2010లో నా పుస్తకాలు

తెలుగునాడి సంపాదకత్వ బాధ్యతలు వదిలేశాక నాకు చదువుకోవడానికి సమయం ఇంకొద్దిగా దొరుకుతుంది.  నవోదయా రామ్మోహనరావుగారు, వాసిరెడ్డి నవీన్, ఫ్రెమాంట్ పబ్లిక్ లైబ్రరీల పుణ్యమా అని పుస్తకాలు బాగానే అందుతున్నాయి. ఇండియానుంచి జాగ్రత్తగా బరువుని లెక్కచేయకుండా పుస్తకాలు మోసుకొచ్చిన కిషోర్, జేపీ, ఆకాష్, నిశాంత్, ప్రమీలగారు, అరుణలకు కృతజ్ఞతలు.  పరుచూరి శ్రీనివాస్,  ఆంధ్రభారతి శాయి, విన్నకోట రవిశంకర్, దాసు కృష్ణమూర్తి, నాసి,  వైదేహి శశిధర్, జె.యు.బి.వి.ప్రసాద్, దశిక శ్యామల, ఖదీర్‌బాబు, కన్నెగంటి రామారావు, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ఇతర మిత్రులు కొన్ని పుస్తకాలు అందించారు. “రెండు దశాబ్దాలు” సంపాదకత్వం సందర్భంగా గత ఇరవై ఏళ్ళలో వచ్చిన వందలాది మంచి తెలుగు కథల్ని ఇంకోసారి చదువుకొనే అవకాశం, అవసరం కలిగాయి. చాల పుస్తకాల గురించి pustakam.netలోనూ, మరికొన్నిటి గురించి ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధంలోనూ   సమీక్షలు/పరిచయాలు చూసి తెప్పించుకోవటమో, మళ్ళీ చదువుకోవటమో జరిగింది. ఈ సంవత్సరం నా చదువుమీద ప్రత్యేకంగా పుస్తకం.నెట్ ప్రభావం ఎక్కువగానూ, స్పష్టంగానూ ఉంది. ఈ సైట్‌ని సమర్థవంతంగా, ఆకర్షణీయంగా నిర్వహిస్తున్న సౌమ్య, పూర్ణిమలకు, సైట్‌లో పుస్తకాలు పరిచయం చేస్తున్నవారందరికీ నా కృతజ్ఞతలు. నేను చదివిన తెలుగు పుస్తకాలు చాలావరకు ఇక్కడ ఇంతకు ముందు పరిచయం చేయబడ్డవి (లేక చేయబడాల్సినవి) కాబట్టి ప్రత్యేకంగా వాటిని గురించి వ్యాఖ్యానించలేదు. ఇంగ్లీషు పుస్తకాల్ని స్థూలంగా పరిచయంచేయటానికి ప్రయత్నించాను.

తెలుగు పుస్తకాలు.
నవలలు
1. రామరాజ్యానికి రహదారి – పాలగుమ్మి పద్మరాజు
2. రెండవ అశోకుడి మూణ్ణాళ్ళ పాలన – పాలగుమ్మి పద్మరాజు
3. కృష్ణాతీరం – మల్లాది రామకృష్ణశాస్త్రి
4. పాలెగాడు – ఎన్.డి.వి. అజీజ్
5. మహి – కుప్పిలి పద్మ
6. ఉత్తర అమెరికా తెలుగు సభలకు చంద్రిగాడి యాత్ర  – గుత్తికొండ రవీంద్రనాథ్
7. రవ్వలకొండ – వంశీ
8. ద్రౌపది – యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
9. గృహరాజు మేడ  – ధూళిపాళ శ్రీరామమూర్తి

అనువాదాలు
10. పర్వ – ఎస్.ఎల్. భైరప్ప (అను. గంగిశెట్టి లక్ష్మీనారాయణ)
11. దాటు – ఎస్.ఎల్. భైరప్ప (అను. పరిమి రామనరసింహం)
12. గిరీష్ కర్నాడ్ నాటికలు  – (అను. భార్గవీరావు)
13. వనవాసి – బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ  (అను. సూరంపూడి సీతారాం)
14. ఒక దళారీ పశ్చాత్తాపం – John Perkins (అను. కొణతం దిలీప్)

సినిమా సంబంధితం
15. నక్షత్ర దర్శనం  – తనికెళ్ళ భరణి
16. మనసులో మాట – అక్కినేని నాగేశ్వరరావు
17. ఆనాటి ఆనవాళ్ళు (75 మేటి చిత్రాలు)  — పులగం చిన్నారాయణ
18. కొమ్మకొమ్మకో సన్నాయి – వేటూరి సుందరరామమూర్తి
19. బాలీవుడ్ క్లాసిక్స్  – మహమ్మద్ ఖదీర్‌బాబు
20. తీపి గుర్తులు, చేదు జ్ఞాపకాలు –  గుమ్మడి వెంకటేశ్వరరావు

అమెరికా తెలుగు రచయితల కథాసంకలనాలు

21. సముద్రంతమ్మినేని యదుకుల భూషణ్
22. ఆ కుటుంబంతో ఒక రోజు — జె.యు.బి.వి.ప్రసాద్
23. అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – దశిక శ్యామల
24. ఎన్నెమ్మ కతలునిడదవోలు మాలతి
25. రంగుటద్దాల కిటికీ –  ఎస్.నారాయణస్వామి

కథాసంకలనాలు

26. బతుకు సేద్యం – సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి
27. తొలి తెలుగు కథలు — భండారు అచ్చమాంబ (సం: సంగిసెట్టి శ్రీనివాస్)
28. ఇట్లు మీ విధేయుడు – భమిడిపాటి రామగోపాలం
29. స్వయంప్రకాశం – టి. శ్రీవల్లీ రాధిక
30. ఆకుపచ్చని జ్ఞాపకం – వంశీ
31. ఆనాటి వానచినుకులు – వంశీ
32. సేజ్జెగాడు – మొలకలపల్లి కోటేశ్వరరావు
33. పేగు కాలిన వాసన – ఎ.ఎన్. జగన్నాధ శర్మ
34. మరో మార్క్స్ పుట్టాలె – ముదిగంటి సుజాతారెడ్డి
35. నెగడు  – నల్లూరి రుక్మిణి
36. మా –  రహమతుల్లా

37. తెలంగాణ కథలు (సం. కాలువ మల్లయ్య, సదానంద్ శారద, చంద్ర)
38-43. తెలుగు కథ 1995 నుంచి తెలుగు కథ 2000 వరకు (6 సంపుటాలు)
44-51. కథావార్షిక 2001 నుంచి కథావార్షిక 2008 వరకు (8 సంపుటాలు)
52-72. కథ 90 నుంచి కథ 2009 వరకు (20 సంపుటాలు + రెండు దశాబ్దాలు)
73-76. తెలంగాణ కథ 2003 నుంచి 2006 వరకు (4 సంపుటాలు)
77. వర్థమాన తెలుగు కథ 2009 (సం. సాకం నాగరాజ)
78. వతన్ – ముస్లిం కథల సంకలనం (సం. స్కైబాబ)
79. కథాస్రవంతి 2002-04
80. వంశీకి నచ్చిన కథలు

81. ప్రళయ కావేరి కథలు  – స.వెం.రమేశ్
82. మిట్టూరోడి పుస్తకం – నామిని
83. ఇస్కూలు పిల్లల పుస్తకం – నామిని
84. పోలేరమ్మ బండ – మహమ్మద్ ఖదీర్‌బాబు
85. నెమ్లీక – తెలిదేవర భానుమూర్తి

కథావిశ్లేషణ
86. తెలుగు కథానికకు వందేళ్ళు – వేదగిరి రాంబాబు
87. కథాకృతి (పరిచయాలు, విమర్శలు) – విహారి

ఆత్మకథలు

88. రమణీయం – దువ్వూరి వెంకట రమణ శాస్త్రి
89. 24 గంటలు – కె.జి. కన్నబిరాన్ / ఎన్. వేణుగోపాల్
90. నాన్న నేను – బుజ్జాయి
91. మా కుటుంబం – కవన శర్మ
92. అనుభవాలు, జ్ఞాపకాలు – మువ్వల పెరుమాళ్ళు
93. (ఇం)కోతికొమ్మచ్చి – ముళ్ళపూడి వెంకటరమణ

కవిత్వం
94. సరదాపద్యాలు (బఠాణీలు) – గన్నవరపు నరసింహ మూర్తి
95. రెండో పాత్ర — విన్నకోట రవిశంకర్
96. శ్రీ రామలింగేశ్వర శతకం – జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
97. తెలుగు వేదం  – జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
98. తెనుఁగు తోట – విన్నకోట వెంకటేశ్వరరావు
99. బసవరాజు అప్పారావు గీతాలు – బసవరాజు అప్పారావు

ఇతరాలు

100. వార్తల వెనుక కథ – కె. రామచందమూర్తి, కట్టా శేఖరరెడ్డి
101. వందేమాతరం నుంచి క్విట్ ఇండియా: ఆంధ్రలో కేసులు, శిక్షలు – సి.వి. రాజగోపాలరావు
102. ఆల్కహాలిక్ పిల్లలు, ఒక అవగాహన — శ్రీదేవి మురళీధర్
103. తెలుగు భాష సంస్కృతి చైతన్య యాత్రలు – యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

104. మధుపం – పూడూరి రాజిరెడ్డి
105. వచ్చే దారెటు —  చంద్రలత

106. ఇడిగిడిగో బుడుగు – బాపు

107. గొలుసుకథలు, నాటికలు, గల్పికలు (కొకు సాహిత్యం vol 5)
108. శ్రీశ్రీ ప్రస్థాన త్రయం – (మొత్తం చదవలేదు)
109. కాళీపట్నం రామారావు రచనలు (2008 వరకూ లభ్యరచనా సంగ్రహం) – (మొత్తం చదవలేదు)

110 తేలికైన తెలుగు -తేట తెలుగు A desktop aide for learners and facilitators dealing with Telugu as a foreign language – International Telugu center, Potti Sreeraamulu university డా. జి. ఇందిర

English

1, The Detroit Electric Scheme  — DE Johnson.   రచయిత మొదటి నవల; డెట్రాయిట్ కార్ల పరిశ్రమ ఎలక్ట్రిక్ కార్లని అభివృద్ధి చేస్తున్న నేపధ్యంలో – కాకపోతే వందేళ్ళ క్రితం (1910లో). ఉత్కంఠ, ఆసక్తి రెండూ కలిగించింది.

2. A Christmas CarolCharles Dickens. పాత క్లాసిక్; మళ్ళీ చదవాలనిపించింది. తొలి మాజికల్ రియలిజం నవల? 🙂

3. FreedomJonathan Franzen.  ఆగస్టులో, ఈ నవల విడుదల కాబోయేముందు, టైం మాగజైన్ జోనథన్ ఫ్రాంజెన్ మీద (ఈ పుస్తకం మీద కూడా) కవర్‌ స్టోరీ రాసింది. డిశంబరులో టైం మాగజైనే ఈ పుస్తకాన్ని ఈ సంవత్సరం ఉత్తమ పుస్తకంగా ఎంపిక చేసింది. ఫ్రాంజెన్ శైలి, వాక్య  నిర్మాణం, భాషను వాడుకొనే తీరు, వివిధ భావాలని వ్యక్తం చేసే తీరు బాగుంటుంది. ఐతే నాకు పుస్తకం మధ్యలో ముఖ్యపాత్రలపట్ల చిరాకు కలిగింది. చివరకొచ్చేపాటికి పర్వాలేదు అనిపించింది మళ్ళీ. పాత్రలు, సంఘటనలు – కొంత మంచిగానూ, కొంత చిరాకుగానూ – గుర్తుంటాయి. పెద్ద పుస్తకమే. చదవటానికి ఓపికతోపాటు, కొంత స్థైర్యం కూడా కావాలి. ఒక భారతసంతతి యువతికి ఈ పుస్తకంలో ప్రముఖపాత్ర ఉంది.

4. A Breath of Fresh AirAmulya Malladi.  David Malouf  పుస్తకాలకోసం లైబ్రరీ షెల్ఫులు వెతుకుతుంటే అమూల్య మల్లాది నవలలు కనిపించాయి. రివ్యూలు చదవటంతో పేరు పరిచయమయిందే. తెలుగువాళ్ళ అమ్మాయి; మిలిటరీ కుటుంబంలో ఆంధ్రప్రదేశ్ బయటే పెరిగింది. ఆ తరువాత అమెరికాలో కొన్నాళ్ళు ఉండి, ఒక డేనిష్ అబ్బాయిని పెళ్ళి చేసుకొని ప్రస్తుతం డెన్మార్క్‌లో ఉంటుంది. ఈ పుస్తకం మొదటి నవల. భోపాల్‌లో  ఒక నవ వధువు – సైనికాధికారి భార్య – విషవాయువు బారిన పడ్డ ఘట్టంతో నవల ప్రారంభమౌతుంది. గుర్తుండే పాత్రలు, సన్నివేశాలు. చాలా సెన్సిటివ్‌గా రాసిన నవల.

5. The Mango Season – Amulya Malladi.  రెండో నవల; అమెరికాలో ఉద్యోగం చేస్తూ అమెరికా అబ్బాయితో ప్రేమలో పడ్డ ప్రియ మామిడికాయల ఋతువులో హైదరాబాద్‌లో స్వగృహానికి చేరుతుంది. సంప్రదాయవాదులైన తాతయ్య కుటుంబం, ఎచ్చులకుపోయే తల్లి, ఇంకా పెళ్ళికాని తోటి వయసు పిన్ని, మామలు, అత్తలు, పెద్ద కుటుంబం. పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. తన ప్రేమగురించి చెప్పటానికి సంకోచం, భయం. వేసవికాలపు ఎండను, ఉక్కను, పెద్ద కుటుంబాలలోని ఆప్యాయతలు, కలతలు, అలజడులను బాగానే పట్టుకొంది.  రచయిత్రికి తెలుగు బాగా రాని విషయం తెలుస్తుంది. ఆఖరు మలుపు కొద్దిగా అతి అయ్యింది.

6. Serving Crazy with Curry – Amulya Malladi. మూడో నవల. మల్లాదివారి అమ్మాయి, ఒక వేటూరివారి కుటుంబం గురించి రాసిన నవల చదవటం గమ్మత్తుగా, సరదాగా అనిపించింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఒక సంపన్న తెలుగు కుటుంబం కథ. కథానాయిక దేవి ఆత్మహత్యాప్రయత్నంతో మొదలైన ఈ నవల కుటుంబసంబంధాలను సునిశితంగా పరిశీలిస్తుంది. అమెరికా భారత జీవితం బాగా చిత్రించింది. డిప్రెషన్ మానసిక స్థితిని కూడా చక్కగా పట్టుకుంది. ఫ్యూజన్ వంటకాల రిసిపీలు బోనస్.

7. The Song of the Cuckoo Bird – Amulya Malladi. నాలుగో నవల. స్వంత కుటుంబం పట్టించుకోకుండా వదిలేసిన కోకిల అనే పేద పిల్ల భీమ్లిలో ఒక ‘తెల్లమేడ’లో చార్వి అనే ఆవిడ ఆశ్రమంలో పెరుగుతుంటుంది. భగవంతుడి అంశ ఉంది అని అందరూ చెప్పుకొనే చార్వి – సమాజసంస్కరణకోసం అనేక పుస్తకాలు రాసిన ఒక ప్రముఖ రచయిత కూతురు. ఆ రచయిత కుటుంబం, చార్వి, ఆవిడ భక్తులు, అనాధలు అందరూ ఆ  ఇంట్లో నివసిస్తుంటారు. ఇది మీకు చలాన్ని, సౌరిస్‌నీ గుర్తు తెస్తే అది మీ తప్పు కాదు. ఆ తెల్లమేడలో కోకిల జీవితం  ఈ నవల. ఒకో చోట సాగదీసినట్లుగానూ, ఒకో చోట ఆసక్తికరంగానూ ఉంటుంది. మొత్తమ్మీద అంతబాగోలేదు.

8. The Sound of Language – Amulya Malladi. ఐదవ, లేటెస్ట్ నవల. ఆఫ్ఘనిస్తాన్‌లో పుట్టి, పెరిగి, తనవాళ్ళని కోల్పోయి, కాందిశీకురాలిగా డెన్మార్క్‌లో దూరపుబంధువులతో ఉంటున్న రెహానా కథ. అక్కడ ఉండాలంటే ఆమె డేనిష్ భాష తప్పనిసరిగా నేర్చుకోవాలి. భాష ప్రాక్టీసు చేయడం కోసం రెహానా, ఈ మధ్యే భార్య పోయిన ఒక ముసలాయనకు తేనెటీగల పెంపకంలో సాయం చెసే ఉద్యోగంలో చేరుతుంది. ఈ నేపధ్యంలో వలసవచ్చేవారి ఇబ్బందులు, జీవన విధానాలు, కొత్త సంస్కృతితో ఇమడడానికి ఇష్టపడేవారు, కష్టపడేవారు, వీరిని ద్వేషించేవారు, సహాయం చేసేవారు వగైరా పాత్రలు. ఈ మధ్యలో తేనెటీగల పెంపకం. కొన్ని సంఘటనలు ఫార్ములా ప్రకారంగానే ఉన్నాయి అనిపించినా, ఆసక్తికరంగానే ఉంది.

9. The Imperfectionists – Tom Rachman.  యూరప్‌లో ప్రచురితమయ్యే ఒక అమెరికన్ న్యూస్‌పేపర్ ఆర్థికంగా కష్టాల్లో ఉంటుంది. ఆ పేపర్లో పనిచేసే వివిధ వ్యక్తుల పరంగా ఈ నవల కథనం సాగుతుంది. ఆబిట్యువరీ ఎడిటర్ భారతసంతతివాడు. పుస్తకం బాగుంది. ఈ పుస్తకం నేను రివ్యూలు రాకముందే చదివాను. ఇంగ్లీషు పుస్తకాల విషయంలో అది నాకు అరుదైన అనుభవం. ఇంకా చాలా రోజుల తర్వాత అంటే మూడురోజుల క్రితం (జనవరి 16న) Bob Edwards Weekend Show (NPR)లో రచయితతో ఈ పుస్తకం గురించి ఇంటర్వ్యూ వచ్చింది.

10. Service Dress Blues  — Michael Bowen; a thriller novel, not particularly memorable

11. As It Was Written – Sujatha Hampton.   ఈ రచయిత్రి మొదటి నవల. అమెరికాలో ఒక మళయాళీ కుటుంబం, ఆ కుటుంబం పూర్వీకులలో ముఖ్యమైన ఒక శాపగ్రస్త స్త్రీల కథల కలగలుపు.
మొదట కొద్దిగా అపహాస్య ధోరణిలో ప్రారంభమైనా, ఆసక్తికరంగా చెప్పిన కథ. కొన్ని సన్నివేశాలని చాలా హృద్యంగా చిత్రీకరించింది, గుర్తుండే పాత్రలు, సన్నివేశాలు. మంచి శైలి. ఒక కన్ను వేసి ఉంచవలసిన రచయిత్రే.

12. The Remains of the Day – Kazuo Ishigara. – మర్చంట్, ఐవరీ జంట ఈ పుస్తకాన్ని సినిమాగా తీశారు. రెండవ ప్రపంచయుద్ధ పూర్వరంగంలో ఒక బ్రిటిష్ లార్డు భవనంలో పని చేసిన ఒక బట్లర్ కోణం నుంచి చెప్పిన కథ. అప్పటి రాజకీయ పరిణామాలు, వర్గ సంబంధాలపై మంచి పరిశీలన. వీటిమధ్య ఒక విచిత్రమైన ప్రేమకథ. ఈ కథ చెప్పటానికి రచయిత ఎన్నుకొన్న మార్గం బాగుంది. మంచి శైలి.

13. Ransom – David Malouf. ద్రౌపది నవలకు అకాడమీ అవార్డు వచ్చినప్పుడు పురాణ గాథలను తిరిగి చెప్పటం ఎలా అన్న చర్చ జరుగుతుండగా వేలూరి వెంకటేశ్వరరావుగారు ఈ పుస్తకాన్ని ప్రస్తావించారు. ఈలియాడ్ కథను మాలూఫ్ ఆసక్తికరమైన పద్ధతిలో తిరగరాశాడు. నాకైతే దీనికంటే భైరప్ప చెప్పిన పర్వ కథే బాగుంది.

14. The Lost Books of Odyssey  – Zachary Mason.  మాలూఫ్ కన్నా నలభైమూడాకులు ఎక్కువ చదివిన మేసన్ ఒడిస్సీకి పర్యాయంగా ఏకంగా నలభైనాలుగు కథలు చెప్పాడు. కొన్ని కథలు చాలా మార్మికంగా, ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ పుస్తకం కూడా వేలూరిగారి సూచనే.

15. Day of the Jackal – Frederick Forsyth.  నా కాలేజిరోజుల్లో నన్ను, నామిత్రులను బాగా ఆకర్షించిన నవల, చిత్రం. ఎందుకో పుస్తకం సౌమ్యగారితో ఇ-సంభాషణలో ప్రస్తావన వచ్చి మళ్ళీ చదవాలనిపించింది. ఇప్పటికీ మంచి పుస్తకమే. థ్రిల్లర్ నవలలమీద ఆసక్తి ఉన్నవారు తప్పక చదవాల్సిన పుస్తకం.

16. ImmigrantsHoward Fast (Lavette quartet). నా కాలేజ్ రోజుల్లో  నాకు ఇష్టమైన రచయితల్లో హొవార్డ్ ఫాస్ట్ ఒకడు.  శాన్‌ఫ్రాన్సిస్కో అఖాతాల్లో చేపలపడవలపై బ్రతికే ఒక ఇటాలియన్ ఇమ్మిగ్రంటు కుటుంబంలో పుట్టిన డాన్ లెవెట్ అనే యువకుడు 1906 భూకంపంలో తన కుటుంబాన్ని కోల్పోతాడు.  కాలక్రమేణా పెద్ద షిప్పింగ్ వ్యాపారానికి  అధిపతి ఔతాడు. బాంకింగ్ వ్యాపారంలో ఉన్న ఇంకో కోటీశ్వరుడికి అల్లుడవుతాడు. ఆ తర్వాత ఆర్థికమాంద్యంలో సర్వస్వమూ కోల్పోతాడు. మళ్ళీ కోటీశ్వరుడౌతాడు. అతని కుటుంబకథను, ముఖ్యంగా కూతురు- జర్నలిస్టు, యాక్టివిస్టు – బార్బరా కోహెన్ కథను, నాలుగు నవలల్లో చెప్పిన ఫాస్ట్ శాన్‌ఫ్రాన్సిస్కో నగర చరిత్ర, కొంత హాలీవుడ్ చరిత్ర, రెండవ ప్రపంచయుద్ధం, ఇజ్రాయెల్ పుట్టుక, ప్రజాహక్కుల ఉద్యమం, ఫిమినిస్టు ఉద్యమం వంటి ఎన్నో చారిత్రక విషయాల గురించి కూడా చెపుతాడు.
17. Second Generation – Howard Fast (Lavette quartet)
18. Establishment – Howard Fast (Lavette quartet)
19. Legacy – Howard Fast (Lavette quartet)

తా.క. ఇది క్వార్టెట్ కాదు పెంటాడ్ అని ఈమధ్యే తెలిసింది. The Legacy తర్వాత ఫాస్ట్ కొంచెం లేటుగా Immigrant”s Daughter అనే పుస్తకం కూడా రాశాడట. ఇప్పుడు ఆ పుస్తకాన్ని కూడా పట్టుకోవాలి.

20. A Passage to India EM Forster.    ఆంగ్లంలో 100 ముఖ్యమైన పుస్తకాలలో ఒకటిగా గుర్తించబడ్డ నవల. జాతి, వర్ణ, వర్గ, లింగ వివక్షల్ని ఎండగడుతూ 1924లోనే వ్రాశాడంటే ఆశ్చర్యం వేస్తుంది. తప్పకుండా చదవాల్సిన పుస్తకం. డేవిడ్ లీన్ ఈ పుస్తకాన్ని అద్భుతమైన చిత్రంగా మలిచాడు.

21. Two States – Chetan Bhagat. సరదాగా సాగిపోయే ప్రేమకథ. నవల ప్రారంభంలో కొన్ని సన్నివేశాలు మాకాలంలో ఇలాంటివి ఎరగం సుమీ అని ముక్కున వేలెట్టించాయి.

22. The Spirit of Lagaan – Satyajit Bhatkal. చాలా రోజుల తర్వాత లగాన్ సినిమా మళ్ళీ చూసి మళ్ళీ ఆనందించాము. అప్పుడు ఈ పుస్తకం ఒకటి ఉందని గుర్తొచ్చి వెతికితే అమెజాన్‌లో దొరికింది.  ఈ సినిమా ఇంత మంచి సినిమాగా ఎలా రూపొందిందో చక్కగా చెప్పిన పుస్తకం. ఇంతకుముందు తెలియని ఆసక్తికరమైన నేపధ్య విశేషాలు చాలా తెలిసాయి. ప్రొడ్యూసర్ అమీర్‌ఖాన్ పై ప్రేమ, గౌరవం ఇంకా పెరిగాయి.

23. Gone in 60 Seconds.  సినిమా నవల; మా నన్నయ కిష్టమైన సినిమా నేను చూడలేదు.

24. The Other Wes Moore: One Name, Two Fates  – Wes Moore.  2000 సంవత్సరంలో బాల్టిమోర్ నగరంలో న్యూస్‌పేపర్లో ఒకే సమయంలో రెండు వార్తలు: వెస్‌మూర్ అనే ఒక యువకుడు రోడ్స్ స్కాలర్షిప్ మీద ఆక్స్ఫర్డ్‌లో చదువుకోవడానికి ఎంపిక అయ్యాడు. అదే పేరు గల, దాదాపు అదే వయస్సులో ఉండి, అదే ప్రాంతంలో పెరిగిన ఇంకో వెస్ మూర్ అనే అబ్బాయి ఒక పోలీసుని హత్యచేసిన నేరానికి యావజ్జీవ ఖైదుని అనుభవించబోతున్నాడు. మొదటి వెస్ మూర్ రెండవ వెస్ మూర్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలుబెట్టాడు. తర్వాత అతన్ని కలుసుకొన్నాడు. తమ ఇద్దరి జీవితాలు దాదాపు ఒకే నేపధ్యంలో నడచినా  అంత వైవిధ్యమైన దారుల్లో ఎలా వెళ్ళాయో ఈ పుస్తకంలో వివరిస్తాడు. ఆలోచింపచేసే పుస్తకం.

25. Dreams in a Time of War: A Childhood Memoir — Ngugi Wa Thiong’o. కెన్యాలో డబ్భైఏళ్ళ క్రితం ఒక చిన్నగ్రామపు పరిసరాల్లో పుట్టి పెరిగిన ఈ రచయిత బాల్య జీవనం ఈ పుస్తకం. మారుతున్న సంస్కృతులు; కొత్తగా ప్రవేశిస్తున్న క్రైస్తవ మతం, ఆర్థిక సంక్షోభం, రాజకీయ కల్లోలాల మధ్య పెరిగిన జ్ఞాపకాలు. ఇప్పుడు ఆఫ్రికానుంచి వచ్చిన ప్రముఖరచయితలలో ఒకడుగా గుర్తింపు పొందాడు గుగీ

26. Guns, Germs and Steel: The Fates of Human Societies — Jared M Diamond.  ఈ ప్రపంచంలో కొన్ని దేశాలు గొప్పగా అభివృద్ధి సాధించగా, కొన్ని ప్రాంతాలు ఏ సౌకర్యాలు లేకుండా పురాతన జీవన విధానాల్లోనే ఎందుకు మిగిలిపోయాయి? యూరప్ వాసులు అమెరికా మీద ఆధిపత్యం ఎలా సంపాదించగలిగారు?  ప్రపంచంలో ఇన్ని భాషలు ఎలా ఏర్పడ్డాయి? ఆహార విధానాలలో ఇన్ని వైవిధ్యాలెందుకు ఉన్నాయి? జీవన పరిణామ క్రమాన్ని చాలా ఆధారాలతో సరళంగా చర్చించి, వివరించే పుస్తకం.

27. Theatre  – David Mamet.   సినిమాలకు, నాటకాలకు స్క్రిప్టులు రాయటంలో ప్రసిద్ధుడైన మామే నాటకరంగం వివిధ పార్శ్వాలపై వ్రాసిన వ్యాసాలు; తనని విసిగించిన విషయాలపై విసుగ్గావ్రాసి విసిగించాడు అనిపించింది.

28. Beyond the Grave: the right way and the wrong way (estate planning) – Gerald Condon. మరణానంతర ఆస్తిపంపకాన్ని గురించి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అని ఇక్కడి ఆర్థిక సలహాదార్లు మొత్తుకొంటూ ఉంటారు. ఒకరోజు లైబ్రరీకి వెళితే ఎదురుగా డిస్‌ప్లేలో ఉంది. ఉపయోగకరమైన చాలా కొత్త విషయాలు తెలిశాయి.

29. Asylum  — Inside the Closed World of State Mental Hospitals  — Christopher Payne. అమెరికాలో దీర్ఘ మానసికరోగుల వైద్యశాలల పాతరోజుల గురించి ఫొటోలద్వారా వర్ణించిన పుస్తకం

30. The Five People You Meet in HeavenMitch Albom.  మోరీతో మంగళవారాలు (Tuesdays with Morrie) పుస్తకంతో ప్రాచుర్యం పొందిన మిచ్ ఆల్బొం ముందు స్పోర్ట్స్ రిపోర్టరు. ఆ పుస్తకం తర్వాత అతను కొద్దిగా తాత్వికమైన పుస్తకాలు రాయటం మొదలుబెట్టాడు.   మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అన్నదానిమీద ఈ పుస్తకం. అమ్యూజ్‌మెంట్ పార్కులో రైడ్స్‌ని రిపేరు చేసే ఒక ముసలాయన అర్థంతరంగా చచ్చిపోతాడు. ఆపైన అతనికి తన పాతజీవితంలోంచి ఒకరితర్వాత ఒకరు ఐదుగురు మనుషులు కనిపించి అతని జీవితాన్ని విశ్లేషిస్తారు. ఈ రకంగా జ్ఞానాన్ని పొందిన అతని ఆత్మకి శాంతి కలుగుతుంది. మంచి కథనం. కొన్ని ఆలోచింపచేసే విషయాలు.

31. For One More Day  — Mitch Albom.  జీవితంలో వైఫల్యం పొంది ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించిన ఒక బేస్‌బాల్ క్రీడాకారుడికి ఒక విచిత్రమైన అనుభవం కలుగుతుంది. అంతకుముందెప్పుడొ చనిపోయిన అతని తల్లితో  ఒకరోజంతా  తన పాత పరిసరాలమధ్య గడిపే  అవకాశం వస్తుంది. అతని జీవనదృక్పథం మారిపోతుంది.

32. Have a Little Faith — Mitch Albom.  రెండు వేరు మతాలకు చెందిన మతాచార్యులు. న్యూజెర్సీలో ఉండే యూదుమతానికి చెందిన ఒక రబ్బి ఆల్బోం స్నేహితుడు. ఆల్బొంని తన మరణానంతర ఉపన్యాసం (ఎలెజీ) ఇవ్వమని ఆ స్నేహితుడు కోరాడు. అతనితో సంభాషణలతో ప్రేరణ పొందిన ఆల్బొం తన ఆధ్యాత్మిక మూలాలను వెతుక్కొంటుండగా డిట్రాయిట్‌లో, చూరుకారుతున్న ఒక చర్చ్‌లో, మతప్రచారం చేస్తున్న ఒక మాజీ నేరస్తుడితో పరిచయం ఔతుంది. వీరిద్దరి సాంగత్యంలో ఆల్బొం ఆధ్యాత్మిక శోధన కొనసాగుతుంది.

33. What the Dog Saw and Other AdventuresMalcolm Gladwell.  Blink, Tipping Point, Outliers వంటి ఆసక్తికరమైన పుస్తకాలు రాసిన మాల్కొం గ్లాడ్వెల్ న్యూయార్కర్‌లో రాసిన వ్యాసాల సంపుటి. చాలా వైవిధ్యమైన విషయాలపై (స్త్రీ ప్రపంచంపై బర్త్‌కంట్రోల్ పిల్ ప్రభావం: మంచి కెచప్ లక్షణాలు, అలంకరణ వస్తువుల మార్కెటింగ్,  కుక్కల్ని పెంచే విధానం వగైరా) ఆసక్తికరమైన వ్యాసాలు. మంచి రచనాశైలి.

34. Game Change — Obama and Clintons, McCain and Palin – John Heilman and Mark Halperin.  2008 అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ఇద్దరు సీనియర్ పాత్రికేయులు విపులంగా వ్రాసిన పుస్తకం. తెరవెనుక విషయాలు చాలా తెలుస్తాయి.

35. The Selling of the President 1968 – Joe McGuinness. 2008లో అధ్యక్షుడి ఎన్నికల గురించిన పుస్తకం చదివాక ఒక పాత పుస్తకాల స్టాలులో ఈ పుస్తకం కనిపించింది. 1960లో అధ్యక్షుడిగా, 62లో కాలిఫోర్నియా గవర్నర్‌గా పోటీ చేసి లూజర్‌గా పేరుతెచ్చుకొన్న రిచర్డ్ నిక్సన్ 1968లో అధ్యక్షుడు కావటానికి టెలివిజన్ మీడియంని ఎంత తెలివిగా వాడుకొన్నాడో వివరంగా చెపుతుంది ఈ పుస్తకం. (1962లో నిక్సన్ మీద కెన్నెడీ గెలవటానికి ముఖ్యకారణం అప్పుడు మొదటిసారిగా టెలివిజన్‌లో చూపించిన అభ్యర్థుల డిబేట్ అని చరిత్రకారుల విశ్లేషణ; అది వేరే కథ).

36. 2010 Take Back America: a Battle Plan – Dick Morris, Eileen McGann.    అమిత మితవాదులు అమెరికాలో అధికారానికి అందుకోవటానికి ప్రచారమూ, ప్రణాళికా. అతిశయోక్తులు, అపోహలను పెంచి ప్రజలను భయపెట్టే ప్రయత్నం. చాలా టైం వృధా అయింది.

37. The Natural  Joe Klein.  Primary Colors పుస్తకాన్ని Anonymousగా రచించి సంచలనం సృష్టించిన జో క్లైన్ అమెరికా అధ్యక్షుడిగా క్లింటన్ నిర్వహించిన పాత్రను సునిశితంగా పరిశీలిస్తూ రాసిన పుస్తకం.

38. Government Girl: Young and Female in the White House — Stacy Parker Aab.  క్లింటన్ అధ్యక్షుడిగా ఎన్నికైన కొత్తలో వైట్‌హౌస్‌లో ఇంటర్న్‌గా చేరిన స్టేసీ పార్కర్ అనే నల్ల కాలేజీ స్టూడెంట్ అనుభవాలు

39. The Kennedy Tapes: Inside the White House During the Cuban Missile Crisis.   ఒక రోజున Thirteen Days చిత్రం అనుకోకుండా చూశాను. అప్పుడు నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవాలనిపించింది. పెద్ద పుస్తకమే, కాని నిఝం చరిత్ర మరి

40. Dear Mrs. Kennedy, The World shares its grief; Letters, November 1963 — Jay Mulvaney, Paul De Angelis. చరిత్రలో ఒక శోకావృత సమయం.   ప్రెసిడెంట్ జాన్ కెనడీ మరణానంతరం జాకీ కెనడీకి ప్రపంచం నలుమూలలనుంచీ 12 లక్షల పైగా సానుభూతి  ఉత్తరాలు వచ్చాయట. వాటిలోంచి ఎంపిక చేసిన కొన్ని ఉత్తరాలు; ఉత్తరం రాసిన వారి వివరాలు, వారికి కెనెడీతో ఉన్న సంబంధం, చారిత్రక నేపధ్యం వివరించడం వల్ల ఒక రకంగా అప్పటి చరిత్ర, కెనడీ జీవిత చరిత్ర కొంత తెలుస్తుంది. సామాన్య ప్రజలనుండి ప్రభుత్వాధినేతలదాకా, స్కూలు పిల్లలనుంది నోబెల్ విజేతల దాకా అందరూ ఉత్తరాలలో తమ హృదయస్పందనను తెలియజెప్పిన విధానం, శ్రద్ధ, ఉత్తరాలలో భాష ఆకట్టునేట్టుగా ఉన్నాయి. ఇంకో విషాదమైన విషయమేమిటంటే ఈ పుస్తకం మొదలుబెట్టిన Jay Mulvaney పుస్తకం పూర్తి కాకుండానే గుండెపోటుతో మరణించడం.
41. Curfewed Night: One Kashmiri Journalist”s Frontline Account of Life, Love, and War in His Homeland — Basharat Peer.  కాశ్మీర్‌లోయలో కల్లోలం ప్రారంభం కాకముందు ఒక పల్లెటూర్లో తన తాతయ్య ఇంట్లో పెరిగిన బషారత్ పీర్ తర్వాత ఆ లోయ మొత్తం రకరకాలుగా విధ్వంసం కావటం ప్రత్యక్షంగా చూశాడు. ముక్కు పచ్చలారని యువకులు ముజహదీన్లుగా మారి మృత్యువాత పడటం చూశాడు. విద్య, వ్యాపారం నాశనమై అనేకమంది ఉపాధులు పోవటం చూశాడు. సైనికుల దమనకాండ చూశాడు. మిలిటంట్ల అరాచకాలు చూశాడు (బషారత్ పీర్ తండ్రి గవర్నమెంటు ఉద్యోగి, ఆయన్ని చంపటానికి మిలిటెంట్లు ప్రయత్నించారు). రాజకీయాలు, మతాలు పేరుతో జరిగే అన్యాయాలు చూశాడు. దూరంగా ఢిల్లీలో కొంతకాలం విద్యార్థిగా, మరికొంతకాలం జర్నలిస్టుగా ఉన్నాడు. చివరికి అమెరికాలో జర్నలిస్టుగా తేలాడు. కాశ్మీర్ గురించి నేను చదివిన పుస్తకాలన్నిటిలోకీ ముఖ్యమైన పుస్తకం

42. Pakistan: Deep Inside the World’s Most Frightening State (Revised edition 2010) – Mary Anne Weaver. 1980నుంచి పాకిస్తానులో జర్నలిస్టుగా ప్రత్యక్షంగా చాలా విషయాలను చూసి, ప్రముఖ వ్యక్తులందరితోనూ మాట్లాడిన మేరీ వీవర్ పాకిస్తాన్‌ గురించి చేసిన విశ్లేషణ. మతం, మిలిటెంట్లు, పారామిలిటరీ సంస్థలు, సైన్యం, గూఢచార వ్యవస్థ, రాజకీయ నాయకులు, అణ్వాయుధాలు, ఆఫ్ఘనిస్తాన్, అరబ్, అమెరికా దేశాల ప్రమేయమూ కలిసి ఒక ప్రమాదభరితమైన వ్యవస్థను సృష్టించిన క్రమం వర్ణన. పాకిస్తాన్ భవిష్యత్తుతో మన భవిష్యత్తూ ముడిపడి ఉంది కాబట్టి మనమూ భయపడాల్సిందే.

43. My Telugu Roots: Telangana State Demand – a Bhasmasura Wish. — Nalamotu Chakravarty నల్గొండ జిల్లాలోనూ, హైదరాబాదులోనూ పెరిగి 1993లో అమెరికా వచ్చిన నలమోతు చక్రవర్తి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మళ్ళీ మొదలయ్యాక, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య ఉన్న భేదాలగురించి తెలుసుకొనే ప్రయత్నం మొదలుపెట్టి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం హానికరం అన్న నిశ్చయానికి వచ్చి తన అభిప్రాయాలను ఈ పుస్తకంగా ప్రకటించారు. ఈ పుస్తకం తెలుగు అనువాదాన్ని ఆయన హైదరాబాదులో ఆవిష్కరించబోతే చాలా గొడవలు జరిగినట్లు పేపర్లలో చదివాను. పుస్తకంలో మొదటి 208 పేజీలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడేవరకూ తెలుగు దేశపు చరిత్ర; తర్వాత 34 పేజీలు 1969-71 ప్రత్యేక తెలంగాణా ఉద్యమం చరిత్ర; 18 పెజీలు 71-72   ప్రత్యేకాంధ్ర ఉద్యమం చరిత్ర; ఆఖరు 30 పేజీల్లో చాలా భాగం ప్రత్యేక తెలంగాణా వాదులు (ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్) తమ ప్రాంతం అలక్ష్యం చేయబడిందని చెప్పే వాదనలు తప్పని గణాంకాల ద్వారా నిరూపించే ప్రయత్నం. సరళంగా వ్రాసిన పుస్తకం సునాయాసంగా చదువుకోవచ్చు. విజయనగర సామ్రాజ్యం గురించి చక్కటి ప్రకరణాలు ఉన్నాయి.

44. Too Big to Fail: the Inside Story of how Wall Street and Washington Fought to Save the System and Themselves  – Andrew Ross Sorkin.  2008 సెప్టెంబరులో ఒక రెండు వారాలపాటు జరిగిన వరుస సంఘటనల్లో, వాల్‌స్ట్రీట్‌లోని చాలా ఆర్థిక సంస్థల తీరుతెన్నులు మారిపోయి ఒక్కసారిగా ప్రపంచాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశాయి.  ఆ రెండువారాల్లో జరిగిన సంఘటనలు, వాటి పూర్వాపరాలను విశదీకరిస్తూ న్యూయార్క్ టైమ్స్ వాణిజ్యవ్యవహారాల విలేఖరి ఆండ్రూ సోర్కిన్ వ్రాసిన పుస్తకం. ముఖ్యంగా లేమన్ బ్రదర్స్ దివాలా, ఏఐజి కంపెనీ అమ్మివేత వంటి వ్యవహారాల వెనుక  ఉత్కంఠ భరితమైన నాటకీయ సంఘటనలు చాలా జరిగాయి. ఆ చరిత్రనంతటికీ విపులమైన ప్రత్యక్షవ్యాఖ్యానంలా రాసిన ఈ పుస్తకంలో హీరోలు, విలన్లు, బఫూన్లు, విక్టిమ్లూ అందరూ ఉన్నారు. పెద్ద పుస్తకమే కాని, చాలా ఆసక్తికరమైన పుస్తకం.

45. Talks and Articles – C. Subbarao.  వైదేహి శశిధర్‌గారి తండ్రి శ్రీ సుబ్బారావుగారు వివిధ సందర్భాలలో ఆంగ్లసాహిత్యం గురించి చేసిన ప్రసంగాలు, వ్యాసాలు.

46. Quiet and Quaint; Telugu Women’s Writing – Malathi Nidadavolu.  మాలతిగారి గురించి పుస్తకం.నెట్ పాఠకులకు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు కదా
47. A Spectrum of My people (Short Stories from Andhra Pradesh) – Malathi Nidadavolu.
48. From My Front Porch – Malathi Nidadavolu.
49. All I Wanted Was to Read and Other stories – Malathi Nidadavolu.

50. 1947 Santoshabad Passenger and Other Stories; Translations of Telugu Short Stories – Dasu Krishnamurthy, Tamraparni Dasu.  పుస్తకంలో ఇంతకు ముందే పరిచయం వ్రాశాను

51. The Garden of Memories – In memory of Dr. Challapalli Sambasiva Rao and Lakshmi Manoharm.

52. The Non Profit Board Answer Book.  నేను పనిచేసే కొన్ని స్వచ్ఛంద సంస్థల పునర్నిర్మాణ కార్యక్రమంలో కొన్ని విషయాలను అధ్యయనం చేయాల్సి వచ్చింది. ఉపయోగకరమైన పుస్తకం.

53. Managing the Nonprofit Organization – Peter Drucker. డిటో.

54. Robert’s Rules of Order Newly Revised, (abridged edition)  పూర్తి పుస్తకం కూడా కొన్నాను. కాని, నా పనికి ఈ సంక్షిప్త సంపుటం సరిపోయింది. పూర్తి పుస్తకంలో రెండో మూడో అధ్యాయాలు మాత్రం చదివాను.

55. Ex Libris: Confessions of a Common Reader — Anne Fadiman.   జెపర్డీ క్విజ్‌షో ముఖ్యమైన వినోదమైన చదువరుల కుటుంబంలో పెరిగిన ఒక పుస్తకాల పురుగు అమ్మాయి, ఇంకో పుస్తకాల పురుగు ప్రొఫెసర్‌గార్ని పెళ్ళి చేసుకొంది. ఇంటినిండా పుస్తకాలు. ఎవరి పుస్తకాలెక్కడ పెట్టుకోవాలి అన్న సమస్య దగ్గరనుంచి అనేక పుస్తక సంబంధిత విషయాలపైన సరదా వ్యాసాలు; అప్పుడప్పుడూ పరిచయమున్న కథలానే అనిపించింది.

56. Catcher in the Rye —  JD Salinger. శాలింజర్ మరణం తర్వాత మళ్ళీ ఒకసారి చదవాలి అనిపించింది
57. Nine Stories  — JD Salinger. డిటో.

58. Bright Sided Barbara Ehrenreich  టైమ్స్‌లో చాలాకాలం కాలమిస్టుగా ఉన్న  బార్బరా ఎరెన్‌రైక్ రొమ్ము కాన్సర్ బాధితురాలు. ఆ నేపధ్యంలో ఇప్పుడు దాదాపు ఒక మతం స్థాయికి పెరిగిన ఆశావహ దృక్పథం (positive thinking movement) ఉద్యమాన్ని చాలా దగ్గరగా నిశితంగా పరిశీలించింది. చివరకు తేల్చిందేమిటంటే ఇందులో నమ్మకం ఎక్కువ; నిజాలు బహు తక్కువ; కొద్దిమందికి ఇది బంగారు గుడ్లు పెడుతున్న బాతు.

59. Complications Atul Gawande.  రోడ్స్ స్కాలర్, క్లింటన్‌ కొకప్పుడు వైద్యవిషయాల్లో సలహాదారు, హార్వర్డ్ మెడికల్‌స్కూల్ సర్జన్ ఐన ఈ భారత సంతతి  కుర్రాడు చక్కటి రచయిత. క్లిష్టమైన సర్జికల్ కేసుల నేపధ్యంలో చాలా విషయాల గురించి ఆసక్తికరంగానూ, ఆలోచనలు రేకెత్తించేట్లుగానూ రాస్తాడు

60. The Checklist Manifesto  – Atul Gawande.  గవాండే కొత్త పుస్తకం.  ఈ పుస్తకాన్ని ఇంతకుముందు తమ్మినేని యదుకుల భూషణ్ పరిచయం చేశారు

61. Next Michael Lewis.  ఇంటర్నెట్ వల్ల సమాజంలో వస్తున్న మార్పుల గురించిన విశ్లేషణ. ఇంతకుపూర్వం అధికారమూ, అవకాశమూ కొద్దిమంది దగ్గర కేంద్రీకృతమై ఉండే రోజుల్ని ఇంటర్నెట్ మార్చేసింది అన్నది పుస్తకంలో చెప్పదలచుకొన్న ముఖ్యవిషయం. ఇంతకు ముందు Liar’s Poker, The New New Thing వంటి పుస్తకాలు రాసిన మైకేల్ లూయిస్ కథనం ఆసక్తికరంగా ఉంటుంది. మంచి ఉదాహరణలను ఎన్నుకొన్నాడు: స్టాక్‌మార్కెట్‌ని ప్రభావితం చేసిన టీనేజ్ కుర్రాడు, ఇంటర్నెట్‌లో న్యాయం, చట్టాల గురించి సలహాలివ్వటంలో ప్రసిద్ధికెక్కిన ఇంకో కుర్రాడు, తమ రికార్డులని ఇంటర్నెట్‌లో మాత్రమే మార్కెట్ చేసి విజయం సాధించిన రాక్‌బాండ్ వగైరా..

62. Sterling’s Gold – Wit and Wisdom of an Ad Man – Roger Sterling. బాగా డిజైన్ చేయబడ్డ బోరింగ్ పుస్తకం. ఫూల్స్ గోల్డ్ అనుకొన్నాను. spoof పుస్తకమని తర్వాత తెలిసింది. Mad Men అనే టెలివిజన్ షోలో రాజర్ స్టెర్లింగ్ ఒక పాత్ర అట; నేనెప్పుడూ ఆ టివి షో చూడలేదు.

63. Ford CountyJohn Grisham. గ్రిషం మొదటి కథల పుస్తకం. రెండు మంచి కథలు ఉన్నాయి – మరణశిక్ష అమలు కాబోతున్నవాణ్ణి చూడడానికి వెళ్ళిన, తల్లి, అన్నతమ్ముల కథ Fetching Raymond, ఎయిడ్స్‌తో చనిపోబోతున్న స్థితిలో తన స్వగ్రామానికి తిరిగివచ్చిన యువకుడి కథ Funny Boy. మిగతావి కూడా బాగానే ఉంటాయి. గ్రిషం శైలి గురించి వేరే చెప్పక్కర్లేదు కదా.

64. Reader’s Digest Great Short Stories of the World.  దాదాపు నలభై ఏళ్ళ క్రితం వచ్చిన పుస్తకం; మొత్తం 71 కథలు; శాంతా రామారావు కథ కూడా ఉంది

65. The Best American Short Stories 2006 – Guest Ed: Ann Patchett.  ఇంతకు ముందు ప్రతి సంవత్సరం  కొని చదువుకొనేవాణ్ణి. మళ్ళీ కొంత విరామం తర్వాత మొదలు బెట్టాను. నేను ఈ పుస్తకాలు చదవటం మొదలు బెట్టినప్పటినుంచీ సిరీస్ ఎడిటర్‌గా ఉన్న కాట్రినా కెనిసన్‌కి ఇది ఆఖరు సంవత్సరం.   20 కథలు. భారత సంతతి రచయితలెవరూ లేరు ఈసారి.

66. The Best American Short Stories 2007 – Guest Ed: Stephen King.  సిరీస్ ఎడిటర్‌గా హైడీ పిట్లోర్‌కి మొదటి సంవత్సరం. భారత సంతతి రచయితలెవరూ ఈసారి కూడా లేరు.

********************

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.

********************

You Might Also Like

4 Comments

  1. పూడూరి రాజిరెడ్డి

    జంపాల గారు,
    మొత్తం 176. అంటే సగటున రెండు రోజులకు ఒకటి. రోబో చిట్టిలాగా స్కాన్ చేయట్లేదు కదా!

  2. leo

    యింత ఓపికగా యిన్ని పుస్తకాల చిట్టా తయారు చేసి అందించినందుకు ధన్యవాదాలు!

  3. తృష్ణ

    చాలా మంచి పుస్తకాల గురించి తెలిపినందుకు మీకు ధన్యవాదాలు. వీటిలో పావు వంతైనా తెలిసినందుకు, కొన్ని చదివినందుకు నాకు ఆనందం.

  4. Indian Minerva

    ఇన్ని పుస్తకాలా! అదీ ఒక్క సంవత్సరంలో!

Leave a Reply