కవితాభూషణం – భూషణ్ గారితో మాటామంతీ – మొదటి భాగం

తమ్మినేని యదుకులభూషణ్ గారు తెలుగు కవితలను. విమర్శను చదివే నెటిజనులందరికీ సుపరిచితులే కనుక, వారి గురించి ప్రత్యేకం పరిచయం అక్కర్లేదనుకుంటాను. కవిగా, విమర్శకుడిగా, చదువరిగా, అనువాదకుడిగా, బహుభాషావేత్తగా, వ్యక్తిగా – భూషణ్ గారి గురించి తెలియజెప్పే ఇంటర్వ్యూ ఇది. ఓపిగ్గా ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు.
ప్రశ్నల కూర్పు-స్వాతికుమారి, పూర్ణిమ, సౌమ్య.

ఇక ఇంటర్వ్యూలోకి వెళదాం……..

వ్యక్తిగతం:
(జీవిత విశేషాలు, ప్రభావితం చేసిన వ్యక్తులు, పుస్తకాలు, సంఘటనలు వగైరా)

౧. ’తమ్మినేని యదుకుల భూషణ్’ అంటే ఒక కవిగా, విమర్శకుడిగా, బహు భాషా పరిజ్ఞానం గల చదువరిగా మా అందరికి సుపరిచితమే. కానీ ఇవన్నీ మీలోని కవిని, విశ్లేషకుడిని ఆవిష్కరించే విషయాలు. వీటన్నిటికీ అతీతంగా, మీరు ఇవేవీ కాక ముందు మీ స్వపరిచయం ఏమిటి? మీలోని ఈ బహుముఖ కోణాలు వెలుగు చూడ్డానికి కారణమైన నేపధ్యం, మీ సొంత మనుషులు, అసలు ఊరు, మీ గురువులు, గురుతుల్యులు వగైరా జీవిత విశేషాలు తెలియజేస్తారా?

నేను పుట్టి పెరిగింది రాయలసీమలోని చారిత్రక పట్టణం తాడిపత్రిలో -ఊరిని చుడుతూ పారే పెన్నా నది , దాని ఒడ్డున వెలసిన ప్రాచీన దేవాలయం, దిగంతాల్లో రంగులు మార్చే కొండలు, వాటి వెంట పరుగులు తీసే రైలు, పట్టాలకు అటూ ఇటూ పొద్దు తిరుగుడు పూవులతో అలరారే పొలాలు -ఇవి మా ఊరి రేఖా చిత్రాలు. తాడిపత్రి చుట్టూ పల్లెలే; ఈనాటికి ఊర్లో ఎద్దుల బళ్ళు దర్శనమిస్తాయి. పల్లెకు పట్టణానికి మధ్య విభజన రేఖ అంత స్పష్టంగా లేదు. ‘ఉన్న ఊరు కన్న తల్లి ‘ అన్న వాక్యంలో తాత్పర్యం గలవాళ్ళు ఎక్కువమంది కనిపించే వాళ్లు. ఎంత గొప్ప చదువులు చదివినా నగరాలకు వలస పోకుండా ఉన్నఊర్లో దర్జాగా బ్రతికే వారు.నాన్న, పెదనాన్న, నాకు చదువు చెప్పిన గురువులది ఇదే ధోరణే. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిది అని మనస్ఫూర్తిగా నమ్మారు కాబట్టే డబ్బే ప్రధానం కాదు, జీవితంలో దాన్ని మించిన విలువలు ఉన్నాయి అన్న విషయాన్ని మనసులో నాటుకుపోయేలా చేయ గలిగారు. దాని వల్ల నేను ఎంతో లాభ పడ్డాను.

నాన్న (తమ్మినేని చిన్న రంగయ్య ,ఇంజనీరింగ్ చదివారు.) నాలో శాస్త్రీయ చింతన పాదు గొల్పారు. పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడం అల్ప విషయం; శరీరాన్ని,బుద్ధిని బలపరుకోవడం ముఖ్యమని చెప్పేవారు. ఆట పాటలను నిర్లక్ష్యం చేయరాదని నిష్కర్ష. ఒక పధ్ధతి తెలియనప్పుడే చదువు కష్టమని తన అభిప్రాయం. మౌనంగా ఉండటంలోని హాయిని అనుభూతం చేసింది నాన్నే.మాటల్లో పునరుక్తిని సహించరు. ఆధ్యాత్మికతలకు ఆమడ దూరంలో ఉంటారు. ఇతరుల సంగతి తనకు పట్టదు. పరిశీలనా శక్తి వల్ల పుట్టుకొచ్చిన హాస్య ధోరణితో అందరినీ నవ్విస్తారు.తరచి చూస్తే, ఇవన్నీ కవిత్వానికి అక్కరకు వచ్చే దినుసులు.

ఆరవతరగతిలో వ్యాస రచన – క్లాసులో అందరూ పెద్దలతో వ్యాసం రాయించుకొని,అదే భట్టీ పట్టి పోటీలో పాల్గొన బోతున్నారు.ఆరోజు లేత వెన్నెల -తళుకులీనే తారలు, ఆరుబయట దోమతెరలు కట్టిన మంచాలు. నేను వ్యాసం విషయం కదిలిస్తే నాన్న ఆ ధోరణి తప్పని మందలించి, వ్యాసానికి కావలసిన విషయాన్ని విపులీకరించి సొంతంగా నా మాటల్లో నన్ను రాసుకోమన్నారు. అందరూ ఆటల్లో పడితే చదువు పాడవుతుందని అనుకొంటే, మొత్తం సమయం కేవలం చదువుకే కేటాయిస్తే బుర్ర పాడవుతుందని నన్ను ఆటపాటల్లో విపరీతంగా ప్రోత్సహించేవారు.నేను ఇంటర్ లో ఉన్నప్పుడు ఏకంగా నాకు క్రికెట్ కిట్ కొనిపెట్టారు. నా కంటూ ఒక స్వంత టీం ఉండేది.అలా అని చెప్పి చదువుల్లో వెనుక బడింది లేదు. క్లాసులో టాపర్ ను నేనే. ఆ రకంగా అందరికీ భిన్నంగా నన్నెంతో ఆత్మవిశ్వాసంతో, ఔదార్యంతో పెంచి పెద్ద చేశారు.

నాయకత్వ లక్షణాలు నాలో పుష్కలంగా ఉండేవి. ప్రతి తరగతిలో నేనే లీడర్. టీచర్లు రాని రోజు తరగతిని నిశ్శబ్దంగా ఉంచడం నా బాధ్యత. నేను చదివిన/ కల్పించిన కథలు చెబుతూ ఉంటే పిల్లలందరూ నిశ్శబ్దంగా వింటూ ఉండేవారు. ఎవరూ గొడవ చేయనందుకు టీచర్లు నన్ను ఎంతగానో ప్రశంసించేవారు. ఆ రకంగా నా తోటి విద్యార్థులే నా కథలకు తొలి శ్రోతలు. నేను ఏడవ తరగతి లో ఉండగా బాల భారతి లో వచ్చిన నా రచనకు ఐదు రూపాయలు వచ్చిన విషయం హిందీ మేడం ప్రమీల అందరితో చెబుతూ ఉండగా నేను విని సంబరపడ్డాను. దేనికీ చలించని నాన్న కూడా కొంత ఆశ్చర్య పడ్డారు-ఈ వార్త తెలిసి.అప్పటి నుండి పిల్లల కథలు రాసి బాలజ్యోతి లాంటి పత్రికలకు పంపించే వాణ్ణి.

తల్లి (నాగరత్నమ్మ ) అమరం ,ఆంధ్రనామ సంగ్రహం తనకు కంఠస్థం. అలాగే ఎన్నో పద్యాలు, పలుకుబళ్ళు. పోతన భాగవతం దేవుని గదిలో ఉండేది. రాయలసీమలో అక్షరాలు దిద్దించే గురువులు భట్రాజులు; వారికి తెలుగులో మంచి పట్టు, పద్య రచనా కౌశలం, లలితకళల్లో నైపుణ్యం ఉండేవి. పెన్నానది ఇసుకలో అక్షరాలు గుణింతాలు దిద్దుకున్నాము. తర్వాత పాత పద్ధతిలో కృష్ణ శతకం, సుమతి శతకం, నరసింహ శతకం నేర్చుకొన్నాము ( కుమార శతకం నేర్వాలన్న అమ్మ కుతూహలం తీరకుండానే పై తరగతులకు వెళ్లి పోయాం). అమ్మ నుండి నాకు సంక్రమించింది అచ్చ తెనుగు, మంచి జ్ఞాపక శక్తి. ఒక్క ఇంగ్లీష్ ముక్కలేకుండా అచ్చ తెనుగు వినాలంటే ఈనాటికీ నాకు మా అమ్మే శరణ్యం.

జన్మ నక్షత్రం ప్రకారం ‘య’ తో మొదలవ్వాలి నా పేరు; అంత సులభంగా జరగలేదు నామకరణం. కాబట్టి నాకు అమ్మ పెట్టిన మొదటి పేరు : శ్రీ కృష్ణ దేవరాయలు (చేయి తిరిగిన కవి తనకు తోచిన చోట యతి నిలిపినట్టు, పేరులో య నిలిచింది కదా అన్నది తన వాదం. అంతే కాక నేను రాయలంతటి కవీశ్వరుడు కావాలని, బాగా బ్రతకాలని తన కోరికట).చివరికి కొంత సాహిత్యం చదువుకున్న ఒక మామ ఓసింతేనా -యదుకుల భూషణ అని పెట్టుకొంటే అన్ని రకాలుగా బావుంటుంది అని సూచించారు.(నేను పుట్టింది అష్టమి రోజు) చాలా కొద్ది మందికి నా మొదటి పేరు వెనుక కథ గురించి తెలుసు.

అమరం లోని కొన్ని శ్లోకాలు ఐదవ తరగతిలో ఉండేవి.’యస్య జ్ఞాన దయాసింధో గోడ దూకితే ఇదే సందో ‘ అని నవ్వుకునే వాళ్ళం. ఊహ తెలిసినప్పటినుండి చెవిన పడిన పద్యం : “ఎవ్వనిచే జనియించు “; తర్వాత మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని అమ్మాయిలు పాడుతుంటే మనసుకు హాయిగా ఉండేది. ‘మా చెవులరింగుమని’ అన్న వాక్యం రాగానే ఎంతో ఉత్తేజకరంగా మారిపోయేది వాతావరణం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే అప్పటికి ప్రభుత్వ బళ్ళు పధ్ధతిగానే ఉన్నాయి. కాన్వెంటు స్కూళ్ళ ఇంగ్లీష్ కంపు సమాజాన్ని సోకలేదింకా. పేదలు,ధనికులు కలిసికట్టుగా అందరూ ఒకే బడిలో చదువుకొనేవారు.

మా పెదనాన్న (వకీలు నరసింహులు) పేరు మోసిన లాయరు. సర్దారు పటేల్లా గంభీరంగా కనిపించే వారు. ఎంత అంటే ఎంత అని ఎదురు తిరిగే ధోరణి. అందరికీ ఆయనంటే హడల్. కానీ, పిల్లలను ఒక్క దెబ్బ కూడా వేసి ఎరుగడు. నమ్మిన దాని కోసం ఎంత దూరమైనా పోగల మొండి పట్టుదల అయన సొంతం.

పెద్దమ్మ (లక్ష్మిదేవమ్మ) నన్నెంతో ప్రేమగా చూసుకొంది. నలుగురు అక్కల తర్వాత నేను చిట్ట చివరి వాణ్ణి. తనను విడిచి నేను ఉండేవాణ్ణి కాదు.నాకు చెప్పకుండా పల్లెకు వెళితే, నేను నా బట్టలు ఒక సంచిలో వేసుకొని తన వెంటే పరిగెత్తే వాణ్ణి

అక్కలు (రాజేశ్వరి ,విజయ ,చిట్టి ,సరస్వతి) : నన్ను చాలా అల్లారుముద్దుగా పెంచారు. నేను తలుపులు బిడాయించుకొని నా గదిలో కూచుని పుస్తకాలు ముందేసుకొని నా లోకంలో నేనున్నా కిటికీలోంచి భోజనాలు వచ్చేవి. మా బుడ్డక్క ,నేను ఎక్కువ సఖ్యంగా ఉండే వాళ్ళం- పిల్లులు పెంచడం, కోళ్ళకు గింజలు వేయడం, కుక్కలకు అన్నం పెట్టడం లాంటివి కలిసి చేసే వాళ్ళం; ఎదురింటి ఎర్రపిల్లి మీసాలు కత్తిరించాం; కారణం వారు మా నల్ల పిల్లిని వెక్కిరించేవారు.

బడి ఇంటి పక్కనే ఉండేది.బడికి ఎదురుగా పార్కు. మద్రాసు/బొంబాయి మెయిలు చప్పుడు వినిపించేది. ప్రతి ఏడాది బడి పిల్లలు అందరం కలిసి కాలినడకన ఆలూరు కోన వెళ్లి వచ్చే వాళ్ళం. ఒక్కోసారి, ఇంటిల్లిపాది ఎడ్లబండిలో తెల్లవారు ఝామున బయల్దేరి పొద్దు చుక్కను చూస్తూ, ఎద్దుల గంటల సవ్వడికి జోగుతూ వెళ్ళే వాళ్ళం.కొండ దిగువున సత్రాల దగ్గర, ఎద్దులను విడిచి మేము పైకి ఎక్కి పోయే వాళ్ళం. సెలయేర్లతో ఎంతో అందంగా ఉండేది ఆలూరు కోన. మడుగులోకి ఎవరు ముందు దూకుతారో పోటీలు పడే వాళ్ళం.సత్రాల్లో పరమాన్నం, చిత్రాన్నం వాసన వచ్చేదాకా, చలిలో పళ్ళు కొట్టుకొంటుంటే ఎండలోని వెచ్చదనాన్ని అనుభవించే వాళ్ళం. ఇటువంటి అందాలకోనలో నేను ఒకసారి తప్పిపోయాను.

పదవ తరగతి వరకు నేను చదివింది తెలుగు మీడియంలో; ఆంగ్లో ఇండియన్ అమ్మాయిలు ఇంగ్లీష్ తెగ మాటాడేస్తుంటే కొంత ఆశ్చర్యంగా కళ్ళప్పగించి చూసే వాళ్ళం.అప్పటికి తలపండిన హిందీ పండితులు కత్తి నాగిరెడ్డి దగ్గర హిందీ సాహిత్యం చదువు కొంటున్నాము.ఆయన హిందీలో స్వయానా రచయిత. తెలుగులో మంచి పట్టు ఉన్నవాడు. తొమ్మిదవ తరగతి కల్లా హిందీ విశారద పూర్తి చేశాను. ఆ పరీక్షల్లో భాగంగా తెలుగు సాహిత్యం కూడా చదివాము. అలా సాహిత్యంలో మంచి పునాది ఏర్పడింది. ఒక వైపు నేను కేరాఫ్ లైబ్రరీ లా ఉండేవాణ్ణి. అప్పట్లో TV లేదు.నా స్నేహితుని తండ్రి నాగరాజా రావు గారు హిందీ లెక్చరర్.( అప్పట్లో మధురాంతకం రాజారాం కుమారులు నరేంద్ర తాడిపత్రి డిగ్రీ కాలేజీ లో పని చేస్తున్నారు.) నాగరాజా రావు సారు తను స్వయంగా నాటకాలు రాసి డిగ్రీ విద్యార్థులతో నటింప చేసేవారు. తను స్వయంగా నటించేవారు. చాలా సరదాగా ఉండేవి ఆ రోజులు.ఆయన మా ఆసక్తిని గమనించక పోలేదు.

శర్మ సారు (కవి పండితులు జోస్యం జనార్ధన శాస్త్రి గారి కుమారులు), సుబ్బయ్య శెట్టి గార్లు మా కోసం ఎంతో కష్టించారు.ఇక ట్యూషన్ : గణితంలో (లింగుట్ల పెద్దప్ప) , ఇంగ్లీష్ లో( లింగుట్ల చిన్న వెంకటయ్య) తమదైనటు వంటి ప్రత్యేక బోధనా పద్ధతులతో మంచి పునాది వేసిన వారు .(వీరు పెద్ద చదువులు చదివినా ఊరి మీది మమకారంలో, కర్ణాటక లో మంచి ఉద్యోగాలు వదులుకొని వచ్చి స్వతంత్రంగా ట్యూషన్లు నడిపే వారు.) ఇంటర్లో శ్రీనివాస రెడ్డి సారు అప్పుడే పాలగుమ్మి
పద్మరాజు అనువాద పద్ధతుల మీద ఎంఫిల్ చేసి వచ్చి నాకు అనువాద విమర్శనా పద్ధతుల్లో మంచి శిక్షణ ఇచ్చిన వాడు. అమెరికా లాంటి దేశాల్లో fiction కి , pulp fiction కి స్పష్టమైన తేడా ఉంది. తెలుగు లో pulp fiction రాసే యండమూరి, మల్లాది లాంటి వారు సీరియస్ రచయితల్లా చలామణి అవుతున్న హాస్యాస్పద వాతావరణంలో శ్రీనివాస రెడ్డి సారు ఒక్క సంభాషణ తో పాలగుమ్మి పద్మరాజుతో పోల్చి సాహిత్యంలో వీరి స్థానాన్ని నిర్ణయించాడు.

నేను అన్ని పోటీల్లో (అనగా వ్యాసరచన/వక్తృత్వం) చురుగ్గా పాల్గొని పుస్తకాలు బహుమతిగా పొందే వాణ్ణి. ఇంటర్లో నేను రాసిన వ్యాసానికి రాష్ట్ర స్థాయి పోటీలో మొదటి స్థానం రావడం ఆశ్చర్యం కలిగించింది. ఆ రోజుల్లో నేను బోలెడు కథలు రాశాను;డిగ్రీ చదివే అక్క స్నేహితులు నా పాఠకులు .ఇంకా నా సహాధ్యాయులు శ్రీధర్ ,రమణారెడ్డి, నా బాల్య స్నేహితుడు రామాయణం వెంకటేశ్వర రాజు వారింట్లో అందరూ నా కథలు చదివి అభిప్రాయం తెలిపే వారు. రచయిత కావాలన్న కోరిక నాలో ఎంతో బలీయంగా ఉండేది. మధురాంతకం రాజారాం గారి సమీక్ష ( ప్రేమ్ చంద్ కథల మీదే అనుకొంటాను) బాగా ఆలోచింప చేసింది. బాపు బొమ్మకు నేను రాసిన చిన్న కథ స్వాతిలో వచ్చింది. అప్పుడు హాస్యప్రియలో బాపు బొమ్మకు నేను రాసిన హాస్య కవితలు ప్రతి నెలా వచ్చేవి. ఆంధ్రజ్యోతి కథల పోటీలో నా కథకు చిన్న బహుమతి వచ్చింది. చివరి పేజీలో రంగుల్లో వేశారు. నేను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను.అక్క స్నేహితులు నా కథ వచ్చిన విషయాన్ని చెబితే, నేను విజయవాడలో ఆ సంచికను వెతికి పట్టుకోవడం చూచాయగా గుర్తు. అధ్యయనం వల్ల, అనువాదాల వల్ల కథా శిల్పం అర్థమైన వెంటనే కథలు రాయడం మానుకొన్నాను. కవిత్వం మీద పూర్తిగా దృష్టి పెట్టాను.

౨. మీకు వివిధ భాషలపై ఆసక్తి కలగడం వెనుక ఉన్న కథ చెబుతారా?

ఐదవ తరగతి ఐపోయాక పొద్దుపోని ఒక ఒక మధ్యాహ్నం, వరండా మెట్ల మీద కూచుని ఒక అరగంటలో దేవనాగరి లిపి నేర్చుకొన్నాను. అలా మొదలయింది ఆసక్తి. ఆ తర్వాత చాలా కాలం హిందీ అధ్యయనం చేశాను. పుట్టపర్తి నారాయణాచార్యులది పక్క ఊరే కదా, ఎంత లేదన్నా ఆయన ప్రభావం ఉంది. భాషలొక పది నేర్చుకోవడం గొప్ప విషయం అన్నఎరుక ఉండేది. నా స్నేహితుడి ఇంట కన్నడం వినిపించేది. ఆ భాషన్నా నాకెంతో ప్రీతి. తర్వాత ఇంటర్ సెలవుల్లో వివేకానందుల రచనలు యథామూలం చదవాలని బెంగాలీ మొదలు పెట్టాను. చిన్న వయసులో సంస్కృతం నేర్చుకోవాలని విఫల ప్రయత్నం చేశాను. ఇంగ్లిష్ హిందీ కన్నా ఒక ఏడాది ముందు మొదలు పెట్టినా ఇంటరు దాకా పాఠ్య పుస్తకాలు వినా పెద్దగా చదివిందేమి లేదు.నాన్న ‘ఆ గుడ్డి హిందీ వదిలి ఇంగ్లీష్ మీద దృష్టి పెట్టు ‘ అని హెచ్చరించే వారు. ఇంకో తమాషా ఏమంటే ,ఎవరికీ అర్థం కాకూడదని నేను డైరీలు సైతం వచ్చీ రాని హిందీలో రాసే వాణ్ణి. రోణంకి అప్పల స్వామి గారు పశ్చిమ ఐరోపా భాషలను నేర్చుకొన్న తీరు అబ్బురపరిచేది. నేను యథామూలం చదవాలని అనువాదం చేయాలని తగుమాత్రంగా చాలా భాషలు నేర్చాను. Tao Te Ching అనువాదం కోసం ఇటీవలి కాలంలో ప్రాచీన చైనీస్ లో బాగా కృషి చేస్తున్నాను. ప్రతి భాషలోను అందం ఉంది. తరతరాల అనుభవాలను, జ్ఞాపకాలను పదిల పరిచేది భాషలే అన్న విషయం మరువ రాదు. బహు భాషలు నేర్చిన ఒక పండితుడు How to learn any language అన్న చక్కని పుస్తకం రాశాడు. తప్పక చదవాలి ఎవరైనా. పలు భాషలు నేర్చుకొనే క్రమంలో విఫలమైనా వచ్చే నష్టం లేదు, అది కూడా ఒక అనుభవమే. నేను లింగ్విస్టిక్స్ సీరియస్ గా చదువుకున్నాను. కావున, భాషామూలాలు తెలుసుకోవడం, పోలికలు పట్టడం, వ్యత్యాసాలు గుర్తించడం నాకెంతో ఇష్టమైన పని.

(ఇంకా ఉంది)

You Might Also Like

9 Comments

  1. పుస్తకం » Blog Archive » 2010లో నా పుస్తకాలు

    […] సముద్రం – తమ్మినేని యదుకుల భూషణ్ 22. ఆ కుటుంబంతో ఒక రోజు — […]

  2. తమ్మినేని యదుకుల భూషణ్

    మొదట్లో పేరు లేని కలంతో రాసే వాణ్ణి. తర్వాత జపనీస్ ఊట కలం అలవాటయింది. చిన్నప్పుడు అంటే ఎంత చిన్నప్పుడు అన్న ప్రశ్న ఉదయిస్తుంది. “నూనూగు మీసాల నూత్న యవ్వనమందు ” రాసిన కవిత్వం కొంత వెలుగులోకి వచ్చింది. “చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు” రచించినవి పాత కాగితాల అలమరాలో మగ్గుతున్నాయి.

  3. అనురాగ్

    భూషణ్ గారూ,

    ఇంకా ఓపిగ్గా సమాధానాలిస్తున్న మీకు కృతఙతలు, మీ ప్రవాహ ధాటి చుస్తుంటే అడగలేక మేము చతికిల పడాలే గానీ చెప్పలేక మీరాగే పని లేదనిపిస్తొంది. ఒక చిన్న ప్రశ్న, చిన్నప్పటి నుంచీ మీరు రచనా వ్యాసంగంలో వేళ్ళూనికొని ఉన్నట్టున్నారు. మీకేమైనా కలం పేరు ఉండేదా? మీరు చిన్నప్పుడు రాసిన కధలు కానీ, కవితలు గానీ అచ్చొత్తించారా? మాకెక్కడైన దొరుకుతాయా?

    అనురాగ్

  4. తమ్మినేని యదుకుల భూషణ్

    ఆ రోజుల్లో ఒక సరదా సంధి సూత్రం ఒకటుండేది :
    ” చెంపకు చేయి పరంబగునపుడు కంటికి నీరు ఆదేశంబగు “

  5. నారాయణ

    `తమ్మినేని వారితో పరిచయం నన్నూ చిన్నతనంలోకి పరుగెత్తించింది.. ‘యస్యజ్ఞాన దయాసింధో’ మాకూ పరిచయమే!

  6. కొత్తపాళీ

    చాలా బావుంది. భూషణి పలకరించాలనే ఆలోచన వచ్చినందుకు పుస్తకం వారికి, ఓపిగ్గా వివరంగా చెప్పుకొచ్చిన భూషణ్‌కీ ఇద్దరికీ అభినందనలు

  7. C.S.Rao

    యదుకులభూషణ్ గారిది ఆకట్టుకునే వ్యక్తిత్వం.ఆయన ప్రధాన లక్షణం గొప్ప Independence of mind. దేనికీ,ఊరకనే బద్ధులు కారు.లోతైన పరిశీలన చేసిన తర్వాతే ఒక విషయాన్ని నిగ్గు తేల్చగల సత్తా,నిజాయితీ గల తత్వం కల్గిన వారు.
    ఏ మాత్రం personal bitterness లేని వ్యక్తి. ఇది సామాన్యమైన విషయం కాదు.
    తను పూర్తిగా నమ్మిన సాహితీ విలువల ఆధారంగా తనకు నచ్చని రచనను అది ఎంత పెద్దవారిదైనా,పేరున్నవారిదైనా చీల్చి చెండాడంలో లోతైనపాండిత్యంతో పాటు ,విమర్శనానైపుణ్యం పాటు పోటీ పడుతూ రాయలసీమ పౌరుషం ,ధైర్యం కూడా ఉంటవి.
    ఆయన విమర్శలో ఉండే కరకుదనానికీ,మానవ సంబంధాలలో వ్యక్తమయ్యే సరళతకు,సౌమ్యత కు,మృదుభాషణ కు పొంతన లేనట్లు కనిపించవచ్చు.
    దేనికదే.అదే నిజాయితీ,అదే bitterlessness.ఎవరి పుస్తకాలు ఖండిస్తూ రచనలు చేస్తారో వారి పుస్తకాలే వారి సహాయార్ధం పదిమందికీ పంచిపెట్టటం నేను చూసిన సత్యం.
    భాషలంటే అమితమైన మమకారం,సహజమైన ప్రేమ.సాహిత్యాభిలాష ,రచనా సామర్ధ్యం,స్నేహశీలత ,సునిశితమైన హాస్యప్రియత్వం,ప్రతిభ కనబడితే అరమరికలు లేకుండా ప్రోత్సహించటం, ఆయన గొప్పగుణాలు.
    పుస్తకం.నెట్ వారు యదుకులభూషణ్ గారితో ముఖాముఖినిర్వహించటం బావుంది.
    ఇరువురికీ అభినందనలు.

  8. రవి

    వావ్! ఏదో పిల్లతెమ్మెర సోకినంత అందంగా ఉన్నాయండి, తమ్మినేని వారి అనుభవాలు.

    “యస్య జ్ఞాన దయాసింధో గోడ దూకితే ఇదే సందో”… నన్నూ ఎన్నో యేళ్ళ క్రితానికి పరిగెత్తించారు.

Leave a Reply