అంతర్ముఖుని బహుముఖీనత
వ్యాసకర్తలు: ఎ. కె. ప్రభాకర్, కె. పి. అశోక్ కుమార్
(2024 కి గాను అప్పాజోశ్యుల-విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కార గ్రహీత అయిన ముకుంద రామారావు గారి గురించి వెలువడిన సమ్మానోత్సవ విశేష సంచిక “ప్రతిభా వైజయంతి” కి ముందుమాట.)
*****
లోకం చూసినవాళ్ళు ప్రజాస్వామికంగా వుంటారు. బహుళ సంస్కృతుల పట్ల వుదారంగా వ్యవహరిస్తారు. వైవిధ్యాన్ని గౌరవిస్తారు. విశాల విశ్వంలో మానవ జీవితానికీ మనుగడకూ వున్న అల్పత్వాన్నీ క్షణికత్వాన్నీ అర్థం చేసుకుంటారు. అవిచ్ఛిన్న కాలగతిలో విధేయంగా వొదిగిపోతారు. వైయక్తిక జీవితానికీ సామాజిక విలువలకూ మధ్య పెరుగుతున్న ఖాళీలను స్వీయ చైతన్యంతో పూరించుకునే యల్లపు ముకుంద రామారావు సాహిత్య ప్రస్థానాన్ని గమనించినప్పుడు యీ అంశం బోధపడుతుంది. బయటి చూపు విశాలమైన వారికి లోచూపు నిశితమౌతుంది అనడానికి ముకుంద రామారావు మంచి వుదాహరణ. రెండు చూపుల మధ్య పోటీ తెచ్చి అంతర్దృష్టిని వున్నతీకరించేవాళ్ళు, లోచూపుకి వ్యవధి లేని సామాజికులు కొందరుంటారు. బాహ్య ప్రపంచాన్ని విడిచి కేవల ఆత్మావలోకనంతో విముక్తి సాధించడానికి ప్రయత్నించే మేధావులూ వుంటారు. వారు యెన్నుకున్న మార్గం వ్యక్తివాదంగా మారే అవకాశం వుంది. అనాత్మవాదులకు అది అంగీకారం కాదు.
వీరందరి మధ్య తనదైన వ్యక్తిత్వంతో రామారావు లోనికీ బయటికీ వొక వారధి కడుతున్నాడు. ఆ వారధి మీద స్వయంగా పయనిస్తున్నాడు. లోనికీ బయటికీ చేస్తున్న ప్రయాణమే ఆయన చేసిన అనేక దూర ప్రయాణాలకంటే సుదీర్ఘమైనది. రెండు ప్రపంచాల మధ్య అలుపు లేని లోలకంలా కదులుతూనే వున్నాడు. బహు దూరపు బాటసారి ముకుంద రామారావు కవిగా తాత్వికుడు. అనువాదకుడిగా గొప్ప ప్రజాస్వామ్యవాది. సమకాలీన కవులు అనువాదకులు విమర్శకులు పరిశోధకులు అనేకులు ముకుంద రామారావు సాహిత్య కృషిని అంచనా వేశారు. వారిలో మూడు తరాలకు చెందిన వారున్నారు. భిన్న సామాజిక వర్గాలకు భిన్న ప్రాంతాలకు చెందిన వారున్నారు. అందరూ ఆయన్ని హృదయానికి హత్తుకున్నారు. స్వీయ దృక్పథాల నుంచి ఆయన్ని దర్శించారు. కొందరు దృక్పథాలకు అతీతంగా వ్యాఖ్యానించారు. ఆయన కవిత్వంలోని వస్తు వైవిధ్యం గురించి తరచి చూశారు. నిర్మాణ రీతుల్ని విశ్లేషించారు. వ్యక్తిగా సాహిత్యకారుడిగా ఆయనలోని బహుముఖీనతని భిన్న పార్శ్వాల నుంచి ఆవిష్కరించారు. అనువాద రంగంలో ఆయన విస్తృతి యెందరినో ఆకట్టుకుంది. ఏ విశ్వవిద్యాలయాలో ప్రాధికార సంస్థలో మాత్రమే చేయగల కృషి వొక వ్యక్తి చేయటం ప్రతి వొక్కర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే యీ సందర్భంగా తప్పనిసరిగా స్పష్టం చేయాల్సిన విషయం యేమంటే రామారావును కేవలం కవిగానో అనువాదకుడిగానో చూడకూడదు; దేశ విదేశాల కవిత్వ చరిత్ర పరిశోధకుడిగా సైతం చూడవలసిన అవసరం వుంది. ఆ కోణాన్ని కాత్యాయనీ విద్మహే వంటి అకడమిషియన్స్ సరిగ్గా గుర్తించారు.
‘ప్రతిభా వైజయంతి’ ముకుందరామారావు గారి సాహిత్యాన్ని కేంద్రంగా రూపొందించిన సంచికే అయినప్పటికీ చాలా వ్యాసాల్లో ఆయన వ్యక్తిత్వం కూడా ప్రతిఫలించింది. వ్యక్తిగానూ సాహిత్యకారుడిగానూ ఆయన నిగర్వి. నిరాడంబరుడు. నిరంతర అన్వేషి. ప్రకృతి ప్రేమి. స్నేహశీలి. మితభాషి. మృదుభాషి. అంతర్ముఖుడు. వివాదరహితుడు. ఆయన జీవన విధానమే రచనల్లో ప్రతిఫలించింది. ఆయన పలికే మిత హిత ఋత వాక్కే కవిత్వంగా పరిణమించింది. అందుకే పదుగురికీ నచ్చింది. మానవ సంబంధాల్లో వుండాల్సిన సంవేదన ఆయన తొలినాళ్ళ కవిత్వంలో అలుముకొని వుంటే యిటీవలి కవిత్వంలో జీవిత సాఫల్యాన్ని గురించిన అన్వేషణ యెక్కువగా గోచరిస్తుంది. జీవన మరణాల మధ్య కాలం ఆడే దోబూచులాట ఆయన కవితా సమయమైంది. అది వయస్సు తెచ్చి పెట్టిన సహజ పరిణామమేమో!
వాదాల సరదాలు అంటని కవి ముకుంద రామారావు అని చెప్పి కొందరు ముచ్చటపడ్డారు కానీ ఆయనకు నిర్దిష్ట ప్రాపంచిక దృక్పథం వుంది. అది ముమ్మాటికీ మానవీయమైంది. బలహీనులపై బలవంతుల ఆధిపత్యాన్నీ అణచివేతనూ ఆయన సర్వదా తిరస్కరించాడు. దేశ దేశాల కవిత్వాన్నీ భారతీయ కవిత్వాన్నీ అనువదించడానికి ఆయన చేసుకున్న ఎంపిక చూస్తే యీ విషయం స్పష్టమవుతుంది. ప్రపంచీకరణ ప్రభావంలో పరాయీకరణకు గురయ్యే మనిషి పట్ల ఆయన లోతైన కన్సర్న్ చూపాడు. భిన్న కారణాల వల్ల పుట్టి పెరిగిన నేలని విడిచిపోయే వలసజీవుల వేదనతో స్వయంగా మమైకమయ్యాడు. మానవ సంబంధాల్లో లుప్తమౌతోన్న స్పందనల పట్ల ఆర్తి ప్రదర్శించాడు. తరచి చూస్తే ఆయన కవిత్వంలో తెలీని తపన వుంది. కనపడని సంఘర్షణ వుంది. అంతు పట్టని ఆవేదన వుంది. దేనికోసమో చెప్పలేని దేవులాట వుంది. లోతైన జీవనానుభవం వుంది. మనుషుల మధ్య వెల్లివిరియాల్సిన ప్రేమైక బంధం గురించిన యెరుక వుంది. అనేక సందర్భాల్లో ఆయన తన కవితల్ని వైయక్తిక సంవేదన నుంచి సామాజిక తలంలోకి నడిపించారు. కవిత్వ భాషలో ఆర్ద్రతనీ సాంద్రతనీ గాఢతనీ గూఢతనీ ఏకకాలంలో సాధించారు. ‘కవిత్వం ఒక ఆల్కెమీ దాని రహస్యం కవికి తెలుసు’ అన్న మాటని ముకుంద రామారావుకి పూర్తిగా అన్వయించుకోవచ్చు. కాస్తంత మౌనానికీ ధ్యానానికీ అవకాశం యిచ్చే అతి తక్కువ కవుల్లో ఆయన వొకరు. ఈ రహస్యాన్ని యిందులో వ్యాసకర్తలు చాలా బాగా పట్టుకోగలిగారు. ముకుంద రామారావుగారి సాహిత్య జీవిత అధ్యయనానికీ, లోతైన పరిశోధనకూ అజో విభొ కందాళం ఫౌండేషన్ ప్రచురిస్తున్న యీ సంచిక దారి దీపమౌతుంది.
***
ఈ సంచిక కోసం రచనల సేకరణ మొదలైన కొద్దిరోజుల్లోనే మా అంచనాలకు మించిన విషయం సమకూరింది. అన్నీ క్రోడీకరించి చూస్తే ముకుంద రామారావు చేసిన యిటీవలి అనువాద రచనల్లా ఆరు వందల పేజీలతో ఉద్గ్రంధం తయారైంది. అది సాహిత్య క్షేత్రంలో ఆయన చేస్తున్న నిరంతర కృషికి గుర్తింపే గానీ; ఎన్నో కత్తిరించుకొని కుదించుకొని చివరికి యీ రూపానికి తెచ్చాం. అడగ్గానే అతి తక్కువ కాలంలో తమ రచనలు అందజేసిన రచయితలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సంచిక తయారీలో అనేక అవాంతరాలు. వాటిని అధిగమించే క్రమంలో రామారావుగారిని విపరీతంగా పీడించాం. ఆయన సహకారం లేకుంటే యీ బృహత్తర ప్రయత్నం నెరవేరేది కాదు. పుస్తకం రూప కల్పనలో పంతుల విట్టుబాబు పాత్ర ఎనలేనిది. ‘తాతా మనవళ్ళు’ లాంటి వీరిద్దరికీ యెన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.
ఎనభై ఏళ్ళ వయస్సులో యిప్పటికీ అనారత అధ్యయన తత్పరతతో, అలుపెరుగని సాహిత్య సేవలో తరిస్తోన్న ముకుంద రామారావు గారికి యీ సందర్భంగా స్నేహ పురస్సరంగా ఆత్మీయతాభినందనలు తెలియజేస్తూ .. వారి రచనా స్ఫూర్తిని అందుకోవాల్సిన బాధ్యతను ముందు తరాలకు మరోసారి గుర్తు చేస్తూ.. సెలవ్.
Leave a Reply