స్వయంప్రకాశం – టి.శ్రీవల్లీ రాధిక

రాసిన వారు: సుజాత
***********
నవ్య వీక్లీలో శ్రీవల్లీ రాధిక గారి కవిత ఒకటి చదివాను “మనోదర్పణం” పేరుతో. అందులో ఆమె మనసు గురించి అంటారు…

“ఆరు రకాల మచ్చలతో తనను తాను నింపుకుంటుంది
ఆదమరిచానంటే ఆ మచ్చలన్నీ నావేనంటుంది
నిశ్చలంగా ఉందంటే
నన్ను నిలబెట్టిన ప్రతిభ తనదేనంటుంది
నిలవలేక జారిందంటే
అష్టవంకరలూ నావేనంటుంది”

ఎంతో లోతైన భావాలతో అలతి పదాలతో రాసిన కవిత. ఈ ప్రసక్తి ఎందుకంటే ఇటీవల ఆమె రాసిన “స్వయంప్రకాశం” చదివినపుడు కూడా పాఠకుడికి ఇదే భావం తోస్తుంది. మొత్తం 12 కథలున్న ఈ కథా సంకలనం ఎంతో శ్రద్ధతో ఏర్చి కూర్చిన కథలతో తయారు చేశారనిపించింది. స్వయంప్రకాశం అనేది ఇందులో ఒక కథ పేరే అయినా అది సంకలనానికి వన్నె తెచ్చేలా ఒదిగిపోయింది.

దాదాపు ప్రతి కథలోనూ పాఠకుడిని ఆలోచనలో పడేసే అంశం ఒకటి తప్పకుండా ఉండేలా చూసుకున్నారు రచయిత్రి. అందువల్ల ఈ పుస్తకం కేవలం టైమ్ పాస్ కోసం చదివే పుస్తకం ఖచ్చితంగా కాదు.అలాగని ఏదో ఒక స్టేట్ మెంట్ ఇవ్వడమో, నీతిని బోధించడమో, జీవిత సత్యాల్ని ఆవిష్కరించడమో రచయిత్రి చేయరు. ఆ వంక పాఠకుడిని పాజిటివ్ గానో, నెగటివ్ గానో ఆలోచించేలా ప్రేరేపించి వదిలేస్తారు. మానవ సంబంధాల పట్ల పరిపక్వమైన ఆలోచనా ధోరణి రచయిత్రిలో కనిపిస్తుంది.

ఎదుటివారు మనం ఈర్ష్యా పరులనుకుంటారేమో అన్న కారణంగా మనసు చంపుకునైనా ,వారికనుగుణంగా ప్రవర్తించక్కర్లేదనే సత్యాన్ని ఆరేళ్ళ కూతురు నుంచి నేర్చుకున్న తల్లి కథ ఈర్ష్య! “ఈర్ష్యను జయించడమంటే ఈర్ష్య పడకపోవడమే కాదు, ఈర్ష్యకు భయపడకపోవడంకూడా” అని ముగిస్తారు రచయిత్రి ఈ కథను.

“సాహసి” కథలో “పెందలాడే ఇంటికి రా! అర్థరాత్రయ్యేదాకా తిరక్కు” అంటూ ఆడపిల్లల రక్షణ గురించి పాఠాలు చెప్తూ సణుగుతూ ఉండే నాయనమ్మ ఎవడో పోకిరి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న విషయాన్ని తేలిగ్గా తీసుకోవడం సృజనకు మింగుడుపడదు.“అవకాశం దొరికితే మగాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు.నువ్వు మొదటిదానివీ కాదు, చివరిదానివీ కాదు.దానికింత గోలపడాలా?”అని చీవాట్లేస్తే ఆలోచనలో పడుతుంది.ధైర్యం అంటే ప్రమాదం రాకముందు చూపించాల్సింది కాదు, ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వచ్చినపుడు చూపించేది.”అని అర్థమైన సృజనకు నాన్నమ్మ ఆకాశమంత ఎత్తులో కనిపిస్తుంది.

పిల్లలు కోరిన కొండమీది కోతినైనా తెచ్చిచ్చే నేటి తల్లిదండ్రులు వాళ్ళ మనసుల్ని ఎందుకు అర్థం చేసుకోడానికి ప్రయత్నించరు?అని ఆవేదనగా ప్రశ్నించే కథ ధారణ! “సమాజాన్ని,శాస్త్రాల్ని అర్థం చేసుకోవడం జ్ఞానానికి నిదర్శనం!కాని పసి పిల్లల్ని అర్థం చేసుకోవడం అలౌకిక ఆనందానికి సోపానం!  తిరిగిరాని బాల్యం గురించి మనం బాధపడుతుంటాం! మన చుట్టూ అలవి కానంత బాల్యం  ఉంది. దాన్ని అర్థం చేసుకుని అక్కున చేర్చుకోవడం ద్వారా మన బాల్యం అందించిన అనుభూతికన్నా గొప్ప అనుభూతిని అందుకోవచ్చు” అంటారు రచయిత్రి.

చిన్నతనంలోనే భర్తను పోగుట్టుకుని కొడుకుని పెంచి  ప్రయోజకుడిని చేసిన భ్రమర “నువ్వు కష్టపడుతున్నావు” అంటే ఒప్పుకోదు.“నేను ఆనందంగా ఉండాలని తీర్మానించుకుంటే నన్ను బాధపెట్టగల శక్తి ఎవరికుంటుంది?నా మనసుకీ పెదవులకీ మధ్య మరెవరూ లేనపుడు నా నుంచి నవ్వెలా దూరమవుతుంది? సంగీతమూ సాహిత్యమూ ఇలా ప్రపంచంలోని ఆహ్లాదాలన్నింటినీ నా ముంగిటిలోకి తెచ్చుకుని ఆనందంగా బతికితే దాన్ని నా విజయంగా గుర్తించక “నువ్వు కష్టపడ్డావు” అంటూ సానుభూతి చూపడం నాకు ఆనందాన్ని కల్గించదు.అవమానకరంగా  తోస్తుంది”అని స్పష్టంగా చెప్తుంది “స్వయంప్రకాశం” కథలో!

“యోగ్యత” కథలో…. తనకిష్టమైన రీతిలో జీవిస్తూ  అందరితో కల్సిపోతూ నిర్లక్ష్యంగా కనపడే జార్జ్ అంటే ఆఫీసులో ఎవరికీ సదభిప్రాయం లేదు…అతడు సమర్థుడైనా సరే!ఒక పిక్నిక్ లో అతడు స్నేహితులతో మరింత ఫ్రీగా ప్రవర్తించడంతో అతడి ప్రవర్తన గురించి సో కాల్డ్ మర్యాదస్థులు చేసే వ్యాఖ్యలు సుచిత్రను ఆలోచింపజేస్తాయి. “సమర్థతకూ,నిగ్రహంతోకూడిన  ప్రవర్తనకు సంబంధం లేదు.జార్జ్ లాంటివాళ్ళకు మేథావులుగా సమాజం చేత గుర్తించబడాలన్న కోరిక లేదు. అందుకే సమాజ నియమాలను నచ్చితే తప్ప పాటించరు.నియమాలను పాటించడం నిగ్రహంతో జీవించడం మర్యాదస్థుల లక్షణం కాబట్టి మాత్రమే చాలామంది వాటిని పాటిస్తారు తప్ప అవి వాళ్ళ సహజాభరణాలు కాలేవు”అని ఆ పార్టీలో మొదటిసారి జార్జ్ ని పాజిటివ్ గా  అర్థం చేసుకుంటుందామె!   మనకు ఆసక్తి లేని పనులు చేసేవాళ్ళను అసమర్థులుగా చూడకూడదన్ని జ్ఞానాన్ని పొందానని చెప్పుకుంటుంది.

కథావస్తువుని ఎన్నుకోవడంలోనూ,దాన్ని సరళంగా నడిపించడంలోనూ రాధిక తనదైన శైలిని ప్రదర్శించారు.కథనం ఈ కథలకు ప్రాణం.

మనుషుల్ని నిశితంగా పరిశీలించే అలవాటుంటే తప్ప  చక్కని మానసిక విశ్లేషణ సాధ్యం కాదు. అటువంటి విశ్లేషణ ఇందులో చాలా కథల్లో కనిపిస్తుంది.అయితే కొన్ని చోట్ల ఇది కొంచెం ఎక్కువైనట్లు కూడా తోస్తుంది.

అలక్ష్యం, తాదాత్మ్యం,ఆశ కథలు కూడా బాగున్నాయి. అర్హత, భార్యత్వం ,మాటలు కాదు..వంటి కథలు అంతగా ఆకట్టుకోకపోయినా మిగతా కథల నాణ్యత వల్ల అది అంతగా పట్టించుకోనక్కర్లేదనిపిస్తుంది.

ఇటీవల ప్రమద పబ్లికేషన్స్ ద్వారా విడుదలైన ఈ పుస్తకం ప్రధాన పుస్తక కేంద్రాలలో లభిస్తుంది. పేపర్ నాణ్యత,ఫాంట్ కూడా బావున్నాయి.

వెల: 80 రూపాయలు

**********
[స్వయంప్రకాశం – పుస్తకావిష్కరణ,పుస్తకంలోని విశేషాలతో పుస్తకం.నెట్ లో సి.బి.రావుగారు రాసిన వ్యాసం ఇక్కడ]

You Might Also Like

9 Comments

  1. పుస్తకం » Blog Archive » 2010లో నా పుస్తకాలు

    […] మీ విధేయుడు – భమిడిపాటి రామగోపాలం 29. స్వయంప్రకాశం – టి. శ్రీవల్లీ రాధిక 30. ఆకుపచ్చని […]

  2. జంపాల చౌదరి

    ఈ కథల్లో కథకన్నా కథకురాలే ఎక్కువ కనిపించారు నాకు. ఆమె పాఠకులతో పంచుకోదలచుకొన్న తత్వాన్ని చెప్పే తాపత్రయంలో దానిచుట్టూ ఏవో పాత్రలను, సంఘటనలను పేర్చినట్లు అనిపించింది. దాంతో ఇవి కథలూ కాక, వ్యాసాలూ కాకుండా పోయాయి.

    1. Kamakshi

      కథలూ వ్యాసాలు రెంటికి తేడా ఏమిటి?
      తత్వాన్ని చెప్పే తాపత్రయంలో … తాపత్రయం అని ఎందుకనుకోవాలి? ఎవరైనా ఎదో చెప్పడానికే కదా కథ రాస్తారు?
      చెప్పదదలచుకొన్న తత్వాన్ని డైరెఖ్ట్గా చెబితే వ్యాసం. పాత్రలను, సంఘటనలను కల్పించి చెబితే కథ. ఈ పుస్తకంలో సంభాషణలు పాత్రలు అన్ని చాల సహజముగ చిత్రించబడినాయి. ఎక్కద కథకురాలు జోక్యము చేసుకున్నట్లుగా అనిపించదు. అన్ని కథలలోను అయాపాత్రలే కనిపిస్తాయి. నాకైతే బాగా నచ్చింది ఈ పుస్తకం.

  3. sathya

    chi.శ్రీవల్లీ రాధిక mariyu sujatha garu ఇద్దరికీ అభినందనలు.

  4. మాలతి

    శ్రీవల్లీరాధిక కథలు కొన్ని తనబ్లాగులో చదివేను. బాగున్నాయి. పరిచయం కూడా బాగుంది. ఇద్దరికీ నా అభినందనలు. – మాలతి

  5. వేణు

    నా వ్యాఖ్యలో చిన్న సవరణ! మే 8నాటి ‘ఈనాడు ఆదివారం’ మ్యాగజీన్..’ బదులు ‘మే 2 నాటి ‘ఈనాడు ఆదివారం’ మ్యాగజీన్…’ అని ఉండాలి.

  6. వేణు

    ఈ పుస్తకంలోని కథలపై, కథనం తీరుపై మీ విశ్లేషణ బావుంది. ఈ సంకలనంలో ‘ఈర్ష్య’ కథ నాకు నచ్చింది. ‘యోగ్యత’ కూడా! అన్నట్టు- మే 2 నాటి ‘ఈనాడు ఆదివారం’ మ్యాగజీన్ సమీక్ష పేజీలో ఈ పుస్తకం గురించి రాశారు!

  7. వేణు

    ఈ పుస్తకంలోని కథలపై, కథనం తీరుపై మీ విశ్లేషణ బావుంది. ఈ సంకలనంలో ‘ఈర్ష్య’ కథ నాకు నచ్చింది. ‘యోగ్యత’ కూడా! అన్నట్టు- మే 8నాటి ‘ఈనాడు ఆదివారం’ మ్యాగజీన్ సమీక్ష పేజీలో ఈ పుస్తకం గురించి రాశారు!

  8. nanich

    చాలా బాగా పరిచయం చేసారండి. తొందర్లొనె చదవటానికి ప్రయత్నిస్తాను.

Leave a Reply