మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారితో ముచ్చట
వ్యాసకర్త: అమిధేపురం సుధీర్
*******
తెలుగు లో వున్న అతి తక్కువ మంది పాపులర్ రచయితలలో ఒకరైనా, ఎన్నడూ తన రూపాన్ని బయటకి చూపించని రచయిత, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు. తనని కనుక్కోవడమే ఇతివృత్తంగా ‘మల్లాది వెంకట కృష్ణ మూర్తి ‘ అనే పేరుతో మ్యూజికాలజిస్ట్ రాజా గారు ఒక నవలనే వ్రాసారు. 1970 నుంచి రచనలు చేస్తూ ఉన్నా, ఎన్నో లక్షల మంది తన పుస్తకాలు చదివినా, తనని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చూసిన వాళ్ళు చాలా తక్కువ.
గత మూడేళ్ళ నుంచి, వారితో కొత్త పుస్తకాల గురించి వాట్సాప్ లో చాటింగ్ చేసేవాళ్ళం. కలవాలని అనుకుంటున్నాం అని వారితో చెప్పినప్పుడు చాలా ఆదరంగా ఆహ్వానించారు. 31 మార్చ్ 2024 సాయంత్రం వారింటికి వెళ్ళాము. ఒక గంట సేపు వారితో మాట్లాడాం. ఆ సంభాషణ లోంచి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈ వ్యాసం.
గత వారం మల్లాది గారు, తన పాఠకులతో ఒక విషయం పంచుకున్నారు. అది యధాతథంగా వారి మాటల్లోనే కింద ఇస్తున్నాను.
“డియర్ బుక్ లవర్స్,
లాంగ్ టైం నో సీ. సారీ.
మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేసిన ఫిబ్రవరి బుక్స్ విడుదల కాలేదు. చాలామంది ‘న్యూ బుక్స్ రిలీజ్ ఎప్పుడు?’ అని అడుగుతున్నారు.
ఓ ఇంట్లో 5-6 గురు ఉంటే, ఇల్లాలు అందరికీ సరిపడా వంట చేస్తుంది. ఒక్కరే ఉంటే, 5-6 గురికి వండినంత వండదుగా. అదే ఇక్కడ జరుగుతోంది.
నేను ఆశించినట్లుగా 40% డిస్కౌంట్ స్కీమ్ లో 500 మంది చేరలేదు. చేరిన 267 లో కేవలం 154 మందే లేటెస్ట్ గా విడుదలైన అక్కడే ఆగక, డెడ్ ఎండ్ పుస్తకాలు కొన్నారు. రీప్రింట్స్ ఇంకా తక్కువమంది కొంటారు. కాబట్టి ఇక నా పుస్తకాలని ప్రచురించదలచుకోలేదు.
తెలుగులో పాఠకులు లేనప్పుడు ఇక ప్రచురించడం, రాయడం వృధా కదా?
పుస్తకాలు అమ్మి సక్రమంగా డబ్బు చెల్లించే బుక్ షాప్స్ కూడా ఒకటి- రెండు మించి తెలుగు రాష్ట్రాల్లో లేవు. పబ్లిషర్స్ కి ఇది ప్రధాన సమస్య.
కొన్ని నెలలుగా ఈ broadcast గ్రూప్ లోని మీతో కలిసి చేసిన ప్రయాణం నాకు అనందాన్ని ఇచ్చింది.
ఏ కళాకారుడికైనా ఎప్పడు విరమించాలో తెలిసి ఉండాలి.
చాలా కాలంగా నా రచనలని ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు.
ఇక సెలవు.”
ఏడు కోట్లో, ఎనిమిది కోట్లో, తొమ్మిది కోట్లో, నాకు సరిగ్గా లెఖ్ఖ తెలీనంత మంది తెలుగువాళ్ళు వున్నారు. ఇన్ని కోట్ల మంది జనాభా వుండీ, 1970 లతో పోలిస్తే అక్షరాస్యత శాతం పెరిగినా ఒక ప్రఖ్యాత రచయిత వ్రాసిన ఒక తెలుగు పుస్తకం, 500 కాపీలు కూడా అమ్ముడుపోవట్లేదు అంటే ఏమనుకోవాలో అర్థం కాలేదు. ఖచ్చితంగా ఇది తెలుగు వారి గొప్పతనమే తప్ప మరేమీ కాదు అనేది నా అభిప్రాయం. ఒకప్పుడు 15000 కాపీలు ముద్రించేవారు. ఇప్పుడు 500 కాపీలు ముద్రంచాలన్నా అలోచించాల్సిన పరిస్థితి.
వారితో జరిగిన సంభాషణలోని కొన్ని అంశాలని ఇక్కడ ప్రస్తావిస్తాను. ఇది ఒక ఇంటర్ వ్యూ నో మరొకటో కాదు. కేవలం, మా మధ్య జరిగిన ఇష్టాగోష్టిలోంచి, నేను ముఖ్యమైనవి అనుకున్నవి ఇక్కడ ఇస్తున్నాను.
- వారు గత నాలుగు పుస్తకాలలో స్పష్టంగానే చెప్తూ వస్తున్నారు, 40% డిస్కౌంట్ స్కీం వుంది అని… దురదృష్టం ఏంటంటే, నేను కూడా అది సరిగ్గా అర్థం చేసుకోలేక పోయాను. మార్కెటింగ్ లో నా ప్రయత్నలోపమేది లేదని వారన్నారు. దానికి మా వద్ద జవాబు లేదు. వారన్నది నిజం. పరిస్థితి ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం మా లోపం.
- ప్రస్తుత పరిస్థితులలో పుస్తకాల రిటైల్ షాప్ ల నుంచి అమ్మకాల తర్వాత డబ్బులు పబ్లిషర్ లకి, అక్కడినుంచి రచయితలకి, సరిగ్గా వెళ్ళట్లేదు. దాదాపు, కొన్ని లక్షల రూపయల బకాయిలు మల్లాది గారు లీగల్ గా వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. పని చేసాక బిల్లు ల కోసం తిరిగే పరిస్థితి ఎంత దారుణంగా వుంటుందో చాలా మందికి తెలిసే వుంటుంది. అలాంటి పరిస్థితి ని ఎవరూ కోరుకోరు. దీనికి పాఠకులుగా మనం చేయగలిగినది, పుస్తకాన్ని, డైరెక్ట్ గా రచయిత నుంచే కొనడం. మల్లాది గారి పుస్తకాలు డైరెక్ట్ గా వారి వద్దనే కొనుక్కోవచ్చు. +91 7893742244 కి వాట్సప్ చేయడం ద్వారా, వారి నుంచే అందుబాటులో వున్న పుస్తకాలు తెప్పించుకోవచ్చు.
ప్రఖ్యాత రచయితలు కొందరు ఎప్పుడో వ్రాయడం మానేసారు. వారి కారణాలు వారు చెప్పారు. ఇంకా పుస్తకం మీద ప్రేమతో, ప్రతీ రోజూ అదే ఒక యజ్ఞం లా, మనకి మంచి రచనలు అందించడానికి మల్లాది గారు పడుతున్న తపన, మాకు చాలా ఇన్స్పిరేషన్ ని ఇచ్చింది.
కాగితాన్ని అసలు వృధాగా పోనివ్వని వారు అలవాటు, వారి రాతప్రతులని కొన్ని అడిగి తెచ్చుకున్న మాకు ఆశ్చర్యం కలిగించింది. సూపర్ మార్కెట్ బిల్ వెనకాల కూడా వారు వ్రాసుకున్నారు.
వేరే భాషల్లో, ముఖ్యంగా ఇంగ్లీష్ లో వస్తున్న మంచి పుస్తకాలని తెలుగులో చదువుదామన్నా, ఇప్పుడున్న అనువాదాల్ని చదవటం కంటే, ఇంగ్లీష్ లో చదవటమే మంచిదేమో అనిపించటం. అనువదించటం లో రచయితలకుండే కష్టాల గురించి మాట్లాడాము.
వారు వాడే సాఫ్ట్వేర్ ఇంకా వారు వాడే ఫాంట్ల గురించి అడిగితే వివరంగా చెప్పారు. అను 7 వెర్షన్లో, ప్రియాంక లేదా రచన అనే ఫాంట్లు చదవడానికి సౌలభ్యంగా వుంటాయని తెలిసింది.
వారు మాకు ఇచ్చిన గంట ఎలా గడిచిందో తెలీదు.
చివరగా, ఇక ముందు పుస్తకాలు ఎలా పబ్లిష్ అవుతాయి అన్న మా సందేహానికి వారు చేస్తున్న ఒక ప్రయత్నం గురించి చెప్పారు. అది అనుకున్నట్లుగానే జరిగితే, మొట్ట మొదటిసారి, వారి నిజమైన అభిమానులు ఎవరో వారికి, కాదు కాదు… వారి అభిమానులం అనుకుంటున్న వారికి, వారు నిజమైన అభిమానులో కాదో తెలుస్తుంది. నిజంగా మీరు చెప్పిన ఆలోచన ఫలించాలని, ఆ విధంగానే మీ పుస్తకాలు భవిష్యత్తులో, order to print జరగాలని, ఆ విధంగానైనా మీ పుస్తకాల పైరసీ తగ్గాలని, మీ అభిమానులుగా మా కోరిక.
ఆధ్యాత్మిక పుస్తకాలు వ్రాయడమే కాదు, వాటిని నిజంగా నే వారు ఆచరిస్తున్నారు అన్న విషయం మమ్మల్ని సాగనంపినప్పుడు మాకు అర్థం అయ్యింది. లిఫ్ట్ వరకూ వచ్చి, డోర్ దగ్గరికి వేసి లిఫ్ట్ కిందకి వెళ్ళేవరకూ వుండి వెళ్ళారు.
సమానత్వాన్నీ, వినయాన్ని నేర్పని అధ్యాత్మికత ఎక్కడ వుంది?
నిన్న మా మధ్య వచ్చిన మరో అంశాన్ని ఇక్కడ వివరించను… కానీ ఈ కింది సూత్రాన్ని మాత్రం ఉటంకిస్తాను, ఇది అధ్యాత్మికత కాదు అని ఎవరు అనగలరు.
మత్తయి 23:12: తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.
ఈ వాక్యం కేవలం మా మధ్య జరిగిన ఒక సంభాషణకి గుర్తుగా, ఇక్కడ ప్రస్తావించాను.
ఇక ఈ వ్యాసం చదివిన వాళ్ళందరూ, పుస్తకాలు కొని చదివేస్తారని కాదు… ఎంత కాదన్నా, ఇక్కడున్న వాళ్ళందరూ పుస్తక ప్రేమికులు… ఖచ్చితంగా ఎంతో కొంత అలోచిస్తారని ఆశ…
థాంక్యూ సర్.
Leave a Reply