“సముద్రం” కధాసంకలనం- సమీక్ష

రాసిన వారు: సి.ఎస్.రావు
***************

చదివించే  బిగి ఉండటం ఏ రచనకైనా ప్రాధమికమైన బలం. తెరచిన కధ మూయకుండా  చదివించగల నేర్పు  శ్రీ తమ్మినేని యదుకులభూషణ్ కి పుష్కలంగా ఉంది. ఆయన కధలలో కొట్టొచ్చినట్లు కనిపించే గుణం నిరర్ధకమైన విసుగు పుట్టించే వర్ణనలు ఏ మాత్రం లేకపోవటం.ఆయన శిల్ప చాతుర్యం అదే,వర్ణన ఉండదు కానీ కధకు సంబంధించిన పరిసరాలు పరిపూర్ణంగా మనకండ్లముందు నిలుస్తవి. పాత్రలు కూడా అంతే.వారిని గురించి పెద్దగా చెప్పినట్లు కనబడదు.కానీ వారి శారీరక ఆకృతుల దగ్గరనుండి మానసిక ప్రవృత్తుల దనకా అన్నీ మన మనస్సుపై గాఢమైన ముద్ర వేస్తవి.మహా పరిమితంగా పదాలను వాడటం ఆయన ప్రత్యేక రచనా విశేషం. ప్రత్యక్షంగా మన గమనం లోకి రాకుండానే కధావసరాలకు అనుగుణంగా అన్ని వివరాలు స్ఫురింపజేయటం.కధనంలో నైపుణ్యం ఉంది;భూత వర్తమానకాలాల సంఘటనల సమన్వయం లోంచి తెల్లారగట్ల ఎర్రని సూర్యుడు రాత్రినీ పగలునూ ఒకటి చేయటానికి పైకి లేచినట్లు కధ క్రమక్రమంగా నెమ్మదిగా రూపు దిద్దుకుంటుంది.

‘పొలి” లో రాయలేలిన సీమలో పొంగులు వారే పౌరుషాన్ని కూడా వళ్ళు గగుర్పొడిచే చిరు చిరు మాటలతోనే ఆవిష్కరిస్తారు భూషణ్. బాలప్పతాత హృదయం నవనీతం తోటివారి యెడలనే కాదు ,ఎడ్లమీద కూడా కరుణ అపారం.పట్టుదలలొస్తే పౌరుషానికి అవధులు ఉండవు.గాయాల తో దేహం రక్తమోడుతున్నా వదనంలో కొలువు తీరిన ప్రశాంతత ,ఆయనను ఆ స్థితిలో చూసిన బంధుజనంలో ఎవరైనా దుఃఖిస్తే “ఏడు తరాలలో కన్నీరు లేదురా” అని వారించే రౌద్రమౌతుంది. తాత పౌరుషమే స్థైర్యమే మనవడు బాలాకు వచ్చింది.కార్గిల్ యుద్ధంలో వీరవిహారం చేస్తుంది.మనవడికి తాత రూపు తెలియదు.చిన్నతనంలో తాత పౌరుష ప్రతాపాలు కధలు కధలుగా వింటూ నిద్రలోకి జారుకునేవాడు.నిద్రముందు విన్న కధలలోని ఉత్తేజం అతని వ్యక్తిత్వ వికాసానికి సొగసైన పునాది.భూషణ్ క్రాఫ్ట్  అది.ఇ.ఎం .ఫాస్టర్ దృష్టిలో ఉత్కృష్ట నవలా రచనలో ఒక అందమైన పార్శ్వం పాటర్న్.అదికధలకు కూడా వర్తింపచేయవచ్చు. చిన్నమార్పుతో ఈ కధలో ఆ పాటర్న్ సాధించబడింది. తాతామనవళ్ళ సంస్కార ,సాహస ప్రవృత్తుల సారూప్యత వల్ల ఆవిర్భవించిన ఆ పాటర్న్ కధ అందాన్ని పెంచింది.

నవలలో కాని, కధలో కాని, శిల్పసౌందర్యానికి భూమిక “ప్లాట్” . మొదటి నుండి కడవరకూ కధ ఎలా నడవాలి,పాత్ర చిత్రణ ఎలా జరగాలి ,కధానుగుణమైన సన్నివేశాలకెలా రూపకల్పన చేయాలి ,కధలో సింక్రనైజింగ్ సజెషన్స్ ను ఎలా చొప్పించాలి,ఉత్కంఠను ఎలా స్థిరపరచుకోవాలి-ఇవన్నీ రచయిత మనసులో స్పష్టతతో కూడిన అవగాహనలో ప్రధానాంశాలుగా ఉండాలి.ఇవన్నీ కూడా ఈ సంకలనంలోని కధలలో కనబడుతాయి. “యాత్ర ” లో సందర్భోచితంగా సూచనప్రాయంగా మహోత్కంఠతను కలిగించే రీతిలో విజయనగర సామ్రాజ్య తేజోఃపుంజాలను శ్రీ శ్రీ మాటల్లో “కృష్ణరాయని బాహుజాద్బడబాగ్నులని” వయసు మళ్ళిన వెంకటాచార్యులవారి ప్రభుభక్తి ,ధనుర్విద్యాకౌశలం ,వారి అపారమైన శారీరకబలం ద్వారా చూపిస్తారు.ఆచార్యులవారి పూర్వీకులు రాయలవారికి నమ్మకమైన దండనాయకులట .నరహరిలాంటి వాడు నమస్కారం చేసింది వెంకటాచార్యులవారికే.

నరహరి ధీరుడు ,యోగి,త్యాగి.అతని పాత్రచిత్రణ చాలా మనోరంజకంగా ఉంది.అతని ముందు మనం అతి సామాన్యులుగా కనిపిస్తాం.తప్పులతడకగా  బ్లాక్ బోర్డ్ మీద స్టెప్స్ వేస్తున్న మాత్స్ లెక్చరర్ని క్లాస్ లో ఛెళ్ళుమని చెంప దెబ్బ కొట్టటం,ఎంసెట్ పరీక్షలలో రాష్ట్రం లోనే ప్రధముడిగా వచ్చి, చిన్న చీటి ఇంటిలో వదలి ఎక్కడికో దేశాలమీదపడి పోవటం ,నరసింహస్వామి వారు వంటి మీదకు రాగా  మార్దంగికుల తాళానికణుగుణంగా నర్తించటం ,అమర్ నాధ్  యాత్రికుల మీద  కాల్పులు జరుపుతున్న టెర్రరిస్టులను కౌపీనధారియైన యోగియై దూసుకవచ్చి కేవలం శూలంతో మారుణాయుధాలతో ఉన్న ముష్కరులను తుదముట్టించటం,తప్పించుకుని  పారిపోతున్న ఒక దుండగుడు చురకత్తితో తన్ను దొంగపోటు పొడవగా వాడిని లాఘవంగా పట్టుకుని వాడి రొమ్ము చీల్చి వాడి రక్తాన్ని త్రాగటం నరహరికే చెల్లింది.పాఠకులుగా మనం అతని ప్రతిచర్యను రోమాంచితమైన దేహంతో స్వీకరిస్తాం ,ఆమోదిస్తాం.మన కళ్ళముందు జరుగుతున్న విషయంగా నమ్ముతాం. యోగిగా యోగుల మధ్యలో హిమాలయసానువుల్లో కాక నరహరి మనకు తెలిసినవాడై మన పరిసరాల్లో ఉంటే ఎంత బాగుండుననిపిస్తుంది.కానీ ఏం లాభం?ఆయన “ పిరికి వాళ్ళతో కలవడట”.నరహరి ఒకప్పటి స్నేహితుడి,ఇపుడు ఆర్మీలో మేజరు అయిన అయిన రావు తాను నరహరిని కలవలేకపోవటానికి కారణంగా చెప్పిన మాటలు! అద్భుతమైన ముగింపు.

ఈ సంకలనంలోని కధావస్తువులలో వైవిధ్యం ఉంది.పౌరుషప్రతాపాగ్నులు,దేశభక్తి “పొలి” లో ఉంటే ,ధైర్యసాహసాలు,నిర్భీతి,దుష్టశిక్షణ,దీనజన రక్షణ “యాత్ర”లో,చావులేని ప్రేమ “భిక్షువు” లో ఉంది.రెండున్నర పేజీలకు మించని కధ భిక్షువు.స్త్రీ,పురుష సంబంధమైన ప్రేమ జనించటమే జరిగితే ,అది వివాహానికి దారి తీయకపోతే ,సంస్కారం,సంప్రదాయం,సంఘనీతులకు లోబడి అది అణిగి ఉంటుందేమో కానీ మనసును కార్చిచ్చులా దహిస్తూ కాటి దనుకా పోతుంది.విచిత్రమైన పరిస్థితులలో ఎంత సుదూర భవిష్యత్తులోనైనా ప్రేమికులు అనుకూలమైన పరిస్థితులలో కలవడం జరిగితే అణిగిమణిగి ఉన్న ప్రేమ ఉప్పెనలా ముంచుకొచ్చి దాని తాకిడికి వారు వివశులైపోక తప్పదు.భిక్షువులో జరిగింది అదే. ఆకలిలో జనించిన కోపంతో కాశికా పట్టణాన్ని శపింపబోయే వ్యాసుడి ముందు అన్నపూర్ణేశ్వరీ దేవి అమ్మవారు ప్రత్యక్షమై ఆయన్ను వారించి తన ఆతిధ్యానికి తన  శిష్యులతో రమ్మని ఆనతిచ్చే ఇతివృత్తం గా కల చిన్న రూపకాన్ని ప్రదర్శిస్తున్నపుడు అంకురించిన ప్రేమ,గుడిదగ్గర ఒక బలమైన కోతి బారినుండి ఆమెను కాపాడినపుడు ,మద్రాసు అష్టలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర బీచ్ లో కలిసినపుడు ,తిరువనంతపురం లో పరీక్షకు రైలులో కలిసి వెళ్ళినపుడు క్రమక్రమంగా బలోపేతమై వారి హృదయాన్ని వశపరచుకుంటుంది.మరెవరితోనో వివాహమై భర్త ఉద్యోగరీత్యా అస్సాంలో ఉంటున్న అన్నపూర్ణకు   విశ్వం భిక్షువుగా మారి ‘ మాతాన్నపూర్ణేశ్వరీ’ అని భిక్ష అడిగినపుడు అతన్ని చూసి నిర్ఘాంత పోయి ,తెచ్చిన భిక్ష చెల్లాచెదరై క్రిందపడిపోగా,’విశ్వేశ్వరా’ అని ఆక్రోశిస్తూ ఆమె తూలబోతే భిక్షువు ఆమెను అవలీలగా ఎత్తుకుంటాడు.ఈ ముగింపు ద్వారా కధలో ఒక రిథమిక్ వలయాన్ని సాధించారు భూషణ్ .మంచి కధ.కధనంలో శిల్పసౌందర్యం ఉంది.చెప్పినదానికంటే మరెంతో  పాఠకుడి ఊహకు అందీ అందనట్లు స్ఫురింపజేయటంలో ఒక ధ్వని ఉంది. స్త్రీ పురుషసంబంధమైన ప్రేమ అన్ని ప్రేమ కధలలో పైకధలో లాగానే కార్యరూపం ధరిస్తుందని చెప్పలేము.అది వ్యక్తమయ్యే రీతి,కార్యరూపం ధరించే తీరు పాత్రల స్వభావాల వల్ల ,వారి ప్రేమ సాంద్రత వల్ల దాని చుట్టూరా వ్యాపించి ఉన్న పరిస్థితులవల్ల ప్రభావితమవుతుంది. తత్ఫలితంగా భిన్నరూపాలలో వ్యక్తమవుతుంది.

“ఒంటరి” గొప్ప కధ.రవిలాగా అంతటి ఔన్నత్యంతో శోభిల్లే వ్యక్తిత్వం కలిగినవాళ్ళు ఉంటారా అని మనం సందేహపడనవసరం లేదు.అటువంటివాళ్ళు పదివేలమంది కొకరైనా ఉంటారు. ఉండకపోయినా ఫర్వాలేదు. సాహిత్యంలో సృజించబడిన ఉదాత్త  వ్యక్తులు  ఉండటానికి అవకాశం ఉందని పాఠకులమైన మనం విశ్వసిస్తే చాలు.ఈ విషయమే అటు “పొలి” లో బాలప్ప తాతకు  “యాత్ర”లో నరహరికి ,వేంకటాచార్యుల వారికి వర్తిస్తుంది. “భిక్షువు”లో భిక్షువుకు వర్తిస్తుంది. రవి హుందాతనాన్ని కధలో మంచి కధనం ద్వారా ఆవిష్కరించటం జరిగింది. సింధులాంటి అందం,హృదయం ఉన్న ప్రధమశ్రేణి సినీ కధానాయిక  ఆకర్షింపబడుతుంది. ప్రయాణీకులలో ఒకడు మాత్రమే అయిన రవికి సర్వ్ చేసేప్పుడు ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఎయిర్ హోస్టెస్ చూపించినట్లు సింధు చెప్పటం   కధనంలో వ్యూహాత్మక విశేషం.తనను అభిమానించే ,ప్రేమించే సౌందర్యవతి తనకు అతిధిగా తన ఇంట్లో నాలుగయిదు రోజులు వంటరిగా వున్నా,తాను అవివాహితుడైన యువకుడే అయినా ఆమెతో అతను ప్రవర్తించే తీరు లోని హుందాతనం సంయమనం పాఠకుల  మెప్పు పొందుతుంది.సాహిత్యం ఆవిష్కరించవలసిన ధీరోదాత్త గుణాలు ఇటువంటివే.

రవి డైరీని సింధు తెరవనంతవరకూ అతని పాత్రచిత్రణలో మనకు ఎటువంటి సందేహాలు ,అసంతృప్తులు  ఉదయించవు.రవి,మహి ల ప్రేమ ఫలించకపోవటానికి డైరీలో చెప్పబడిన కారణాలు వారిని భగ్నప్రేమికులని చేసేంత బలీయమైనవిగా కనిపించవు . “జీవితంలో ఎవరూ  వంద మార్లు ప్రేమించరు”.అన్న రవి తనను ప్రేమించిన సింధుకు  లండన్ నుండి వచ్చిన పెళ్ళి సంబంధాన్ని వప్పుకోమని సలహా ఇవ్వక తప్పలేదు.మొదటి రెండు పేజీలలో కధనం రచయితే సింధు,సింధే రచయిత అన్నట్లు సాగుతుంది.దానివల్ల ప్రత్యేకంగా సమకూరే ప్రయోజనం ఉన్నట్లు అనిపించదు.

ఈ కధా సంకలనం చదివితే భూషణ్ కి ధీరోదాత్త గుణాల మీద మక్కువ ఎక్కువ అని తెలుస్తుంది.అందుకనే ప్రతి కధలోను అటువంటి గుణాల లో   ఏదోఒకటి  పాత్ర ,సన్నివేశాల సమీకరణలలోంచి  నీలపు కొండలపై పరచుకున్న మధ్యాహ్నపు వెండి ఎండలా  ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.“మార్పు”  మంచి కధ.కధా నాయకుడి పేరు లేదు కానీ పేరు లేని వాడు కాదు.స్థిరమైన అభిప్రాయాలు కలవాడు.జాలి కల వాడు. పరిస్థితుల ప్రభావం వల్ల ఇంతకాలం పెదనాన్నతో, ఆయన కుటుంబం తో మాటలు లేకపోయినా మరణ శయ్యపై ఉన్న పెదనాన్నను  చూడటానికి వస్తాడు.ఐ.సి.యు లో ఉన్న పెదనాన్న తనమీద చెయ్యి వేసినపుడు “పాత స్పర్శే.నా చిన్నప్పుడు  ఎంతో దయగా వ్యవహరించేవాడు .చేయిజేసుకునే వాడు కాదు .నా సమక్షంలో ఎంతో సాంత్వన పొందుతున్నాడన్న విషయం చెప్పక చెప్పుతున్నాయి.నా మనసంతా జాలితో నిండి పోయింది.” కధ ప్రారంభం ఈ సన్నివేశం తోనే.పాఠకుల హృదయాలుకూడా కరుణతో కరిగిపోతవి.బుద్బుదప్రాయాలైన మన జీవితాలను ఎందుకూ కొరగాని కార్పణ్యాలతో నింపుకుని శాంతికి,సుఖానికి ,స్వచ్చమైన,సహజమైన ప్రేమలకు ఎందుకు దూరమవుతున్నామనే అంతర్మధనానికి లోనవుతాము..

కధానాయకుడు ఎంత స్థిరసంకల్పుడో అంత జాలి కలవాడు. ఋజువర్తన కలవాడు. స్థిరమైన మనస్తత్వం కల వాళ్ళలో చీటికి మాటికి మార్పులు రావు.వచ్చే మార్పు స్థిరమైనదిగానే ఉంటుంది.దాని పునాదులు కూడా అతని స్థిర స్వభావంలోనే ఉంటవి.సముద్రంలో కలిసే నదీ జలాలు సముద్రమైపోయినట్లు ఉద్యోగరీత్యా దేశదేశాలు తిరిగిన అతను మారలేదు,అతని  స్వభావం మారలేదు. పెళ్ళిచేసుకోవటంలేదని  అతని తల్లితండ్రులు దిగులు బడేవారు కానీ గట్టి  గా చెప్పగలిగేవారు కాదు.అతని స్వభావం  వారికి తెలుసు గనక.థాయ్లాండ్ లో పరిచయమైన మధ్యతరగతికి చెందిన అమ్మాయి, సుయ్ మెయ్  రాసిన జాబుతో కధ ముగుస్తుంది.”త్వరలో మళ్ళీ నిన్ను కలుస్తాను .’ నా గురించి బెంగ పెట్టుకోకు.” ఇక ఆమెకు బెంగ లేదు,తల్లితండ్రులు బెంగపడవలసిన అవసరం లేదు.

భూషణ్ ముద్ర కొద్దిగా తక్కువగా కనిపించేది “ప్రయాణం” లో .ప్రయాణం వేణు,హేమల ప్రేమకధ.ప్రేమిస్తే సరిపోతుంది కదా అన్న వేణు మనస్తత్వం, ఆ మనస్తత్వం నచ్చని  హేమలో  అసహనాన్ని ,ఉక్రోషాన్ని పెంచితుంది.వారి మధ్య ఎడం పెరుగుతుంది.ప్రేమాధిక్యత వాస్తవమే కాబట్టి హేమ తండ్రి మరణం వల్ల ఆమె లోనైన వంటరితనం మరలా వారిని దగ్గర చేస్తుంది.ప్రేమ ఫలిస్తుంది.ప్రేమ ఉంటే సరిపోదు.అది ఆకర్షణీయంగా వ్యక్తమవాలి.అపుడది ద్విగుణీ కృతమవుతుంది  ,నిత్యనూతనంగా ఉంటుంది.
“సముద్రం” మరొక మంచి ప్రేమ  కధ . పాత్రోచితంగా ఎవరికి తగిన ఔన్నత్యం వారికి ఉన్న కధ.కధనం తక్కిన కధల్లొలాగా బాక్ అండ్ ఫోర్త్ మూవ్మెంట్ తొ ముందుకు సాగుతుంది.ఉన్న కొద్దిపాటి సంభాషణలు క్రిస్ప్ గా  లైవ్లీగా ఉండి కధనం లొ కరిగి పోతవి. అల్లరి పిల్లగా పెరిగిన అవని కులాలతో ,చుట్టరికాలతో సంబంధం లేకుండానే చిన్ననాటినుండి “మామగా” పిలుస్తూ సన్నిహితంగా చందు  తో మెలుగుతుంది.చిన్నప్పుడే తల్లితండ్రులను పోగొట్టుకున్న అవని తాత,బామ్మల పోషణలో పెరుగుతుంది.కారణాంతరాలవల్ల వారు కలకత్తా వెళ్ళటం ఆ తర్వాత వాళ్ళ తాతగారు పోవటం జరుగుతుంది.చందు సివిల్స్ లో నెగ్గి అండమాన్ లో పెద్ద ఉద్యొగంలో ఉంటాడు.కలకత్తా యూనివర్సిటీలో ఆంత్రొపాలజీ  లో మాస్టర్స్ జేస్తూ అబారిజినల్ ట్రైబ్స్ అయిన జాన్వాల గురించి,ఒంగేల గురించి ఫీల్డ్ స్టడీ కోసం అవని అండమాన్ వస్తుంది.వారిని ప్రభుత్వం అనుమతితోనే కలవాలి.ఆ ఉన్నతప్రభుత్వాధికారి అయిన చందు దగ్గరకు పర్మిషన్ కోసం వస్తుంది. ఒకరినొకరు పోల్చుకోలేకపోయారు.  దరఖాస్తులోని అవని పేరు చూసి చందు సంభ్రమాశ్చర్యాలతో అవనిని పిలుస్తాడు.ఆ తర్వాత  ఆమెకు అన్ని వసతులు ,సౌకర్యాలు తన బంగ్లాలోనే కల్పిస్తాడు.వారిమధ్య ఎప్పుడో బీజప్రాయంగా ఉన్న ప్రేమ శాఖోపశాఖలై విస్తరిస్తుంది.ఇంతలో కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఆమెకు అడ్మిషన్ వస్తుంది. ఆ కోర్సుకు అవసరమైన డబ్బు మొత్తం తాను సమకూరుస్తానని చందు అంటాడు.మద్రాసు నుండి అమెరికాకు కావలసిన దుస్తులు కొంటాడు.ఎన్ని సంవత్సరాలనుండో కంటున్న కలలు నిజమయ్యే తరుణం లో కూడా ప్రేమ ప్రవాహమై ముంచెత్తినప్పుడు ఇక మరేం పట్టదు.అవని అమెరికా వెళ్ళటానికి నిరాకరిస్తుంది.చందుతో జీవితం పంచుకోవటానికి నిశ్చయించుకుంటుంది.చందూకు ఇష్టమే .సుజీ ఉదంతం ఈ కధకు అవసరం అని మాత్రం అనిపించదు.
“సముద్రం” అనే పేరు ఈ కధకు పెట్టడంలో అర్ధవంతమైన సింబాలిజం ఉంది .ప్రేమ కూడా పారావారం లాంటిదే.దాని విస్తృతి,లోతు ,విజృంభణ గూడా అంతటిశక్తిగలవే .ఈ సంకలనానికి ఆ పేరే పెట్టటం కూడా బావుంది.భూషణ్  కధలలో సంయమనం ,ఔచిత్యం,ఆర్భాటం లెని భాషా సౌందర్యం ఉన్నవి.కధనంలో శిల్పపరమైన సొగసు ,విషయపరిజ్ఞాన విస్తృతి  ఉన్నవి.తాను కవి కూడా కాబట్టి ఉద్వేగభరితమైన సన్నివేశాలలో అక్కడక్కడ పదాల కూర్పులో తళుక్కున మెరిసే  కవిత్వం ఉంది.ప్రతి కధలోనూ ఒక ఉదాత్తమైన మానవీయలక్షణం భాసిస్తుంది. అన్నిటినీ మించి సజీవ పాత్ర చిత్రణ ఉంది. విశ్రాంతి దొరికినప్పుడల్లా  మంచికధలు చదవాలనుకున్నప్పుడు గుర్తువచ్చే కధాసంకలనాలలో ‘సముద్రం “ఒకటి. ఇంకా ఎన్నో సంకలనాలు భూషణ్ నుండి వెలువడాలని ఆశిద్దాం.

సి.ఎస్.రావు
10/23/2010

You Might Also Like

8 Comments

  1. పుస్తకం » Blog Archive » 2010లో నా పుస్తకాలు

    […] సముద్రం – తమ్మినేని యదుకుల భూషణ్ 22. ఆ […]

  2. పుస్తకం » Blog Archive » నిరుడు చదివిన పుస్తకాలు

    […] కథలు పై పుస్తకంలో వచ్చిన వ్యాసం ఇక్కడ. సన్నపురెడ్డి […]

  3. C.S.Rao

    భూషణ్ గారి ‘సముద్రం’ కధా సంకలనం మీద నా సమీక్ష పై సునిశితమైన వివెచనతో ఆర్ద్రమైన స్పందనలనందించారు రాజు గారు,పవన్ గారు. పవన్ గారు అదే సంకలనం మీద ఇంతకు క్రితం వచ్చిన సమీక్షల లింకులు ఇవ్వడం,రాజు గారు తన చిరకాలమిత్రుడైన రచయిత గురించి అరమరికలు లేని ఆనందంతో ఎన్నో విషయాలు చెప్పటం నాకు సంతోషం వేసింది.పవన్ గారు చెప్పిన సమీక్షలు చదువుతాను.వ్యక్తిగా శ్రీభూషణ్ సుగుణాలు కొన్ని నాకు తెలియకపోలేదు. కానీ రాజుగారు ఎన్నెన్నో ప్రశంసార్హమైన విషయాలను ఆర్ద్రమైన అనుభవంగా మేళవించి చెప్పటం చాలా బావుంది.

    రాజుగారికి,పవన్ గారికి,ఈ సమీక్ష ప్రచురించిన సౌమ్య &పూర్ణిమ గార్లకు నా కృతజ్ఞతలు.

  4. రాజు.

    నేను రాసినది పోస్ట్ చేసాక చూసుకొంటే , కట్ పేస్ట్ లో ఒక పేరా ఎగిరి పోయింది.
    ( ‘కవి పాత్రలో ‘అన్న వాక్యంతో ప్రారంభ మయే) ఐదవ పేరా తర్వాత , ఈ పేరాను చదువు కోగలరు.
    ———————–
    మా అదృష్టం కొద్ది మా ఊరికి ఆనుకొని పెన్నా నది పారుతుంది. రాయల కాలంలో మహాను భావులు నిర్మించిన అద్భుత మైన ఆలయాలు ఉన్నాయి.ప్రశాంతత కోసం పెన్నా నది వొడ్డుకు, ఆ ఆలయాలకు తరచూ వెళ్ళే వాళ్ళము. ఇక రైల్వే స్టేషన్ కయితే రోజూ వెళ్ళే వాళ్ళము. అక్కడ మౌనంగా కూర్చొని అక్కడి నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం మా యిద్దరికీ యిష్టం. దేశంలోని ప్రజలందరినీ మోసుకెళ్ళే రైలు ను చూస్తే ఎంతో విశాల భావన. అక్కడే భూషణ్ రాసిన కవితల గురించి రచనల గురించి చర్చించు కొనే వాళ్ళం. మనిషి మేధస్సు పెరిగే కొద్ది తను ముందు చేసిన తప్పులు గుర్తించ గలుగుతాడు. అలా భూషణ్ కు తన కవితలను తనే విమర్శ చేసుకునే స్వభావం ఉంది. ఎక్కడయినా తేడాగా అనిపిస్తే తొలగించడమో, మార్చడమో చేసేవాడు. అందుకే అతని రచనలు అంత బలంగా ఉన్నాయి.
    —————-

  5. రాజు.

    పెద్దలు రావు గారికి,

    భూషణ్ రచన ‘సముద్రం’ గురించి మీరు రాసిన సమీక్ష పూర్తిగా చదివాను.చాలా బాగుంది. రచనా రంగం లో అతని ప్రతిభ చూసి మీరు అబ్బురపడి ఉంటారని అర్థమయింది .వ్యక్తిగతంగా అతని గుణగణాలు వింటే మీరు ఇంకా సంతోష పడతారని భావించి అతని గురించి నాకు తెలిసిన విషయాలు మీకు చెబుతున్నా.

    మా యిద్దరి ఇండ్లు దగ్గరగా ఉండటం యాదృచ్చికమే అయినా అదే నాకు అదృష్టంగా మారింది. ఒక మంచి మిత్రుడు దొరికాడు.
    చిన్నప్పటినుంచి కలసి తిరిగాము, ఆడుకున్నాము, దాపరికాలు లేకుండా అన్నీ చర్చించే వాళ్లము. యిప్పటికీ అలాగే ఉన్నాము.
    అందువల్ల అతని గురించి నాకన్నా ఎక్కువ ఇంకొకరికి తెలియడం కష్టమే.

    భూషణ్ కు మొదటినుంచీ నాయకత్వ లక్షణాలు అబ్బినాయి. ఒకటో క్లాసు నుంచి పదో క్లాసు వరకూ అతనే క్లాసు లీడర్.
    అన్ని క్లాసుల్లో అతనే ఫస్ట్. గేమ్స్ ఆడేవాడు. ముఖ్యంగా ఫుట్ బాల్. సాయంకాలం 7 వరకూ గ్రౌండ్ లోనే ఉండేవాళ్ళము.
    ప్రతిరోజు డైరీ రాయటం అతనికి ఎప్పటినుంచో అలవాటు.

    పుస్తకాల విషయం వస్తే, చందమామ, బాలమిత్ర,పిల్లల బొమ్మల పుస్తకాలతో మొదలయింది. వాటి స్పూర్తితో కథలు రాసి నాకు వినిపించే వాడు.మధ్య తరగతి కుటుంబాలు కదా, చాలా పుస్తకాలు కొని చదవాలంటే కష్టం. అందుకే లైబ్రరీ కి వెళ్లి అక్కడే చాలా గంటలు ఉండి చదివే వాడు. అతని రూం లో యిప్పుడో లైబ్రరీ తయారయింది. పుస్తకాలను చదివేప్పుడు వాటికి నోట్స్ రాసుకునే వాడు.

    ప్రకృతి లోని సుందర దృశ్యాలను చూడటం, సహజంగా వినిపించే ధ్వనులను వినటం అతనికి ఆనందాన్నిచ్చే అంశం. ఒక సారి అడిగాను, నాకు రాత్రి సరిగా నిద్ర పట్టడం లేదు,ఏమి చేయాలి అని. నీ చుట్టూ వినిపించే అన్ని శబ్దాలను అంటే రైలు కూతలు, కీచురాళ్ళ ధ్వనులు, వాహనాలు చేసే శబ్దాలు వింటూ పడుకో, నిద్ర పడుతుంది అన్నాడు. అలానే జరిగింది.

    కవి పాత్రలో ఎంత పరకాయ ప్రవేశం చేసినా నటించ గలడే కాని జీవించలేడు. అలాకాకుండా కవి తన అభిలాష ను అనుభవాలనే పాత్రలకు ఆపాదిస్తే భూషణ్ కథల్లా బలంగా ఉంటాయి.భూషణ్ సృష్టించిన పాత్రలకు భూషణ్ నిజ జీవితంలోని వ్యక్తులతో చాలా పోలికలు ఉన్నాయి. భూషణ్ పెదనాన్న ను నేను చూసాను. మా ఊరి లో నెంబర్ వన్ లాయర్. కాని చివరి వరకూ ఆయనకు కారు కాదుకదా ద్విచక్ర వాహనం కూడా లేదు. ఎక్కడికి వెళ్ళినా కాలి నడకనే. సాధారణ లాయర్లు కూడా ఆయన ఎదుట కార్లలో తిరిగే వారు.

    పలు కారణాల వల్ల , భూషణ్ చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు దేహాన్ని బలంగా ఉంచు కోవాలని నిర్ణయించుకున్నాడు. (అంతే యిప్పటికి అలానే ఉంచుకుంటున్నాడు. )అన్ని రకాల వ్యాయామాలు అతనికి కొట్టిన పిండి.ఖాళీ సమయంలో ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇవ్వడం అతనికి ఎంతో ఇష్టమైన పని.( శరీరం బలంగా లేకపోతే కవిత్వాలు అర్థం కావు, అని చెబుతుండే వాడు).మీకో సరదా విషయం చెబుతాను. మేము పెన్నా నది ఒడ్డుకు వెళ్లి నప్పుడు, అక్కడి ఇసుకలో భూషణ్ పల్టీలు కొట్టడం, చేతులతో కాళ్ళతో ఏవేవో ఫీట్స్ చేసేవాడు. మా ఫ్రెండ్స్ అందరం అలానే చేయాలని తెగ ఆరాట పడేవాళ్ళం. కుదిరేది కాదు. భూషణ్ ఏదో చేస్తున్నాడని మనం చేయాలనుకోవడం మూర్ఖత్వం. దానికి శరీరం అదుపులో ఉండాలి, నిరంతర సాధనా అవసరమే. (ఒక ఫ్రెండ్ అలానే ప్రయత్నించి ముక్కు పగుల గొట్టు కున్నాడు.) యిప్పుడు కూడా వేపచెట్టు లాంటిది కనిపిస్తే అవలీలగా ఎక్కడం అతనికి సరదా. ఎప్పటికీ చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు.

    చిన్నప్పుడు మాంసాహారం తీసుకొనే వాడు. కాస్త అవగాహన వచ్చాక జంతువులను చంపటం బాధగా అనిపించి మాంసాహారం మానేసాడు. అతనిలా సమయ పాలన చెయ్యటం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, అన్నీ పద్దతిగా చేస్తూ పోవటం, యితరులకు సాయం చేసే గుణం, రోజూ డైరీ రాయటం యివన్నీ అందరికీ అయ్యే పనేనా. భూషణ్ నాతో పరుషంగా మాట్లాడాడు అని చెప్పేవారు ఒక్కరు కూడా లేరు. మా యిద్దరి మధ్యలో కొన్ని సార్లు మనస్పర్ధలు వచ్చాయి. కాని భూషణ్ వెంటనే సర్దుకు పోయే వాడు. అది నా అదృష్టం. ఎవరితో అయినా అలా తనే సర్దుకు పోతాడు. నిజమయిన స్నేహితులు అలానే ఉంటారేమో.

    భూషణ్ ముక్కుసూటి ధోరణి అడుగడుగునా అతనికి ఎన్నో కష్టాలను కొని తెచ్చింది. నమ్మిన దాని కోసం నట్టేట మునగడానికి కూడా అతను సిద్ధమే.భయమన్నది అతని స్వభావంలో లేదు. రాజీ ధోరణి అతను ఎరగనిది.అతని ప్రేమ కేవలం కథలకే పరిమితం కాలేదు, అస్సాం లో తను ప్రేమించిన అమ్మాయినే అక్కడికే వెళ్లి పెళ్లి చేసుకున్నాడు.

    అమెరికా నుంచి ఎప్పుడు వచ్చినా మా ఊళ్ళో ఉన్న రెండు ఆలయాలకు వెళ్ళటం తప్పదు. అక్కడి సజీవ శిల్పాలను చూస్తే కట్టించిన వారి గొప్పతనము, శిల్పుల సునిశిత నైపుణ్యము తనకు ఎంతో స్పూర్పినిస్తాయని. పుస్తకాన్ని చాలా వేగంగా చదవగలడు. అందుకే ఎన్నో పుస్తకాలను అవలీలగా చదవ గలిగాడు. చదివినవి అన్నీ గుర్తుంచుకోవడం భూషణ్ స్పెషాలిటీ. అందుకే కవిత్వం మాత్రమే కాకుండా ఏ రంగం లో అయినా టాపిక్ వస్తే అనర్గళంగా, సాధికారికంగా మాట్లాడ గలడు. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటా, ఎలా సాధ్యం అని. అది కొంత మందికి మాత్రమే సాధ్యం. ఇస్మాయిల్ గారి కవిత్వం అంటే ప్రాణం. అందుకే ఆయనకు ఆత్మీయుడయాడు. మీకు తెలిసే ఉంటుంది-కవితా రంగంలో ఆయన కీర్తికి గుర్తుగా ఆయన పేరున అవార్డ్ నెలకొల్పాడు. నేను మానసికంగా శారీరికంగా క్రుంగి పోయింది ఒక్కసారే. భూషణ్ విదేశాలకు వెళ్ళినప్పుడు. ఇంక నాతో సరదాగా గడిపే వారు, సలహాలిచ్చే వాళ్ళు లేరుగా…

    మీ సమీక్ష చదువుతుంటే మా పాత విషయాలన్నీ గుర్తొచ్చాయి. అందుకే కళ్ళలో నీళ్ళు ఆగలేదు.

    రాజు.

  6. గరికపాటి పవన్ కుమార్

    ఎన్నో రోజులుగా మంచి “ప్రేమ కథ” లు చదవాలన్న దాహాన్ని తీర్చిన “సముద్రం” – కుప్పిలి పద్మ

    భావుకత్వంతో నిండిన ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ సమీక్ష:

    http://www.eemaata.com/em/issues/200403/196.html

    “కట్టె – కొట్టె – తెచ్చే” అన్న ఆరి సీతారామయ్య గారి “సముద్ర” పరిచయం.

    http://www.eemaata.com/em/issues/200403/197.html

    గరికపాటి పవన్ కుమార్

  7. గరికపాటి పవన్ కుమార్

    సమీక్షకైన, విమర్శకైనా పరిశీలన, పాండిత్యం ఆయువు పట్టు లాంటివి. రెంటినీ సమపాళ్ళలో రంగరించి అందించిన ఈ వ్యాసం అద్భుతం. భూషణ్ సముద్రం కథా సంకలనాన్ని చాలా సార్లు చదివాను వినోదం కోసం, శైలి కోసం, మళ్ళీ మళ్ళీ చదివించే కథలవి. సి. యస్ రావు గారి గొప్పదనమేమిటంటే ఈ వ్యాసం చదివిన తర్వాత వెంటనే మళ్ళీ చదవాలనిపించడం.

    ఎన్నో సరికొత్త సంగతులను పరిచయం చేసారు.

    గరికపాటి పవన్ కుమార్

  8. రాజు.

    సి.యస్. రావు గారు సముద్రం గురించి రాసిన సమీక్ష సగం చదివే సరికి కళ్ళలో నీళ్ళు !!
    సమీక్ష ‘అద్భుతం’ !!

Leave a Reply