అందమైన పుస్తకం ఆకుపచ్చని జ్ఞాపకం

రాసిన వారు: జంపాల చౌదరి
****************
వంశీ కథల కొత్త పుస్తకం ‘ఆకుపచ్చని జ్ఞాపకం‘ నా చేతికి నిన్ననే వచ్చింది. ఇంత అందంగా డిజైన్ చేయబడి (అక్షర క్రియేటర్స్), అచ్చు వేయబడ్డ (కళాజ్యోతి ప్రింటర్స్) రంగుల కథల పుస్తకం తెలుగులో ఇంకోటి ఇంతకు ముందు నాకు తెలిసి రాలేదు.

పూర్తిగా ఆర్ట్ పేపర్ మీద అన్ని పేజీలూ రంగుల్లో ఉన్న ఈ 360 పేజీల మేలిమి బౌండు పుస్తకంలో ప్రతి కథతోనూ బాపుగారి బొమ్మలు అద్భుతంగా అచ్చు వేయబడ్డాయి. ఎప్పుడో 1966లో ఆనంద కావ్యమాల పేరుతో వి.ఏ.కె.రంగారావు ‘లీలాజనార్దనం’ ప్రచురించిన తర్వాత, తెలుగులో ఇంత అందంగా ప్రచురించబడిన బొమ్మల పుస్తకం ఇంకోటి లేదు అనిపించింది. బాపు బొమ్మలకోసమే వేయబడ్డ ఇటీవల పుస్తకాల (తిరుప్పావై, లీలాజనార్దనం 2001 ఎడిషన్ వగైరా) నాణ్యత కూడా ఈ స్థాయిలో లేదు.

పేరున్న తెలుగు ప్రచురణకర్తలు కూడా నాణ్యమైన రీతిలో పుస్తకాలు ముద్రించే విధానంలో (పేజ్ లేఔట్, ఫాంట్ సైజు, మార్జిన్లు, ప్రూఫ్‌రీడింగ్, కాగితం వగైరా విషయాల్లో) అలక్ష్యం చూపిస్తున్న రోజుల్లో, అతిగా రంగులు పులిమి వెర్రిమొర్రి బాక్‌గ్రౌండ్లతో పేజీని నింపేయగల అవకాశాన్ని, లౌల్యాన్ని అదుపులో పెట్టుకొని, మంచి అభిరుచితో డిజైన్ చేసిన (మిత్రుడు వాసిరెడ్డి నవీన్ చేయి స్పష్టంగా తెలుస్తుంది) ఈ పుస్తకం కంటికి ఇంపుగా, ఆకర్షణీయంగా ఉంది. ముఖపత్రం మీద అద్దిన తళుకు మాత్రం మినహాయింపు. వీలైనంత చౌకగా ప్రింట్ చేసినా పుస్తకాలు తగినన్ని సంఖ్యలో అమ్ముడవటం లేదని గోలపెడుతున్న సమయంలో ఒక కథల పుస్తకాన్ని ఇలా ఖర్చుకు వెనుకాడకుండా ప్రచురించిన ఇలియాస్ ఇండియా బుక్స్ వారిది సాహసమే.

వంశీ కథలు నచ్చేవారికి ఈ కథల గురించి ప్రత్యేకంగా చెప్పవల్సిన పని లేదు. కోనసీమ వాతావరణం, గోదావరి అందాలు, ఆ మనుష్యుల భాషా, యాసా, నడకా, నడతా మంచి నేర్పుతో చిత్రీకరించే వంశీ కథల్లో చెమక్కుమనిపించే మెరుపులు, కిసుక్కుమనిపించే హాస్యం, చురుక్కుమనిపించే వ్యంగ్యం, చివుక్కుమనిపించి మనసు మెలితిప్పే విషాదం కొద్దిగా శృంగారంతో కలగలిసిపోయి, పాత్రలు సజీవంగా కళ్ళముందు ప్రత్యక్షమవుతాయి. ఈ సంపుటిలో కొన్ని కథలు ఇంతకుముందు ‘ఆనాటి వానచినుకులు’ అన్న పేరుతో వచ్చిన సంకలనంలో ఉన్నాయి (ఈ కథలకు బాపు కొత్త బొమ్మలు వేశారట). కొన్ని కథలు ఈ మధ్యనే స్వాతి వారపత్రికలో వచ్చాయి.

పసలపూడి కథలతో మొదలుబెట్టి వంశీ కథలకు స్వాతి వారపత్రికలో ప్రత్యేకంగా బాపు విలక్షణమైన బొమ్మలు వేస్తున్నారు. ఆ కథలు పడ్డ స్వాతి పత్రికలను దాచుకోకపోతే ఆ బొమ్మలు మళ్ళీ దొరకటం కష్టం. ఈ కథలను ఇలా రంగుల్లో కాకుండా నలుపుతెలుపుల్లో ముద్రిస్తే ఆ బొమ్మల అందం పూర్తిగా తెలీదు. ఆ బొమ్మలు దాచుకోవాలంటే ఇలాంటి పుస్తకాలొస్తేనే సాధ్యమౌతుంది. ఈ బొమ్మలు స్వాతిలోకన్నా ఈ పుస్తకంలో – పేపర్, ప్రింటింగ్ నాణ్యతలవల్ల కాబోలు – ఇంకా అందంగా కనిపిస్తాయి. ఈ పుస్తకం వంశీ భావుకత్వానికి, రాజీబడనితనానికి ప్రతీకగా నిలుస్తుంది.

ఇది ఖచ్చితంగా కలెక్టర్స్ అండ్ కలెక్టిబుల్ ఎడిషన్. కథల పుస్తకానికి 350 రూ. ఎక్కువ ధరేమో కాని, ఇలా ముద్రించిన పుస్తకానికి ఇది ఎక్కువ ధర కాదు. చదువుకొని, చూసుకొని, మెచ్చుకొని, మురుసుకొని, దాచుకొని, మనకూ ఇట్లాంటి పుస్తకాలు వేయగల సత్తా ఉందని బోరవిరుచుకొని చూపించుకొనే అందమైన పుస్తకం ఈ ఆకుపచ్చని జ్ఞాపకం.

ఆకుపచ్చని జ్ఞాపకం
వంశీ కథలు
ఇలియాస్ ఇండియా బుక్స్
4వ అంతస్తు, ప్లాట్ నం. 13, ఫేజ్ 3, జుబిలీ హిల్స్, హైదరాబాద్ 500 033
విశాలాంధ్ర ద్వారా పంపిణీ
360 పేజీలు, మేలిమి బౌండు
రూ. 350

తా.క. ఈ అట్టమీద బొమ్మ లాంటి బొమ్మనే, చంద్ర వేసింది, చాలకాలం క్రితం వంశీ కథకొకదానికి స్వాతి వారపత్రికలో చూసిన గుర్తు.

********************

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.

********************

వివిధ వంశీ రచనల ఆన్లైన్ కొనుగోలుకు ఇండియాలో ఉన్నవారికి – ఈవినింగ్ అవర్ లంకె ఇదిగో. ఏవీకేఎఫ్ వారి లంకె ఇక్కడ చూడండి.

వంశీ ఇతర రచనల గురించి పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసాలు ఇక్కడ చూడవచ్చు.
ఆకుపచ్చని జ్ఞాపకం కథ గురించి ‘నెమలికన్ను’ బ్లాగులో వచ్చిన వ్యాసం ఇక్కడ చూడండి. వంశీ వెండితెర నవలలు ఎందుకిష్టమో “వేణువు” బ్లాగులో రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.

You Might Also Like

7 Comments

  1. లలిత (తెలుగు4కిడ్స్)

    నా అభిప్రాయం చెప్తున్నాను. దయచేసి నా పైన దండయాత్రకు రావొద్దు.
    First Impression: వంశీ గారి మాటల పక్కన కృష్ణుడి బొమ్మ తీరు చూస్తే బాధేసింది.

    మొదట చదివిన కథ ‘యాత్ర ‘ నిరాశ పరిచింది.
    తర్వాత ఇక్కడిచ్చిన లంకె పట్టుకుని నెమలికన్ను బ్లాగులో వ్యాఖ్యకి ఈ సమాధానం చదివాను.
    “వంశీ సినిమాల్లాగే సాహిత్యం లోనూ, మంచి, చెత్త రచనలు ఉన్నాయి.”
    ధైర్యం చేసి మళ్ళీ ఇంకో కథ చదివాను.
    “వంతెన” కథ, నా expecations తగ్గించుకుని చదివినందుకో, మరి బహుశా నిజంగానే బావుందేమో.
    ఈ కథా, మిగిలిన కథలూ కూడా కొన్నాళ్ళ తర్వాత చదివి చూడాలి.

    నాకింకో చిక్కు ఉంది. బాపూ బొమ్మలంటే చాలా ఇష్టం. ఎవరికుండదు?
    సమస్యేంటంటే మా పెద్దబ్బాయికి కూడా ఇష్టం.
    వాడినుంచి ఈ పుస్తకం దాచిపెడ్తున్నాను, నాకు ఇబ్బందిగా అనిపించి. 🙁
    బాపూ బొమ్మలనగానే ఉత్సాహం పెంచుకోకుండా, కాస్త కథల ఇతివృత్తాల గురించి కూడా తెలుసుకోవలసింది.
    అమరావతి కథలతోనూ కొంచెం ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది కూడానూ. కానీ ఆ పుస్తకం డిజైనే ఎక్కువ నచ్చింది నాకు.

  2. పుస్తకం » Blog Archive » 2010లో నా పుస్తకాలు

    […] – టి. శ్రీవల్లీ రాధిక 30. ఆకుపచ్చని జ్ఞాపకం – వంశీ 31. ఆనాటి వానచినుకులు – వంశీ […]

  3. budugoy

    > వాతావరణ కల్పనలో చూపిన నేర్పు కథ తాలూకు మిగతా విషయాలపై సమపాళ్ళలో చూపనందువల్లనేమో?
    అంతేనేమో..ఈ చమక్కులూ, చురుక్కులూ, కిసుక్కులూ, చివుక్కులూ అన్నీ “తూచ్”ఎనేమో?

    > కథ-2009లో వంశీ కథ దొమ్మరిసాని ఉంది. అదే ఈ సిరీస్‌లో మొదటి వంశీ కథ.
    I was planning to buy it in dec’ book exhibition anyway. will be intersting to see vamsee in katha . hopefully not a sad story 😉

  4. చౌదరి జంపాల

    (‘గాలికొండపురం రైల్వే గేటు’ పుస్తకంపైన శ్రీ వేణూ-శ్రీకాంత్ వ్రాసిన పరిచయంపై జరిగిన చర్చలో చేసిన వ్యాఖ్యను, ఆయన సూచన ప్రకారం ఈ పరిచయానికి కూడా జతచేస్తున్నాను.)

    @వేణూశ్రీకాంత్: ఆనాటి వాన చినుకులు నుండి “ఆకుపచ్చని ఙ్ఞాపకం” లోకి ఎక్కని కథలు ఇవి. నల్లమిల్లి పెదభామిరెడ్డిగారి గ్రామం, ఒకరోజు, ఒక శిథిలమైన నగరం, కాకినాడలోరైలుబండెక్కికోటిపల్లి వెళ్ళాం, ఉప్పుటేరుమీద ఒక ఊరు, రాజమండ్రిలో కైలాసం.

    వేణూ శ్రీకాంత్ గారూ:

    నల్లమిల్లి పెదభామిరెడ్డిగారి గ్రామం కథ ‘అలా కాకుండా ఉంటే ఎంత బాగుండేది’ అన్న పేరుతో కొత్త పుస్తకంలో ఉంది. ఐతే కొత్త కథలో నల్లమిల్లి పెదభామిరెడ్డిగారు లేరు.

    ఒక రోజు కథ సంగతి ఇంకొద్దిగా విచిత్రం. చూడబోతే ఆ కథ ముందు ఇండియా టుడే లోనూ, ఆ తర్వాత ఆనాటి వాన చినుకులు మొదటి ఎడిషన్‌లోనూ ఆకుపచ్చని జ్ఞాపకం అన్న పేరుతో ప్రచురింపబడింది. ఈ కథ ఇప్పుడు కొత్తగా వచ్చిన ‘ఆకుపచ్చని జ్ఞాపకం’ వాల్యూంలో లేదు. కొత్త పుస్తకంలో ఉన్న ‘ఆకుపచ్చని జ్ఞాపకం’ పేరుతో ఉన్న కథకీ పాత కథకి విషయంలో స్వారూప్యత ఉంది కానీ ఇది వేరే కథ.

    ఇంకో విషయం: ఆనాటి వానచినుకులు రెండో ఎడిషన్ వెనక అట్ట మీద సూచికలో ‘ఆకుపచ్చని జ్ఞాపకం’ పేరు ఉంటుంది. లోపల ఇండెక్స్‌లో ఆ స్థానంలో ఒక రోజు ఉంటుంది.

    ఒక అనుబంధం ఒక ప్రారంభం అని వంశీ పరంగా ఉత్తమ పురుషలో చెప్పిన కథ ఆనాటి వానచినుకులులో ఉంది. ఆ కథ కొత్త పుస్తకంలో ఒక అనుభవం ఒక ప్రారంభం అన్న పేరుతో ప్రథమ పురుషలో, వంశీ కాకుండా వేరే డైరెక్టర్ ముఖ్యపాత్రగా సాగుతుంది.

    ఒక శిథిలమైన నగరం, కాకినాడలో రైలుబండెక్కి కోటిపల్లి వెళ్ళాం, ఉప్పుటేరు మీద ఒక ఊరు, రాజమండ్రిలో కైలాసం: ఈ నాలుగూ కథలు కాదు; ట్రావెలాగ్స్.

    పాత వాల్యూములలో లేనివి 13 కథలు కొత్త పుస్తకంలో ఉన్నాయి.

  5. చౌదరి జంపాల

    @budugoy:
    వాతావరణ కల్పనలో చూపిన నేర్పు కథ తాలూకు మిగతా విషయాలపై సమపాళ్ళలో చూపనందువల్లనేమో?
    కథ-2009లో వంశీ కథ దొమ్మరిసాని ఉంది. అదే ఈ సిరీస్‌లో మొదటి వంశీ కథ.

  6. budugoy

    ఇప్పుడే చదవడం పూర్తి చేశాను. జంపాల గారి ఈ వ్యాఖ్యతో నూటికి నూరు పాళ్ళు ఏకీభవిస్తాను.

    ” కోనసీమ వాతావరణం, గోదావరి అందాలు, ఆ మనుష్యుల భాషా, యాసా, నడకా, నడతా మంచి నేర్పుతో చిత్రీకరించే వంశీ కథల్లో చెమక్కుమనిపించే మెరుపులు, కిసుక్కుమనిపించే హాస్యం, చురుక్కుమనిపించే వ్యంగ్యం, చివుక్కుమనిపించి మనసు మెలితిప్పే విషాదం కొద్దిగా శృంగారంతో కలగలిసిపోయి, పాత్రలు సజీవంగా కళ్ళముందు ప్రత్యక్షమవుతాయి.”

    నా కథాసిరీస్ పుస్తకాలు కొన్ని పరహస్తగతమయ్యాయి. గుర్తున్నంత మేరకు దశాబ్దకాలంగా రాస్తున్న వంశీ ఒకసారైనా కథా సిరీస్ లో కనిపించినట్టులేరు? i am just curious why he fails to meet the bar?

  7. budugoy

    “ఇది ఖచ్చితంగా కలెక్టర్స్ అండ్ కలెక్టిబుల్ ఎడిషన్. కథల పుస్తకానికి 350 రూ. ఎక్కువ ధరేమో కాని, ఇలా ముద్రించిన పుస్తకానికి ఇది ఎక్కువ ధర కాదు.”
    ఆమెన్. నాణ్యమైన, అందమైన ముద్రణ. బహుశా స్వాతి పాఠకుల మార్కెట్ ఉంటుందని ఇంత ధైర్యంగా, కాస్ట్లీ ఎడిషన్ తీసుకొచ్చారేమో. ఇంచుమించు ఇదే ధరలో వచ్చిన పసలపూడికథలు, కలర్, బౌండ్ ఎడిషన్ కూడా చాలా బాగా వచ్చింది.

Leave a Reply