చెక్ లిస్ట్ మేనిఫెస్టో

రాసిన వారు: తమ్మినేని యదుకులభూషణ్
************************

పుస్తకం వివరాలు:
The Checklist Manifesto, Atul Gawande
New York: Metropolitan Books, 2009

రైలు కదిలే ముందు కిటికీ దగ్గర నిలబడి – ‘ నీ టికెట్ బాత్రూం లో చూసినట్టు గుర్తు. జేబులో పెట్టుకొన్నావు కదా’ ?? స్వరం పెంచి అడిగే వాడు నాన్న . బోగీలో సగం మంది కంగారుగా టికెట్ ఉందా లేదా అని చెక్ చేసుకొనేవారు. నాకిది అలవాటైన ప్రశ్నే కాబట్టి తాపీగా ‘ఉంది ‘ అనేవాణ్ణి. స్నేహితుని ఇంట భోజనాల దగ్గర ఈ సంఘటన చెబితే అందరూ నవ్వుతుంటే , జీనియస్ గా పేరు పొందిన స్నేహితుడి నాన్న గారు కలుగ జేసుకొని – ” అబ్బాయ్ , అది check behaviour , అది purely scientific ఏదీ మిస్ కారాదు అన్నది స్పిరిట్. ” అని సిగరెట్ వెలిగించారు. పాత కాలం ఇంజనీర్లలో ఈ తరహా ధోరణి నేను గమనించక పోలేదు. అమెరికాలో పేరు పొందిన వైద్యుడు ఈ ధోరణి మీద ఏకంగా ఒక పుస్తకమే రాశాడని తెలిసి ఆశ్చర్య పోయాను. మతిమరపు, అశ్రద్ధ ,అజాగ్రత్త మరే కారణం వల్లనైనా సరే, దొరలే ఘోరమైన తప్పులను ఎలా అరికట్టాలి ?? అన్నది ప్రధానాంశం.

అసలు తప్పులెందుకు చేస్తాము ?? అన్న ప్రశ్న తాత్విక మూలాలకు వెళతాడు రచయిత. తెలియక పోవడం లేదా అజ్ఞానం ఒక కారణం అనుకోవచ్చు.అలాగని చెప్పి, పోనీ, పూర్తి పరిజ్ఞానం గలవారు తప్పులు చేయకుండా ఉంటారా అంటే నమ్మకం లేదు. మరి తప్పులను అరికట్టడం ఎలా ??

అసలు కథలోకి పోయే ముందు ఒక పిట్ట కథ :

అమెరికాకు వచ్చిన కొత్తలో మనకు అసలు వంట రాదాయ. చిన్నక్క ఇచ్చిన సంచి తెరచి చూశాను. అందులో లేపాక్షి నోట్ బుక్ నుండి చింపిన రూళ్ళ పేపర్ మీద గుండు అక్షరాల రాత. పప్పు ఎలా చేయాలో వివరంగా ఉంది.అక్కడితో ఆగలేదు చిన్నక్క- జాగ్రత్త గా తన పద్ధతికి అనుగుణంగా మొదటి సారి పప్పు చేయడానికి కావలసిన సామగ్రి : కంది పప్పు ,మిరపకాయలు ,ఆవాలు,జిలకర -ముఖ్యంగా చింతపండు, అంతే గాక కొలమానం తప్పరాదని ఒక చిన్న స్టీల్ గ్లాసు ఉంచింది. నేను చేసినదల్లా తన వంట పద్ధతిని ఆకళించుకొని, ఆ కాగితాన్ని చూస్తూ ఒక్కొక్కటీ కుక్కర్లో వేశాను. తర్వాత తిరగమోత తన పద్ధతిలో తు.చ తప్పకుండా పేపర్ చూస్తూ చేశాను. పప్పు ఘుమఘుమలు అమెరికా గాలిలో సగర్వంగా వ్యాపించే సరికి నా స్నేహితులకి మతి పోయింది. రుచి చూసి నిర్ఘాంత పోయారు. అంత రుచిగా పప్పును తిని ఎరుగరు.

తర్వాత పప్పు అంటే నేనే చేయవలసి వచ్చేది. నేను విధి విధానాలు తు.చ తప్పకుండా అదే రుచిని తెప్పించే వాడిని. అందరూ ‘మంత్రగాడి ప్రాణం చిలుకలో ఉన్నట్టు, నీ పప్పు రహస్యం చిన్న చీటీ లో వుంది అని నవ్వే వారు. వారందరితో పోలిస్తే నాకు వంటలో ఓనమాలు కూడా రానట్టే. కానీ, వారికి బాగా వచ్చిన వంటలు కూడా తరచూ పాడు చేసేవారు. నేను నా విధానంలో మరి కొన్ని వంటలను చేసి రుచికి ఒక ప్రమాణం ఉండ వలసిందే అని వాదించే వాణ్ణి. వారిని కూడా వంట బాగా కుదిరిన రోజు పాటించిన పద్ధతిని రాసి పెట్టి, ఆ విధి విధానాలను తు.చ తప్పకుండా చేయమని చెబితే ఎవరూ నా మాట వినే వారు కాదు. పైగా వారి సమాధానం, మేము చాలా ఏళ్లుగా చేస్తున్నాం, అవన్నీ మాకు అవసరం లేదు. నీవు వంటకు కొత్త, కాబట్టి ఈ చీటీలు వగైరాలు అవసరం అనేవారు. మరి, లెక్కలేనన్ని సార్లు వంటలో ఉప్పు తక్కువ, సరిగా ఉడకలేదు, ఇంకా వేగలేదు ..ఈ కబుర్లన్నీ ఎందుకు అంటే మారు మాటాడే వారు కాదు. వారికి అర్థం కాని విషయం ఏమిటంటే వీటిని సులభంగా అరికట్ట వచ్చు. వంటను ప్రమాణీకరించ వచ్చు. ఎలా అంటే – వంట చేసే విధి విధానాల చీటీ (ఇది కూడా ఒక తరహా చెక్ లిస్టు) చెంతనుంటే చాలు.

ఈ విషయాన్ని ఇంతటితో ఆపకుండా వంట వారితో పరిచయం పెంచుకొన్నాను. అలాగే హోటల్ యజమానులతో. ఒక పదేళ్ళలో నేను గమనించింది ఏమంటే వంటవారు మారిన ప్రతిసారి చాలా చోట్ల వంట రుచి మారుతోంది. కొన్ని సార్లు రుచి తలకిందులై హోటల్ మూత పడిన సంఘటనలు ఉన్నాయి. కేవలం ఒక్క హోటల్లో వంటవారు మారినా రుచి మారడం లేదు. యజమానిని అడిగేశాను: ‘ అయ్యా, ఏమిటి మీ చిదంబర రహస్యం ‘? అని. మితభాషి అయిన అతగాడు తమిళనాడు తెలుగు యాసలో చెప్పాడు, మెనూ లో ఉన్న అన్ని వంటకాలకు ఎలా చేయాలో వివరంగా విధి విధానాలను రాసి ఉంచాడట. ఏ కొత్త వంటవాడు వచ్చినా అదే పద్ధతిలో చేయవలసిందేనట. కాబట్టి ,స్వంత పైత్యానికి అవకాశం లేదు అని కరాఖండి గా చెప్పి వేశాడు. ‘భేష్’ అన్నాను నాకిష్టమైన రసం చప్పరిస్తూ.

న్యూ జెర్సీలో పేరు పొందిన హోటల్ అది. చాలా మంది అమెరికన్లు సైతం వారి శాకాహార వంటకాలను ఆరగించడానికి బారులు తీరతారు. నా ఆలోచనలో బలం ఉంది అని తెలిసినా జనాలను ఒప్పించడం అంత సులభం కాదు. కారణం , పాకశాస్త్రంలో ఎవరికి వారు నల భీములనుకొంటారు (మన కవుల్లాగే ) ఇప్పుడు ,ఈ పుస్తకాన్ని వారిముందు గిరవాటేసి- ‘మారు మాటాడకుండా చదువు ‘ అని హుకుం జారీ చేయగలను.

మన ముందున్న పని జటిలంగా మారే కొద్దీ, కేవలం స్వంత తెలివితేటలు, జ్ఞాపక శక్తి మీద ఆధారపడితే ప్రమాదాలు కొని తెచ్చుకోవడమేనని, విమాన రంగంలో అనుభవం నేర్పిన పాఠం. అయితే వారు అక్కడే ఆగిపోకుండా పరిశోధనను ముమ్మరం చేశారు. మతిమరుపు, అజాగ్రత్త వల్ల ఎంత చిన్న తప్పు దొర్లినా అంత ఎత్తున ఉన్న విమానం నిలువునా కూలిపోతుంది-కళ్ళు మూసి తెరచే లోగా. మరి మనుషుల్లో మతి మరపు అతి సహజం అన్నది అందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే. దీన్ని అరికట్టడానికి వారు కనిపెట్టిన సాధనం: చెక్ లిస్టు.

అందులో విధి విధానాలను వీలయినంత క్లుప్తంగా పొందు పరుస్తారు. రోజువారీ పనులు, ప్రమాదకరమైన పరిస్థితులతో చేయదగిన పనులు, ఇలా చక్కగా వింగడించి అయోమయానికి ఏ మాత్రం తావులేకుండా చూసుకొంటారు. పైలట్లు విధిగా వీటిని వాడవలసిందే. పనిలో పరాకు చిత్తగిస్తే ఏమవుతుందో వారికి బాగా తెలుసు కాబట్టి విధిగా వీటిని అనుసరించి లెక్క లేనన్ని సార్లు ఎన్నో ప్రమాదాల బారీన పడకుండా తప్పించుకొన్నారు. ప్రమాదం జరిగిన ప్రతిసారి బ్లాక్ బాక్స్ సేకరించేది పైలట్లు విధి విధానాలను ఏ మేరకు పాటించారు అని పరిశీలించడానికే. జరిగిన ప్రమాదాన్ని పరిశీలించి, తిరిగి అది జరగకుండా చూడటానికి పాటించవలసిన జాగ్రత్తలు ఒక చెక్ లిస్టు గా మార్చి పైలట్లకు అందుబాటులోకి వచ్చేలా చూస్తారు. చెక్ లిస్టు లేకుండా ప్రమాదాలను అరికట్టడం దాదాపు అసంభవం.

అలాగే నిర్మాణ రంగంలో ముఖ్యంగా- ఆకాశాన్నంటే భవనాలు కట్టే వారు నిర్మాణ సమయంలో అనేక జాగ్రత్తలను పాటించవలసి వస్తుంది. లేదంటే వారు కడుతున్న మహాసౌధం పేకమేడలా కూలిపోతుంది. రచయితకు ఆశ్చర్యం కలిగించిన విషయం భవననిర్మాణం దాదాపు దోషరహితంగా ఉంది ( లక్షకు రెండు తప్పులు జరిగాయి) మరీ ముఖ్యంగా ఆకాశ హర్మ్యాల నిర్మాణం ఎంతో నిర్దుష్టంగా ఉంది. ఈ ప్రమాణాలను వారు ఎలా సాధించారు ?? చెక్ లిస్టు !!

౧౯ వ శతాబ్దంలో ,నిర్మాణ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకొన్నాయి. ఒక్క కంపెనీయే అన్ని పనులు చేపట్టే నమూనాకు తెరపడింది. వాటి స్థానే, చక్కని సమన్వయంతో పనిచేసే నానా విభాగాలు ప్రత్యక్షమయ్యాయి. వాటి మధ్య సమన్వయం సాధించడానికి గల ఏకైక సాధనం చెక్ లిస్టు. నిర్మాణ సమయంలో తలెత్తే అన్ని సమస్యలు అందరికీ తెలియాలి.లేదంటే అన్ని విభాగాలు కలుపుగోలుగా పనిచేయలేవు. నిర్మాణం సజావుగా సాగదు. చేయవలసిన పనులకు ఒక చెక్ లిస్టు, విభాగాల మధ్య సమన్వయం (ఈమెయిలు /ఫోన్ /మీటింగు) కోసం ఒక చెక్ లిస్టు, వాటిని పాటించేలా చూసే సిబ్బంది, యంత్రాంగం ఉంటే గాని భవనం లేచి నిలబడదు.

అతుల్ గవాండే పరిశీలనలో తేలిందేమంటే వైద్యులు తమరంగంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న ప్రత్యేకతలతోనే సతమతమవుతున్నారే తప్ప, ఆపరేషన్ రూం లో ఒక జట్టుగా వ్యవహరించలేక పోతున్నారు. దానికి భిన్నంగా, విమాన, నిర్మాణ రంగాల్లో ఒక జట్టుగా నిలబడి చివరిదాకా పోరాడి గెలుస్తున్నారు. వైద్యుడే సర్వజ్ఞుడు, తతిమ్మా వారందరూ ఆటలో అరటిపళ్ళు అన్న చింతన వల్ల అసలుకే ఎసరు వచ్చిందని వాపోతాడు గవాండే .

ఆపరేషన్ రూములో అనస్తీషియా ఇచ్చే వారు, వివిధ నర్సులు, రెసిడెంట్ల మధ్య ఒక సమన్వయం లేనిదే గొప్ప ఫలితాలను రాబట్ట లేము; ఇందు నిమిత్తం సర్జను సర్వజ్ఞుడు అన్న ధోరణి మారాలి. ఆపరేషనుకు ముందు విధిగా అందరూ జట్టు కట్టాలి. కలిసికట్టుగా పనిచేయాలి. కానీ, ప్రస్తుతం అలా జరగడం లేదు. కాబట్టి ఎన్నో తప్పులు దొరలుతున్నాయి..ఎందరో మరణిస్తున్నారని మన వైద్యుని నిష్కర్ష.

అతుల్ గవాండే తప్పులను ఎలా నివారించాలి అని మొదలు పెట్టిన పరిశోధన – Organization Behaviour, Administration లోకి పర్యవసించిన తీరు చాలా ఆసక్తి గొలుపుతుంది. అంతేగాక, చెక్ లిస్టులను ఎలా రూపొందించాలి అన్న అధ్యాయం విలువైనది. కవిత్వానికి అసలు సిసలు అనువర్తన (application) ఇక్కడ చూడగలం. కవిత్వం ఏమి చేయగలదు అన్న ప్రశ్నకు మంచి జవాబు ఇక్కడ దొరుకుతుంది.

చెక్ లిస్టు వీలయింత క్లుప్తంగా, స్పష్టంగా ఉండాలి. దీర్ఘత పనికే రాదు. ఎంతటి వారయినా విస్మరించడానికి అవకాశం ఉన్నవాటిని గుర్తు చేయాలి. అది పనికి రావాలి.అది చదివాక మన బుర్ర వెలగాలి .(చెక్ లిస్టు చదివే వారికి ఏమీ తెలియదు అనుకొని తెలిసినవన్నీ ఏకరువు పెట్టరాదు.) అందరికీ తేలికగా అర్థమయే దాన్ని వదిలేయాలి. అందులో కేవలం కీలకమైన వాటికే చోటివ్వాలి.అనుభవ సారం అందులో కనిపించాలి.

పై పేరాలో చెక్ లిస్టు ఉన్న చోటల్లా కవిత అని పెట్టి చదవండి. ఇంకా అనుమానం తీరకున్న కవిత్వ దేశికుడు రష్యన్ మహాకవి బ్రాడ్ స్కీ వ్యాసం- “పుస్తకం ఎలా చదవాలి ?” తిరగేయండి. ఆయన పేర్కొన్న కవిత్వ లక్షణాలను మననం చేసుకోండి ..తప్పక ఆశ్చర్య పోతారు. జీవితాన్ని అర్థవంతంగా మార్చేది కవిత్వం. ఆ స్ఫూర్తి ఏ రంగాన్నైనా దేదీప్య మానంగా వెలిగిస్తుంది.

వైద్య రంగంలో ముఖ్యంగా శస్త్ర చికిత్సలో దొరలే తప్పులు వాటి వల్ల సంభవించే మరణాలు(అమెరికాలో ప్రతి ఏడాది లక్షన్నర మంది చనిపోతున్నారు, రోడ్డు ప్రమాదాలలో మరణించే వారి సంఖ్య దీని కన్నా తక్కువ) మన వైద్యుణ్ణి ఆలోచనలో పడవేశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి పనుపున పరిశోధన నిర్వహించి, వైద్య రంగంలో పాటించ వలసిన విధి విధానాలను రూపొందించి వాటిని చెక్ లిస్టుల రూపంలోకి మార్చి, ప్రపంచ వ్యాప్తంగా వాటి వాడకాన్ని పర్యవేక్షించి, వాటి వల్ల జరిగిన మేలును గుర్తించి, తాను తెలుసుకొన్న సత్యాన్ని నలుగురితో పంచుకోవాలన్న సదుద్దేశంతో ఈ గ్రంథ రచనకు పూనుకొన్నారు అతుల్ గవాండే. ఆలోచనకు పురికొల్పే ఈ పుస్తకాన్ని అందరూ తప్పక చదవ వలసిందే.

అమేజాన్ లంకె ఇక్కడ. ఫ్లిప్కార్ట్ లంకె ఇక్కడ.

You Might Also Like

7 Comments

  1. పుస్తకం » Blog Archive » 2019-20 లలో నా పుస్తకపఠనం

    […] The Checklist Manifesto: How to Get Things Right – Atul Gawande: ఏ పనికైనా చెక్ లిస్టులు వాడ్డం వల్ల చాలా సమస్యలు అరికట్టవచ్చు అన్నది ఈ పుస్తకం సూత్రీకరణ. రచయిత డాక్టరు – ఆయన అనుభవంలో ఇది ఎలా పనిచేసిందో చెప్పారు. పుస్తకం లో కొన్ని ఉపయోగకరమైన అంశాలు ఉన్నాయి. గతంలో ఈ పుస్తకం గురించి తమ్మినేని యదుకులభూషణ్ గారు పుస్తకం.నెట్లో పరిచయం చేశారు. ఆ వ్యాసం ఇక్కడ. […]

  2. పుస్తకం » Blog Archive » 2010లో నా పుస్తకాలు

    […] The Checklist Manifesto  – Atul Gawande.  గవాండే కొత్త పుస్తకం.  ఈ […]

  3. తమ్మినేని యదుకుల భూషణ్

    మీరు లింకు ఇచ్చి మంచి పని చేశారు. పుస్తకం అందుబాటులో లేని వారు కనీసం ఒక అధ్యాయం
    తిరగేయగలరు. అంతేగాక , అతుల్ గవాండే ఇంటర్వ్యూ వినగలరు. పుస్తకం చదవలేని వారికి
    ఈ రెండూ ఎంతో లాభదాయకం.ఇక పోతే ,నేను తరచు సందర్శించే హోటల్ :
    దోశ గ్రిల్

  4. Srinivas Vuruputuri

    భూషణ్ గారూ,

    కృతజ్ఞతలు. కొనేసాను, మీ సమీక్ష చదవగానే

  5. తమ్మినేని యదుకుల భూషణ్.

    తప్పకుండా , అలాగే ,నేను చెప్పిన చోట శాకాహార భోజనం కూడా రుచి చూపిస్తాను.

  6. హెచ్చార్కె

    వ్యాసం చాల బాగుంది. పుస్తకం మీద ఆసక్తి రేకిత్తించడం సరే, దానికి ముందు ఈ పరిచయ వ్యాసం చదివి చాల మేలు పొంద వచ్చు. మీరు వండిన పప్పు ఒక్క సారైనా తినాలి. 🙂

Leave a Reply