పుస్తకం
All about booksపుస్తకాలు

December 16, 2010

రంగుటద్దాల కిటికీ – ఒక సంవత్సరం ఆలస్యంగా

More articles by »
Written by: Jampala Chowdary

రాసిన వారు: చౌదరి జంపాల
****************
నాసీ అని మేమూ, కొత్తపాళీ అని తెలుగు బ్లాగ్లోకులు పిలుచుకొనే మిత్రుడు శంకగిరి నారాయణస్వామి తాను అప్పటిదాకా రాసిన కథలన్నిటినీ కలిపి ఒక పుస్తకంగా రంగుటద్దాల కిటికీ అన్న పేరుతో  సరిగ్గా ఒక సంవత్సరం క్రితం అచ్చేసి, ఆవిష్కరించి, అభిమానంగా ఒక కాపీ పంపించి, మీ అభిప్రాయం రాయండి అన్నాడు. ఐనా నాసీ కథల మీద నేను కొత్తగా అభిప్రాయం చెప్పాలా? ఈ పుస్తకంలో ఉన్న కథల్లో దాదాపు సగం కథలు నేను సంపాదకత్వం వహించిన తానా పత్రికలోనో, తానా సావనీర్లలోనో, తెలుగునాడిలోనో, ప్రత్యేకంగా అడిగి మరీ ప్రచురించుకొన్నవే కదా. మిగతావాటిలోనైనా నేను ఇంతకు ముందు చదవనివి ఏమీ లేవు (నాకు నచ్చిన, నేను తానాపత్రికలో ప్రచురించిన, నాసీ కథ ఒకటి ఎందుకనో ఈ సంపుటంలో లేదు. ఆ కథ సంగతి తర్వాత).

తెలిసినవే ఐనా, కథలన్నీ ఒక్క చోట చేర్చుకొని, చక్కగా అచ్చేసిన పుస్తకంలో ఒకేసారి చదివే అనుభవము, స్పందన వేరు. దానికితోడు అన్వర్ చక్కటి బొమ్మలతో కథల్నీ, పుస్తకాన్నీ అలంకరించాడు. ముఖచిత్రమూ, వెనుక అట్ట మీద రంగుల్లో నవ్వుతున్న రచయిత ముఖం చిత్రమూ బాగున్నాయి. అన్నట్లు ముందే చెప్పవలసిన విషయం: నారాయణస్వామి నాకు మొదట అమెరికాలోనే నాసీగా పరిచయమైనా, (వెనుక అట్ట మీద అతనే చెప్పుకొన్నట్లు) విజయవాడలో అందరికిమల్లే నాక్కూడా అతను లెక్చరర్ ఎస్.ఎన్.రామస్వామిగారి అబ్బాయన్న అభిమానం ఎక్కువే. ఆయన నాకు లయోలా కాలేజీలో బోటనీ మాస్టారు; క్విజ్‌క్లబ్ అడ్వైజర్‌గా నాకు మెంటరు. (ఇంకో డిస్క్లోజరు: ఈ పుస్తకం మొదట్లో రచయిత కృతజ్ఞతల లిస్టులో నా పేరు కూడా ఉంది.)

నాసీ కథల్లో చదివించే గుణం ఉంది. కథ ఎత్తుగడ ఉత్కంఠభరితంగా ఉంటుంది. యదుకుల భూషణ్‌గారు కథకు ప్రాణం అని చెప్పే వాతావరణ కల్పన, దానితోపాటు తప్పకుండా ఉండాల్సిందేనని నేను చెప్పే వస్తువు తన కథల్లో ఉంటాయి. కథలన్నీ ఒకే పద్ధతిలో ఉండవు. వైవిధ్యమున్న ఇతివృత్తాల్ని తీసుకొని, వస్తువునిబట్టి కథ చెప్పే టెక్నిక్‌ని మార్చుకొంటూ ఉంటాడు. తనకు తెలిసిందంతా కథలో చొప్పించాలన్న లౌల్యం లేదు. అవసరమైనదానికన్నా కథని పొడిగించాలన్న తాపత్రయమూ తక్కువే. కథ అందంగా తయారు చేయటంలో శ్రద్ధ వహిస్తాడు. అందుచేత సాధారణంగా నాసీ రాసిన కథలేవీ నాసిగా ఉండవు. సులువుగా చదివేసుకోవచ్చు.

ఐతే సులువుగానే చదివేసినా, కొన్ని కథల్ని తేలిగ్గా తీసుకోలేం. అతని తుపాకీ కథకు పదేళ్ళు వయస్సు వచ్చినా ఇప్పటికీ ప్రశంసలు పొందుతునే ఉంది. ఈమధ్య ఇండియన్ వేల్యూస్ కథని గురించి చాలామంది చర్చించుకోవటం నాకు తెలుసు. వీరిగాడి వలసలో రాఘవరావు,వీరిగాడు గుర్తుండిపోయే పాత్రలు. ఖాండవవనంలో వాతావరణ చిత్రణని భూషణ్‌గారు కూడా మెచ్చుకోవల్సిందే. ఈ కథకు తగినంత ప్రాచుర్యం రాలేదని నాకు అనిపిస్తుంది. అనుసరణే ఐనా అచ్చమైన తెలుగు కథలానే నడుస్తుంది సాక్షి. చక్కని చుక్క, ఓరి భగవంతుడా… వంటి కొన్ని కథలు మనస్తత్వ విశ్లేషణ ప్రధానంగా రాసినవి.

ఇవే కాకుండా కులాసా కథలు కూడా నాసీ బాగానే రాయగలడు – డిటెక్టివ్ నీలూ, అత్తగారితో కొత్తకాపురం, ధీర సమీరే, నీవేనా నను తలచినది వంటివి. ఒక జనవరి శుక్రవారం లోకస్ట్‌వాక్ కార్నర్లో కథ చైతన్యస్రవంతి పద్ధతిలో నడుస్తుంది.

ఈ సంపుటిలో నాసీ చమత్కారంగానో వ్యంగ్యంగానో రాసిన చిన్నకథలు (గల్పికలు అనవచ్చు అనుకుంటా కొకు బాటలో) నాలుగు ఉన్నాయి. ఆ కథలు ఈ సంకలనంలో చేర్చకుండా ఉంటే బాగుండేది. వాటిలో చెప్పుకోదగ్గ వస్తువూ లేదు, అంత హాస్యంగానూ లేవు. రచయితగా నాసీకి గౌరవాన్నిచ్చే కథలు కావు ఇవి. తాము రాసిందంతా తమ సంకలనాల్లో ప్రచురించాలనే లౌల్యానికి నాసీ మినహాయింపు కాకపోవటం నన్ను ఇబ్బంది పెట్టింది.

చెప్పక తప్పని ఇంకొక విషయం. చాలా కథలు ఏదో ఒక్క విషయమే కేంద్రంగా నడుస్తాయి. అందుచేత కథలు ఆసక్తికరంగానే ఉన్నా చాలావాటిలో గాఢత తక్కువ.

చికాగోలో జరిగిన రెండవ అమెరికా సాహితీ సదస్సు (2000)లో నాసీ ‘మాటలు‘ అన్న పేరుతో ఒక కథ చదివాడు. ఆ కథ తర్వాత తానాపత్రికలో కూడా ప్రచురితమయ్యింది. ఒక చిన్న సంఘటనను చక్కటి వడితో వర్ణించిన చిన్న కథ. నాసీ రచనల్లో నాకు నచ్చినవాటిలో ఒకటి. ఎందుచేతనో ఆ కథ ఈ సంకలనంలో లేదు. ఉంటే బాగుండేది.

అమెరికా తెలుగు జీవితంలో వివిధ వర్ణాల్ని చూపించే రంగుటద్దాల కిటికీలు ఈ కథలు. రచయితగా పరిణతి చెందుతూ, ప్రథమశ్రేణి అమెరికా తెలుగు కథకుల్లో ఒకడుగా పేరు తెచ్చుకొన్న మిత్రుడు నాసీ ఇంకా చాలా రాస్తాడనీ, ఇంకా బాగా రాస్తాడనీ ఆశిస్తున్నాను.

రంగుటద్దాల కిటికీ
ఎస్.నారాయణస్వామి
ప్రచురణ: డిసెంబరు 2009
ప్రతులకు: నవోదయా పబ్లిషర్స్, విజయవాడ
vjw_booklinks@yahoo.co.in 0866 2673500
191 పేజీలు; 75 రూ. 9$

ఈ పుస్తకంపై ‘మనసులోమాట‘ సుజాత గారు జనవరిలో రాసిన సమీక్ష ఇక్కడ చదవండి.About the Author(s)

Jampala Chowdary

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు, కథ-నేపథ్యం కథాసంపుటాలకు సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానాకు 2013-2015కు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా, 2015-2017కు అధ్యక్షుడిగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.4 Comments


 1. […] 24. ఎన్నెమ్మ కతలు — నిడదవోలు మాలతి 25. రంగుటద్దాల కిటికీ –  […]


 2. చౌదరిగారూ,
  – Complete Works of Narayanaswamy కొనుక్కొని చదువుకొనే సమయం ఇంకా రాలేదు –
  కరెక్టే కావచ్చు -:)).


 3. చౌదరి జంపాల

  @మాలతి:
  మాలతి గారూ:

  ఒక్కటే విషయం చుట్టూ కథలు రాయవచ్చు కానీ మంచి కథలు రాయటం కష్టం. మనం చదివే కథల్లో ఎక్కువభాగంలో రచయిత ఏదో ఒక పాయింటును కథ ద్వారా చెప్పాలని సంకల్పించుకొని తన దృష్టంతా ఆ పాయింటు మీదే ఉంచటంతో కథకూ, పాత్రలకూ పార్శ్వాలు (dimensions) తగ్గిపోయి తరచూ చిత్తుబొమ్మలు మిగిలిపోతాయి. అలాంటి కథల్లో గాఢత అరుదుగా ఉంటుంది. రచయిత సమర్ధత, శ్రద్ధ చూపించినప్పుడు మాత్రమే అటువంటి కథలు బాగా పండుతాయి.

  ఒక రచయిత పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవటానికి ఆ రచయిత రచనలన్నీ ఒకచోట ఉండటం ఉపయోగపడే మాట నిజమే (ఉదాహరణకు కాళీపట్నం రామారావు రచనలు, శ్రీశ్రీ ప్రస్థానత్రయం). నిర్మొహమోటంగా చెప్పాలంటే పాఠకులు Complete Works of Narayanaswamy కొనుక్కొని చదువుకొనే సమయం ఇంకా రాలేదు. తప్పా, తాలూ కలిసిన ధాన్యానికీ, తూర్పారపట్టి, జల్లెడ పట్టిన గింజలకూ ఒకటే విలువ కట్టం. ఎంపిక విషయంలో నాసీ జాగ్రత్తగా ఉండి ఉంటే తన సంకలనం స్థాయి ఇంకొంత మెరుగ్గా ఉండేది కదా అన్నది నా బాధ.


 4. చౌదరిగారూ, చక్కగా సమీక్షించేరు నాశీ కథలు. ఒకచోట మాత్రం నాకు కొంచెం అయోమయంగా అనిపించింది **ఏదో ఒక్క విషయమే కేంద్రంగా నడుస్తాయి. అందుచేత కథలు ఆసక్తికరంగానే ఉన్నా చాలావాటిలో గాఢత తక్కువ.** అంటే ఒక్కవిషయంమీద కేంద్రంగా కథ రాయలేం అంటారా? అలాగే చిన్న చిన్న గల్పికలు కూడా – ఒకే రచయిత కథలసంకలనం అయినప్పుడు ఇవి ఆ రచయిత స్ఫూర్తిని, ప్రయోగాలనీ అర్థం చేసుకోడానికి ఉపయోగపడతాయి కనక అవి చేర్చడంలో తప్పు లేదనే అనుకుంటాను నేను. మీతో విబేధించాలని కాదు కానీ నా అభిప్రాయం చెప్పేనంతే. – మాలతి  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Wakes on the horizon – పుస్తక పరిచయం

తెలుగు కవుల కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ఎన్నెస్ మూర్తి గారి పుస్తకం “Wakes on the hor...
by పుస్తకం.నెట్
0

 
 

తంగేడు పూల బతుకమ్మలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (కొన్నాళ్ళ క్రితం భూమిక ప్రియాంక అనే యిద్దరు 12/13 సంవత్సరాల బం...
by అతిథి
1

 
 

సహవాసిని తల్చుకుందాం – సభ ఆహ్వానం

సభ వివరాలు: తేదీ: 23 డిసెంబర్ 2017 సమయం: ఉదయం 11-12:30 వేదిక: ప్రెస్ క్లబ్ వివరాలకు జతచేసిన ఆహ్వా...
by పుస్తకం.నెట్
0

 

 

“కొలిమి రవ్వలు” పుస్తకావిష్కరణ – ఆహ్వానం

గౌరి లంకేశ్ రచనల సంకలనం “కొలిమి రవ్వలు” పుస్తకావిష్కరణ 28 నవంబర్ నాడు హైదరాబాదులో...
by పుస్తకం.నెట్
0

 
 

వచన గానం – చింతకింది మల్లయ్య ముచ్చట కథలు

వ్యాసకర్త: సిద్ధార్థ (సమీక్షకుడు ప్రముఖ కవి) *********** To write is to make oneself the echo of what cannot cease speaking- and since it cannot, in orde...
by అతిథి
0

 
 

వెండివెన్నెల: మళ్లీ మళ్లీ నిర్మించిన సినిమాల ముచ్చట్లు

వ్యాసకర్త: కాదంబరి ************* వెండి తెరకు శీతల వెన్నెల భాష్యాలు వెలయించిన పుస్తకం ‘వెండ...
by అతిథి
0