కృష్ణాతీరం – మల్లాది రామకృష్ణశాస్త్రి – ఆధునిక సాహిత్యంలో అనర్ఘరత్నం -14

“కృష్ణాతీరం” – పుస్తకం, 200 పేజీల చిన్న నవల. నేను సుమారు 35 ఏళ్ళక్రితం కొని చదివి పదిలంగా దాచుకున్న పుస్తకం ఇది. ఎన్నిసార్లు చదివేనూ అంటే — లెక్కపెట్టలేదు — కాని, ఓ ముప్ఫై నలభై సార్లకు తక్కువ కాకుండా చదివుంటా నిప్పటికి. ఎన్నిసార్లు చదివినా గానీ, ఎప్పటికప్పుడు కొత్తగా మొదటిసారి చదువుతున్నట్లే వుంటుంది. అదీ దీని మహత్తు. అసలు మొట్టమొదటి సారి చదివినప్పుడు మొదట సరిగా అర్థం కాలేదు — చదవటం చేతకాక. ఎందుకంటే శాస్త్రిగారి రచనని చదివేటప్పుడు ఒఠి అక్షరాలనే కాదు, ఫుల్స్టాపులు, కామాలూ, చిన్ని చిన్ని మధ్య మధ్యలో గీతలూ, సెమికోలనులూ, ఫ్రశ్నార్థకాలూ, ఆశ్చర్యార్థకాలతో సహా చదవటం నేర్చి ఉండాలి. అప్పుడే మనకు ఏ సంభాషణ ఎక్కడ మొదలయిందీ, ఎక్కడ చివరికొచ్చిందీ, ఎవరు ఎవరితో ఏమేమన్నారూ వగైరై వగైరా వివరంగా తెలుస్తాయి. ఈ సందర్భంలో మల్లాది వారు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారిని గుఱించి అన్నమాటలు వారి విషయంలోనూ కూడా సార్థకాలే. కాబట్టి వాటినో సారి గుర్తు చేసు కుందాం.

“ఆయన రచనలు మరోభాషకు లొంగవు. జాను తెలుగు నేర్చిన వారికే శ్రీ శాస్త్రి గారి కథలు చదివి ఆనందించే అదృష్టం.” ఈ ఉపోద్ఘాతంతో కృష్ణాతీరం పరిచయాన్ని మొదలు పెడతాను.

‘మనం కృష్ణాతీరం వాళ్ళం:

పేరు  గొప్పే కాదు: ఎక్కడికి వెళ్ళినా పెద్ద పీట వేయించుకుంటాం !—‘

‘ఓ యబ్బ!— ఏటి ఒడ్డున పుట్టిన వాళ్ళెవరైనా యింతే!—

అటు పెన్నలో  వాళ్ళూ, యిటు గోదావరిలో వాళ్ళూ, — ఏడేడు తరాలనుంచీ యిదే రాంభజన —‘

‘వాళ్ళు చేశారంటే సబబుంది! అక్కడ నన్నయ్య, యిక్కడ తిక్కన్న పుట్టుకొచ్చారు …..’

‘ఆ,- భారతమూ పుట్టుకొచ్చింది! మూడూళ్ళు తిరిగితేకాని ముడిపడలేదు. కృష్ణఒడ్డున కూచుని సంకల్పం జెప్పుకుని, ఓంటిచేతి మీద భాగవతం వ్రాశాడు, ఆ పేద బ్రాహ్మడు! అన్నీ నదులే, కాని, యిదిరా నాయనా తేడా !…’

రాజమ్మ  ( అన్నప్ప గారి గురువుగారి అమ్మాయి) అన్నప్పతోఅనే మాటల్లో మల్లాది వారు పలికించిన తేనె పలుకులు ఇవి.

ఇంకో  సందర్భంలో లచ్చమ్మ అనే  ఆమెతో ఇలా అనిపిస్తారు.

“మనం మనం మనసులు కలిసిన వాళ్ళం. అందరూ బాగుండడమే మనకు కావల్సింది. మీది అద్దరి, మాది ఇద్దరీ! అందరిదీ కృష్ణాతీరమే! అంతే కాకుండా చుట్టరికాలంటూ కలవడంతో మరింత చేరువౌతాం కద! మీ ఊళ్ళో పోపు పెడుతుంటే మా ఊళ్ళో ఘుమ ఘుమ లాడుతుంది.” —

అన్నప్ప ఓసారి సుబ్బరాముడితో అంటాడు .

“వయస్సంటే వంటిమీదకు వచ్చింది కాని మనస్సింకా మనుగుడుపుల్లోనే ఉం దన్నాట్ట వెనకటికి నా వంటి వా డెవడో!- నాయనా, యిది యివాల్టి ముచ్చటా? యీ శుద్ధ తదియకు మా అన్యోన్యానికి అర్ధషష్టిపూర్తి. దాంపత్యం అనేది, తమలపాకు లాటిది, ఆదిలో,– లేతలౌజు , ఆపై కవటాకు, పైపై పండుటాకు ! దాంపత్యమంటే తాంబూలమంటే, ఆద్యంతం రసవంతమే కాదుషోయ్!‘

దాంపత్యంలో  ఆడకూతురు మకురుతనం చేసిందంటే, అది అర్థంలేని మొండిపట్టు అనుకోవడం, మన అమాయకత్వం కాని, మరొహటి కాదు: కవ్వించటం అనేది తలకొక రకం! తమలపాకుతో తా నొకటంటే, మల్లె చెండుతో మన మొక టన్నప్పుడే మన్మథుల వారు మనకు దాసోహం చేసేది!’ అంటాడు అన్నప్ప.

అన్నప్పగారి భోజన ప్రియత్వం గురించి చెబుతూ అన్నప్ప చేతే ఇలా అనిపిస్తారు మల్లాది వారు.

“యీ స్వస్థి కేం గాని, పెందరాడే కాస్త పప్పూ అన్నం బెడుదూ. చుట్టాలొచ్చేరని, నవకాయ పిండివంటలూ జేసేవ్. వంకాయ నాలుగు పచ్చాలు చేసి పోపులో వేసి, ఆనపకాయమీద యింత నువ్వు పప్పుచల్లి, అరటిదూట మొఖాన యింత ఆ వెట్టి, తోటకూర కాడల్లో యింత పిండి బెల్లం పారెయ్. కొబ్బరీ, మామిడీ, అల్లం యీ పచ్చళ్ళు చాల్లే — పెరుగులో తిరగబోత పెట్టి, దాన్లో పది గారిముక్కలు పడేయ్. రవంత శెనగపిండి కలిపి, మిరపకాయలు ముంచి చమురులో వెయ్. సరే క్షీరాన్నమంటావా, అదోవంటా? ములక్కాయలు మరి కాసిని వేసి, పులుసో పొయిమీద పడెయ్, యీ పూటకు యిల్లా లఘువుగానే పోనీయ్. ఇదిగో నేనూ స్నానం జేసి వస్తున్నా గాని, ఈ లోగా, ఓ అరతవ్వెడు గోధుంపిండి తడిప్పెట్టూ, రత్తమ్మొస్తే నాలుగు వత్తి అలా పడేస్తుంది ….. మధ్యాహ్నం పంటి క్రిందకు వుంటాయ్ ! ——‘

—వంట రసకందాయంలో ఉండగా, రత్తమ్మ ఇంత బచ్చలకూరా, ఇన్ని వామనకాయలూ, పట్టుకుని వచ్చింది. అవి చూడగానే అన్నప్ప ‘ రత్తమ్మప్పా! నాకు బచ్చలికూరంటే ప్రాణమే ననుకో , నాలుగు వెల్లుల్లి రెబ్బ లందులో రాల్చి, దిమ్మ తిరిగేట్టూ, తిరగబోతెడితే, ఆహా ! యింకా పంచభక్ష్య పరమాన్నా లెందుకు? ముక్యంగా బొబ్బట్లలో నంజుకునేందుకు! మాంచి వనరు! యింకా అలా నుంచుంటావేం ! మడి గట్టుకో! నీవుకూడా చెయి చేసుకోకపోతే, మా యిద్దరి వల్లాఅయేట్టు లేదు. ‘

మల్లాది వారు వాడిన అనేకానేక సామెతల్ని, జాతీయాలనీ, పదబంధనందనాల్నీగుది గుచ్చితే ఇలా ఉంటుంది.

ఇదో – ఇక్కడో అక్షర కాంతిపుంజం దర్శించి మురిసిపోనౌను.

‘తిండీ తిప్పలుమాని, కంపనుబడ్డ కాకల్లే తిరిగి ఎండగట్టుకుంటే ఏమౌతుంది ? ఏనుగు చిక్కింది . ఎలకపిల్లయ్యింది……. పాలల్లోబడ్డ బల్లి అయితేగాని, అయ్యకు ఒళ్ళు తెలియలా !’

“మబ్బుచాటున ఎండ మండుకు పోతున్నట్లు ఊరంతా యేదో కానరాని చుర చుర, “ —- ఎందుకా చుర చుర?— అన్నప్ప ‘భ్రష్టు’డైన సుబ్బరాముడి ఇంట భోజనం చేసివచ్చినందుకు.

“గంప సంసారం కాకపోవటంతో రాజెవరి బిడ్డరా అన్నట్టు ఆయన వాహినీగానే వెళ్ళమార్చుకుంటూ వచ్చాడు.” –అన్నప్పను గుఱించిన మాట.

“వస్తుతః ఆవిడ ససేమిరా మనిషి”

‘భావి లేని లోగిలి ఉంటుందా ?- పసుపు పూసుకోని ఇల్లుంటుందా ? కాని – కృష్ణాస్నానం అంటే మాకు జన్మానికి శివరాత్రి ! ఆ పుణ్యం నిత్యమూ లభ్యమయ్యేదా?’

బ్రాహ్మణీకం గుఱించి—

‘ఇహ బ్రాహ్మణీకం అంటావా? – ‘చిత్తశుద్ధి – సదాచారం, వినయం, వివేకం – యివి బ్రాహ్మణ లక్షణాలు ! అంతేకాని, ఫలానా యింట్లో పుట్టటం కాదు. యిప్పటి మన సంకుచిత దృష్టితోనే చూస్తే – మన లెక్క ప్రకారం, మంత్రద్రష్టలైన ఋషుల్లో, యెంతమంది బ్రాహ్మణు లున్నారు. ఒక్కడో అరో మినహాయిస్తే – తతిమ్మావా రందరూ అనులోమ ప్రతిలోమముల ఫలితాలే కద ! ‘

అలాగే ఇంకోచోట-

“మన బ్రహ్మిగాళ్ళపని అలాగే ఉంది; వేళకో తవ్వెడు గింజలు ఏరి తెచ్చుకుని, దంచుకుని బొక్కినన్నాళ్ళూ – అర్ధాకలి మీద ఉండటంతో – అర్షవిద్యలు ఒంట పట్టుకుని ఉన్నాయి : యీ జమీందారులూ, ప్రభువులూ, మడులూ మాన్యాలూ అంటూ యిచ్చి సగం చెడగొట్టారు. దాంతో రాజసాలకుపోయి, మరో సగం మనవాళ్ళు చెడ్డారు.”

‘సాహస మంటే చేతికి చిక్కిన అభాగ్యుణ్ని పట్టుకు చెండాడటం కాదు. చేసిన తప్పు తెలుసుకుని చేతులు జోడించడం !’

పాలెం అక్కడికి క్రోసున్నర వుంటుంది. ‘పెళ్ళి నడకలు నడిచినా, సంధ్యావందనం చేసినంత సేపు పట్టదు.’

కనుక, లచ్చి, చేను గట్టున చెంగు  ఎగరేసే రకం కాదు !

‘మీరేమో బ్యామ్మర్లు గందా?’

‘మరో తిట్టు మీ నోటికి రాదా ?’

‘అరుడు మెచ్చితే నరుడూ మెచ్చాడని’

‘అంతో ఇంతో నాళ్ళమధ్యనే పావలా వడ్డీకి తిరుగు తూంది’

‘పాలెంలో చీమ చిటుక్కుమంటే, గ్రామంలో చప్పుడౌతుంది!’

‘నీ బతుకు బ్రాహ్మణకూడు చేశాడు…’

‘లోకం గుడ్డిదైనంత మాత్రం చేత గుర్రం గాడిదా ఒకటవు తాయా?’

‘వెలనాటి వాడంటేనే వేయిళ్ళ పూజారి. అందులోనూ నల్లబ్రాహ్మడు  …….’

“మూడు నిద్దర్లకే ముగ్గురు పిల్ల లన్నట్లు, ఆకుదూసిన మల్లె పందిరికి మల్లే మొగ్గ మీద మొగ్గ తొడుగుతూంది ! “

“నాలుగు కులాలు అంటే అది లెక్క వరుస కాని, ఒక దానికి ఒకటి తీసికట్టని కాదు. తల్లి కడుపున తొలి చూలు బిడ్డ బ్రాహ్మడూ, నాలుగోవాడు శూద్రుడూ అవుతాడా? మనవెర్రి కాని…. “

‘అన్నప్రాశన నాటినుంచి, ఆపోసెనం దాకా అన్నీ ఏకరువు పెట్టింది ‘

‘భార్య గయ్యాళైన – ప్రాణనాథుని తప్పు ; కూతురు చెడుగైన మాత తప్పు !’

వెనకటికో  పద్యం చెప్పారుట. దాని ప్రకారం  – మహాభాష్యం చదవకపోతే పదమంజరి చదవడం దండుగ ! భాష్యం చదివాక పదమంజరి చేతపట్టడం దండుగ – అని. ఇంకా అనేకానేక ముచ్చటైన పదబంధనందనాలు చూసి మురిసిపోడానికి– అవధరించండి!

“కూసు చిప్పిళ్ళు , సన్నాయి నొక్కులు , గారాల కూచి , నిత్య పెళ్ళికూతురు , సకల మంచివాడు, పప్పు ఎనిపినట్టు ఎనపటం , చిన్నెలూ చిద్విలాసాలూ , యేడుపాయల జడలల్లటం , పాత్రసామానుతో పాటు  పడి ఉండటం , లుసుకూ లుసుకూ పోయి రావటం , వూళ్ళో ఉప్పూ పత్రి పుట్టటం , వెన్నెల్లో మల్లె పువ్వల్లే ఉండటం , సాయలా పాయలాగా మాట్లాడటం, కస్సుమనకుండా కన్నబిడ్డను పలకరించినట్టు, మనిషి కడుపు నిండేట్టు ఉండటం, నవ్వితే ఉరుం ఉరుమినట్లే, మాట మల్లెమొగ్గల సౌరు, –వగైరా వగైరా రామకృష్ణశాస్త్రీయమైన పలుకుబళ్ళు ఎన్నో ఎన్నెన్నో.” ఆయన భాష అధిక చక్కనిది, ఆంధ్రికి వరమైనది.

ఇంకా  చూడండి….

“నిండు ముస్తాబు మీద ఉంటుంది. మడి గట్టుకున్నంత సేపైనా ఘుమ ఘుమ లాడుతూ ఉండాల్సిందే. “

“నాలిక మీద తేనె ఉంటే నరుడికి మంచి, మనసులో పూవులుంటే, దేవుడికి మంచి!”

“మనతోటలో తులసిమొక్కను తెచ్చి యేసుకున్నా మనుకోండి; దానికి పూలూ కాయలూ లేకపోతేనేం—– పూజ్జేసుకునేందుకు పనికిరావడంలా ? మామిడి అంటులు అల్లా దిగ్గాయించడమేం? నన్నిలా చిగుళ్ళతోనే సరిపెట్టుకొమ్మంటాడేం? అని తగూలాడుతుందా ! మన పుటకిందుకూ అని , మనం దెలుసుకుంటే చింతే ఉండదు !”

“అడవి పక్షుల కెవ్వడాహార మిచ్చెను, మృగజాతి కెవ్వడు మేత పెట్టే— అని పెద్ద లన్నారు. “

“ఏటికేడాదీ పురాణం జెప్పేవాడికి, ఎదుటివాడి కునుకుపాట్లేం దెలుస్తాయి ?”

“మనిషి మళ్ళీ నీళ్ళోసుకున్నట్టుంది ; పూవుల పొట్లం లాగుంది !’’

“యింటి వెనకాల యింగువ చెట్టుంటే యల్లంతా ఘుమ ఘుమేనే అమ్మాయ్”

“ఆనాడు అక్బరు సాయిబు సూర్య నమస్కారాలు చేయగా లేంది, అన్నీ తెలిసిన మావారు శూద్రుల యింట ఆపోసనం పుచ్చుకుంటే ఏం దోషమా అంట!” –అంటుంది అన్నప్ప యిల్లాలు. రంగడికి రామశేషుకు మధ్యనున్న ఆత్మీయతను అపార్థం చేసుకున్న రామశేషు భార్య అమ్మడితో రంగడు – “అక్కయ్యమ్మా! నేను గొడ్లమధ్య పుట్టాను, గొడ్లలో పెరిగాను—కాని గొడ్డులాగా పెరగలా! అదే నాకూ—నీకూ తేడా! “

మాటకు మాట జోడించుకుంటూ పోయి ఓ  చిత్రమైన అందాన్ని ఆవిష్కరించటం.

“ఇంటి దగ్గర నుంచేనా ?”

“కాక?”

“కాకో — నిక్కాకో ! నీకు తెలియాలి.” — ఇదో మచ్చు తునక. ఇంకో బంగారు మొలక.

“ఒకరు చెప్పాలా? పాలెం పాలెం కోడై కూస్తుంటే…”

“ పాలెంలో కోడి కూసినా,బ్రాహ్మణవాడ నిద్రలోనే ఉంది.”

ఇప్పటి  వరకూ మల్లాది వారి పలుకుబడులను  వరుసగా వ్రాసుకుంటూ పోయాను. దీనివల్ల పాఠకులకు మన తెలుగు పలుకుబడి, దానిలోని నానుడి, నుడికారం అందచందాలు అవగత మవుతాయని. ఇంక ఇప్పుడు ఆయన వ్రాసిన రెండు మూడు సంఘటనలని యథాతథంగా వ్రాస్తాను. వీటిద్వారా వారి రచనలోని వేగం, కథాకథన చాతుర్యం పాఠకులకి అనుభవం లోనికి వస్తాయి.

సీతారామాచార్యులవారని  ఓ ధన్వంతరి లాంటి వైద్యులగురించి ఇందులో వివరంగా వుంటుంది. ఆ సంఘటన గురించి ఉదాహరిస్తాను.

“అన్నప్పగారూ. మీరు యింటికి వెళ్ళేప్పుడు మీ నవ్వు కాస్త యిక్కడ దిగవిడిచి వెళ్ళండి. ఆరగారగా నవ్వుతుంటే ఆరోగ్యం మరింత బాగుపడుతుంది” . అది ఓ పట్టానికి వినిపించుకుని, అన్నప్ప – ‘అంటే యిప్పుడు నీ ఆరోగ్యానికి వచ్చిన లోపమేమిటి ?

“ఇప్పు డేం లే దనుకోండి !”

“ఒకప్పుడు మటుకు?”

“ఏం సుబ్బన్నా, చెప్పనా?”

“ఓ మా రాజు బిడ్డలాగా! ఇప్పు డా యెద్దడి తీరిందిగా- అన్నప్పగారూ! శేషయ్యగారు చెప్పడం కాదు, నేం జెప్పుతా వినండి! యీ కుర్రాయినకి పెళ్ళామంటే ప్రాణం! మా అమ్మాయిగారికి, యింకా చిన్నతనం; వుత్తి పుణ్యానికి, ఏదో మాటామాటా పెంచుకుని, నవ్వులతో పోనిచ్చే దాన్ని నారసాల దాకా తెచ్చుకున్నారు: యిద్దరికీ గుక్క తిప్పుకోవడం చేతకాలేదు: యిప్పుడిన్ని కబుర్లు చెబుతూ యింత నిరవాకం జేస్తున్నాడే యీ బంగారుతండ్రి – తానేం జేశాడు ? చేతనైతే తనిల్లు తాను దిద్దుకోవాలి- లేదా యీ ముసిలాడికి చెప్పాలి  –

“ అమ్మా అయ్యకు జెప్పేందుకు, మొగ బిడియం గావచ్చును: నాతో చెప్పడానికేం – కన్నామన్న పేరే వారిది కాని, పెంపకం నాదేకంద !

ఉహుఁ చెప్పలా! –

“మీసం మొలకేసిందిగా. మొనగాడైనాడు!

“తిండీ తిప్పలుమాని, కంపనుబడ్డ కాకల్లే తిరిగి – ఎండగట్టుకుంటే ఏమౌతుంది ? ఏనుగ చిక్కింది . ఎలకపిల్లయ్యింది. అప్పుడన్నా మేలుకోవచ్చా? పంతా లాయెను !…. పాలల్లోబడ్డ బల్లి అయితేగాని, అయ్యకు ఒళ్ళు తెలియలా ! సీతారామాచార్ల దగ్గిరకు పోయినాం: అయ న్నరం నరం పట్టి చూసి, అహ! ఓహో – అనుకుంటూ అటు యిటూ పచారుచేసి, రవంత కూనిరాగం దీసి, వచ్చి వెన్నుమీద ఒక్కటి చరచి, ‘ఓరి భడవా, మమ్మల్నందరినీ మించేట్టున్నావురా!’ అంటూ ‘ఒరే సుబ్బన్నా, మాకు, వచ్చిన వ్యాధి నయం జేయటం ఎలాగో, తగు మాత్రం తెలుసు, వీడికి వ్యాధి రప్పించుకోడ మెలాగో – తెలిసిందోయ్! ఏంరా శేషూ, ఏమిటి నీకీ తెగులు?’ అని ఓ గదమాయింపు గదమాయించే సరికల్లా, బయటపడక తప్పింది కాదు; మాచేత వాగిందే వాగించి, ఏమాకళింపు జేసుకున్నాడో, మళ్ళీ కూనిరాగం అందుకున్నాడు; అలా కుసింత సేపు గునిసి,- నను బ్రోవమని చెప్పవే,- సీతమ్మతల్లీ, అని పాటెత్తుకున్నాడు: ఆ మనిషి అలా పా టెత్తుకున్నా డంటే, వచ్చినవాడి ఖాయిలాకి రాంకీర్తన పాడేస్తున్నా డన్నమాట! అదే కొండగుర్తు: వేళ్ళు మడిచి చిటికె వాయిస్తూ, ఆయన పాడుతుంటే,- ఎదటివాడు అప్పటికప్పుడే సగం కోలుకుంటాడు; ఆ – అదేమందూ, అదే మంత్రం ఆ మనిషి వైద్యం అదోమాదిరి! –

“అలా పాట ఆసాంతం పాడేసి, సీతమ్మ తల్లిని ముమ్మారు తలచుకొని, ఎదురుగుండా కూచుని, ఏమన్నా డంటే —-

‘చీకటితో బలరాముడు

ఎండెక్కితే  చిన్నికృష్ణుడు,

మధ్యాహ్నం భోజరాజు

రాత్రికి  రాయలవారు—

‘ఒరే, నాయనా, ఓ యేడాదిపాటు యిలా కానీయ్! తరువాత అదే అలవాటై ఊరుకుంటుంది. పచ్చటి నీడను పగటి నిద్ర అలవాటుచేసుకో ! వెన్నెల్లో కూచుని హాయిగా సంగీతం పాడుకో! బద్ధకమేసింది, ఒక్క గుక్కెడు మంచినీళ్ళు — గుక్కెడే తాగి బబ్బో.

‘శేషూ, రావణబ్రహ్మకు లంకంత లోగిలుండగా ఆ ఒక్క మనిషీ ఉండేందుకు చోటు లేకపోయిందా? ఆవిడ ఉండనందా? –

‘అది కాదురా అసలు సంగతి;

‘అతగాడు వేత్త కదా? లంకానగరం రాగద్వేషాల మీద నిర్మించిందాయెను. కనుక వాటికి అంటి ముట్టకుండా ఉండేట్టు అశోకవనం నిర్మించి, అక్కడ ఆ తల్లికి విడిది కలిపించి సేవించుకున్నాడు.

‘నాయనా మనందరిదీ, రావణబ్రహ్మ మతమే;

‘ఆ తల్లి ఉన్నచోట అశోకవనం!

తనువుకై నా, ధరణికై నా యిదే భేషజం!’

యిలా  అనేసి ఊరుకున్నాడు.

“మాకు అందులో ఒక్కముక్క అర్ధం కానిదే! ‘ఆచార్లగారూ, చీకటితో బలరాము డేమిటి, చిన్ని కృష్ణు డేమిటి? ఏమిటి దాని కమామీషు,’ అని అడిగేశాను.

“ఆయ నన్నారుగందా! ‘ఒరే, మరేం లేదురా! నిద్దర్లేవంగానే పుడిసెడు తేనె పుచ్చుకోవడం – ఎండెక్కినాక వెన్నముద్ద! అక్కడికి ప్రాతఃస్మరణ అవుతుంది, భోజరాజువారు, పెసరపప్పు గుత్తంగా వండించుకుని, నెయ్యోడుతూ తినేసి, గడ్డపెరుగు, ఫలహారం జేసేవాట్టా! రాయలవా రున్నారే, ఆయనకు రాత్రిపూట వేరే తిండీ తిప్పలూ అవసరం లేదు. పాలమీద చెత్త యింత తినేసి, హాయిగా పడుకునేవాడు.

‘ఇదీ పద్ధతి. యిదీ పథ్యం! యీ సాలుకు యిలా జరుపుకుపోతే, వచ్చేయేడు కాముడు ఖజ్జూరపండు దినొచ్చు.

‘ఒరే శేషూ, యీ వెర్రి నీ మంచికే వచ్చిందిరా, ఒంటరొంటరిగా, అఘోరించదలచుకున్నప్పుడు, యింటి పట్టున ఎందుకూ? నేం జెప్పినట్టూ, ఆ పై న్నీకు తోచినట్టూ చెయ్!

‘మామిడికోళ్ళ దగ్గిర, మనకో మూడెకరాల తోటుంది; దాన్నంటే ముప్పై ఎకరాల బంజరూ! అదీ యిదీ  పనగలిపి పచ్చబడితే, అక్కడున్న పదిమందీ మన కళ్ళ ఎదుట చల్లగా ఉంటారు: అంతమేరా నీకు సర్వదుంబాలాగా, హస్తార్పితం జేస్తున్నాను. ఇహ ఆ పని మీద ఉండు!’ అని మాకు సెలవిచ్చి, పదిబారలు వచ్చినాక నన్ను మళ్ళీ వెనక్కి పిలిచి ,- ‘ఒరే సుబ్బన్నా, వీడిని యిక్కడికి లాక్కురావడం అన్నిందాలా మంచిదే అయింది సుమా! మరి ఏ సంచికట్టుగాడికో చూపించి ఉంటే శ్వేత పాండువనో, కాకపోతే రాజయక్ష్మమనో, పుస్తకాల్లోంచి ఏవో దిక్కుమాలిన పేర్లు వెదకిపెట్టి పుఠం ఆర్చేవాడు. ఒరేయ్, దొబ్బుడాయ్ అనేది కావటానికి గొప్ప జబ్బు! అది వీడికి పట్టుకుంది. అందుకు సందేహం లేదు.!

‘దీనికి, అనుపానమే ఔషధం !

‘నే నింత చేతకాని వాణ్ణయితినేమా అని, లో లోపల గింజుకోడంతో, యిలా లోచెడ్డాడు. చేతినిండా, చిత్తం వచ్చిన  పనంటూ ఉంటే నిబ్బరం, దానంతట అదే అబ్బుతుంది. మళ్ళీ నిమ్మకు నీరెత్తుతుంది; యిదీ అసలు కిటుకు! యీ విషయం రెండో కంటివాడికి తెలియనీయవద్దు. వీడి క్కూడా చెప్పద్దు. నీవు మట్టుకు అంటిపెట్టుకుని ఉండు.

‘నేను, యీపూట అక్కడికి వెళుతున్నాను.

‘మీరు శనివారం తెల్లారిగట్ల బండీ కట్టుకున్నారా అంటే, అట్టే ఎండెక్కకముందే చేరుకుంటారు. వండుకునేందుకూ వార్చుకునేందుకూ అక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి మన పర్ణశాల ఉంది. మనిషి సాయం అంటావా? చెదురువాటుగా ఓ యాభై కుటుంబాల దాకా ఉన్నాయి. చెప్పిన పని చేతులు కట్టుకుని చేస్తారు. దూకూ అంటే దూకేస్తారు: వాళ్ళందరూ మన బలగం! చక్కగా కాలక్షేపం అవుతుంది. ఒరే, వాడి వళ్ళు బాగుపడాలంటే, నీవో ఏడాదిపాటు, వళ్ళు దగ్గిరపెట్టుకు ఉండాలి. యిహ పోయిరా, పో.’- అన్నారు. సరేనని యింటికిపోయి కావలసిన బట్టా పాతా పట్టుకుని అనుకున్న నాటికి యిక్కడకు వచ్చి పడ్డాం –‘

ఇంకో  చిన్ని సంఘటన తో ముగిస్తాను కృష్ణాతీరం పరిచయాన్ని. ఆచార్లవారూ అన్నప్పా కలసి బండి దగ్గరకు  వస్తారు. ఆచార్లవారు అన్నప్పదగ్గిరకు  వచ్చి, “ఏంరా, వెళ్ళి రమ్మంటావా?” అన్నారు.

“రమ్మనమనే, అంటున్నాను. మీరు కూడా.—-“

“ఒరే, నన్ను మీ రంటా వేమిరా ?ఇక్కడిందరున్నారు చూడు! ఒక్కనా డనలే దంత మాట. అన్నను తమ్ముడు పట్టుకుని  ‘మీరు’ అన్నాడంటే, ఎప్పు డంటాడు? ఓ చెంపను మునసబు కోర్టులో దావా నడుస్తున్నప్పుడు! అందుకోసమనే రోజూ ఒక్క పర్యాయం తేనె పుచ్చుకుంటే, నోటికి అనవచ్చినమాటేదో అనకూడని మాటేదో తెలిసివస్తుంది. అవునుగాని, నీవు ఆ రామయ్య తండ్రిమీద ఒంటికాలిమీద లేస్తుంటావట! ఆ తల్లి ఏమనుకుని పోతుందో, అనే ధ్యాసవుండద్దురా ! బిడ్డ తండ్రి మీద ఎదురుతిరగటం ఏ తల్లి హర్షిస్తుందిరా ?—-

“నాయనా, మనం మనుషులం! దేవతల తప్పులెన్నేందుకే బ్రహ్మ యిచ్చా డింత తెలివి ! మన అమ్మ మనకు దేవత ! మరో దైవం మనకు లేడు. అక్కరలేదు  ఆమాట నిజమే  కాని రాఘవుడు మన దైవానికి దైవం కాదుట్రా! అమ్మ అంటే, బిడ్డకు లోకువ కనుక, పిలిచినప్పుడల్లా పలుకుతుంది. మనకు తల్లి దగ్గర అంత గారాబం లేదనుకో, అయితే మటుకు మనం అంటే, మనమనం అమ్మా అని, ధ్వనించినప్పుడల్లా నాన్నా అని ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆ మాట కాదంటావా? ఆ తల్లిని నమ్మినవాడికి లోచూపు లేదంటావా ? లోపించిందంటావా? జయ్ రఘునాయక ! జయ్ జానకీ రమణ !ఒరే అన్నప్పా ! యీ నటన కూడా ఒక లీలావినోదమే! శ్రీరామ నామం హృదయంలో పదిలంగా దాచిపెట్టుకుని పైకి యిదో నాటకం ఆడుతున్నావూ? అంతేకాదూ?…..”

ఆచార్లగారు  ఇలా లాలన చేస్తుండగా, అన్నప్ప  కనులనీరు నిండినది: అమితానందాన,—– మనిషి గజగజలాడి పోయినాడు. తెప్పరిలి, నవ్వుతూ అంతలో అంతకంతగా పొంగి పోయినాడు. “ఔనన్నా, పిల్లవాడు తాయెల్లం దాచుకున్నట్టు దాచుకున్నాను. నేటికి నా బండారం బట్టబయలు చేశావ్ !జయ సాకేత నిలయ !అంటూ చిందులు తొక్కుతున్నాడు అన్నప్ప.

‘రామహో సీతా రామహోఁ- ‘అంటూ రాజప్ప గానాని కందుకున్నది. — అందరూ ఒక్కక్షణం ఆ తన్మయత్వంతో ఉండి , —మన ధోరణికి వచ్చారు.

ఆచార్ల  వారు, ‘అమ్మా సీతమ్మా!’ అని గర్జించి బండిలోనికి ఎక్కి కూర్చున్నారు. బండి పరుగందు కున్నది. బండి కనుమలుపు తిరిగే దాకా, ఎవరూ కదలలేదు. ఆపై ఎవరిదోవను వారు తప్పుకున్నారు.

తెలుగు  భాషలోని అందచందాలను ఆకళింపు  చేసుకోవాలంటే కృష్ణాతీరాన్ని  చదవాల్సిందే.

You Might Also Like

29 Comments

  1. narasimharao mallina

    వ కార యకారాలతో ప్రారంభం అయ్యే తెలుగు పదాల నెన్నంటినో అన్నమయ్య తన సంకీర్తనలలో చాలా విరివిగా ఉపయోగించారు.అందుచేత మనం చిన్నప్పుడు నేర్చుకొన్న ఆ రూలును మనం నిక్కచ్చిగా పాటించాల్సింది కాదని నా కనిపిస్తున్నది.

  2. పుస్తకం » Blog Archive » 2010లో నా పుస్తకాలు

    […] పాలన – పాలగుమ్మి పద్మరాజు 3. కృష్ణాతీరం – మల్లాది రామకృష్ణశాస్త్రి 4. […]

  3. పుస్తకం » Blog Archive » మృత్యువుకు జీవం పోసి..

    […] మల్లాది రామకృష్ణశాస్త్రి గారి కృష్ణాతీరం ఎలా ఉంటుందీ అంటే, ఆ జాగింగేదో, […]

  4. పుస్తకం » Blog Archive » నన్ను చదివే పుస్తకం..

    […] మల్లాది రామకృష్ణశాస్త్రి గారు, కృష్ణాతీరంలో! మనసు అంతరార్థం తెల్సుకోవటం కూడా […]

  5. Ravindranth

    Hello

    For those who could not read due to poor eye sight, and for those who can not hold a book due to old age, Audio Books are welcome relief.

    Let the old generation who love Telugu be benefited by the technology.

    Manavado, manavaralo koni ichina walkman lo M S Ramarao garu vinipinche Sundrakanda vintoo walking chese vaallu, audio casettes dwaara suprabhatham vintoo no, aditya hrudayam vintu no madi kattukoni vanta chese baammalu, manchi kadha lu kaburlu, vintoo kothi kommachu laadukovatam , ilaanti drusya lu chaala telugu logilla lo meee ku inka koncham kalam lone jaraga pothunnadi.

    “వయస్సంటే వంటిమీదకు వచ్చింది కాని మనస్సింకా మనుగుడుపుల్లోనే ఉం దన్నాట్ట వెనకటికి నా వంటి వా డెవడో”

  6. Ravindranth

    Antha manchi ghuma ghuma laade inguva poputo unna vyasam chadivina tharuvaatha, naaku konni kaburlu mee andari tho panchukovaalani unnadi.

    Midhnam katha vochi vo 12/ 13 samvastaralu daatindhi, aaaa kadha kadhanam chaduvuthe, malladi gaari bhassha vaarasatva lakshanaalu inka endi poledani ani pistunnadi.

    Eeee madhya vachina Potturi Vijayalakshmi gaari kadha Athidi Raakshalu,
    chaala kalam krindata vachina Illeramma katha lu, mana telugu loni malle poovu ni kotha tharam vaaru anandinche telugu loni Lilly poovuni jatha katti ranjimpa chestunnarani ani pistunnadi.

    Manchi baasha ku je je je lu, manchi kathaku la ku je je je lu

  7. uma

    mahadbutam malladi telugu.padabandanalo kammati hasyam vundi. neti hasyam lo asllelata vuntudi. kani naati hasyam tene teepila vundi

  8. narasimharao mallina

    @మాలతి గారికి
    మీ పరిచయం చదివి నా పుస్తకాలను తిరగవేస్తే నా దగ్గఱ కూడా మల్లాది వారి కథల పుస్తకం 2వ వాల్యూమ్ దొరికింది. కాని వారి కథల ఇప్పటికి కొన్ని మాత్రమే ఎప్పుడో చదివాను , అన్నీ ఇప్పటివఱకూ పూర్తిగా చదవలేదు. ఎందుకంటే వాటిని చదవాల్సిన విధంగా(కామాలూ, విరామచిహ్నాలతో సహా)చదవటానికి ఇంకా సమయం కుదరలేదు కాబట్టి. అవును. తెలుగు భాషను నేర్చుకుందామని అనుకునే మనబోటి వారికి అవి పాఠ్యగ్రంథాలు లాంటివే.
    @కొత్తపాళీ గారికి
    తాతగారి కథలూ శ్రీనాథుడి కథలూ నా దగ్గఱ లేవండీ, వాటికోసం ప్రయత్నం మొదలు పెట్టాను. మీరు నేనూ మన మందరం కలసి చేయాల్సినది కీర్తి శేషులు మల్లాది వారికి శత కోటి వందనాలు అర్పించటమే.
    @సుజాత గారికి
    అవునండీ.ఎంత తియ్యని తెలుగో మనది.
    @జంపాల చౌదరి గారికి
    మీరిచ్చిన సమాచారానికి నా ధన్యవాదాలు. వారి కథల మొదటి వాల్యూం ( కృష్ణా తీరం నవలతో కలసి ఉన్నది) నా దగ్గఱ లేదు. దానిని కూడా వీలు వెంబడి సంపాదించి చదవాలి.
    @శ్రీనివాస్ ఉరుపుటూరి గారికి
    ఆనందంతో ధుమ ధుమ లాడటం కాదనుకుంటా, సంతోషంతో ధుమ ధుమ లాడాడు అని ఉందని జ్ఞాపకం.ఇటువంటి తెలుగు మాట్లాడేవారూ, రాసేవాళ్ళూ ఎవరో నూటికీ కోటికీ ఒకరైనా ఉంటారనే నాకు అనిపిస్తుంది. జాను తెలుగు గుఱించి నాకూ పూర్తిగా తెలుసుకోవాలని ఉంది.ఆడియోగా వస్తే సంతోషించే వాళ్ళలో నేనూ ఒకడిని.
    @సుజాత గారికి
    ఆడియో లాభాలు ఆడియోకూ ఉంటాయండి.కృష్ణాతీరం విశ్వనాథ్ గారి దర్శకత్వం లోగానీ, బాపూ వెంకట రమణల ద్వారా గానీ సినిమాగా ఇంతవరకూ ఎందుకు రూపు దిద్దుకోలేదా అని నేను మథన పడుతుంటాను. అలా సినిమాగా మారి మనలను అలరించే అదృష్టం ఎప్పటికైనా సాధ్యమైతే బాగుంటుందనేది నా ఆకాంక్ష.
    @పరుచూరి శ్రీనివాస్ గారికి
    వి యే కే రంగారావు గారి ఈ మెయిలు చిరునామా దయచేసి వీలైతే పంపించగలరు.
    @సౌమ్య గారికి
    రాసిన వారు కాదండీ, వ్రాసిన వారు అని ఉండటం సరియైనది. రాకేశ్ గారి కామెంటును చూసే ఉంటారనుకుంటాను. సరి చేయగలరు. వీలైతే నా నరసింహ సైటుకు లింకు ఇవ్వగలరు.పొరపాటును ఎత్తిచూపినందుకు అన్యధా భావించరని తలుస్తాను.
    అందరికీ సమాధానాలు ఆలస్యంగా వ్రాసినందులకు క్షంతవ్యుడిని. దీనికి కారణం నా కలనయంత్రం చాలా చాలా స్లోగా మారి పోయి నన్ను ఇబ్బంది పెట్టడమే.

  9. సుజాత

    Dear Sailaja,

    please use http://www.lekhini.org to write telugu using computer. Or try http://www.baraha.com !

    Enjoy writing telugu!

  10. sailaja

    hi
    how to write in telugu using computer can you please guide me

  11. సౌమ్య

    ఈపుస్తకం నేను చదవలేదు కానీ, ఇక్కడి చర్చ గురించి నా అభిప్రాయం:
    ఇంతకీ, ఆడియోలో భాషనీ, భావాన్నీ మామూలు జనాలకి ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పొచ్చు అని నాకనిపిస్తుంది. భాషపై మరీ ఎక్కువ పట్టు లేని నాబోటి వారికి ఆడియో పుస్తకం ఉంటే లాభమే కానీ నష్టమేమీ ఉండదని నా అభిప్రాయం.
    Srinivas Vuruputuri అన్నట్లు – “అలా చదవటం తెలియని వారికి, సమర్థులెవరైనా చదివితే, విని గ్రహించగల సులువు ఉంటుంది కదా! ” – Exactly!

  12. Srinivas Vuruputuri

    @సుజాత: మల్లాది వారి తెలుగు విలక్షణంగా ఉంటుంది. విన సొంపుగా ఉండే ఉంటుందని అనుకుంటాను. అలాంటి జాను తెలుగు మాట్లాడే వాళ్ళుంటే, “వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుందో” వినాలనిపించి అన్నానా మాట! మల్లిన నరసింహారావు గారు అన్నట్లు, “శాస్త్రిగారి రచనని చదివేటప్పుడు ఒఠి అక్షరాలనే కాదు, ఫుల్స్టాపులు, కామాలూ, చిన్ని చిన్ని మధ్య మధ్యలో గీతలూ, సెమికోలనులూ, ఫ్రశ్నార్థకాలూ, ఆశ్చర్యార్థకాలతో సహా చదవటం నేర్చి ఉండాలి. అప్పుడే మనకు ఏ సంభాషణ ఎక్కడ మొదలయిందీ, ఎక్కడ చివరికొచ్చిందీ, ఎవరు ఎవరితో ఏమేమన్నారూ వగైరై వగైరా వివరంగా తెలుస్తాయి.”

    అలా చదవటం తెలియని వారికి, సమర్థులెవరైనా చదివితే, విని గ్రహించగల సులువు ఉంటుంది కదా!

  13. Sreenivas Paruchuri

    నరసింహరావు గారు:

    > “చదవటం చేతకాక. ఎందుకంటే శాస్త్రిగారి రచనని చదివేటప్పుడు ఒఠి అక్షరాలనే కాదు, ఫుల్స్టాపులు, కామాలూ, చిన్ని చిన్ని మధ్య మధ్యలో గీతలూ, సెమికోలనులూ, ఫ్రశ్నార్థకాలూ, ఆశ్చర్యార్థకాలతో సహా చదవటం నేర్చి ఉండాలి.”

    ఈ పై వాక్యాన్ని అర్జంటుగా వి.ఎ.కె.రంగారావుగారికి పంపించండి. ఆయన చాలా సంతోషిస్తారు 🙂

    చర్చను మల్లాదిగారి పుస్తకంనుండి పక్కకు మళ్ళిస్తున్నందుకు క్షంతవ్యుణ్ణి. సుజాతగారు “రాయడంలో ఒక సొగసు,పలుకుబడులు,Pun లు,నిగూఢమైన వ్యక్తీకరణలు(చదివితే గానీ అర్థం కానివి) ఉంటాయి. అవన్నీ ఆడియోలోకి తెప్పించడం అసాధ్యం” అన్నారు. ఆ వాక్యంతోను, నిజానికి పైనున్న పూర్తి కామెంటుతోను విభేదిస్తాను. వినడం, చదవడం రెండు వేర్వేరు ప్రక్రియలైనా (Theres tons of published research on oral and written literatures and I need not repeat all that here.) రాయడంలోని “సొగసులు,పలుకుబడులు,Pun లు,నిగూఢమైన వ్యక్తీకరణలు” కూడా ఆడియోలోకి తెప్పించడం సాధ్యం అని నేననుకుంటాను. తెలుగులో మనకున్న ఆడియో పుస్తకాల సంఖ్య చాలా తక్కువ కావటంవల్ల ఉదాహరణలివ్వలేను కానీ, ఇంగ్లీషు, జర్మన్‌భాషల్లో బోలెడు ఉదాహరణలు చెప్పగలను.

    — శ్రీనివాస్

  14. సుజాత

    శ్రీనివాస్ వురుపుటూరి గారూ,

    ఆడియో గా తెలుగు పుస్తకాలు ఎందుకు రావాలండీ అసలు?( తెలుగు పుస్తకాలు చదవలేని వారి కోసం..అని జవాబైతే..ఊహూ! తెలుగు చదవడం నేర్చుకుని చదువుకోవాలి). చదవడంలో ఉన్న ఆనందం వినడంలో ఉంటుందా? అదీ కాక రాయడంలో ఒక సొగసు,పలుకుబడులు,pun లు,నిగూఢమైన వ్యక్తీకరణలు(చదివితే గానీ అర్థం కానివి) ఉంటాయి. అవన్నీ ఆడియోలోకి తెప్పించడం అసాధ్యం! కోతి కొమ్మచ్చి ఆడియో విషయంలో కూడా నా అభిప్రాయం ఇదే! ఇంకా దాన్ని చదివింది బాలూ కాబట్టి కొంతలో కొంత నయం!

    ఇదివరలో రేడియోలో నవలలు చదివి వినిపించే ప్రక్రియ ఉండేది. శారదా శ్రీనివాసన్ గారు చదవడం విన్నాను నేను. కానీ అది మామూలు సాదా సీదా నవలలకు పనికొస్తుంది కానీ ఇటువంటి విలక్షణమైన పుస్తకాలకు కాదు.

    ఇప్పటికీ ఇలాంటి తెలుగు రాసేవాళ్ళూ, మాట్లాడే వాళ్ళు ఉన్నారా?..ఉంటారు ఎక్కడో కొందరు!వాళ్ళకి ఆడియో అక్కర్లేదు. ఆడియో అవసరం అయినవాళ్ళకు ఈ తెలుగు అర్థం కాదు.

    ఏమంటారు?

  15. Srinivas Vuruputuri

    “కృష్ణాతీరం”లోనే అనుకుంటా -“ఆనందంతో ధుమధుమలాడాడు అనే పదబంధ ప్రయోగం చూసాను.

    మల్లాదివారి కథలు జాను తెలుగు కథలు అంటారు కదా! “జాను తెలుగు” అంటే? ఇది ఓ తరహా మాండలికమా? శ్రీపాద వారి తెలుగు కూడా జాను తెలుగేనా?

    ఇప్పటికీ ఇలాంటి తెలుగు రాసేవాళ్ళూ, మాట్లాడే వాళ్ళు ఉన్నారా?

    కృష్ణాతీరం – ఆడియో పుస్తకంగా వస్తే బావుంటుంది కదా?

    1. సురేశ్ కొలిచాల

      ఉరుపుటూరి గారు (మీ ఇంటి పేరు మార్చిరాసినందుకు క్షమించండి, కానీ తెలుగు పదాలను వు-కార, యి-కారాలతో ప్రారంభించి రాయలేను)

      జాను తెలుగు అంటే అందమైన తెలుగు. కానీ తరువాతి రోజుల్లో సంస్కృతభూయిష్టం కాని అచ్చ తెలుగు రచన అన్న అర్థంలో కూడా జాను తెలుగును వాడారు. జాను- అంటే సొగసైన, అందమైన అన్న అర్థాలు ఉన్నాయి కదా. కన్నడలో జాణు/జాను దీనికి సోదరపదం. కన్నడలో జానుకన్నడ, జాణ్ణుడి (అందమైన నుడి), తమిళంలో చెందమిళం (centamil) అన్న పదబంధాలు దీనికి సంబంధించినవేనని నా అభిప్రాయం. అదే నిజమైతే, ఈ ద్రావిడ పదాలకు మూల ధాతువు *చెన్- =మంచి, అందమైన అని చెప్పుకోవచ్చు.

      సురేశ్.

    2. Srinivas Vuruputuri

      అవును కదూ, మా ఇంటిపేరు “ఉ”తో మొదలవ్వాలి.

      జాను తెలుగు అనే మాటను చాలా కొద్దిమంది రాసే/మాట్లాడే తెలుగు గురించి విశేషణంలా వాడగా విన్నాను. నన్నెచోడుడు, మల్లాది వారు, శ్రీపాద వారు… అందుకనే ఆ సందేహం.

      చెన్/సెన్ అనే ధాతువుకు ఎరుపు అనే అర్థం ఉందా? తిరుమల రామచంద్ర గారి నుడి-నానుడిలో అలాగని చదివిన జ్ఞాపకం.

    3. సురేశ్ కొలిచాల

      నేను కూడా బెంగుళూరులో IISc లో చదువుతున్న రోజుల్లో ಚೆನ್ನಾಗಿದ್ದೀರ అంటే “ఎర్రగా ఉన్నారా” అంటే “ఆరోగ్యంగా ఉన్నారా” అన్న అర్థమేమో అని అనుకునేవాడిని. తిరుమల రామచంద్ర గారు ఏం రాసారో నాకు తెలియదు గాని ఎఱుపు అని అర్థం ఉన్న పదానికి మూల ధాతువు *కెన్-. తెలుగులోను తమిళంలోనూ తాలవ్యీకరణ అనే ధ్వనిపరిణామం ద్వారా కి-/కె- లు చి-/చె-లుగా మారాయి. కొన్ని ఉదాహరణలు: కెవి > చెవి; కెంపు > చెంపు; కిళి > చిలిక > చిలుక.

    4. Sreenivas Paruchuri

      Srinivas-gaaru: I don’t think that there is so far any consensus on the word “jaanu telu(nu)gu”. The debate is quite old, kicked off by Palkuriki Somanatha’s claim that he was going to write in “jaanu …”. There are a few essays published in “bhaarati” (and elsewhere) in 1930s which you may like to check.
      Regards, — Sreenivas

    5. సురేశ్ కొలిచాల

      @Sreeni: I think it is a controversy only because none of the participants has the background of comparative lingustics. I don’t see any controversy. — Regards, Suresh.

    6. Srinivas Vuruputuri

      శ్రీనివాస్ పరుచూరి గారికి

      భారతి పత్రిక సంచికలు నెట్‌లో దొరుకుతాయా? ఆంధ్రభారతి శాయిగారి ప్రాజెక్టులలో “భారతి పత్రిక” ఒకటి అని చెప్పినట్లు జ్ఞాపకం…

      సురేశ్ గారికి

      నుడి-నానుడి లోని “చెంబూ కంచం” అనే మొదటి వ్యాసంలో తిరుమల రామచంద్ర గారిలా అన్నారు: “చెంబును మీటండి! ఏం చెబుతుందో వినండి! సెమెటిక్ జాతులు రాగిని మొట్టమొదట కనిపెట్టాయి. బహుశా ప్రపంచంలోకల్లా మొదటి లోహం రాగేనేమో! … తమిళ్‌లో దీనిన్ “సెంబు-సెప్పు” అంటారు. ఎర్రనిది అని దీని అర్థం. చెహప్పు, చెవ్, సెన్, కెన్, కెంపు, చెంగ్, చెన్ అనే పదాలన్నీ యీ జాతివే. ఎర్రగా మెరుగ్గా వుండేదంతా అందమైనదనే భావం ప్రబలిన కాలంలోనిదే చెన్ను అనే పదం. ఇది లాక్షణికంగా అందమనే అర్థంలో నిలిచింది…”

      శ్రీనివాస్

    7. సురేశ్ కొలిచాల

      మీరు ఉటంకించిన తిరుమల రామచంద్ర వారి వ్యాఖ్యలోని ప్రతి వాక్యం నాకు ఇబ్బందికరంగానే ఉంది. ఆయన భాషాశాస్త్రవేత్తగా కాక భాషల గురించి తెలిసిన సాహితీవేత్తగా ఎందుకు మిగిలిపోయారో ఇప్పుడు తెలుస్తోంది.

    8. Srinivas Vuruputuri

      I guess, we will need to take this offline. We moved too far away from the original post. 🙂

    9. రవి

      సురేష్ గారు, రామచంద్ర గారు సాహితీవేత్త మాత్రమే, శాస్త్రవేత్త కారు. ఆయన చేసినవి చాలా వరకూ ఊహలేనని ఆయనా ఒప్పుకున్నారు.

  16. జంపాల చౌదరి

    మల్లాది వారి నవలలు, నాటికలు కలిపి ఒక సంపుటంగా 2002లో అబ్బూరి ఛాయాదేవి ముందుమాటతో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించింది. కృష్ణాతీరంతో సహా మూడు నవలలు ఉన్న ఈ పుస్తకంలో రహస్యం చిత్రంతో ప్రాచుర్యం పొందిన మల్లాది వారి పార్వతీకల్యాణం నృత్యరూపకం కేళీగోపాలం పేరుతో కనిపిస్తుంది.

  17. సుజాత

    ఈ పుస్తకం ఇటీవలే దొరికిందండీ నాకు! అది చదువుతూ ఉండటం వల్ల కాబోలు మీ వ్యాసం మరీ నచ్చింది. ఆ అచ్చతెలుగు పలుకు బళ్ళు ఎంతో తీయగా ఉన్నాయి!

  18. కొత్తపాళీ

    మల్లాది వారి రచనలు దొరక్కుండా పోవడం మన తెలుగు వాళ్ళ దౌర్భాగ్యం.
    ఈ నవలిక నించి ఇన్నిన్ని విశేషాలు ఓపిగ్గా, తప్పుల్లేకుండా కూర్చి మాకిచ్చినందుకు మీకు శతసహస్ర వందనాలు. విశాలాంధ్ర వారి పుణ్యమాని కనీసం రెండు కథల సంపుటాలు మిగిలాయి తెలుగువాళ్ళకి. వాటిల్లో తాతగారి కథలూ శ్రీనాథుడి కథలూ మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉంటాను. ఆయన రచనని ఫులిస్టాపూ కామాతో సహా జాగ్రత్తగా చదవాలని మీరు చేసిన హెచ్చరిక అక్షరాలా నిజం.

  19. మాలతి

    మంచి వాక్యాలు ఎత్తి చూపేరండీ. రామకృష్ణశాస్త్రిగారి భాష అంటే నాక్కూడా చాలా ఇష్టం. తమతెలుగుని మెరుగుపరుచుకోవాలనుకునేవారు చదవతగ్గ కథలు ఆయనవి. నేను ఆయనమీద రాసిన వ్యాసం కూడా చూడగలరు, మీకు టైమున్నప్పుడు.
    http://tethulika.wordpress.com/2009/11/06/%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0/

    మాలతి

Leave a Reply