భవిష్యత్ దర్శకుడు – జార్జి ఆర్‌వెల్ (1903-1950)

వ్యాసకర్త: శారద మురళి

********

సాహిత్యం సాధారణంగా సమకాలీన  సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతూ వుంటుంది. అలా వుండాలని ఆశిస్తాం కూడా. అయితే, తద్విరుద్ధంగా  రచనలు కొన్ని చారిత్రాత్మకమైనవి అయితే, కొన్ని భవిష్యత్తుని ఊహిస్తూ వుంటాయి.

సమకాలీన పరిస్థితులూ, సమస్యలూ ఆధారంగా భవిష్యత్తులో రాబోతున్న సమస్యలనీ, పరిస్థితులనీ ఊహిస్తూ ఎందరో సాహిత్యకారులు రచనలు చేసారు. తెలుగులో వీరేంద్రనాథ్ గారు వ్రాసిన “ఆనందో బ్రహ్మ” అటువంటిదే. ఆంగ్లంలోనూ భవిష్యత్తుని ఊహిస్తూ వ్రాసిన  నవలలు ఎన్నో వున్నాయి. 

మార్గరెట్ కేవెండిష్ అనే రచయిత్రి 1666 వ్రాసిన “ది బ్లేజింగ్ వర్ల్‌డ్“, 1895 లో హెచ్.జి.వెల్స్ వ్రాసిన “ది టైం మెషీన్” అటువంటి నవలలే. 

అయితే వీటిలో రెండు రకాలున్నాయి. సాంకేతికతా, విస్తరిస్తూ వున్న శాస్త్ర విజ్ఞానమూ ఇంకా ఎంత అభివృద్ధి చెందగలవో ఊహిస్తూ వ్రాసే సైన్స్-ఫిక్షన్ లాటి నవలలు కొన్నైతే, ప్రస్తుతం వున్న రాజకీయ, సామాజిక రుగ్మతలు ఎక్కువై మానవ జీవితం ఇంకా క్షీణించిపోయే దశకు చేరుకుంటే ఎలా వుంటుందన్న ఊహతో వ్రాసే నవలలు రెండో రకం. ఈ రకం నవలలలో కొంచెం అతిశయోక్తి వుండొచ్చు గాక, అయినా, ప్రస్తుత పరిస్థితులని ఇంకొంచెం లోతుగా పరిశీలించుకోవాలని మానవ సమాజానికి సూచిస్తాయి ఇటువంటి నవలలు.

సమస్యాత్మకంగా, నిరాశాపూరితంగా కనిపించే భవిష్యత్తుని డిస్టోపియన్ ఫ్యూచర్ అంటారు. అటువంటి భవిష్యత్తుని ఊహించే రచనలు డిస్టోపియన్ రచనలు.  “ది హంగర్ గేమ్స్“, “డు ఆండ్రోఇడ్స్ డ్రీం ఆఫ్ ఎలెక్ట్రిక్ షీప్” నవలలూ ఇటువంటి డిస్టోపియన్ భవిష్యత్తుని ఊహిస్తూ వ్రాసినవే. రెండు నవలలూ చలన చిత్రాలుగా కూడా ఎంతో ప్రాచుర్యం చెందాయి.

తాను వుంటున్న సామాజిక,  రాజకీయ పరిస్థితులని విశ్లేషిస్తూ, వాటిల్లో వున్న రుగ్మతలను తీవ్రంగా ఎండగడుతూ అద్భుతమైన రచనలు చేసిన వారిలో ఆంగ్ల రచయిత జార్జి ఆర్‌వెల్ ముందు వరుసలో వుంటారు. కమ్యూనిస్టు ప్రభుత్వాలని నిర్మొహమాటంగా,నిర్భయంగా విమర్శింఛిన వీరి నవల “ఎనిమల్ ఫార్మ్” ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే జార్జి ఆర్‌వెల్ ఎంతో కమ్యూనిస్టు, వామ పక్ష భావజాలాన్ని సమర్ధించే వాడవడమే కొంచెం వింత.

1903 జూన్ 25న భారత దేశంలో, అప్పటి బెంగాల్ రెసిడేన్సిలోని మోతిహరీ గ్రామంలో జన్మించారు. జార్జి ఆర్‌వెల్ అన్న కలం పేరుతో అత్యద్భుతమైన రచనలు చేసిన ఈయన అసలు పేరు ఎరిక్ అర్థర్ బ్లెయిర్. ఆయన తండ్రి బ్రిటిష్ ప్రభుత్వాధికారి. తల్లి ఫ్రెంచి దేశానికి చెందిన టేకు వ్యాపారి కూతురు. అయితే, కుటుంబ గౌరవమూ, ప్రతిష్ఠా తప్ప, పెద్దగా ఆర్థిక వనరులు లేని కుటుంబం వారిది. బ్రతికి చెడ్డ కుటుంబంగా తమని తాము వర్ణించుకున్నారు ఆర్‌వెల్.

ఎరిక్‌కి అయిదేళ్ళు పెద్దదయిన ఒక అక్క, మార్జొరీ, అయిదేళ్ళు చిన్నదయిన చెల్లె ఏవ్రిల్ వున్నారు.అతనికి యేడాది వయసుండగా, అతన్నీ, మార్జొరీని తీసుకుని తల్లి భారతదేశం వదిలి ఇంగ్లండు వెళ్ళిపోయారు. ఎరిక్ ఇంగ్లండులోనే విద్యాభ్యాసం ముగించారు. 

ఈటన్ బోర్డింగ్ స్కూల్లో స్కాలర్షిప్పుతో 1917 నుంచి 1921 వరకు చదువుకున్నారు. అక్కడ ప్రఖ్యాత రచయిత ఆల్డస్ హక్స్‌లీ బోధన ఎరిక్‌ని ప్రభావితం చేసి వుండొచ్చు. అక్కడే మొదటి సారి ఎరిక్ స్కూలు పత్రిక కోసం చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టారు. హైస్కూలు తరవాత యూనివర్సిటీ చదువులకెళ్ళకుండా ఎరిక్ బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించుకున్నారు.

1921లో ఎరిక్ బర్మాలో బ్రిటిష్ పోలీసు అధికారిగా ఉద్యోగం చేపట్టారు. మొదట కొన్నాళ్ళు మచ్చలేని బ్రిటిష్ అధికారిగా పనిచేసినా, తరవాత అతను బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా అసహ్యించుకొని, ఆ దేశం తరఫున అధికారిగా పనిచేస్తున్నందుకు విపరీతంగా అవమాన పడ్డారు. 

ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. తరవాత జార్జి ఆర్‌వెల్ పేరుతో ఆయన చేసిన చాలా రచనలలోని ప్రోటాగనిస్టు ఇలాగే వుంటాడు. ముభావి, సున్నిత మనస్కుడూ అయిన కథా నాయకుడు తన మనసుకి ఏ మాత్రం నచ్చని పరిస్థితులతో రాజీ పడనూ లేక, వాటిని మార్చడానికి శక్తీ లేక, తన మనసుకీ, బయట గడపాల్సిన జీవితానికీ మధ్య నలిగిపోతూ వుండటం, ఆయన బహుశా తన బ్రతుకు గురించే చెప్తూ వుండాలి.

“బర్మీస్ డేస్” అనే నవలలోనూ, “షూటింగ్ ఎన్ ఎలిఫంట్”, “ఎ హాంగింగ్” అనే కల్పికల్లోనూ ఆయన తన బర్మా అనుభవాలనే వెల్లడించారు.

1927లో బర్మా వదిలి ఇంగ్లండు వెళ్ళిపోయిన ఎరిక్, 1928లో తన బ్రిటిష్ పోలీసు అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసారు. బర్మాలో వుంటూ కూడా, అక్కడి స్థానిక ప్రజానీకంతో మమేకవలేని తన స్వాభావికమైన జాత్యహంకారాన్ని తానే విపరీతంగా అసహ్యించుకున్న ఎరిక్, దానికి ప్రాయశ్చిత్తంగా అన్నట్టు యూరోప్ లోని అట్టడుగు వర్గంలో ప్రజానీకంతో కలిసి నివసించ సాగారు. తాను వ్రాయదల్చుకున్న వారి బ్రతుకులని అనుభవించి గానీ వ్రాయలన్న నమ్మకంలో ఆయన జాక్ లండన్‌ని స్ఫూర్తిగా తీసుకున్నారని అంటారు. మొత్తం మీద 1928 నుంచి చాలా యేళ్ళు ఆయన పేదరికం గురించే వ్రాసారు. అప్పుడే సర్వ మానవ సమానత్వం కోసం, వామ పక్ష భావ జాలం పట్లా, కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్లా ఆకర్షణ పెంచుకున్నారు.

లండన్, పారిస్ నగరాల్లో కూలీలూ, పేదలూ నివసించే ప్రాంతాల్లో వుంటూ, హోటల్లల్లో గిన్నెలు కడిగారు. స్వచ్ఛందంగా పేదరికాన్ని కౌగలించుకుని నిరుపేదలా బ్రతికారు. ఈ అనుభవాలనే 1933లో తన పుస్తకం “డౌన్ ఎండ్ అవుట్ ఇన్ పారిస్ ఎండ్ లండన్” లో వివరించారు. ఈ పుస్తకంతో ఆయన మొదటిసారి సాహితీ రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ పుస్తకం కోసం మొదటి సారి “జార్జి ఆర్‌వెల్” అనే కలం పేరు వాడారు. ఆ తరవాత 1934లో “బర్మీస్ డేస్” ప్రచురితమయి, జార్జ్ ఆర్‌వెల్ పేరు ఆంగ్ల సాహిత్యంలో సుస్థిరమైంది.

1933 నుంచి 1949 వరకు ఆయన ఆరు నవలలూ, మూడు పుస్తకాలూ, ఎన్నెన్నో వ్యాసాలూ, పత్ర్రికల్లో కాలమ్సూ , కొన్ని కవితలూ వ్రాసారు. బ్రిటిష్ వంటకాలను గురించి కొన్ని వ్యాసాలు వ్రాసినట్టు కూడా దాఖలాలున్నాయి. ఆయన సాహిత్యాన్నీ, ఆయన రాజకీయ నమ్మకాలనీ విడదీయలేం.

బర్మా నించి తిరిగొచ్చి యూరోపియన్ సామ్రాజ్యవాదం పట్ల విముఖత పెంచుకున్న ఎరిక్, వామ పక్ష సిద్ధాంతలను నమ్మడం మొదలు పెట్టారు. ఈ నమ్మకమే 1937లో వ్రాసిన “ది రోడ్ టు విగన్ పియర్” పుస్తకంలో వెల్లడి చేసారు. తనని తాను ప్రజాస్వామిక-సోషలిస్టుగా నిర్వచించుకున్నారు ఆ పుస్తకంలో.

1936లో మొదలైన స్పానిష్ అంతర్గత యుద్ధంలో పాల్గొనడానికి జార్జి స్పెయిన్ వెళ్ళారు. అది ముగిసి ఇంగ్లండు తిరిగొచ్చేసరికి జార్జి లో వామ పక్ష భావలపట్ల కొంచెం విముఖతా, నిరాశా మొదలయ్యాయి. వామ పక్ష రాజకీయ పార్టీల్లోని ముఠాతత్వాలూ, అంతర్గత యుద్ధాలూ, సోవియట్ యూనియన్ ఆధిపత్య ధోరణీ, వీటన్నిటినీ ఆయన నిరసించసాగారు.

అయితే, సాంఘిక అసమానతలను నిర్మూలించి సమ సమాజాన్ని స్థాపించడం మాత్రం ఒక్క వామపక్ష రాజకీయాల వల్లే సాధ్యమని గాఢంగా నమ్మారు. ఆ రకంగా చూస్తే కొన్నిసార్లు ఆయన ఆలోచనా ధోరణిలో పరస్పర వైరుద్ధ్యం కనపడక మానదు.

స్టాలిన్ నాయకత్వంలోని సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు సిద్ధాంతాలని తుంగలో తొక్కి,  ప్రజలని మోసం చేస్తున్నారన్న అభిప్రాయానికొచ్చారు జార్జి. అన్నిటికంటే జార్జిని చాలా వికలపరిచింది కమ్యూనిస్టు నాయకుల అధిపత్య ధోరణీ, నిరంకుశత్వమూ. 

వామపక్ష రాజకీయాల హిపోక్రసీని, కమ్యూనిస్టు నాయకుల నిరంకుశత్వ ధోరణులనీ ఆయన “ఎనిమల్ ఫార్మ్”(1945) అనే వ్యంగ్య రచనలో ఎండగట్టారు. ప్రపంచంలోని నాయకులందరూ నిరంకుశులై, ప్రజల కదలికలనీ, జీవితాలనీ, ఆఖరికి ఆలోచనలని కూడా నియంత్రించే రోజులు భవిష్యత్తులో రాబోతున్నాయనీ, అలాటి రోజులొస్తే సామాన్యుల బ్రతుకులెంత అర్థరహితంగా మారుతాయోనన్న ఊహలో జన్మించినదే ఆయన వ్రాసిన 1984 అనే పుస్తకం. ఈ పుస్తకం 1949లో ప్రచురితమై ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఇదే ఆయన వ్రాసిన ఆఖరి పుస్తకం.

తన జీవితకాలంలో ఎరిక్ ఎంతో మంది స్త్రీలతో స్నేహం చేసారు. 

1936లో ఎరిక్ తన స్నేహితుల్లో ఒకరైన ఐలీన్ ఓషానీ అనే స్త్రీని పెళ్ళాడారు. 1945లో ఐలీన్ మరణించడంతో, ఒంటరితనం భరించలేక 1949లో సోనియా బ్రౌనెల్ అనే స్త్రీని పెళ్ళాడారు. అయితే ఆ పెళ్ళైన నాలుగు నెలలకే జార్జి ఆర్‌వెల్‌గా ప్రసిద్ధి పొందిన ఎరిక్ బ్లెయిర్ 1949 జనవరిలో మరణించారు.

You Might Also Like

Leave a Reply