ఎన్నెమ్మ కథలు

(ఇంటర్నెట్ లో తెలుగు చదవడం అలవాటున్న వారికీ నిడదవోలు మాలతి గారిని పరిచయం చేయనక్కర్లేదు. తూలిక.నెట్ సైటు ద్వారా, తెతూలిక – తెలుగు బ్లాగు ద్వారా, ఆవిడ అందరికీ పరిచితులే. మాలతి గారి బ్లాగులో సిరీస్ గా చాలా రోజులు వచ్చిన “ఎన్నెమ్మకతలు” ని ఒక పుస్తకం గా చేర్చి ఈ-బుక్ గా విడుదల చేసారు. ఈ పుస్తకం కోసం శంకగిరి నారాయణస్వామి గారు ముందుమాట రాసారు. ఆ ముందుమాటే ఈ వ్యాసం – పుస్తకం.నెట్)
*****************************************

తన బాల్యాన్నీ, ఆ బాల్యన్నిండా నిండి ఉన్న మనుషుల్నీ కథా వేదికనెక్కించి నామిని సుబ్రహ్మణ్యన్నాయుడు తెలుగు కథకి ఒక కొత్త రూపమిచ్చాడు 1980 లలో. సినబ్బ కతలు, మిట్టూరోడి కతలు .. ఈ సంపుటుల రాక తెలుగు కథా సాహిత్యంలో వ్యక్తిగత కథనానికి, నిజజీవిత కథనానికి తెరతీసింది. ఆ తరవాత ఖదీర్ బాబు దర్గా మిట్ట కతలనీ, సోమరాజు సుశీల ఇల్లేరమ్మ కతలనీ అదే పంథాలో ఇంకో అడుగు ముందుకేశారు. ఇంకా కొన్ని కూడ వచ్చి ఉండొచ్చు. ఈ కతలన్నిటి ప్రయోజనం చిన్నప్పటి కబుర్లు నెమరు వేసుకోవటం ఒక్కటే కాదు. ఒక్కొక్క స్థల కాల సందర్భాల్లో వెల్లివిరిసిన జీవితానికి, ఒక్కొక్క సామాజిక వర్గపు జీవితానికి, ఈ కతలు సజీవమైన డాక్యుమెంటరీలు. అటుపైన కథ చెప్పే వ్యక్తి తన బాల్యాన్ని నెమరు వేసుకుంటూ ఉత్తమ పురుషలో నేను అనుకుంటూ కథ చెప్పడమూ, అప్పుడప్పుడూ తానే ఆ బాల్యంలోకి జారిపోయి అప్పటి చైతన్యంలోంచి కథ కొనసాగించడం వల్ల ఆసక్తికరమైన సన్నివేశాలు, దృక్కోణాలు ఉత్పన్నమవుతుంటాయి.

మాలతిగారి ఎన్నెమ్మ కతలు (ఇంతకీ వీటికి ఎన్నెమ్మ కతలని పేరెందుకొచ్చిందో అర్ధమయిందా?) కూడా వ్యక్తిగత కథనానికి, నిజజీవిత సంఘటనలకీ పెద్ద పీట వేస్తున్నాయి. మాలతిగారు వీటికి ఊసుపోక అని ట్యాగ్ లైను పెట్టినా, వీటిలో పనికొచ్చే ఊసులు చాలా ఉన్నాయి. అక్కడక్కడా బాల్యపు స్పర్శ తగులుతుంది గానీ ఇవి బాల్యపు కథలు కావు. వీటిల్లో పాఠకుల ఉత్కంఠని రేకెత్తించే ప్లాటు, సస్పెన్సు లాంటి మసాలా దినుసులు ఎక్కువగా కనపడవు. అమెరికాలో ఉత్తరపు అంచున కెనడా సరిహద్దున ఉన్న విస్కాన్సిన్ రాష్ట్రంలో, రాష్ట్రానికి రాజధాని అయినా, ఒక గొప్ప విశ్వవిద్యాలయానికి పుట్టినిల్లయినా, విస్తీర్ణంలోనూ గుణంలోనూ మన తెనాలి వంటి ఒక చిన్న పట్టణంలో, మంచు కురుస్తున్న ఒక డిసెంబరు సాయంత్రం మనం వారింటి వాకిట నిలబడి ఉంటే, మనల్ని లోపలికి ఆహ్వానించి, లివింగ్ రూములో కూర్చో బెట్టి, ఫైర్ ప్లేసులో మంట వెలిగించి, చిక్కటి కమ్మటి వేడి వేడి కాఫీ ఇచ్చి, అంతకన్నా వెచ్చ వెచ్చటి కబుర్లు మనకి చెబుతారు రచయిత్రి. ఏదో రోజువారీ సాధారణ సంఘటనతోనో (ఉదా: కాఫీ తాగడం), ఎప్పుడైనా ఒక అసాధారణ సంఘటనతోనో (ఉదా: మంచులో నడవబోయి జారి పడి రచయిత్రి చెయ్యి విరగడం) మొదలు పెట్టి, అనేక వైయక్తిక, సాంఘిక, సాహిత్య, త్త్విక అంశాలని స్పృశిస్తూ నిజజీవన స్రవంతిగా ఈ కబుర్ల కథనాలు సాగుతుంటాయి. మధ్య మధ్య పొన్నమ్మాళ్ వంటి ప్రస్తుత జీవితంలో పాత్రలూ, సముద్రాల్లాంటి బాల్యకాలపు పాత్రలూ వచ్చి ఆప్యాయంగా పలకరిస్తుంటారు.

ఇదంతా ఒక యెత్తు, ఈ కథల్లో అంతర్లీనంగా ఉన్న సామాజిక విలువ ఇంకో యెత్తు. ఇంతకు ముందు ఉదహరించిన కథల్లాగానే ఈ ఎన్నెమ్మ కథలు కూడా ముఖ్యమైన సోషల్ డాక్యుమెంటరీలు. నేపథ్యంలో భారత జీవితానికి సంబంధించి ఒక అదృశ్యమై పోయిన మధ్యతరగతి నాగరిక జీవితపు ఛాయలు లీలగా కనిపిస్తుంటే, ప్రస్తుతంలో అమెరికాలో చాలా కాలంగా ప్రవాసం ఉన్న తొలి తరపు అనుభవాలు ప్రస్ఫుటంగా మన దృష్టిని ఆకర్షిస్తుంటాయి. దానికి తోడు ఆ కథలు చెప్పే మనిషి స్వతహాగా మాంఛి సునిశితమైన పరిశీలనా దృష్టి కలిగిన రచయిత్రి కావడమూ, ఇతర భారతీయ వలసప్రజ లాగా ఏదో ఒక వృత్తి విద్యకి అంకితమైన మనిషి కాకపోవడమూ కారణంగా ఈ కథలకి ఇతరత్రా సాధ్యం కాని ఒక చురుకూ ఒక మెరుపూ సంక్రమించాయి. ఏ డాక్టరో, ఇంజనీరో, సాఫ్టువేరు నిపుణులో ఈ కథలు రాయలేరు. ఆలాగే మాలతి గారు తాను అమెరికాకి వలస వచ్చి ఉండక పోతే ఈ కథలసలు పుట్టి ఉండేవే కావు. ఆ విధంగా ఈ కథలు ప్రత్యేకమైన అనుభవ సముదాయానికి సాక్షర సాక్ష్యాలు.

ఆంధ్ర దేశాన్నించి పెద్ద సంఖ్యలో అమెరికాకి తొలి తరం వలసలు 70 లలో జరిగాయి. అప్పట్లో అమెరికను నగరాల్లో ప్రతి వీధికీ ఒక భారతీయ పచారీ కొట్టూ, ప్రతి పేటకీ ఒక భారతీయ రెస్టారెంటు ఉండేవి కావు. కందిపప్పు కావాలంటే న్యూయార్కుకి రాసి తెప్పించుకోవాల్సి వచ్చేదిట. అలా తమ వలస జీవనం మొదలు పెట్టి గత నలభయ్యేళ్ళుగా తమదైన ఒక అస్తిత్వాన్ని నిర్వచించుకున్నారు ఆ తరం వారు. వీరిలో కాస్త కలం పట్టనేర్చిన వారు తమతమ అనుభవాల్ని రికార్డు చేసే ప్రయత్నం చేశారు కూడా. దీన్నే డయాస్పోరా సాహిత్యం అన్నారు. అమెరికా వచ్చిన తెలుగువాళ్ళు రాసుకున్న డయాస్పోరా సాహిత్యంలో నిజంగా డయాస్పోరా ఏమీ లేదూ అని వేలూరి వేంకటేశ్వర్రావు గారు చాలా బాధపడిపోతుంటారు. మాలతి గారి ఎన్నెమ్మ కథలు ఆ కొరత (అనేది ఉంటే) ని తీరుస్తున్నాయని ఘంటాపథంగా చెప్పగలను. మాతృదేశంలో తాము అలవాటు పడిన జీవన విధానాన్నించి బాగా తేడాగా ఉండే పాశ్చాత్య సమాజంలో వచ్చి పడిన మనవాళ్ళకి సాధారణంగా కొన్ని వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. మన పేర్లు పలకడానికి ఇక్కడి వాళ్ళ తిప్పలు, ఏ ఫాశ్ట్ ఫుడ్ సెంటర్లోనో కాఫీషాపులోనో ఆర్డరివ్వడానికి మనవాళ్ళు పడే తిప్పలు, కారులో జోరుగా పోతుంటే కాపులతో తిప్పలు .. అమెరికా వచ్చిన కొత్తల్లో వీటి పాలబడని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఐతే, ఈ అనుభవాల్ని గురించి చిరాకుతోనో, హాస్యంగానో, రాసుకున్నంత మాత్రాన అది డయాస్పోరా సాహిత్యం ఐపోదు. ఈ వ్యక్తిగత అనుభవాల్ని శోధించి మధించి, ఆ మధనంలోంచి జీవితసత్యమనే అమృతాన్ని ఆవిష్కరించినప్పుడు అది నిజమైన డయాస్పోరా సాహిత్య మవుతుంది. ప్రవాసులు తమని తాము అర్ధం చేసుకోవడానికే కాక, ఇటువంటి సాహిత్యం, నివాసులకీ ప్రవాసులకీ మధ్య వారధిగా కూడా ఉపయోగ పడుతుంది. అటువంటి సాహిత్యానికి అగ్రగామిగా మీ ముందుకొస్తున్నాయి ఈ ఎన్నెమ్మ కథలు.

ఇదిలా ఉండగా ఈ కథల అస్తిత్వానికి ఇంకొక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. అది తెలుగు బ్లాగ్లోకం. ఈ కథల్లో తెలుగు బ్లాగుల ప్రస్తావనా, అనేక తెలుగు బ్లాగరుల పరమార్శా చాలా చోట్ల మీకు కనిపిస్తాయి. తాము ఎక్కువగా ఉపయోగించక పోయినా, సగటు తెలుగు పుస్తక పాఠకులకి కంప్యూటర్, ఇంటర్నెట్, ఈమెయిల్ .. అంటే ఏవిటో తెలిసే ఉంటుంది. యాహూ, గూగుల్ వంటి సంస్థలు వాడుక దారులకి ఉచితంగా ఈమెయిల్ సదుపాయాన్ని కల్పించాయి. అదే పద్ధతిలో వాడుకదారులు తమ ఆలోచనల్ని రాసుకుని ఇంటర్నెట్లో ప్రచురించుకునే అవకాశాన్ని ఉచితంగా అందిస్తున్నాయి కొన్ని ఇంటర్నెట్ వ్యాపార సంస్థలు. ఇలా రాసి ప్రచురించే రచనలకే బ్లాగు అని పేరు. బ్లాగులో రాయడమే బ్లాగడం. బ్లాగే మనిషి బ్లాగరి. తెలుగులో బ్లాగే బ్లాగరులందరూ చేరి తమ అనుభవాల్ని కలబోసుకునే వినూత్న ఆలోచనా ప్రపంచమే తెలుగు బ్లాగ్లోకం. ఈ బ్లాగ్లోక విశేషాలను గురించీ, అనేక బ్లాగులను గురించీ దిన పత్రికల్లోనూ, కంప్యూటర్ ఎరా వంటి సాంకేతిక విద్యా పత్రికల్లోనూ, ఎఫ్ఫెం రేడియో, స్థానిక తెలుగు టీవీ ఛానెళ్ళలోనూ కొన్ని కథనాలు వెలువడుతూ వస్తున్నాయి, కానీ తెలుగు బ్లాగుల గురించి ఎక్కువమందికి తెలీదు, తెలుగు సాహిత్యాన్నీ, ఇంటర్నెట్టునీ పట్టించుకునే వారికి కూడా.

ఎవరి బ్లాగుకి వారే అధినేత. మరి ఎటువంటి సంపాదక పర్యవేక్షణ లేకుండా రచనల్లో నాణ్యత ఎలా ఉంటుంది? నిజమే. అన్ని బ్లాగులూ ఆసక్తికరం కాకపోవచ్చు. ఆసక్తికరమైన బ్లాగుల్లోనూ ప్రతీ బ్లాగు టపా గుర్తు పెట్టుకోదగిన గొప్ప సాహిత్యం కాకపోవచ్చు. కానీ సమర్ధవంతులైన రచయితలకీ, తమ ఆలోచనల మీద ఇతరుల నియంత్రణ సహించని రచయితలకీ బ్లాగులు గొప్ప స్వేఛ్ఛాద్వారాలని తెరిచాయి. సాధారణ పత్రికా ప్రపంచంలో కనబడని, ఆమోదించబడని భావజాలాన్ని పదిమందితో పంచుకోగలిగిన స్వేఛ్ఛకు బ్లాగులు తెరతీశాయి. పత్రికలో ప్రచురించాలి అంటే అది కథా వ్యాసమో కవితో ఫీచరో ఏదో ఒకటి అయుండాలి. ఇలాంటి వర్గీకరణ చట్రాల్లో స్థిమితంగా ఇమడని ఎన్నెమ్మ కథలకి తెలుగు బ్లాగ్లోకం తగిన పుట్టినిల్లయింది. ఎందుకంటే ఈ కథలు, ఇదిగో ఇలా పుస్తకంగా సంకలిస్తే తప్ప, మరో విధంగా పదిమందికీ చేరే అవకాశం లేదు. అప్పటికే కొన్నేళ్ళుగా ఆంగ్ల అనువాద కథలకి తూలిక అనే వెబ్ సైట్ నిర్వహిస్తున్న మాలతి గారు, తెలుగు బ్లాగుల గురించి తెలుసుకోగానే తాను కూడా ఒక బ్లాగుని ప్రారంభించి తన తాజా తెలుగు రచనలని తద్వారా ప్రచురించడం తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా అమెరికా తెలుగు డయాస్పోరా సాహిత్యానికి గొప్ప మేలు చేసిందని నేను నమ్ముతున్నా.

ఎన్నెమ్మ కథలకి విశాలమైన జీవితానుభవం ఆవరణ కాగా లోతైన పరిశీలన వీటికి పునాది. కథనం అంటారా, తినబోతూ రుచి ఆడగడమెందుకు గానీ, పచ్చి మిరపకాయ బజ్జీలో కొద్దిగా నిమ్మరసం పిండి తిన్నట్టుంటుందనుకోండి. అటు వ్యంగ్యపు కారం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, ఇటు హాస్యపు నిమ్మపులుపు ఉపశమనమిస్తుటుంది. అన్నట్టు మిరపకాయబజ్జీ కూడా ఒక కథాంశమేనండోయ్. మధ్య మధ్య ముళ్ళపూడి బ్రాండు వాడుకలూ, పిట్ట కథలూ పలకరిస్తుంటాయ్. ఋణాంకితమైన అమెరికను ఆర్ధిక వ్యవస్థకి నీరాజనమిస్తూ వెంకట్రమణగారి అప్పారావుని కూడ తల్చుకున్నారు. ఇంటర్నెట్, బ్లాగులు, బ్లాగరులు తరచు కనిపిస్తారిక్కడ. “నసాంకేతికం”, “నెట్టవతారం”, ఇలాంటి వినూత్న పదబంధాల్తో పాటు తెలుగుతనం ఉట్టిపడే అచ్చతెలుగు జాతీయాలూ, సామెతలూ, నుడికారాలూ కోకొల్లలు ఎన్నెమ్మ కథల్లో. వీటన్నిటికీ కింద అంతర్లీనంగా మెత్తగా మంద్రంగా వినబడే తూర్పు యాస (రచనలో యాసేంటి అంటారా? చదవండి, మీకే తెలుస్తుంది.) మెత్తగా గిలిగింతలు పెడుతూంటుంది.

అదుగో మాలతిగారు తలుపు తెరిచారు. మరి లోపలకి పదండి.

***********************************************
ఎన్నెమ్మ కథలు ఈ-బుక్ ని ఇక్కడ చదవొచ్చు.

You Might Also Like

10 Comments

  1. పుస్తకం » Blog Archive » 2010లో నా పుస్తకాలు

    […] ఇల్లాలి ముచ్చట్లు – దశిక శ్యామల 24. ఎన్నెమ్మ కతలు — నిడదవోలు మాలతి 25. రంగుటద్దాల […]

  2. భావన

    చాలా మంచి సమీక్ష, చక్కటి ముందు మాట కొత్తపాళి గారు. మాలతి గారి కధలలో అమెరికా సమీక్ష ను, మాయమైన మధ్య తరగతి జీవితాలలో ఎక్కడైనా గడిచిపోయిన చితుకులు మావి కూడ కనపడతాయేమో వెతుక్కోవాలి. 🙂 మీరు చెప్పిన పుస్తకాలతో పాటు పురాణం గారి ’ఇల్లాలి ముచ్చట్ట్లు ’ కూడా మధ్య తరగతి ఇంకో పార్శ్వాన్ని చూపించినట్లు వుంటుంది నాకు.

  3. e-Books « తెలుగు తూలిక

    […] (కొత్తపాళీ)గారి ముందుమాట ఇక్కడ […]

  4. మాలతి

    @ వాసుగారూ 🙂

  5. మాలతి

    @ రమగారూ, థాంక్సండీ. మళ్లీ సరి చూసుకుని మళ్లీ upload చేస్తాను.

  6. రామ

    మాలతి గారు,
    నేను మీరు ఇచ్చిన లంకె ప్రకారం పీ డీ ఎఫ్ దించుకున్నానండి – కాని, పరుగెత్తుకుంటూ తొంభై ఆరు పేజీలు చదివిన తరవాత, నా చదువు ఒక్క సారిగా ఆగిపోయింది – తొంభై ఆరు తరవాత మిగలిన పేజీలు లేవు!. నా దింపుడు లోపమా లేక అక్కడి ఫైల్ తప్పో అర్ధం కాక ఇలా..

    అదీను, పీ డీ ఎఫ్ లో జూమ్ 100 % పెట్టుకొని చూస్తె అక్షరాలూ గుండ్రం గా కనిపిస్తున్నాయి. (ఎవరికైనా అక్షరాలూ కుదిమట్టం గా కనిపిస్తుంటే జూమ్తగ్గించుకోండి).

  7. Vasu

    మాలతి గారూ,

    అన్నన్నా పక్కనే పెట్టుకుని చూడలేదు మీరు చెప్పేవరకూ. థాంక్స్.

    parallax error కాబోలు 🙂

    కొత్తపాళీ గారు,

    వివరంగా చెప్పారు. థాంక్స్.

  8. కొత్తపాళీ

    కథ కి బదులు కత అనడం.
    ఇదొక సూత్రీకరణ కాదు, ఇలాంటి రచనల్ని కత అనాలని. ఈ ఊసుపోక వరుస రచనలు మొదలు పెట్టినప్పుడు వీటిని రచయిత్రి ఏమన్నారో నాకిప్పుడు గుర్తు లేదు. కత అన్నప్పుడు అందులో కాసింత అమాయకత్వం, మరికాస్త కొంటెతనం తొంగిచూస్తున్నాయి. నామిని సినబ్బకతలని మొదలెట్టినాక, ఇలాంటి స్వానుభవ కథనాల్ని కతలు అని పిలుచుకోవడం ఒక ఆచారం అయినట్టుగా కనిపిస్తోంది .. దర్గమిట్ట కతలు, ఇల్లేరమ్మ కతలు .. ఇలాగ. సాధారణంగా పాఠకులు కథ అంటే ఊహించుకునే రచనకీ, ఈ రచనలకీ ఉన్న తేడాల్ని నేను పై వ్యాసంలో స్పష్టంగానే చర్చించాను. కత అనే కొత్త ప్రక్రియ ఏమీ లేదు. ఇవి కథలే.

  9. మాలతి

    వాసుగారూ,
    కొత్తపాళీ మీప్రశ్నకి జవాబు ఇస్తారనుకుంటాను.

    ఇ-బుక్ విషయంలో మాత్రం నేను జవాబు ఇస్తాను. మీరు ఈలింకు చూడండి. http://www.archive.org/details/EnnemmaKathalu. ఎడమవేపు, రీడ్ ఆన్లైన్ కింద, pdf file కూడా ఉంది. అది తెరిస్తే, మీరన్నట్టు, స్పష్టంగా కనిపిస్తుంది.
    -మాలతి.

  10. Vasu

    కొత్తపాళీ గారు,

    పరిచయం (ముందు మాట) బావుంది. కతలు (కథలు అని కాకుండా) అని వాడడానికి కారణం వివరించగలరు (చాలా చోట్ల )

    ఇప్పుడే ఆ ఈ బుక్ లో కొన్ని కథలు చదివా. జూం చేస్తే అక్షరాలూ అలికేసినట్టు కనిపిస్తున్నాయి. అక్రోబాట్ తో చేస్తే ఇంకా బావుందేమో చదవడానికి అనిపించించింది.

    వాసు

Leave a Reply