2010లో చదివిన ఇంగ్లీషు పుస్తకాలు

(ఆస్ట్రేలియన్ ఓపెన్ అప్పుడు రావాల్సిన పోస్టు, వింబుల్డన్ టైంకొచ్చిందంటే మరి బద్ధకమన్నాక ఆ మాత్రం వేగం లేకపోతే ఎలా?)

జనవరి నెల వచ్చేస్తోంది, మనం ఫోకస్ అనౌన్స్ చేయాలి అని సౌమ్యా నేనూ మాట్లాడుకుంటున్నప్పుడు, మనసులో “హబ్బ.. ఈ ఏడాది ఏం సరిగ్గా చదవలేదు. రాయడానికి ఏముంటుందో”నని అనుమానం వచ్చి, నా ఆన్‍లైన్ బుక్  షెల్ఫులూ, పుస్తకంలో “మీరేం చదివారు?” పేజీలూ కలయజూసి, చదివిన పుస్తకాల జాబితా రాసుకున్నాను. చూసుకున్నాను. “పర్వాలేదు” అనిపించింది.

2009లో అయితే మిలిన్ కుందేరా, ఇటాలో కాల్వినో లాంటి వారి పుస్తకాలన్నీ పిచ్చిపట్టినట్టు చదివాను. ఈ సారి పిచ్చెక్కలేదు గాని, కొందరు రచయితలు మాత్రం నాతో నిల్చిపోయారు. అందులో భైరవభట్ల కామేశ్వరరావు గారు పరిచయం చేసిన పిరన్‍దల్లో. Six characters in search of an author అన్న పుస్తకం చదివాక, “బహుశా, ఇది నా ఫేవరట్ కావచ్చు” అనుకున్నాను గాని, “Loveless love” చదివాక మాత్రం ఈయనంటే తెగ ఇష్టం పుట్టుకొచ్చేసింది. అసలు, మానవసంబంధాలని అర్థం చేసుకోవడంలో కాల్పనిక సాహిత్యం – అంటే, మానవసంబంధాలపై బాగా అవగాహన ఉన్న రచయితలు రాసిన సాహిత్యం – బాగా పనికొస్తుంది అని నా అభిప్రాయం. అంటే, ఇప్పుడు తెలుగు సాహిత్యంపై మక్కువ ఉన్న చాలా మంది “ప్రేమలేఖలు” అనగానే కొంచెం మెలికలు తిరుగుతారా? ఎందుకని? వాళ్ళు ప్రేమలో పడుతూండగా దీన్ని చదవటమో, పడక ముందు చదివి “హబ్బ.. నేనింకా పడనే!” అనుకోవడమో, పడి లేచాక ధీర్ఘ నిట్టూర్పులతోనో చదూకుంటారా? కారణం? చలం తాననుకొన్నది రాయడం వేరే సంగతి, ఇప్పుడందులో ఎవరికి కావాల్సింది వాళ్ళు వెతుక్కుంటారన్న మాట. ఆ లెక్కన “లవ్‍లెస్ లవ్” అనేది ఒక పాఠ్యపుస్తకమే, చదవగలిగలిగితే!

సరమగో.. ఈయన రాసిన Death at Intervals గురించిన పరిచయ వ్యాసం చదివి, ఆ పుస్తకం దొరక్క Blindness చదివాను. కథ, కథనం, శైలీ శిల్పం అన్నీ విపరీతంగా నచ్చేయడంతో వావ్ అనుకొని, ఆ డెత్ పుస్తకం కూడా సంపాదించుకున్నాను. కొత్తావకాయ రుచెలా ఉంటుందని వివరించడం కన్నా, ఓ ముక్క నోట్లో పెట్టటం మేలుగా! సరమగో గురించి చెప్పుకోవడం కూడా అంతే! అదే ఊపులో Small Memories అన్న పుస్తకం కూడా చదివాను. ఇది ఆయన జ్ఞాపకాల మ్యూసింగ్స్! సరమగో ఇంటి పేరు కదా? ఇంటి పేర్లకీ పుట్టుపూర్వోత్తరాలుండడంలో ఆశ్చర్యం లేదుగాని, ఈయన వల్ల వీరి నాన్నకు సరికొత్త ఇంటి పేరొచ్చిందంటే ఆశ్చర్యమే కదా! ఆ తమాషాలతో పాటు మరెన్నో నిషా గాధలు ఇందులో ఉన్నాయి.

డొరతీ పార్కర్ గురించి ఏం చెప్పను? I heart Dorothy Parker! Amen!

ఒకరు “మస్ట్ రీడ్” అని అరిచినంత పని చేసినందుకు గానూ, స్టీఫెన్ కింగ్ “On Writing” చదివాను. ఒక పుస్తకాన్ని రానూ పోనూ రైలు ప్రయాణాల్లో పూర్తిచేయటం అదే మొదటి సారి. అది చదివి నేనూ ఆనందంతో అరచినంత పని చేశాను. “The road to hell is paved with adverbs” అని కింగ్ ఉవాచ. “The road to hell of a relation is paved with adjectives.” అని నా ఉద్దేశ్యం. ఎప్పుడైతే, “నువ్విలా..”, “నువ్వలా” అన్న మాటలొస్తాయో, ఆ బంధం నిలకడ ప్రశ్నార్థకం అవుతుంది.

నాకు చరిత్రపై, అందునా యుద్ధ చరిత్రపై అమితాసక్తి ఉందని అనేసుకొని, అదే మాట ఇద్దరి ముగ్గురు స్నేహితుల దగ్గర వాగాను. అందు మూలంగా, ఏడాది మొదలవ్వడమే, గ్రాండ్ ఓపెనింగ్ అన్నట్టు, నాగరాజుగారు నాకోసమని విన్‍స్టల్ చర్చిల్ రాసిన రెండో ప్రపంచపు పుస్తకాలు ఒరిజినల్ ఎడిషన్ రెండు కొనిపెట్టారన్న వార్తతో మొదలయ్యింది. ఏడాది ముగిసేసరికి వారే నాకు ఆరు పుస్తకాలూ గిప్ట్ చేశారు. ఆ పుస్తకాలను తెరచి కూడా చూడలేదన్నది వేరే కథ. ఈ ఏడాది తప్పకుండా చదువుతాను అనుకుంటున్నాను, పోయిన ఏడాదిలానే.

Catch 22 అంటే? హమ్మ్.. జోసెఫ్ హెల్లర్‍నే అడగాలి. కొన్ని సంవత్సరాలుగా ఈ రచన్ని బెస్ట్-సెల్లర్స్ లో చూస్తూ కూడా, దీన్ని చదవడానికి సాహసించలేదు. ఎందుకో తెలీని భయం ఆ పుస్తకం అంటే. ఈ పుస్తకం ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించేలా ఉంటుందని నా instinct చెప్పింది. A book finding its reader అన్న చందాన, మూడు సముద్రాలచే చుట్టుముట్టబడి ఉన్నప్పుడు కలిగే దాహాం వల్ల మూడు చెరువుల నీళ్ళు కూడా ఒక గుటకలో తాగేసే లాంటి పరిస్థితుల్లో దీన్ని చదవటం మొదలెట్టాను.

అసలైతే  ఈ రచనో Roller-coaster ride. అసలున్నరైతే నాకీ రైడ్లంటే పరమ వీర భయం. అలాంటిది దీన్ని చదువుతున్నంత సేపూ హాహాహా కారాలు బదులు, హహహహకారాలు అన్నమాట.  ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. నవ్వటం కూడా చేతనవ్వాలి.

ఇదే ఊపు కొనసాగిస్తూ, జోసెఫ్ హెల్లర్ ప్రాణాంతక వ్యాధి నుండి బయటపడ్డాక దాని తాలుకు విశేషాలతో చేసిన రచన, “No laughing matter” చదివాను. ఇదో హాస్యస్ఫోరక రచన అని ఊదరగొట్టారు. నాకు నవ్వంతగా రాలేదుగాని, హెల్లర్‍ని అర్థం చేసుకోడానికి కాస్త ఉపయోగపడింది.

ఇంకో ఫ్రెండ్ వంశీ ఏమో సామ్ మెనెక్షా గురించి పరిచయం చేసి వదిలేసాడు. వెతగ్గా ఆయనపై ఓ పుస్తకం ఉందని తెలిసింది. దాని కోసం చెట్టూ-పుట్టా రేంజ్‍లో వెతికాను. (అంటే వెతికించాను అని మరో అర్థం.) ఎట్టకేలకు ఫ్లిప్‍కార్ట్ వాడి పుణ్యమా అని దొరికింది.

అలానే వెతుకుతున్న(అనగా… ) మరో పుస్తకం, హార్షా భోగ్లే రాసిన “అజహర్” పుస్తకం దొరక్కుండానే ఈ  ఏడాదీ పూర్తయ్యిపోయింది. ఇది దారుణంలే. ఎంతలేదూ పుస్తకం ఉందని ఫ్లిప్‍కార్ట్ నుండి మెయిల్ వస్తే, ఆర్డర్ చేసి అర్రులు చాచుకొని కూర్చున్నాను. వాడేమో ఎప్పటికీ పంపక, చివరకు, “లేదు.. సారీ!” అని చావుకబురు చల్లగా చెప్పాడు.

అందుకని ఫ్లిప్‍కార్ట్ లో పుస్తకాలు కొనడం మానేశాను, అలిగి! కొనిపించటం మొదలెట్టాను. ఏదైనా పుస్తకం కొనాలి అంటే, ఆన్‌లైన్ ఎవరు కనిపిస్తే వాళ్ళని పింగ్ చేసి.. “ఫలానా పుస్తకం ఉందీ.. అబ్బబ్బబ్బ.. హొహొహొహొ” అని ఊదరగొట్టటం మొదలెట్టి, “నేను కొనివ్వనా?” అని వాళ్ళు అనే దాకా ఆపను. అలా వాళ్ళు నాకోసం కొంతా, వాళ్ళకోసం కొంతా కొనిచ్చారన్న మాట. “బయింగ్ బుక్స్ బార్బేరియస్” అన్నాడటగా గిరీశం. ఇహ, నన్ను చూస్తే ఏమంటాడో! అన్నట్టు, ఈ ఏడాదే  “గిరీశం లెక్చర్లు” చదివాను, తొట్టతొలి సారిగా. (“ఇప్పుడా చదవటం..” అని మనసులోనే తిట్టుకోండి.. పైకే అనేయండీ పర్లేదు!) కాని, ఏం లెక్చర్లు, ఏం లెక్చర్లు! రొలాండ్ బార్తెహెస్ గాని తెలుగువాడయ్యుంటే,  Language is a whip అని ఇంగ్లీషులో అని తెలుగువాడనిపించుకునే వాడు.

సౌమ్య, నేనూ చదువుతున్న, చదవబోతున్న, చదవాలనుకుంటున్న పుస్తకాల గురించి వీలైనంతగా మాట్లాడుకుంటూ ఉంటాము. ఈ సారి సౌమ్య కొన్ని పుస్తకాలు చదివి ఊరుకోక, నాతో చదివించటానికీ పూనుకుంది. చాలా వరకూ సఫలమయ్యింది. వాటి విశేషాలు.

In the land of invented languages అనేది ఒక అద్భుతమైన పుస్తకం. ఎంత అద్భుతమైన పుస్తకం అంటే, మనం taken for granted గా వ్యవహరించే భాషల గురించి లోతుగా ఆలోచించే వీలు కల్పిస్తుంది. ఒక మనిషి మరో మనిషికి తానేమనుకుంటున్నాడో తెలియపరచటానికే భాష. ఉన్న భాషలు, వాటి అర్థాలూ, అంతరార్థాలూ ఎన్ని ఉన్నా, అవి ఎప్పుడూ అరకొరగానే ఉన్నాయన్న నిజాన్ని గుర్తెరిగి, ఏటికి ఎదురీది విశ్వజనీయమైన ఒక భాషను కనిపెట్టాలని కలలు గన్న కొందరి గాధలు! ఈ పుస్తకం చదివాక, నాకూ కాస్త పైత్యం ఎక్కి, కొన్ని స్మైలీలను తయారుచేశా.. \o/ అనేది ఆవలింతకు సూచిక అని. అంతలా ప్రభావితం చేసింది. (ఎంతలా? అన్నది మీరు నిర్ణయించుకోండి)

Connect the Dots అనే రచన కూడా చాలా స్ఫూర్తిదాయకమైంది. దాని గురించి ఇదివరలో రాశాను.

ఎప్పుడో బళ్ళో చదువుకున్న “To Sir with Love” అనే రచన కూడా సౌమ్య పట్టుబట్టి, పుస్తకం అరువిచ్చి, చదివించింది. రోజూ ఆఫీసుకు పోయేటప్పుడు దారిలో ఈ రచన్ను చదివాను, బ్రేక్‍ఫాస్ట్ లా. ఇందులో వచనం ఎలా ఉంటుందయ్యా అంటే, వేడి వేడి దోశ మీద కరుగుతున్న వెన్నలా.. మృదువుగా ఉంటుంది. లేదా, కాడ్‍బెరీ వాడు ప్రవేశపెట్టిన డేరీ మిల్క్ సిల్క్ లా ఉంటుంది. ఇంగ్లీషులో అందం, కథా, కథనంలో ఉన్న అందం, భలేంటి పుస్తకంలే!

సౌమ్యకి ఎవరైనా నచ్చితే, ఇహ వాళ్ళు మనకి నచ్చాల్సిందే! బెంగళూరు నాగరత్నమ్మ గారి గురించి బజ్జ్ లో మొదలెట్టుకొని,  Devadasi and a Saint పుస్తక రచయిత శ్రీరాం గారి నుండే పుస్తకం తెప్పించి చదివి, ఇక్కడ రాసి ఊరుకోలేదు. నాకూ ఇచ్చింది. ఇట్లాంటి పుస్తకాలు ఇచ్చి చదివిస్తున్నందుకు, థాంక్స్ చెప్తే చప్పగా ఉంటుంది. వీలైతే ఒక జగ్గుడు కాఫీ, లేదా కిలో చాక్లెట్ కేక్ ఇంటికి పంపించేయాలనిపిస్తుంది. అంతగా నచ్చేసింది ఈ పుస్తకం.
(ఎంతగా? అంటే, అనిపించేంత మాట! కొనిచ్చేంత కాదని నిగూఢార్థం!)

బెంగళూరుకి ఈ ఏడాదిలో మూడు ట్రిప్పులు వేశాను. మూడూ రోజున్నర నిడివి ఉన్న ట్రిప్పులే! రోజున్నరలో  ముప్పావు సమయం పుస్తకాల కొట్లలోనే తిరగాను, తిప్పించాను.

పుస్తకాల విషయంలో బెంగళూరు నాకు తెగ నచ్చేసింది. సెలెక్ట్ బుక్ షాపును గురించి తెలిసింది! ఆ షాపును గురించిన పుస్తకం Miscellaneous అనే పుస్తకం నా చేతికి రాక ముందే, నేనీ షాపుకు వెళ్ళడం సంభవించింది. మూర్తిగారితో మాట్లాడ్డం కూడా! ఆ విశేషాలను ఇక్కడ పంచుకోలేకపోయాను గాని, అసలు ఈ పుస్తకం గురించి నేను రాయకపోవడం మాత్రం క్షమించరాని నేరం. పుస్తకంలో కొన్ని వ్యాసాలేమో సెలెక్ట్ గురించినవి ఉంటాయి. కాని, అత్యధిక భాగం బెంగళూరు నగరవాసుల పుస్తక ప్రేమను తెలిపేవిలా ఉంటాయి. ఒక్కొక్కరూ అలా నోస్టాల్జియాలో మునిగి, మనల్ని కూడా ముంచేస్తారు. అసలు పుస్తకాల వేటలో ఉన్న మజా ఏంటో ఇలాంటివి చదివితే తెలుస్తుంది. మీకు గాని అవకాశం ఉంటే, ఈ పుస్తకాన్ని తప్పక చదవండి.

నా మనసు దోచుకున్న మరో పుస్తకశాల “సుధా బుక్ హౌస్”. ఇది రాజాజీ నగర్‍లో ఉంటుంది. అడుగు పెట్టీపెట్టగానే, “నేను పూర్ణిమ. ఒక పుస్తకం.నెట్..” అన్న టేప్ వేశాను. ఆయన నవ్వి, ఆయన గురించి కొంచెమే చెప్పి, పుస్తకాల గురించి బోలెడు చెప్పుకొచ్చారు. వారి వద్దనున్న దుర్లభమైన పుస్తకాలన్నింటినీ తీసి చూపించారు. అవెందుకంత “రేర్”ఓ వివరించారు. ఆ తర్వాత మా మానానికి మమల్ని వదిలేసారు. నేను రెండు ట్రిప్పుల్లో, మూడేసి సంచీల పుస్తకాలు కొన్నాను ఇక్కడ. మొన్న చెప్పుకొచ్చిన నార్లవారి ఉత్తరాలు, పదార్చన, యుగకవి శేషేంద్ర పుస్తకాలు కాక, కొండపల్లి చరిత్రకు సంబంధించిన పుస్తకం, కొన్ని పాత మ్యాగజైన్స్ ఇక్కడే కొన్నాను.

ఇహ నేను దాసోహం అన్న పుస్తకం షాపు మాత్రం బ్రిగేడ్ రోడులో ఉన్న “Bookworm”! మొదటి సారి వెళ్ళినప్పుడు ఒక Encyclopedia పుస్తకం కోసం ఆదరాబదరాగా వెళ్ళి కొనుక్కొచ్చేశాం. మరుసటి సారి అదే పుస్తకం కోసం వెళ్ళి, ఫ్లైటుకి చాలా సమయం ఉండడంతో, పుస్తకాలన్నీ తీరిగ్గా బ్రౌజ్ చేసే వీలు కలిగింది. ఇక్కడే, ఈ షాపులోనే, I’ve got my find of the year. “Shifu, You’ll do Anything For a Laugh” అన్న పుస్తకం నన్ను చాలా ప్రభావితం చేసింది, సాహిత్యపరంగానూ, ఇతరత్రా పరంగానూ. అలాగే, ఇక్కడే కొన్న, “Teach Us to outgrow our madness” అన్న పుస్తకం కూడా నాలుగు నవలికలు కల్సున్న పుస్తకం. నేను టైటిల్ కథ ఒక్కటే చదివాను. ప్లాట్ అయిపోయాను. ఈ పుస్తకంలో మొదటి కథ ఒక కాన్సర్ పేషెంట్‍ది (అనుకుంట!) కథనం నడిపిన విధానం అంత తేలీగ్గా అనిపించదు. పైగా ఆ వచనం ఎంత బాగుంటుందంటే, అక్కడక్కడే తచ్చాడుతూ ఉండిపోయాను. ఇది జపాను నుండి నోబెల్ ప్రైజ్ అందుకున్న Kenzaburo Oe రాసిన పుస్తకం. ఇది కాక, మరో జపాన్ నవల చదివాను. దాని పేరు Dreaming Water. వెనుక అట్ట మీద కథ, మొన్ననే వచ్చిన అమితాబ్ బచ్చన్ “పా” లా అనిపించి, చదివి చూద్దామని కొన్నాను. శరీరం త్వరగా ముసలిదయ్యిపోయే జబ్బును గురించే ఈ కథ అయినా, జబ్బును గురించి కాక, దాని చుట్టూ మనుషుల బంధాలు ఎంత అందంగా అల్లుకున్నాయో చూపించిన తీరు మనసును బరువెక్కించక తప్పదు. టేక్ ఆఫ్ కావడానికి నిరాకరించే ఫ్లైట్‍లో    కూర్చొని చదివితే, అమాంతంగా జీవితం మీద తీపి, మమకారం కలిగించేస్తుంది ఈ రచన.

ఒక ప్రపంచ పటం తీసుకొని, నేను చదివిన – ఖచ్చితంగా చెప్పాలంటే, నా మీద ప్రభావం చూపిన – రచయితలు అమెరికా నుండి, ఇటాలీ గుండా, చైనా మీదుగా, జపాన్ వరకూ కొనసాగింది. ఎప్పటి నుండి చదవాలనుకుంటున్న జపాన్, చైనా రచనలు ఈ ఏడాదిలో జరిగింది. మిలన్ కుందేరాతో పాటు, చెక్ నుండి నన్ను మెప్పించిన మరో రచయిత, Bohumil Hrabal. వీరి రచన “Too loud a solitude” గురించి నాకు చెప్పటం నా వల్ల కాదు. మళ్ళీ చదువుకోవటం తప్ప.

అమెరికన్ రచయితల గురించి అయితే, ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముళ్ళపూడి గారి పంథాలో చెప్పాలంటే, అభద్రతాభావానికీ, అసంతృప్తికీ వ్యంగ్యం, హాస్యమనే సూట్ వేస్తే, అమెరికన్ రచయితలు తయారు అవుతారు. ఒక డొరతీ పార్కర్, ఒక జోసెఫ్ హెల్లర్ల ప్రభావం నుండి ఇంక తప్పించుకోక ముందే, గ్రూచో మార్క్స్ చదివాను. ఉత్తరాలు చదవటమంటే నాకు చాల ఇష్టం కాబట్టి, గ్రూచో ఉత్తరాల సంకలనం “Groucho Marx Letters” నుండే మొదలెట్టాను. ఇందులో వారి కుటుంబ సభ్యులకూ, వ్యాపార రిత్యా కల్సిన వ్యక్తులకూ, స్నేహితులకూ రాసిన రచనలున్నాయి. కమెడియన్ అన్న మాస్క్ తీసేస్తే కొందరు కళాకారులు మామూలు మనుషుల్లానే అనిపిస్తారు. గ్రూచో మాత్రం అత్యంత సన్నిహితులకు రాసేటప్పుడైనా, లేక వివాదాలను పరిష్కరిస్తున్నప్పుడైనా ఒకటే పంథా అవలంబిస్తారు. ఆయన హాస్యప్రియత్వం ప్రపంచాన్ని ఎందుకు ఉర్రూతులూగించిందో ఈ రచనలు చదివితే తెలుస్తుంది. ఆయన ఆత్మకథ అయిన “Groucho Marx and Me” అన్న పుస్తకం కూడా ఒక ఆణిముత్యం.

ఈ అమెరికన్ రచనలన్నీ చదివితే, నవ్వాగదు. ఆగాక, ఆలోచించే ఓపిక మిగులుంటే, వీరు లేవనెత్తే ప్రశ్నలు ఎంత క్లిష్టమైనవి అంటే, వాటిని తప్పించుకోడానికి, మళ్ళీ ఇవే చదువుకుంటూ ఉన్నాను. ఆశ్చర్యంకలిగించే విధంగా, ఒక పాఠ్య పుస్తకం ద్వారా నాకు Jerry Seinfeld పరిచయం అయ్యాడు. సరేనని, కొన్నాళ్ళకి ఆయన పుస్తకం Sein Language దొరకబుచ్చుకున్నాను. నిత్యజీవితంలో పరిపాటైన విషయాలను కొత్త కోణంలో చూపటంలో వీరికి వీరే సాటి. అర్రే.. ఆడవారు షాపింగ్‍కు వెళ్ళి, ఏదో డ్రస్ ఎన్నుకున్నాక, దాన్ని వేసుకొని చూడ్డానికి గదిలోకి పోకుండా, అద్దం ముందు నుంచొని, నలభై ఐదు డిగ్రీల ఆంగిల్ లో కాలు పైకి లేపి చూసుకుంటారు అని కామెంటు విసిరుతాడు. నేను డ్రస్ సెలెక్ట్ చేసుకుంటే, పక్కన జెర్రీ లాంటి వాళ్ళు లేరు కదా, అని ఒక సారి తరచి చూసుకుంటాను. ఇంకెవ్వరైనా అద్దం ముందు ఆ విన్యాసం చేస్తే, నవ్వాగక ఆపుకోలేక, తంటాలు పడతాను. ఇవే కాదు, సభ్యత చట్రంలో ఇరుక్కున్న మానవ నైజాల గురించి కూడా చక్కని హాస్యపు వ్యాఖ్యానం ఉంటుంది.

వైదేహి శశిధర్ గారి ఆహ్వానిస్తే, వారి నాన్నగారి పుస్తకం ఆవిష్కరణ సభకు వెళ్ళాం. టాక్స్ ఆండ్ ఆర్టికల్స్ బహు చక్కని పుస్తకం. అప్పుడెప్పుడో కొత్తపాళిగారి బ్లాగులో Kite Runner బుక్ గురించి చదివి, అప్పుడే కొనేసి, ఇన్నాళ్ళకు చదివాను. చాలా నచ్చింది రచన. సరళంగా సాగుతూనే సమాజంలోని సంక్లిష్టతను చాటుతూనే ఉంటుంది.

You Might Also Like

5 Comments

  1. Purnima

    ఓహ్.. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. పుస్తకంలోని విషయాన్ని నేను తక్కువగానే చెప్తాను.. అలా తక్కువ చెప్పడానికే ప్రయత్నిస్తాను. చదివేటప్పుడు నాకు నచ్చిన లైన్లు, మరీ అవసరమనిపిస్తే తప్ప, ఇక్కడ పెట్టను. తమకి ఇష్టమైన పుస్తకాల్లో ఇష్టమైన వ్యాఖ్యలనో, సన్నివేశాలనో నా పరిచయంలో రాయలేదని నిరాశపడ్డ మనుషులూ ఉన్నారు. అయినా, నేనలానే రాస్తాను. కారణం: పుస్తకం చదవటం అనేది నా అనుభవం మేరకు, ఓ కొత్త మనిషితో అనుబంధం ఏర్పర్చుకోవటం లాంటిది. ఇప్పుడు నా స్నేహితుణ్ణి పరిచయం చేయాలనుకుంటే, అతని ఒడ్డూపొడవు, రంగూ రూపం గురించి చెప్పను. అతడి గుణగణాల చిట్టాలో సందర్భానుసారంగా ఏవో ఒకట్రెండు చెప్పుకోవచ్చు. కాని, ఎక్కువగా మాట్లాడేది, అతడితో నాకున్న అనుబంధం గురించి, మా ఇద్దరి సఖ్యత గురించి. నేను దీన్నే ఆధారంగా చేసుకొని పుస్తకాల గురించి రాస్తాను. అందుకని, నేను పుస్తకానికి శాయశక్తులా, రచయితకు, పబ్లిషర్, సెల్లర్ త్రయానికి ప్రయత్నలోపం లేకుండా అన్యాయం చేస్తుంటాను మాట! 😛 నేను న్యాయం చేసేది, చేయాలనుకునేది, నాలోని పాఠకునికి మాత్రమే.. however inefficient that reader might be!

    “పుస్తకంలో ఏముందో చెప్పు.. నీకేమనిపించిందో మాకెందుకూ?” అన్న ప్రశ్నా ఎదురయ్యింది. వారికి నా సమాధానం, “నమస్కారం!” 🙂

  2. Purnima

    ఈ మధ్య నా బ్లాగులో వచ్చిన కమెంట్, రమేశ్ చేశారు. నా బ్లాగుకన్నా పుస్తకానికి సరిపోతుందని, నా జవాబూ అందవలసిన వాళ్ళకి అందుతుందని, ఇక్కడ పెడుతున్నా…

    >> మీరు చాలా బాగా వ్రాస్తున్నారండి.
    మీ blogs (P&I, ఇది, మరియు పుస్తకం) కొన్ని రొజుల నుంచి చదువుతున్నానండి. కానీ comments పెట్టలేదు. ఒక కారణం కొన్ని చాలా, చాలా బాగా నచ్చి (మరీ public forum లో ఎక్కువగా పొగిడేస్తే బాగోదేమో అని), కొన్ని మరీ అంతగా నచ్చక.

    మీ reviews చదివాక, నేను A Fraction of the Whole, The Man Who Knew Infinity పుస్తకాల్లు చదవటం మొదలు పెట్టాను. A Fraction of the Whole – ఒక (finctional) biography తో భయపెట్టవచ్చు అని తెలియచేసిన పుస్తకం.

    నేను పుస్తకాలు చదవటం చాలా తక్కువ. చదివినవి, చదివేవి కొన్ని కూడా non-fiction మాత్రమే. అలాంటి నేను fiction చదవటం మొదలు పెట్టానంటే చాలా వరకు మీరు వ్రాసిన పుస్తక పరిచయాల ప్రభావమే. మీరు వ్రాసిన వాటిల్లో నాకు నచ్చిన reviews, చాలా వరకు మీరు పుస్తకానికి అన్యాయం చేసి, author కి న్యాయం చేసేలా ఉన్నాయా అనిపిస్తుంది – ఎందుకంటే, మీరు పుస్తకం లో ఉన్నది తక్కువ చెప్తారు, కానీ పుస్తకం కొనిపిస్తారు.

    ********************************

    రమేశ్ గారికి:
    ముందుగా, వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు! వ్యాసకర్తల రచనా ప్రతిభను పొగడడానికి కాకుండా, పుస్తక విషయాల గురించి చర్చిస్తూ మరికొన్ని వ్యాఖ్యలు వస్తే బాగుంటుంది. మీరు చదివిన పుస్తకాల గురించి చెప్తూ ఉండండి, నచ్చినా, నచ్చకున్నా! పుస్తకం.నెట్‍ను ఒక full fledged forumగా మార్చాలంటే నిర్వాహకపరంగా కలగలిగే ఇబ్బందుల వల్ల ఆగిపోతున్నాం కానీ, ఈ సైటు ఉన్నదే పుస్తకాల గురించి మాట్లాడుకోడానికి. You could blast me for a recommendation and demand compensation. For which, I could blast you, in turn.. and that’s the whole fun of forums, I guess. 😛 (I was kidding! I’m too lazy for all of that.)

    మీరు నా పరిచయాలు (అవి రివ్యూలు కావు) చదివి, ఆయా పుస్తకాలు కొన్నందుకు – dumping my modesty – I’m super thrilled. ఫ్లిప్‍కార్ట్ ద్వారా కొన్ని పుస్తకాల కొనుగోళ్ళు జరుగుతున్నాయని గుర్తించినా, మీరు నేరుగా చెప్పటం వల్ల, అధికారికంగా ఆనందపడచ్చు నేను. 🙂 ఒక్కో సారి ఓ పుస్తకం చదవటానికి మూడు గంటలు పడితే, దాని గురించి రాయడానికి ఆరు గంటలు పడుతుంది. తీరా అంత కష్టపడీ రాసాక, నాకే నచ్చుతుందో లేదో తెలీదు. దీనికి తోడు, ఎంత చదివినా రాయని వాళ్ళు నా బద్ధకాన్ని ఊరిస్తుంటారు. ఇన్ని అవాంతరాల మధ్య చేతనయీ అవ్వకుండా నేను రాసినదాన్ని, సహృదయంతో మెచ్చుకున్నందుకు నెనర్లు.

    కాకపోతే ఇక్కడో చిక్కు. పుస్తకం.నెట్‍లో తొంభై శాతం పైగా వ్యాసాలు, “ఈ పుస్తకం ఎలా ఉంది?” అన్నదానికి సమాధానంగా ఉండవు. “ఈ పుస్తకం నాకేం అనిపించేలా చేసింది?” అనేలా ఉంటాయి. సచిన్ బాటింగ్ చేస్తుంటే ఏ లెంత్ బాల్‍కి, ఏ ఫుట్‍వర్క్ తో, ఏ వైపు షాట్ కొట్టి ఎన్ని పరుగులు చేసాడన్న వివరణలు ఇక్కడ చాలా అరుదు – రవిశాస్త్రులు takkuva కాబట్టి. ఇక్కడ ఎక్కువగా వినిపించేవి స్టాండ్స్ లో ఉన్నవారి అరుపులు, కేకలు, చప్పట్లు.. కొన్ని సందర్భాల్లో తిట్లు. నేను రాసినవన్నీ ఈ కోవకే చెందుతాయి. అందుకని, అయాచితంగానే అయినా, ఒక సలహా.. నేను పరిచయం చేసేవి ఎక్కువగా ఇంగ్లీషు రచనలే కాబట్టి, నేను వ్యాసం చివర్న ఇచ్చిన లింకులూ, గూగుల్‍ని అడిగితే వచ్చే లింకులూ, ఒక మారు చూసుకొని, పుస్తకం మీకు నచ్చే అవకాశాలుంటేనే కొనుక్కోండి. ఎందుకిలా చెప్పటం అంటే, ఎంతలేదన్నా పుస్తకాలు వందలు పోస్తే గాని రావు. తీరా అది నచ్చకపోతే, డబ్బూ పాయె.. అంత కన్నా ముఖ్యంగా దాన్నేం చేసుకోవాలో తెలియదు, దుమ్ముపట్టించటం తప్ప. ఇంకెవ్వరికీ అమ్మలేం. అంటగట్టలేం. అందుకని చెప్తున్నాను. పుస్తకాన్ని తెరచి, తరచి చూసే అవకాశం ఉంటే వదులుకోకూడదు.

    పుస్తకాలను కొనిపించటం నా ముఖ్యోద్దేశ్యం కాదు. పుస్తకం.నెట్‍ది అసలే కాదు. పుస్తకాలను చదివింపజేయటం అనేది లక్ష్యంగా పెట్టుకుంటే లక్షణంగా ఉంటుందేమోగాని, ఎందుకు ఊరికే అంతలేసి బాధ్యతలు?! పుస్తకం.నెట్ ముఖ్యోద్దేశ్యం పుస్తకాలను చదివి, వాటిని గురించి రాయడానికి ఇష్టపడేవారికి ఒక వేదిక అవ్వటం. అంతే! అందులో నావంతుగా నాకున్న మిడిమిడి జ్ఞానంతో చదవగలిగినవి చదివి, వాటిని గురించి యధాశక్తి రాయటం. అదీ సంగతి! 🙂

    Thank you!

    Purnima

    PS: P&I and my buzz have been laid to rest, because of maintenance issues. My new micro-blogging adobe is talkingtodead.tumblr.com – only till tumblr holds me from freaking out! 🙂

  3. Madhu

    Meerut aru pustakalani Calais cheeses. Any way it is a good article to read. I enjoyed reading your article.

  4. SrInivas Vuruputuri

    “రొలాండ్ బార్తెహెస్ గాని తెలుగువాడయ్యుంటే, Language is a whip అని ఇంగ్లీషులో అని తెలుగువాడనిపించుకునే వాడు.”. So funny! రమణ గారి పలుకుబడి మీకు బాఘా పట్టుబడి పెట్టుబడిగా మారిపోతోంది.

  5. ఆ.సౌమ్య

    అమ్మో, నేను చదవాల్సినవి ఇంకా ఎన్ని పుస్తకాలున్నాయో! 🙁

Leave a Reply