Astrophysics for people in a hurry – పుస్తక పరిచయం

వ్యాసకర్త: అమిధేపురం సుధీర్

*******

చాలా రోజుల క్రితం Cosmos a personal voyage అనే టీవీ సిరీస్ చూసాను. కార్ల్ సాగన్ వ్యాఖ్యతగా వ్యవహరించిన ఆ టీవీ సిరీస్ చాలా బావుంటుంది. దానికి కొనసాగింపుగా Cosmos: A Spacetime Odyssey అనే టీవీ సిరీస్ వచ్చింది. దానికి వ్యాఖ్యత Neil deGrasse Tyson. అలా మొదటి సారి ఆయన పేరు విన్నాను. తర్వాత నుంచి ఆయన్ని ట్విట్టర్ లో ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. అప్పుడే Astrophysics for the people in a hurry అనే పుస్తకం గురించి తెలిసింది. చదవాల్సిన పుస్తకాల జాబితాలో దీన్ని చేర్చినా, చాలా రోజులు వరకు ఈ పుస్తకాన్ని కొనే ప్రయత్నం చేయలేదు. మొన్న ఫెబ్రవరి లో జరిగిన బుక్ ఫేయిర్ లో ఈ పుస్తకం దొరికింది. కొని చదవగలిగాను.

పేరుకి తగ్గట్టే ఇది చాలా చిన్న పుస్తకం. రచయిత అప్పుడప్పుడూ వ్రాసిన వ్యాసాలన్నీ ఒక దగ్గర కూర్చిన సంకలనం. మొత్తం 12 వ్యాసాలు, అతి సరళమైన భాష లో, ఈ విషయం మీద కనీస అవగాహన వున్న ఎవరికైనా చాలా సులభంగా అర్థమయ్యే విధంగా వున్నాయి. న్యూటన్ భూమ్యాకర్షణ శక్తిని కనుగొనడం, దాని సూత్రాలను మరింత విస్తరించి, ఐన్ స్టీన్ రిలేటివిటీ ని ప్రతిపాదించడం. ఆ తర్వాత పెరిగిన టెక్నాలజీ తో మరింత విస్త్రుతంగా ఖగోళ శాస్త్ర పరిశోధనలు జరుగుతుండడం. డార్క్ మాటర్ అనే ఒక శక్తి వుందేమో అన్న అనుమానం రావటం, ప్రస్తుతం దాని గురించి పూర్తిగా తెలీకపోయినా, డార్క్ మాటర్ ఉనికిని చాటడానికి కావలిసిన ఋజువులు సంపాదించడం వరకూ ఇందులో వుంటుంది.

టెక్నాలజీ పెరిగి శాస్త్ర పరిశోధనలు మెరుగవుతున్న కొద్దీ, మనం ఊహిస్తున్న దానికన్నా ప్రపంచం విశాలమవుతూనే వుంది. మార్వెల్ సినీమాలలో చూసినట్టు కాకుండా నిజంగానే Multiverse అనే కాన్సెప్ట్ ని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు అన్న విషయం ఆశ్చర్యమనిపించింది. ఎంతైనా హాలీవుడ్ సినీమాలు సైన్స్ లోని కాన్సెప్ట్స్ ని జోడించి కథలు అల్లుకోవడం బావుంది.

ఇందులో కొన్ని పరిశోధనల గురించి చదువుతుంటే టెక్నాలజీ కన్నా సృజనాత్మకత  ఎంత విలువైందో అర్థమయ్యింది. కాంతికీ, ఉష్ణొగ్రతకి మధ్య వున్న సంబంధం మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారు. మన కళ్ళకి కనపడే visible light ని న్యూటన్ కాలం లో నే ఒక Prism ద్వారా విచ్చిన్నం చేసి, అందులో ఏడు వర్ణాలు వున్నాయి అన్న విషయం కనుక్కున్నారు. అయితే మన కంటికి కనపడని దేని వల్లనో కూడా ఉష్ణం జనిస్తుంది అన్న విషయం అర్థమయినా దాన్ని ఋజువు చేయలేకపోయారు. 1800 సంవత్సరం లో హెర్షెల్ (Herschel) అనే ఒక శాస్త్రవేత్త ఒక సాదారణమైన ప్రయోగం చేసాడు. prism ద్వారా కాంతిని విచ్చిత్తి చేసి, ఏడు రంగులని విడదీసి, ప్రతీ రంగు యొక్క ఉష్ణోగ్రతని కొలిచాడు. అలా కొలుస్తున్నప్పుడు, చివరిదైన ఎర్ర రంగు పక్కన పెట్టిన thermometer ఎరుపు రంగుకంటే ఎక్కువ ఉష్ణొగ్రతని నమోదు చేసింది. అప్పటివరకూ ఊహిస్తున్న కనపడని రంగు కి Infrared అని పేరు పెట్టారు. ఆ తర్వాత కాలంలో Violet రంగుకి ఇవతల కూడా ఉష్ణం జనిస్తుంది అని కనిపెట్టారు. దానికి Ultraviolet అని పేరు పెట్టారు. ఈ రోజుల్లో Infrared ఉప యోగాలు ఎన్నో మనం మన నిత్య జీవితం లో చూస్తున్నాం. డాటా ట్రాన్స్ఫర్ నుంచి జ్వరం వస్తే టెంపరేచర్ చూడడానికి వాడే IR Thermomter వరకు ఎన్నో వాడుతున్నాం. 

ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలతో ఈ పుస్తకం ఒక మంచి అనుభవాన్నిచ్చింది. సైన్స్ లో ఏ కొంచం ఆసక్తి వున్నా, ఈ పుస్తకం తప్పకుండా చదవండి. 

అదృష్టవశాత్తు, అదే రోజు కార్ల్ సాగన్ రచించిన Cosmos పుస్తకం కూడా దొరికింది. అది కూడా తొందర్లోనే చదవాలి అనుకుంటున్నాను. చూడాలి.

You Might Also Like

Leave a Reply