గలివర్

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

********

గలివర్… సాహస సాగర ప్రయాణాలు

మూలంః జొనాథన్ స్విఫ్ట్
స్వేచ్ఛానువాదంః కాళ్లకూరి శేషమ్మ

జొనాథన్ స్విఫ్ట్ రచనను తెలుగు వారికోసం అనువదించి శేషమ్మ గారు పాఠకులకు ఒక అద్భుత ఊహా ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. పిల్లల కోసమే కాదు పెద్దల మనసుల్లోని పసితనాన్ని మరోసారి మేల్కొలిపేందుకు కూడా ఈ కథల్ని అనువదించే పని చేసేరనిపిస్తుంది. జీవితాల్లో దైనందిన ఒత్తిళ్లు, వేగం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ రోజుల్లో సులువుగా వాటిలోంచి బయటపడేసే అందమైన మార్గాన్ని ఇలా కనుక్కున్నారేమో! 

ఆధునిక యుగంలో వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు విజ్ఞాన ఫలాల్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుని విశ్వ శాంతికి కృషి చేస్తున్న మహనీయులకు ఈ పుస్తకాన్ని అంకితమివ్వటం రచయిత్రి ఉదాత్తతను చూపుతుంది.

గలివర్ చేసిన నాలుగు సముద్ర ప్రయాణాలు గురించి పుస్తకాన్ని నాలుగు భాగాలుగా చేసి వివరంగా కథ చెపుతారు. ప్రతి భాగం చివర ఆయా ప్రయాణాల్లో గలివర్ కి ఎదురైన అనుభవాల్ని, వాటి పై రచయిత్రి చక్కని విశ్లేషణ చూస్తాం. ఒఠ్ఠి కథలుగా మాత్రమే కాకుండా ఆనాటి ఆయా ప్రాంతాల్లోని సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, మనుషుల ప్రవర్తన వంటి అనేక విషయాల్ని గలివర్ పొందుపరిచారు. పుస్తకాన్ని ఒక్కోభాగంగా సింహావలోకనం చేసుకుందుకు ఇది వీలుగా ఉంది.

ముందు మాటలో ముక్కామల చక్రధర్ గారు రచయిత్రి వచనం తనను ఎంతో ఆకర్షించిందంటారు. పూర్వం ఈ పుస్తకం గురించిన అనువాదాలు వచ్చినా ఇప్పటి సామాజిక సమస్యలు, వాటి వల్ల వ్యక్తులు ఎదుర్కొంటున్న బాధలు పోయి, అందరి సంక్షేమం గురించిన ఆకాంక్ష తనను ఈ పుస్తకాన్ని రాసేందుకు, మరొకసారి అనువదించేందుకు ప్రేరణ అయిందని రచయిత్రి చెప్పారంటారు.

“ప్రపంచాన్ని దారి మళ్లించకుండా ఇబ్బంది పెట్టటానికి” గలివర్ యాత్రల్ని రాసానన్న స్విఫ్ట్ మాటల్ని తన ముందు మాటలో జె. విజయ చెప్పారు. తన స్వేచ్ఛానువాదంతో కథలన్నీ కంటి ముందు కనిపించేలా రాసిన రచయిత్రిని విజయ అభినందించారు.

రచయిత్రి శేషమ్మ గారి తమ్ముడు శివ జొన్నలగెడ్డ తన ముందు మాటలో జొనాథన్ రాసిన ఈ పుస్తకం ఇప్పటివరకూ ప్రపంచంలో ప్రచురించిన మొదటి 100 ఉత్తమ నవలల్లో ఒకటిగా చెప్పారు. ఈ క్లాసిక్ ను అనువదించి తెలుగు పాఠకుల దృక్పథాన్ని విస్తృతం చేసే ప్రయత్నం చేసిన రచయిత్రిని అభినందించారు.

రచయిత జొనాథన్ స్విఫ్ట్ 1667 లో ఐర్లండ్ లో జన్మించారు. 1726లో గలివర్ ప్రయాణాలు రాసారు.

రచయిత్రి తన మనసులో మాట చెపుతూ, జొనాథన్ స్విఫ్ట్ జీవితకాలంలో చూసిన ఒడిదుడుకులు ఆయన రచనలపై ప్రభావం చూపిందంటారు. సామ్రాజ్యవాదము, వలసల పేరుతో ఇతర దేశాలను కొల్లగొట్టటం, సైనికుల దాష్టీకం, సామాన్యుల జీవితాల్నెలా కష్టాల్లో ముంచెత్తాయో జొనాథన్ ను కలవరపరచాయి. సంస్కృతంలో విష్ణుశర్మ రాసిన నీతిచంద్రిక కథల్లో వివిధ పక్షులు, జంతువుల ద్వారా రాజనీతి, ధర్మం, సమాజ శ్రేయస్సు వంటి విలువలను తెలియపరిచాడు. ఇలాటి విషయాలనే జొనాథన్ కల్పనలు, వ్యూహాలు, వ్యంగ్యం, అతిశయోక్తి వంటి అనేక లక్షణాలతో ఉన్న పాత్రల ద్వారా చెప్పాడంటారు శేషమ్మ గారు. ప్రస్తుత సమాజంలో ఉగ్రవాదం, పదవీ వ్యామోహం, కులమత భేదాల వంటి అవలక్షణాలను చూస్తున్నప్పుడు వీటికి జవాబులు జొనాథన్ రాసిన పుస్తకంలో దొరికాయంటూ, తన అన్వేషణ ఫలించిందన్న సంతోషంతో పుస్తక అనువాదానికి పూనుకున్నట్టు చెప్పారు.

మొదటి భాగం

లిల్లీపుట్ల రాజ్యంలో పర్యటన

గలివర్ కళాశాల విద్య తరవాత శస్త్రవైద్యంలో శిక్షణ తీసుకున్నాడు. సముద్రయానం, గణితం, ఫిజిక్సు వంటివి అధ్యయనం చేసిన గలివర్ కు సముద్రయానం పట్ల ఎంతో ఇష్టం. నేర్చుకున్న విద్యలన్నీ సముద్రయానానికి ఎంతో సహాయకారిగా ఉండేవే. గలివర్ నేర్చుకున్న నైపుణ్యాలు, భాషలు అతను ప్రయాణించిన అన్ని ప్రాంతాలలోనూ ప్రజలతో మమేకమై జీవించేందుకు ఎంతగానో తోడ్పడ్డాయి.

తన సముద్ర ప్రయాణాలు, ఎదురైన అరుదైన అనుభవాలు, అక్కడి ప్రాంతపు మంచి చెడ్డలు, ఆ సమాజంలోని ప్రజలు, వారి తీరుతెన్నులు, రాజ్య వ్యవస్థ, పరిపాలన గురించి గలివర్ వివరంగా రాసుకున్నాడు.

1699 నాటికి గలివర్ అప్పటికే అనేక సముద్ర ప్రయాణాలు చేసి అలిసిపోయాడు. అయినా కుటుంబ ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని సముద్ర ప్రయాణానికి సిద్ధమవుతాడు. కెప్టెన్ విలియం ప్రిచర్డ్ వద్ద ఉద్యోగంలో చేరి, బ్రిస్టల్ నుంచి ప్రయాణం ప్రారంభించి, దక్షిణ సముద్రం వైపుగా బయలుదేరుతాడు. మొదట్లో సౌకర్యంగా సాగిన ప్రయాణం, తూర్పు దీవులు దాటుతుండగా తుఫాను ఎదురవుతుంది. క్రమంగా సిబ్బంది అంతా మరణించటం, చెల్లాచెదరవటంతో గలివర్ ఒంటరిగా ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి చేరుకుంటాడు.  

అలా గలివర్ లిల్లీపుట్ల రాజ్యానికి చేరాడు. ఇక్కడి ప్రజలు కేవలం ఆరు అంగుళాల ఎత్తు మాత్రమే ఉంటారు. అక్షరాస్యతలో అగ్రగణ్యులు. గణితం, యుద్ధపరికరాలు తయారీలో నేర్పరులు. మంచి భాషా నైపుణ్యం కలిగినవారు. వారి రాజభవనం, ఇతర నిర్మాణాలు నేటి మన ఆధునిక కాలంలో చూస్తున్న విధంగా అందంగా నిర్మించుకున్నారు. ఆర్థిక శాస్త్రం మీద వీరికి మంచి పట్టు ఉంది. ప్రభుత్వ పనితీరు గొప్పగా ఉంది. దొంగతనం కంటే నమ్మకద్రోహం చేసినవారికి, కృతఘ్నత చూపిన వారికి తీవ్రమైన శిక్షలు విధించేవారంటాడు. ఉద్యోగ నియామకాల్లో నిజాయితీకి పెద్ద పీట వేసేవారు. క్రమంగా తన పట్ల అక్కడి చక్రవర్తి, ఉన్నతాధికారుల విశ్వాసాన్ని గెలుచుకుంటాడు గలివర్. 

పిల్లల చదువు, వారిని ఉత్తమ పౌరులుగా ఉన్నత విలువలతో పెంచటం వంటి బాధ్యతను ప్రభుత్వమే పూర్తిగా తీసుకుంటుంది. కానీ వారు చిన్నప్పటినుంచీ తల్లిదండ్రులకి దూరంగా హాస్టళ్లలో ఉండవలసి వచ్చేది. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య అనుబంధానికి ప్రాధాన్యత ఉండేది కాదు.

ఇంత ప్రతిభావంతమైన రాజ్యంలో అంతర్యుద్ధాలు తరచు జరుగుతూ రాజ్యం అశాంతి పాలవుతుండేది. ఉదాహరణకి, ఎత్తు మడమల చెప్పులు వేసుకోవాలా, సామాన్యమైనవి వేసుకోవాలా అనీ, కోడి గుడ్డును ఏ వైపు నుండి తెరవాలనీ అర్థంలేని చిన్నచిన్న కారణాలు వాటికి కారణం అంటాడు. నిజాయితీకి పెద్ద పీట వేసే రాజ్యంలోనూ రాజుకో నీతి, సామాన్యులకో నీతి ఉందంటాడు. పొరుగు రాజ్యం నుంచి ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు గలివర్ శక్తియుక్తులు ఉపయోగించుకుంటాడు రాజు. కానీ ఆ రాజ్యాన్ని ఓడించి స్వాధీనం చేసుకోవాలన్న రాజకుమారుడి ఆలోచనను కాదన్న గలివర్ పై అంతలోనే ద్వేషాన్ని పెంచుకుంటాడు. 

అంతేకాక గలివర్ రోజుకు తినే ఆహారం రాజ్యం పై ఆర్థిక భారం మోపుతోందన్న కోశాధికారి లెక్కలు ఆశ్చర్యం కలిగిస్తాయి. రోజుకు 1724 మంది లిల్లీపుట్లకు సరిపడు ఆహారం గలివర్ ఒక్కడికి అవసరం అవుతోందన్నది వారి లెక్క. 

ఒక శ్రేయోభిలాషి రహస్యంగా చేసిన హెచ్చరికతో తెలివిగా ఆ రాజ్యం నుంచి విముక్తుడవుతాడు గలివర్. 1702 ఏప్రిల్ నాటికి ఇల్లు చేరతాడు.

రెండవ భాగము

బ్రాబ్డింగ్ నాగ్ లో పర్యటన

ఈ ప్రయాణం 1702 జూన్ లో ప్రారంభమైంది. భారత దేశంలోని సూరత్ గమ్యంగా ఈ ప్రయాణం మొదలవుతుంది. మెడగాస్కర్ జలసంధి దాటిన తరువాత తీవ్రమైన గాలులు మొదలై ఓడ తూర్పువైపుకు ప్రయాణించింది. బ్రాబ్డింగ్ నాగ్ చేరతాడు. అక్కడి భారీకాయుల్ని చూసి రాక్షసుల్లాగా ఉన్నారనుకుంటాడు. అక్కడి వారు తమ యజమాని దగ్గరకు గలివర్ ను తీసుకెళ్తారు. క్రమంగా గలివర్ ఒక మనిషేననీ, వివేకం, ఆలోచన ఉన్నవాడని యజమానికి అర్థమవుతుంది. యజమాని కుమార్తె గలివర్ సంరక్షుకురాలిగా మారుతుంది. యజమాని గలివర్ ను ఒక వింత జీవిగా ప్రదర్శనకు పెట్టి ఆదాయాన్ని ఆర్జించటం మొదలు పెడతాడు. గలివర్ శక్తి క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. అలాటి దశలో ఒకానొక రాజాస్థానంలో జరిగిన ప్రదర్శనలో అక్కడి రాణి దయకు, ప్రేమకు పాత్రుడై తన యజమాని నుండి విముక్తుడవుతాడు గలివర్.

రాజ్యంలో మనుష్యుల భారీ ఆకారానికి తగినట్టే వారి అవసరాలకు అనుగుణంగా ప్రకృతి సంపద సమృద్ధిగా ఉంటుంది. గలివర్ దేశం గురించి, ప్రభుత్వం, విధులు, ఆచారాలు ఇలా అనేక విషయాల గురించి రాజు అడిగి తెలుసుకుంటాడు. కానీ గలివర్ చెప్పిన మాటలను నమ్మడు. తరచుగా యుద్ధాల గురించి చెపుతున్నావు. మీరంతా తరచు గొడవలకు దిగుతారని అర్థమవుతోందంటాడు. పైగా గలివర్ దేశంలో శాసన సభ్యులు అసమర్ధులని, న్యాయం, చట్టం లెక్కచెయ్యరని అంటాడు. తమదే గొప్ప దేశం అన్న భావం కలవాడు రాజు. 

తుపాకీ మందును తాను తయారు చెయ్యగలనని, ఇతర దేశాలపై దండయాత్ర చెయ్యవచ్చని గలివర్ చెప్పినప్పుడు రాజు అలాటి హీనమైన పని తాను ఒప్పుకోనని, రాజ్యంలో సగభాగం కోల్పోయినా ఫర్వాలేదని అంటాడు. అంతేకాక మానవాళిని, జీవాలను, సంపదలను నాశనం చేసి మరణాలకు కారణం కాకూడదని, చేతనైతే మానవుడు తనకు మరికొంత ఆహారం, పశువులకు మరింత గ్రాసం పండించగలగాలని చెపుతాడు. ఉత్తమ విలువలను తెలుసుకో అంటాడు.

ఈ బ్రాబ్డింగ్ నాగ్ దేశం జపాన్ కు, కాలిఫోర్నియాకు మధ్య ఉందని, రాజధాని లాల్ బృల్ గ్రడ్ అని చెప్పాడు. 1706 జూన్ నాటికి యాత్ర ముగించి ఇల్లు చేరతాడు గలివర్. ఈ పర్యటనలో మనిషిలోపెరుగుతున్న వాణిజ్య సంస్కృతిని విమర్శిస్తాడు. ప్రతి దాన్నుంచీ ధనం సంపాదించాలన్న ఆశ.

మూడవ భాగం

లాపుటా, బాల్నిబార్బీ, గ్లబ్ డబ్ డ్రిబ్, లుగ్గనాగ్, జపాన్ లలో గలివర్ పర్యటన

1706 ఆగష్టులో హోప్ వెల్ అన్న నౌకలో విలియం రాబిన్ సన్ కెప్టెన్ గా మరొక ప్రయాణానికి గలివర్ బయలుదేరాడు. ఫోర్డ్ సెయింట్ జార్జ్ దగ్గర కెప్టెన్ సరుకు కోసం ఆగవలసి రావటంతో, కొంత సరుకుతో, సిబ్బందితో గలివర్ ను మరొక పెద్ద పడవతో బయల్దేరదీస్తాడు. ఇంతలో తుఫాన్ రావటంతో పడవ దిశ మారుతుంది. సముద్రపు దొంగలు గలివర్ పడవను వెంబడించి సరుకుల్ని తీసేసుకుంటారు. అక్కణ్ణుంచి ఒంటరిగా గలివర్ ను చిన్న పడవలో వదిలివేస్తారు. సముద్రంపై తేలుతున్న ద్వీపాన్ని గమనిస్తాడు. అది ఆకాశంలో ఎగురుతుంది కూడా. గలివర్ ప్రాధేయపడటంతో ఆ ద్వీపంలోకి గలివర్ ను ఆహ్వానిస్తారు. ఇక్కడి ప్రజలు లిల్లీపుట్ల లాగా చిన్నగానూ, బ్రాబ్డింగ్ నాగ్ వారిలా భారీగానూ కాక సాధారణ యూరప్ వాసుల్లాగా ఉంటారు. గలివర్ కు అక్కడి భాషను నేర్పించే ఏర్పాటు చేస్తాడు రాజు. 

రాజు అనుమతితో రాజ్యంలో పర్యటన చేస్తూ అనేక విషయాలను తెలుసుకుంటాడు. రాజధాని లాగడో లో వ్యవసాయంలో కొత్త పనిముట్లతో ఎక్కువ ఫలసాయాన్ని పొందచ్చన్న తీర్మానాలు చేస్తారు కానీ అవన్నీ కాగితాలకే పరిమితం అవటంతో ప్రజలు పేదరికం, ఆకలితో అలమటిస్తుంటారు. ఒక పెద్ద భవంతిలో వేరువేరు ప్రయోగాలు జరుపుతుంటారు. ఉదాహరణకి, తేనెటీగ, సాలీడు లాగా ఇళ్లను నేల మీద పరిచి కట్టి, దాన్ని నిలబెట్టి సిద్ధంచేసే ప్రయోగం, భాషను కుదించి కేవలం నామవాచకాల్ని మిగల్చటం ఇలా అనేక అర్థం లేని ప్రయోగాలతో ఉక్కిరిబిక్కిరిగా ఉంటాయి ఆ ప్రయోగశాలలు.

మరొక ప్రదేశంలో మంత్రగాళ్ల జాతికి చెందిన వారే పాలకులు. అక్కడ చనిపోయిన వారిని పిలిచి వారితో మాట్లాడే అవకాశం ఉంది. గలివర్ తను కోరుకున్నట్టుగా అలెగ్జాండర్ ను, జూలియస్ సీజర్ ను, పాంపెయ్, అరిస్టాటిల్, హోమర్ వంటి ప్రసిద్ధులను చూడగలుగుతాడు. (వారి వివరాలను, ఫోటోలను కూడా పుస్తకంలో జతచెయ్యటం బావుంది.)

స్ట్రల్డ్ బర్గ్స్ ప్రాంతంలో అమరజీవులుంటారని తెలిసిన గలివర్ సంతోషిస్తాడు. తాను అలా పుడితే ఆదర్శవంతమైన సమాజాన్ని సృష్టిస్తానని ప్రకటిస్తాడు. కానీ అక్కడ వాస్తవంగా వృద్ధులను ప్రభుత్వమూ, పిల్లలూ పట్టించుకోకపోవటంతో వృద్ధులు భిక్షాటనలో జీవిస్తూ, దీనస్థితిలో మరణిస్తారని అర్థమవుతుంది. 

రచయిత్రి ఈ ప్రయాణంలో గలివర్ చూసిన సమాజం, అక్కడి అస్తవ్యస్త పరిస్థితులు, మనుషులుగా వారి పతనం ఇప్పటి మన సమాజాన్ని కొంతమేర ప్రతిబింబిస్తుందంటారు. జొనాథన్ దార్శనికత కు ఆశ్చర్యపడతారు. ప్రజాసంక్షేమం కాక ప్రభుత్వం ఇచ్చే ప్రలోభాలకు లోబడిపోయే ప్రజల దుస్థితిని, న్యాయవ్యవస్థ పతనాన్ని కూడా చూస్తామిక్కడ.

గలివర్ 1710 ఏప్రిల్ నాటికి ఇల్లు చేరతాడు. 

నాలుగవ భాగం

హ్యూహ్నిమ్స్ – ఒక విశిష్ట విచిత్ర తెగతో గలివర్

1710 సెప్టెంబరులో ఎడ్వంచర్ అనే నౌకలో కెప్టెన్ గా మరొక ప్రయాణానికి గలివర్ బయలుదేరతాడు. ఎప్పటిలాగే తుఫాన్ ఎదురై గలివర్ ఒక్కడే మిగులుతాడు. నౌక లీవర్డ్ ద్వీపాన్ని చేరినపుడు అక్కడి బార్బడోస్ తెగవారిని సిబ్బందిగా చేర్చుకుంటాడు. వారు గలివర్ ను బందీని చేస్తారు. 1711 మే నెలలో గలివర్ ను చిన్న పడవతో విముక్తుడిని చేస్తారు వారు.                    గలివర్ ఒక తీరాన్ని చేరి అక్కడ పశువులను తలపించే మనుష్యులను చూస్తాడు. వాళ్లు యాహూలు. వారు గలివర్ పై దాడి చెయ్యబోగా హ్యూహ్నిమ్స్ అన్న పేరుతో పిలువబడే గుర్రాలను పోలిన మనుషులు గలివర్ ను రక్షిస్తారు.

హ్యూహ్నిమ్స్ ను గలివర్ ఒక గొప్ప జాతిగా చెపుతాడు. వారి సునిశిత పరిశీలనా, నాగరికత, సమిష్టిగా జీవించే వారి శాంతి దృక్పథం, ఓర్పు, నీతి, ఉత్తమ విలువలను ఆశ్చర్యపడుతూనే గ్రహిస్తాడు. వారి జీవితాల్లోని ఆదర్శవంతమైన లక్షణాలకు తను కూడా కలిగి ఉండాలని కోరుకుంటాడు. 

అక్కడి యజమాని గలివర్ ను ఎక్కడివాడవని వివరాలు అడిగినపుడు గలివర్ తమ దేశం గురించి అక్కడి జీవన విధానం గురించి వివరంగా చెపుతాడు. అవి విన్న యజమాని నియంత్రణ లేని జీవితాలు దండుగ అని, వైద్యుల అవసరం తమ రాజ్యంలో ఉండదని చెపుతాడు. 

 గలివర్ కూడా ఈ యాత్ర అనుభవాల్ని గురించి తలుచుకుంటూ హ్యూహ్నిమ్స్ లోని శాంతి కాముకతను, మంచి లక్షణాల్ని అందరం అవలంబిస్తే ప్రపంచంలో అశాంతి ఉండదని అంటాడు. హ్యూహ్నిమ్స్ లాటి గుర్రాలను తాము రవాణాకి ఉపయీగిస్తామని యజమానికి చెప్తాడు. యాహూలను పరిశీలించి వారికి మంచిని చెప్పినా నేర్చుకొనరని, బండపనే తప్ప ఇంకేం చేతకాదని, మోసగాళ్లు, దుర్మార్గులు అని, పగతో ఉంటారని చెపుతాడు. తాను కూడా యాహూ జాతికి చెందిన వాడినే అని చెపుతూ ఎలాటి అవలక్షణాలూ లేని హ్యూహ్నిమ్స్ ను ఎంతగానో అభినందిస్తాడు. 

గలివర్ తాను చేసిన ప్రయాణాల గురించి వాస్తవ విషయాలనే రాయాలన్న సంకల్పం చేసుకుంటాడు. అనవసరపు కల్పనలు యాత్రాకథనాల్లో చెయ్యరాదంటాడు. యాహూల వంటి మానవులు హ్యూహ్నిమ్స్ లోని ఉన్నతమైన లక్షణాలను అవలంబించాలని కోరుకుంటాడు.

జొనాథన్ తన గలివర్ పర్యటనలను రాస్తూ తనదైన ధోరణిలో ప్రస్తుత సమాజపు ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లోని అవకతవకల్ని నిశితంగా విమర్శించాడంటారు రచయిత్రి పుస్తకాన్ని ముగిస్తూ. ముఖ్యంగా మూడు, నాలుగు భాగాలు ఎంతో లోతుగా చదివి అవగాహన చేసుకుని మనల్ని మనం సరిచేసుకుని మానవాళి సంక్షేమాన్ని సాధించాలంటారు. ఇది వారి ఆలోచనల్లో, అధ్యయనంలో ఉన్న పరిపక్వతను చెపుతోంది

ఇవి పిల్లలకే కాదన్నది స్పష్టం. ఆలోచనాపరులు పుస్తకాన్ని ఆమూలాగ్రంగా చదివి నేర్చుకోవలసింది ఎంతో ఉంది.

ప్రస్తుత సమాజం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని, వాటిని దాటేందుకు ఈ పుస్తకం ఉపయుక్తమని రచయిత్రి గాఢంగా నమ్ముతున్నానంటారు. అదే మనకి ఈ అనువాదాన్ని అందించింది. 

రచయిత్రికి అభినందనలు.

స్మృతి పబ్లికేషన్స్, కాకినాడ. మార్చి 2024

ధర: రూ. 150/-

You Might Also Like

Leave a Reply