Connect the Dots – Rashmi Bansal

వేసవి కాలం, వెన్నెల రాత్రి, సుబ్బరంగా భోంచేసి, అలా ఆరు బయట పడక్కుర్చీలోనో, నులకమంచం మీదో నడుం వాల్చి, ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ, ఆ చుక్కల్ని గాల్లో గీతలు గీస్తూ కలుపుకుంటూ బొమ్మలను ఊహించుకోవటం, “చూడు..చూడు, ఆ చుక్కని,ఈ చుక్కతో ఇలా కలిపితే ఇలాంటి ఆకారం వస్తుంద”ని పక్కవాళ్ళకి చెప్పి, మన కళనీ, కలనీ వాళ్ళ కళ్ళకి అప్పగించే పని చేయటం దాదాపుగా అందరి అనుభవంలోనిదే! నిదురమ్మ జోకొడుతూ కలలతీరాలకి తీసుకుపోయి, తిరుగుబండిలో వచ్చేసరికి, చుక్కలూ ఉండవు, వాటి ఆధారంగా చేసుకొన్న ఊహాచిత్రాలూ ఉండవు. ఎప్పటిలానే మళ్ళీ బతుకుబండి సాగిపోతూ ఉంటుంది. కానీ కొందరుంటారు. వాళ్ళు పగటిపూట కూడా చుక్కలు చూడగలరు. తాము గీసుకున్న గాలిచిత్రాల బ్లూ ప్రింట్ భద్రంగా దాచుకుంటారు. అంతరాళ్ళల్లో పలికే “గొంతు”ని విస్మరించక దానికి సంపూర్ణ మద్దతునిస్తారు. ప్రపంచం నిదురోయే రాత్రి పూట వీళ్ళు తపస్సు చేస్తుంటారు. “అందనంత ఎత్తా తారాలోకం? సంగతేందో చూద్దాం రా!” అని కూనిరాగాలు తీస్తూ చుక్కలకేసి నిచ్చెనలు వేసుకొంటూ, చకచకా ఎక్కేస్తుంటారు. అలాంటి అరుదైన ఇరవై మందిని పరిచయం చేస్తూ వెలువడిన పుస్తకమే, రష్మీ బన్సల్ రాసిన “connect the dots”.
అత్యంత సాధారణ కుటుంబ / విద్య నేపధ్యాలు కలిగిన యువతీయువకులు, సరళమైన సరసమైన “ఐడియా”లను ఆచరణలో పెట్టి కోట్లకి పడగలెత్తిన వైనాన్ని వివరిస్తుంది ఈ పుస్తకం. ఇలాంటి కథలూ, కథనాలూ మనం రోజూవారి వార్తల్లో చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అందుకే, ఈ పుస్తకం గురించి మొదట తెల్సినప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. నా రీడింగ్ లిస్ట్ లో స్థానం ఇచ్చే ప్రసక్తే లేదనుకుంటుండగా, సౌమ్య చదవడం మొదలెట్టి, ఇందులోని ఎన్నో విషయాలను నాతో ఉత్సాహంగా పంచుకుంది. ఆ ఉత్సాహాపు ఊపుకి కూడా పుస్తకం కొనేదాన్ని కాదు, సౌమ్య చెప్పిన కథల్లో, ప్రముఖ బుక్‍స్టోర్ క్రాస్‍వర్డస్ స్థాపకులు శ్రీరాం, అనిత దంపతుల ఉండుండకపోయుంటే! వాళ్ళిద్దరి గురించి తెల్సుకోవాలనే చదవటం మొదలెట్టాను. మొదటి పేజి నుండి చివరి పేజీ దాకా ప్రతీ పేజీ ఉత్సాహంగా చదివాను. ప్రతీ వ్యక్తి ఒక అద్భుతం, ప్రతీ వ్యక్తిత్వం అపురూపం అనిపించేలా ఉన్నాయి, కథనాలు. వీలైనంత సమయం తీసుకొని నింపాదిగా ఒక్కోరి గాథను ఆకళింపుచేసుకుంటూ చదివేసరికి, అనుకున్నదానికన్నా ఎక్కువ సమయమే పట్టింది.

హోటల్లో అంట్లు తోముకునే దగ్గర నుండి “దోశ”కు పేటెంట్లు తీసుకునేంతగా దానితో వ్యాపారం చేసిన ప్రేం గణపతి, ఇన్వెటర్ల రంగంలో విస్తృత కృషిచేసిన “సుకామ్” అధినేత కున్వేర్ సచ్‍దేవ్, “వివేకానంద స్పోకెన్ ఇంగ్లీషు కోర్సు” నుండి “వీటా – VETA” ప్రయాణించిన గణేష్ రాం, భారతంలోకి బయటి ఉత్పాదనలు రాని సమయంలో ఆడవారికి కావాల్సిన కాస్మెటిక్స్ తయారు చేసిన “ఫెమ్ కేర్ ఫార్మా” సునీత రాంనాథ్‍కర్, చెన్నైలో చైనీస్ రెస్టారెంట్ పెట్టడం నుండి జ్వరం వచ్చినప్పుడే తింటారనుకునే బ్రెడ్ ని తమిళులకి, ఇతర భారతీయులకి నోరూరించే ఎన్. మహదేవన్, చిన్న కాంట్రాక్ట్ పనులతో మొదలెట్టి, నేడు పార్లమెంట్, ప్రధాని, రాష్ట్రపతి నివాసాలను “మెయింటేన్” చేస్తున్న భారత వికాస్ గ్రూప్ వ్యవస్థాపకులు హన్మత్ గైక్వాడ్, తంత్రా టీ షర్ట్స్ అంటూ యువత ఉర్రూతలూగించిన రంజీవ్ రాంచందాని, ఐఐటి నుండి పట్టభద్రులై “లేసర్ సాఫ్ట్” అనే సాప్ట్వేర్ కంపెనీ నడుపుతూ, తమ కంపెనీలో వికలాంగులకూ చేయూతనిస్తూ, బాంకింగ్ రంగంలో ఎన్నో ప్రాడెక్ట్స్ చేసిన / చేస్తున్న “సురేశ్ కామత్”, హైదరాబాద్ లో వాల్డన్, ఆపై దేశంలో పలుచోట్ల క్రాస్ వర్డ్స్ బుక్ స్టోర్ చెయిన మొదలెట్టిన శ్రీరాం, రాగా డిజనైర్ కలెక్షన్స్ చేసిన అభిజిత్ బన్సోడ్ – ఈ పుస్తకంలో పరిచయం చేసిన కొందరి  పేర్లు.

మేనేజ్‍మెంట్ లో డిగ్రీలు లేకుండా వ్యాపారాలు మొదలెట్టి, మేనేజ్‍మెంట్ సూత్రాలను నాలుగు గోడల మధ్య కాక, నలుగురి మధ్యనా నేర్చుకుంటూ, ఆటుపోట్లను ఎదుర్కొంటూ విజయాలను సాధించిన వారిని పరిచయం చేయాలన్నది రచన ముఖ్యోద్దేశ్యం. అందుకనుగుణంగా వీరిని ఎన్నుకోవడం జరిగింది. నాకీ రచన నచ్చటానికి కారణం – పుస్తకం కొనే ముందు వీరిలో ఒక్కరి పేరూ తెలియకపోయిన, దోశాప్లాజా, సుకాం, వీటా, ఫెం, టైటన్ రాగా కలెక్షన్, వాల్డన్, క్రాస్‍వర్డ్స్ వంటివి నాకు సుపరిచితమే. అందుకే వీటి వెనకున్న మనుషులూ, వారు దీన్ని ఎలా సాధించారు అని తెల్సుకోవడం చాలా ఆసక్తికరంగా అనిపించింది. చదివే కొద్దీ అర్థమయ్యింది ఏంటంటే, వీరిలో ఒక్కరో, ఇద్దరో “జీనియస్” అని పిలవబడే వారు. తక్కినవారంతా మిడిమిడి జ్ఞానం కలవారే. నేర్చుకోవడంలో నేర్పు కనిపించారు. శైలి అంతగా బాగోకున్నా, అక్కడక్కడా తికమక పెట్టినా, చెప్పదల్చుకున్న విషయం బాగుండడం చేత ఈ పుస్తకం నాకు చాలా నచ్చింది.

వ్యాపారం అంటే చాలా రిస్క్ తో కూడుకున్నదనీ, అది మన వల్ల కాదని చాలా మంది చేతులెత్తేస్తూ ఉంటారు. కొందరు చేతులు కాల్చుకొని, ఏ బర్నాలో రాసుకుంటూ జీవితాన్ని గడిపేస్తారు. మరికొందరు అనుకున్నది సాధించే వరకూ నిద్రపోకుండా, నిద్రపోనివ్వకుండా ఇలా పుస్తకాలకి ఎక్కేస్తారు. వీరందరి గురించి చదివాక, వీరి విజయాలకు  దారి తీసిన అతి ముఖ్యమైన లక్షణం ఏదీ అని నన్నడిగితే, “తమ అంతరాత్మ చెప్పింది విని, నిజాయితీగా దాన్ని అమలుపర్చడం” అని అంటాను. “నీకు కావాల్సింది ఇదిరా.. మొర్రో” అని లోపల నుండి అరిచి గీ పెట్టేవాడి నోరు నొక్కేసి, “జీవితం ఇంతే!” అని సరిపెట్టుకునేవాళ్ళైపోకుండా, “అవును, నాకిది కావాలి” అని లోపలివాడికి వోటేసి, ఆపై ప్రపంచమంతా ప్రతిపక్షమైనా ధైర్యంగా కొనసాగి అనుకున్నది సాధించారు. “ఇంట గెల్చి, రచ్చ గెలవడం”కి ఇదో కొత్త ఉదాహరణలా అనిపించింది. ఇంకో లక్షమడిగితే, “ఉన్నదానితో సంతృప్తి పడక, ఇంకా కావాలి” అనుకుంటూ శ్రమించటం. మధ్యస్థాయి వ్యాపారులుగా మిగలాల్సిన వీళ్ళు వందల కోట్లు ఆర్జింజటానికి కారణం అదే!

మన చదువులకూ, బయట ప్రపంచానికి ఎప్పుడూ పొంతన ఉండదు. కాలేజీల్లో చదివి రాసి పాసైన పరీక్షల అనుభవం, జీవితం పెట్టే పరీక్షల ముందు నిలువలేవు. భారతదేశంలోనే అత్యుత్తమైన ఐఐటీలు కూడా ఇంతేనని అర్థమయ్యింది. కాకపోతే, వీటిలో చదివినవారికి “ఏమన్నా చేయగలం” అన్న ధైర్యం అధికపాళ్ళల్లో ఉంటుందనిపించింది కొందరి గురించి చదువుతుంటే!

“తప్పక చదవాల్సిన పుస్తకం” అని చెప్పనుగాని స్ఫూర్తిదాయకమైన పుస్తకం అని మాత్రం చెప్పగలను.

Book Details:

Connect the Dots

Author: Rashmi Bansal

Cost: Rs 150

You Might Also Like

3 Comments

  1. పుస్తకం » Blog Archive » దాదా సాహెబ్ ఫాల్కే జీవితం

    […] గుర్తు చేసినది – రష్మీ బన్సల్ తన ’కనెక్ట్ ది డాట్స్’ పుస్తకం కోసం – ఫాల్కేపై […]

  2. tolakari

    మంచి పుస్తకం గురించి తెలియచేసారు. ఇలాంటి పుస్తకాలు యువతకు స్ఫూర్తిదాయకాలు.(తొలకరి)

  3. మేధ

    “Stay Hungry, Stay Foolish” చదివిన తర్వాత రష్మీ బన్సాల్ మరో పుస్తకమనగానే చదువుదామనుకున్నాను.. మంచి పరిచయం.. త్వరలో చదవాలి..

Leave a Reply