పుస్తకం
All about booksపుస్తకభాష

March 15, 2010

On Writing – in and out of pustakam.net :)

More articles by »
Written by: Purnima

ఇదివరకూ పుస్తకం.నెట్ లో ఇలాంటి వ్యాసం రాలేదు. సైటులో ముఖ్యంగా పుస్తకాల సమీక్షలూ, పరిచయాలూ వచ్చాయి. ఎప్పుడన్నా ఎడిటోరియల్స్ రాయాల్సి వస్తే, చెప్పాలనుకున్న పాయింట్ ను సూటిగా “పుస్తకం.నెట్” పేరిట ప్రచురించాం. ఈ మధ్యనే నేను చదివిన “On Writing” చదువుతున్నప్పుడు మాత్రం, స్టీఫన్ కింగ్ మాటలను ఆసరా చేసుకుంటూ పుస్తకం.నెట్ ఉద్దేశ్యాన్ని మరింత స్పష్టం చేయొచ్చునని అనిపించింది. అందుకే ఈ వ్యాసంలో ఆ పుస్తక పరిచయం, దానితో నా అనుభవాలూ, నాకు నచ్చిన నచ్చని అంశాలతో పాటు, పుస్తకం.నెట్ ని విచ్చేసే వారికీ నా మాటగా కొన్ని చెప్పాలనుకుంటున్నాను. అంటే ఈ వ్యాసం – part book review, part editorial. సైటుని విచ్చేసే వారందరికీ ఈ పుస్తకం పై ఆసక్తి ఉండే అవకాశాలు తక్కువ కాబట్టి, ముందు పుస్తకం.నెట్ కి సంబంధించినవే చెప్తాను.

పుస్తకం.నెట్ కి ఏదన్నా వ్యాసం పంపాలనుకునే అత్యధికులు మమల్ని అడిగే ప్రశ్న: ఫలానా పుస్తకం పై ఇదివరకే ఎవరన్నా రాశారా? అని. ఈ ప్ర్రశ్నకి రెండు కారణాలు ఉండచ్చు:
౧) మరెవరూ పరిచయం చేయని పుస్తకం పై రాసి ప్రత్యేకతను చాటుకోవడం – ఇదే మీ కారణమైతే మాకేం అభ్యంతరం లేదు.
౨) ముందే ఎవరన్నా రాసుంటే చర్విత చర్వణమే అని అనుకొని రాయడానికి వెనుకాడ్డం! – ఎందుకు రాయాలి అన్నదానికి నా కారణాలు ఇక్కడ ఇస్తున్నాను.

స్టీఫన్ కింగ్ పుస్తకంలో “What Writing Is” అనే ఛాప్టరు హెడ్డింగ్‍కు, ఛాప్టర్ మొదటి వాక్యంలోనే సమాధానం ఇచ్చారు – “Telepathy, Of course” అని. రచయిత రచన చేసేటప్పుడు, పాఠకుడు అతని పక్కన ఉండడు. రచయిత చూస్తున్నవీ, చేస్తున్నవీ పాఠకుడు చూడలేడు. కాలగమనంలో రచన పాఠకుని చేతిలో పడి, దాన్ని అతడు చదవడానికి నిర్ణయించుకున్నప్పుడు – అప్పుడు వారిద్దరి మధ్యనా ఈ పుస్తకం అనే “టూల్” ద్వారా వారధి నిర్మితమవుతుంది. తన ఊహాప్రపంచాన్నంతా (కాల్పనిక సాహిత్యమనుకుంటే) అక్షరాల్లో ప్రోది చేసి పుస్తకంలో రచయిత నిక్షిప్తం చేస్తే, అక్షరాలను చదువుకుంటూ పాఠకుడు తన మనోవీధిలో రచయిత ఊహాప్రపంచాన్ని నిర్మించుకుంటాడు. (కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే, రచయిత డౌన్‍లోడ్ చేస్తే, పాఠకుడు అప్‍లోడ్ చేసుకుంటాడు). ఇలా ప్రతీ రచయిత తన పాఠకులతో మాట్లాడగలడు. ఇలానే ప్రతీ పాఠకుడు అనేకానేకమైన రచయితలతో సంభాషించగలడు.

సినిమాలు చూడ్డం కన్నా ఒక పుస్తకం చదివిన అనుభూతి గొప్పదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. దీనికి, నేననుకునే మఖ్య కారణం ఏంటంటే, సినిమాలో డైరెక్టర్ ఊహంతా తెరపై బొమ్మలుగా నిలుస్తుంది. ఆ బొమ్మలను గుర్తించడం, గుర్తుపెట్టుకోవడమే ప్రేక్షకుడు చేయవలసిన పని. అదే పుస్తకం చదివేటప్పుడు – ముఖ్యంగా కాల్పనిక సాహిత్యం – రచయిత ఇచ్చిన వివరాలతో పాటు పాఠకుడు సొంతంగా మరికొన్ని వివరాలు ఊహించుకోవాల్సి వస్తుంది.

ఉదాహరణ: ఎర్రని బట్ట కప్పి ఉన్న ఒక బల్ల మీద ఓ కుందేలు కారెట్ తింటుందని ఒక రచయత మనతో చెప్పబూనితో, పాఠకులుగా రంగునీ, బట్ట మెటీరియల్‍నీ, బల్ల ఎత్తు, వైశాల్యాల్నీ – ఇలాంటివెన్నో ఊహించుకోవాల్సి వస్తుంది.

(దీన్నే స్టీఫన్ కింగ్ వివరించిన తీరు ఇక్కడ ఇస్తున్నాను.

“Look – here’s the table covered with a red cloth. On it is a cage the size of a small fish aquarium. In the cage is a white rabbit with a pink nose and pink rimmed eyes. In its front paws is a carrot-stub upon which it is contendly munching. On its back, clearly marked in blue ink, is the numeral 8.”

“Do we see the same thing? We’d have to get together and compare the notes to make absolutely sure, but I think we do. There will be necessary variations, of course: some receivers will seea cloth which is turkey red, some will see one that scarlet, while others may see still other shades… Some may see scalloped edges, some may see straight ones. Decorative souls may add little lace,…” )

అయితే, ఇది కేవలం రచనలో ఉటకించబడ్డ వస్తువులకే పరిమితమవుతుందని నేననుకోను. పాత్రలూ, వారి స్వభావాలూ, పాత్రల చుట్టూ ఉన్న పరిస్థితులూ అన్నీ పాఠకుని లోకానుభవం బట్టే చదివేటప్పుడు అతను ఊహించుకుంటున్న ప్ర్రపంచంలో ప్రతిబింబిస్తాయి. అంటే రచన ఒక్కటే అయినా, అది చదివేవారిని బట్టి కొత్త కొత్త అర్థాలు సంతరించుకుంటూ ఉంటాయి. అర్థాలూ, విపరీతార్థాలూ, నానార్థాలూ పక్కకు పెడితే, ఒక్కటి మాత్రం నిర్వివాదమైన అంశం: రచయితకీ, పాఠకునికీ మధ్య ఓ రచన ద్వారా ఏర్పడిన వారధి, వారిద్దరికీ మాత్రమే ప్రత్యేకం. అన్యులకి ప్రవేశార్హత ఉండదు.

పుస్తకం.నెట్ లో మేం ఆశించేది, ఈ ప్రత్యేకానుభవాన్ని అక్షరీకరించమనే! రచయితతో మీరు ముచ్చటించవన్నీ మాకు ఊసులుగా చెప్పమనే!

సమీక్షలూ, సాహిత్య విమర్శలకు కొన్ని ప్రయోజనాలు ఉండచ్చు. కానీ వాటిని పుస్తకపఠనాభిలాష ఉన్న ప్రతి ఒక్కరూ రాయలేరు. సాహిత్య ప్రక్రియల గురించి, రచనలో శిల్పచాతుర్యం వగైరాల గురించి పుస్తకాల మీద ప్రీతి ఉన్న ప్రతి ఒక్కరూ వివరించలేరు. “పుస్తకంలో ఏముందో చెప్పు, నీకేమనిపించిందో నాకెందుకూ?!” అని అనేవారూ ఉండచ్చు. కాకపోతే ఓ పాఠకునిగా మీ అభిప్రాయాలూ, అనుభవాలూ పంచుకోవాలనిపిస్తే మీకు ఇది సరైన వేదిక. అలా పంచుకోవడానికి ప్రయత్నించిన మీకు కలిగే మొదటి ప్రయోజనం ఒక అత్మీయ సంభాషణను నెమరువేసుకోవడంలోని ఆనందం. (లేదూ, మహా చిరాకుని వెళ్ళగక్కే సౌలభ్యం! :))

ఒక పద్ధతిని అనుసరించి చేసే పుస్తక పరిచయాలకూ, సమీక్షలకూ “పుస్తకం.నెట్” వ్యతిరేకం కాదు. అలా రాసేవారుంటే మహదానందం. కానీ సాహిత్యం పై ఇష్టం ఉంటే చాలు, పుస్తకం.నెట్ లో రాయడానికి, అందులో మీరు పట్టభద్రులో, పండితులో కానవసరం లేదు.

దీన్నే పదే, పదే జార్జ్ ఆర్వెల్ మాటల్లో చెప్తూ ఉంటాము.

Nearly every book is capable of arousing passionate feeling, if it is only a passionate dislike in some or the other reader, whose ideas about it would surely be worth more than those of a bored professional.

ఒకే పుస్తకంతో ప్రతీ ఒక్కరి అనుభవం ప్రత్యేకమైనది అని అంగీకరిస్తే, మరి ఆ ప్రత్యేకానుభవ విశేషాలు కూడా ప్రత్యేకమేగా? అప్పుడు చర్విత చర్వణమనే ప్రసక్తి ఏది? ఉదాహరణకు, పుస్తకం.నెట్ లో కోతి కొమ్మచ్చి అనే పుస్తకం పై మూడు వ్యాసాలు వచ్చాయి. అరిపిరాల వారు టెల్గూస్ చేత కొనిపిస్తున్న అచ్చ తెలుగు పుస్తకంగా దాన్ని ఆకాశానికి ఎత్తితే, ఓ మనిషి  జీవితం పట్ల అవలంబించిన దృక్పధానికి నేను అబ్బురపడ్డాను. చదువరి గారేమో పదుగురితో కల్సి నడుచుకోవాల్సిన సమయాల్లో ఎలా నెగ్గుకు రావాలో తెల్సొచ్చిందన్నారు. కోతికొమ్మచ్చి ఒక్కటే, బాపూ-రమణలు ఇద్దరే! కానీ చదివిన ప్రతీ ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం. కోతికొమ్మచ్చిలో విషయసూచి, వెల, ప్రతులకి సంప్రదించాల్సిన చిరునామా, వీలుపడితే ముళ్ళపూడిగారి వచనాన్ని, బాపూ గారి కార్టూన్ల శైలిని తీవ్రంగా చర్చించే ఇలాంటి వ్యాసాలే ఉంటే ఎలా?

అద్దపు అల్మారాలో అలంకారాలు కాదు కద, పుస్తకాలు కొనుక్కునేది. అవి చెప్పే సంగతుల కోసం కూడా కద?! వాటితో బాటు పాఠకుల అనుభవాలూ ఉండాలిగా మరి?! 🙂

అలా అభిప్రాయాలు చెప్తే, “అబ్బే.. ఇవీ అభిప్రాయాలేనా?” అని ఆవేశపడుతున్న వాళ్ళ సంగతి ఏమిటని నన్ను అడక్కండి! అడగితే ఒక్కటే మాట చెబుతా, అంతర్జాలమనే మహాసముద్రం పై వేటకి పోయినప్పుడు మనక్కావాల్సిన సరుకుకు అనుగుణంగా వల ఉపయోగించాలి. అయినా కూడా, అప్పుడప్పుడూ మంచి కాని, పోనీ, మనకి అవసరం కాని సరుకు తగిలినప్పుడు వదిలించుకోవాలి. విస్మరించగలగాలి. “పుస్తకాలెలా చదవటం?” అన్నదానికన్నా ముందు “ఎదుటి వారికీ అభిప్రాయాలుంటాయ”ని గుర్తించగలగాలి. ఇంతకన్నా నేనేం చెప్పజాలను.

పుస్తకం.నెట్ ముఖ్యోద్దేశ్యాన్ని మరోసారి వివరించాను కాబట్టి, ఇక  “On Writing”  గురించి మాట్లాడుకుందాం.

**************************************************

స్టీఫన్ కింగ్ తో నా టెలీపతి సెషన్ నారయణాద్రి ఎక్స్ ప్రెస్ లో జరిగింది. రచయితలు కావాలని కలలుగనే ప్రతీ ఒక్కరూ రోజులో నాలుగైదు గంటలు పుస్తక పఠనంలో గడపాలని చెప్తూ, ఆయన, చదువుకోడానికి అనువైన చోటులుంటాయని చెప్పుకొచ్చారు. ఈ పుస్తకాన్ని చదవటానికి నేను అత్యంత ప్రతికూల పరిస్థుతులను ఎన్నుకున్నాను. “అబ్బా.. ఇంత చిరాకులో నువ్వు పుస్తకమెలా చదువుతావ్?” అని నా పక్కనున్న జీవి ప్రశ్న. కొంత మంది వ్యక్తులను కల్సినప్పుడు, కొన్ని పుస్తకాలు చదివేటప్పుడు అప్పటి మన మూడ్ కానీ, చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ ఏమీ పట్టవు. ఆ క్షణాల్లో చుట్టూ ఉన్న ప్రపంచం తన ఉనికి కోల్పోతుంది. సినిమాటిక్ వ్యూ లో చెప్పాలంటే, సంభాషణలో ఉన్న ఆ ఇద్దరు తప్ప, మిగితా ప్రపంచమంతా blur అయిపోతుంది. నాకలాంటి అనుభూతి కలిగించిన పుస్తకాలలో ఇది ఒకటి.

సచిన్ టెండూల్కర్ ని చూడాలనుకుంటే అతడు ఆడేటప్పుడు చూడాలి. రహ్మాన్ని వినాలనుకుంటే అతడు గొంతు సిడిలో పాటగా వస్తున్నప్పుడు వినాలి. చిత్రకారుడ్ని చూడాలనుకుంటే అర్ట్ ఎగ్జిభిషన్లో అతని చిత్రాలు చూడాలి. అంతే గాని, సచిన్ క్రికెట్ ను, రహ్మాన్ సంగీతాన్ని, చిత్రకారుడు బొమ్మల్ని అభ్యసించేటప్పుడు కాదు. ఎంతటి గొప్ప నటుడి షూటింగ్ అయినా కాసేపటికి బోరు కొడుతుంది. షూటింగ్ జ్ఞాపకాలు మెదలుతుండగా తెరపై కదిలే బొమ్మలు అబ్బురమనిపించకపోవచ్చు.

మరి అబ్బురపరిచే కళల వెనుక కళాకారులను కలవాలనుకోవడం, వారిని గురించి తెల్సుకోవాలనుకోవడం దేనికి? ఓ కరాచాలనం, ఓ ఆటోగ్రాఫ్ కి మించి కళారాధకునికీ, కళాకారునికీ సంబంధం ఉండాలా?

మీరూ అదే కళలో నిష్ణాతులు కావాలనుకుంటే ఆ వివరాలు మీకు జీవితకాలానికి సరిపడా inspiration, instruction manual అవుతాయి. మీరు వేరే కళను అభ్యసిస్తుంటే, ఈ కళాకారుడిలో పట్టుదల, శ్రద్ధ అన్నీ ఆచరణీయాలు అవుతాయి.

కళను ఆస్వాదించడం తప్పించి మరే అర్హతులు లేనివారైతే? నా సమాధానం, ఆ కళాకారునిలోని మనిషిని గుర్తించే అవకాశం ఉంటుంది కనుక. కళ కోసం ఒక సామాన్యుడు సృష్టికర్తగా మారిన వైనం తెలుస్తుంది. దైనందిక జీవితంలో విసిగి వేసారి ఉన్నప్పుడు, ఇంతకన్నా ఉత్తేజపూరితమైనవి దొరకటం కష్టం. “మీకు రాయడం పై ఆసక్తి గానీ, శ్రద్ధ గానీ లేకపోతే ఈ పుస్తకం పక్కకు పారేసి , వెళ్లి ఇంకేదైనా పనులు చేసుకోండి – పోనీ, మీ కారుని కడుక్కోండి” అని రచయిత ఖచ్చితంగా చెప్పేసినా, నేనీ పుస్తకాన్ని చదవడానికి గల కారణం – స్టీఫన్ కింగ్ , విశ్వవిఖ్యాత అమెరికన్ రైటర్ లోని మనిషిని తెల్సుకోవడం.

రచనా రంగంలో వృద్ధిలోకి రావాలనుకునేవారికి మార్గదర్శకాలు ఇవ్వాలనే ముఖ్యోద్దేశ్యంతోనే ఈ రచనను చేసినా, ఇందులో స్టీఫన్ కింగ్ ఆత్మకథా ఉంటుంది. అంటే, ఈ వ్యాసంలో రెండు భాగాలున్నట్టే, ఈ పుస్తకంలోనూ రెండు భాగాలు, part memorial, part manual – రెండు భాగాలూ నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆయనలోని రచయితను గురించి స్పష్టంగా రాశారు. ఆయనలోని మనిషిని అంతే సూటిగా ప్రెజెంట్ చేశారు.

రచన అనేదే సంక్లిష్ట ప్రక్రియ అనుకుంటే, ఆ ప్రక్రియ మీద రాయడం కత్తి మీద సాములాంటిది. అందులోనూ, డబ్బూనూ, పేరునూ అనుభవించిన రచయిత ఇలాంటిది రాయబూనినప్పుడు బడాయిలకు పోకుండా, ఉన్న విషయాన్ని సూటిగా చెప్పగలగాలి. అది ఈ రచయిత బాగా చేశారు. ఈయన ఉపయోగించే భాష “డీసెంట్” అనే పదానికి కొన్ని మైళ్ళ దూరంలో ఉంటుంది. అది నన్ను అక్కడక్కడా ఇబ్బంది పెట్టింది. అయినా చిరాకు పుట్టలేదు. ఎందుకంటే, ఓ క్లాసురూంలో కూర్చోబెట్టి, బోర్డు పై ఏదో రాస్తూ, వివరించే “లెక్చరర్” గా స్టీఫన్ కింగ్ రాయడంపై పాఠాలు చెప్పలేదు. తన ఇంటికి ఆహ్వానించి, ఓ వేడి కాఫీ చేతిలో పెట్టి, తన ఇంట్లో, తన గదుల్లో, తన వరండాలో, తన తోటలో తిప్పుతూ, తన స్నేహితులతో మాట్లాడినట్టే విషయాలన్ని చెప్పుకొచ్చారు. తన విషయాలుగా చెప్పుకొచ్చారు. అందుకే చికాకు పుట్టించే రైలు ప్రయాణంలో సైతం, పుస్తకం చదవడం మొదలెట్టిన కొన్ని నిమిషాల్లోనే మా ఇద్దరి టెలీపతీ సంభాషణ, ఇద్దరి అపరచితుల బిడియం నుండి ఆప్తస్నేహితుల గాఢతను పొందింది.

ఈ పుస్తకంలో నాకు నచ్చినవాటిని గురించి రాయడం మొదలెడితే అయ్యే పని కాదు. పైగా ఏదో మర్చిపోయినట్టే అనిపిస్తుంది. రచనా వ్యాసంగం పై నాకు అంత ఆసక్తి లేకపోయిన ఒక రచయిత మనోభావాలనూ, మనసునూ అర్థం చేసుకునే వీలు కల్సించింది ఈ పుస్తకం. కొన్ని వాక్యాలను, 40 సైజు ఫాంటుతో బుర్రలో హోర్డింగ్స్ పెట్టుకున్నాను. అలాంటి వాటిలో కొన్ని:

*Waiting rooms are made for books – of course!
* Reading is the creative center of a writer’s life.
* If you intend to write as truthfully as you can, your days as a member of polite society is numbered, anyway.
* The closed door is your way of telling the world and yourself that you mean business, you have mad a serious commitment to write and intend to walk the walk as well as talk the talk.
*Description should begin in the writer’s imagination, but should finish in the reader’s.
*Boredom can be a very good thing for someone in a creative jam.
* Writing fiction, especially a long work of fiction, can be difficult, lonely job; it’s like crossing the Atlantic Ocean in a bath tub.
* All novels are really letters aimed at one person.
*Formula: 2nd Draft = 1st Draft – 10%
*Writing is not life, but I think that sometimes it can be a way back to life.

పుస్తకం చదివేశాక, ఊరికే అమెజాన్‍లో ఈ పుస్తకం పై అభిప్రాయాలు చదువుతూ ఉంటే, ఒక విషయం అర్థమయ్యింది. దీన్ని రైటింగ్ మీద వచ్చిన “హౌ టు రైట్” లేదా “become professional writer in 24 hours” అన్నట్టుగా చదివితే, తీవ్ర నిరాశ కలగొచ్చు. రచన గురించి, రచన పట్ల రచయితకుండాల్సిన గుణాల గురించి, జీవితం గురించి, పుస్తకం తొలి ప్రతినీ, మలి ప్రతిని ఎలా సరిదిద్దాలనే దాని గురించి, పుస్తకాలను ఎలా మార్కెట్ చెసుకోవాలన్న వాటి గురించి చాలా విషయాలనే చర్చించినా, ఇది book on craft అంటే, నేనొప్పుకోను. ఓ పేరొందిన రచయిత, తన జీవితానుభవాలను పంచుకున్న గ్రంథంగానే దీన్ని చూడగలను.

ఈ పుస్తకంలో నాకు నచ్చని, రుచించని కొన్ని విషయాలున్నాయి. ముఖ్యంగా, రచయిత రచన చేసేటప్పుడు, అతడి దృష్టిలో ఉండాల్సిన “ideal reader” గురించిన అభిప్రాయాలతో నేను ఏకీభవించను. రచయిత చేసే రచనలన్నింటికీ ఒకే ఐడియల్ పాఠకుడు / పాఠకురాలు ఉండాలనీ, అది రచయిత జీవిత భాగస్వామి అయితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మూసివున్న గదిలో ఒంటరిగా రాసుకుంటున్న రచయితకి తోడుగా అతడి దృష్టిలో ఓ పాఠకుడుంటాడని నేను నమ్మినా, అది ఎప్పుడూ ఒకే మనిషి కావాలన్న నిబంధనలాంటి సూచన నచ్చలేదు. అలా అందరూ చెయ్యడం మొదలెడితే, రచనల్లో వైవిధ్యం తగ్గుతుందని నేననుకుంటాను.

ఈ పుస్తకాన్ని గుడ్డిగా మార్గదర్శకంగా తీసుకోకూడదని నేను చెప్పడానికి మరో కారణం: ఎంత కాదనుకున్నా స్టీఫన్ ఒక మంచి రచయిత. ఆయకున్న కళ, రచయిత కావాలని ఉబలాటపడే ప్రతి ఒక్కరి దగ్గరా ఉండకపోవచ్చు. టాలెంటడ్ అయినా, స్టీఫన్ కూడా స్వంతంత్ర రచయిత కావడానికి చాలా పాట్లు పడ్డారు. చిన్నా, చితకా ఉద్యోగాలు చేశారు. ఒక్కసారి ఆయన రచనలు వెలువడ్డం మొదలెట్టాక, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వీటికన్న ముఖ్యంగా ఆయన కుటుంబ నేపధ్యం చాలా బలంగా ఉంది. ఆయన వైవాహిక జీవితంలో భారీ ఎత్తున విపత్తులు ఒకటో, అరో వచ్చినా, ఆయన జీవితభాగస్వామి ఓ పర్వతమంత మనోబలాన్ని ఇస్తూనే ఉంది. విజయాల విశ్లేషణలో అతి దారుణంగా నిర్లక్ష్యానికి గురైయ్యే అంశం ఇదే అనుకుంటా, మనిషి సఫలత వెనుక అతని బంధాల పటిష్టతను గుర్తించకపోవడం.

“కాబోయే రచయితలే చదవండి” అని రచయితే చెప్పుకున్న, చదవడంలో ఆనందాన్ని ఆస్వాదించగలిగేవారందరూ చదువుకోదగ్గ పుస్తకం:

On Writing – Stephen King.

Cost: Rs. 352 /-

Online Purchase through Flipkart, Amazon.

 About the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..10 Comments


 1. “విజయాల విశ్లేషణలో అతి దారుణంగా నిర్లక్ష్యానికి గురైయ్యే అంశం ఇదే అనుకుంటా.”
  పూర్ణిమా,
  బాగా కాచ్ చేశావ్ 🙂


 2. హెచ్చార్కె

  @Purnima: మీరు అలాంటి అభిప్రాయంతో రాయలేదు. మీ వాక్యం ప్రేరణతో నా ఫీలింగ్స్ ని మితృలతో పంచుకున్నానంతే.


 3. Purnima

  @Independent: 🙂

  @Achilles: కాదండి, ఆ తలపు వేరు, ఆ తలుపు వేరు. 🙂

  @మెహెర్: హమ్మ్.. క్రిమినల్ బెటర్, బ్లఫ్ మాస్టర్ కన్నా! 🙂

  @హెచ్చార్కె: పుస్తకాలు ఎక్కువ, సినిమాలు తక్కువ అనే అభిప్రాయంతో నేనా వాక్యాలను రాయలేదని మీరు గ్రహించుంటారని అనుకుంటున్నాను. అవును, దేనికదే! టైపో కరెక్ట్ చేస్తాను. ధన్యవాదాలు.

  @కామేశ్వర రావు:

  “అక్షరాలను చదువుకుంటూ పాఠకుడు తన మనోవీధిలో రచయిత ఊహాప్రపంచాన్ని నిర్మించుకుంటాడు”

  నేను వ్యాసం ప్రచురించడానికి బటన్ వత్తేటప్పుడు, ఆగి, ఆ వాక్యంలో “రచయిత” అన్న పదాన్ని ఇరికించాను. ఎవరో ఒకరు పట్టుకుంటారని అనుకుంటూనే ఉన్నాను. 🙂 Thanks for highlighting it.

  “అక్షరాలను చదువుకుంటూ పాఠకుడు తన మనోవీధిలో ఊహాప్రపంచాన్ని నిర్మించుకుంటాడు, రచయిత ఇచ్చినదాన్ని ముడిసరకుగా చేసుకుంటూ.” అని అంటే సరిపోతుందేమో?! పాఠకుని ప్రపంచం కేవలం తనదే అయినా, దానికి ముడిసరకునో, లేక inspiration / aspiration ఓ ఇచ్చేది రచయిత కదా! I can’t rule out writer completely here.

  >> ఇందులో రచయితకికూడా ప్రవేశార్హత లేదు. It is a one-way bridge!

  ఎలానో మీరు వివరిస్తే వినాలనుంది. వివరించగలరు.

  (రచయిత పాఠకుడికేదో ఉపన్యాసమో, కథో చెప్తున్నట్టి అనుకోలు కన్నా, రచయిత పాఠకుని తీసికెళ్లి తాను సృష్టించినదానితో వదిలేస్తే బ్రహ్మాండంగా ఉంటుందేమోనని అనిపిస్తోంది. Writer is a vehicle who drives the reader to a point and leaves him there to his imagination. – Comments Please 🙂 )

  అవును, రచయితతో పర్సనెల్ గా తెల్సే కొద్దీ, ఆత్మీయత తగ్గుతుందని స్వానుభవం. కాబట్టి, మారు మాట్లాడకుండా ఒప్పేసుకుంటాను. 🙂


 4. హెచ్చార్కె

  ‘సినిమాలు చూడ్డం కన్నా ఒక పుస్తకం చదివిన అనుభూతి గొప్పదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు.’ నిజం. నేను సినిమా చూడ్డం, పుస్తకం చదవడం జరిగిన ప్రతి సందర్భంలో పుస్తకాన్నే ఎక్కువగా ఇష్టపడ్డాను. ‘పాపియ్యో’, స్పార్టకస్‍’, ‘టు కిల్‍ ఎ మాకింగ్‍ బర్డ్’, ‘కైట్ రన్నర్‍’, తెలుగులో తెన్నేటి సూరి ‘ఛెంగిజ్‍ ఖాన్‍’ ఆ తరువాత ఇంగ్లిష్‍లో సినిమా, … ఇలా దాదాపు అన్ని సందర్భాల్లో పుస్తకం చదవకపోయి వుంటే చాల మిస్సయ్యే వాడిని. దానిక్కారణం, బహుశా, అంతరంగాల చిత్రణకు, మానవ ప్రవర్తనపై వాతావరణం ప్రభావం చిత్రణకు… పుస్తకంలో ఉన్నంత అవకాశం సినిమాలో ఉండకపోవడం కావచ్చు. ఉదాహరణకు, మీరు ఉటంకించిన స్టీఫెన్ కింగ్ మాటల్లోని పిల్లి ‘contendly munching’ లో ‘contendly’ ని పుస్తకం చెప్పినంత బాగా సినిమా చూపించలేదు. (I took ‘contendly’ for ‘contentedly’. Hope I am not wrong).
  ఇంతా చేసి, సినిమా, పుస్తకం… దేని గొప్ప దానిది. సినిమా చేసే కొన్ని పనుల్ని పుస్తకం చేయలేదు. ఉదా: సినిమాలో దుఃఖం చూసి ఏడ్చినంత/నవ్వినంత సులభంగా పుస్తకం చదువుతూ ఏడవం/నవ్వం 🙂 .


 5. >> ఇదివరకూ పుస్తకం.నెట్ లో ఇలాంటి వ్యాసం రాలేదు.
  ఈ వాక్యానికి పూర్తి న్యాయం చేకూర్చారీ వ్యాసంలో… ఆద్యంతం ఆసక్తి భరితంగా ఉంది.
  నేను సాధారణంగా బాగా పాఠకాదరణ పొందిన పుస్తకాలే చదువుతుంటాను(తీరిక లేక). కాబట్టి నేనెప్పుడు పుస్తకం.నెట్ కు అనుభవాలు పంపిచాలన్నా ఆ ఎవరో రాసేసుంటార్లే అనే నిర్లిప్తత. ఇప్పుడు మీవ్యాసం చదివాక కొత్త ఉత్సాహం వస్తోంది. ఈ సారి ఏదైనా పుస్తకం చదివినప్పుడు నా అనుభవాలు అక్షరబద్ధం చేయడానికి ప్రయత్నిస్తాను. చూద్దాం ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతమౌతుందో…


 6. వ్యాసం చక్కగా ఉంది.

  భైరవభట్ల గారు: మీ తర్క ప్రజ్ఞ అబ్బుర పరుస్తుంది 🙂


 7. మెహెర్

  చాలా బాగుంది. One of the best reviews. Gotta read this one. స్టీఫెన్ కింగ్‌ రచనలేవీ ఇదివరకూ చదవలేదు. కానీ ఆయన రచనల ఆధారంగా నిర్మితమైన సినిమాలు మాత్రం కొన్ని చూసాను. “The Shining”, “Green Mile”, “The Shawshank Redemption”, “Dream Catcher”, “Secret Window”… etc,. ఈ సినిమాలన్నీ రొడ్డకొట్టుడు హాలీవుడ్‌ ఉత్పత్తులకు కాస్త భిన్నంగా వుంటాయి. కానీ, “గాన్ విత్ ద విండ్” నుండి “గాడ్ ఫాదర్” దాకా ఎన్ని ఉదాహరణలు తీసుకున్నా, మంచి సినిమాలకు మూలమైన రచనలన్నీ మీడియొకర్‌‍గానే వుంటాయన్న ముఢాభిప్రాయం నాకేర్పడిపోవటంతో స్టీఫెన్ కింగ్ జోలికి ఇప్పటిదాకా వెళ్ళలేదు. ఈ పరిచయం చదివాకా ఆసక్తి మొదలైంది. థాంక్యూ. 🙂

  >>> సచిన్ టెండూల్కర్ ని చూడాలనుకుంటే […] కళాకారునికీ సంబంధం ఉండాలా?

  Becoming a king of analogies, it seems. 😛 Loved it.

  >>> రచనా వ్యాసంగం పై నాకు అంత ఆసక్తి లేకపోయిన…

  I know that it is only a bluff. If not, it’s down-right criminal sirjee! 😛


 8. ఆసక్తికరమైన వ్యాసం పూర్ణిమగారు!

  “అక్షరాలను చదువుకుంటూ పాఠకుడు తన మనోవీధిలో రచయిత ఊహాప్రపంచాన్ని నిర్మించుకుంటాడు”
  ఇది వట్టి ఆశపోతు రచయితల ఊహ 🙂 పాఠకుడు తన మనోవీథిలో నిర్మించుకునేది తన ఊహప్రపంచమే కాని రచయితది కాదు.

  “రచయితకీ, పాఠకునికీ మధ్య ఓ రచన ద్వారా ఏర్పడిన వారధి, వారిద్దరికీ మాత్రమే ప్రత్యేకం. అన్యులకి ప్రవేశార్హత ఉండదు.”
  ఇందులో రచయితకికూడా ప్రవేశార్హత లేదు. It is a one-way bridge!

  “ఇలానే ప్రతీ పాఠకుడు అనేకానేకమైన రచయితలతో సంభాషించగలడు”
  ఇది నిజం. ఆ సంభాషణ చాలా ఆత్మీయంగా కూడా ఉంటుంది. ఎందుకంటే నిజానికి ఆ సంభాషించేది తన ఆత్మతోనే కాబట్టి. నేరుగా రచయితతో సంభాషించ గలిస్తే (ఉదాహరణకి, ఇలా వ్యాఖ్యల ద్వారా!) ఆ “ఆత్మీయత” పోతుంది.


 9. “If you intend to write as truthfully as you can, your days as a member of polite society is numbered, anyway.”

  True 🙂

  “The closed door is your way of telling the world and yourself that you mean business, you have made a serious commitment to write and intend to walk the walk as well as talk the talk.”

  So this was what you meant when you said that you wanted to ‘shut the door’ the other day:)


 10. Independent

  వావ్ పూర్ణిమా. ఇంతింతై వటుడింతై అని.. ఎంత ఎదిగి పోయావంటే…
  మునుపటి కన్నా చిక్కదనం, గాఢత, రిపిటీషన్స్, అనవసరమయిన టాంజెంట్స్ లేకుండా కండెన్స్డ్ మిల్క్ లాగా ఉంది నీ రచనా శైలి ఇందులో .

  గ్రేట్ ప్రొగ్రెస్ Ma’am.

  I now have to say “I am honored to know you Purnima’.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Ngugi Wa Thingio’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Nguigi Wa Thiongio) రాసిన Education for a national culture అన్న వ్యాసం గు...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 
 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 

 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1

 
 

పుస్తకం.నెట్ తొమ్మిదో వార్షికోత్సవం

ఇవ్వాళ్టితో పుస్తకం.నెట్ మొదలుపెట్టి తొమ్మిదేళ్ళు పూర్తవుతుంది. ముచ్చటగా పదో ఏట అడ...
by పుస్తకం.నెట్
0