‘విద్యాసుందరి’ బెంగళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర!

అసలీ పుస్తకం గురించి చెప్పేముందు, బెంగళూరు నాగరత్నమ్మ ఎవరు? అన్న విషయం‌మొదట చెబుతాను.
బెంగళూరు నాగరత్నమ్మ కర్ణాటక సంగీతంలో ఒక ప్రముఖ గాయని. తిరువయ్యూరులో త్యాగయ్యకు సమాధి కట్టించిన మనిషి. అలాగే, త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఒకరు. ఎంతో ధనవంతురాలైనప్పటికీ, తన సర్వస్వాన్నీ త్యాగరాజ ఆరాధనకే వెచ్చించారు. ఇది ఒక పార్శ్వం అయితే, మరో పార్శ్వంలో ఆవిడది గొప్ప వ్యక్తిత్వం – పరిస్థితులకు వెరవని , అసమానతను సహించని మనిషి ఆమె. ఫెమినిజం అదీ ఇదీ అని ఇప్పుడు అంటున్నారు కానీ, అవేవీ తెలీనప్పుడే ఆవిడ స్త్రీ అభ్యుదయం కోసం, దేవదాసీల హక్కుల కోసం కూడా పోరాడారు. ఆవిడ సంగీత ప్రపంచానికి చేసిన సేవకు గుర్తుగా, త్యాగరాజు సమాధి ఎదుట వినమ్రంగా కూర్చుని ఉన్న నాగరత్నమ్మ విగ్రహం ఉందట.
[ఒక వికీ పేజీ అయినా ఉన్నట్లు లేదు. కర్నాటక సంగీతం వెబ్సైట్లలో మాత్రం రాసారు ఈవిడ గురించి.]

నాకెందుకీవిడపై ఆసక్తి?

బెంగళూరు నాగరత్నమ్మ – అన్న పేరు నేను విన్నది ‘రాధికాసాంత్వనము’ పుస్తకం గురించి రేగిన వివాదాన్ని గురించి చదువుతున్నప్పుడే‌అనుకుంటాను. కనుక, నేను ఆవిడ రచయిత్రి, ప్రచురణకర్త అయి ఉంటారనుకున్నాను. వీరేశలింగం గారినే ఎదిరించారని విని, ‘ఔరా!’ అనుకున్నాను. ఆపై అంతగా ఆలోచించలేదు. అయితే, సుమారు నెల రోజుల క్రితం ఈనాడు ఆదివారం అనుబంధం లో ఆవిడ జీవిత చరిత్ర తెలుగు అనువాదం విడుదలైందని రివ్యూ చూశాను. అటు పిమ్మట, పరుచూరి గారి ద్వారా, ఈమాట లో జె.కె.మోహనరావు గారు నాగరత్నమ్మ గారిపై రాసిన వ్యాసం చదివాను (ఇక్కడ చదవండి).అది చదివాక, ఆవిడెవరో‌తెలుసుకోవాలన్న కుతూహలం ఈసారి కాస్త తీవ్రంగా కలిగి, తెలుగు పుస్తకం తెప్పించుకున్నాను, ఆంగ్ల మూలం ఎక్కడా దొరక్క. కొన్నిరోజుల్లో కాస్త అవస్థ పడి, ఆంగ్ల మూలం దొరకబుచ్చుకున్నాను. ఆ ఆంగ్ల మూలం గురించే ఈ వ్యాసం.

పుస్తకం,నాగరత్నమ్మ కథ గురించి:
పుస్తకం పది చాప్టర్లుగా విభజించారు. మొదట, నాగరత్నమ్మ గురించి, ఈ పుస్తకం‌గురించీ స్వల్ప పరిచయం అయ్యాక, అసలు కథ మొదలౌతుంది.ఒక్కో ఛాప్టర్లోనూ ఆమె జీవితంలోని కొన్ని విశేషాలను తెలుపుతూ ముందుకు సాగుతుంది. కథను కొన్ని మాటల్లో చెప్పాలంటే – నాగరత్నమ్మ ఒక దేవదాసి కూతురు. ఆమెకి ఒకటిన్నర సంవత్సరాల వయసున్నప్పుడు తల్లి తన పోషకుడి నుండి విడిపోవడంతో, తల్లీకూతుళ్ళిద్దరూ మైసూరు చేరారు. అప్పటి మైసూరు కళల పుట్టిల్లు. అక్కడ నాగరత్నమ్మ తల్లి పుట్టలక్ష్మమ్మ గిరిభట్ట తిమ్మయ్య అన్న సంస్కృత పండితుడి ఆదరణ పొందింది. అతనే నాగరత్నమ్మ కు సంగీతము, సంస్కృత వ్యాకరణము, కన్నడ,తెలుగు,ఆంగ్ల భాషలు నేర్పే ఏర్పాట్లు చేశాడు. నాగరత్నమ్మ త్వరగా నేర్చుకుంటూ ఎదిగిపోతూ ఉండటంతో, అసూయకు లోనై ఆమెకి తొమ్మిదేళ్ళ వయసున్నప్పుడు తిమ్మయ్య వీరిద్దరినీ విడిచిపెట్టేశాడు.ఆ గొడవలోనే, నాగరత్నమ్మను మైసూరు వీథుల్లో పేడ ఎత్తేందుకు తప్ప ఎందుకూ పనికిరావని శాపనార్థాలు పెట్టాడు. అక్కడే‌పుట్టలక్ష్మి తన కూతురు సంగీత సాహిత్యనృత్యాల్లో నిష్ణాతురాలు అయ్యి తీరాలని శపథం చేసుకుంది. కాలక్రమంలో అనేకానేక మంచి వ్యక్తుల సహాయ సాహచర్యాల వల్ల, ఆటంకాలను అధిగమిస్తూ నాగరత్నమ్మ ఎదిగింది. అయితే, ఈ ఎదుగుదల చూసేందుకు పుట్టలక్ష్మి ఎక్కువకాలం బ్రతకలేదు.

నాగరత్నమ్మ సంగీతజ్ఞురాలిగా ఎదిగింది. ఆకాలంలో లెక్కలేనంత ధనాన్నీ, కీర్తినీ, గౌరవాన్నీ అర్జించింది. గృహలక్ష్మీ స్వర్ణ కంకణ గ్రహీత. త్యాగరాయ ఆరాధన ఉత్సవాల్లో మహిళలకి ప్రవేశం ఉండేది కాదు అప్పట్లో. ఆ నియమం పై తిరుగుబాటు చేసి, అందరూ‌మహిళలే ఉన్న గుంపుతో ఒక ఏడు ఆరాధన నిర్వహించింది. అలాగే, దేవదాసీల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడింది. మహిళాభ్యుదయం కోసం కృషి చేసింది. వివిధాంశాలపై పుస్తకాలు రచించింది. ముద్దుపళని రాధికా సాంత్వనం విషయమై రగిలిన వివాదంలో మహామహుల్ని ఢీకొని, వారికి సమఉజ్జీయై నిలిచింది. ఆ పుస్తక ప్రచురణలో ప్రధాన పాత్ర వహించి, ముందుమాట కూడా రాసింది. ఆర్థిక విషయాల్లో ఆమె చురుకుదనాన్ని చూసినా, ఆమెలో మామూలుగానే కనబడే ఆత్మవిశ్వాసాన్ని చూసినా, ఆమె చేపట్టిన కార్యాలను చూసినా – ఎలాగన్నా ఆకాలంలోని మహిళలల్తో పోలిస్తే ఆవిడ ఎన్నో మెట్లు పైన ఉన్నట్లు అనిపిస్తుంది. ఇవన్నీకాక, ఆమె అంటే సంగీత ప్రపంచంలో గుర్తుకు వచ్చేది – త్యాగరాజు పై ఆమెకి గల అవ్యాజమైన భక్తి ప్రపత్తులు, ఆ విషయమై ఆవిడ చేసిన సేవ.

ఈ‌పుస్తకం రాయడానికి శ్రీరాం‌గారు ఎంత పరిశోధన చేశారో, ప్రతి అధ్యాయానికీ ఉన్న ఫుట్నోట్లనూ, రిఫరెన్సులనూ చూస్తే తెలుస్తుంది. అయినా కూడా, శైలి అకడమిక్ గ్రంథాల్లా కాక, సామాన్య జనాలకి అర్థమయ్యే రీతిలో సరళంగా సాగింది. పుస్తకంతో పాటు అందించిన ఫొటోలు ఊహించని బోనస్. ఈ పుస్తకం రాసిన తీరులో, అప్పటి సాంఘిక జీవనం గురించి, కొంత చరిత్ర గురించీ కూడా అవగాహన కలుగుతుంది కనుక, నాగరత్నమ్మ కథని వేరుగా కాక, ఆనాటి సామాజిక చరిత్ర దృక్కోణం నుంచే చూస్తాము – అని నా అభిప్రాయం.

“This book is a tribute to her indomitable spirit and her unrelenting efforts to perpetuate the memory of her patron saint, Tyagaraja”.
-అన్న వెనుక కవర్పేజీ వాక్యాలు అక్షర సత్యాలు.

నన్ను అడిగితే, ఇది తప్పక చదవాల్సిన పుస్తకం అని చెబుతాను. చరిత్ర పుస్తకాలు ఇలా తేలిగ్గా అర్థమయ్యేలా రాస్తే, నాబోటి పామరకోటికి కూడా అర్థమౌతుంది. శ్రీరాం గారి ఇతర పుస్తకాల్లో – ఇలాగే శాస్త్రీయ సంగీత నేపథ్యం లేకున్నా అర్థం చేసుకుని స్పూర్తి పొందగల పుస్తకాలేవన్నా ఉంటే, మీకు తెలిస్తే, ఒక వ్యాఖ్య వదలండి!

తెలుగు అనువాదం గురించి:
నేను మొదట తెలుగు అనువాదం‌మొదలుపెట్టి, మూలానికి వచ్చాను. అనువాదం కూడా బాగుంది. అయితే, ఇరు పుస్తకాల సైజుల్లో మాత్రం చాలా తేడా ఉంది! తెలుగు అనువాదం‌హైదరాబాదు బుక్ ట్రస్టు వారు వేశారు. వివరాలకి వారి బ్లాగులో చూడండి (ఇక్కడ చదవండి). ఆంగ్ల పుస్తకం అలభ్యం అని చెప్పారు శ్రీరాం గారిని సంప్రదిస్తే. కనుక, తెలుగు అనువాదం అందరూ తప్పక చదవండి!
(అన్నట్లు, హై.బు.ట్ర వాళ్ళు నాకేం‌కమిషన్ ఇవ్వరండోయ్! నిజంగానే ఆంగ్ల మూలం దొరకట్లేదు. నేను నేరుగా రచయితనే సంప్రదిస్తే, ఆయన వద్ద ఒక ఎక్స్ట్రా కాపీ ఉందని పంపారు… అందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు.)

పుస్తకం‌వివరాలు:
The Devadasi an the saint: The life and times of Bangalore Nagarathnamma
Author: V.Sriram
East West Books (Madras) Pvt Ltd
Price: 275
Pages: 207
First Published: 2007

ప్రస్తుతానికి మార్కెట్లో దొరకడం లేదు, నాకు తెలిసినంతవరకు. పబ్లిషర్ల చిరునామా:

East West Books (Madras) Pvt Ltd
571,Poonamalle High Road
Aminjikarai
Chennai-29
Email: ewb@ewbpl.com

You Might Also Like

8 Comments

  1. kumar

    Your introduction about the book and its content is nice.There is no statue of Sri Nagaratnamma near Sri Tyagaraja’s tomb.at Tiruvayyar… we can see her photo near the wall stone depicting her service in renovating the the great masters’ tomb.

    1. ok johnny

      నో. హర్ టూంబ్ ఐస్ ఠెరె నియర్ తో ది త్యాగరాజ సమాధి. ఐ హవె సం ఫోటోగ్రాఫ్స్ అఫ్ ఠాట్ మెమోరియల్. సొమెతిమె ఐ విల్ పోస్ట్ ఇట్ హియర్.

  2. మహిళావరణం – 1 « sowmyawrites ….

    […] గురించి ఒక పరిచయం పుస్తకం.నెట్లో ఇక్కడ […]

  3. పుస్తకం » Blog Archive » 2010లో చదివిన ఇంగ్లీషు పుస్తకాలు

    […] గురించి బజ్జ్ లో మొదలెట్టుకొని,  Devadasi and a Saint పుస్తక రచయిత శ్రీరాం గారి నుండే […]

  4. చౌదరి జంపాల

    ఈ పుస్తకం గురించి, నాగరత్నమ్మ గారి గురించి, దేవదాసీ వ్యవస్థ నిషేధం గురించి మరికొన్ని వివరాలతో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు వ్యాసం http://www.andhrajyothy.com/sundayPageshow.asp?qry=2011/mar/20/sunday/specialstory&more=2011/mar/20/sunday/sundaymain

  5. పుస్తకం » Blog Archive » హైద్రాబాద్ పుస్తక ప్రదర్శన, 2010 – నేను కన్నవి, కొన్నవి

    […] కనిపించాయి. వనవాసి, రైలు బడి, బెంగళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర, మిట్టూరోడి పుస్తకం […]

  6. malathi

    @ నాబోటి పామరకోటి =))

  7. rayraj

    ఇంగ్లీషు పుస్తకం పిడియఫ్‌ చేసి ఎక్కడన్నా పైకెక్కించేసే ఐడియా ఉంటే చెప్పండి

Leave a Reply