మా ఊరి పుస్తక ప్రదర్శన – కొన్ని ఫొటోలు

నాకు ఈ ఊరొచ్చాక, పుస్తకాలు చదవడం సంగతి దేవుడెరుగు కానీ, పుస్తకాలు రోడ్డు పై పరిచి వీళ్ళు అమ్ముతూ, జనం కొంటూ ఉంటే చూడ్డం ఓ వ్యసనం అయిపోయింది. ఇదే సమయంలో Tuebinger Buecherfest (ట్యూబింగెన్ పుస్తకాల పండుగ) మొదలైంది. నేను మన దగ్గర్లాగానే, ఎక్కడో ఏ గ్రౌండ్స్ లోనో చేస్తారు అనుకుని, రోడ్డుపైకి వస్తే, ఎక్కడో తెలుస్తుందిలే అనుకుని బయలుదేరాను. కానీ, నాక్కనబడ్డ దృశ్యం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది మే 27-29 మధ్య జరిగింది. ఈ బుక్ ఫెస్ట్ చరిత్ర అదీ, నాకు తెలీవు ఇంకా, 1997 లో మొదలైందని ఎవరో చెప్తే విన్నానంతే. అంతా జర్మన్ మయం కనుక, ఇంకా నాకు అంత జర్మన్ తెలీదు కనుకా, ప్రస్తుతానికి అంతకు మించి ఏమీ చెప్పలేను.

డౌన్‌టౌన్ వీథుల్లోకి రాగానే, ఎక్కడ పడితే అక్కడ, రోడ్డంతా వ్యాపించి ఉన్న తాత్కాలిక పుస్తక దుకాణాలూ, ఎక్కడికక్కడ బారులు తీరిన జనమూ!

ఇవి కాక, లోకల్ పత్రికల వాళ్ళ స్టాల్స్, ఇతరత్రా స్టేషనరీ వాళ్ళు, బుక్ బైండింగ్ వాళ్ళూ – వీళ్ళ స్టాల్స్ …ఇలాంటివి కూడా ఉన్నాయి.

వీటిపాటికి ఇవి జరుగుతూ ఉంటే, ఊర్లో రెండు మూడు చోట్ల రీడింగ్ సెషన్లూ, రచయితలతో ముఖాముఖి చర్చలూ – అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఒక పక్క. ఏ వీథుల్లో నడుస్తున్నాం అన్న దాన్ని బట్టి, ఒక్కోచోట ఏవో చప్పట్లూ అవీ వినిపించాయి నాకు…అక్కడేదో జరుగుతోంది అన్నదానికి సూచనగా.

పేరుకి “పుస్తకాల పండుగ” కాదు – నిజంగానే పండుగలా జరిగింది మొత్తానికి!!

You Might Also Like

2 Comments

  1. శివరామప్రసాద్ కప్పగంతు

    మంచి విషయం తెలియచేసారు. ఇలాంటి పండుగ చెయ్యటం మనం కూడా నేర్చుకోవాలి. ఇప్పటికే మన హైదరాబాదులో, అబిడ్స్ సెంటర్లో ప్రతి ఆదివారం సెకండ్ హాండ్ పుస్తకాలు పెద్ద ఎత్తున అమ్ముతూ ఉంటారు అబిడ్స్ కెనరా బాంకు మొదలు పక్కనే ఉన్న కాంప్లెక్స్ మొత్తం పుస్తకాలు నేల మీద పరిచి అమ్ముతూ ఉంటారు. అలాగే విజయవాడ లో విశ్వనాథ సత్యనారాయణ గారి విగ్రహ పరిసర ప్రాంతంలో (గవర్నర్ పేట)ప్రతి రోజూ, అక్కడే రైవస్ కాలవ దాటితే గాంధీనగర్లో బాటా షో రూం దగ్గర ఆదివారాల్లో పుస్తకాలు అమ్మే షాపులు ఉన్నాయి. అనేకానేక ఆణిముత్యాలు దొరకపుచ్చుకున్నాను.

  2. dvrao

    పొరపాట్న మన హైదరాబాద్ లో కూడా ఇలా జరిగితే ఎంత బావుంటుందో కదా!

Leave a Reply