నవతరంగం వారి ప్రపథమ ప్రయత్నం-ఒక మంచి బృందగానం

రాసిన వారు: దేవరపల్లి రాజేంద్ర కుమార్
***********************
వెలిగే దీపం మరొక దీపాన్ని వెలిగిస్తుంది అన్నది పెద్దలు చెప్పిన చద్దన్నం లాంటి మాట.సత్యజిత్ రే రచించిన ఆంగ్ల గ్రంథం ‘Our Films-Their Films’ ఆ కోవకు చెందినది.నవతరంగం ఫిల్మ్ స్టడీస్ నిర్వహణలో వి.బి.సౌమ్య అనువదించగా నవతరంగం.కాం లో ధారావాహికగా వెలువడ్డ వ్యాసపరంపర పుస్తకరూపంలో వెలువడింది.

ఫిల్మ్ స్టడీస్ అన్నది విస్తృతం,విశ్వజనీనమైన పదం.భారతీయులకు సినిమాల మీద ఉన్న యావ,సినిమాలకు సంబంధించిన అనుబంధ అంశాలమీద ఉండదు అన్నది పదేపదేరుజువైన సత్యం.కొన్నిలక్షల మందికి జీవనోపాధి కల్పిస్తూ,వేలకోట్ల రూపాయల టర్నోవర్ తో కోట్లాదిమందికి వినోదం అందిస్తూ ప్రపంచచలన చిత్రాల నిర్మాణంలో ద్వితీయ స్థానాన్ని (రాసి పరంగా)ఎప్పటినుంచో నిలబెట్టుకుంటూ వస్తున్న భారతీయచలనచిత్ర పరిశ్రమ గురించి వెలువడ్డ అధ్యయనాలు అతిస్వల్పం.

జరిగిన,జరుగుతున్న పరిశోధనలు వాటితోపాటు వచ్చిన,వస్తున్న సిద్ధాంతగ్రంథాలు పచ్చి అకడమిక్ వాసనలతో నిండి సాధారణపాఠకులను విపరీతమైన నిరాశకు గురిచేస్తూ ఉంటాయి.

చలనచిత్రప్రముఖుల గురించి వెలువడే జీవితచరిత్రలు,ఆత్మకథలు ఎక్కడో తప్ప,స్వీయ ఆత్మప్రశంసలకు ప్రబలమైన ఉదాహరణలు.దేశంలోని విశ్వవిద్యాలయాల్లో సినిమాను ఒక అధ్యయన విషయంగా పరిగణించేవి అతితక్కువ.అవికూడా పత్రికారంగం,టీవీ,కొండొకచో రేడియోలకు ఇచ్చిన ప్రాధాన్యం ఎంతోప్రభావవంతమైన సినిమాకు ఇవ్వవు.విదేశాల్లో సినిమామీద అధ్యయనం అన్నది బహుముఖమైన ప్రక్రియ. అక్కడ పరిశోధనలు అత్యంత సూక్ష్మస్థాయిలో జరుగుతూ ఉన్నాయి.ఉదాహరణకు అమెరికన్ ఎంబసీ వారు ప్రచురించి విశ్వవిద్యాలయాలకు సరఫరా చేసే ‘ఆర్టికల్ అలర్ట్’లో సుమారు ఒక దశాబ్దం క్రితం ఒక అమెరికన్ పరిశోధక విద్యార్థికి పిహెచ్.డి పట్టాను సంపాదించి పెట్టిన అంశం,” లేట్ నైట్ టెలీవ్యూయింగ్ హ్యాబిట్స్ ఆఫ్ ఎ సింగిల్ గే పేరెంట్ ఆఫ్ న్యూజెర్సీ సబర్బన్’.

సినిమాలమీద ఏకంగా దినపత్రికలు వెలువడుతున్న పాశ్చాత్యదేశాలు ఎన్నో ఉన్నాయి.దశాబ్దాల నుంచి సినిమాను సీరియస్ గా అధ్యయనం చేసే జర్నల్స్ కు కొదవేలేదు.భారతదేశం విషయానికి వస్తే సినిమా గతంలో ప్రజాదరణ పొందిన ఫిల్మ్ ఫేర్,స్క్రీన్ పత్రికల్లో ఒకమోసర్తుగా వచ్చిన వ్యాసాలు,విశ్లేషణలు ఇవ్వాళ కరువయ్యాయి.భారతీయ సినిమా గురించి ఇవ్వాళ కొంచెం ఇంటలెక్చువల్ స్థాయిలో వస్తున్నవి ఎకనమిక్ అండ్ పొలిటికల్ రివ్యూ అది కాకుంటే ఎప్పుడన్నా మెయిన్ స్ట్రీమ్ లేదా ప్రత్యేకసంచిక వెలువరిస్తే ‘సెమినార్’.

తెలుగులో సినిమాల గురించిన విశ్లేషణాత్మకమైన వ్యాసాలు రాకపోవటం అన్నది ఒక ప్రశ్నేకాదు.ఎందుకంటే మనకు సాహిత్యానికో,భక్తికో,రియల్ ఎస్టేట్ కో సంబధించిన పత్రికలున్నాయి గాని కలగూరగంపలా అన్ని విషయాలను స్పృశించే పత్రికలు లేకపోవటం ఒకప్రధాన అంశంకాగా సినిమాల గురించి వెలువడేవాటిల్లో ఎక్కువగా అభిమానులకోసం వస్తున్నవే.

ఇంటూరి వెంకటేశ్వరరావు లాంటి పాతతరం సినిమాజర్నలిస్టులు,ఆరి సీతారామయ్య,కాట్రగడ్ద నరసయ్య లాంటి వారు గతంలో సినిమాకు సంబంధించి ఎంతో విలువైన సమాచారాన్ని తెలుగుపత్రికలలో పాఠకులతో పంచుకునేవారు.అలాంటి వ్యాసాలు పుస్తకరూపంలో వస్తే భవిష్యత్తరాల వారికి ఎంతో ఉపయుక్తంగా ఉండేది కానీ అలాజరగలేదు.ఇప్పుడు రావికొండలరావు లాంటి వాళ్ళు అలనాటి సినిమాల గురించి రాస్తున్నా వాటి హిస్టారికల్ యాక్యురసీ(చారిత్రక వాస్తవాల నిక్కచ్చితనం)మీద అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలికాలంలో అనూహ్యంగా తెలుగుసినిమాల మీద వెలువడుతున్న పుస్తకాల సంఖ్య గణనీయంగా పెరిగింది.అయితే పైన పేర్కొన్నట్లు వ్యక్తుల,సంస్థల గురించి తప్ప సినిమాల మీద వస్తున్న విశ్లేషణాపూర్వక రచనలు దాదాపు శూన్యమనే చెప్పాలి తెలుగు సినిమాపై హాలీవుడ్ ప్రభావం లాంటి పుస్తకాలను మినహాయిస్తే,ఇలాంటి అగమ్యగోచరమైన పరిస్థితుల్లో నవతరంగం నిర్వాహకులు సత్యజిత్ రాయ్ ఆంగ్ల గ్రంథాన్ని తెలుగులోకి తెచ్చి మరపురాని ఉపకారం చేశారు.

చలనచిత్రరంగానికి చెందినవారిలో ఇప్పటివరకూ అత్యధికంగా చాప్లిన్ మీద అన్ని ప్రపంచభాషలలో అసంఖ్యాకంగా వ్యాసాలు,పుస్తకాలు పరిశోధనలూ వెలువడ్దానికి ప్రథమకారణం చాప్లిన్ విశ్వమానవుడు కావటం.అదేవిధంగా స్వయంగా పుస్తకరచనచేసిన వారిలో ఐజెన్ స్టెయిన్ ప్రథములు.ఆయన సినిమా గురించి అత్యధికంగా రచనలు చేసారు.భారతీయ సినిమారంగంలో సత్యజిత్ రాయ్ బహుగ్రంథకర్తకాగా వెలువడ్డవ్యాసాల్లో కూడా సింహభాగం ఆయనను గురించినవే కావటం ఒక విశేషం.అయితేప్రయోగాత్మక సినిమాకు పెద్దపీటవేసే యూరోపియన్ దేశాల్లో ఆయాదేశభాషల్లోనే సత్యజిత్ రాయ్ గురించిన సమాచారం వ్యాసాలు ఉండిపోయాయి.అవి ఈనాటి సాంకేతికసౌకర్యాన్ని ఉపయోగించుకుని మొదట ఆంగ్లంలోకి ఆతరువాత భారతీయ భాషలన్నిటిలోకి రావాల్సిన అవసరముంది.

‘Our Films-Their Films’ అన్న సత్యజిత్ రాయ్ పుస్తకశీర్షికను ‘సినిమాలు మనవి-వాళ్లవి’అంటూ అనువదించటంలో చూపిన చమత్కారం పేజీలన్నిటా పరుచుకుని ఉంది.

మన సినిమాలు అన్న విభాగంలో పన్నెండు వ్యాసాలు,‘వాళ్లవి’ విభాగములో పదమూడు వ్యాసాలున్నాయి.మొత్తానికి అవ్యాసానికి ఆవ్యాసం ఒక ఆణిముత్యం.సినిమాను కూలంకషంగా ఔపాసన పట్టిన ఒక అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుడు,మీదుమిక్కిలి సృజనాత్మక సాహిత్యంలో,సంగీతంలో, చిత్రలేఖనం.సంగీతం,కూర్పు ఇలా అన్నిటిలోనూ స్వయంప్రకాశత్వం చూపిన రాయ్ ప్రపంచప్రముఖ సినిమా దర్శకులు,అందులోనూ తనను యెంతగానో ఆకట్టుకున్న కురసోవా లాంటివారి గురించి రాసుకున్న అధ్యాయాలు ప్రతి ఒక్కరు చదివితీరాల్సినవి.

సత్యజిత్ రే -భారతచలన చిత్ర దర్శకులలో అగ్రగణ్యుడు,భారతీయ నవ్య చలనచిత్రాన్ని అంతర్జాతీయ సినిమాప్రేమికులకు పరిచయం చేసిన వారిలో ప్రథముడు. ఈ గ్రంథంలో రే చలనచిత్ర ఆవిర్భావ కాలం నుంచి 1974వరకూ అంటే అతను రచనలో నిమగ్నమైన నాటివరకూ ప్రపంచసినిమా గురించి ప్రముఖంగానూ భారతీయ సినిమా గురించి యథాలాపంగానూ వివరిస్తారు.కొన్ని సార్లు ప్రపంచ భారతీయ సినిమాలు రెంటిని సమైక్యంగా మూల్యాంకనం చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలూ ఇందులో ఉన్నాయి.

మనకున్న సాంకేతిక పరిమితుల గురించి చెప్తూ,”క్రేన్ షాట్,ప్రాసెస్ షాట్ వంటి యంత్రాలు అవసరమైనవేకానీ అత్యవసరమైనవి కావు, మనకున్న యంత్రాలనే కాస్త తెలివిగా ఆలోచిస్తే మరింత
బాగా వాడుకోవచ్చు,మన సినిమాకి కావలిసింది ఒక శైలి,ఒక జాతీయముద్ర—అన్న విషయాన్ని ఎంతో విశదంగా వివరించే ‘మన చిత్రాలతో సమస్యలు’ అన్న వ్యాసం సత్యజిత్ రే అనుభవం దృష్ట్యా,మన భారతీయ చలనచిత్రాల అవసరాల దృష్ట్యా అటు ఔత్శాహికులు,ఇటు అనుభబజ్ఞులైన దర్శకనిర్మాతలూ,విమర్శకులు ఎన్నడూ మరువరానిది.ఎందుకంటే నేలమీద తిరిగే సైకిలు చక్రాన్ని కూడా గ్రాఫిక్ సాయంతో తీసేందుకు ప్రయత్నిస్తూ,విఫలమౌతూ,డబ్బు తగలేస్తూ అదేదో మహత్కార్యంలా చాటుకుంటున్న ఈనాడు ఎప్పుడో నలభై యేళ్ళనాడు రే ఎంతో అనుభవంతో,పరిశీలనతో చెప్పిన మాటలు ఎవరి చెవుల్లో నన్నా పడతాయా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే.అదే విధంగా మనకంటూ ఒక ముద్ర,జాతీయశైలి అనిపించుకునేందుకు కళాత్మక చిత్రదర్శకులొక్కళ్ళు ప్రయత్నిస్తే సరిపోతుందా?దేశంలో చలనచిత్రనిర్మాణం జరుగుతున్న ప్రతి భాషలోనూ అలాంటి ప్రయత్నం గతంలో జరిగిందా?అసలు భవిష్యత్తులో జరిగే ఆలోచన అయినా ఎవరికైనా ఉందా అని ప్రశ్నించుకుంటే లభించే సమాధానం ఊహాతీతం.

బెనారస్ డైరీ నుండి,మహారాజాతో సమావేశాలు అన్న రెండు వ్యాసాలు కాస్త హాస్యభరితంగా సాగుతాయి.చార్లీ చాప్లిన్ గురించిన రెండు వ్యాసాలలో ఒక గ్రేట్ మాస్టర్ గురించి మరొక గ్రేట్ మాస్టర్ ఒక ప్రేక్షకుడిగా తన అభిప్రాయాన్ని,ఒక దర్శకుడిగా తన దృక్కోణాన్ని వెల్లడించిన తీరు పాఠకులను ఎంతయినా ఆకట్టుకుంటుంది.

పుస్తకంలోని ప్రతివ్యాసమూవిలువైనవే,విపరీతంగా ఆకట్టుకునేవే.ఈ సమీక్ష ఉద్దేశ్యం క్లుప్తపరిచయమే కాబట్టి అన్నివ్యాసాలను వివరంగా విశ్లేషించే పని పెట్టుకోలేదు.అయితే ఇక్కడ అనువాదకురాలి ప్రతిభను, పనితనాన్ని తప్పక ప్రస్తావించాలి.సత్యజిత్ రాయ్ మూలగ్రంథాన్ని చదివిన వారికి సులభమైన ఆంగ్లంలో ఉన్నట్టు అనిపించినా చాలా చోట్ల ఆయన వాడిన పదజాలం తెలుగులోకి అనువదించేటప్పుడు సంక్లిష్తంగా ఉంటుందనేది నా స్వీయానుభవం.అలాంటి కష్టతరమైన పనిని వి.బి.సౌమ్య అత్యంత సులభంగా,సరళంగా పూర్తిచేసారు.ముఖ్యంగా ఎన్నో కఠినమైన నామధేయాలను ఉఛ్ఛారణకు అనుగుణంగా ఉదాహారణకు-Francois Truffautను ట్రుఫొ అనడం చాలా అర్థవంతంగానూ,భవిష్యత్తులో వెలువడే అనువాదాలకు ఒక దారి చూపినట్లుగాను ఉంది.అయితే ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ గురించి ట్రుఫొ అన్న ‘”Your point of departure is not the content but the container——వాక్యాన్ని యథాతథంగా ఉంచటం మంచి ఎత్తుగడ,పిండుకున్న వారికి పిండుకున్నంత అర్థం ఉందా వాక్యంలో తెలుగులో.అలాగే– “ఈమార్కెట్ లో అసలు కూరగాయలే కనిపించి చావవే “అని వెస్టర్న్ సినిమాల మహోపాధ్యాయుడు జాన్ ఫోర్డ్ చే అనిపించటం నవ్విస్తుంది.

నవతరంగం ఫిల్మ్ స్టడీస్ సంపాదకులు ముందుమాట రాయటం విధాయకమే అయినా సినిమారంగంలో ముఖ్యంగా సత్యజిత్ రాయ్-ప్రపంచసినిమాపై అనురక్తి ఉన్నవారు ఉదాహరణకు,అభిరుచి గల నిర్మాత అనిపించుకున్న కె.మురారి,దర్శకుడు నీలకంఠ,రచయిత,దర్శకుడు తనికెళ్ళ భరణి, లేదా దర్శకనిర్మాత బి.నరసింగరావు,ప్రొఫెసర్.జయధీర్ తిరుమలరావు ఇలాంటివారి చేత కూడా ముందుమాట రాయించిఉంటే మరింత పసందుగా ఉండేది.

అదే విధంగా నవతరంగం ఫిల్మ్ స్టడీస్ సంపాదకులు తెలుగు సినిమారంగానికి సంబంధించినంతవరకూ రఘుపతి వెంకయ్య,కె.వి.రెడ్డి.ఆదుర్తి సుబ్బారావు,కమలాకర కామేశ్వరరావు,కె.బి.జి.తిలక్,జి.రామినీడు,కె.యస్.ఆర్.దాస్. దేవదాస్ కనగాల లాంటి దర్శకుల పై కూడా భవిష్యత్తులో ఇలాంటి మంచి పుస్తకాలని అందిస్తారని ఆశపడటంలో ఎలాంటి తప్పులేదని ఈ సమీక్షకుడి భావన.

చలనచిత్ర ధృవతారా సంకీర్తనకై నవతరంగం వారి ప్రపథమ ప్రయత్నం ఒక మంచి బృందగానం.

You Might Also Like

10 Comments

  1. సినిమాలు – మనవీ, వాళ్ళవీ | పుస్తకం

    […] (సత్యజిత్ రాయ్ వ్యాసాల సంకలనం‌ “Our films, Their films” తెలుగు అనువాదం ఇటీవలే వచ్చిన విషయం పుస్తకం.నెట్ […]

  2. అరిపిరాల సత్యప్రసాద్

    “సినిమాలు మనవీ వాళ్ళవీ” ఇప్పుడు అన్ని విశాలాంధ్ర పుస్తక కేంద్రాలలో లభ్యం..!

  3. రాజేంద్రకుమార్ దేవరపల్లి

    @m. lakshmi: lakshmi garu plz try this link—http://www.satyajitray.org/films/filmo_directed.htm

  4. m. lakshmi

    నాకు సత్యజిత్ రే సినిమాలంటే చాలా ఇష్టం. ఈ అనువాద పుస్తకం విజయవాడలో ఎక్కడ దొరుకుతుంది? నేను పథేర్ పాంచాలి, బైసికిల్ తీవ్స్, ఇంకేవో ఒకటి, రెండు సినిమాలు మాత్రమే చూసాను. మిగతావి చూడ లేదు. సత్యజిత్ రే సినిమాలన్నీ ఒక సెట్టుగా ఎక్కడన్నా దొరుకుతాయా?

  5. రాజేంద్రకుమార్ దేవరపల్లి

    పైన వ్యాఖ్యాతలు వెలిబుచ్చిన అనుమానం సమంజసమే.
    యింతతీరుబాటుగా స్పందిస్తున్నందుకు మన్నించాలి.
    అసలీ సమీక్ష చాలా యిబ్బందులమధ్య చేసింది.ఇంటర్ నెట్ సౌకర్యం లేకపోవటం,నా కంప్యూటర్ జబ్బుపట్టం లాంటి అవాంతరాలమధ్య చాలా హడావుడిగా రాసిన సమీక్ష ఇది.ఈ కంగారులో కొన్ని అంశాలు ప్రస్తావించలేకపోయాను.ఆరిసీతారామయ్యా?ఎ.వి.సీతారామయ్యా అన్నది ఇప్పుడు నాకే తెలిసింది.ఎ.వి.సీతారామయ్య అన్న పరుచూరి శ్రీనివాస్ గారి మాటే నిజం.
    వాస్తవానికి తెలుగు సినిమాలమీద తెలుగు పత్రికల్లో రాసినవారు చాలామంది ఉన్నారు.ఉదాహరణకు మిక్కిలినేని,కాకపోతే వాటన్నిటి సంకలనాలు ఎవరైనా శ్రద్ధ,డబ్బు,కాలం వెచ్చించి జరపాల్సి ఉంది.అచ్చం భారతి లో వెలువడ్డ వ్యాసాలే ఒక బ్రహ్మాండమైన సంకలనం అవుతుంది.అలాగే చందమామలో వెలువడ్డ సినిమా ప్రకటనలు మంచి పుస్తకం అవుతుంది.ఇలాంటి తవ్వుకుంటూ పోతే నేలమాళిగలో లంకెబిందెలు దొరకొచ్చు.:)

  6. ప్రసాద్‌

    జంపాల గారూ, మీరు అడిగింది ఇప్పుడు బాగా అర్థం అయింది. మొదట్లో, వాక్య నిర్మాణం గురించి అలాంటి అర్థం వస్తుందన్నట్టుగా అడగారనుకున్నాను. – ప్రసాద్‌

  7. జంపాల చౌదరి

    నాకు తెలిసిన కథకుడు, మిత్రుడు ఆరి సీతారామయ్యగారు సినిమాల గురించి ఎక్కువగా రాసినట్లు నాకు తెలీదు. అందుచేత వ్యాసకర్త ప్రస్తావించిన సీతారామయ్యగారి వివరాలకోసం అడిగాను. మిత్రుడు పరుచూరి శ్రీనివాస్ ఇచ్చిన సమాచారం ప్రకారం పూర్వం A.V. సీతారామయ్య అని ఒకాయన తెలుగు సినిమా తొలిరోజుల్లో సినిమాలపై వ్యాసాలు వ్రాశారట. ఆయన, వ్యాసకర్త ప్రస్తావించిన సీతారామయ్య ఒకరేనా?

  8. ప్రసాద్‌

    జంపాల గారూ,

    ఈ కింద వాక్యాన్ని ఒక సారి చదవండి:
    “ఇంటూరి వెంకటేశ్వరరావు లాంటి పాతతరం సినిమాజర్నలిస్టులూ, ఆరి సీతారామయ్య,కాట్రగడ్ద నరసయ్య లాంటి వారూ గతంలో సినిమాకు సంబంధించి ఎంతో విలువైన సమాచారాన్ని తెలుగుపత్రికలలో పాఠకులతో పంచుకునేవారు.”

    ఇప్పుడు కూడా ఆరి సీతారామయ్య గారు సినిమాజర్నలిస్టు అనే అర్థమే వస్తోందా? లేదు కదూ? మాట్టేడేటప్పుడు వుండే దీర్ఘం, రాసేటప్పుడు పెట్టక పోవడం వల్ల, తప్పు అర్థం ధ్వనిస్తుంది. దీర్ఘం లేక పోవడం వల్ల, “ఆరి సీతారామయ్య గారూ, కాట్రగడ్డ నరసయ్య గారూ ఇద్దరూ ఇంటూరి వెంకటేశ్వరరావు లాంటి పాతతరం సినిమాజర్నలిస్టులు” అని అర్థం తప్పుగా వస్తుంది.

    ఇదీ నా అభిప్రాయం.

    – ప్రసాద్‌

  9. జంపాల చౌదరి

    కథకుడు ఆరి సీతారామయ్యగారితో పరిచయం ఉంది కాని సినీచరిత్రకారుడు ఆరి సీతారామయ్యగారి గురించి తెలీదు. ఆయన గురించి మరిన్ని వివరాలు ఇవ్వగలరా?

  10. అనిల్ అట్లూరి

    కాట్రగడ్డ నరసయ్య గారి ఆ రోజుల్లో చలన చిత్ర పరిశ్రమ మీద కొన్ని పుస్తకాలు వెలువరించారు.

Leave a Reply