ఓ నవ్వు కోసం.. :)

ముక్కూ, మొహం తెలీని వాళ్ళతో మాట్లాడవద్దనీ, వాళ్ళిచ్చినవి ఏమీ తీసుకోవద్దనీ అమ్మ చెప్పే మాటలను, నేను పుస్తక రచయితల విషయంలో కూడా అమలుపరిచేస్తూ ఉంటాను. కారణం: అపరిచితులు మాయచేసి, మహా అయితే ఉన్నది దోచుకుంటారు, లేదా ఎత్తుకుపోతారు. రచయితలు మాత్రం – ముఖ్యంగా కాల్పనిక సాహిత్యం రాసేవారు – మన అంగీకారంతోటే మన కళ్ళకి మాయా గంతలు కట్టి, మనల్ని ఎక్కడెక్కడో తిప్పుతారు. కొందరు చక్కగా, మొదలెట్టిన చోటే తీసుకొచ్చి దింపేస్తారు. కొందరు ఎక్కడికో తీసుకెళ్ళి, మాయమయ్యిపోతారు. అక్కడి నుండి మనకు మనంగా తిరిగిరావాలి. కొందరు ఒక్క చోటే నిలబెట్టి, మనల్ని గుండ్రంగా తిప్పుతుంటారు. బుర్ర వాచిపోతుంది. అందుకనే, ఆసక్తికరమైన రివ్యూలో, బలమైన రికమెండేషన్సో తగిలితే తప్ప, నాకు తెలీని రచయితల పుస్తకాలను కొద్ది క్షణాల్లో ఎన్నుకోవడం నాకు రాదు. అంతగా కాకపోతే, అక్కడే కూర్చొని ఒక నాలుగైదు పేజీలు చదివి నిర్ణయించుకోగలను గాని, గుడ్డిగా ఏ పుస్తకాన్ని చదవడానికి ఎన్నుకోను.

మొన్నటి వేసవిలో బెంగళూరులోని “Bookworm”కి వెళ్ళినప్పుడు, నాక్కావాల్సిన, నాకు తెల్సిన రచయితల పుస్తకాలు బోలెడు కనిపించాయి. ముందు రోజు సాయంత్రం లాండ్‍మార్క్ లో అవే పుస్తకాలు చూసి, చూసి రావడం వల్ల, అసలు నేనెప్పుడూ కనని, వినని పుస్తకాలు చూద్దాం అని నిర్ణయించుకున్నాను. అలా చూస్తూ ఉండగా, కనిపించిన ఓ పుస్తకం “Shifu, You’ll do anything for a laugh”. పేరు చూడగానే ఆసక్తి కలిగింది. ’బహుశా, నిరంతరం ఆనందవాహినిలో పడి మునకలేసే జీవి కథై ఉంటుంది. అందర్నీ నవ్విస్తూ, నవ్వుతూ బతికేసేవాడి కథ అనుకుంటా’ అని అనుకుంటూ పుస్తకం చేతిలోకి తీసుకున్నాను. చైనీస్ నుండి ఆంగ్లంలోకి అనువదించబడ్డ పుస్తకమనీ, మూల రచయిత మో యాన్ అని కవర్ పేజీ ద్వారా తెల్సింది. ఇంతకీ కథాంశమేమిటో చూడ్డానికి పుస్తకం తెరిస్తే, రచయిత ముందు మాట కనిపించింది. “రచయిత అయిన ప్రతివాడికీ, తాను రచయిత అవ్వడానికి ఏవో కారణాలు ఉంటాయి. నేను మరో హెమ్మింగ్వేనో, ప్లాబర్టో కాక, నేను నాలాంటి రచయితగా ఎందుకు మారానంటే, నా బాల్యంలో నేను చూసిన ఆకలి, జీవితం!” అన్న అర్థంలోని మాటలు చదవగానే, “ఇహ.. ఈయన ఏం రాసినా, నేను చదివి తీరుతా!” అని పుస్తకం కొన్నాను.

కొన్న ఆర్నెళ్ళకి ఆ పుస్తకానికి చదివి మోక్షం కలిగించాను. మొదటి రెండు పేజీలు పూర్తయ్యేసరికి, మనల్ని తీసి ఈ కింద వాతావరణంలో వదిలిపెట్టేస్తాడు ఈ రచయిత:

చైనా దేశంలో ఒక ఫ్యాక్టరీ కాంపౌండ్. ఆ పూట అక్కడంతా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. కార్మికులంతా ఊపిరి బిగబెట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఆర్ధిక మాంద్యం (ఇది రెండేళ్ళ కింద వచ్చిన ఆర్థిక మాంద్యం కాదు!) వల్ల కార్మికులను ఉద్యోగాలనుండి తీసేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఒక జాబితా వెలవడబోతుంది. అందులో ఎవరి పేరు ఉంటే వాళ్ళ ఉద్యోగం ఊడినట్టే! రోడ్డుపై పడ్డట్టే! ఆ జాబితాలో తమ పేర్లు ఉన్నాయేమోనని భయపడుతూ ఉన్నవారిలో ఒక ముసలతను ఉంటాడు. అతడు ఆ ఫ్యాక్టరీకి ఎనలేని సేవ చేసినవాడు. “షిఫు” – నైపుణ్యం ఉన్న కార్మికుడు – అని అందరిచేతా పిలవబడతూంటాడు. ఇంకో రెండు నెలల్లో అతని రిటైర్మెంట్. ఈ లోపుగాని అతడి ఉద్యోగం పోతే, ఇన్నేళ్ళ శ్రమంతా వృధా పోయినట్టే. “ఒక వేళ ఉద్యోగస్తులను తీసెయ్యాల్సి వచ్చిన పరిస్థితుల్లో, నీ పేరు చివరాఖరన ఉంటుంది.” అని మానేజ్‍మెంట్ ఇచ్చిన భరోసాను ఊతంగా చేసుకొని జాబితా చూసుకుంటాడు. అక్కడ అతడి పేరు ఉంటుంది. ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు.

ఇది చదివే సరికి, ఇదేదో కటిక పేదరికం తాలూకు కథ! ఇప్పుడు అలా ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళ దీన గాథై ఉంటుందనిపించింది. టివిలో వస్తున్న పాత తెలుగు సినిమా సంగీత దర్శకుడు, పనిలో పని, నాక్కూడా పనికొచ్చేలా, విషాద సంగీతం హోరెత్తించారు.

వయోభారం! భార్యను పోషించాల్సిన బాధ్యత! వృద్ధాప్యంలో బాగోగులు చూసుకోడానికి పిల్లలు లేకపోవడం – అన్నీ వెరసి, అతడి మీద బతకుభారం పెంచుతాయి. “నీకు అన్యాయం జరిగింది. అందుకని సంబంధిత ఆఫీసులకు పోయి, ధర్నా చేయి, దీక్ష చేపట్టు” అని సలహాలు ఇస్తారు. పాపం, ప్రయత్నిస్తాడు. అది కాస్తా, హింసాత్మకం అయ్యేసరికి, “నా వల్ల ఇందరికి హాని కలుగుతోంది.” అన్న మదనతో ఆ ప్రయత్నం విరమించుకుంటాడు. చూస్తూ ఉండగానే, తనతో పాటు నిరుద్యోగులు అయిన వారందరూ, ఏదో చిన్నా చితకా వ్యాపారాల్లో ఇమిడిపోతారు. ముసలతని పరిస్థితి దయనీయంగా తయారవుతుంది. పూట గడవడం కష్టంగా! ఒంట్లో శక్తి నశిస్తోంది. తేలికపాటి పనులేమో దొరకటం లేదు.

అప్పుడే అతడికి ఒక ఐడియా తడుతుంది. దాన్ని తన స్నేహితునితో పంచుకుంటాడు. “మరో ఆలోచన లేకుండా, మొదలెట్టు” అని భరోసా వస్తుంది స్నేహం నుండి. ముసలతనికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది, ఆ పని చేయడానికి. కాని తప్పదు కాబట్టి, మొదలెట్టేస్తాడు. కొద్ది రోజులకే లాభం వేటలో పడతాడు. అంతా సాఫీగా గడుస్తున్న రోజుల్లో అతని పీకమీదకొచ్చే పరిస్థితి ఒకటి కలుగుతుంది. పోలీసుల నుండి తప్పించుకోడాకని స్నేహితుడి సాయం తీసుకుంటాడు.

పోలీసుల నుండి తప్పించుకోగలిగాడా? అసలు అతను చేపట్టిన వ్యాపారం ఎలాంటిది? అందులో పోలిసుల ప్రమేయం ఎందుకు వచ్చింది? గౌరవప్రదంగా జీవించిన అతణ్ణి పరిస్థితులు దిగజార్చాయా? అసలు కథ పేరుకీ, కథకీ సంబంధం ఏంటి? లాంటి వివరాలన్నీ నాకు చెప్పేయాలని ఉంది. కాని అలా చెప్పేస్తే, ఈ కథ / నవలికలో నైపుణ్యంతో నడిపిన element of surpriseని మీకోసం పాడుచేసినట్టు అవుతుంది. కథ తిరిగే మలుపులు అన్నీ ఇన్నీ కావు మరి!

ఉపోద్ఘాతంలో చెప్పుకున్నట్టు, ఈ రచయితా కళ్ళకి గంతలు కట్టి, బోలెడన్ని మలుపులు తిప్పిస్తూ మనల్ని ఓ చోట వదిలేస్తాడు. అక్కడ నుండి నేను ఈలేసుకుంటూ, కులాసాగా నడుస్తూ వెనక్కి వచ్చాను.  బోలెడంత ఉత్సాహం మూటగట్టి రచయిత నా నెత్తిన పెట్టినా, పెద్దగా బద్ధకించకుండా, అంతా వెంట తెచ్చేసుకున్నాను.

ఈ పుస్తకం నాకెంతగా నచ్చిందో చెప్పడానికి ఇస్మైయిల్ గారి హైకూ ఒకటి వాడుకుంటాను..

ఈమెను ప్రేమిస్తున్నానని
అడుగడుక్కీ రుజువు చేయాలి:
బతుకంతా పరీక్షే!

ఇక్కడ ఈమె=బతుకు అనేసుకుంటే, ఈ నవలిక సారాంశం మన ముందున్నట్టే. హెమ్మింగ్వే రచించిన “The old man and the sea” గొప్ప కావ్యమే అవ్వచ్చుగాక! అది ప్రకృతి మీద ఆధారపడిన ఒక మనిషి జీవితంలో ఒక రోజు కథ. నన్ను ఈ రెండు రచనల్లో ఎన్నుకోమని అడిగితే, మరో ఆలోచన లేకుండా దీన్నే ఎన్నుకుంటాను. ఎందుకంటే, ఆ కథలో ఆ ముసలతడి చుట్టూ సముద్రం ఉంటుంది. ఇక్కడ సముద్రానికి బదులు భవసాగరం ఉంటుంది. దాన్ని ఈ మనిషి ఈదిన తీరు నన్ను ఆశ్చర్యానందాల్లో ముంచేసింది. అచ్చంగా మనం కనెక్ట్ అవ్వగలిగే పరిస్థితుల్లో అతను నెగ్గుకొచ్చిన తీరు జోహార్లు. ఇంకా చెప్పాలంటే, ప్రశ్నాపత్రం చూసి ముందు తెల్లమొహం వేసి, ఏం చెయ్యాలో పాలుపోని సమయంలో చేతులెత్తేయక, బుద్ధిని ఉపయోగించి గట్టెక్కిన విధానం, ఇతడి మెదడింకా వృద్ధాప్యం రాలేదనే అనిపిస్తుంది. ఈ రచయిత మరో హెమ్మింగ్వే కాకుండా, మో యాన్‍గానే మిగిలినందుకు నాకు చాలా సంతోషం ఉంది.

ఈ పుస్తకం నాకెందుకు చాలా నచ్చిందో చెప్పడానికి, నా దగ్గర బోలెడు కారణాలున్నాయి. అవి ఎంతగా చెప్తే, ఈ కథ చదవబూనేవారి సస్పెన్స్ ని అంతగా పాడుచేసినదాన్ని అవుతాను. అందుకనే వ్యాసం అసంపూర్ణంగా అనిపిస్తున్నా ఇక్కడితో ఆపేస్తాను. ముందు మాటలో ఆయనో మాట అంటారు: Alcoholism is not just about alcohol. కథ చదువుతున్న కొద్దీ, ఆ విషయం తేటతెల్లం చేసిన విధానం.. వావ్!

నిజానికి ఈ పుస్తకం కథల సంపుటి. నేను ఇక్కడ పరిచయం చేసింది (ఆ మాటకొస్తే, అసలు నేను చదివింది కూడా) ఆ ఒక్కటే! కాని ఆ ఒక్క రచనతోనే నాకీ రచయిత, ఆయన శైలి, శిల్పం, వగైరాలు, జీవితం పట్ల ఆయన దృక్పథం బాగా నచ్చేశాయి. నిస్సంకోచంగా ఆయన ఈ ఏడాదిలో నేను చదివినవారందరిలో నన్ను అమితంగా influence చేసినవారు. He’s the find of the year, for me.

మో యాన్ మీద వికీ పేజి
ఆయణ్ణి గురించి చక్కటి వ్యాసం. (పుస్తకం చదవాలని నిర్ణయించుకున్నవారు, ఇది చదవకపోవడం మేలు!)

Google Books Limited Preview

You Might Also Like

9 Comments

  1. varaprasaad.k

    మీ అంత సావకాశం లేని మా లాంటి వాళ్ళ కోసం మరి కాస్త విపులంగా రాస్తే బావుండేది.సస్పెన్సు పోతుందని మాములుగా చెప్పేసారు,ఇపుడు ఆపుస్తకం దొరికేదెప్పుడు,మేము చదివేదెప్పుడు.

  2. ravi avula

    బాగుంది మీ విశ్లేషణ.. నాకు ఆంగ్లం రాదు. బుక్ చదవాడానికి మరి ఏం చేయాలి నేను. ?

  3. pavan santhosh surampudi

    //పుస్తకం తెరిస్తే, రచయిత ముందు మాట కనిపించింది. “రచయిత అయిన ప్రతివాడికీ, తాను రచయిత అవ్వడానికి ఏవో కారణాలు ఉంటాయి. నేను మరో హెమ్మింగ్వేనో, ప్లాబర్టో కాక, నేను నాలాంటి రచయితగా ఎందుకు మారానంటే, నా బాల్యంలో నేను చూసిన ఆకలి, జీవితం!” అన్న అర్థంలోని మాటలు చదవగానే, “ఇహ.. ఈయన ఏం రాసినా, నేను చదివి తీరుతా!” అని పుస్తకం కొన్నాను.//
    అన్నారు. చదువుతూండగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నోబెల్ స్థాయి రచయితని టక్కున ఒక్కమాటలో పట్టేశారు(నోబెల్ రాకుండానే). తీరాబోసి
    //తెలీని రచయితల పుస్తకాలను కొద్ది క్షణాల్లో ఎన్నుకోవడం నాకు రాదు.//
    అన్నారు.. 🙂

  4. వీక్షణం – 1 (కొత్త శీర్షిక ప్రారంభం) | పుస్తకం

    […] చైనా కు చెందిన రచయిత మో యాన్ కు ఈ ఏడాది నోబెల్ సాహిత్య పురస్కారం లభించింది. “Mo Yan, a novelist who brought to life the turbulence of the 20th century China in vivid and often graphic works set against the tumult of the Japanese invasion and a struggling countryside, on Thursday became the first writer in China to be awarded the Nobel Prize in Literature.” అంటూ మో యాన్ గురించి హిందూ పత్రికలో వచ్చిన అనంత కృష్ణన్ వ్యాసం ఇక్కడ చదవండి. మో యాన్ కథల సంకలనం “Shifu, You’ll do anything for a laugh” గురించి పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం ఇదిగో. […]

    1. pavan santhosh surampudi

      మీక్కూడా కంగ్రాట్స్ అండీ

  5. Purnima

    @Indian Minerva:

    ఇది ఆన్‍లైన్‍లో లేనట్టుంది. ఫ్లిప్‍కార్ట్ వాడు స్టాక్ లేదంటున్నాడు. మీది బెంగళూరు అయితే, నేను కొన్నట్టే, బిగ్రేడ్ రోడ్డులో ఉన్న Bookworm వారిని అడిగి చూడండి. ఎం.జి రోడ్డులో కూడా వీరి బ్రాంచ్ ఉందని విన్నాను.

  6. Indian Minerva

    మీ రివ్యూ ఆసక్తిని రేకెత్తించేదిగా వుంది. ప్రస్తుతానికి నేను ఈ పుస్తకం వేటలో వున్నాను. సహాయం చేయగలరు.

    1. Purnima

      Looks like this book is now available on Flipkart. Not just this, other works of Mo Yan are also there. Have been hunting for them, for a long time.

      Buy Shifu, You’LL Do Anything for a Laugh from Flipkart.com

Leave a Reply