2010లో చదివిన తెలుగు పుస్తకాలు
గడిచిన ఏడాది నాకు అచ్చంగా పుస్తకనామ సంవత్సరం. ఇంకా చెప్పుకోవాలంటే అసలెక్కడికి వెళ్ళినా పుస్తకాలను తోడు తీసుకెళ్ళటం అలవాటే అయినా, పోయిన ఏడాది ఎటు వెళ్ళినా పుస్తకాలు నాకు ఎదురయ్యాయి. కొన్నింటిని నేను వెతుక్కుంటూ వెళ్తే, కొన్ని నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. రమణ గారన్నట్టు, “బుక్స్, బుక్స్ మరియు బుక్స్!” ఎంతగా అంటే ఇంట్లో వాళ్ళకి నా పుట్టినరోజు బహుమతిగా ఇవ్వటానికి బుక్ షెల్ఫ్ తప్ప మరో ఆలోచన రానివ్వనంత! ఏడాది సగంలో కిండిల్ చేతికి రావటంతో అందు, ఇందు అన్న సందేహం లేకుండా ఎక్కడైనా పుస్తకాలతో జత కట్టే అవకాశం దొరికింది.
ఇహ, తెలుగు పుస్తకాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉన్న సాహిత్యాన్నంతా చదివేశానని కాదు గాని తెలుగు కన్నా నాకు ఆంగ్ల సాహిత్యం మీదే మక్కువ జాస్తి. తెలుగులో వెరైటీ లేదన్నది నా అభిప్రాయం. అది దాదాపుగా తప్పని నిరూపించిన ఏడాది ఇదే! ఒక సంవత్సరకాలంలో ఇన్ని తెలుగు పుస్తకాలు నేను ఇంతకు ముందు చదివింది లేదు. అది సాధ్యపడ్డానికి గల కారణాలు నెమరువేసుకోవడం ఇక్కడ అప్రస్తుతం కాదనుకుంటాను.
విశాలాంధ్రను దాదాపుగా మర్చిపోయాను. ఏ ఊరెళ్ళినా తెలుగు పుస్తకాలు వెతుక్కున్నా ఊర్లో ఉన్నప్పుడు మాత్రం ఈవినింగ్ అవర్ మీద ఆధారపడ్డాను. నా బద్ధకాన్ని వారు ప్రయత్నలోపం లేకుండా పెంచేసారు. అనుకొన్న తిరుపతిలో చాలా తక్కువ పుస్తకాలు దొరికాయి. అనుకోని బెంగుళూరులో ఆసక్తికరమైన తెలుగు పుస్తకాలు చేజిక్కాయి. “ఒక ఫైవుందా?” అని అప్పులు అడిగేవాడిలా, “శేషేంద్ర ఉన్నారా? దాశరథో?” అని అడగడానికి వెనుకాడలేదు ఎవర్నిబడితే వాళ్ళని. ముళ్ళపూడిగారిని కలిసి మాట్లాడామా? అన్న విషయం నమ్మశక్యం కాకముందే, సందట్లో సడేమియా అన్నట్టు వారి లైబ్రరీలో ఉన్న పుస్తకాల్లో మనకి కావాల్సినవి వీలుపడితే ఒరిజినల్ లేకపోతే ఫోటోకాపీ ఇప్పించుకున్నాను. ఏదో చూసొద్దామని తార్నాకలో ఉన్న ఆర్కైవ్స్ కి వెళ్ళి “సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు? మీకెందుకీ పుస్తకాలూ?” అని అనిపించుకొని మరీ ఆత్రేయ ఆత్మకథ దక్కించుకున్నాను. ఓరియంటర్ మాన్యుస్రిప్ట్స్ వారు మూడొందల డబ్భై ప్లస్ పది ని కాలుకులేటర్ మీద లెక్కేసి మరీ బిల్లు ఇచ్చేంతగా పుస్తకాలు కొన్నాము. (ఇలా చివర్లో బహువచనం వచ్చేస్తే అది నేను, సౌమ్యా కల్సి ఉన్నట్టు గమనించగలరు.) తిరిగొచ్చిన ఊర్లు చాలనట్టు ఇంటర్నెట్ లో తెలుగు పుస్తకాల ఖజానా డిజిటల్ లైబ్రరీని కెలికి బోలెడన్ని పుస్తకాలు దించేసి, ఆవగింజలో అరపాతిక సగం అన్నంతగా చదివాను. కిండిల్ ఉండడం వల్ల ఆ మాత్రమైనా సాధ్యమైంది.
కోతి కొమ్మచ్చి ఆడియో పుణ్యమా అని నిద్రపోతూ కూడా చెవుల్లో తెలుగు ధ్వనిస్తూనే ఉంది. మొట్టమొదటి సారిగా సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి పత్రికకు అలవాటుపడ్డాను. వయస్సుకు తగ్గ పుస్తకాలుంటాయేమో గాని నేను మాత్రం బుడుగు, బాల (పత్రిక), ఈద్ఘా, టోటో చాన్ వంటి బాలసాహిత్యం మనసారా ఆస్వాదించాను. ఎప్పుడూ చదవని పొలిటికల్ సెటైర్ చదివాను. తెలుగు పద్యాలతో కసరత్తు ఇంకా ప్రథమ దశలోనే ఉన్నాను. పద్యప్రధానమైన పుస్తకాలు కొన్ని చదివాను.
ఈ ఏడాది నన్ను అమితంగా ఆకట్టుకున్న రచయితల్లో నాపై చెరగని ముద్ర వేసినవారిలో బైరాగి, ముళ్ళపూడి గార్లు మొదట నిలుస్తారు! ఇద్దరికీ శతసహస్ర వందనాలు.
ఇక ఇదిగో నా జాబితా..
కవితలూ – కవిత్వం:
స్వప్నలిపి – అజంత: పుస్తకాల లిస్ట్ రాసేటప్పుడు మొదట ఈ పేరే తట్టింది. దీనికి రెండు కారణాలు. ఒకటి: ఇందులో కవితలు చాలా నచ్చడం. మరోటి: ఈ పుస్తకం కోసం నేను పరితపించటం. ఇహ, దొరకదని ఆశలు వదిలేసుకున్న తరుణాన ముళ్ళపూడి వారి లైబ్రరీలో ఉన్న ఈ పుస్తకాన్ని తీసుకొని ఫోటో కాపీ తీయించుకున్నాను. ఈయన కవిత్వంలో ఒక విషాదస్వరం వినిపిస్తూ ఉంటుంది. మృత్యువును గురించి ప్రస్తావన అధికంగా ఉంటుంది. చదివిస్తాయి. ఆలోచింపజేస్తాయి. ఈ కింది వాక్యాలు చూడండి:
“ఉదయం నిద్రలేవగానే, సూర్యబింబాన్ని ఒకసారి నా వైపు త్రిప్పుకొని, మా ఆవిడ పాదాల వైపు చూస్తాను పువ్వులు జల్లుతున్నట్టు; వృద్ధాప్యంలో తల్లి తర్వాత తల్లి; ఇప్పుడు నేను బ్రతుకుతున్నది ఆమె చేతులలోనే; సుఖ దుఃఖాలలో తడిసిన ఆమె చేతులను అప్యాయంగా ఒకసారి స్పృశిస్తాను; ఆమె స్పర్శలో, సాహచర్యంలో మృదువైన ఆమె వేళ్ల నుంచి ప్రసరిస్తున్న జీవశక్తిని కన్నుల నిండా నింపుకొని, తడబడుతున్న అడుగులతో నా ప్రపంచంలో అప్పుడు అడుగు పెడతాను.” – వేళ్లు ఇక్కడే, అజంత
అలానే తల్లిదండ్రులను నేను ఎటూ సరిగ్గా చూసుకోకలేకపోయాను, కనీసం నువ్వన్నా చూసుకో అని తమ్ముడితో చెప్తున్నట్టు ఉండే కవిత చాలా నచ్చింది నాకు. ఈ పుస్తకం కోసం వెతికినందుకు మంచి ప్రతిఫలమే దొరికింది.
నిద్రిత నగరం – వైదేహి శశిధర్: ఆ శీర్షికే సగం పడిపోయాను నేను. నేను పుట్టి పెరిగిందంతా నగరం కావటంతో, నాకు నగరం అంటే ఆప్యాయత ఎక్కువ! ఇహ, బాగా రాత్రయ్యాకో, లేక ఇంకా భానుడు నిద్ర లేవకముందే నగరాన్ని చూడాలంటే నాకు మరింత ఇష్టం. కవిత్వం గురించి చెప్పటానికి నాకు చేత కాదు. వీణ తీగలను మీటినప్పుడు వెలువడే శబ్దాన్ని విని పులకరించటం మాత్రమే నాకు చేతనవుతుంది. నాకు ఇంకోటి కూడా బాగా చేతనవుతుంది. ఇలాంటి రచనలు ఎప్పుడు ఎక్కడ చదవాలి అన్న విషయాలు ఎంపిక చేసుకోవడం. కూర్గ్ లో కావేరీ నది ఒడ్డున ఊయల్లో పడుకొని ఇలాంటి కవిత్వం చదివితే ఉంటుంది చూడండీ… ఆహ! నేను ఎందుకు చెప్పటం.. మీరూ ప్రయత్నించండి.
ప్రతిమా నాటకము – చిలకమర్తి లక్ష్మీనరసింహం: తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడున్న తి.తి.దే ప్రెస్స్ లో భారత భాగవతాలు దొరక్క, ఖాళీ చేతులతో వచ్చే బదులు ఏవోటి కొందాంలే అని తీసుకున్న రచనల్లో ఇదొకటి. బాగా నచ్చిన రచన. పద్య రచనలు చదవాలన్న పట్టుదలతో చదివింది. అనుకోకుండా రవి గారు కూడా ఇదే నాటకాన్ని సంస్కృతంలో అప్పుడే చదివారని తెల్సుకొని, ఇద్దరం కల్సి, దీని మీద చర్చ లాంటిది జరిపాం. అదో మంచి అనుభవం.
సుందోపసుందుల వధ : ఇది కూడా చిలకమర్తి వారి రచనే! పద్యాలతో కూడి ఉంటుంది. కథ తెలిసినదే అయినా ఆద్యంతం చదివిస్తుంది. తి.తి.దే. వారి ప్రచురణ.
ఆగమగీతి – బైరాగి: “నేను ఫలనా కవిత్వం చదివాను.” అని చెప్పుకోవడం అంటే నాకు భలే భయం. ఎందుకంటే, ఆ పైన చెప్పటానికి నా వద్ద ఇంకేం మిగలదు. ఆ కవిత్వాన్ని విశ్లేషించలేను. పోనీ, కవిత్వం గురించి అంతే కవితాత్మకంగా చెప్పలేను. అదీ పోనీ, కనీసం చదివిన కవితల్లో నాలుగు ముక్కలు తిరిగి అప్పజెప్పలేను. అలాంటప్పుడు ఇహ, చదివానని చెప్పుకోవడం ఎందుకో నాకే అర్థం కాదు. నాకు నచ్చే కవితలు ఎలా ఉంటాయి అంటే మాటలతో గాట్లు పెట్టేలా, గాయాలు చేసేలా.. అలా గాయపడ్డాక వాటిని “ఉఫ్..ఉఫ్” అని ఊదుకోవటం సరిపోతుంది. ఇక కవిత్వం గురించి ఏం చెప్తాను?
అయినా, “జీవితమొక క్షణికోన్మాదం – జీవితమొక వ్యర్థవినోదం” అని కవిగారే బల్ల గుద్ది చెప్పాక నేనేం చెప్తా. అన్నట్టు బైరాగి గారి కవితల్లో నాకు నచ్చిన ముఖ్యాంశం ఇదే – ఏది చెప్పినా బల్ల గుద్ది చెప్పినంత conviction కనిపిస్తుంది.
ఇస్మాయిల్ గారు “కవిత్వంలో నిశ్శబ్దం” అన్న పుస్తకంలో కవిత్వమనేది మూగవాని కేక అని అభివర్ణించారు. అలా అనుకుంటే మూగబోయిన మన ఎన్నెన్నో భావాలను బైరాగి కవితల్లో వినిపిస్తాయి.
“నూతిలో గొంతుకలు” – ఆలూరి బైరాగి: ఇదో పరమాద్భుతమైన రచన. గొప్పలకు పోయి నేనీ పుస్తకం చదివానని ఇక్కడే గొప్పలు పోయాను గాని, నిజానికి దీన్ని చదవడానికి నాకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆపై అర్థం చేసుకోడానికి ఎన్ని ఏళ్ళు పడతాయో మరి!
ఎల్లోరా కవిత్వం: అజంతాతో పాటు ఎల్లోరా కూడా దొరికితే, “సరే, ప్రయత్నిద్దాం” అని తీసుకున్నాను. మొదట్లో ఉన్న వ్యాసాన్ని చదువుతూ పోతూ ఉంటే అంతగా పేరు వినబడని మరో అద్భుతమైన కవి వీరు కాబోలునని అనుకున్నాను. వ్యాసం చివర్న శేషేంద్ర శర్మ గారి కనిపించి, సందేహం వలదు అని అనిపించింది. తీరా చదివాక, నీరసం వచ్చింది. అంటే బాగోలేవని కాదు. అంటే బాగున్నాయనీ కాదు. లైట్ తీసుకున్నాను.
బేతవోలు రామబ్రహ్మం గారి “పలుకు చిలుక”: ఈ పుస్తకం నన్ను ఆకర్షించడానికి రెండు కారణాలు. ౧) రచయితను గురించి చాలా విని ఉండడం. ౨) పుస్తక విషయం. భారతీయ భాషల్లో వచ్చిన అత్యుత్తమ కవితలకు చంధోబద్దమైన తెలుగు అనువాదాలు ఉన్నాయి. అసలు అనువాదాలే కష్టతరం అనుకుంటే, ఇహ చంధోబద్ధమంటే మరీ కష్టం కదా అని అనిపించింది. చదివినంత మేరకు నాకు బాగానే అనిపించాయి. అనువాదాలు మాత్రమే ఉండడం వల్ల, అసలు మూలానికి ఎంత న్యాయం జరిగింది లేక ఏది బాగుంది అన్న మీమాంస నాకు తప్పింది. ఈ పుస్తకాన్ని చదివిన మరొకరు మాత్రం అంతగా నచ్చలేదన్నట్టు మాట్లాడారు. ప్రస్తుతం అలభ్యం కనుక, ఎక్కడైనా తగిలితే ఈ రచన్ని చదవమనే చెప్తాను.
నక్షత్ర దర్శనం – తనికెళ్ళ భరణి: నాటికలు చదివాక, మరో ఆలోచన లేకుండా ఆయన పుస్తకం కనిపించింది కనిపించినట్టు కోనేశాను. ఇవి, ప్రముఖులపై భరణి గారు వేసిన కవితా కుసుమాలు. ఇందులో బ్రహ్మానందం గారి పై రాసిన కవిత నాకు బాగా నచ్చింది. ఇందులో ఇంకో ప్రయోగం, శ్రీశ్రీ-విశ్వనాథ, హిట్లర్-చాప్లిన్ లాంటి కాంబినేషన్లో కవితలు ఉండడం. మొన్న విజయవాడ పుస్తక ప్రదర్శనలో మాట్లాడుతూ, “ఈ కవితలు అంతటితో ఆగలేదు. నాకు నచ్చిన ప్రముఖుల గురించి ఇంకా రాస్తాను” అని చెప్పారు. అలానే ఆయనకు సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టమనీ చెప్పారు. ఇప్పుడిక నేను దేని గురించి వేచి చూస్తున్నానో ప్రత్యేకంగా చెప్పక్కరలేదుగా!
ఇస్మాయిల్ హైకూలు: బ్లాగుల వల్లే నాకు ఈయన గురించి తెల్సింది. ఈమాటలో వారి / వారిని గురించిన ఉన్న రచనలన్నీ నచ్చాయి. పుస్తకాలు దొరకలేదు. ఈ మధ్య కాలంలో దొరికాయి. మళ్ళీ చదువుకున్నాను.
*******************
నవలలూ..
కృష్ణాతీరం – మల్లాది రామకృష్ణ శాస్త్రి: ఇది కూడా వెతికి వెతికి వేసారి, రమణ గారి వద్ద అదనపు కాపీ ఉంటే ఇప్పించుకున్నాను. అత్యద్భుతమైన రచన. కమ్మని తెలుగు! చిక్కని తెలుగు! నోరూరించే తెలుగు! మీగడ లాంటి తెలుగు! మల్లాది వారి కథలు కొన్ని చదవబూనుకొని, “కొంచెం కష్టం” అనుకుంటూ పక్కన పడేసిన నాకు ఈ రచన చదవటం ఎంత కష్టమనిపించిందో కష్టం యొక్క ప్రతిఫలం నోటికందేటప్పుడు అంత సంతృప్తీ కలిగింది. Punctuationని కథలో అంతర్భాగం చేయడం ఇందులోనే చూశాను.
తెలుగు నా మాతృ భాష అయినందుకు ఎగిరి గంతేసి, అందుకు కారణమైన ప్రతి ఒక్కరికీ “థాంక్స్” చెప్పాలనిపించేంతగా నచ్చిన రచన.
జీవన రాగం -వేటూరి సుందరామ్మూర్తి: ఇది కూడా రమణ గారి లైబ్రరీలో చూసి, “ఔరా!” అనుకొని, ఫోటోకాపీ తీయించుకున్నాను. ఆయన కొమ్మకొమ్మకో సన్నాయి పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఎవరో అన్న మాటలు: ఆయన మరిన్ని రచనలు చేయకపోవటం సాహిత్యం దురదృష్టం. కాని, వారే లేకపోయుంటే, సినిమా సాహిత్యం ఇంకెంత దయనీయమైన పరిస్థితిలో ఉండేదో. అక్షరసత్యాలు ఆ మాటలు. వేటూరి సుందరామ్మూర్తికి జై! ఈ పుస్తకం చదువటం పూర్తి అవ్వీ అవ్వగానే, ఆయన మరణించారన్న విషయం తెలీయటం నన్ను బాధపెట్టిన సందర్భాల్లో ఒకటి.
టోటో చాన్: “చదవండి!” అని చనువుగా నా చేతిలో ఈ పుస్తకం పెట్టి, నా చేత కొనిపించిన అరుణగారికి బోలెడు థాంక్సులు! భలేంటి పుస్తకం. చదివిస్తుంది. ఆలోజింపజేస్తుంది.
ఈద్ఘా – ప్రేంచంద్ : హా! ఈ పుస్తకం లిస్ట్ లో ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చిందో! “చిన్నపిల్లల పుస్తకాలు చదువుతావేంటి?” అని చుట్టూ ఉన్న వాళ్ళు వింతగా చూసినా, ఇట్లాంటి పుస్తకాలు వెత్తుక్కొని, కొని చదవాలని చెప్తూ ఉన్నా. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన కథ లీలగా గుర్తుంది. కొన్న పుస్తకంలో చాలా అచ్చుతప్పులు. పేలవమైన అనువాదం. బొమ్మలూ బాగా లేవు. అయినా పుస్తకం చదవటం పూర్తవ్వగానే నవ్వు కళ్ళల్లో, విషాదం పెదవుల పైనా స్థిరపడే విధానం కోసం, ఎంత మంది ఎన్ని విధాలుగా వింతగా చూసినా చదువుకోవాల్సిందే!
********************
కథలూ…కమామిషు..
సాహిత్య అకాడెమీ కథలు: నా సొంత తెలివి ఉపయోగించి, “నేషనల్ బుక్ ట్రస్ట్” వారు పెట్టిన స్టాల్లో మూలకు పడున్న రెండు దుమ్ముకొట్టుకుపోయున్న పుస్తకాలను కొన్నాను. “సమకాలీన భారతీయ కథానికలు” అని వాటి పేర్లు! భారతదేశంలో వివిధ భాషల్లో వెలువడ్డ అత్యుత్తమ కథలకు తెలుగు సేత. (అంటే వివిధ భాషల నుండి ఇంగ్లీషులోకి అనువదింపబడి, అటు నుండి తెలుగు అనుకుంట!)
నేను అన్ని కథలూ చదవలేదు. నిజానికి చాలా తక్కువే చదివాను. కాని చదివినంత వరకూ ఆ కథలూ, ఆ కథల్లోని భావోద్వేగాలూ నా మెదడులో ఫెవికాల్ పెట్టి అతికించినట్టు నిలిచిపోయాయి. “మాంచి కథ..” అన్న పదం వినగానే, “హే..ఆ అస్సామీ కథ ఉంది చూడు, అందులో కటిక పేదలైన భార్యాభర్తల సంబంధం గురించి ఉంటుంది… అసలా కథ ముగింపు ఉంది చూశావూ..” అని ఒక క్షణం, “ఇంకోటి కూడా, అత్తా కోడలి మధ్య వివాదాన్ని పరిష్కరించుకునే తీరు ఉంటుందే…” అని మరో క్షణం, “అదేదో కథ గుర్తు రావటం లేదు కాని, “నిరీక్షణ” అన్న పదాన్ని ఎంత బాగా ఆవిష్కరించారు ఆ కథలో.. “ అని మరో మారు.. ఇలా అనిపించటం సహజమైయ్యిపోయింది నాకు.
నేనిప్పుడు ఈ పోలిక చెప్తే, కిసుక్కుమని నవ్వుతారేమో గాని, నాకు పది పన్నెండేళ్ళ వయస్సులో దూరదర్శన్ ఢిల్లీ కేంద్రం వారు, జాతీయ స్థాయిలో పేరు గాంచిన కొన్ని కథలను చిత్రీకరించి, సిరీస్‍గా వేసేవారు. అవి కళాఖండాలు కాకపోవచ్చు, గాని హృదయాన్ని సూటిగా తాకుతాయి. మనపై చెరగని ముద్ర వేస్తాయి. ఈ కథలు అచ్చంగా అలానే అనిపించాయి. శిల్పమూ, శిలా వగైరాలు పక్కకు పెడితే, ఒక కథ నిర్వర్తించాల్సిన అతి ముఖ్యమైన పని – పాఠకుని కదిలించటం – సమర్థవంతంగా చేస్తాయి ఈ కథలు.
ఆలూరి బైరాగి కథల సంపుటి – దివ్యభవనం: బూదరాజు గారిది “మరువరాని మాటలు” అని ఒక పుస్తకం ఉంటుంది. అందులో బైరాగి గారి మాటలు (కోట్స్!) కొన్ని చదివి, ఈయన రచనలు చదివి తీరాలన్న కసితో పుస్తకాల వేట మొదలెట్టినా, అహింసాయుతంగానే ఈ పుస్తకాలు విశాలాంధ్ర వాళ్ళ పుణ్యమా అని దొరికాయి. వచనమా? కవిత్వమా? అని అర్థం చేసుకోడానికి నాకు సమయం పట్టింది. అసలు కవులను కథలు రాయనివ్వకూడదు నన్ను అడిగితే. ఒక్కో వాక్యాన్నీ పదేసి సార్లు చదువుకునేంత బాగా రాస్తే, ఇహ కథలు చదవటం ఎప్పటికి అయ్యేను అట?!
నామిని కథలు: నామిని నామ జపం వినీ, వినీ ఏడాది ప్రధమార్థంలో ఈయన పుస్తకాలు అందుబాటులో లేక, అరువిప్పించుకొని చదివిన పుస్తకం. చదివిన అంటే నిజానికి చాలా దూరమవుతుంది. నలుగురం కలిసి వంతులు వారీగా ఒక్కో కథా చదువుకొని, హాయిగా నవ్వుకోవటం ఓ మధురానుభూతి. యాస, కథ, కథనం అన్నీ నచ్చాయి.
పోలేరమ్మ బండ కతలు – మహ్మద్ ఖదీర్ బాబు: ఈ కథల గురించి బాగా విని ఉండడం వల్ల, కొత్త ముద్రణ కళ్ళబడగానే కొనటం, చదవటం పూర్తయ్యింది. నాకు చాలా నచ్చిన కథల సంకలనంలో ఇది ఒకటి. కాకపోతే వీటిని కతల కన్నా మ్యూజింగ్స్ చూడ్డానికే ఇష్టపడతాను. కొందరిది బంగారు బాల్యం. కొందరిది కూడూ, గుడ్డా కూడా దొరకని బాల్యం. చాలా మందిది, ఈ రెంటికీ మధ్యన ఉంటుంది. ఉండీ లేనట్టు, లేకపోయినా ఉన్నట్టు ఉండే ఇలాంటి జీవితాలనుండే బోలెడు కథలు పుట్టుకొస్తాయి , అవి ఏక కాలంలో నవ్వించీ, ఏడిపించగలవనీ నిరూపించిన కతలివి!
కవన శర్మ “అమెరికా మజిలీ కథలు”: టైంపాస్ కి చదువుకునే రచనలు నాకు సరిపడవని తెల్సినా ప్రయత్నించాను. మధ్యలో వదిలేశాను.
నీతి కథామాల: తితిదే ప్రచురణ. చిన్న పిల్లల కోసం. బాగానే ఉంటుంది.
*****************
జీవిత చిత్రాలు – ఆత్మకథలు
సి.పి. బ్రౌన్ లేఖలు : దీని గురించి నా అభిప్రాయం ఇక్కడ రాసాను. కాకపోతే, సి.పి. బ్రౌన్ ను అనవసరంగా భుజాల మీద మోస్తున్నారన్న ఒక అభిప్రాయం తరచూ వినిపిస్తోంది. ఆ కథేమిటో కనుక్కోడానికి నేను సి.పి.బ్రౌన్ గురించి తెల్సుకోవాల్సింది చాలా ఉందని అర్థమయ్యింది.
సాహిత్య అకాడెమి వారి మోనోగ్రాఫ్ “భాసుడు” – వెంకటాచలం: 2009లో బుక్ ఫేర్‍లో మళ్ళీ నా సొంత తెలివి ఉపయోగించి, చవగ్గా వస్తుంది కదా, భాసుడు ఎవరైతే మనకేం అని కొనేశాను. ప్రతిమా నాటకాన్ని రాసింది భాసుడని తెల్సి, ఈ పుస్తకాన్ని బయటకు తీసి చదివాను. పైన పేర్కొనబడిన చర్చలో దీని గురించి మాట్లాడుకున్నాము. భాసుని గురించి తెల్సుకోడానికి బాగా ఉపయోగపడుతుంది.
కనుపర్తి వరలక్ష్మమ్మ – సాహిత్య ఆకాడెమీ ప్రచురణ: మాలతిగారు ఇక్కడ కనుపర్తి వారి గురించి చెప్పేవరకూ నాకు ఈవిడ పేరు కూడా తెలీదు. తెలిసాక, ఆవిణ్ణి గురించిన మోనోగ్రాఫ్ కనిపించగానే కొని చదవటం పూర్తి చేశాను. ఆవిడను గురించీ, ఆవిడ పుట్టి పెరిగిన వాతావరణం, అప్పటి సమాజ పరిస్థితులూ, ఆవిడ జీవిత నేపధ్యం అన్నీ తెలిసేలా ఉందీ రచన. ఆవిడ కవొతలు కొన్ని చదివే అవకాశం ఈ పుస్తకం ద్వారానే కలిగింది. తెలుగులో ప్రప్రధమ లేఖా సాహిత్యంగా పరిగణించబడే “శారద లేఖలు” పై ఈ పుస్తకం చాలా ఆసక్తి రేపినా, ఆ రచన దొరక్క చదవలేదు.
ఆత్రేయ ఆత్మకథ: “మరుపే తెలియని నా హృదయం, తెలిసీ వలచుట తొలి నేరం, అందుకే ఈ గాయం.” అనుకుంటాం గాని, గాయాలలో నుండి పుట్టే గేయాల మాధుర్యమే వేరు. గొంతులో అడ్డం తిరిగిన దుఃఖాన్ని, కన్నీళ్ళలా ప్రసవింపజేసే మంత్రసాని ఈ గేయాలే కదా! ఆత్రేయ తెలుగువాడిగా పుట్టినందుకు ఎగిరి గంతులేసినంతగా నచ్చిన రచన ఇది.
నాన్న-నేను – బుజ్జాయి: ఈ పుస్తకం వెనుక అట్ట మీద ఒక చిన్న బొమ్మ ఉంటుంది. ఓ నడివయస్సు వ్యక్తి పంచెకట్టుతో ఉంటారు. ఆయన చేయిని పట్టుకొని ఒక చిన్నవాడు ఉంటాడు. ఇద్దరూ అలా నడుచుకుంటూ పోతుంటే, మనకి వెనక నుండి కనిపిస్తారు. పుస్తకాన్ని చదవడానికి సిద్ధపడ్డం అంటే ఆ చిన్నపిల్లవాడి చేయి పట్టుకొని మనం కూడా వాళ్ళతో అలా కులాసా నడవడం. మనం వేలు పట్టుకున్నవాడు ప్రముఖ చిత్రకారుడు కావచ్చు గాక! అతను వేలు పట్టుకున్నవాడు పేరెన్నికగన్న కవే కావచ్చు. వారిద్దరి నడకలో మనకు ఇంకెందరో ప్రముఖులు కనిపించవచ్చు. కాని మనల్ని ఆ తండ్రీ కొడుకుల ఆప్యాయతానురాగాలకు మించి మరేమీ కనిపించవు. బా రాయడమేమో కాని, చదివించేంత బాగా విషయాలను పంచుకోవడమూ ఒక కళ!
శ్రీ పదార్చన: అన్నమయ్య జీవిత చరిత్ర చదవాలనిపించి ఈ పుస్తకం కొన్నాను. నిరాశపరిచింది. ఒక నవల్లా చదువుకుందామన్న ఇది నన్ను అంతగా ఆకట్టుకోలేదు. ముదిగొండ గారి గురించి విని ఉండడం వల్ల, అంచనాలు హెచ్చై ఇంకా నిరాశ చెందాను.
నార్ల వారి ఉత్తరాలు – హరిప్రియ: హరిప్రియ అనే కన్నడ రచయితకు తెలుగులో కూడా ప్రావీణ్యం ఉంది. ఆయన నార్ల వెంకేటశ్వరరావుతో నెరిపిన లేఖా సంభాషణ ఇది. నార్ల వారి చివర దశలో ఆయన చేసిన ప్రయాణాలు, పాల్గొన్న సాహిత్య కార్యక్రమాలూ, ఆయన అనారోగ్యం వంటి అనేక విషయాలను గురించి తెలుస్తాయి.
రేడియో అన్నయ్య: తెలుగు యూనివర్సిటీ ప్రెస్ లో దుమ్ము పట్టేసిన అరల్లో ఉన్న పుస్తకాలు వెతుక్కోవడం వల్ల దొరికిన ఒక ఆణిముత్యం ఇది. రేడియో అన్నయ్య. అక్కయ్యగా ప్రాచుర్యం పొందిన న్యాయపతి రాఘవరావుగారు, వారి సతీమణి గురించిన పుస్తకం. వారి జీవిత నేపధ్యాన్ని, వారు చేపట్టిన పనుల గురించి విశీదకరించాను, సరళమైన భాషలో. ఫోటోలు కూడా బాగున్నాయి. వాళ్ళు అంకితభావంతో చేసిన పనులు అప్పట్లో ఎంతమంది చిన్నారులను ఆకట్టుకుందో తెలుస్తూ ఉంటే ఆశ్చర్వమనిపించింది.
అనుభవాలున్నూ – జ్ఞాపకాలున్నూ – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి: మూడో భాగం దొరికింది. మహాప్రసాదమనుకుని అదే చదువుకున్నాను. నేను అనుకున్న దానికన్నా విభిన్నంగా ఉంది. రచయితగా ఆయన పడిన పాట్లు, రచనా వ్యాసంగంపై ఆయన అభిప్రాయాలూ చదువుకోడానికి బాగున్నాయి. నాకు నచ్చాయి.
అముద్రిగ గ్రంథచింతామణి పత్రిక (1885-1904) నుండి ఎంపిక చేసిన వ్యాసాలు: ఇది ఓరియంటల్ మాన్యుస్ర్కిప్ట్స్ వారి ప్రచురణ. పూర్తిగా చదవడానికి నా వల్ల కాలేదు. అసలే గ్రాంధికం. ఆపై చర్చించిన అంశాలు పండితులకు పరిమితం. కాకపోతే, ఈ పత్రికను నడిపిన తీరు, దానికోసం వ్యవస్థాపకుడు పడిన పాట్లు.. ఆయన అంకితభావం, ఇవ్వన్నీ స్పూర్తిదాయకం.
నా ఇష్టం – రామ్ గోపాల్ వర్మ: పిరియడ్! 🙂
********************
ఇతరత్రా…
బుడుగు – ముళ్ళపూడి: చిన్నప్పుడే చదివామా అంటే చదివాము అన్నట్టు చదివేసిన ఈ రచన్ని పోయిన సంవత్సరం చదివాను. కొత్తగా అనిపించింది. అయినా బుడుక్కి పరిచయాలు ఎందుకు? ఆపేస్తున్నాను..
ఇడిగిడిగో బుడుగు – బాపు: బుడుగు + బాపు… అస్సలు చెప్పక్కరలేదు!
గిరీశం లెక్చర్లు – ముళ్ళపూడి వెంకటరమణ: చాలా ఆలస్యంగా చదివాను. ముళ్ళపూడి గారంటేనే మరో ఆలోచన అక్కర్లేదు. ఇక, ఆయన సెటైర్ అంటే నోరు మెదపక్కర్లేదు. అద్భుతమైన రచన. తెలుగువారు విశిష్టంగా భావించే తెలుగు నాటికలోని ఒక ప్రముఖ పాత్రను తీసుకొని, ఆ పాత్రతో తెలుగువారిని విమర్శించిన తీరు.. పరమాద్భుతం! కన్యాశుల్కంలో ఏ పాత్రకైనా ఆత్మకథ రాయవచ్చునూ అనే కమ్మెంట్ విన్నాను. కాని, గిరీశం లెక్చర్లు చదివాక, అసలా ఆ పాత్రలన్నీ మన మధ్య ఇంకా బతికే ఉన్నాయేమోననిపించింది.
కథాశిల్పం – వల్లంపాటి వెంకట సుబ్బయ్య: ఏడాది ప్రధమార్థంలోనే చదివిన పుస్తకం. ఎలా పరిచయమయ్యిందో గుర్తు లేదు గాని, చదివి చాలా మంచి పని చేశానని మాత్రం బలంగా అనిపించింది. ప్రపంచ సాహిత్యంలోని కథలను గురించి చాలా విషయాలు తెల్సుకునే అవకాశం కలిపిస్తుంది. కథలను రాసే ఆసక్తి ఉన్నవారే కాక, కథలను చదవడానికి ఇష్టపడే వారి వద్ద ఉండాల్సిన పుస్తకం. అనేకానేక కథలూ, కథకులూ, కథనాలూ, కథలో ప్రయోగాల గురించి ఆసక్తికరంగా చెప్పుకొస్తారు. వీరిది నవలా శిల్పం కూడా ఉన్నట్టు ఉంది. అదింకా చదవలేదు.
పద్య సాహిత్యం: సంఘ చరిత్ర (1900-1950) – బూదరాజు రాధాకృష్ణ : వీరి రచనలంటే నాకు మహా బాగా ఇష్టం. ఇదో చిట్టి పుస్తకం. బాగుంటుంది.
శీత వేళ రానీయకు – కుప్పిలి పద్మ: తీవ్రంగా నిరాశపరిచిన పుస్తకం. ఆవిడేం చెప్పదల్చుకున్నారో కాని, అది నాకు అర్థమైన తీరు మాత్రం… హమ్మ్, తీరిగ్గా రాస్తా దీని గురించి.
తనికెళ్ళ భరణి నాటికలు: తనికెళ్ళ భరణి అంటే నాకో విలక్షణ నటుడు గుర్తొస్తాడే తప్ప, కవో, రచయితో కాదు. ఆయనది “ఆట గదరా శివ” అనే కవితా పుస్తకం ఉందని తెల్సినా పెద్దగా పట్టించుకోలేదు. కాని, ఆయన నాటికలు చదివాక అవాక్కయ్యాను. అంత బాగా రాస్తారని నేనూహించలేదు. చదివితేనే ఇవి ఇంత బాగున్నాయీ అంటే, ఇక చూస్తే ఎంత బాగుంటాయో!
పతంజలి భాష్యం: కె.ఎన్.వై పతంజలి గారు చనిపోయేవరకూ ఆయన ఎవరో నాకు తెలీదు. తెలిసాక, ఎంత వెతికినా వారి పుస్తకాలు దొరకలేదు. ఎట్టకేలకు మొన్నే ముగిసిన హైద్ బుక్ ఫేర్‍లో “పతంజలి భాష్యం” దొరికింది. అసలేముంటుందా అని తెరిచి చూస్తే, మొదటి వాక్యాలే నన్ను కట్టిపడేసాయి. ఎంతగా అంటే ఇంటికి రాగానే మొదట అదే పుస్తకం తెరిచాను. చదివేశాను. ఎనభై, తొంభైల్లో భారతదేశ రాజకీయ అస్తవ్యస్థత పై ఆయన వ్యాఖ్యానం చదువుతుంటే తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవ్వడం ఖాయం. ఆయన వచనం, ఆయన ఆలోచనలూ రెండూ సవాలు పై సవాలు విసురుతాయి. ఎటు తప్పుకుపోవాలో తెలీదు.
పుణ్యభూమి – బూదరాజు రాధాకృష్ణ: అసలా పేరు చూడగానే పుస్తకాలు కొనేయడం అలవాటయ్యిపోయిన నాకు, దీన్ని ఎన్నుకోడానికి ప్రత్యేక కారణాలు లేకపోయాయి. కొన్నాక తెల్సింది, స్కూల్లో ఉన్నప్పుడు ఈనాడు దినపత్రికలో “ధర్మారావు” పేరిట వచ్చే వ్యాసాలు ఇవని. ఎనభైల్లో జరిగిన విషయాలు నాకు తెలీనే తెలీవు. అందుకని అక్కడక్కడా తలగోక్కోవడం, అక్కడక్కడా ఆశ్చర్యపోవడం నా వంతయ్యింది. ఆయన వ్యంగ్యం మాత్రం చదువుకోడానికి మాత్రం చాలా బాగుంది.
తెలుగులో నేను చదివిన అత్యుత్తమ పొలిటికల్ సెటైర్లు ఇవే!
తెలుగు సినిమా-భాష: తెలుగు యూనివర్సిటీ ప్రచురణ. పరుచూరి వారి పేరు చూసి మహా ఉత్సాహంగా కొన్నాను. పేలవమైన చర్చ – ఉపన్యాసాలు. అస్సలు నచ్చలేదు.
యుగకవి శేషేంద్ర – లేఖలూ, చర్చలూ: ఇదింకో ఆసక్తికరమైన పుస్తకం. అదృష్టం కొద్దీ దొరికింది. శేషెన్ గురించిన పుస్తకం. చాలా అరుదైన ఫోటోలు ఉన్నాయి. ఇందులో శ్రీశ్రీ రాసిన ఉత్తరం నాకు బా నచ్చింది. అలానే శేషెన్ కవితల అనువాదాల మీద ఇతర భాషా రచయితల ప్రశంసలూ, విమర్శలూ చదింపజేస్తాయి.
bhavanimulukutla
purnimagari ki mi vyasam anto bavundi. manassu ki anto hayi ga anipinnichindi.ami teliyadu antune chalamandi kavula gurinchi, rachyatala gurinchi chala baga rasaru. miru cheppinatlu eppudu pustakalu dorakadam kastamgane vundi
budugoy
పూర్ణిమ గారు, మీరు బ్రౌన్ అనగానే గుర్తొచ్చింది. బ్రౌన్ లేఖలు అన్న మీ వ్యాసం చూసి, ఆ పుస్తకం చదివి, కామెంట్లలో మెన్షన్ చేసిన “Peter L. Schmitthenner. Telugu Resurgence: C. P. Brown and Cultural Consolidation in Nineteenth-Century South India. New Delhi: Manohar” కూడా కొని చదివాను. ఈ పుస్తకం ఒక విధంగా సీ.పీ.బ్రౌన్ జీవిత చరిత్ర అనవచ్చు. author has reconstructed majority of c.p.brown’s biography as a part of his research.
>>”నేను సి.పి.బ్రౌన్ గురించి తెల్సుకోవాల్సింది చాలా ఉందని అర్థమయ్యింది”
బ్రౌన్ మీద ఆసక్తి ఉంటే, ఈ ష్మిటెనర్ పుస్తకం నిజంగానే తప్పక చదవాల్సిన పుస్తకం. btw ఈ పుస్తకం ఒకో చోట ఒకో ధరపలుకుతోంది. నాకు వేదంబుక్స్ అనే సైటులో కనిష్టంగా 600+/- కి దొరికింది.