పుస్తకం
All about booksపుస్తకాలు

January 20, 2010

ఆలూరి బైరాగి కథా సంపుటి: దివ్య భవనం

ఆలూరి బైరాగి పేరు ఇదివరకూ అడపాదడపా వినడం విన్నాను. కానీ ఎందుకో అకారణంగా ఆ పేరు నా మెదడులో “నగ్నముని” మొదలైన — నన్ను బెంబేలెత్తించే — కొన్ని పెట్టుడు పేర్లతో ముడిపడిపోయింది. దాంతో ఎప్పుడూ ఆ పేరు వెనుక మనిషిపై పెద్దగా ఆసక్తి కలగలేదు. మొన్నొక కవితా సంకలనంలో చదివిన రెండు కవితలూ మాత్రం బాగా నచ్చాయి. తర్వాత ఇదే సైట్‌లో ఎక్కడో ఆయన కథల గురించి ప్రస్తావన కనిపిస్తే “కథలు కూడా రాసాడన్నమాట” అనుకున్నాను. ఇటీవలి పుస్తక ప్రదర్శనలో కొనలేకపోయిన పుస్తకాలు “బుచ్చిబాబు కథలు”, “దువ్వూరి వెంకట రమణశాస్త్రి – స్వీయచరిత్ర” కొనటానికి మొన్న విశాలాంధ్రా వెళ్లి, కొనడం ఐన తర్వాత అలవాటుగా మిగతా అరల్లో పుస్తకాల వరుసలన్నీ కెలుకుతూంటే, ఈయన కథాసంపుటి “దివ్య భవనం” కంటపడింది. నన్ను నలుపు రంగు కవర్లెందుకో ఉత్తపుణ్యానికి ఆకట్టుకుంటాయి. ఈ పుస్తకం విషయంలో కవరు రంగే కాదు, ఇంకా చాలా విశేషాలున్నాయి: వెనక కవరు మీద రచయిత అందమైన ముఖం (అందమైన వాళ్లు జీవితంలో అందవిహీనమైన, వికృతమైన పార్శ్వాల్ని కూడా వెనుకాడకుండా నిస్సంకోచంగా రాయగలరని నాకో మూఢ నమ్మకం), పక్కనే ఇచ్చిన జనన-మరణ తేదీల ప్రకారం చిన్నవయస్సులోనే మరణించాడని తెలియడమూ (కాఫ్కా వల్లనో, తిలక్ వల్లనో మరెవరి వల్లనో తెలీదు గానీ, వృద్ధాప్యాన్ని చూడని రచయితలంటే నాకు ప్రత్యేకమైన ఆకర్షణ), క్రింద ఇచ్చిన జీవిత సంక్షిప్తంలో ఈయన త్రిభాషా ప్రావీణ్యం గురించి ప్రస్తావనా (ఎక్కువ భాషలు తెలిసిన వారికి మాతృభాషను ప్రత్యేకమైన దృష్టితో చూడటం అలవడుతుందనీ, ఫలితంగా వారి వచనం బాగుంటుందనీ నాకింకో మూఢ నమ్మకం), పేజీలు యధాలాపంగా తిరగేస్తుంటే “బీజాక్షరి” అన్న కథలో కళ్ళను కట్టిపడేసిన కొన్ని వాక్యాలూ (వాటిలో ఇదొకటని గుర్తు: “ఆ ఎలుక సుఖదుఃఖాలకు, రాగద్వేషాలకు అతీతమై, ఏదో ఒక ఉత్తుంగ గిరి శిఖరం మీది నుంచి క్రింద వున్న ప్రపంచాన్ని చూచినట్టుగా, అనిర్వచనీయమైన కరుణతో అతన్ని చూస్తున్నది.”), పైపైచ్చు పుస్తకం వెల వందరూపాయలే కావడమూ (ఇదో స్వయం సమృద్ధమైన కారణం కాదూ!). . . ఇత్యాది ఉత్ప్రేరకాలన్నీ ఒక్కుమ్మడిగా పన్చేసి నా చేత ఈ పుస్తకాన్ని కొనిపించాయి. ఇంటికెళ్ళి చదవడం మొదలుపెట్టింది తడవు — సెలవ రోజు కూడా కావటంతో — దాదాపు ఐదుగంటలు ఒకే విడతగా సాగిన పఠనంలో మొత్తం పుస్తకాన్ని పూర్తి చేసేసాను. ఇదివరకూ ఎన్నడూ వినని, కనీసం దాని ఉనికి ఉందన్న సూచన కూడా అందని, కొత్త గొంతేదో నన్ను నిమంత్రించి నియంత్రిస్తుంటే, మంత్రముగ్ధుణ్ణై చదువుతూ వుండిపోయాను. ఇలా చదివించింది ముఖ్యంగా శైలి. కొంతమంది కవులు వచనం రాసినా తమ కవిత్వపు అద్దకం పనీ, చెక్కుళ్ళ పోకడా వదులుకోలేరు. కొందరు మాత్రం — ఏదో ఆ అద్దకం పనికి కావాల్సిన ఏకాగ్రత నుండీ, ఆ చెక్కుడు పనిలోని అలసట నుండీ విముక్తి పొందడానికే అన్నట్టు — వచనం దగ్గరకొచ్చేసరికి గట్టు తెంచుకున్న వరదలా ప్రవహించేస్తారు. అంటే వాళ్ళు నిజంగా రాసేటప్పుడు అలా ప్రవహించినా ప్రవహించకపోయినా, చదివేటప్పుడు ఆ భ్రమను మాత్రం అలవోకగా మన ముందుంచుతారు. బైరాగి శైలిలో ఆ ప్రవాహగుణం వుంది. అందుకే కొన్ని కథలు చివరిదాకా వచ్చేసరికి మనకేమీ ఇవ్వక, ఎటూ కాకుండా ముగిసి, నిరాశ కలిగించినా, అవి మనల్ని అంటిపెట్టుకు కడదాకా చదివించిన వైనం మాత్రం నచ్చుతుంది. బైరాగి శైలిలో నాకు నచ్చిన గుణం మరొకటి వుంది. చాలా మంది రచయితల్లో ప్రతీ వాక్యమూ ఒక విడి యూనిట్‌గా వుంటుంది. ఒక్కో వాక్యం ఒక్కో ఆలోచననో, దృశ్య విశేషాన్నో ఇచ్చి ముగిసి పక్క వాక్యానికి దారిస్తుంది. ఎంత కథలో నిమగ్నమైనా, ఈ విభజన మనకు అంతర్లీనంగా స్ఫురిస్తూనే వుంటుంది. కానీ బైరాగి వాక్యాలు అలాక్కాదు. అవిభాజ్యంగా, ఆనవాలు దొరకని విధంగా ఒక దాంట్లోంచి మరొక దాంట్లోకి ప్రవహిస్తూ పోతాయి. వాక్యాల మధ్యే కాదు; విడి విడి పేరాగ్రాఫుల మధ్య కూడా ఇదే అవిభాజ్యత. చివరికి కథ కూడా ఒక ప్రత్యేకమైన యూనిట్ అనిపించదు. వెనకెక్కణ్ణుంచో వచ్చి ఆగకుండా ముందెక్కడికో పోయే రైలు, కొద్దికాలం పాటూ ప్లాట్‌ఫామ్ మీద నిలబడ్డ మనల్ని తన సంచలనంతో ముంచెత్తినట్టు — మన చుట్టూ దుమ్ము రేపి, జుట్టు చెదరేసి, దుస్తులు అతలాకుతలంగా ఎగరేసి పోయినట్టు — ఈ కథలు ఎక్కడో పుట్టి ఎక్కడికో పోతూ వయా మధ్యలో మనల్ని కదిపి పోతాయంతే. నేనిలా నా రూపకాల యావలో పడి, ఆ పరాకులో అసలు విషయాన్ని బలవంతాన వాటి ముడ్డికి కట్టి ఈడ్చుకొచ్చే పాపానికి పూర్తిగా ఒడిగట్టకముందే, ఇక్కడతో ఈ బృహద్విశ్లేషణలాపి కథల సంగతి కొస్తాను. వీటిలో నాకు బాగా నచ్చిన కథల్ని, అవే క్రమంలో నచ్చాయో అవే క్రమంలో, క్లుప్తంగా పరిచయం చేస్తాను.

జేబు దొంగ: ఇది మొత్తం సంపుటిలో నాకు బాగా నచ్చిన కథ. ఇతివృత్తమంటూ పెద్దగా చెప్పుకోదగ్గదేం లేదు. ఒక నిరుద్యోగ యువకుడు గడవడానికి డబ్బుల్లేక అల్లల్లాడుతూ, పరిచయస్తుడైన ఓ పెద్దాయన్ని అర్థించి, “ఇస్తానూ – ఇవ్వనూ” అన్న ఇదమిత్థమైన భరోసా ఆయన్నుంచేమీ రాకపోయినా, ఇవ్వచ్చేమోనన్న ఆశతో ఆ రాత్రి ఆయన సతీసమేతంగా ఊరెళ్తోంటే సాగనంపటానికి రైల్వే స్టేషన్‌కి వస్తాడు. ఇంతాజేసి ఆయన రైలు కదిలేముందు యువకుని చేతిలో ఓ ముష్టి ఐదురూపాయల కాగితం పెడ్తాడు. యువకుడు నిర్విణ్ణుడై వెనుదిరుగుతాడు. స్తబ్ధావస్థలో తన గది వైపుగా రోడ్డు మీద నడుస్తుంటే, వెనక నుంచి ఓ పద్నాలుగేళ్ళ కుర్రవాడు జేబులోంచి ఆ ఐదురూపాయలూ కొట్టేయబోతాడు. యువకుడు అప్రయత్నంగానే గబుక్కున వెనుదిరిగి వాడి చేయి పట్టుకుంటాడు. వాడి కళ్ళలో భయదైన్యాలు చూసి యువకునిలో హఠాత్తుగా ఏదో మార్పు వస్తుంది. చుట్టూ వున్న తెరలేవో జారిపోయి, ఆ కుర్రవాడికీ తనకూ మధ్య ఏదో అద్వైతం స్ఫురిస్తుంది. “జీవితపు రక్తోజ్వల ముక్తి క్షణ”మేదో అనుభూతికొస్తుంది. కుర్రవాడి చేయి వదిలి వాణ్ణి దయగా దగ్గరికి తీసుకోబోతాడు. వదలడమే తరువాయి, వాడు తుర్రున పారిపోతాడు. యువకుడు తిరిగి తన గది వైపు నడవడం మొదలుపెడతాడు. అంతే కథ! కానీ రచయిత ఆ యువకుని మానసిక చైతన్యాన్ని అందుకున్న తీరూ, కథ మొదట్లో ఎత్తుగడా, ముగింపు దగ్గర దాన్ని వాడుకున్న విధానం అబ్బురపరుస్తాయి. ఆ యువకునికి ఒక జేబుదొంగలో దైవ సాక్షాత్కారం లాంటిది చేయించడమన్నది మామూలు ఆలోచనే అనిపిస్తుంది; కానీ చేయించిన తీరు మాత్రం అద్భుతమనిపిస్తుంది. (చదవబోయే వారి అనుభవాన్ని పాడుచేస్తుందన్న అనుమానం లేకపోతే ఆ చివరి పేరా యథాతథంగా ఇక్కడ ఇచ్చేసే వాణ్ణే!) ముఖ్యంగా ఆ యువకుని చైతన్య స్రవంతిని ఉన్నదున్నట్టు అక్షరాల్లోకి మళ్ళించడంలో రచయిత ప్రదర్శించిన నైశిత్యం చూస్తే, ఈ విషయంలో అతను బుచ్చిబాబుకు బాబనిపించాడు. కొన్నాళ్ళ క్రితం బుచ్చిబాబు “ఎల్లోరాలో ఏకాంతసేవ” చదివాను. ఆయన ఈ కథలో జ్ఞాన సుందరి అనే పాత్ర ఆలోచనా స్రవంతిని నమోదు చేయటానికి ప్ర్రయత్నిస్తాడు. కానీ చాలాచోట్ల నాకెందుకో ఆయన ఆమెలో సాగుతున్న ఆలోచనల్ని నమోదు చేయటం గాక, ఆ ఆలోచనల్ని స్వయంగా తనే ఆమె మనస్సులో కూరుతున్నట్టనిపించింది. ఫలితంగా అవాంఛనీయమైన రచయిత నీడ కథలో ఆద్యంతం ఆమె వెనుక కనిపిస్తూనే వుంది. కానీ ఈ “జేబు దొంగ” కథలో ఎక్కడా ఆ యువకుని ఆలోచనల వెనుక రచయిత ప్రమేయం కనిపించదు. వచనం చిక్కగా వుంటూనే సులువుగా పారుతుంది కూడా. దేవుడెక్కడో లేడనీ, నిత్యం తారసపడే మనుషుల ద్వారానే మనతో దోబూచులాడుతుంటాడనీ సూచించే మొదటి పేరాలు, కవి అన్నవాడు వచనం రాస్తే ఎలా వుండచ్చో రుచి చూపిస్తాయి:

“మెలకువలోను నిద్దురలోనూ, నీ హృదయపు చీకటి గదిలో మేలుకొన్నవాడు; నీ కళ్ళు కునకడం, నీ మెటిమలు విరగడం, నీ మెడ క్రింద లోయలో చిన్న చిట్టి నరం నీడలా చలించడం, ఇవన్నీ గమనించినవాడు అతడే. నీవు నవ్వుతున్న విధంగా నవ్వడం, నీవు ఏడుస్తున్న విధంగా ఏడవడం, ఏమీ తోచనప్పుడు కాళ్ళాడిస్తూ కూచోటం, నీకు నేర్పిన వాడు అతడే. ప్రపంచమంతా చీకటి చెరగు కింద నిద్దురలో, దద్దరిల్లిన క్షణాల్లో నీ ఎడమ చేతిని కుడి చేయి ఎరుగని రోజుల్లో అంతా అయోమయంగా వున్నప్పుడు కూచుని కాపలా కాసినవాడు అతడే. ఆకాశంలో నక్షత్రాలూ, భూమి మీద దీపాలూ, రాత్రి రాల్చిన మంచుబొట్లూ, కునుకెరుగని కన్నీటి చుక్కలూ, లెక్కబెట్టిన గణిత శాస్త్ర పారంగతుడు అతడే. అతడే నీవు సిద్ధంగా లేని సమయాలలో వస్తాడు. నీవు సిద్ధం కాకముందే వెళ్ళిపోతాడు. నీవు స్వాగతపత్రం ఇచ్చిందాకా, కాళ్ళకు నీళ్ళిచ్చి కుశల ప్రశ్నలు వేసిందాకా ఆగడు. అతడు వచ్చిన క్షణం మెరుపు మెరుస్తుంది. ఉరుము వురుముతుంది. తప్ప త్రాగిన తుఫానులో ప్రపంచపు పర్వత శిఖరాగ్రాలపై పాలుగారే పసిపాపలు సెలయేళ్ళ జల జలలా పకపకా నవ్వుతూ పరిగెత్తుతారు. ఒక్క క్షణం అంతా వుంటుంది. ఏదీ లేకపోదు. ఆ మనిషి. అతడే మనిషి. మనుష్య మాత్రుడు కాదు గాని కేవలం మనుష్యుడు. ఈ క్షణం ఆకాశం క్రింద ఈ ప్రదేశంలో రెండడుగుల మేర మానవుడా! మానవుడా! కొంచెం కరుణ కావాలి కదూ?”

బీజాక్షరి: జీవితాన్ని కాస్తో కూస్తో జీవించటమంటూ జరిగాక చుట్టూ ప్రపంచపు జిలుగువెలుగులెన్నో మనలో ప్రతిఫలిస్తాయి. ఎంతెంతో ప్రపంచం మనలో బరువుగా నిండుకుంటూ వస్తుంది. దాన్ని మనకే పరిమితమై మిగిలిపోనీయకూడదనుకుంటే, మనతో పాటే మట్టిలో కలిసిపోనీయకూడదనుకుంటే, భావికి సందేశంగా అందియ్యాలనుకుంటే, కళ కావాలి. రచయితలైతే రాత కావాలి. ఇక్కడ ఒక “అబ్బాయి” ప్రపంచం తనలో నింపిన ఆశనూ, జీవితం పట్ల కృతజ్ఞతనూ కథ ద్వారా బయట పెడదామని కూర్చుంటాడు. రాతబల్ల, కుర్చీ, కాగితమూ, కలమూ, సిరా. . . ఇలా సరంజామా అంతా సిద్ధంగా వుంటుంది. ఒక వాక్యం రాస్తాడు: “ఆ అబ్బాయి నడుస్తూ నడుస్తూ తలెత్తి చూశాడు” అని. అంతే, ఒక్కసారిగా చెప్పాలనుకున్నదంతా మీద దాడి చేస్తే ఏం రాయాలో తెలీక అక్కడే ఇరుక్కుపోతాడు. రాయటం మొదలుపెట్టక ముందు అతను “తన కథ ఆకాశంలోంచి చుక్కల కాంతిలాగా గాలి లోనించి పాటల జాలులాగా నిద్రా తరంగాల మీద స్వప్న నౌక లాగా తేలిపోతూ అవతరిస్తుందనే అనుకున్నాడు. కాని అలా జరగలేదు”:

“నా ఉద్దేశం కథ రాయటం. ఆ కథలో ఎన్నో అద్భుతమైన విషయాలు పెడదామనుకున్నాను. కాని, కలం మొదటి వాక్యంతోనే ఆగిపోయింది. ఈ కథ పూర్తి చేసే శక్తి నాకు లేదని తెలుస్తున్నది. నేనీ కథను గురించి సంవత్సరాల తరబడి కలలుగన్నాను. నేనీ కథను సంపూర్ణ సత్యంగా నమ్మాను. దానిలోని ప్రతి అంశాన్ని వందసార్లు జీవించాను. ఇప్పుడిది నాలోనించి విడిపోనటువంటి ఒక భాగమైపోయింది. రాబోయే తరం వారికి నా కథ, నా మహాకావ్యం చదివే అదృష్టం లేదు కాబోలు. కాని భావాలకు శబ్దాల సహాయం లేకుండానే దేశకాలాలను అధిగమించి స్వయం సిద్ధంగా జీవించే శక్తి గనుక ఉన్నట్టయితే నా కంఠాన్ని భావియుగం వారు తప్పనిసరిగా వింటారు. నా సందేశం వాళ్ళకు అంది తీరుతుంది.”

— ఇలా తాను సంవత్సరాల తరబడి కలలుగన్న ఆశని, సంపూర్ణ సత్యంగా నమ్మిన ఆశని, వందలసార్లు జీవించిన ఆశని దేశకాలాలను అధిగమించి ముందుకెలా పంపాలో తెలీక చాలాసేపు తెల్లకాగితం ముందు గింజుకుంటాడు. చివరికి అటుగా పోతూ పోతూ ఎందుకో అతని గదిలోకి తొంగి చూసిన పక్కింటి పిల్లవాడు అతణ్ణి ఆదుకుంటాడు. అతను వాణ్ణి లోపలికి పిల్చి వళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. వాడి చిట్టి అరచేతిలో కలంతో “ఆశ” అన్న రెండు అక్షరాలు రాస్తాడు. తర్వాత ఆ కలాన్ని గోడకేసి బద్దలుగొట్టేస్తాడు. ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని వాకిట్లోకి వచ్చి, చేతిని శ్రద్ధగా పరిశీలించుకుంటున్న వాణ్ణి ఉద్దేశించి, ఇదే బీజాక్షర మంత్రమనీ, ఈ మంత్రాన్ని మరిచి పోవద్దనీ, ఈ మంత్రంలో నేను కూడా జ్ఞాపకముంటానని చెప్తాడు. వాణ్ణి కిందకి దించి పంపేస్తాడు.

కథలో ఈ అబ్బాయి, జీవితం పట్ల తనలోని ఆశను ఎలా బయట పెట్టాలో తెలీక కలం విరగ్గొట్టేసినా, ఇతని కథను మనకు కలం విరగ్గొట్టకుండానే చెప్పి ఆ “ఆశ”ను మనకు స్ఫురింపజేస్తాడు బైరాగి. తన గదిలో ఎలుక పట్ల ఆ అబ్బాయి గౌరవం, ఎదుట కిటికీలోంచి రోజూ అతన్ని పలకరించే తెల్లకాకీ, కుర్చీకి నెప్పి కలుగుతుందేమనని అతను ఓ పక్క నుంచి మరో పక్కకు ఒత్తిగిలి కూర్చోవటం. . . ఇవన్నీ ప్రపంచం పట్ల అతనిలో వున్న  ఆశనీ, ప్రేమనీ, దయనీ చెప్పకనే చెబుతాయి. కథ కాసేపు ప్రథమ పురుషలోనూ, కాసేపు ఉత్తమ పురుషలోనూ సాగుతుంది. కాని ఆ మార్పు అయోమయం కలిగించని విధంగా వాడుకోగలిగాడు రచయిత.

దరబాను: శిల్పపరమైన చమక్కులేవీ లేకుండా, మన చూస్తూండగానే కొన్ని అలతి వాక్యాల్లో పాత్రలకు పోత పోసేసి, వేటికి వాటికి పుట్టు పూర్వోత్తరాలు దిట్టంగా కేటాయించేసి, వాటి మనసుల్లో దూరి వాటికో లోపలి ప్రపంచాన్ని నిశితంగా అల్లేసి, చకచకా వాటిని మనకు సన్నిహితం చేసేయడంలోనూ — చురుకైన కథనంతో మనల్ని కథలోని ఒక అంశం నుంచి మరొక అంశానికి అలవోకగా లాక్కుపోతూ, తెప్పరిల్లేలోగానే మనల్ని ఓ సజీవ ప్రపంచానికి నడి మధ్యన నిలబెట్టడంలోనూ — రచయిత సిద్ధహస్తుడనిపిస్తుంది ఈ కథతో. ఇది నచ్చని వాళ్ళెవరూ వుండరేమో. మెడ్రాసు నగరంలో ఒక బాంకు బయట కాపలా వుండే గూర్ఖావాడి కథ. నగరంలో వాడి ఒంటరితనం, పదే పదే వాడి వర్తమానంలోకి పొడుచుకు వచ్చి దిగులు రేపే తన నేపాలీ పల్లెటూరి గతం, ఆ బాంకు ఉద్యోగులకు క్యారియర్లు మోసుకొచ్చే ఒక అమ్మాయిపై వాడు మనసు పడటం, ఆమెను తన ప్రపంచంలోకి ఆహ్వానించబోయి, మనసులోని మాట బయటకు పెగిలీ పెగలక ముందే ఆమెని కోల్పోవడం, మళ్ళీ ఆశల్లేని మునుపటి జీవితానికి తిరిగి మళ్ళటం. . . ఇతివృత్తం ఇలా చెప్పడం కష్టం, చదివి తీరాలి. నేను చదివిన కథలన్నింటిలోనూ నాకు బాగా నచ్చిన ముగింపుల్లో ఈ కథ ముగింపు కూడా ఒకటి. అప్పుడప్పుడూ ఆశావాదం కన్నా వల్గరైన విషయం ఇంకోటి లేదనిపిస్తుంది.

ఒక గంట జీవితం: ఎప్పుడూ ఎప్పటిలాగే మంద్రంగా సాగే మన జీవన సంగీతం ఏవో కొన్ని యాదృచ్ఛిక క్షణాల్లో ఉన్నట్టుండి స్వరారోహం పెంచి ఉచ్ఛస్థాయి నందుకుంటుంది. ఆ క్షణాల్లో మనకు మన అస్తిత్వపు పూర్ణరూపం దివ్యంగా సాక్షాత్కరిస్తుంది. బైరాగికి ఇలాంటి క్షణాల పట్ల మక్కువ ఎక్కువనుకుంటా. “జేబుదొంగ” కథలోని మాటల్తో చెప్పాలంటే, బతుకు ఊబిలోంచి పైకెత్తి మనుషుల్ని దేవతుల్యంగా మార్చే క్షణాలు. ఈ సంపుటిలో “జేబు దొంగ”, “దీప స్తంభం”, ఇప్పుడీ “ఒక గంట జీవితం” కథలు ఇలాంటి క్షణాల్ని ఆలంబనగా చేసుకు అల్లినవే. “జేబుదొంగ”లో కథానాయకుని జీవితంలో ఇలాంటి క్షణాలకు జేబు కొట్టబోయి పట్టుబడిన ఓ కుర్రాడు కారణమైతే, “దీపస్తంభము”లో ఒక బైబిలు పుస్తకం కారణం అవుతుంది; ఇప్పుడీ “ఒక గంట జీవితం” కథలో హోటల్ రేడియోలో అకస్మాత్తుగా ఆనందభైరవి రాగంలో మ్రోగడం మొదలైన వయొలిన్ నాదం కారణమవుతుంది. స్థలం: ఏదో నగరం. ఒక సాయంత్రం కథానాయకుడు హోటలుకెళ్తాడు. సిగరెట్ కాలుస్తూ, కాఫీ తాగుతూ ఆలోచనా మగ్నుడౌతాడు. కథనం అతని ఆలోచనా స్రవంతిని అనుసరిస్తుంది. ప్రస్తుతం ఎందుకో కల్లోల మనస్కుడైన అతనికి పరిసర ప్రపంచమంతా అసంబద్ధంగానూ, ద్వందాల మయం గానూ కనిపిస్తుంది. తనలోని ఒంటరితనం, బయటి జంటలు; ఎదుట కుర్చీల్లో తుళ్ళిపడుతున్న పడుచుదనపు ఉత్సాహం, గాజు అద్దాల వెలుపల బిచ్చమెత్తుతోన్న ముసలితనపు దైన్యం. . . ఈ ద్వందాలన్నీ అతణ్ణి కలవరపరుస్తాయి:

“ఏది నిజం? సిగరెట్టు పొగలోంచి, కాఫీ చిరు చేదు నిషాలోంచి, సుందరీ వక్ష వీక్షణ సౌభాగ్యానందకందళిత హృదయారవిందుడనై అడుగుతున్నాను నేను? ఏది నిజం? సిల్కు చీరలా? చింకి గుడ్డలా? మాడిన కడుపులా? బలిసిన రొమ్ములా? వృద్ధ వేశ్య ప్రలాపాలా? జవ్వనుల పకపకలా? చీకటిలో ఒంటరితనం? వెలుగులో జంటలు? ఏది నిజం? చావు బ్రతుకుల సంజమసక. కల్తీలేని వెన్న కాచిన నిజం ఏది? ఎలా గుర్తు పట్టటం దాన్ని?”

— ఇలా సాగుతాయి అతని ఆలోచనలు. ఇప్పుడే రేడియో లోంచి వయొలిన్ సంగీతం మొదలవుతుంది. అయితే ఇక్కడే కథ పక్కదోవ కూడా పడుతుంది. ఎంతో ఆశ కల్పిస్తూ మొదలైన కథ పొంతనలేని దృక్చిత్రాల పేర్చివేతగా మిగిలిపోతుంది. బహుశా సంగీతం తెలిసి, చదివేటప్పుడు ఆనందభైరవి రాగంలో వయొలిన్ నాదాన్ని చెవుల్లో ఊహించుకోగల పాఠకులకు ఈ భాగం ఏమన్నా నచ్చుతుందేమో — ఏదన్నా ఉత్తేజం కలిగించగలుగుతుందేమో. కానీ ఇందులో నాకే అర్థం కనపడలేదు. “జేబుదొంగ” కథా, “దీపస్తంభము” కథా చదువుతున్నపుడు, ఆయా కథానాయకుల మామూలు జీవితం ఇలా వున్నట్టుండి పై స్థాయినందుకున్న క్షణాల ఉద్వేగం నేనూ కాస్తో కూస్తో అనుభూతి చెందగలిగాను. ఈ కథ మాత్రం నన్నలా కదిలించలేకపోయింది. అయినా ఈ కథ మొదటి అర్థభాగం చూపించిన ప్రామిస్ ఆధారంగా దీన్ని కూడా నాకు నచ్చిన కథల్లోకి జమ చేసేస్తున్నాను.

X ——— X  ——— X

ఇవీ, పదకొండు కథల ఈ సంపుటిలో నాకు బాగా నచ్చిన నాలుగు కథలూ. ఇవిగాక “స్వప్నసీమ”, “దీప స్తంభము” కథలు కూడా నచ్చాయి. “నాగమణి”, “తండ్రులూ – కొడుకులూ” ఓ మోస్తరు కథలనిపించాయి. ఈ కథల్లో చెప్పుకోదగ్గ విషయమేమీ లేకపోయినా, ముగింపులు ఉస్సురుమనిపించి గాలి తీసేసేవే అయినా, కథకి వాతావరణాన్ని అల్లడంలో రచయిత సహజ నైపుణ్యం వల్ల కూర్చోబెట్టి చదివిస్తాయి. ఇక “కన్నతల్లి”, “కిమాని” అన్న కథలు నాకంతగా నచ్చలేదు. బలవంతం పద్దులా ఏదో కథ రాయాలని ఉన్నపళాన కూర్చుని రాసినట్టూ వున్నాయి. సంపుటికి శీర్షికను అరువిచ్చిన కథ “దివ్య భవనం” కూడా నచ్చలేదు. అసలే ప్రతీకల్తో కూడిన కథలంటే నాకు ఏవగింపు. ఒక ప్రత్యక్ష వస్తువును మరో పరోక్ష వస్తువుకు సింబల్‌గా చూపిస్తూ కథ నడపాలనుకున్నప్పుడు, సింబల్‌గా నిలబడ్డ ప్రత్యక్ష వస్తువు తన గుణాలన్నింటినీ పూర్తిగా పాటిస్తూనే, సింబలైజ్ కాబడిన పరోక్ష వస్తువును కూడా స్ఫురింపజేయగలగాలి. అలా చేయలేనప్పుడు అవి — కుటిలత్వానికి నక్క ప్రతీక, రాజసానికి సింహం ప్రతీక, తెలివికి ఎండ్రకాయ ప్రతీక. . . యిలా చిన్నపిల్లల పంచతంత్ర కథల్లాగా తయారవుతాయి. ఈ కథలో దివ్య భవనం దేనికి ప్రతీకో నాకు అర్థం కాలేదు. రచయిత కాసేపు దాన్ని రాగి – ఇనుముతో తయారైందిగా చూపిస్తాడు, మరి కాసేపు గాలీ – శూన్యాల్తో తయారైందిగా చూపిస్తాడు, ఇంకాసేపు గాజులా పారదర్శకమైందంటాడు. ఒక పేరాలో దానికి ఆపాదించిన గుణ సముదాయాన్ని వెనువెంటనే మరుసటి పేరా కాదంటుంది. మొత్తం మీద నాకు లెక్కలోకి తీసుకోదగ్గ కథలా కనపడలేదు.

పుస్తకంలో ముద్రారాక్షసాలు అధికం. చాలాచోట్ల విరామ చిహ్నాల పాటింపు అవకతవకగా వుంది. ప్రతీ కథకూ చివర్లో రచయిత ఆ కథ ఏ సంవత్సరంలో రాసాడో వేస్తే బాగుండేదనిపించింది. అలాగైతే రచయిత రచనల్లో కాలానుగతమైన పరిణతి ఏమన్నా వుంటే గ్రహించే వీలుండేది. లేకపోతే “జేబుదొంగ” కథ రాసిన రచయితే తర్వాత “కిమానీ” లాంటి కథ ఎలా రాసుంటాడు చెప్మా అని నాలాంటి పాఠకుడు మథనపడాల్సి వస్తుంది.

కొంతమంది రచయితలు మనకి చాలా క్రింద వుండి కథ చెప్తున్నట్టూ వుంటుంది. వాళ్ళని లెక్కచేయనే చేయం. మరికొంతమంది చాలా ఎత్తులో వుండి కథ చెప్తూన్నట్టూ వుంటుంది. వారిని తలెత్తి అబ్బురపాటుతో చూస్తాం; అందుకోవాలని ప్రయత్నిస్తాం; అందుకోలేకపోతే, అబ్బురపాటుతోనే సరిపెట్టి, వారి రచనల్ని భవిష్యత్తుకెపుడో అట్టేపెడతాం. ఇంకొంతమంది మన ప్రక్కనే వుండి కథ చెప్తున్నట్టూ వుంటుంది. వారిని పట్టించుకుంటాం. ఇంకా తెలుసుకోవాలని ఉబలాటపడతాం. బైరాగి కథ చెప్తూంటే ఇలాగే అనిపించింది. ఇవి తప్ప ఆయనిక వేరే కథలేవీ రాయలేదు కాబట్టి, నాకు ఆయన కవిత్వంపై ధ్యాస మళ్ళింది. తిలక్ తర్వాత నా పఠనా ప్రపంచంలో కవుల కోటాలో ఏర్పడిన ఖాళీని బహుశా ఈయనే భర్తీ చేస్తాడేమో అనిపిస్తుంది. చూడాలి.

దివ్య భవనం (కథా సంపుటి)

రచన: ఆలూరి బైరాగి
మూల్యం: 100/-
తొలి ముద్రణ: 1955
ద్వితీయ ముద్రణ: 2006

ప్రతులకు:

1) సత్యం ప్రాసెస్
6-1-1081/6, లక్డీకాపూల్,
హైదరాబాద్ – 500 004.

2) కాక్‌స్టన్ ప్రెస్
11-4-668, రెడ్ హిల్స్,
హైదరాబాద్ – 500 004.About the Author(s)

మెహెర్22 Comments


 1. […] ఆలూరి బైరాగి కథల సంపుటి – దివ్యభవనం: బూదరాజు గారిది “మరువరాని మాటలు” అని ఒక పుస్తకం ఉంటుంది. అందులో బైరాగి గారి మాటలు (కోట్స్!) కొన్ని చదివి, ఈయన రచనలు చదివి తీరాలన్న కసితో పుస్తకాల వేట మొదలెట్టినా, అహింసాయుతంగానే ఈ పుస్తకాలు విశాలాంధ్ర వాళ్ళ పుణ్యమా అని దొరికాయి. వచనమా? కవిత్వమా? అని అర్థం చేసుకోడానికి నాకు సమయం పట్టింది. అసలు కవులను కథలు రాయనివ్వకూడదు నన్ను అడిగితే. ఒక్కో వాక్యాన్నీ పదేసి సార్లు చదువుకునేంత బాగా రాస్తే, ఇహ కథలు చదవటం ఎప్పటికి అయ్యేను అట?! […]


 2. […] కథలు మధురాంతకం రాజారాం – బాలల కథలు ఆలూరి బైరాగి కథలు మంత్రనగరి – పి.సత్యవతి కథలు మా […]


 3. అప్పాజీ గారు,

  కొన్ని పేజీలు చేశాను.నా స్కానర్ మొరాయించింది దాంతో ఆపేశాను. ఇప్పటివరకు చేసినవి తప్పక పంపించగలను. మిగతావి కూడా ఎలాగోలా పూర్తి చేస్తాను.
  మెహర్, శ్రీనివాస్ గారూ, ఏమైపోయారండీ,, మిగతా పేజీలు ఏవీ అని కూడా అడగలేదు….
  అప్పాజీ గారు, నా మెయిల్ ఐ డి kalpanarentala@yahoo.com కి మీరోకా మెయిల్ పంపిస్తే మీకు ఆ స్కానీడ్ పేజెస్ పంపిస్తాను.

  ధన్యవాదాలు.

  కల్పనారెంటాల


 4. appaji

  @kalapana garu…
  naakkudaa aa scanned copy pampagalara


 5. […] గతంలో పుస్తకం.నెట్ లో వచ్చిన సమీక్ష ఇక్కడ. మల్లెమాల వేణుగోపాలరెడ్డి కథలు: అసలు […]


 6. కొడవళ్ళ హనుమంతరావు

  కల్పన గారు తమ బ్లాగులో “పాప పోయింది” ని పరిచయం చేస్తూ, “మొన్నీమధ్య పుస్తకం.నెట్ లో బైరాగి కథల్ని మెహర్ సమీక్షించినప్పుడు శ్రీనివాస్ అనే రీడర్ పెట్టిన కామెంట్ ద్వారా ఈ పుస్తకం గుర్తుకు వచ్చింది. బైరాగికి ఓ పాప వుండేదని, ఆ పాప చనిపోయాక బైరాగి ఈ నవల రాశాడని అతను చెప్పటం తో ఒక విధమైన ఆసక్తి కలిగింది,” అన్నారు.

  నేనా నవల కోసం కొన్నేళ్ళ క్రితం ప్రయత్నించాను కాని దొరకలేదు. నేను చెదురుమదురుగా చదివిన వాటిని బట్టి, బైరాగి అవివాహితుడు. వెల్చేరు గారి “Hibiscus on the Lake” లోనూ, బైరాగిని ఇంగ్లీషు లోకి అనువదించిన పి. ఆదేశ్వరరావు గారి “Voices from the Empty Well,” “The Broken Mirror” లోనూ బైరాగి విషాద జీవితం గురించి కొంచెం తెలుసుకోవచ్చు.

  కొడవళ్ళ హనుమంతరావు


 7. సౌమ్య

  ఇవాళే ఈపుస్తకం పూర్తి అయింది. కథకుడిగా నాకు బైరాగి నచ్చాడు. కథల్లో ఒక పది కథలు రాసినా, వెయ్యి రాసినా – వైవిధ్యం లేకుంటే, నాకో పట్టాన ఏ రచయితా నచ్చడు. (కథా వస్తువుల్లోనూ, కథన తీరులోనూ). పట్టుమని పదకొండు కథలే చదివినా, అందులో నాలుగైదు నచ్చకపోయినా కూడా నాకు బైరాగి కథలు నచ్చాయి. కొన్ని వావ్! అనిపించేలా ఉన్నాయి. కొన్ని పర్లేదనిపించాయి. భాష పరంగా, వాక్య నిర్మాణాల పరంగా – నాకు ఈయన చాలా నచ్చారు. కథలు రాసే కవుల కథలు సగం కవిత్వం – అని నాకు ఇదివరలో అనిపించేది. కానీ, ఇవి అలా లేవు… (హాయిగా ఉంది చదవడానికి…)


 8. @chitralekha45: నూట పద్నాలుగు 🙂


 9. మెహర్ గారు బైరాగి గారి పుస్తకం పరిచయము అద్భుతముగా చేసారు.
  చిన్న సందేహము వారు ఏక బిగిన ఐదు గంటలు చదివి పూర్తి చేసాను అన్నారు పుస్తకం ఎన్ని పేజీలు ఉన్నదో ?
  మెహర్ గారికి ధన్యవాదాలు


 10. నామైల్ ఐడి కల్పనరెంటాల@యాహూ.కామ్. మీరు మైల్ పంపిస్తే నేను బుక్ స్కాన్ చేసి పంపిస్తాను. అయితే అంత ఒక్కసారిగా పంపలేను. చాలా సేపు పడుతుంది కదా స్కానింగ్.


 11. chilakapati Srinivas

  @kalpana:
  నాక్కూడా…నాక్కూడా.. 🙂


 12. @Mehar, I already have a copy. Do u need a scanned version?


 13. మెహర్, నాకైతే దొరుకుతుంది. మీకైతే తెలియదు..


 14. @kalpana: కల్పన గారూ, ఇప్పుడు ఈ నవల ఎక్కడన్నా దొరుకుతుందా?


 15. పుస్తకం పేరు ‘. పాప పోయింది’ . నవల అది.


 16. chilakapati Srinivas

  బావుంది.
  ఆయన రాసిన నవలిక కూడా ఉండాలి – పాప చనిపోయాక కలిగిన దిగులునంతా నింపుకుని. పేరు ఎవరికయినా తెలుసా?


 17. తెలియని విషయాలు చెప్పారు.


 18. పూర్ణిమా, 🙂 తప్పకుండా. ఇంకో పెర్సెప్షన్ కోసం ఎదురు చూస్తాను.


 19. Purnima

  Meher,

  That is one hell of a review. 🙂 ఇవ్వాళ పొద్దున్నే ఒకరికి బైరాగి కవితల్నీ, కథల్నీ పరిచయం చేయబూనుకొని, రెండు, మూడు వాక్యాలతో అయ్యే పని కాదని, నేనే ఈ పుస్తకం గురించి రాద్దామనుకున్నాను. రాస్తాను. మీతో చాలా వరకూ ఏకీభవించినా, I still feel I can give it a different perception.

  ఇహ మీరు “ఆగమగీతి” మొదలెట్టకపోతే, పెట్టేయండి. I’m sure he’ll rock your boat! 🙂 A.M.A.Z.I.N.G! నేను రాత్రుల్లు పడుకున్నవాళ్లని లేపి మరీ ఆ కవితలు చదివి వినిపిస్తుంటాను. ఆ కవితలు మనసులో చదువుకోడానికి కుదరదు. నిద్రలేపి, నిలేసి మన చేత చదివించుకుంటాయి. Now, go.. start on it and come back with another review. 🙂


 20. మెహర్,
  ఆశ్చర్యకరం. నేను కూడా అదే పుస్తకం తీశాను చదవటానికి. పుస్తకం చదవటానికి ముందు విశ్లేషణలు చదవలేను కాబట్టి నేను పుస్తకం చదివాక వచ్చి మీ వ్యాసం చదువుతాను.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0