సి.పి. బ్రౌన్ లేఖలు

పుస్తక పరిచయం:

సి.పి.బ్రౌన్ – ఈ పేరు తెలీని తెలుగువారుండే అవకాశమే లేదు అని అతిశయోక్తులకి పోను. వాస్తవాన్ని అంగీకరించదల్చాను కాబట్టి, సి.పి.బ్రౌన్ ఎవరో, ఏ కాలానికి చెందినవారో, ఏం చేశారో అన్న విషయాలు తెలీని వాళ్ళు ఉండచ్చు. ఆయన గురించిన వికీ పేజీలు చదివితే, తెలుగు భాషకి ఎనలేని సేవ చేసిన ఆంగ్లేయుడని తెలియవస్తుంది. దానితో పాటే ఇతర వివరాలున్నూ.

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రచురించిన “బ్రౌన్ లేఖలు – ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర శకలాలు” సి.పి.బ్రౌన్ గురించి మరిన్ని విషయాలు, ముఖ్యంగా అప్పటి పరిస్థితులను, తెలుగు సాహిత్య సేవకు బ్రౌన్ అంకితమైన విధానాన్ని, ఆయన సాధకబాధకాలని గురించి తెల్సుకునే మహత్తర అవకాశం. కేవలం లేఖావళి కాక, ఇందులో ప్రతీ లేఖకీ వ్యాఖ్యానం ఇచ్చారు పరిశోధకులు బంగోరె. ఈ వ్యాఖ్యానం జాబులను మరింతగా అర్థం చేసుకోడానికి సాయపడుతుందని నాకనిపించింది.

ప్రస్తుతం, పుస్తకం అందుబాటులో ఉందో లేదో తెలీదు. ఆర్కైవ్స్ నుండి మాత్రం దిగుమతి చేసుకోవచ్చు.

(ఇప్పటికే మీకీ పుస్తకం మీద ఆసక్తి కలిగుంటే, పుస్తకం చదువుకోండి, దాని కన్నా ముఖ్యమైనది కాదు ఈ వ్యాసం. ఇప్పటికీ మీకు ఆసక్తి కలగకపోతే, ఇక పై నేను రాసేది కూడ మీకు అనవసరమనిపించచ్చు.)


నా స్పందన:

హైదరాబాదులో కొన్ని కూడళ్ళుంటాయి, ఒకటి రెండు రహదారులనీ, ఒక సన్న గల్లీ కలగలసినవి. ఇవి ఎక్కువగా రద్దీగా ఉండవు కాబట్టి, ఇలానే-వెళ్లాలి అనే నియమాలుండవు. ఎవరైనా, ఎటునుంచి ఎటువైపుకైనా పోవచ్చు. తప్పొప్పుల ప్రసక్తి ఉండదు. ఎవడి దారి వాడిది. కొన్ని సార్లు రద్దీగా మారినప్పుడు మాత్రం, ఇలాంటి కూడలిలో నుంచోవాల్సి వస్తే ఎటు పోవాలో తెలియదు. ఎవరి తప్పించుకోవాలో తెలీదు. అడుగు ముందుకీ వేయలేం, వెనక్కీ వేయలేం. అలా అని నుంచోలేం. ప్రతివాడి హార్న్ మోగుతుంది, మిమల్ని ఉద్దేశించే! కాని ఎటూ పాలుపోదు.

“ఎందుకు నిలబడ్డానురా?!” అని అనిపిస్తుంది. ఈ పుస్తకం చదివాక నాకలానే అనిపించింది.

“సి,పి.బ్రౌన్ లేఖలు” అన్న రెండు పదాల శీర్షికలో నన్ను ఎక్కువగా ఆకర్షించింది లేఖలు అన్న పదం. నాకు లేఖా సాహిత్యం అంటే వల్లమాలిన అభిమానం. గొప్పవాళ్ల లేఖల ద్వారా, అప్పటి సామాజిక, చారిత్రక పరిస్థితులు, ఆ కాలంలోని ఇతర ప్రముఖుల ప్రస్తావన వంటివాటి కన్నా, లేఖల బట్టి గొప్పతనం సాధించిన మనిషిని తెల్సుకునే అవకాశం ఉంటుందని నాకు గొప్ప నమ్మకం. సి.పి.బ్రౌన్ తెలుగుకి చేసిన మేలును గురించి కన్నా, ఆయన ఎలాంటి పరిస్థితులను, ఎలాంటి మనుషులను ఎదుర్కొనవలసి వచ్చిందోనన్న కుతూహలంతో పుస్తకం చదవటానికి ఉపక్రమించాను.

జి.ఎన్ రెడ్డిగారి “ప్రస్తావన” చదవటం అయ్యింది. ఆ తర్వాత “బంగోరె” గారి ముందుమాటలు. ప్రస్తావనలో మెల్లిమెల్లిగా మొదలయ్యిన “తెలుగేతరుడు” భావం, ఈయన వ్యాసంలో ఊపందుకుంది. తెలుగులోని సాహితి సంపదనంతా కర్కశమైన కాలం తన కాళ్ళ కింద కబలించివేయకుండా సి.పి.బ్రౌన్ ఒక తపస్సులాంటిదేదో చేసి, ఆ సాహిత్యాన్ని ఉద్దరించారన్నది నిర్వివాదమైన అంశం. “ఒక ఆంగ్లేయుడు చేశాడు కాని, ఒక ఆంధ్రుడు చేయలేకపోయాడు. కనీసం చేసిపెట్టినదాన్నైనా జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నాం. మనమింతే!” అన్న భావం ముందుమాటలో ప్రస్ఫుటమయ్యే కొద్దీ ఇబ్బందిగా అనిపించటం మొదలయ్యింది. “ఛ! ఒక్కరు కూడా ముందుకు రాకపోవడమేంటి?” అని ఆవేశం పొంగుకొచ్చింది. “మనం ఎప్పటికీ ఇంతే. మనం బాగుపడం” అన్న నిట్టూర్పు. అసలు భాష అంటే మక్కువ లేదు. సంప్రదాయం అంటే లెక్కలేదు. మనదన్న దాన్ని కాపాడుకోవాలన్న శ్రద్ధ లేదు. ఏదో ఒకటి చేసేసి, అన్నీ మార్చేయాలన్నంత ఆవేశం. ఏం చెయ్యలేనని స్ఫురించి నిర్వేదం. వీటిన్నటికీ తోడు బంగోరె వచనం. పుండుని వేడి నీళ్ళతో కడిగి, కారం పూసినట్టనిపించింది.

లేఖలు మొదలయ్యాయి. సి.పి.బ్రౌన్ చేస్తున్న పనులూ, ఆయనతో పాటు పని చేసిన మనుషుల గురించి కొద్దికొద్దిగా తెలుస్తూ వచ్చింది. ఈ లేఖల కాలం, పదొమ్మిదో శతాబ్దం కాబట్టి లేఖ చదివితే అంతా అర్థమయ్యిపోతుందంటే పొరపాటే! దాదాపుగా ప్రతి లేఖ కింద బంగోరె వ్యాఖ్యానం. ఉన్న పరిస్థితులను వివరించటంతో పాటు, మనుషుల మనస్తత్వాలనూ విశ్లేషించారు. లేఖల్లో ప్రస్తావించిన పరిస్థితులని వివరించడానికి వేరే పుస్తకాల సాయం తీసుకున్నారు. లేఖల్లో ఉన్న విషయాన్ని బట్టి, తెలుగు సాహిత్య చరిత్రను “అల్లే” ప్రయత్నం. (ఈ పుస్తకం చదివేటప్పుడు మాత్రం, అసలు చరిత్రకు సంబంధించిన పుస్తకాలెలా చదవాలన్న అనుమానం వచ్చింది. చరిత్రకారుడు అంటే వాగ్యోధుడు (అలాంటి పదం లేకపోతే మన్నించండి, మాటలతో యుద్ధం చేసేవాడని నా ఉద్దేశ్యం!) అనిపించింది. బ్రౌన్ లేఖలు దాదాపుగా, interpretation of facts అనే అనిపించింది. (“బ్రౌన్ జ్వరం”తో ఉన్నట్టు బంగోరె నే చెప్పుకున్నారు.)

బ్రౌన్ రాసిన నిఘంటువే అత్యుత్తమైనదిగా ప్రతిపాదించిన తీరు నన్నంతగా ఆకట్టుకోలేదు. దువ్వూరి రాసిన “రమణీయం”లోని తప్పొప్పులను గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఏది నిజమో తెలీలేకపోయింది. “చాటుపద్య మణిమంజరి” వేటూరి ప్రభాకర శాస్త్రిగారు బ్రౌన్ రాసిపెట్టిన నోట్స్ నుండి “లిఫ్ట్” చేసారన్న వాదన విని నోరెళ్ళబెట్టాల్సివచ్చింది. వీటిలోని నిజానిజాలను తెల్సుకోవటం నాబోటి వారికి సాధ్యం కాదు. పుస్తకంలోని ప్రతి వాక్యాన్ని “ఆయన అభిప్రాయం అది..” అనుకుంటూ చదువుకున్నా కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను ఏదైనా ఆర్కైవ్స్ సంస్థలో నివాసం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చేది.

తెలుగు సాహిత్యం గురించి చాలా తెల్సుకునే వీలు కల్పించిన పుస్తకం ఇది. ముఖ్యంగా పాశ్చాత్యులకు మన తెలుగుపై మక్కువ చూసి మచ్చటేస్తుంది. (అలా ముచ్చటపడే ప్రతీ సందర్భంలోనూ, తెలుగోడి నిరాసక్తి గురించి మాట్లాడి నీరుగార్చేయటం మన రక్తంలోనే ఉందనుకుంట!) తెలుగు భాషపై పరిశోధన చేయాలనుకునేవారికి ఈ రచన ఉపయుక్తం అనిపించింది. సామాన్య పాఠకులైనా ఓపికుంటే, ఆసక్తుంటే, దీనిలో ప్రస్తావించబడ్డ అనేకానేక పుస్తకాల గురించి ఆరా తీసి, దొరకబుచ్చుకొని చదువుకోవచ్చు! “సి.పి.బ్రౌన్ సాహిత్యాన్ని నేను సమగ్రంగా, సవివరంగా చదవలేదు, అది ఎన్నో పి.హెచ్.డిలకు సరిపడా ముడి సరుకు” అని ఎడిటర్ చెప్పుకున్నా, ఆ ముడిసరుకును గూర్చి బాగా ఆసక్తి కలిగించేలా రాసుకొచ్చారు. పందొమ్మదవ శతాబ్ధంలోని తెలుగు, అందునా మనకి తెలీని రచనల పేర్లు. మనకి తెలీని సామాజిక పరిస్థితులు – వివరణలు లేకపోతే చదవటం కష్టసాధ్యం. వివరణలివ్వడంతో పాటు, అమితాసక్తి కలిగించే వచనం బంగోరె ప్రత్యేకత. పుస్తకం మొదలెట్టటం తరువాయి, అది పూర్తయ్యేవరకూ ఆపాలనిపించదు. తెలుగులో చరిత్రపై ఇంతటి పుస్తకం ఉంటుందనే ఊహించలేదు, ఇంతగా చదివించే గుణం ఉంటుందని అసలు అనుకోలేదు. ఇంకా అబ్బురంగానే ఉంది నాకు.

కాస్తో కూస్తో మెదడు మేత వేయగలిగే రచన చదివానని ఒక వైపు. చదివిన దాంట్లో నిజానిజాలను నిర్ధారించుకోలేక మరో వైపు. వృత్తికి సంబంధం లేకపోయినా, పిచ్చనిపించేంత ఇష్టంతో ఒక సామాన్యుడు తెలుగు సాహిత్యానికి ప్రాణం పోసిన తీరు ఆశ్చర్యపరిచింది ఒక వైపు. “మనకి లెక్క లేదు. మనకి భక్తి లేదు. మనకి ఒళ్ళొంగదు” లాంటి మాటలు చదివీచదివీ ఉత్సాహమంతా నీరుగారిపోయింది మరో వైపు. ఉర్రూతలూగించే తెలుగు పుస్తకం కావాలన్న ఆశ తీరిందన్న తృప్తి కలిగించింది ఒక వైపు. ఆ తెలుగు పుస్తకం తెలుగోళ్ళపై సదభిప్రాయం కలిగించలేదని నిరాశ మరో వైపు.

ఇంతటి ఉక్కిరిబిక్కిరి మధ్య ఈ పుస్తకం మీద ఏం రాయాలో తోచలేదు. ఇప్పుడప్పుడే రాయను కూడా అనుకున్నాను. అనుకోకుండా, రెండు రోజుల క్రితం ఎ.వి.కె.ఎఫ్, అప్పజోస్యుల సత్యగారిని కలవటం జరిగినప్పుడు, మాటల మధ్యలో నేనడిగిన ఒక ప్రశ్నకు, “సాహిత్యమనేది సామాన్యుల వల్ల బతికి బట్టకట్టదు. సాహిత్యాన్ని బతికించేది, ముందు తరాలకి అందించేది దాని పై అమితాసక్తి ఉన్న కొందరి వల్ల. దానికోసం అహోరాత్రులు కష్టించేవారి వల్లాను.” అని అభిప్రాయపడ్డారు. ఆ మాటలు నా చిక్కుముడి విప్పాయి.

“బ్రౌను మనకి దానం ఇచ్చాడు. దోసెడు నిండుగా దానం చేశాడు. మంచోడే! కాని పుచ్చుకున్నందుకు నామోషిగా ఉంది” లాంటి అభిప్రాయాలు ఈ పుస్తకంలో వినిపించాయి. నాది దాదాపు అదే సమస్య. మనవాళ్లెవ్వరూ చెయ్యలేకపోయారే అని. సత్యగారి మాటలు విన్నాక, ఎవరు, ఏ జాతీయుడి చేశాడన్నది వదిలి ఆ వ్యక్తి కృషిని అభినందించాలి. సాహిత్యాన్ని ఒక జాతి మొత్తం కాపాడుకోవాలన్నది నియమం అయితే, మనం ఘోరంగా విఫలమయ్యాం. ఆ అపరాధభావం మొదలయితే అవతలివాళ్లని ఆకాశానికి ఎత్తేయటం, మనల్ని మనం కించపర్చుకోవటమే చేయగలం.

బ్రౌను ఆంగ్లేయుడని కాక, చేయాలనుకున్నది చేసి తీరే సాధకుడు, లేక మొండిఘటం, లేక పిచ్చివాడు అని భావిస్తే ఆయన చేసిన పనిని మనం అభిమానించగలం. అభిమానించగలం. ప్రేరణ పొందగలం. అలా అర్థంచేసుకోవటానికి కూడా ఈ పుస్తకంలో చాలా సరుకుందని మాత్రం చెప్పగలను. చచ్చిపడున్న సాహిత్యానికి ప్రాణం పోసి, నిలబెట్టిన మహనీయునికి మాత్రం, శిరస్సు వంచి నమస్కారాలు! (ఇది ఒక ఆంగ్లేయునికి ప్రణామం కాదు, సాటి మనిషికి, చేసిన పనులకి, పనుల వెనకున్న passionకి!)

తప్పక చదవాల్సిన పుస్తకం, అందులో అనుమానం లేదు!

You Might Also Like

6 Comments

  1. రవి

    ఒక్క మాట లొ చెప్పాలంటే తెలుగు సాహిత్య దీపం మినుకు మినుకు మంటున్న దాన్ని అఖండ జ్వొతి గా చెసి ముందు తరాల వారికి అందిచారు.
    కందుకూరి, విస్వనాద సత్యనారయణ, జాషువ, చిలకమర్తి , గురజాడ, అడవి బాపిరాజు ఇలా చాలా రచయతలకు మార్గదర్స్యకుడు అయ్యాడు.
    భ్రౌన్ దొర గురించి ఎప్పటినుంచొ చదవాలని ఉన్నది, మీ పుస్తక పరిచయం చదివిన తరువత, నా తరువాతి పుస్తక పఠణం ఇదె నని నిర్నయం తీసుకున్నాను. పూర్ణిమ గారు మీకు నా దన్యవాదలు.

    -రవి

  2. telugu4kids

    పూర్ణిమా నువ్వు చాలా బాగా రాస్తావు.
    బహుశా నీ సమీక్షలన్నీ ఒకటికి రెండు సార్లు చదివి జీర్ణించుకోవాలి.
    ఈ ప్రస్తుత పరిచయమైతే సరిగ్గా ఎలా చదివితే నాకూ, నా ఆసక్తికీ ఉపయోగపడుతుందో అలా నేను చదువుకోవడానికి మార్గదర్శకంగా ఉపయోగపడుతోంది. చదువుతున్న కొద్దీ నీ పరిచయం నాకు ఇంకా బాగా అర్థమౌతోంది, అద్భుతం అనిపిస్తోంది.
    Well done. Best wishes.

  3. శ్రీనిక

    పూర్ణిమ గారికి,
    యాధృచ్చికం కాకపోతే..బాబా గారిలా నేనూ మొదలెట్టాను. చరిత్ర పుటల్లో నలిగిపోయిన నిజాల్ని చదివి ఉద్రేకంతో పొంగిపోయానంటే నమ్మండి. అప్పటికే మరో సమీక్ష టపా చేయాల్సింది ఆపి.. ఇది అందరికీ తెలియాల్సిన విషయం అని టపా రాయడం మొదలు పెట్టాను. బహుసా మీ టపా కంటే బాగా రాక పోనేమో. నా స్పందనలు దాదాపు మీ సమీక్షలో రావడం నా అదృష్టం. అయినా కొన్ని ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి…వీలైతే మరో టపాలో…

  4. bollojubaba

    పూర్ణిమ గారికి
    పుస్తకం నెట్ లో మీరేంచదువుతున్నారు లో మీ కామెంటు చూసి ఈ బుక్కును చదవటం మొదలెట్టాను. రాత్రి మూడయ్యింది ఆ ప్రవాహంలోంచి బయటపడటానికి. మీరన్నట్టు కొన్ని వాఖ్యలు మన ఈగోను దెబ్బతీసినా, ఆ పాటి వాతలు అవసరమేమోననిపించింది. బంగోరె రాసిన కొరడా రాతలవల్లే ఈనాడు బ్రౌనుకు దక్కాల్సిన స్థానం దక్కిందేమో.

    కానీ అప్పట్లో బంగోరేకి యూనివర్సిటీలు తగిన ఆర్ధిక సాయాన్నో లేక అప్పటి సాహితీవేత్తలు తగిన గుర్తింపునో ఇచ్చి ఉంటే పాపం ఆయన జీవితం విషాదాంతం అయ్యి ఉండకపోనేమో.

    పరుచూరి శ్రీనివాస్ గారికి,
    మీరు అక్కడక్కడా, “బ్రౌన్ భక్తి” పై మీకు కొన్ని అభ్యంతరాలున్నాయంటూ చెపుతూ వచ్చారు. బహుసా ఇది సరైన వేదికే ననుకొంటున్నాను, కొంచెం విపులంగా వివరించటానికి……… 🙂

    బొల్లోజు బాబా

  5. మెహెర్

    బాగుంది. నేను మొదటి అధ్యాయమన్నది మొదటి అధ్యాయంతోనే ఆగిపోయింది. తప్పు పుస్తకానిది కాదు, మధ్యలో వేరే పుస్తకం వైపుకు మనసు మళ్ళింది.

    దువ్వూరిపై విమర్శ విషయం: చరిత్రకారులు అంత కష్టపడి అంతంత సమాచారం పోగేసి రాస్తారు కదా ఎంతైనా, వాళ్ళ దృష్టిలో facts అనేవి పొల్లుపోకూడని పవిత్ర మంత్రోచ్ఛారణల్లా మారిపోతాయనుకుంటా. అందుకే ఎవరు కాస్త అటూయిటూ పలికినా శతఘ్నుల్లా మీదకొచ్చేస్తారు. బంగోరెని అర్థం చేసుకోవచ్చు. “రమణీయం” ప్రారంభంలో దువ్వూరి చిన్నయసూరి గురించి రాసిన కాస్త జీవితసంగ్రహమూ ఏదో పుస్తక పరిజ్ఞానం అనిపించింది నాకైతే; సొంత పరిశోధన కాదు. అయినా ఆయన ముఖ్యోద్దేశం చిన్నయసూరి వ్యాకరణసమీక్ష గానీ, జీవితరచన కాదుగా. కాబట్టి ఇటు ఈయన పరిమితులూ అర్థం చేసుకోవచ్చు. 🙂

    “వాగ్యోధుడు” అన్నది చరిత్రకారులకు అన్వయించుకోలేకపోయినా, పదం మాత్రం నచ్చింది. 🙂

    సి.పి. బ్రౌన్‌ శ్రమలో ఒక సారస్వత పరంపరని శిథిలం కాకుండా నిలబెట్టాలన్న తపన కన్నా, ఒక ఇండివిడ్యువల్ పాషన్ కనిపిస్తుంది. ఇలాంటి ఇండివిడ్యువల్ పాషన్సే దేన్నైనా నిలబెడ్తాయి చివరకి; కలెక్టివ్ విన్సింగ్ కన్నా కూడా. ఈ పాషన్ వున్న ఆయన ఆంగ్లేయుడు కావడం ఒక ఏక్సిడెంట్, అని నాకనిపిస్తుంది.

  6. తమ్మినేని యదుకుల భూషణ్

    వైద్యం ఎవరు చేసినా వైద్యమే. వైద్యుని జాతి ప్రాంతం లెక్కలోకి రావు. బ్రౌన్ సేవ వైద్యం లాంటిదే.
    కబీర్ సూక్తి విన లేదా : जाति न पूछो साधू की, पूछि लीजिये ज्ञान
    मोल करो तलवार का, पड़ी रहन दो म्यान
    (జాతి కాదు అడుగు జ్ఞానం సాధువును ; ఎంచుకో కరవాలం ;పడి ఉండనీ ఒరను) .
    అన్నిటి కంటే విలువైనది ఒక వ్యక్తినుండి స్ఫూర్తి స్వీకరించి మన జీవితకాలంలో
    వారి ఆశయాలను నెరవేర్చగలగాలి. బ్రౌన్ మన భాషకు కలిగించిన దోహదం అంతా
    ఇంతా కాదు. ఈ కృషిలో ఆయన కు తెలుగు పండితుల తోడ్పాటు ఉంది. బ్రౌన్ జీవితాన్ని
    కృషిని సమగ్రంగా తెలుసుకోవాలంటే మీరు చదివి తీరవలసిన పుస్తకం :
    Peter L. Schmitthenner. Telugu Resurgence: C. P. Brown and Cultural Consolidation in Nineteenth-Century South India. New Delhi: Manohar
    ( ఈ పుస్తకం మీద సమగ్ర సమీక్ష రాయాలని చాలా ఏళ్లుగా అనుకొంటున్నా కార్యరూపం దాల్చలేదు; ఇది సదరు రచయిత ఏడేళ్ళ కృషి ఫలితం ,ఒకటి రెండు తప్పులు దొర్లాయి
    గ్రంథ రచనలో ,రచయిత సాధించిన దానితో పోలిస్తే అవి చిల్లర విషయాలు.)

Leave a Reply