వినగవినగవినగ… ఒక కోతి కొమ్మచ్చి…

All imperfection is easier to tolerate if served up in small doses – అంటారు నోబెల్ ప్రైజ్ గ్రహీత Wislawa Szymborska.

కోతి కొమ్మచ్చి ఆడియో గురించి రాయాలని, పది రోజులుగా, రోఝూ తెల్ల కాగితం వైపు తెల్లబోయి చూస్తూ కూర్చోవటం తప్ప, ప్రోగ్రెస్ బొత్తిగా కనబడ్డం లేదు. అందుకని కోతి కొమ్మచ్చి ఆడియోను సరిగ్గా వివరించలేని నా అసమర్థతను, ఇలా కొద్ది కొద్దిగా అందిస్తున్నాను.

**********************************

ఏదైనా చూసినా, చదివినా , విన్నా ఏదో ఒక ఫీలింగ్ బలంగా నాటుకుంటుంది. కాని కోతి కొమ్మచ్చి ఆడియో వింటుంటే, ఎన్నెన్నో భావాలు – కిక్కిరిసిన తిరుమల క్యూ కాంప్లెక్సుల్లా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, ఎక్కడ నుండి ఎలా మొదలెట్టాలో తెలీటం లేదు.

**********************************

“మన్ని తెచ్చి దేవుడు మా ఇంట్లో పడేస్తాడు” అని చెప్పాడు బుడుగు. దేవుడు మంచాడు. ఎందుకంటే మన్ని తెలుగింట్లో పడేశాడు కద. మనకన్నా ముందు బాపూ-రమణల్ని పక్కపక్క తెలుగిళ్ళల్లో పడేశాడు. అందుకని దేవుడు ఇంకా చాలా మంచాడు.

కాని దేవుడు మాయగాడు కూడా. ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకుంటాడు. తీసేసుకున్నట్టే తీసేసుకొని ఇచ్చేస్తాడు. తీసేసుకుంటూ ఇస్తాడు. ఇస్తూ తీసేసుకుంటాడు. అంతా మాయ!

మనం పాపం, పుణ్యం సరి పాళ్లల్లో చేసుకొని ఉంటాం. అందుకే ఓ చేత్తో బాపూ-రమణల్లాంటి వాళ్ళని ఇస్తూనే, మరో చేత్తో మనం మన భాషనే మర్చిపోయేలా చేసుకున్నాం. “అంతా మన మంచికే” అన్నట్టు, ఇప్పుడు ఇంకో చేత్తో రమణ గారి వచనాన్ని బాలుగారి గొంతులో “కోతి కొమ్మచ్చి ఆడియో పుస్తకం” రూపేణ ఇప్పించాడు దేవుడు.

**********************************

నాకు కోతి కొమ్మచ్చి పుస్తకం అంటే ఇష్టం. బాపూ-రమణలంటే ఇష్టం కనుక కొంత ఇష్టం. కాని అసలు కారణం వేరులే.

అది నాకూ, వేటూరిగారికి మధ్య సీక్రెట్. ఎవ్వరికీ చెప్పకూడదు మరి. వేటూరి గారు నాకో మంత్రం చెప్పారు – “ప్రాప్తమనుకో ఈ క్షణమే బతుకులాగా. పండెననుకో ఈ బతుకే మనసు తీరా”. నాకేమో అర్థమయ్యిందిగాని, అర్థం కాలేదు. కొన్నాళ్ళకి రమణగారొచ్చి “కోహతి కొమ్మచ్చి… కొమ్మకు పూలొచ్చి…” అంటూ పాడుతూ ఆడ్డం మొదలెట్టారు. అలా పెట్టారేగాని, రాను రాను “ప్రాప్తమనుకో ఈ క్షణమే బతుకులాగా….. ” అని హమ్ చేసారు మెల్లిగా. నాకు వినపళ్ళేదని అనుకున్నారు. కాని వినపడిపోయిందిగా. అదన్న మాట సంగతి.

**********************************

వారానికో, పది రోజులకో ఒక పేజీ మోతాదు తగ్గకుండా కోతి కొమ్మచ్చిని చదూకుంటూ ఉన్నానా? ఉన్నాను. అప్పుడు కోతికొమ్మచ్చి ఆడియో వచ్చేసింది.

ఇంకేముంది? పొద్దున్న లేస్తూనే చెవిలో పెట్టేసుకోవడం. నిద్రలో అదే పడిపోతుందిలే. మళ్ళీ పొద్దున్న అవ్వగానే పెట్టేసుకోవడం. గంటకో ఐదు నిముషాలైనా దీన్ని వినిపించకపోతే మనసు సైరన్లు మోగించేస్తుంది మరి. వినిపించకోకపోతే, కోర్ట్ మార్షల్ కూడా చేయబోతుంది.

“కడుపాకలి మంచిది. “ఇక చాలు” అని చెప్తుంది కదా” అన్నారు రమణగారు. కాని మనసాకలికి అలాంటి పట్టింపులేవీ లేవు. దానికున్నది ఒక్కటే – ఆఆఆఆఆకలి! అందుకని నేను బ్రేక్‍ఫాస్ట్ బాలుగారితోనూ, లంచ్ గంగరాజు గుణ్ణం గారితోనూ, డిన్నర్ వరా ముళ్ళపూడి, బాలు గార్లతోనూ, మధ్యమధ్యన లైటాకలి టైముల్లో అనంత్ శ్రీరాం, ఎమ్బీయస్ ప్రసాద్, వరప్రసాద్ గార్లతో చేయాల్సివస్తుంది. తప్పటం లేదు మరి.

**********************************

ఆడియో పుస్తకం తెలుగు చదవటం రాని వాళ్ళకి అని చెప్తున్నారు. తూచ్! నమ్మకండి, వాళ్ళను. నన్ను నమ్మచ్చు. అంతగా కాపోతే, మీకు తెలుగు చదవడం రాదని చెప్పండి. పర్లేదు. ప్రతి పాపానికి ఒక పరిహారం ఉంటుందిలే. దీన్ని మాత్రమ్ మిస్స్ కాకండి.

**********************************

తెలుగు చదివినా బాగుంటుంది. విన్నా బాగుంటుంది. రాసుకున్నా బాగుంటుంది. తెలుగంటే అమ్మ కదా, అమ్మ ఎప్పుడూ బాగుంటుంది. చటుక్కున వెళ్ళి ముద్దివ్వాలి అనేలా.

అందులోనూ రమణగారి వచనాన్ని బాలుగారంతటి వాళ్ళు చదువుతూ ఉంటే, తెలుగింకా బాగుంటుంది. శ్రావణ శుక్రవారం పూట పసుపు రాసుకొని పట్టుచీర కట్టుకొని, ఇంత బొట్టు పెట్టుకొన్న అమ్మలా. అప్పుడు వంగి కాళ్ళకి దండం పెట్టుకోవాలి అనిపించేంతగా. మన అమ్మే, ఇప్పుడు కోవెల్లో దేవేరిలా.

అందుకని, బాలుగారే కావాలి అని మంకుపట్టు పట్టింది మనసు. కాని రమణగారి వచనాన్ని ఎవ్వరు చదివినా బాగుంటుంది. ఎలా చదివినా బాగుంటుంది. ఎంత సేపన్నా చదువుకోవాలనిపిస్తుంది. వినాలనిపిస్తుంది. ఆయన రాసిన వాక్యాలే గమకాలు పలికించగలవు. ఎస్పీబి సరే సరి! కాని తక్కిన వారు కూడా చక్కగా చదివి వినిపించారు.

నాకు మటుక్కు నాకు, గంగరాజు గుణ్ణం గారి గొంతు బాగా నచ్చింది. “లంచ్ కి పోతున్నా… మిస్టర్ గుణ్ణం గారితో” అనుకుంటూ రోడ్డు మీద పడతాను. ఆయన మాట్లాడ్డం మొదలెడతారు. “ప్ర్రేమ గుడ్డిదే కాదు బుద్ధి లేనిది కూడా. అందుకే చదివి వినిపిస్తున్నా” అంటారు. ఆ తర్వాత చదవటం మొదలెడతారు. ఈ లోపు నేనే సబ్-వేకో చేరుకుంటాను. ఆర్డర్ ఇస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతాను. సాండ్‍విచ్ తయారుచేస్తున్నవాడు నాకేసి ఇలా చూస్తాడు. నేను పట్టించుకోకుండా తీసుకొని, వచ్చేస్తాను. రమణ గారు మసాలా దోశల గురించి, గోధుమ అన్నం గురించి చెప్తుంటే తినే సాండ్‍విచ్ లో ఆ రుచులు వద్దన్నా తగులుతాయి. ఇంతలో ఏదో జోకు. ఫక్కుమని నవ్వుతాను. చుట్టూ ఉన్న వాళ్ళు ఇలా చూస్తారు, మళ్ళీ. నేను మళ్ళీ పట్టించుకోను.

**********************************

రమణ గారి స్ట్రైల్లో – ఈ ఆడియో బుక్ ను హాయిహాయిగా, జాయ్ జాయ్ గా వినే కేంద్రాలు / సమయాలు – తారు రోడ్లు, ట్రాఫిక్‍లో సాగుతుండగా – ఆగుండగా, ఆఫీసు వరండా, వెయిటింగ్ హాల్లూ, రెస్టారెంట్లు, పార్కులు, ఇంట్లో, ఇంటి డాబాపై, ఇంటి మెట్ల మీద, వంట చేస్తూ, తింటూ, పడుకోబోతూ, పడుకుంటూ, పడుకొని లేస్తూనే, అలసటలో, ఆనందంలో – మన పక్కనున్న మనిషితో మాట్లాడాల్సిన obligation లేని ఏ సమయంలోనైనా విని తరించవచ్చు.

**********************************

ఇలా పడిపడి నవ్వుకుంటున్నప్పుడు, మతి చెడి నవ్వుకుంటున్నారని జనాలు అనుకుంటే పర్లేదు. ఏ ప్రేమలాంటి వాటిలోనే పడి పోయామని “ఎవరు? ఎవరు?” అని అడిగినప్పుడే వస్తుంది తంట!

“exclusive laughing zones” అని ఏర్పరిస్తే బాగుంటుంది, పబ్లిక్ ప్లేసెస్ లో..

**********************************

ముళ్లపూడి వారు ఆకలి గురించి బాగా చెప్పుకొచ్చారు కో.కొ లో. ఆ పంథాలోనే కొనసాగుతూ…

భాషాకలి అని ఒకటి ఉంటుంది మనిషికి. తాను పుట్టి, పెరుగుతున్న వాతావరణాన్ని అర్థం చేసుకోడానికి ఈ ఆకలి అన్న మాట, కడుపాకలి శరీరాన్ని చూసుకోడానికిలా. ఆకలి ఉండాలే గాని, మనిషి ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చును. అసలు తెలుగువాడు పుట్టడమే తక్కువ (స్వ)భాషాకలితో పుట్టాడని కొందరి నిశ్చితాభిప్రాయం. దానికి తోడు కడుపాకలిలానే దీన్ని కూడా, పరిస్థితుల బట్టి, అందుబాటులో ఉన్నవాటిని బట్టి తీర్చుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు, “తెలుగు వద్దు నాయనా, రుచిగా ఉన్నా బలం రాదు. ఇంగ్లీషు అయితే నీ వంటికి మంచిది” అని ఒక తరం మొత్తం చేత తెలుగును మర్చిపోయేలా చేశారు కదా!

అన్నం దొరక్క పస్తులు ఉండడంలా, భాష అందుబాటులో లేకో, రాకో పస్తులుండడం కూడా జరుగుతూ ఉంటుంది గద మరి!

ఆ లెక్కన, రమణగారు “స్ట్రాంగ్ ఆకలి” గురించి చెప్పినవన్నీ ఈ తరంలో అత్యధికులకు సరిపోతాయి. ఎప్పుడో పదో తరగతి పరీక్షల్లో నిక్కుకుంటూ, మూలుక్కుంటూ రాసిపారేసిన తెలుగు “సబ్జ్రెక్టు”ను ఒక భాషగా, ఒక జీవధారగా, ఒక సంస్కృతిలో అంతర్భాగంగా గుర్తించలేని వారంతా, స్ట్రాంగాతి స్ట్రాంగ్ ఆకలి మీదున్న వారే! వారికి కో.కొ ఆడియో, అచ్చ తెలుగు భోజనంలానే ఉంటుంది.

అడపాదడపా తెలుగు న్యూస్ ఛానెల్స్, తెలుగు సినిమాలు చూస్తూ, దాన్నే తెలుగు అనుకొన్న వాళ్ళూ మీడియం ఆకలి మీదున్నట్టు. వారి ఆకలికి సరైన రచిని తెలిపే భోజనం ఇదే!

ఇహ, తెలుగును సుష్టిగా భోంచేసి, త్రేన్ఛేవారికి ఇది సరిపడుతుందో లేదో నేను చెప్పలేను. ఆకలి రుచి ఎరుగదు. ఆకలి తీరినా రుచి తెలీదు.

**********************************
బాపు కార్టూన్లు లేకపోవడం మాత్రం బోలెడు వెలితి. అందుకని, ఇది వింటూ, చదూకుంటే బాగుంటుంది. బాపూ కార్టూన్లు కూడా ఈ-బుక్ లేక ఆడియో బుక్ లో భాగం చేస్తే బాగుణ్ణు.

అప్పుడు కిండిల్లోనో, ఐపాడ్ లోనో పుస్తకాన్ని తెరిచి, ఆడియో మొదలెడితే ఉంటుంది నా సామి రంగా… ఆహా!

**********************************

మనసులో చదువుకోవడం అనేది ఒకటి ఉంటుంది గద! ఆడియో వినివినివిని, ఎప్పుడన్నా బాపుగారి కార్టూన్ల కోసమని పుస్తకం తెరిస్తే, మనకు ఎస్పీబి డబ్బింగ్ చెప్తున్నట్టు ఉంటుంది. చదువుతున్నది మన మనసే అయినా, చెవుల్లో ఆయన గొంతు వినిపిస్తుంది మరి.

**********************************

“వినగవినగవినగ… ఒక కోతి కొమ్మచ్చి… అందులో…” అంటూ ప్రపంచంలో తొట్టతొలి తెలుగు ఆడియో పుస్తకాన్ని గురించి, కథలు కథలుగా చెప్పే అవకాశం మనదే మరి!

**********************************

నేను కోతి కొమ్మచ్చి (కేవలం) చదవను.. వింటాను (కూడా) – ఉహహహుహహుహహ

**********************************

Audio is available for purchase, only in US!


You Might Also Like

8 Comments

  1. పక్కింటబ్బాయి(పవన్ సంతోష్ సూరంపూడి)

    ఇండియాలో ఉన్నవాళ్లు కొనాలంటే ఎలా?

  2. vasu

    అద్భుతంగా రాసారు. ఎలా మిస్ అయ్యానో.

    ఇప్పుడు నేనందుకు రాశానా అనిపిస్తోంది ఈ పుస్తకం గురించి. రాజుని చూసిన కళ్ళతో .. అన్నట్టు ఉంది నా పోస్ట్ ని చూసుకుంటే మీది చదివాకా.

    @ రామ: నేను గమనించి, అలోచించి, తెలుగు రాణి వారి గురించ యాని డిసైడ్ అయ్యా. అన్నట్టు మచ్చుకైనా లేదంటారే తెలుగు, పుస్తకం ముఖ చిత్రం మీద, హెడర్ లోనూ ఉంది కదా 🙂

  3. పుస్తకం » Blog Archive » 2010లో చదివిన తెలుగు పుస్తకాలు

    […] కోతి కొమ్మచ్చి ఆడియో పుణ్యమా అని నిద్రపోతూ కూడా చెవుల్లో తెలుగు ధ్వనిస్తూనే ఉంది. మొట్టమొదటి సారిగా సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి పత్రికకు అలవాటుపడ్డాను. వయస్సుకు తగ్గ పుస్తకాలుంటాయేమో గాని, నేను మాత్రం బుడుగు, బాల (పత్రిక), ఈద్ఘా, టోటో చాన్ వంటి బాలసాహిత్యం మనసారా ఆస్వాదించాను. ఎప్పుడూ చదవని పొలిటికల్ సెటైర్ చదివాను. తెలుగు పద్యాలతో కసరత్తు ఇంకా ప్రథమ దశలోనే ఉన్నాను, పద్యప్రధానమైన పుస్తకాలు కొన్ని చదివాను. […]

  4. రామ

    కావచ్చు.. ఏదేమైనా ఈ ప్రయత్నం హర్షణీయం. జంపాల గారిలా నేను కూడా డేటన్ – చికాగో – డేటన్ ట్రిప్పులో అంతా కాకపోయినా చాలా పుస్తకం ‘విన్నాను’. భలే బాగుంది.

  5. సౌమ్య

    @రామ: బహుశా, తెలుగు చదవడం రాని, తెలుగు అర్థం చేసుకోగల తెలుగు వారిని టార్గెట్ చేశారేమో!

  6. రామ

    మీ రివ్యూ నచ్చి ఇప్పుడే వెబ్ సైట్ నుంచి శబ్దపుస్తకం (ఆడియో బుక్) కొన్నాను.
    ఎవరూ కొట్టను అంటే ఒక మాట – కోతి కొమ్మచ్చి అమ్మే వెబ్ సైట్ లో తెలుగు ముక్క ఒక్కటి కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ముళ్ళపూడి గారి ముందు మాటలో గాని, వ్యాఖ్యాతల పరిచయాల్లో గాని – ఎక్కడా కూడా.

  7. చౌదరి జంపాల

    దాదాపు రెండునెలలక్రితం కోతి-కొమ్మచ్చి ఆడియోపుస్తకం గురించి వ్రాద్దామని మొదలెట్టినా వివిధ కారణాలచేత ఇప్పటిదాకా పూర్తిచేయకపోవటం మంచిపనే అయ్యింది. పూర్ణిమ చెప్పినంత అందంగా చక్కగా నేను చెప్పగలిగి ఉండేవాణ్ణి కాదు.

    చికాగోనుంచి సెయింట్‌లూయిస్‌కు ఒక్కణ్ణే కార్లో వెళ్ళాల్సి వస్తే, ఆ ఏడువందల మైళ్ళ (తిరుగు) ప్రయాణంలోనూ, రమణగారు స్వయంగా నా పక్క సీట్లో కూర్చొని – ముందు బాలుగారి గొంతుకతోనూ, ఆ పైన వరప్రసాదరెడ్డి, గుణ్ణం గంగరాజు, జొన్నవిత్తుల, ఎంబీఎస్ ప్రసాద్, అనంత్‌శ్రీరాం, వర ముళ్ళపూడిల గొంతుకల్తోనూ – ఆపకుండా ఆసక్తికరంగా బోల్డెన్ని కబుర్లూ, చాలా జోకులూ, ఆసక్తికరమైన కథలూ చెప్తుంటే టైమసలు తెలీనేలేదు. చాలాసార్లు చిన్నగానో, ఘట్టిగానో నవ్వేసుకొన్నా, కొన్నిసార్లు మాత్రం గుండెల్ని పట్టేసినట్టూ అనిపించింది. ఇంతకు ముందు ఈ పుస్తకాన్ని కనీసం రెండుసార్లో (కొన్ని భాగాలు ఇరవైపదకొండుసార్లో) చదివినా, ఈ కబుర్లూ, కథలూ మళ్ళీ మళ్ళీ వినటంలో ఉన్న మజాయే వేరు. Random episodesగా ఇప్పటికీ కార్ ఆడియోలో వింటూనే ఉన్నా.

    నాకు తెలిసినంతవరకూ కవితలూ, కవితా సంకలనాలూ, విడి కథలూ, నాటకాలూ ఆడియోగా ఇంతకు ముందు అడపాదడపా వచ్చినా, ఇలా పూర్తిగా ఒక వచనపుస్తకం మొత్తం ఆడియోరూపంలో రావటం ఇదే మొదటిసారనుకొంటాను. ఈ పుస్తకాన్ని శ్రమపడి తీసుకువచ్చిన ముళ్ళపూడిగారి చిరంజీవులు అనూరాధ, వరలను అభినందించాలి. బాలుగారి కోతికొమ్మచ్చి పల్లవి ఒక బోనస్. పేపాల్ అక్కౌంట్ ఉన్నవారెవరైనా ఈ పుస్తకాన్ని http://kothikommachi.com/లో కొనుక్కోవచ్చు. తొమ్మిదిన్నర గంటల (35 భాగాలు, 407 మెగాబైట్ల) శ్రవణానందం. మీరందరూ తగుసంఖ్యలో ఈ ఆడియో పుస్తకం కొనేసి వినేసుకొంటే, ఇంకోతికొమ్మచ్చి, ముక్కోతికొమ్మచ్చి కూడా మనం వినటానికి అవకాసం ఉంటుంది మరి.

    (Disclosure: ఈ ఉత్తరానికీ, ఈపుస్తకంలో ఓ చోట రమణగారు నన్నో హీరోగా పేర్కొనడానికీ, ఎట్టి సంబంధమూ లేదు గాక లేదు).

  8. సౌమ్య

    :)) Good one!

Leave a Reply