శ్రీమదాంధ్రమహాభారతం – ఎందుకు చదవాలి ? – 1

రాసిన వారు: మల్లిన నరసింహారావు
*******************
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకున్నాను. అందుకు నేనేం చేయ్యాలి? చదివితేనే గదా తెలిసేది ఎందుకు చదవాలో? అందులో ఏమున్నదో? అందుకని మహా భారతం పుస్తకాలకోసమని చాలా సంవత్సరాల క్రితమే ప్రయత్నాలు ప్రారంభించాను. అర్థతాత్పర్య రహితమైన కవిత్రయప్రణీత శ్రీమదాంధ్రమహాభారతం పుస్తకాల్నినేను చాలా ఏళ్ళ క్రితం శ్రీకాళహస్తి గుడికి వెళ్ళినపుడు ఆ గుడిదగ్గఱ కొన్నాను. అప్పుడక్కడ అన్ని పర్వాలూ పూర్తిగా దొరకలేదు. అక్కడ దొరకని వాటిని రవీంద్రా పబ్లిషింగ్ హౌస్ హైదరాబాదులో కొన్నాను. 1993-1995 ల మధ్య నేను నిరుద్యోగిగా తణుకులో కాలం గడుపుతున్నప్పుడు మహాభారతం మొత్తం 18 పర్వాలూ 18 రోజులలో పూర్తిగా చదవాలని ఓ వింత ఆలోచన ఎందుకో కలిగి అలాగే గబగబా చదివి పూర్తిచేసాను. కాని అప్పుడు చదివినదానిలో ఏ 20% మాత్రమో అర్ధమయింది. నేను చదివిన పుస్తకాల్లో అర్ధ తాత్పర్యాలు కానీ ఇతర వివరణలు కానీ ఏమీ లేవు.

ఇటీవల జూలై నెలలో తిరుపతి వెళ్ళినపుడు అక్కడి ప్రెస్సులో శ్రీమదాంధ్రమహాభారతం టీకాతాత్పర్యాలతోనూ విశేష వివరణలతోను ఉన్న టి.టి.డి ప్రచురణల ప్రతి 18 పర్వాలూ 15 సంపుటాలలోఉన్నది 1000 రూపాయల చౌక ధరలో కనిపిస్తే కొన్నాను. 2010 ఆగస్టు నెలలో చదవటం మొదలుపెట్టి 2010 డిసెంబరు 31 నాటికి 5 నెలల్లో చదవటం పూర్తి చేయగలిగాను.ఈ పుస్తకాల్లో అర్థం, తాత్పర్యం, అక్కడక్కడా అవసరమైనచోట్ల విశేష వివరణలూ కూడా ఉండటం చేత సుమారు 90 % పైగా అర్ఠం చేసుకోగలిగాను. పుస్తకం.నెట్ వారు 2010 లో మీరు చదివిన పుస్తకాలగుఱించి ఏమైనా వ్రాస్తే ప్రచురిస్తామని అనటం చూసి శ్రీమదాంధ్రమహాభారతం ఎందుకు చదవాలనే దాని గుఱించి వ్రాద్దామనిపించి వ్రాయటానికి పూనుకున్నాను. పెద్దలు నా ఈ సాహసాన్ని మన్నింతురు గాక!

కొంతమంది మహాభారతాన్ని వినటాన్ని ఇష్టపడతారు.( వింటే భారతం వినాలన్నది మన తెలుగు వారి నానుడి) కొంతమంది మహాభారతాన్ని చూడటానికి ఇష్టపడతారు. మఱికొంతమంది మహాభారతాన్ని చదవటానికి ఇష్టపడతారు. వినగోరేవారికి భక్తి టీ.వి లోని గరికపాటి వారి మహాభారతం, లేదా ఇతర ఛానళ్ళలోని చాగంటివారి మహాభారత ప్రవచనాలూ వినటానికి అందుబాటులో ఉన్నాయి.అలాగే మహాభారతాన్నిచూడగోరేవారికి ఈ టి.వి.లోని మహాభారతం ధారావాహికా వీక్షణం ప్రస్తుతం అందుబాటులో ఉంది. అలాగే కొంతమంది బ్లాగరులు కంప్యూటర్లలో మహాభారతాన్నిఎందుకు చదవాలో దానిలోని గొప్పదనం ఏమిటో ఎవరైనా వ్రాస్తే చదవాలని కూడా అనుకోవచ్చని ఎందుకో నా కనిపించింది. సరిగ్గా అలాంటి వారికోసమే నా ఈ చిన్ని ప్రయత్నం. పెద్దలందరూ నా ఈ ప్రయత్నాన్ని నిండుమనసుతో స్వీకరించి నన్నాశీర్వదించాలనీ నాచే చేయబడే తప్పులను ఎత్తిచూపి నాకు మార్గదర్శకత్వం వహించాలనీ ఇందుమూలంగా కోరుకుంటున్నాను. మీ అందరి సలహాలకూ సంప్రదింపులకూ నేనెప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను.

వేదవ్యాసమహాముని సంస్కృతంలో రచించిన మహాభారతం నూఱు పర్వాలతోను సుమారు 100500 శ్లోకాలతోను ఉంటే కవిత్రయం వారాంధ్రీకరించిన మహాభారతం 18 పర్వాలతోనూ 21507 గద్యపద్యాలతోనూ ఉంది. భారతానువాదం ఒక అనువాదంలా కాకుండా ఓ స్వతంత్ర్యకావ్యంగా కవిత్రయం వారి చేతుల్లో రూపుదిద్దుకుంది. ఆంధ్రమహాభారతం లోని పర్వాల పేర్లు 1. ఆదిపర్వం 2. సభాపర్వం 3.ఆరణ్యపర్వం 4.విరాటపర్వం 5.ఉద్యోగపర్వం 6.భీష్మపర్వం 7.ద్రోణపర్వం 8.కర్ణపర్వం 9.శల్యపర్వం 10.సౌప్తికపర్వం 11.స్త్రీపర్వం 12.శాంతిపర్వం 13.అనుశాసనికపర్వం 14.అశ్వమేధపర్వం 15.ఆశ్రమవాసపర్వం 16.మౌసలపర్వం 17.మహాప్రస్థానీకపర్వం18.స్వర్గారోహణపర్వం. వీటిలో ఆది, సభాపర్వాలనూ ఆరణ్యపర్వంలో కొంత భాగాన్నీ రాజరాజనరేంద్రుని కాలంలో (క్రీ.శ. 1053ప్రాంతం) ఆయన అభ్యర్ధనపై నన్నయభట్టారకుడు తెలుగు చేసాడు. విరాట పర్వం మొదలుగా మిగిలిన 15 పర్వాలనూ నెల్లూరు మనుమసిద్ధి ఆస్థానంలోని కొట్టరువు తిక్కన సోమయాజి (1255-1260మధ్యలో ) ఆంధ్రీకరించటం జరిగింది. నన్నయ భట్టారకుడు ఆంధ్రీకరించగా మిగిలిన భాగాన్ని ఎఱ్ఱాప్రెగడ నన్నయ పేరుమీదుగానే పూర్తిచేసాడు. వ్యాసుడు మహా భారతాన్ని 3 సంవత్సరాల్లో పూర్తిచేసాడు. అయితే ఆంధ్రమహాభారతం మటుకు 3గ్గురు కవులచేత 3 విడి విడి సమయాల్లో పూర్తిచేయబడింది.

ఉపోద్ఘాతం(అవతారిక)

నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్ ! దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్!!

– ధర్మార్థ కామమోక్షాలకు సంబంధించి భారతంలో ఉన్నఅంశం మరొకచోట ఉండవచ్చు. కాని, భారతంలో లేని అంశం మరెక్కడా ఉండదని వ్యాసులవారు సంస్కృత మహా భారతంలో ఘంటాపథంగా ప్రకటించారు.

ధర్మే చార్ధే చ కామే చ మోక్షే చ భరతర్షభ ! యది హాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్ ! ! (సం.మ.భా. 56-33)

– దీనిని భారతం చివరలో స్వర్గారోహణ పర్వంలో తిక్కన గారీవిధంగా ఆంధ్రీకరించారు.

అమల ధర్మార్థ కామ మోక్షముల గుఱిచి ! యొలయు తెరు వెద్దియును నిందుఁ గలుగునదియు
యొం డెడలఁ గల్గు దీన లేకుండు చొప్పు ! దక్కొకంటను లేదు వేదజ్ఞులార ! (స్వర్గా.82)

( ఓ వేదవిదులారా ! పవిత్రమైన ధర్మార్థ కామమోక్షాలకు సంబంధించి ప్రవర్తించే ధర్మం ఏదైతే ఈ భారతంలో చెప్పబడిందో అది మరొకచోట కూడా ఉంటుంది. ఇందులో లేని ధర్మం మరెక్కడా కూడా కనిపించదు.)

వ్యాసుడు భరతవంశ కథనాన్ని మొదటగా జయం అనే పేరుతో వ్రాసాడు. దానిని వివిధలోకాలలో ప్రచారించే నిమిత్తం తన శిష్యులైన నారదుడు(దేవలోకం), అసితుడైన దేవలుడు(పితృలోకం), శుకుడు(గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాలలో), సుమంతుడు(నాగలోకం), మనుష్యలోకంలో ప్రచారం చేయటానికి వైశంపాయనుడినీ నియోగించాడు. జయ కావ్యం మనుష్యలోకంలో వైశంపాయనునిచే చెప్పబడినప్పుడు భారతంగా విస్తరించటం జరిగింది. ఆ వైశంపాయనుడు జనమేజయునికి భారతాన్ని చెప్తుండగా విన్నవాడు రోమహర్షుని పుతృడైన (రౌమహర్షిణి) ఉగ్రశ్రవసుడు అనే మహాముని. ఆ రౌమహర్షిణి తఱువాత నైమిశారణ్యంలో శౌనకాది మహామునులకు ఆ కావ్యాన్ని విస్తరించి మహాభారతం గా చెప్పటం జరిగింది. ఇది జయకావ్యం మహాభారతంగా రూపుదిద్దుకున్న విధాన క్రమం. కన్నడంలో పంపమహాకవి భారతాన్ని జయం అనే పేరుమీదనే నన్నయ కంటే ముందుగానే కన్నడీకరించాడు.

వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి. – ఇది తెలుగువాళ్ళ నోటినుండి తఱచుగా వెలువడే నానుడి. అందుచేతనే మన తెలుగు వారందరికీ ప్రీతి పాత్రమైన భారతం గుఱించి వ్రాయాలని సంకల్పించాను. నన్నయ భారతాంధ్రీకరణాన్ని ఈ క్రింది పద్యంతో మొదలుపెడతాడు.

మంగళశ్లోకము

శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవామ్,
తే వేదత్రయమూర్తయ స్త్రి పురుషా స్సంపూజితా వ స్సురై
ర్భూయాసుః పురుషోత్త మామ్బుజభవ శ్రీ కన్ధరా శ్శ్రేయసే.

(ఏ విష్ణు బ్రహ్మ శంకరులు చిరకాలంనుండి క్రమంగా, రొమ్మునందూ, ముఖమునందూ, దేహమునందూ లక్ష్మీ సరస్వతీ పార్వతులను ధరిస్తున్నవారై, స్త్రీపురుషుల సంయోగం వలన పుట్టిన లోకాల సుస్థిరత్వాన్ని అవిచ్ఛిన్నంగా కలిగిస్తున్నారో, మూడువేదాలరూపం కలవారున్నూ, దేవతలచేత పూజింపబడినవారున్నూ అయిన ఆ విష్ణు బ్రహ్మ శంకరు లనబడే త్రిమూర్తులు మీకు శ్రేయస్సు కలిగించే వా రౌతారు గాక !) ఈ పైపద్యం శార్దూల విక్రీడితం. కాని దీనికి తెలుగులోని యతి ప్రాసలు లేవు. సంస్కృత శార్దూల విక్రీడితం ఈ పద్యం.

నన్నయ ఋషితుల్యుడు.ఆయన నోట త్రిమూర్తులు అనే పదం రావటం చేత భారతాన్ని కూడా త్రిమూర్తులవంటి కవిబ్రహ్మ తిక్కన, నారాయణునివంటి నన్నయ, ప్రబంధపరమేశ్వరుడని పేరుగాంచిన ఎఱ్ఱన తెలిగించారని కొందరు పెద్దలంటారు. నిజమే ననిపిస్తుంది.

రాజరాజనరేంద్రుడు నన్నయతో మహాభారతాంధ్రీకరణం గుఱించి చెప్తూ ఈ విధంగా అంటాడు.

ఇవి యేనున్ సతతంబు నాయెడఁ గరం బిష్టంబు లైయుండుఁ బా
యవు భూదేవకులాభితర్పణమహీయఃప్రీతియున్ భారత
శ్రవణాసక్తియుఁ బార్వతీపతిపదాబ్జధ్యానపూజామహో
త్సవమున్ సంతతదానశీలతయు శశ్వత్సాధుసాంగత్యమున్ .

రాజరాజుకు అత్యంత ప్రీతి పాత్రమైన 5 విషయాల్లో భారతకథాశ్రవణం కూడా ఒకటి. ఆ మహా భారతం ఎటువంటి దంటే ….

అమల సువర్ణ శృంగఖుర మై కపిలం బగుగోశతంబు ను
త్తమబహువేదవిప్రులకు దానము సేసినఁదత్ఫలంబు త
థ్యమ సమకూరు భారతకథాశ్రవణాభిరతిన్ మదీయచి
త్తము ననిశంబు భారతకథాశ్రవణ ప్రవణంబుకావునన్.

(పరిశుద్ధమైన బంగారపు తొడుగుతో కూడిన కొమ్ములును, గిట్టలును కల కపిలవర్ణం కల వందావులను యోగ్యులు, నాలుగువేదాలూ అధ్యనం చేసిన వారైన విప్రులకు దానం చేసిన ఫలితం భారతకథను వినే ఆసక్తిచేత తప్పక కలుగుతుంది. నాహృదయం కూడా భారతకథను వినాలి అని కుతూహలపడుతూ ఉంటుంది.)

కాబట్టి — “మహాభారతబద్ధనిరూపితార్థం”— ఏర్పడేటట్లుగా రచించమని కోరతాడు రాజరాజ నరేంద్రుడు నన్నయని. నన్నయ కవిత్వం –

సారమతిం గవీంద్రులు ప్రసన్న కథాకవితార్థయుక్తి లో
నారసి మేలునా,నితరు లక్షరరమ్యత నాదరిం ప నా
నారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా
భారతసంహితారచనబంధురుఁ డయ్యె జగద్ధితంబుగన్.

(కవిపుంగవులు ప్రశస్తమైన బుద్ధితో ప్రసాదగుణంతో కూడిన కథలందును, కవిత్వమందును కల మనోహరాలైనఅర్థాలతోడి కూడికను లోపల తరచి గ్రహించి బాగు,బాగు అని ప్రశంసించగా, సామాన్యులు వీనులకు విందుచేకూర్చే అక్షరాలకూర్పులోని సౌందర్యాన్ని మెచ్చుకోగా, హృద్యమైన అర్థాలతో కూడిన వివిధసుభాషితాలకు నిధానమైన నన్నయభట్టు లోకశ్రేయస్సు కలిగేట్లుగా మహాభారత వేదాన్ని రచించటానికి పూనుకున్నాడు.మహాభారతానికి పంచమ వేదం అనే పేరు కూడా ఉంది. ప్రసన్న కథాకవితార్థయుక్తి,, అక్షరరమ్యత, నానారుచిరార్ధసూక్తినిధిత్వం అనే ఈ మూడూ నన్నయ కవిత్వ లక్షణాలు.)

భారత కథా ప్రస్థావన

నైమిశారణ్యంలో శౌనకుడనే మహర్షి పన్నెండు సంవత్సరాలపాటు సాగే సత్రయాగం చేస్తున్నప్పుడు అక్కడికి చేరిన మహాఋషులందరూ రోమహర్షణుని కుమారుడైన ఉగ్రశ్రవసుని చుట్టూచేరి ఆయన దగ్గరనుండి పురాణకథలను వినగోరుతారు. అప్పుడు ఆయన మీరు నానుండి ఏమంచి కథని వినదలచుకున్నారని అడగ్గా వారతనితో–

ఏయది హృద్య, మపూర్వం ! బేయది, యెద్దాని వినిన నెఱుక సమగ్రం
బై యుండు, నఘనిబర్హణ ! మే యది ? యక్కథయ వినఁగ నిష్టము మాకున్.

(ఏకథ మనోహరమో, ఏది క్రొత్తదై వింతగా ఉంటుందో, దేనిని వింటే సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుందో, ఏది పాపాలను తొలగిస్తుందో అటువంటి కథను వినటం మాకిష్టం. అని అంటారు)

అప్పుడు ఉగ్రశ్రవసుడు వారికి భారతకథను చెప్పటానికి ప్రారంభించి, ఆ కథను కృష్ణద్వైపాయనుడనే పేరుగల వ్యాసమహర్షి రచించాడు అని చెప్పి దానిలోని పర్వాలవివరాలనన్నిటినీ విశదం చేస్తాడు. ఆ మహాభారతం తెలుగులో 18 పర్వాలతో కూడి ఉందని సంగ్రహంగా ఆ యా పర్వాలలోని కథాసంగ్రహాలను వివరిస్తాడు. మహాభారత మాహాత్మ్యాన్ని కూడా చెప్తాడు.

సాత్యవతేయవిష్ణుపదసంభవ మై విభుధేశ్వరాబ్ధిసం
గత్యుపశోభితం బయి జగద్విదితం బగుభారతీయభా
రత్యమరాపగౌఘము నిరంతర సంతతపుణ్యసంపదు
న్నత్యభివృద్ధి సేయు వినినం గొనియాడిన నెల్లవారికిన్.

(సత్యవతీ పుత్త్రుడైన శ్రీమన్నారాయణరూపమైన వ్యాసుని వాక్కునుండి పుట్టి పండితసముద్రం యొక్క స్నేహమనే కలయికచే శోభనొందిన భారతమనే ఆకాశగంగా ప్రవాహం విన్నవారికి ప్రశంసించినవారికీ ఎల్లప్పుడూ సర్వసంపదలనీ కలిగిస్తుంది )

మహాభారత యుద్ధం పాండవులు(7 అక్షౌహిణులు), కౌరవుల(11 క్షౌహిణులు) మధ్య 18 రోజులపాటు శమంతపంచకం (కురుక్షేత్రం) అనేచోట జరుగుతుంది. కౌరవుల పక్షాన 10 రోజులు భీష్ముడు, 5రోజులు ద్రోణుడు, 2 రోజులు కర్ణుడు, ఒకరోజు సగానికి శల్యుడు, మిగిలిన సగానికి దుర్యోధనుడు సేనానాయకత్వం వహిస్తారు. పాండవుల పక్షంలో పాండవ పట్టమహిషి యైన ద్రౌపది సోదరుడు దృష్టద్యుమ్నుడు సేనానాయకత్వం వహిస్తాడు. ఒక అక్షౌహిణి అంటే 21870 రథాలు, 21870 ఏనుగులు,65610 గుఱ్ఱాలు, 109350 కాల్వురు కలిగిన సేనాసమూహం. ఇటువంటి 18 అక్షౌహిణుల సైన్యం భారతయుద్ధంలో పాలుపంచుకున్నది.

ఆదిపర్వం

పరీక్షన్మహారాజు కొడుకైన జనమేజయుడు సుదీర్ఘంగా సాగే సత్త్రయాగాన్ని ప్రారంభిస్తాడు. మహాభారతం ఉదంకోపాఖ్యానమనే కథతో ప్రారంభమవుతుంది. ఈ ఉపాఖ్యానంలో చాలా మంచి పద్యాలు కొన్ని ఉదాహరిస్తాను.

తగు నిది తగ దని యెదలో ! వగవక, సాధులకుఁ బేదవారల కెగ్గుల్
మొగిఁ జేయు దుర్వినీతుల ! కగు ననిమిత్తాగమంబు లయిన భయంబుల్. 1-1-85

(ఈపని యుక్తమయినది, యుక్తమయినది కాదు అని మనస్సులో ఆలోచించకుండానే బీదవారికి, అశక్తులకూ, మంచివారికీ అపకారాలు పూనికతో చేసే నీతిరహితులకు కారణం లేకుండానే ఆపదలు వస్తూ ఉంటాయి.)

నన్నయ రుచిరార్థసూక్తినిధిత్వానికి ఇది ఒక ఉదాహరణం. సరమ అనే దేవలోకంలోని ఆడకుక్క కొడుకు సారమేయుడనేవాడు జనమేజయుడు చేసే సత్రయాగం ప్రదేశానికి వచ్చి ఆ ప్రదేశంలో తిరుగుతుండగా జనమేజయుని కొడుకులు వాడిని కొట్టి బాధిస్తారు. అప్పుడు సరమ జనమేజయునితో పై విధంగా అంటుంది. మరో మంచి పద్యం.

నిండుమనంబు నవ్యనవనీతసమానము, పల్కు దారుణా
ఖండల శస్త్రతుల్యము జగన్నుత ! విప్రులయందు; నిక్కమీ
రెండును రాజులందు విపరీతము; గావున విప్రుఁ డోపు, నో
పం డతిశాంతుఁ డయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్. 1-1-100

(లోకం చేత స్తుతించబడినవాడా ! ఉదంకమహామునీ ! బ్రాహ్మణులలో వారి నిండు హృదయం అప్పుడే తీసిన వెన్నతో సమానంగా మిక్కిలి మృదువుగా ఉంటుంది. మాట భయంకరమైన ఇంద్రుని వజ్రాయుధంతో సమానంగా ఉంటుంది. ఇది నిజం. మనసూ, హృదయమూ అనే ఆ రెండున్నూ రాజులలో అందుకు విరుద్ధంగా ఉంటాయి. అంటే రాజులందు మనస్సు వజ్రతుల్యంగానూ, పల్కు వననీతంగానూ ఉంటాయి. కాబట్టి బ్రాహ్మణుడు తాను ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోగలుగుతాడు. మిక్కిలి శాంతు డైనా రాజు తన శాపాన్ని ఉపసంహరించుకోలేడు.)

ఇది కూడా నన్నయ రుచిరార్థసూక్తినిధిత్వానికి ఉదాహరణమే. ఉదంకుడు గురుపత్నికోరికమేరకు పౌష్యమహారాజు దేవి కుండలాల కోసమని వెళ్ళి నపుడు ఆ పౌష్యుడూ ఉదంకుడూ ఒకరినొకరిని పరస్పరం శపించుకుంటారు. ఉదంకుడు పౌష్యుని తనకిచ్చిన శాపం ఉపసంహరించుకోమని కోరినప్పుడు రాజు అతనితో పైవిధంగా అంటాడు.నన్నయ గారు ఉదంకోపాఖ్యానంలోనే ఉదంకునితో నాగముఖ్యులను తన వశం చేసుకోవటానికై చెప్పిన 4 పద్యాలు 1.బహువన పాదపార్థి 2.అరిది తపోవిభూతి 3. దేవమనుష్యలోకముల 4. గోత్రమహామహీధర అనేవి కూడా బహుళ ప్రచారంలో ఉన్నవీ మరియు కంఠస్థం చేయదగినవీను. ఉదంకుడు జనమేజయునితో “ప్రల్లదుఁ డైన యొక్క కులపాంసను చేసినదానఁ దత్కులం బెల్లను దూషితం బగుట యేమి యపూర్వము?” అని చెప్పి జనమేజయునికి సర్పయాగ బుద్ధిని పుట్టిస్తాడు. ఇక్కడ భృగువంశకీర్తనమూ, చ్యవనుని చరిత్ర, సహస్రపాదుని వృత్తాంతమూ, గరుడోపాఖ్యానం వగైరా వరుసగా వస్తాయి. ఇక్కడ వచ్చిన ఉదంకోపాఖ్యానమూ, చ్యవన చరిత్ర మరియు గరుడోపాఖ్యానం తరువాత తిక్కన భారతంలో కూడా మళ్ళీ వస్తాయి. దేని అందం దానిదే.

You Might Also Like

20 Comments

  1. M V MARUTHI PRASAD

    ayya,

    nannayya vasula varu samskrutam lo wrasina tala patra grandham vunda. Vunte yekka vundi. Asalu Vasula varu bhagavatam rachinchi natlu adaralemaina vunnaya. Daya chesi telupa galaru.

    Kavitrayam wrasina padyalu vasula vari anukarunanena.
    itlu

  2. ఉప్పయ్య చంద్రశేఖర

    నమస్కారమండి
    మీ ప్రయత్నాన్ని చాలా మేచ్చుకున్నానండి. నాకు నన్నయ ఆంధ్రమహాభారతం పద్యంగాని తత్రర్యం గాని కావాలి. అది ఉంటే దయచేసి నన్ను మేల్ చేయండి.

    ధన్యవాదం

    1. narasimharao mallina

      నా దగ్గఱ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన శ్రీమదాంధ్ర మహాభారతం ప్రతి ఉన్నది.దానిలో సంపూర్ణంగా అర్థ తాత్పర్యాలతోను, విశేష వాఖ్యలతోను ఉన్నది. ఈ పుస్తకాలు అన్ని నగరాలలోని టి.టి.డి. వారి కల్యాణమండపాల్లోనూ, పుస్తక విక్రయశాలలలోను దొరకవచ్చును. ప్రయత్నించండి.మీకు తప్పకుండా అవి లభిస్తాయి. నేను కొన్నది మొత్తం 15 పుస్తకాలు 1000 రూపాయలకు తిరుపతి లోని టి.టి.డి.వారి ప్రెస్సులో.

  3. narasimharao mallina

    పూర్తి వచన మహాభారతాలు కూడా ఉండిఉండవచ్చు. నాకు తెలియదు. ఈ మధ్యనే మిత్రులొకరు సంస్కృతమహా భారతాన్ని అనుసరించి యథాతథంగా ఎవరో పండితులు తెలుగులో ( పద్యకావ్యం గానే అనుకొంటున్నాను) 20 వాల్యూములులో పూర్తిగా అనువదించారనిన్నీ ఖరీదు కూడా చాలా తక్కువగా Rs. 750 మాత్రమే ననిన్నీ భాగ్యనగరం వచ్చినపుడు ఆ పుస్తకాలు చూడొచ్చుననిన్నీ చెప్పారు. దీనిని కూడా అధ్యయనం చేద్దామని అనుకొంటున్నాను. ఈసారి భాగ్యనగరానికి వెళ్ళినప్పుడు (త్వరలోనే ఆ అవకాశం కలగొచ్చుననుకుంటున్నాను) ఆ పుస్తకాలను చూసి పద్యకావ్యం అయితే కొనుగోలు చేద్దామని అనుకొంటున్నాను. నాకు పద్యమంటేనే ఇష్టం, వచనానికంటే కూడా. అలా అని వచనాన్ని ఏమీ తక్కువగా చూడను. పద్యం లాగే ఎంతో అందమైన వచనాన్ని వ్రాసే మన పూర్వీకుల రచనలన్నా నాకు చాలా ఇష్టం.ఉదా. కృష్ణాతీరం- మల్లాది రామకృష్ణశాస్త్రి గారిది.

  4. raju

    mallina narasimha rao garu,
    mee prayathnananiki danyavadalu.
    Poorthi vachana mahabharatham telugulo vunda?
    vunte soochincha galaru.

  5. kameswara rao

    chala bagundi. thanks

  6. మల్లిన నరసింహారావు

    @జాబాలిముని: ధన్యవాదాలు.

  7. జాబాలిముని

    మీరు తలపెట్టిన బృహత్కార్యం నిర్విఘ్నంగా కొనసాగాలని మనసారా వాంచిస్తున్నాను.
    జాబాలిముని

  8. RUKMINI DEVI

    Mallina gaaru, namaskaaramandi.. Bhaaratam gurinchi excellent gaa varninchaaru. Maa naannagaari daggara aa books wundevi. chinnappudu inchuminchu ennisaarlu chadivinaa kottagaane wundedi..telugulo naaku veelu wunnapudu mail chestaanu.. prastutaaniki manninchandi..

  9. మాలతి

    @ నరసింహారావుగారూ, మీ సమీక్షే ఒక బృహత్ కావ్యంలా ఉంది. క్షుణ్ణంగా చదివేరన్నమాట మహాభారతం. అభినందనలు.

  10. ramakrishna

    namaskaramandi,

    me prayatnaniki devudu anni vidala sahayam cheyalani korutunnanu.

  11. మల్లిన నరసింహారావు

    లోకేష్ గారికి
    ఉన్నదున్నట్లుగా వ్యాసభారతాన్ని ఎవరైనా అనువదించారో లేదో నాకూ తెలియదు. పెద్దలెవరైనా తెలిస్తే తెలియజేయగలరు.
    రాఘవ గారికి
    ఈమాత్రం ప్రోత్సాహం చాలు. కొండల్ని పిండి చెయ్యటానికి.ధన్యవాదాలు.

  12. పుస్తకం » Blog Archive » శ్రీమదాంధ్రమహాభారతం – ఎందుకు చదవాలి ? – 1.1

    […] ******************* పదిహేనో తేదీన వచ్చిన ఈ వ్యాసానికి […]

  13. రాఘవ

    నరసింహారావుగారూ, చాలా చక్కటి పరిచయం. సందర్భానుసారంగా పద్యాలు ఉద్ధరించి చూపటం చాలా బాగుందండీ. మీరు ఈ పని కొనసాగించటానికై వలసిన శక్తిసత్త్వారోగ్యాలను భగవంతుడు ప్రసాదించునుగాక.

  14. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

    నరసింహారావు గారు మీ వ్యాసం బావుంది.సంస్కృతంలో 100 పర్వాలు ఉన్నాయని చదివి ఆశ్చర్యం వేసింది.టి.టి.డి. వారు ముద్రించిన పుస్తకాలు నేనూ చూశాను.వ్యాసమహాభారతాన్ని ఉన్నదున్నట్లుగా తెలుగులో అనువదించిన పుస్తకాలు ఉన్నాయా? ఎక్కడ దొరుకుతాయి?

  15. నరసింహారావు మల్లిన

    నమస్కారం లక్ష్మీనారాయణగారూ!
    ఆదిపర్వం రెండోభాగం ఓ రెండురోజుల్లో ప్రచురించబడవచ్చు. ప్రస్తుతం సభాపర్వం వ్రాస్తున్నాను.దేముడు మేలుచేస్తే శ్రీమదాంధ్రమహాభారతం మొత్తంగా అందించాలని నా కోరిక.మీబోటివారి ప్రోత్సాహం నాకు టానిక్ లా పనిచేస్తుంది.
    భారతం లోని మంచిమాటలు అందరూ తెలుసుకుంటే బాగుంటుందని నా ఆశ.

  16. లక్ష్మినారాయణ సునీల్ వైద్యభూషణ

    నమస్కారం నరసింహారావు గారూ.

    మంచి ప్రయత్నం. నేనూ ప్రస్తుతం తితిదే వారి మహాభారతం చదువుతున్నాను. ప్రస్తుతం అరణ్య పర్వంలోని పంచమాశ్వాసంలో ఉన్నాను. మీ తదుపరి వ్యాసానికి ఎదురుచూస్తున్నాను.

  17. మందాకిని

    అయ్యా,
    ధన్యవాదాలు.
    ఈ వ్యాసం లోని వివరాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి.
    మీకు మా ధన్యవాదాలు.

  18. నరసింహారావు మల్లిన

    సంస్కృతంలోని 100 పర్వాలను కొన్నికొన్నింటిని కలిపి నన్నయ్య గారు మొత్తం 18 పర్వాలుగా కూర్చారు. అలా చేయటంలో కొన్ని కొన్ని పర్వాలు వదలి ఉండవచ్చుకూడా. వాటి వివరాలు నన్నయ్య గారిచే ఆదిపర్వంలో వివరంగా ఇవ్వబడినవి.

  19. మందాకిని

    అయ్యా, చాలా బాగున్నది.
    సంస్కృతంలో 100 పర్వాలున్నాయని విని ఆశ్చర్యంగా ఉన్నది. తెలుగులోని 18 పర్వాలు కాక వేరే ఉదంతాలు అందులో ఉన్నాయనుకుంటాను.

Leave a Reply