పుస్తకం
All about booksపుస్తకభాష

May 24, 2010

జీవనరాగం – వేటూరి సుందరామమూర్తి తొలి రచన

More articles by »
Written by: Purnima

మాకు ఏడెనిమిది తరగతుల్లో ఎప్పుడో, “కోడిగుడ్డంత గోధుమగింజ” అనే పాఠం ఉండేది, తెలుగు వాచకంలో. కథ లీలగా గుర్తుంది. ఒక రాజ్యంలో ఎవరికో ఒక వింత వస్తువు దొరుకుతుంది. దాన్ని రాజుగారి కొలువు తీసుకెళ్ళి చూపిస్తారు. ఆ వస్తువేంటో కనుగొనడానికి చాలా కష్టపడతారు. చివరకో వృద్ధుడు, అది తన కాలంలో పండిన గోధుమ పంట తాలూకూ గింజగా గుర్తిస్తాడు. అప్పట్లో గోధుమ గింజలు ఇప్పటి కోడిగుడ్డంత పరిణామంలో ఉండేవనీ, కాలనుక్రమంగా వచ్చిన మార్పుల వల్ల నాణ్యతలు తగ్గాయని చెప్పుకొస్తాడు. ఈ కథ ఎంత కల్సితమో నాకు తెలీదు. కాని పోయినవారం వేటూరి సుందరరామమూర్తి గారి తొలిరచన, 1959లో “ఆంధ్ర సచిత్ర వార పత్రిక”లో సీరియల్‍గా ప్రచురితమైన నవల “జీవన రాగం” చదివాక, తెలుగు వచనంలో ఉన్న నాణ్యత, ఇప్పటికి మనకి మిగులున్న తెలుగుతో పోల్చుకుంటే, కోడిగుడ్డంత గోధుమగింజ కథే గుర్తుకొస్తుంది.

కథాపరంగా చూసుకుంటే మహాగొప్ప కథ అని చెప్పుకోడానికి ఏమీ లేదు. ఒక ఆరు పాటలు, అక్కడక్కడా ఫైట్లూ ఇరికించగలిగితే, ఏన్నార్ ని హీరోగా పెట్టి, గుమ్మడిగా ఎన్నార్ దగ్గర చేదోడు వాదోడైన పనివాడిగా పెట్టి, ఒకిద్దరు హీరోయిన్లు, ఒక సైడ్ హీరోని పెట్టేస్తే మంచి సినిమా కథ అయ్యేది. కథలోని హీరో రఘు పేరుగడించిన సినీ సంగీత దర్శకుడు. సఫలత పొందుతున్న కొద్దీ, పనిభారం వల్ల ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. అతణ్ణి కంటికి రెప్పలా కాపాడుకోవాలని తపనపడే సహగాయని రాగిణిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. అనారోగ్యం నుండి కోలుకోడానికి వైద్యుల సలహా మేరకు, రాగిణి సూచన ప్రకారం నాగార్జున కొండ ప్రాంతానికి విశ్రాంతి తీసుకోడానికి వెళ్తాడు. అక్కడే వెంకన్న అనే వృద్ధుడు వంటవాడిగా కుదురుతాడు. మునుపెన్నడూ కనని, వినని పల్లె ప్రాంతపు విశేషాలు, ప్రకృతి అందాలూ అతణ్ణి విశేషంగా ఆకట్టుకుంటాయి. ఒకనాడు కొండల్లో, కోనల్లో విహరిస్తున్న అతడిని ఒక పక్షి ఆకర్షిస్తుంది. దాన్ని వెంబడిస్తూ దారితప్పిపోతాడు. ఆ అడవి గుండా వెళ్తున్న గూడెం యువకులు అతణ్ణి క్షేమంగా ఇంటికి చేరుస్తారు. అలా మొదలైన పరిచయం స్నేహంగా మారి, గూడెంలోకి రాకపోకలు పెరిగి సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఇతని పాటకి, అక్కడి నాయకుని కుమార్తె ఆటకి చక్కని జోడి కుదురుతుంది. రఘు ఆ అందగత్తెకు తన మనసులో మాట చెప్పేస్తాడు. ఆమె అంగీకరిస్తుందా? ఆమెను అప్పటికే మనసావాచా భార్యగా స్వీకరించిన గూడెం యువకుడు ఎలా స్పందిస్తాడు? రాగిణి సంగతి ఏంటి? ఈ కథ మొత్తానికి వంటవాడైన వెంకన్న పాత్ర ఏంటి? పట్నవాసపు ఇరుకుదనంతో అనారోగ్యం పాలైన రఘు, కొండకోనకి చేరి సాధించినదేమిటి? ఈ ప్రశ్నలన్నింటికి జవాబులతో కథ ముగుస్తుంది.

కథనం థర్డ్ పార్టీ నరేషన్‍లో సాగుతుంది. సంగీత ప్రధానమైన కథ కాబట్టి, కొన్ని సంఘటనలనూ, భావానలూ వివరించడానికి సంగీతాన్నే ఆశ్రయించారు. సిటిలో పెరిగిన కథానాయకుడి మనోభావాలనుండి, గూడెంలో పుట్టిపెరిగిన వారి దాకా, వ్యక్తీకరణలో తేడాను సుస్పష్టంగా కనబరిచారు. కథనం ఒక నదిలా సాగిపోతూనే ఉంది. అక్కడక్కడా ఉత్సుకత, అక్కడక్కడా తీవ్ర మనోసంఘర్షణ, అప్పుడప్పుడూ ప్రవాహంలో మలుపులు, ఇవ్వన్నీ కథని చివరి వరకూ చక్కగా నడుపుకొచ్చాయి. పాత్రల స్వభావాలను చిత్రీకరించటంలో విశేష ప్రతిభ దాగుంది. ముఖ్యంగా రఘు పాత్రకు కాస్త గ్రే షేడ్ ఇవ్వటం, రాగిణి పాత్రను పూర్తి పాజిటివ్ పాత్రగా మల్చడం వల్ల జీవనరాగం ఏ అపశృతి లేకుండా పలికింది.

వేటూరిగారి మరో పుస్తకం “కొమ్మ కొమ్మకో సన్నాయి” అన్న పుస్తకం చదివినప్పుడే, ఆయనవి మరే పుస్తకాలు దొరకబుచ్చుకునే అవకాశం కలిగినా వదులుకోకూడదూ అని నిశ్చయించుకున్నాను. ఆయన సినీ పరిశ్రమలో గేయరచయితగా స్థిరపడక ముందు, కొన్ని రచనలు, ముఖ్యంగా నాటకాలు చేసినట్టు విన్నాను. ఆయన నవల రాశారని, ఇది చదివేవరకూ తెలీలేదు. ఈ రచన చదివాక మాత్రం, తెలుగు సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపిన ప్రసిద్ధ గేయరచయిత, ఒక పరిపూర్ణ రచయిత అని కూడా తెలుస్తుంది. ఆయన నడిపిన కథలో అన్నీ ఉన్నాయి, భాష, భావోద్వేగాలూ, తెలుగుదనం, ఒక చక్కని నీతి, విధి నైజం, మనిషి నెగ్గుకొచ్చే తీరు. ఈ రచనలో ప్రకృతి వర్ణణలు చదువుతుంటే మాత్రం మనమున్నది ఆ అందమైన ప్రకృతి వడిలోనేనా అని అనిపించేతంటి అనుభూతి కలుగుతుంది. ఎప్పుడూ ప్రకృతిని ఆస్వాదించని కథానాయకుడు ఉండటం వల్ల, ఈ అనుభవం నాకు మరింత చేరువగా అనిపించింది. సంగీతం, ప్రకృతి, రాగద్వేషాల మేలు కలయిక ఈ నవలిక. కథ సుఖాంతం అవుతుందని ముందే గ్రహించగలిగే, పాత్రల్లో కలిగే మార్పులు ఎలాంటివన్న ఉత్సుకత ఎక్కువగా ఉంటుంది.

ఇహ, ఇందులోని వచనం గురించి మాట్లాడ్డానికి నేను సరిపోను. నాకు నచ్చిన కొన్ని వాక్యాలను, మచ్చుకు ఇక్కడ ఇస్తున్నాను.

“”డికాషన్”లో పోస్తున్న పాలలాగా చీకటిలోకి తెల్లని ఉదయ కాంతులు జొరబడుతున్నాయి” – సూర్యోదయానికి ముందు ఆకాశాన్ని వర్ణించారిలా.

“పెద్ద ముత్తైదువు భూమాతనుదుట తిలకమై అరుణ సూర్యుడు అందగించాడు. రిమరిమలాడుతూ వస్తున్న రేరాణి కంటికి కాటుకై చిరుచీకటులు చెలరేగుతున్నాయి. ముచ్చటగా మలుపులు తిరుగిన కృష్ణాస్రవంతి ఆ కొండలోయలో ఎక్కడో లోతున పరుగులిడుతోంది. ఆ పరుగుల సరిగమలు ఏవో సాయంకాలసమాశ్వాస హిందోళరాగమాలికలైవీణాను స్వరగీతికలై వినిపిస్తున్నాయి.”

“ప్రియభార్యా వియోగ బాధా సంతప్తుడై వట్టిపోయిన బ్రతుకును నెట్టుకొస్తున్నాడు వెంకన్న. మనఃకల్పిత వానప్రస్థంలో మౌనిగా బ్రతుకుతున్నాడు. శేషజీవితం భారంగా ఇసకలో బండినడకలా అతిధీర్ఘంగా ఉంది. ఒక్కమాటలో అతడు జీవచ్ఛవం.”

“రెండు కొండల నడుమ అనంతంగా కృష్ణ ప్రవహిస్తున్నది. అందులో ఒక కొండ ముందుకు వంగి రెండవ కొండను చుంబించబోతున్నట్లున్నది. జీవితంలో సంయోగం కోరే ప్రేయసీప్రియుల మధ్య తెలియకుండా జారిపోయే కాలసరిత్తులా ఉన్నది కృష్ణవేణి.”

“గ్రీష్మాతపవహ్నికి నెర్రెలుపడిన భూమిలాగా వియోగ వ్యధితుడైనవాని గుండెలు బీటలువారి పగిలిపోతాయి.”

పుస్తకం మొదట్లో, సాలూరి రాజేశ్వరరావుగారి ఫోటో, వేటూరి ఆయనపై రాసిన ఒక గేయం  ఉన్నాయి. వేటూరిగారు, ముందుమాటలో మల్లాది రామకృష్ణశాస్త్రి గారికి, శ్రీ పెండ్యాల నాగేశ్వరరావుగారికి ధన్యవాదాలు తెలిపారు.

తెలుగుదనాన్ని, తెలుగు భాషలోని కమ్మదనాన్ని తెలియపరిచే అరుదైన రచన ఇది. ఉపోద్ఘాతంలో చెప్పినట్టు, ఒకప్పటి తెలుగు ఇంత మధురంగా ఉండేదా అన్న ఆశ్చర్యం కలుగకమానదు. వేటూరి గారు తెలుగు సినిమా సాహిత్యాన్ని ఎంతో పైకి తీసుకెళ్ళారు. ఆయన సాహిత్య రంగంలోనే కొనసాగుండి ఉంటే, ఆయనకింతటి జనాదరణ లేకపోయినా, తెలుగు భాషకు మాత్రం బోలెడు లాభం కలిగేది. నేను చదివిన వేటూరి రెండు పుస్తకాలూ మాత్రం, తప్పక చదవాల్సినవే! “కొమ్మ కొమ్మకో సన్నాయి” కూడా త్వరలో పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాం.

ఈ పుస్తకం ఇప్పుడు దొరుకుతుందన్న ఆశ లేదు. పాత పుస్తకాల షాపుల్లోనో, తెలుగు సాహిత్యాభిలాషుల వ్యక్తిగత గ్రంథాలయాల్లో కాని ఈ పుస్తకం దొరికితే తప్పక చదవండి.
————————————————————————————————
ఈ వ్యాసం రాస్తున్న సమయంలో, టివిలో బ్రేకింగ్ న్యూస్ ద్వారా వేటూరి ఇక లేరన్న వార్త తెల్సింది. కొందరు మహనీయులు పుట్టిన కాలాన్ని మనమూ పంచుకోవడం అదృష్టం. ఆయన పాట వింటూ పెరిగిన నాలాంటి వారందరి తరఫున ఆయనకు అశ్రునివాళి.About the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..5 Comments


 1. ఈ సమయాన వేటూరి వారి నవలా పరిచయం నిండైన నీరాజనం. పుస్తకం వారికి ధన్యవాదాలు.

  వేటూరి మరణానికి మునుపే ఆసక్తి వలన నేను సేకరించుకున్న విషయాలివి. 1936 లో పుట్టిన వేటూరి సుందరరామమూర్తి పేరు వెండితెరకెక్కటం, ఈ ఏడాదికి సరిగ్గా 36 యేళ్ళవడం యాధృచ్చికం. ఆయన వృత్తి తొలుత పాత్రికేయుడు. జర్నలిస్టుగా జీవితాన్ని ఆరంభించిన వేటూరి ఎన్‌.టి.రామారావు గారి కోరిక మేరకు తెలుగు చిత్రరంగంలోకి ప్రవేశించారు. పత్రికా రంగంలోనూ, సినీ రంగంలోనూ దాదాపుగా సమాన ఖ్యాతి గడించారు. [ *** ఇక ఇదే ఏడాది ఆ రంగాన ఆయన జీవితం ముగియటం విచారకరం]

  సిరికా కొలను చిన్నది – వేటూరి రేడియో కోసం రాసిన సంగీత నాటిక ఇది. రాయల నాటి తెలుగు సంస్కృతిని, ప్రజా జీవన సరళిని ప్రతిబింభించే కథ. కథా స్థలం కృష్ణా నదీ తీరాన ఆంధ్ర విష్ణు క్షేత్రంగా ప్రసిద్దికెక్కినశ్రీకాకుళం. ఈ నాటికని పొడిగించి సినిమాగా తీయాలనుకున్న ఎన్‌.టి.రామారావు గారి కోరిక తీరలేదు.

  ఆయన సాహిత్య నేపథ్యం గురించి……[వేటూరి మాటల్లో]

  “మా తాతగారు వేటూరి సుందరశాస్త్రి గారు మంచి పండితుడు. ‘ కదళి మహత్యం ‘ అని వో గ్రంథం రాసారు. మా కళ్ళేపల్లి పై రాసిన గ్రంథమది. నా గురువు, ఆత్మగురువు నా తండ్రిగారైనటువంటి చంద్రశేఖరశాస్త్రి గారు. ఆయన వొడిలోనే తొలి అక్షరాలు దిద్దాను. మా అమ్మ కమలాంబ. నా సరస్వతి. నా సమస్త అక్షరం. అమ్మవాక్కు, నాన్నదీవెనలే నా జీవన చేతనకు పునాదులు. మా పెదనాయిన వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. గొప్ప శాసన పరిష్కర్త. తెలుగు భాషా సాహిత్యాలపై నాకు మమ కారం ఏర్పడడానికి మా పెదనాన్న వేటూరి ప్రభాకరశాస్త్రి, కవి సమ్రా ట్‌ విశ్వనాథ సత్యనారాయణగారు కారణం.”


 2. మెహెర్

  Never knew he wrote a novel. Thanks for introducing. Timely tribute.


 3. ఆరు నెలల నుంచీ ఈ పుస్తకం గురించి రాయాలని…. ఇంటికి వెళ్ళీన ప్రతిసారీ రాయటానికి తెచ్చుకుందాం తెచ్చుకుందాం అనుకుంటూనే బధ్ధకిస్తూ వచ్చాను. నాన్నగారి దగ్గర ఉన్న పుస్తకాల్లో నేను చిన్నప్పటి నుంచీ చూస్తూ…అప్పుడప్పుడు మళ్ళీ మళ్ళీ చదివిన పుస్తకం ఇది. ముఖ్యంగా ప్రకృతి వర్ణన చాలా బాగుంటుంది. ప్రేమ కధ మనసును హత్తుకుంటుంది. బాగుందండీ పరిచయం. కానీ మీరన్నట్లు ఇప్పుడు ఈ పుస్తకం దొరుకుతుందో లేదో అనుమానమే..


 4. Rao S Vummethala

  Veturi gaari ee rachana gurinchi naaku ippude telisindi.
  Thank u so much.
  Nizamgaa ee samayamlo aayanaku idi manchi nivali.


 5. Vaidehi Sasidhar

  అవును.ఆయన పాటలు వింటూనే పెరిగాం.ఒకప్పుడు ఆయన పాటలేని సినిమా లేదేమో.
  ఆయన రాసిన కొన్ని పాటలలో గొప్ప సాహితీ స్థాయి ఉన్న కవిత్వం ఉండటం నిజం.
  ఈ పుస్తకం గురించి వినలేదు .కోట్ చేసిన వాక్యాలు బావున్నాయి. ముఖ్యంగా మొదటి,చివరి వాక్యాలు.
  చాలమందికి తెలియని ఆయన తొలి రచనను ఈ సమయం లో పరిచయం చేయటం అప్రాప్రియేట్ గా ఉంది.

  వేటూరికి నివాళి.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0