నిరుడు చదివిన పుస్తకాలు

రాసిన వారు: స్వాతికుమారి బండ్లమూడి
**********************
పుస్తకాలు చదవడంలో మనిషికో పద్ధతి ఉంటుందేమో! నామటుకు నాకు అప్పుడున్న మానసిక స్థితిని బట్టి, సమయాన్ని బట్టి ఆ సమయానికి ఏది చదవబుద్ధేస్తే అది తిరగెయ్యడమే. ఎక్కువగా ప్రయాణంలోనో,వేరే పనిలేనప్పుడో చదువుతుంటాను కాబట్టి నచ్చిన వాక్యాలూ, విషయాలు పనిగట్టుకుని రాసిపెట్టుకోవడమో, గుర్తుంచుకోవడమో పెద్ద అలవాటు లేదు. అందుకే ఏడాది పొడుగునా చదివినవి శాస్త్రీయంగా పరిచయం చెయ్యాలంటే అయ్యేపని కాదు. కాకపోతే వాటిపేర్లు, అవి చదివినప్పటి అనుభూతి అడపా దడపా ఒకటీ అరా వాక్యాలు మాత్రం కొద్దిగా పంచుకోగలను. గత ఏడాదిలో నేను చదివిన పుస్తకాల వివరాలు ఇవీ;

మహాప్రస్థానం

అవును. ఇన్నాళ్ళూ చదవలేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా పొరపాట్న దీన్లో కవితలు వినడమూ, చదవడమూ తప్ప పనిగట్టుకుని పుస్తకం చదివిందిప్పుడే. ఆ మధ్య ఒక స్నేహితుడు శ్రీశ్రీ గురించి మాటాడుతూ “గర్జించు రష్యా, గాండ్రించు రష్యా. ఆహా రష్యా! ఓహో రష్యా… అసలు రష్యా గర్జిస్తే గాండ్రిస్తే మనకెందుకు?” అన్నమాటలు గుర్తొచ్చాయి. ఈ సంకలనంలోని కొన్ని పేజీలు ఆవేశపు పలవరింతలు, పదాల్ని పలువిధాలా పైకీ కిందకీ గిలకొట్టి బుస్సుమనిపించే గారడీ సోడాబుడ్లు. కానీ ఆ ఆవేశాన్ని కాసేపు కలవరించాల్సిందే, పదాల ఫీట్లను పుక్కిటపట్టాల్సిందే. అప్పుడప్పుడూ కవిత్వం ఇచ్చే షాక్ కి దిమ్మెరపోవాల్సిందే. బాగా పేరున్న పుస్తకమే కానీ దీనికన్నా ‘ఖడ్గసృష్టి’లోని కవితలు కత్తుల్లా అనిపిస్తాయి నాకు.

బుచ్చిబాబు కథలు

మొదటి సంపుటం చదివేశాను. ‘ఒహో, కథలు ఇలా కూడా ఉంటాయా! ఇలాటి కథలు తెలుగులో ఉన్నాయా!’ అని మొదట్లోనే అనుకుని చదవటం మొదలుపెట్టాకా అలాటి ఆశ్చర్యార్ధకాలు మరిన్ని చేర్చుకోవాల్సొచ్చింది. ఎవరైనా చదవదల్చుకుంటే జాగ్రత్తగా చదవండి. అంటే రోజుకో కథకన్నా ఎక్కువ కాకుండా, అజీర్ణం సమస్య ఉన్నవాళ్లైతే మరింత జాగ్రత్త. వాటిల్లో అర్ధం కానివికొన్ని ఉన్నాయి కానీ నచ్చనివి లేవు. చాలాసార్లు ముగింపు గురించిన చిన్న క్లూ కూడా ఇవ్వకుండా ‘మీతిప్పలేవో మీరు పడండి’ అని నాలాటి బద్ధకస్తుల్ని నట్టేట్లో ముంచేస్తాడు రచయిత. ఈ కథల్లో కథకులు తెలివిగా, అనుభవంతోటీ ఎప్పటివో సంగతులు, ఏవో జ్ఞాపకాలు పిచ్చాపాటీలా చెబుతున్న భ్రమ కలిగించి – పూర్తి చేసేసరికి గొంతులో ఒక విషాదపు జీరతో, తీర్చుకోటానికి ఇష్టపడని తీవ్రమైన కోరికల్ని నొక్కిపట్టడంలో ఏదో తెలీని పరిపూర్ణతని అనుభవిస్తూ తెర వెనక్కెళతారు. ప్రతీకథలో వింతగా అనిపించే శైలీ, గొప్పగా అనిపించే భావుక తాత్వికత ఏదో ఒక రూపంలో ఉన్నానాకు బాగా గుర్తొచ్చేది మాత్రం ‘మేడమెట్లు’ కథ. అనారోగ్యానికి స్థలం మార్పుకోసం ప్రకృతికన్నా మనుషులు తక్కువుండే ఏదో చోటుకెళ్ళిన కథకి ఆ నిర్జన ప్రదేశాల్లో తిరుగుతూ చెట్లలో, కోనల్లో భాగమయిపోయిన ఒక మనిషి తారసపడతాడు. అతనిలోని గంభీరతకి, అంతుచిక్కనిలోతుకి, అందుకోలేని ఎత్తుకీ ప్రతీకగా అతన్ని ‘కొండయ్య’ అని పిలుచుకోవడం సమంజసమే అని నమ్మేంతలో అతనొచ్చి నాపేరు ‘దౌర్భాగ్యుడు’ అని చెబుతాడు. శ్రోత అనాసక్తితో పని లేకుండా అతని కథ అనంతంగా చెప్పుకుంటూనే ఉంటాడు. ముగింపు నాటకీయంగా, బుచ్చిబాబు తరహాలో ఎప్పటికీ మూసిపెట్టిన రహస్యంలాగ ఉన్నా, ఆ ముగింపుతో సంబంధం లేకుండా కూడా కథ పూర్తిజీవితపు అసంతృప్తి తాలూకూ భారాన్ని దుఃఖరహితంగా మనలోకి ప్రసరిస్తుంది. రెండవ సంపుటం కోసం ఎదురుచూట్టం కన్నా ఇంతకంటే మాట్టాడటం అనవసరం.

హంపీనుండి హరప్పా దాకా

ఒకేసారి పట్టుబట్టి చదివి పక్కన పడేసే రకం కాదిది. అసలు జీవిత చరిత్రలంటేనే అలా ఉంటాయేమో. ఫిక్షన్ కన్నా జీవితంలో ఉండే డ్రామా ఎక్కువ అని కాల్పనికాన్ని రొమాంటిసైజ్ చేసే ఉద్దేశంతో కాదు కానీ, కథల్లాగా ఊపిరి బిగబట్టించి, మెలికల్తో, మలుపుల్తో మధ్యలో దిగిపోలేనంత వేగమైన ఎమోషనల్ స్పీడ్ తో జీవితమూ, జీవిత చరిత్రలూ ఉండవు. అలా ఉండకపోవటమే వాటిల్లోని ఆకర్షణ. కథల్లో ఏ వివరాలూ, సన్నివేశాలూ ఐతే కథనాన్ని మొద్దుబార్చి, కోతలకు గురవుతాయో; సరిగ్గా అటువంటివే గతకాలపు జ్ఞాపకాలుగా వినేటప్పుడు – వేపచెట్టుకింద నులకమంచం మీద వేసవి రాత్రిలా నిండుదనంతో, తరాల మధ్య హుందాగా ప్రవహిస్తున్న అనుభవసారపు పంటకాలవ పాయల్లాగా ఆహ్లాదింపజేస్తాయి. ఇది సైన్సు, ఇది చరిత్ర, ఇదిగో లోకజ్ఞానం, ఇలా ఉంటాయి బాబూ ఆపదలు, అవసరాలూ, ఒడిదుడుకులూ అని దేనికది శాస్త్రాలుగా, సబ్జెక్టులుగా, సెమినార్లుగా మారకముందు కాలపు సహజత్వపు ఆనవాళ్ళు – కేవలం పాతలోని వింత మూలంగా మాత్రమే గొప్పగా అనిపిస్తాయన్నమాట నిజంకాదు. ఇంకా చెప్పడానికి – ఏదీ నేనింకా పూర్తిగా చదవందే. చెప్పానుగా అప్పటికప్పుడు చదివేసేది కాదు, ఎప్పటికప్పుడు చదవడానికెంతో కొంత మిగుల్చుకుంటూ ఉండవలసింది అని.

Crime and punishment

దాస్తోవిస్కీ పేరు చాలా చోట్ల వినపడ్డమూ, ఏదో ఇంగ్లిష్ సినిమాలో ఈ పుస్తకం ప్రత్యేకంగా సంభాషణల్లోకి రావడమూ వగైరా చూస్తే గిట్టుబాటయే వ్యవహారంలానే అనిపించింది. చాలాచోట్ల నిటారుగా కూచోబెట్టి చదివించే కథనం. కళ్ళతో చూడ్దం కాదు, ఆ పాత్రలే మనమేమో అనే భ్రమ కల్పించేంత పకడ్బందీగా ఉంటుంది అల్లిక. ప్రధానపాత్రధారి చెప్పుల్లో చదువరి కొన్నాళ్ళు దూరి అతను తిరిగిన స్థలాలూ, అనుభవించిన ఆందోళన వందశాతం ఫీలవచ్చు. తను చేసిన నేరం ఎవరికీ తెలిసే అవకాశం లేదని రుజువైపోయాక అసలా పని చేసింది తనే కాదని మనస్పూర్తిగా నమ్మగలిగితే, ఆ మానసిక ప్రవృత్తిని తేలిగ్గా అర్ధం చేసుకోవచ్చు. అక్కడే వచ్చింది చిక్కంతా; తను ఉద్దేశపూర్వకంగా, పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన దారుణమైన ఘోరాన్ని ఇక ఎవరూ కనిపెట్టలేరని అర్ధమౌతున్నకొద్దీ రాస్కోల్నికొవ్ (ఈ కథలో ప్రధాన పాత్ర) కు అసహనం ఎక్కువైపోతుంది. తన నేరం రుజువు చేసుకోవడానికి తద్వారా అతను అనుభవిస్తున్న అపరాధభావన, అనిశ్చితి నుండి బయటపడ్డానికి అనుక్షణం తపిస్తూ ఉంటాడు. చట్టం ద్వారా వచ్చే శిక్షకి, నేరస్తుడు మానసికంగా కోరుకునే శిక్షకి ఉండే వ్యత్యాసాన్ని ముందుమాటలో వివరిస్తాడు రచయిత. ఇదే కాకుండా రచయిత కథకుడిగా రాసే కథల్లోనూ, మూడో వ్యక్తిగా కథను చూడవలసిన సందర్భాల్లోనూ ఉన్న తేడా గురించి ముందుమాటలో ఇచ్చే వివరణ బోనస్.

మార్గదర్శి

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారిని ఈ పుస్తకంతోనే పరిచయం చేసుకున్నాను. మొదటి కథ చదువుతూ అక్కడక్కడా ‘అబ్బా!చాదస్తం, పోనిద్దూ!మరీ చాందసం’ అనుకుని పక్కన పెట్టి మళ్ళీ చాన్నాళ్లకి తెరిచి త్వరత్వరగా పూర్తిచేసిన పుస్తకం. తెలుగు వాళ్లలో పాశ్చాత్య వాదాలూ, సాహిత్యమూ ప్రభావితం చెయ్యని రచయిత అని శాస్త్రి గారి గురించి అంటూ ఉంటారు. తెలుగుతనం తక్క మరోటి ఎరగని కల్తీలేని మనిషిలా కనిపిస్తారు. చిక్కదనం స్పష్టంగా కనపడే నుడికారమూ, భాషా, హాయిగొలిపే నడక, ఇట్టే గొంతుదిగిపోయే కథా వస్తువులు.. వీటికోసం శ్రీపాదని చదవాలి.

పెళ్ళీ-దాని పుట్టుపూర్వోత్తరాలూ

తాపీ ధర్మారావు గారి మిగతా పుస్తకాల్లాగే చరిత్ర, సంస్కృతి, మూలాలు క్లుప్తంగా చర్చిస్తూ వివాహవ్యవస్థలోని రకాలు, రూపాలు, రూపాంతరాలు గురించి ఒక విహంగ వీక్షణాన్నిస్తుంది. పెళ్ళికి సంబంధించి మనకున్న నమ్మకాలు, నిశ్చితాభిప్రాయాల విలువలు ఒక్కసారి మననం చేసుకుని ధృవీకరించుకోవలసిన అవసరం కల్పిస్తుందీ పుస్తకం.

The Defence

జీవితాన్ని చదరంగం అనుకుంటే ప్రత్యర్ధి ఎత్తేమిటో, దాని ద్వారా ఆశించిన పావు ఏమిటో తెలీకుండానే అనుక్షణం ఆడుతూ ఉండాలి. కళ్ళు తెరిచి కూడా ఫలితం అనూహ్యమైన ఈ ఆటతో పోలిస్తే కళ్లకి గంతలు కట్టి చెస్ ఆడ్డమే సులువుగా భావించే రాటుదేలిన ఆటగాడి(లూజిన్) కథ ఇది. ఊపిరి బిగబట్టటాలు, వెన్నుపూస జలదరించడాలూ, కళ్ళు దయాసముద్రాలవ్వటాలూ ఏమీ లేకుండానే ఆసక్తిగా చదివించగల నవల. నబకోవ్ వి చిన్న వ్యాసాలు, ఆయన శైలి మీద రివ్యూలు తప్ప పూర్తిస్థాయి పుస్తకం చదవడం ఇదే. నాకు ప్రత్యేకంగా నచ్చినవిషయాలు, కథా వాతావరణాన్ని సృష్టించడంలో, పరిసరాల్ని వర్ణించడంలో రచయితకున్న ఆసక్తి, క్షుణ్ణమైన పరిశీలన. కథలో చెప్పిన ఇంట్లో తను ఉన్నట్టు నమ్మించుకుంటేకానీ అంత చిన్నపాటి వివరాల్ని కూడా వదలకుండా ఇవ్వడం సాధ్యం కాదు. పాత్రల మనోగతాలను వాస్తవికంగా వివరించడం తప్ప భావావేశాలను రచయిత పనిగట్టుకుని పాత్రలపైనా, పాఠకులపైనా రుద్దే సందర్భాలు పెద్దగా కనిపించవు.
ఇకపోతే రుచి చూపించడం కోసం రెండు ముక్కలు;

“He found therein deep enjoyment: one did not have to deal with visible, audible,palpable pieces whose quaint shape and wooden materiality alwaysdisturbed him and always seemed to him but the crude, mortal shell of exquisite, invisible chess forces. When playing blind he was able to sense these diverse forces in their original purity. He saw then neither the Knight’s carved mane nor the glossy heads of the Pawns — but he felt quite clearly that this or that imaginary square was occupied by a definite, concentrated force, so that he envisioned the movement of a piece as a discharge, a shock, a stroke of lightning — and the whole chess field quivered with tension, and over this tension he was sovereign, here gathering in and there releasing electric power.” – nabakov

బ్లైండ్ చెస్ ఆడేటప్పుడు పావుల భౌతిక రూపాన్ని చూడలేకపోవడం వల్ల ఒక అంతరాయం తొలగిపోయి, కేవలం వాటి వాటి శక్తిని మాత్రం దృష్టిలో ఉంచుకుని లూజిన్ వాటిని నలుపు తెలుపు స్థానాల్లో ప్రతిక్షేపించిన సందర్భంలో కింది వాక్యం లోని షాపనార్ Objectification of will కు ఇదొక మంచి ఉదాహరణ అనిపించింది. (శరీరం స్థానంలో పావుల్ని ఊహించుకుంటే).

“Just as little does the physiological explanation of the functions of the body detract from the philosophical truth that the whole existence of this body and the sum-total of its functions are only the objectification of that will which appears in this body’s outward actions in accordance with motives.” – Arthur Schopenhauer

అతను చదరంగంలో ఎంతగా మమేకమవుతాడంటే, చివరికి తలనొప్పి కూడా తల మొత్తంలో కాకుండా నలుపు చతురస్రాల ఆకారంలో వస్తున్నట్టుగా అనిపిస్తుంది. టోర్నమెంట్ వాయిదా పడి హాల్ లో అందరూ వెళ్ళిపోయాక ఆ గది లో ఉన్న ప్రతి వస్తువు తను ఉన్న స్థానానికి చెక్ చెబుతున్నట్టుగా, తన హోటెల్ గదిలోంచి దూరంగా కనిపిస్తున్న పోల్ మీదకి యే పావు ఐతే గెంతగలదు అని ఆలోచిస్తూ ఉంటాడు. కాకపోతే ఇదంతా మరేదో అనివార్యమైన, భయానకమైన అనుభవాల్నుండి పారిపోవడానికి తనని తాను నిమగ్నం చేసుకోవడమే తప్ప, మిగతా ఆసక్తులని, అభిరుచుల్నీ, సంతోషాల్నీ అధిగమించిన ప్రేమ మాత్రం కాదు. కళనో, ఆటనో నిజజీవితం నుండి పారిపోవడానికి అనువైన రహస్యస్థలంగా మార్చుకుని అదెంత విసిగించినా, బాధపెట్టినా మనస్పూర్తిగా చరించగల మరో చోటు దొరకని దీనావస్థలో – బ్రతుకుకంటే ముందే జీవించడాన్ని అంతం చేసుకునే దురదృష్టవంతుడి దృష్టాంతంగా అనిపిస్తుంది.

గుంటూరు శేషేంద్రశర్మ కవిత్వం

నిదురించే తోటలోకి నిశ్శబ్ధంగా వచ్చి కమ్మని కలలిచ్చే పాటలాంటి కవిత్వం శేషేంద్ర గారిది. లలితమైన లయతో ఆహ్లాదంగా నడిచే ఆయన కవితాపంక్తులు కొన్ని..
“హృదయ విపినాన్ని ప్రేమజ్వాల రగిల్చింది.
సంధ్య కొండలలో పశ్చిమాన్ని దహించింది.”

“నేనొక నవకోకిలనై జీవన తరుశాఖల్లో
తియ్యటి రాగాలొలుకుచు తిరిగిన ఆ రోజుల్లో”

“జీవకాంతుల్లేని శిశిర శిధిలాంగాల
హిమసమాధులమీద సుమసమూహంచల్లి
నవవసంతోదయం నాట్యమాడింది.”

అల్పజీవి

బహుశా రావిశాస్త్రిగారిది నేను చదివిన ఏకైక రచన. కిండెల్ లో ఒక్కరోజులో చదివేసిన మొదటి పుస్తకం. ఇదివరికే ఎవరో అన్నారు ‘అసమర్ధుని జీవయాత్రలో సీతారామయ్య పాత్రలాంటిదే ఇందులో కూడా’ అని. ఒకరకంగా అవుననవచ్చు. ఏకబిగిన చదివించేసే నవల. చదివేస్తే ఒక పనైపోతుంది.

అల్పజీవి పై పుస్తకంలో వచ్చిన వ్యాసం ఇక్కడ.

బీరకాయపీచు

కొడవటిగంటి కృష్ణమూర్తిగారని.. నాకూ తెలీదు ఎవరో. స్నేహితుల నుంచి సాఫ్ట్ కాపీ వచ్చిందీ కథా సంకలనం. మంచి శైలి, టెక్నిక్ ఉన్న కథలు. రచనాకాలం 1947.

రాముడీకి సీత ఏమౌతుంది?

వెటకారంగా అనటం లేదండీ! పుస్తకం పేరే అది. రామాయణం మనకే కాదట, చాలా దేశాల్లో వేర్వేరు పేర్లతో కొద్దిపాటి కథ, పాత్రల మార్పులతో ఉందట. ఆరుద్రగారు చెప్పారు. మనం రామాయణం అని పిలుచుకుంటున్న ఇతిహాసం ఎక్కడెక్కడ ఎలా చెలామణిలో ఉందో తెలుసుకోవడం ఆసక్తిగానే ఉంటుంది.

మ్యూజింగ్స్

ఒక్కసారే, ఒకేసారి చదివి మర్చిపోవడమో, గుర్తుంచుకోవడమో చెయ్యలేం కొన్నిటిని. ఎప్పటికప్పుడు చదువుతూ, పూర్తి కానివ్వకుండా అలా అట్టేపెట్టేసుకుని చాన్నాళ్లపాటు సాగతీసుకుంటూ చదువుకోవడమే బావుంటుంది.

చలం

ఆత్మకథ. చిన్న పుస్తకమే కానీ రచయితగా కాకుండా వ్యక్తిగా చలం ఏమిటి అనే విషయాన్ని మొహమాటం లేకుండా స్పష్టంగా చూపించేస్తుంది. కాకపోతే రచయితకి, వ్యక్తికి ఆట్టే తేడా ఉన్నట్టు కనిపించదు. జీవితం పొడవునా సాగిన అసహనం, అంతర్మధనం, ఎడతెగని వెతుకులాట, అన్నింటికన్నా తననితాను ఎక్కువ నమ్ముకున్నతనం కనిపిస్తాయి ఈయన వ్యక్తిత్వంలో.

రాలూ రప్పలూ

పుస్తకం పరిమాణం చూసి ‘ధర్మారావు గారిది ఇంతచిన్న జీవితమా?’ అనిపిస్తుంది. పూర్తి ఆత్మ కథ కాదు కానీ, ఎక్కువ భాగం ఆయన బాల్యమూ, చదువు మీద ఆపేక్ష, గురువులతో అనుబంధం, నాటకాలు, స్నేహాలు వరకూ వివరంగా ఉంటుంది. ఒక విధ్యార్ధిగా తాపీవారు ఏమిటి అని తెలుసుకోవచ్చు.

సముద్రం కథలు

తమ్మినేని భూషణ్ గారు కథలు రాశారని నేనూ అనుకోలేదు. ఉన్న కాసిని కథల్లోనూ వైవిధ్యం బావుంది. అక్కడక్కడా తన మార్కు కవిత్వం వచనంలోకి చొరబడి అందాన్నిస్తుంది. ఒక్కోచోట తీర్చలేని దిగులేదో గుండెకి గండి కొడుతుంది. చదివినంతసేపు పాతబెంగలేవో పలకరించి వెళ్తుంటాయి.

సముద్రం కథలు పై పుస్తకంలో వచ్చిన వ్యాసం ఇక్కడ.

సన్నపురెడ్డి కథలు

సీమ మాండలీకంలో చాలా కథాసంకలనాలు వచ్చాయి కానీ, కేవలం మాండలీకం కోసమో, రాళ్ల కరువుని ప్రధానంగా చిత్రించడమో మాత్రమే ఛేశాయి ఎక్కువశాతం. వాటికి భిన్నంగా చక్కటి వస్తువైవిధ్యంతో, చదివించే శైలితో సీమ రైతుని కేవలం కరువు గీటురాయి మీదే కాకుండా, భావావేశాలు, ఆత్మీయత, సరదా సంతోషాలూ కలగలసిన పూర్తిస్థాయి మనిషిగా చూపించిన కథలు.

నేనూ- చీకటి

కాశీభట్ల నవల. ఆద్యంతమూ విషాదస్వరంలో సాగుతూ, జీవితం మీదో, లోకం మీదో తీరని కసిని మోసుకుంటూ మూర్తీభవించిన దైన్యాన్నీ, హైన్యాన్నీ సాక్షాత్కరింపజేస్తుంది. కాశీభట్ల గారి ఇతర రచనల్లాగానే ప్రతిభావంతంగా మలచబడ్డ నవల.

శ్రీశ్రీ కథలు, అనువాద కథలు

‘ఈయన కథలూ రాశారన్నమాట’ అనుకుంటాం మొదట వినగానే. ‘కవితలకంటే బాగా రాశారే’ అనిపిస్తుంది చదివేశాక. వ్యంగ్య ధోరణిలో సాగే కథలు ఈయన శైలికి బాగా నప్పాయి అనిపిస్తుంది. అనువాద కథల్లో ఎక్కువగా ‘విలియమ్ సారోయన్’ నుంచి తెలుగించినవి ఆకర్షణీయంగా ఉన్నాయి.

వేదాంతం

చలం కథల సంపుటి – దీన్లో వేదాంతమేం లేదు మరి. 🙂 కొన్ని కథలు బావున్నాయి. ‘గ్రహణం’ పేరుతో సినిమాగా వచ్చిన ‘దోషగుణం’ కథ ఈ సంపుటిలోనిది అని గుర్తు. ఆ కాలంలోని కొన్ని నమ్మకాల్లోని బోలుతనాన్ని ఉత్కంఠ తెగకుండా కథ చివరిదాకా నడిపించడం వల్ల చదివిస్తుంది.

తెలుగు కథకు జేజే

చాలా పెద్ద పుస్తకమే. పేరుమోసిన తెలుగు రచయితలందరివీ మచ్చుకో కథైనా తగుల్తుంది ఇందులో. మంచి సేకరణ.

ఆముక్త మాల్యద – పరిచయం

సీ.పీ బ్రౌన్ అకాడెమీ ప్రచురణ. ఆముక్త మాల్యద రచనా నేపథ్యం, కృష్ణదేవరాయల జీవిత సంగ్రహం, చారిత్రక వివరాలు తెలుసుకోదగ్గవి. క్లుప్తంగా కావ్య పరిచయమూ, విశేషాలు పరిచయమౌతాయి.

నేటికాలపు కవిత్వం – తీరుతెన్నులు

తమ్మినేని భూషణ్ గారు ఈ మధ్య కాలంలోని కవిత్వపు నడక, తీరూ వగైరా సంగతుల్ని కొందరు సమకాలీన కవుల కవితల్ని ఉదాహరణలుగా చూపిస్తూ చేసిన విమర్శ. కవిత్వానికి ఉందవలసిన లక్షణాలూ, ఉండకూడని ఆడంబరాలు, అనవసరపు బరువులూ వంటి వివరణలు కొత్తవారికి మార్గదర్శకంగా ఉంటాయి.

అనంతం

శ్రీశ్రీ సాహిత్య నేపథ్యం, ఆ నాటి కవిత్వపు ప్రస్థానం, ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలూ.. ఎందుకో సగం చదివాక ఆసక్తి పోయింది.

కొకు రచనా ప్రపంచం- మొదటి భాగం

ఈ భాగమంతా కథలే. మొదట్లోని కథలు మూస ధోరణిలో, మరీ తేలిగ్గా అనిపించినా పోను, పోనూ బాగానే అనిపిస్తాయి. కథావస్తువులు ఎక్కువగా విధవా పునర్వివాహాలు, సంఘ సంస్కరణ చుట్టూ తిరుగుతుంటాయి. క్లుప్తంగా కథ చెప్పెయడం కుటుంబరావుగారి ధోరణి. కొన్ని కథలు మాత్రం కొంచం భిన్నంగా అనిపిస్తాయి. ఇలా అనుకోగానే ఒక కథలో “దిక్కులేనివాడు కాదు అనాధ. ఏ దిక్కూ లేకుండా బ్రతకలేనివాడు అనాధ” అన్నమాట గుర్తొస్తుంది. చాలా కథల్లో లౌక్యమూ, లోకజ్ఞానమూ, గడుసుతనమూ ముగింపుని ఇచ్చేస్తూ ఉంటాయి.

కొ.కు.సాహిత్య వ్యాసాలు

తెలుగులో సాహితీప్రస్థానం గురించిన మౌలిక అవగాహనకోసం చదివితీరదగ్గ పుస్తకం.
ఈ వ్యాసాల్లోని కుటుంబరావు గారి అభిప్రాయాలు, అనుభవాలు కొన్ని మనమాటల్లో:
“రచయితలు కొన్ని సందర్భాల్లో పాఠకుడి తెలివితేటల స్థాయి ఎక్కువగా ఉన్నట్టు తను నమ్మినట్టు నటించాలి. మరీ స్కూల్ పిల్లాడికీ పాఠం చెబుతున్నట్టుగా వివరించటం మొదలెడితే పాఠకుడి అహం దెబ్బ తినచ్చు.”

“రచనలో శైలి కి శిల్పానికి ప్రాధాన్యత ఇచ్చేవాణ్ణి మొదట్లో. ఎంతగొప్ప విషయమైనా సరైన శైలి లేకుండా చెబితే ఆ రచన నచ్చేది కాదు. టెక్నిక్ బావున్న కథల్లో సరైన ఇతివృత్తం లేకుండా కూడా రాయ ప్రయత్నించాను. కానీ కాలక్రమేణా కథల వల్ల సాధించదగ్గ సామాజిక ప్రయోజనమేదో ఉన్నట్టు తోచింది. ఎంతో కొంత అభ్యుదయం రచనల ద్వారా సాధించాల్సి ఉందనిపించింది.”

“గురజాడ రచనల్లో ఎక్కడో ఆకాశం లోనో, రాజాంతఃపురాల్లోనో ఉన్న కథాంశాలను, పాత్రలను సగటు మనిషి స్థాయి తీసుకొచ్చారు. ఏ చిన్నపాటి అభూత కల్పనని కూడా ఆయన పాత్రలు సహించలేవు.”

“చలం మొహమాటాల్లేకుండా నిజాయితీగా అందరి మనసుల్లోనూ, జీవితాల్లోనూ ఉండే అసంతృప్తి ని, సౌందర్య రాహిత్యాన్ని తన రచనల్లో శాపనార్ధాలు పెట్టాడు. అది చాలామంది బయటికి ఒప్పుకోలేని వాస్తవం. ఆవేశాన్ని, భావోద్వేగాల్నీ యధాతధంగా రాయగల సహజ రచయిత ఆయన. వ్యావహారిక భాషని వీలైనంత సహజంగా రాసిన సింప్లిసిటీ కూడా అయనదే. చలం వాక్యాలు కొన్ని కొద్దిగా జాగ్రత్త పడుంటే భాషా పరంగా మెరుగ్గా ఉండేవనిపిస్తుంది.”

– ఇప్పటివరకూ ఉన్న రచయితలతోనూ, రచనలతోనూ పూర్తిగా తృప్తి చెందకపోవటం వల్లే తను కథలు రాయటం మొదలెట్టవలసి వచ్చిందని చెప్పుకుంటారొకచోట. ప్రతి మనిషి తనలోకి, తన చుట్టూ ఉన్న మనుషుల మనసుల్లోకీ, వారి పరిస్థితుల్లోకి తొంగి చూసి అర్ధం చేసుకోవలసిన అవసరం ఉందనీ, ఆ ఆత్మ విమర్శని, ప్రశ్నించుకునే తత్వాన్ని నిజ జీవిత పాత్రలకు, సంఘటనలకూ దగ్గరగా ఉండే కథల ద్వారా పాఠకుడికి అలవాటు చెయ్యటం అవసరమని కొకు అభిప్రాయం.

– ఇంగ్లీషు భాష తెలుగుని/తెలుగు సాహిత్యాన్ని నాశనం చేస్తుందంటే అది ఎంత మాత్రమూ నిజం కాదంటారు. అలాంటి నష్టమేదైనా జరిగితే అది గ్రాంధిక భాషపై వ్యామోహం వల్లే జరుగుతుందని గట్టిగా అభిప్రాయపడ్డారు. హిందీలోను, ఇతర భారతీయ భాషల్లోను వచ్చినంతగా వైవిధ్యమైన అంశాల మీద తెలుగులో కథలు రాలేదని అన్నారు.

– మరో ప్రపంచం అనే భావన ప్రతీ రచయితకీ/కళాకారుడికీ ఆ మాటకొస్తే ప్రతీ మనిషి కీ సంబంధించినది. ఇప్పుడు తమ జీవితాల్లో లేనిదీ, ఉండే అవకాశం లేనిదీ ప్రతిదీ మరో ప్రపంచానికి సంబంధించిన విషయమే. అసలు ఇప్పుడున్న ప్రపంచంతో సంతృపి పడిపోవటమంటే అది కేవలం జడత్వం అని నిష్కర్షగా చెప్పారు.

కళ్యాణి

చలం కథల సంపుటి. రేడియో కళాకారిణి కళ్యాణి ఉన్నట్టుండి ఎవరికీ ఆచూకీ తెలీకుండా ఒక అజ్ఞాత ప్రపంచంలోకి వెళ్ళిపోయిన కథతో మొదలై ఒకదానికొకటి భిన్నమైన వస్తువులతో మరిన్ని కథలతో సాగుతుంది.

కుండీలో మర్రిచెట్టు

విన్నకోట రవిశంకర్ గారి కవితా సంకలనం. ఆడంబరాలకి అతీతంగా, భావస్పష్టతకి ప్రాధాన్యతనిస్తూ హృద్యమైనశైలిలో ఉన్నాయి కవితలు. మచ్చుకి కొన్ని వాక్యాలు.

“చిగిర్చడం కోసం
చివరి ఆకునీ రాల్చేసే
చెట్టుకున్న మనోధైర్యం
మనకు లేదు.”

“ప్రకటించలేక,
పాతిపెట్టిన వందల మాటల్ని
ఒక్క మౌనరోదన వర్షిస్తుంది.
సున్నితమైన జ్ఞాపకాల వేలికొసల తాకిడికి
శ్రుతిచేసిన వీణలా ఆమె ధ్వనిస్తుంది.”

కళాపూర్ణోదయం

ఈమాట గ్రంధాలయంలో వచనరూపంలో ఉంది. కథలో ఉపకథలు, గొలుసు కథలు శాపాలూ, వరాల మధ్య ఎక్కడ మునిగి ఎక్కడ తేలతామో గమనించలేము. రచనా వైచిత్రిని అస్వాదించడమూ, మన జ్ఞాపకశక్తికి పనిచెప్పడమూ ఒకేసారి చెయ్యొచ్చు.

విరాట్ – స్టీఫెన్ త్వైక్

భారతీయ తాత్వికత ప్రభావంతో ’కర్మయోగం’ అనే భావానికి కథారూపమైన వివరణలా ఉంటుందీ చిన్న నవలిక. ప్రపంచ జ్ఞానం, ఆత్మ జ్ఞానం – ఈ రెంటి మధ్యా సాగిన ప్రయాణం అందులోని అనుభవాలుటిరిన సందిగ్ధాన్ని మించి పెరుగుతున్న తీర్చుకోలేని సందేహాలు ఇదీ క్లుప్తంగా కథా సారాంశం. “నీ కర్మలన్నిటికీ నువ్వే కర్తవు కాదు” అనే సందేశాన్ని అంతర్లీనంగా చూపించారు రచయిత.

విరాట్ పై పుస్తకంలో వచ్చిన వ్యాసం ఇక్కడ.

మధురాంతకం రాజారాం కథలు – 4,5
చెప్పేదేముంది. ఎన్నిసంపుటాలున్నా ఎక్కువకాదు. నిశ్చింతగా, కులాసాగా చదువుకోవచ్చు.

———————–
* ఇవి కాక, చదివిన మరి కొన్ని పుస్తకాలు;

కాశీభట్ల వేణుగోపాల్ కథలు
ఆలూరి బైరాగి కథలు
బంజార -ఇక్బాల్ చంద్ కవిత్వం
నిశ్శబ్ధంలో నీ నవ్వులు -తమ్మినేని యదుకుల భూషణ్
కోతి కొమ్మచ్చి – ముళ్ళపూడి రమణ
తెలుగు కథానికలు
చిల్లర దేవుళ్ళు -దాశరధి రంగాచార్య
రెండో పాత్ర – విన్నకోట రవిశంకర్

You Might Also Like

7 Comments

  1. sesha kumar kv

    Prayanaalu chesthoo inni manchi pusthakalu chadivina Swathi garu! Meeku abhinandana sahasralu! ‘Sri Sri’ gaari MAHA PRASTHANAM telugu kavitha rachanalo asadharana viplavam. Adi akkadakkada ‘Matala garadi’ anadam sababu kademo! Sri Sri gari tharuvathi rachanalu ‘Khadga srishti’,’Maro prashanaala’ kanna manchi kavithvam Maha prasthanam lo vunnadhani na nammakam. ‘Hampi nunchi Harappa daka’ oka nijayihi gala athmakatha.

  2. ramani

    “ఎప్పటికప్పుడు చదవడానికెంతో కొంత మిగుల్చుకుంటూ ఉండవలసింది అని.” పుస్తకం ఏదైనా కావచ్చండి , నాకు చాలా నచ్చింది మీరిలా ఎప్పటికప్పుడు చదవడానికి మిగుల్చుకోడం అని ఊటంకించడం.

    నిజానికి కాస్త అసూయ కలిగింది మీరు ఇలా పుస్తక పఠనా ప్రవాహాన్ని చెబుతుంటే. కాని చదువుతున్న కొద్దీ.. అరెరే! ఇది నేను చదివానే అన్న భావన. బాగుందండి ఈ కొత్త ఒరవడి. “మార్గదర్శి నిన్నే చదివా… కాదు కాదు విన్నాను. చాలా బాగుంది మీరు వినండి.

    http://kottapali.blogspot.com/2009/09/blog-post_25.html

  3. చౌదరి జంపాల

    1) నేనూ-చీకటికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందన్న విషయం నాకు తెలీదు. ఎప్పుడు వచ్చింది?

    2) కొడవటిగంటి కృష్ణమూర్తిగారి కథల పుస్తకం సాఫ్ట్‌కాపీ ఎక్కడ దొరుకుతుంది?

    3) అలాగే ఆలూరి బైరాగిగారి కథల పుస్తకం దొరికే వివరాలు కూడా ఇవ్వగలరా?

    నా ఇ-మెయిల్ అడ్రస్: cjampala@gmail.com.
    Thanks in advance.

  4. kcube

    అమ్మో ఇన్ని పుస్తకాలా అని ఒక మారు ఆశ్చర్యమేసింది. కదులుతూ చదివే అలవాటు నాక్కూడా వుంది. అలాగే పూర్తిగా మీ వ్యాసం చదివాలన్నా ఎక్కువ సమయం తీసుకోవాలి. కానీ మహాప్రస్థానం పై మీ అభిప్రాయంతో విభేదిస్తున్నా. నాటి హంగ్రీథర్టీస్ దశాబ్ధంలో శ్రీశ్రీ రాసిన అభ్యుదయ కవిత్వమది. అప్పటికి రష్యా అమెరికా తదితర దేశాల దాడినుండి కాపాడుకునే ప్రయత్నంలో సోషలిస్టు రష్యాగా ఆవిర్భవించిన కొత్త శిశువు గా తన సర్వశక్తులను ఒడ్డి పోరాడుతున్న సమయం. కవి విశ్వప్రేమికుడుగా తన ప్రాపంచిక దృక్పధానికి దగ్గరగా వున్నవాటిని ప్రేమించకుండా, కవిత్వం రాయకుండా వుండగలడా? అలాగే మరోప్రస్థానం కూడా చదవండి. శ్రీశ్రీ పామరజనం భాషలో రాసిన కవిత్వం వుంటుంది. కవిత్వాన్ని భూమార్గం పట్టించిన వాడు శ్రీశ్రీ..

  5. రవి

    ఇన్ని పుస్తకాలు చదివారా? వీరతాళ్ళు ఓ వంద.

  6. Indian Minerva

    మహా ప్రస్థానం నాక్కూడా అలాగే అనిపించింది మరి. ఖడ్గ సృష్టైతే ఏ కొన్నో తప్పితే మిగతావి అస్సలర్ధంకాలేదు :).
    Crime and Punishment?.. Should try.

  7. Independent

    “గొంతులో ఒక విషాదపు జీరతో, తీర్చుకోటానికి ఇష్టపడని తీవ్రమైన కోరికల్ని నొక్కిపట్టడంలో ఏదో తెలీని పరిపూర్ణతని అనుభవిస్తూ తెర వెనక్కెళతారు”

    “అదెంత విసిగించినా, బాధపెట్టినా మనస్పూర్తిగా చరించగల మరో చోటు దొరకని దీనావస్థలో – బ్రతుకుకంటే ముందే జీవించడాన్ని అంతం చేసుకునే దురదృష్టవంతుడి దృష్టాంతంగా అనిపిస్తుంది”.

    ఎంత బాగా చెప్పారు స్వాతీ!!

    అసందర్భమయిన ఇన్ ఫర్షనేమో..మీరు యు ఎస్ లో ఉంటే కనక బోర్డర్స్ వాడు నబొకోవ్, సాలింజర్ ల సెట్స్ 40% ఆఫ్ పెట్టాడు, మంచి బేరం :-). నిన్నే కొన్ని కొనుక్కొచ్చా. మీరూ నబొకొవ్ గురించి రాసారు కాబట్టి, ఆసక్తి ఉందేమో అని చెప్పానంతే

Leave a Reply