“బంజార” – ఇక్బాల్ చంద్ కవిత్వం

వ్యాసం రాసిపంపినవారు: బుడుగోయ్

ఈమాటలో అడపాదడపా చక్కని కవితలు రాసే కవి మూలా సుబ్రహ్మణ్యం పుస్తకం.నెట్లో రాసిన వ్యాసం చూసి  ఇక్బాల్ చంద్ కవిత్వం చదవాలన్న కుతూహలం కలిగింది.
ఆ వ్యాసంలో నన్నాకర్షించిన వాక్యం

“ఇక్బాల్‌చంద్‌ తన అస్తిత్వ వేదన నీ, ఆత్మలోకంలో దివాలానీ, అంతుపట్టని అన్వేషణనీ అద్భుతంగా ఆవిష్కరించారు తన ‘ఆరోవర్ణం’ కవితా సంకలనంలో…
నవీన జీవితంలోని అత్యంత సూక్ష్మమైన ప్రశ్నలకి ప్రతినిధిగా కనిపించే మహాకవి బైరాగి తన అస్తిత్వ వేదనని గానం చేసేందుకు శబ్ద కవిత్వాన్నే వాహకంగా వాడుకున్నాడు. ఆయన కవిత్వంలో నిశ్శబ్ద పద చిత్రాలు ఎక్కడా కనిపించవు. అయితే నిశ్శబ్ద పద చిత్రాలతో సైతం ఆ ఆవేదనని అంతే గాఢంగా ఆలపించొచ్చు అని నిరూపించాడు ఇక్బాల్‌చంద్‌.”

ఆరోవర్ణమంటూ కాస్త నెట్లో వెతికితే, గత దశాబ్ద కాలంలో ఎన్నదగ్గ విమర్శ రాసిన తమ్మినేని యదుకుల భూషణ్ వ్యాసం కనిపించింది.

“ఇక్బాల్‌ చంద్‌ కవిత్వంలో అంతుపట్టని సంఘర్షణ, ‘ ఆత్మలోకంలో దివాలా ‘ , అన్వేషణ, వడపోతా, అరుదుగా ఆశా, అశాంతి అన్నీ ముప్పిరిగొని కని పిస్తాయి. ఇతనిలో నన్నాకర్షించినది నిరాడంబర శైలి. అక్కడక్కడ పద్యకవుల్లో కనిపించే ‘నిర్గమ్య’  భాషాలౌల్యం, అసమతౌల్యం కొంచెం కుదిపినా, ఇటీవలి కాలంలో వచ్చిన కవిత్వంలో నిస్సందేహంగా ఇతనిది సొంత గొంతుక. అరుదైన అంతరంగ మధనం ,నిజాయితీ నిలువెల్లా వున్న కవి.”


భూషణే ఇలా మెచ్చుకున్నాడంటే తప్పక చదవాల్సిందే అని పుస్తకాలకొట్టుకి వెళ్ళితే ఇక్బాల్ చంద్ రెండో సంకలనం “బంజార” కనిపించింది.  అదీ పూర్వరంగం.

బంజార పుస్తకం సాంతం చదివాక పైఇద్దరి పొగడ్తలకూ ఇక్బాల్‌చంద్ నూటికి నూరుపాళ్ళూ అర్హుడేననిపిస్తుంది.  అస్తిత్వవేదనను, జీవితంలో అసంబద్ధతనూ ఇంత కొత్తగా ఆవిష్కరించిన కవి ఊహావైచిత్రి పాఠకులను అబ్బురపరచడం ఖాయం. దాదాపు ఏభై కవితలున్న ఈ సంకలనంలో సగానికి పైగా కవితలు కవి అంతర్మధనాన్ని వినిపించి,  ప్రతిభను ప్రదర్శించే కవితలు.
మచ్చుకు ..

“నన్ను
కొంచెం కొంచెంగా
చప్పరిస్తూ
మరణ వాంగ్మూలం
రాస్తుంది ఇది –

నా వీలునామాలో
ఏవో నాలుగు పద్యాలు తప్ప
మరేమి కంపించనందుకు
నన్ను
కాపలా కాసిన
ఈ గడియారాన్ని
అసహనంతో
లోకం శపిస్తోంది   (గడియారం. పు.5)”

బతికినన్నాళ్ళూ అనామకంగా దుర్భర జీవితం గడిపిన కళాకారులను మరణం తరువాత నెత్తికెక్కించుకొనే లోకం పోకడని ఎలా ప్రకటిస్తాడో చూడండి.
“కొన్ని చెట్లు
ఎండి రాలి, నిప్పంటుకొని రగిలాక
సుగంధ పరిమళ వ్యాప్తమవుతాయి
అవి సజీవంగా ఉన్నప్పుడు
లోకం
నిర్దయగా రాళ్ళు రువ్వేది  (పు.32 – కళా కారుడు)”

అలాగే లోకంలో ఇమడలేనివాడి మనోగతం వినండి.
“లోకం
కాలుతున్న కమురు
వాసన వేస్తోంది.

క్షణం సేపు
నిలవడానికి
చోటు లేని
ఈ నేల
ఒక పాడుబడిన
గబ్బిలశాల” (పు.50  – ఇమడలేనివాడు)

జిబ్రాన్ లాంటి తత్త్వవేత్తను ఒక కవిత్వవస్తువుగా ఎన్నుకోవడం సాహసం. ఎంతోమంది ఇలాంటి ఉదాత్త వస్తువులమీద రాయబోయి చతికిలబడటం చూస్తూనే ఉంటాం. కాని ఈ కవికి సత్తా ఉంది.

“సుఖ దుఖఃపు రాత్రీ పగళ్ళకు అందని
దివ్య సంధ్యలో ఎగుర్తోన్న మిణుగురుల
మత్తు కాంతి తారకలూ

నన్ను తూర్పూ పశ్చిమాల ఇరుదరులనూ తాకినట్లుగా
మార్మికపు ఊయలూపుతూ చూపుతోన్న సప్తలోకాలు__”   (పు. 46 – జిబ్రాన్ చిత్రాలు)

ఇక ఇక్బాల్‌చంద్ వాడిన కొన్ని పదచిత్రాలు చూడండి.

“ఎప్పటికీ తెల్లారని
మహాచీకటి ముఖరూపి ” (పు.56  – శాపగ్రస్తుడు)

“అలౌకిక వర్ణాల నాట్యం__

అవిశ్రాంత
మోహపూరిత
నిండు జీవన పాత్రిక” (పు.8 – సీతాకోకచిలుక)

“మూర్ఛ రోగి
కొట్టుకోవటం ఆగిపోయాక
నిద్రపోతున్నట్లుగా వుంది”  (పు.20 – వొర్షం వెలిసాక)

ఇలా చెబుతూపోతే ఇక్బాల్‌చంద్ కవిత్వపటిమను తెలియజేసే కవితలు చాలానే ఉన్నాయి. వెతుకులాట, బుల్‌బుల్, శిక్ష, రాయి, వొర్షం వెలిసాక -1,2, కొబ్బరి ఆకు, నిప్పురవ్వ ఈ సంకలనంలో ఇంకొన్ని మంచి కవితలు.

ఇక ఈ పుస్తకంతో నాకున్న ఇబ్బందుల గురించి కొంత.

1) 2002లో వచ్చిన భూషణ్ విమర్శ స్పష్టంగా చెబుతోంది.  “…అక్కడక్కడ పద్యకవుల్లో  కనిపించే నిర్గమ్య భాషాలౌల్యం, అసమతౌల్యం కొంచెం కుదిపినా..” అని. ఐతే పొగడ్తల మధ్య ఉన్న ఈ చిన్న విరుపును కవి గమనించినట్టులేదు. లేకపోతే

“దేహానికి
రెండు రెక్కలూ
మనసుకు కొంత
భావుకతా

అంతకు మించి
ఏమి కోరి ఉంటాను?
ఇది జన్మ పంజరం
ఎందుకీ శిక్ష…? ( పు.33 –  శిక్ష)”

అని అత్యంత సరళంగా హృదయవేదనను అక్షరీకరించగలిగిన కవి

“హిమ చైతన్య చలద్రూప మోహ పరవశ నీలి రధ
ఆషాఢ చంచల నర్తన శాల రోదసీ అలిగి
అగ్ని అంబరాన్ని అలంకరించుకొన్నట్లుంది
ఇక నాకు విహాయసానికి చోటెక్కడ?” (మేఘ ఘోష . పు.49) ,

“నేనో సౌందర్య మెరుపుని –
సంశయ డోలాయమాన కైలాసాన్ని-
అందుకేనేమో నాలో –
గుబులు ఊడల అరణ్యాల నిట్టూర్పులు”  (సాలమను గీతనాయిక – పు.31)

అంటూ ఎందుకు రాస్తున్నాడు. ఇస్మాయిల్ గురించి ఒక కవిత రాసేంత అభిమానమున్న కవి భాషను శుద్ధి పరచడంలో కవి పాత్రగురించి ఆయన చెప్పిన విషయాలను ఎలా విస్మరిస్తున్నాడు? ఈ విపరీత సమాసాలు, భాషాడంబరాలూ కవి సమ్మేళనాల్లో చప్పట్లు కొట్టించడానికీ, మేధతో వ్యాయామం చేయించడానికీ  పనికొస్తాయేమో గానీ, పాఠకుల హృదయపు పొలిమేరల్లో కూడా అడుగిడలేవు.

2) ఇక రెండో ఇబ్బంది మన ప్రస్తుత వ్యవస్థ వలన వచ్చింది. మన తెలుగుకవి కవిగా ఎంత సమర్థుడైనా ఒక్క కవి భూమిక నిర్వర్తిస్తే సరిపోదు. తనే తన సంకలనానికి ఎడిటర్, ప్రూఫు రీడరు, ప్రచురణ కర్తా అవ్వాలి. ఇక్బాల్ చంద్ ఇన్ని పాత్రలు పోషించడంతో ఈ పుస్తకం మంచి సంకలనానికి కావలసిన ముడిసరుకుగా ఉంది కాని గొప్ప సంకలనం కాలేకపోయింది.

సృజన చాలా కష్టమైన ప్రక్రియ. చాలా మంది కవులు కవిత రాయడాన్ని ప్రసవవేదనతో పోల్చారంటే ఆశ్చర్యం లేదు. అలాంటప్పుడు మనం రాసినదాన్ని మనమే నిష్కర్షగా తీసివేయలాంటే కష్టమైన పనే. ఇక్బాల్‌చంద్ ఆ పని సమర్థవంతంగా చేయలేకపోయారు.

ఈ పుస్తకం పాఠకుడి చేతిలో పడే ముందు మంచి ఎడిటర్ చేతిలో పడుంటే బాగుండేది.  అప్పుడు “శ్వేతీయ అబద్ధం” (పు.2) లాంటి అనువాద పదాలు,  సూఫీ కవిత్వాన్ని గుర్తు తెచ్చే మధుపాత్రల కవితలు, కవి శోభను ఏ మాత్రమూ పెంచని తఖల్లుస్ ప్రయోగాలు

“మీ నవ్వు
గులాం అలి గజల్ అనుకున్నానింత కాలం
కానీ ఇక్బాల్ అంటున్నాడిపుడు
ఇస్మాయిల్ గారూ!
కవి కన్నా ముందు
తుంటరి బాలుడు మీరు”  ( ఇస్మాయిల్ గారూ! – పు.17)

పరిహరించబడేవి. వచనం ఎక్కువై తేలిపోయిన “మృగయుడా..”, “మరోవయసు”, “మేఘఘోష “, “మై మిత్ర్” కవితలు నిర్ద్వంద్వంగా తీసివేయబడేవి.  “స్ట్రీట్ డాన్సర్”, “సాలమను గీతనాయిక”, “బంజార” (టైటిల్ కవిత ఎన్నుకోవడంలో ఇంత అజాగ్రత్తా?!!) లాంటి కవితలు కత్తిరింపులకు గురయ్యేవి. అలాగే “వర్షం వెలిసాక-3”, “నాంచారి”,  “మ్యూజియంలో ఆయుధాల గది” – వంటి కవితలు పక్కనబడి (ఈ కవితా వస్తువులపై ఇప్పటికే పలువురు పలుసార్లు రాశారు. కొత్త విషయేమున్నట్టు?) ఈ సంకలనంలో ఇక్బాల్ చంద్ గొంతు స్పష్టంగా ఉండేది.

ఏదేమైనా ఈ పుస్తకం చదివాక

“నా కల్లోల స్వరం వారికి వినిపించదు
లోకం పోకడ నాకు వంట బట్టలేదు” (పు.1)

అని వాపోయే కవి నుండి,

“వ్యర్ధ పదాన్ని
భరించలేని
కవిత్వం లానే
జీవిత రహదారి
రహస్యమైనదే కాదు
కరుకైనది కూడా__”

అన్న ఎరుకగలిగిన కవి నుండి ఇంకా మంచి కవిత్వం వస్తుందన్న విశ్వాసం కలుగుతుంది.

ఈ పుస్తకాన్ని కవిత్వప్రేమికులు తప్పకుండా చదవాలి. ఫీల్ గుడ్ కవిత్వానికి అలవాటు పడ్డ పాఠకులు మాత్రం దూరంగా ఉండండి.

“బంజార” – రచన : ఇక్బాల్ చంద్ – వెల 50/-
అన్ని ప్రధాన పుస్తకకేంద్రాల్లో దొరుకుతుంది. 

You Might Also Like

6 Comments

  1. పుస్తకం » Blog Archive » నిరుడు చదివిన పుస్తకాలు

    […] వేణుగోపాల్ కథలు ఆలూరి బైరాగి కథలు బంజార -ఇక్బాల్ చంద్ కవిత్వం నిశ్శబ్ధంలో నీ నవ్వులు -తమ్మినేని […]

  2. budugoy

    @ బాబా గారు,
    బంజారలో ఇక్బాల్ చంద్ గారు ఇచ్చిన వివరాలు:
    చిరునామా : డా. ఇక్బాల్ చంద్
    మసీదు రోడ్డు, సత్తుపల్లి, 507 303 ఖమ్మం జిల్లా.
    చె- 9441211765
    ఈ వివరాలు 2006లొ పుస్తకం ప్రచురించినప్పటివి. పుస్తకాఇకై సంప్రదించవచ్చునేమో. నేనైతే హైదరబాదులో నవోదయలో కొన్నాను

    @Independent: ఈ మధ్య పుస్తకం.నెట్లోనే మూడు-నాలు సార్లు చూశాను హైరోడ్డు అంటూ నిరసన వ్యక్తం చేయడం. care to elaborate? ఎవరైనా గట్టిగా ఒక స్టాన్సు తీసుకోకపోతే భిన్నాభిప్రాయాలకు చోటేది?

    @ మూలా గారు : ఆరోవర్ణం లో కూడా మంచి కవిత్వంతో బాటు ఈ గందరగోళాలున్నాయనిపించింది. ఏమంటారు?

  3. సుబ్రహ్మణ్యం మూలా

    చక్కని సమీక్ష . మనకున్న మంచి కవుల్లో ఇక్బాల్ చంద్ ఒకరు. అయితే నాకు “బంజార” కంటే “ఆరోవర్ణం”లో గొప్ప కవిత్వం ఉందనిపిస్తుంది. ఈ విషయాన్ని ఇక్బాల్ కూడా అంగీకరించారు.

    నా దగ్గర “బంజార” ప్రతులు కొన్ని ఉన్నాయి. బెంగుళూరులో ఉన్న మిత్రులు మెయిల్ ద్వారా సంప్రదిస్తే వారికి అందజేయగలను.

  4. Independent

    నాకు మీ రివ్యూలో బాగా నచ్చిన విషయమేంటంటే పాయింట్ (2) లో చెప్పిందే కాకుండా దానికి కొన్ని ఉదాహరణలు ఇవ్వటం కూడా.

    కొన్ని లైన్లు ఎంత అందంగా రాసాడో తను. ఉదా: “దేహానికి..”, “నేనో..”

    ఇంకొన్ని నాకు నచ్చాయి(కిందవి) కాని, నాకు ఈ సెల్ఫ్ ఇంపార్టెన్స్ జాఢ్యం మనకు(telugu) అంతో ఇంతో పేరున్న కవుల్లో ఎందుకింత కనపడుతుందో అర్ధం కాదు. పేరున్న(“పాపులర్” కాదు, క్రిటికల్లీ రికగ్నైజ్డ్) రచయితలూ, కవులే కాదు, ఇక్కడ కాస్తో కూస్తో బాగా పుస్తకాలు చదివి, మంచి రివ్యూస్/సమీక్షలు రాసే వాళ్ళల్లో కూడా ఈ హై రోడ్ జాఢ్యం బాగా కనపడుతూ ఉంటుంది. ఆ సో కాల్డ్ “హై థింకింగ్” ఉన్నంత మాత్రాన “కామన్ సోసైటీ”నీ, మిగతా అందరినీ లుక్ డౌన్ ఎందుకు చేస్తారో అర్ధం కాదు నాకు.

    Morning ranting 🙂

    “క్షణం సేపు
    నిలవడానికి
    చోటు లేని
    ఈ నేల
    ఒక పాడుబడిన
    గబ్బిలశాల” (పు.50 – ఇమడలేనివాడు)”

    “కొన్ని చెట్లు
    ఎండి రాలి, నిప్పంటుకొని రగిలాక
    సుగంధ పరిమళ వ్యాప్తమవుతాయి
    అవి సజీవంగా ఉన్నప్పుడు
    లోకం
    నిర్దయగా రాళ్ళు రువ్వేది (పు.32 – కళా కారుడు)”

    “నా వీలునామాలో
    ఏవో నాలుగు పద్యాలు తప్ప
    మరేమి కంపించనందుకు
    నన్ను
    కాపలా కాసిన
    ఈ గడియారాన్ని
    అసహనంతో
    లోకం శపిస్తోంది (గడియారం. పు.5)”

  5. bollojubaba

    wonderful review. well written.

    i tried find this book some time back.

    can you pl. give address where it can be get

Leave a Reply