నూరేళ్ళ తెలుగు నవల
తెలుగులో మొదటి నవల ఏది అన్న విషయం మీద అభిప్రాయ భేదాలున్నాయి. 1872లో శ్రీ నరహరి గోపాలకృష్ణమ్మ చెట్టి శ్రీరంగరాజ చరిత్రము (సోనాబాయి పరిణయము అని ఇంకో పేరు) అన్న ‘నవీన ప్రబంధా’న్ని రచించారు. 1878లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాజశేఖర చరిత్రము (వివేక చంద్రిక అని ఇంకో పేరు) అనే ‘వచన ప్రబంధా’న్ని తాము నడిపే వివేక వర్ధని పత్రికలో సీరియల్‌గా ప్రచురించారు. ఈ రెండిట్లో ఏది మొదటి తెలుగు నవల అని జరిగిన విస్తృత చర్చలో నూటికి ముప్పాతికమంది ఆ గౌరవం రాజశేఖర చరిత్రానికే ఇచ్చారట. 1897లో ఈ పుస్తకంపై వ్రాసిన వివేక చంద్రికా విమర్శనం అన్న గ్రంథంలో శ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి ఈ విధమైన రచనలని ‘నవల’ అని (ఇంగ్లీషులో novel అన్న పదానికి సమానార్థకంగా) అనవచ్చునని ప్రతిపాదించారట.
అప్పట్నుంచీ ఇప్పటిదాకా తెలుగులో వేల సంఖ్యలో నవలలు వచ్చాయి. వాటిలో ప్రసిద్ధమైన 25 నవలలకి శ్రీ సహవాసి వ్రాసిన పరిచయాల్ని పర్‌స్పెక్టివ్స్ సంస్థ వారు ‘నూరేళ్ళ తెలుగు నవల: 1878-1977’ అన్న పేరుతో శ్రీ డి. వెంకట్రామయ్య సంపాదకత్వంలో 2007లో ప్రచురించారు. ఈ పరిచయాలతో పాటు, ప్రసిద్ధ విమర్శకురాలు శ్రీమతి కాత్యాయని విద్మహే వ్రాసిన వ్యాసం ’సమాజ భిన్న దశల సమాహారం – నూరేళ్ళ తెలుగు నవలా వికాసం ’ కూడా ఈ పుస్తకంలో అనుబంధంగా చేర్చారు. వీటికితోడు తెలుగులో చదువదగిన మరికొన్ని నవలల జాబితా, శ్రీ సహవాసి జీవిత విశేషాలు కూడా అనుబంధాలుగా ఉన్నాయి.
ఈ పుస్తకంలో రాజశేఖర చరిత్రంతో మొదలుపెట్టి 1972లో ప్రచురితమైన వాసిరెడ్డి సీతాదేవి గారి మట్టిమనిషి వరకూ పాతిక ప్రసిద్ధ నవలల పరిచయాలున్నాయి. ప్రతి పరిచయంలోనూ, ఆ నవల కథను సంగ్రహంగా చెప్పి, రచయిత గురించి, కథాకాలాన్ని గురించి, ఆ నవలకి ఉన్న ప్రాముఖ్యత గురించీ రచయిత క్లుప్తంగా వివరిస్తారు. ఈ పుస్తకంలో పరిచయం చేయబడ్డ ఇతర నవలలు: మాలపల్లి (ఉన్నవ లక్ష్మీనారాయణ); బారిష్టరు పార్వతీశం (మొక్కపాటి నరసింహశాస్త్రి); మైదానం (చలం); వేయి పడగలు (విశ్వనాధ సత్యనారాయణ), నారాయణరావు (అడవి బాపిరాజు); చివరకు మిగిలేది (బుచ్చిబాబు); అసమర్థుని జీవయాత్ర (గోపీచంద్); అతడు-ఆమె (ఉప్పల లక్ష్మణరావు); చదువు (కొడవటిగంటి కుటుంబరావు); అల్పజీవి (రాచకొండ విశ్వనాధశాస్త్రి); కీలుబొమ్మలు (జి.వి. కృష్ణారావు); మంచీ-చెడూ (శారద); ప్రజల మనిషి (వట్టికోట ఆళ్వార్‌స్వామి); పెంకుటిల్లు (కొమ్మూరి వేణుగోపాలరావు); కాలాతీత వ్యక్తులు (డా. పి. శ్రీదేవి); దగాపడిన తమ్ముడు (బలివాడ కాంతారావు); బలిపీఠం (రంగనాయకమ్మ); కొల్లాయి గట్టితేనేమి (మహీధర రామ్మోహనరావు); మైనా (శీలా వీర్రాజు); చిల్లరదేవుళ్ళు (దాశరథి రంగాచార్య); అంపశయ్య (నవీన్); పుణ్యభూమీ కళ్ళు తెరు /హేంగ్ మీ క్విక్ (బీనాదేవి); హిమజ్వాల (వడ్డెర చండీదాస్).
తెలుగు సాహిత్యంపై ఆసక్తి ఉన్న ప్రతివారికీ పరిచయమై ఉండవలసిన నవలలలో ఇవి కొన్ని. ఈ పుస్తకాలు ఇంతకు ముందు చదవనివారికీ, అందుబాటులో లేనివారికీ ఈ పరిచయాలు చాలా ఉపయోగపడతాయి. ఈ రచనల గురించీ, రచయితల గురించీ వివరంగా తెలుస్తుంది. ఈ పుస్తకాలు మీకు ఇంతకు ముందు పరిచయమైనవే అయినా కొన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది.
ఈ పరిచయాల్ని చేసిన శ్రీ సహవాసి (జంపాల ఉమామహేశ్వరరావు) అనువాదకుడుగా ప్రసిద్ధులు. తెలుగు సాహిత్యమూ, తెలుగు సామాజిక చరిత్రా క్షుణ్ణంగా తెలిసినవారు. సాహిత్య ప్రయోజనంపట్ల స్పష్టమైన అభిప్రాయాలున్నవారు. అందుచేత ప్రతి నవల గురించి ఆయన చేసిన పరిచయం, విశ్లేషణ ప్రామాణికంగానూ, ఆసక్తికరంగానూ ఉంటాయి.
శ్రీమతి కాత్యాయని విద్మహే తెలుగు నవలల పరిణామాన్ని సామాజిక చరిత్రకు అనుసంధిస్తూ, విశ్లేషిస్తూ వ్రాసిన 44 పేజీల విపులమైన, విలువైన వ్యాసం ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. ఈ విషయంపై ఆసక్తి ఉన్నవారందరూ చదువదగ్గ వ్యాసం ఇది.
ఈ పుస్తకాన్ని పర్‌స్పెక్టివ్స్ వారు అందంగా, శ్రద్ధగా ప్రచురించిన విధానం నాకు చాలా నచ్చింది. అట్ట అందంగా, ఆకర్షణీయంగా ఉండటమే కాదు, లోపల ముద్రణ కూడా ముచ్చటగా ఉంది. ప్రతి నవలాపరిచయంతోపాటు, ఆ నవల, రచయితల వివరాలు, నవల ముఖచిత్రం, రచయిత ఛాయాచిత్రం, విపులమైన పాదపీఠికలు పుస్తకానికి సమగ్రతను తీసుకొచ్చాయి. నూరేళ్ల తెలుగు నవలా వికాసంపై శ్రీమతి కాత్యాయని విద్మహే విశ్లేషణాత్మక వ్యాసం, సంపాదకుడు శ్రీ డి. వెంకటరామయ్య ముందు మాట, సహవాసి గురించి శ్రీ వెనిగళ్ళ వెంకటరత్నం ఆత్మీయ కథనాల్ని చేర్చటం ఈ పుస్తకం విలువను పెంచాయి. ఇంత శ్రద్ధగా ప్రచురించినందుకు పర్‌స్పెక్టివ్స్ నిర్వాహకులు శ్రి ‘ఆర్కె’ని అభినందించాలి.
ఇంత ప్రేమగా, అందంగా ప్రచురించిన ఈ పుస్తకం ప్రెస్‌కాపీ తయారుచేసిన 20 నిమిషాలకే, దీన్ని చూడకుండానే శ్రీ సహవాసి మరణించడం బాధాకరమైన విషయం.
ఈ పరిచయాల నేపథ్యం చెప్పాలంటే నాకు ఈ వ్యాసాలతోనూ, శ్రీ సహవాసితోనూ ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి చెప్పాలి. నేను సంపాదకత్వం వహించిన ’తెలుగు నాడి’ పత్రికకు శ్రీ సహవాసితో ప్రత్యేకంగా 2004-2007 మధ్య ’నవలా పరిచయం’ అన్న శీర్షికకోసం వ్రాయించుకొన్న పరిచయాలనుండి ఈ పాతిక తీసుకోబడ్డాయి. ఒకప్పుడు నాకు గొప్ప ఇంగ్లీషు పుస్తకాలని పరిచయం చేసిన Classics Illustrated, మాలతీ చందూర్ పాతకెరటాలు కోవలో, తెలుగులో పాత పుస్తకాలని కొత్త తరం పాఠకులకు పరిచయం చేయాలన్న కోరిక నాకు ఎప్పటినుంచో ఉండేది. తెలుగు నాడి పత్రికను ప్రారంభిస్తున్నప్పుడు, అలా ఉద్దేశించిన నవలా పరిచయం శీర్షిక ఎవరు నిర్వహిస్తే బాగుంటుంది అన్న ప్రశ్న వచ్చింది. నాకూ, అతిథి సంపాదకుడు వాసిరెడ్డి నవీన్‌కూ, సలహాలిస్తున్న ఇతరమిత్రులకూ, అందరికీ మొట్టమొదట తట్టింది సహవాసిగారే. ఆయన కూడా ఉత్సాహంతో స్పందించారు. తెలుగు నాడి ప్రారంభ సంచికలో (ఏప్రిల్, 2004) ఉన్నవ గారి మాలపల్లి నవలతో ఈ శీర్షిక ప్రారంభమయ్యింది.
మొత్తం 33 నవలలను సహవాసి గారు తెలుగు నాడి పాఠకులకు పరిచయం చేశారు. ఉన్న రెండు పుటల పరిమితిలోనే, ముఖ్యవిషయాలేవీ వదలకుండా, పుస్తకాలను చక్కటి తెలుగులో సమగ్రంగానూ, సంక్షిప్తంగానూ పరిచయం చేస్తూనే, రచయితల వివరాలనూ, ఆ నవలల నేపధ్యాన్నీ రసభంగమూ, ఔచిత్యభంగమూ కాకుండా మేళవించి, మేమాశించినదానికన్నా అర్థవంతంగా, ఆకర్షణీయంగా ఈ శీర్షికను నిర్వహించిన ప్రతిభాశాలి శ్రీ సహవాసి. ఈ పరిచయాలు వ్రాస్తున్న సమయంలో శ్రీ సహవాసి ఉబ్బసంతోనూ, కేన్సర్‌తోనూ పోరాడుతున్నారు. తీవ్రమైన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, పత్రిక ముద్రణా సమయానికి జాప్యం లేకుండా నెలనెలా పరిచయాల్ని అందజేసిన ఆయన ఉత్సాహం, క్రమశిక్షణ నన్ను చాలా ఆశ్చర్యపరిచేవి.
ఇంకా చాలా పుస్తకాలను పరిచయం చేయాలన్న ప్రణాళికలు మాకు ఉండేవి. ఆయన ఆకస్మిక మరణానికి రెండురోజుల ముందు కూడా ఆ నెల ఆయన పరిచయం చేద్దామనుకొంటున్న నవలను గురించి చర్చించి, హైదరాబాద్ వచ్చి పరిచయం అందజేస్తానని చెప్పారు. అవేవీ పూర్తి కాకుండానే, నూరేళ్ళ తెలుగు నవల పుస్తకం ప్రతిని చూడకుండానే ఆగస్టు 29, 2007న ఆయన మరణించడం బాధాకరం.
నూరేళ్ళ తెలుగు నవల: 1878-1977
(పాతిక ప్రసిద్ధ నవలల పరిచయం)
రచన: సహవాసి
సంపాదకుడు: డి. వెంకట్రామయ్య
ప్రచురణ: పర్‌స్పెక్టివ్స్
సామాజిక శాస్త్రం / సాహిత్యం
ఆగస్టు 29, 2007
సోల్ డిస్ట్రిబ్యూటర్స్:నవోదయ బుక్ డిస్ట్రిబ్యూటర్స్
3-3-859/1/బి, మొదటి అంతస్థు
ఆర్యసమాజ్ ఎదురుగా, కాచిగూడ క్రాస్‌రోడ్స్,
హైదరాబాద్ -27
ఫోన్: 24652387
230 పేజీలు, 100 రూ.
పుస్తకం » Blog Archive » నూరేళ్ళ తెలుగు కథ – మళ్ళీ చెప్పుకొంటున్న మన కథలు
[…] పుస్తకం, ఇంతకు ముందు పరిచయం చేసిన నూరేళ్ళ తెలుగు నవల, వైతాళికులు కవితా సంకలనం, ప్రతి […]