కోతి కొమ్మచ్చి కోరి చదివొచ్చి..

రాసిన వారు: తుమ్మల శిరీష్ కుమార్

నా గురించి:
చదువరి అనే నేతిబీరకాయ పేరుతో జాలంలో తిరుగుతూంటాను.
హాస్యం, వ్యంగ్యం ఇష్టం. చరిత్ర, రాజకీయాలు, ఆత్మకథలు, ఇంటర్వ్యూలు చదవడానికి ఇష్టపడతాను. పుస్తకంలో కంటెంటు ఎంత ముఖ్యమో, పుస్తకం రూపకల్పన కూడా అంతే ముఖ్యమని భావిస్తాను. ఇతర భాషల్లో ప్రసిద్ధిగాంచిన పుస్తకాలకు తెలుగు అనువాదాలు విరివిగా వస్తే బాగుండు కదా అని ఆశ.


********************
ko.koసాధారణంగా ఆత్మకథలంటే సంఘటనల సమాహారం. ఒకదానికొకటి లింకుండనివి, లింకుండేవీ.. అనేక సంఘటనలు జీవితంలో జరుగుతూంటాయి. ఈ సంఘటనలను గుదిగుచ్చి, ఒక ఆత్మకథగా రాయడంలో ముళ్ళపూడి వెంకటరమణ చూపిన నేర్పు “కోతి కొమ్మచ్చి” ని ఒక వైవిధ్యమైన రచనగా నా మనసులో నిలబెట్టింది. తన జీవితం ఒక చెట్టైతే, అందులోని ఒక్కో ఘటనా ఒక్కో కొమ్మ. ఓ కొమ్మ మీంచి మరోదానిమీదకు దూకుతూ, ఓ ఘటనలోంచి మరోదానిలోకి దూరుతూ ముళ్ళపూడి తన కథ చెప్పుకుంటూ పోయారు. ఆయనలోని చాతుర్యమేంటంటే.. పాఠకుడితో చెతుర్లు వేస్తూ ఈ గెంతులు దూకుళ్ళూ తెలీనీకుండా సాగిపోవడం! ఓ సంఘటన చెబుతూ దానితో సంబంధం ఉన్నదో లేనిదో.. మరో సంఘటన వైపుకు దూకి ఆ వృత్తాంతాన్ని వివరించడం, అదయ్యాక, ‘ఆఁ, ఇప్పుడెక్కడున్నానూ ‘ అంటూ వెనక్కి వెళ్ళటం, -ఇలా తన జీవిత కథను సరదాగా చెప్పుకుంటూ పోయారు.

కోతి కొమ్మచ్చి ద్వారా రచయిత తన జీవితాన్ని తెరిచిన పుస్తకంగా చేసి పాఠకుడి ముందు పెట్టారు. అనేకానేక కష్టాలు, నష్టాలు, అనేక ఉద్యోగాలు, రాజీనామాలు, పెసరట్లు, పొగరెట్లు, మందోబస్తులు, విందోబస్తులు, సినిమాలు, రచనలు, విజయాలు, అపజయాలు,.. అన్నీ కలిపి కోతి కొమ్మచ్చి! సాధారణంగా ఆత్మకథలు, జీవిత కథలూ ఆ వ్యక్తి కథతో పాటు, తన సమకాలికుల గురించి, అప్పటి ఆర్థిక సామాజిక పరిస్థితుల గురించీ కూడా తెలుపుతాయి. అ కోణంలోంచి చూస్తే కోతి కొమ్మచ్చికి వంగి మొక్కొచ్చు! తన కథను చెబుతూ ముళ్ళపూడి మనలను ఆనాటిలోకి తీసుకుపోతారు. ముఖ్యంగా యాభై అరవై యేళ్ళనాటి పత్రికాలోకం, సినిమాలోకాల్లోని తెరవెనక కథలు, విశేషాలు ఎన్నో తెలుస్తాయి మనకు.

తనకు నచ్చిన వ్యక్తుల గురించి చెప్పేటపుడు మొహమాటం లేకుండా మెచ్చేసుకున్న ముళ్ళపూడి అంతగా నచ్చని వ్యక్తుల గురించి చెప్పేటపుడు పేరు తలవకుండానే, మనకు చటుక్కున తట్టేవిధంగా గుర్తులు చెబుతూ సూచించారు. ముఖ్యంగా కృష్ణంరాజు గురించి ఆయన రాసిన దానిలో నేనిది గమనించాను. కృష్ణంరాజు పేరు ఎక్కడా చెప్పనప్పటికీ ఆరడుగులవాడనీ, తిన్నడనీ, కేంద్రమంత్రనీ.. సూచించారు. ఆ సూచనలను బట్టి ఆ వ్యక్తి ఆయనే అని అనుకున్నాను. డబ్బుల దగ్గర మాటపట్టింపుతో వచ్చిందట గొడవ.

ఆదుర్తితో కూడా తేడాలొచ్చాయని రాసారుగానీ, పేరు స్పష్టంగానే రాసారు. ఆయనతో విభేదాలు ఎందుకొచ్చాయో రాసారు. ఆ సంగతి రాస్తూనే ఆదుర్తి అంటే తనకు ఎంత గౌరవమో కూడా రాసారు. గొడవ గొడవే, ఆయనపై ఉన్న గౌరవం గౌరవమే -దేనిదారి దానిదే!

“పిలకా గణపతిశాస్త్రి గారు ఒక పాపులర్ రచయిత్రిని ‘గొప్ప’ అని ఒప్పుకోలేక- ‘బ్యూటిఫుల్ రైటర్’ అనేవారు.” అని రాసారు. ఇక్కడ ఆ రచయిత్రి పేరు చెప్పలేదు. కానీ మరో కొమ్మమీద ఉండగా ఆ రచయిత్రి ఎవరో, ఆయనలా ఎందుకన్నారో, అ తరవాత ఏమన్నారో కూడా చెప్పారు. (ఇది బహుశా ఇంకోతికొమ్మచ్చిలో -కోతికొమ్మచ్చి రెండో భాగం- అనుకుంటాను.)

ఈ కోతి కొమ్మచ్చి అటలో దూకిన కొమ్మ మీదకే మళ్ళీ దూకిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ముళ్ళపూడి మైకం వలన మనలనవేమీ బాధించవు. వాలిన పువ్వుమీదే మరల వాలితేమి, మకరందమున్నంతవరకూ! గతంలో వివిధ సందర్భాల్లో తాను రాసుకున్న సొంతగోడు కూడా కొంత – కొంతే – ఇక్కడ కనబడుతుంది. ముఖ్యంగా తన తల్లి, చిన్నమ్మమ్మల గురించిన సంగతులు. అయితే అవి వీలైనంత తక్కువగా ఉండేలా జాగ్రత్తపడినట్టు నాకనిపించింది.

ముళ్ళపూడి భాషాచాతుర్యం గురించి చెప్పుకోకపోతే ఈ వ్యాసంలో సమగ్రత ఉండదు. అయితే ఆ చాతుర్యం గురించి సమగ్రంగా చెప్పమని అడక్కూడదు నన్ను. ఎందుకంటే పుస్తకమంతా రాసుకుపోవాల్సుంటుంది. మచ్చుకు కావాలంటే కళ్ళు మూసుకుని ఏదో ఒక పేజీని తిప్పండి. ప్ఫదహారు కనబడతాయ్! అలా నాక్కనబడినది ఒకటిక్కడ. బాపు గురించి తన గురించీ చెబుతూ..

“అతనికి ప్రథమ కోపం. తిక్క దూకుడు. ముందర అపార్థం చేసుకుని ఆనక అర్థం చేసుకోవడం. అతను అపార్థసారథి అయితే నేను అప్పార్థసారథిని. అంటే అప్పులతో -ఋణానుబంధాలతో బంధాలను గట్టిపరచుకునేవాడిని” అని రాసారు.

పుస్తకం మొదటిపేజీ నుంచి చివరిపేజీ దాకా ముళ్ళపూడి భాషా చమత్కారాలను ఆస్వాదిస్తూ సరదా సరదాగా చదువుకుపోతాం. చివరిపేజీ కూడా తిప్పేసాక మనకు ముళ్ళపూడి క్యారికేచరున్న వెనక అట్ట కనిపిస్తుంది. అంతేకాదు, ముళ్ళపూడి వ్యక్తిత్వం మన కళ్ళముందు రూపు కడుతుంది.

అట్ట దాకా వచ్చాం కాబట్టి, అట్టేసినవాళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి. నేను చూసిన తెలుగు పుస్తకాల్లో చక్కటి రూపం, సైజూ కలిగిన పుస్తకాల్లో ఇదొకటి. ఏదో ‘అచ్చేసి, వదిలేసాం’ అన్నట్టు కాకుండా చక్కగా శ్రద్ధతో తీర్చిదిద్ది, పాఠకుణ్ణి సంతోషపెట్టారు, హాసం వారు. బాపు బొమ్మలూ క్యారికేచర్లతోటీ, ఫోటోలతోటీ పుస్తకాన్ని చక్కగా అలంకరించారు. ఫాంటు సైజు ఓ నూలు తక్కువ ఉంటే బాగుండుననిపించింది. అచ్చుతప్పు ఒకటెక్కడో కనబడినట్టు గుర్తు.

అడ్రసులూ గట్రా వేసే మూడో పేజీలో అడ్రసూ గట్రాలను ఇంగ్లీషు లిపిలో వేసే చాపల్యం నుండి మాత్రం తప్పించుకోలేకపోయారు ప్రచురణకర్తా గట్రాలు! మొత్తమ్మీద పుస్తకప్రియులు కొనుక్కుని చదవదగ్గ, పుస్తక షోకేసు ప్రియులు కొనుక్కోదగ్గ 150 రూపాయల పుస్తకం కోతి కొమ్మచ్చి.

———————————————————————-
ఇప్పటికే ఈ పుస్తకంపై చాలా సమీక్షలొచ్చాయి, స్పందనలొచ్చాయి రాబోయే కాలంలో మరిన్ని చూస్తాం. పుస్తకంలోని విషయాలను ఉటంకిస్తారు. ముళ్ళపూడి పేదరికం గురించి, పెద్దరికం గురించి, స్వాభిమానం గురించి, ‘స్వాతి’శయం గురించి, … రాస్తారు. నేను పుస్తకాంతంలో ఉన్న ఒక ఉదంతం గురించి రాస్తాను.
కొత్త యజమానితో వచ్చిన మాటపట్టింపుల కారణంగా ఆంధ్ర పత్రిక నుంచి రాజీనామా చేసారు ముళ్ళపూడి. కొత్త యజమాని తండ్రి – శివలెంక శంభుప్రసాద్ – పిలిపించారు, సంగతేంటో కనుక్కుందామని. ముళ్ళపూడికి ఈయనంటే వల్లమాలిన భక్తి; అయ్యవారు అని పిలుస్తారు. అయ్యవారికి కూడా ఈయనంటే ఎంతో అభిమానం. అయ్యవారు ఒక పత్రికను తీసి అందులో ఉన్న ఒక వార్తను చూపించారు. అందులో ఇలా ఉంది:

“ఏయెన్నార్ గేటులో ఎంగిలాకులు తినే ముళ్ళపూడి”

అక్కినేని నాగేశ్వరరావుకు భజన చేసి, ఆయన దగ్గర లంచాలు కతికి, ఎంగిలాకులు తినే జర్నలిస్టని ముళ్ళపూడి గురించి రాసారందులో. రాసినది కాగడా శర్మ అనేటతడు. (ఈ కాగడా శర్మ గురించి చలామందికి తెలిసే ఉంటుంది. రామారావును రాజకీయాల్లోకి రమ్మని సలహా ఇచ్చింది నేనే అని చెప్పుకున్నాడతడు.)
“దీనికి భయపడ్డారా? నేనిలాంటివి పట్టించుకోను”, అని చెప్పారు అయ్యవారు.
ముళ్ళపూడి, ‘మీరు పట్టించుకుంటారని అనుకుంటే మీమీద నాకు గౌరవం లేనట్టే’నని అన్నారు.
“ఐతే, మరి మీరు ఆ వార్తను ఖండించరా?” అని అడిగారు అయ్యవారు.
దానికి ముళ్ళపూడి ఇచ్చిన సమాధానము, అలాంటివాటి పట్ల ఆయన అవలంబించిన విధానమూ అందరికీ అనుసరణీయమైనవి. “ఆ రొచ్చులో రాయి వేస్తే వాళ్ళు మరింత రెచ్చిపోతారు. వాళ్లకు కావలసింది అదే.. మనం ఒకసారి ఖండిస్తే – ఇంకా తీవ్రంగా రాస్తాం – ఆపాలంటే డబ్బివ్వాలని బెదిరిస్తారు..” ఇదీ ఆయన సమాధానం.
ఈ సంభాషణ అలా కొంత ముందుకు సాగాక, అయ్యవారు ఇంకో ప్రశ్న వేసారు.. “.. కానీ మీలాంటివాడి గురించి అసహ్యంగా రాస్తే వాళ్ళకేం లాభం?” దానికి ముళ్ళపూడి చెప్పిన సమాధానమేంటో రాయడం లేదుగానీ, నాకది నచ్చింది.

తనను తిట్టినవాడిని మంచివాడనడం ముళ్ళపూడి గొప్పతనం -అది అభినందించదగ్గదే. అయితే, నన్ను ఆకట్టుకున్నది మాత్రం – ఆ రాతలను, ఆ రాసేవాణ్ణి ఆయన పట్టించుకోనితనం!. ఇది అంతర్జాల యాత్రికులు కూడా నడవదగ్గ, నడవాల్సిన బాట!

************************************
పుస్తకం.నెట్ లో కోతికొమ్మచ్చి గురించి వచ్చిన ఇతర వ్యాసాలు ఇక్కడ మరియు ఇక్కడ.

You Might Also Like

6 Comments

  1. gksraja

    చదువరి గారూ! బాగా చదివించారు. నేను ముళ్ళపూడి వీరాభిమానిని. నేను గంద్రగోళం లో ఉన్నప్పుడు, పిచ్చి ఆలోచనల వల్ల నిద్ర పట్టనప్పుడు – ముళ్ళపూడి గారి పుస్తకం చదివి (రాత్రుళ్ళు, తెల్లారగట్ట) నూట వందో సారి చదువుతూ సేద తీరేవాడిని. ఎంతమంది ముళ్ళపూడి గురించీ వ్రాసినా, ఎంతమంది ఆయన పుస్తకాలు చదువుతూ ఆనందం పొందినా అవి నా ఖాతాలో కూడా వేసుకొని సంబరపడిపోయేవాడిని, మీరూ మళ్ళి సంబర పెట్టారు. ముఖ్యంగా మీ ప్రొఫైల్ చదివాక, ఇన్నాళ్ళ నా అభిరుచులు, అభిలాషలు నేనే వ్రాసుకున్న ఫీలింగు కలిగింది. ధన్యవాదాలు తుమ్మల శిరీష్ కుమార్ గారూ!
    gksraja.blogspot.com రాజా

  2. పుస్తకం » Blog Archive » నిరుడు చదివిన పుస్తకాలు

    […] నీ నవ్వులు -తమ్మినేని యదుకుల భూషణ్ కోతి కొమ్మచ్చి – ముళ్ళపూడి రమణ తెలుగు కథానికలు చిల్లర దేవుళ్ళు […]

  3. లలిత

    మేవెప్పుడో చదివేసామోచ్……
    భానుమతి ముళ్ళపూడి మధ్య జరిగిన సంఘటనలు, సంభాషణలు బావుంటాయ్ .
    వాటి గురించి మీరు రాయలేదు! మీరు భానుమతి గారికి భయపడ్డారా?

  4. cbrao

    “అడ్రసులూ గట్రా వేసే మూడో పేజీలో అడ్రసూ గట్రాలను ఇంగ్లీషు లిపిలో వేసే చాపల్యం నుండి మాత్రం తప్పించుకోలేకపోయారు ప్రచురణకర్తా గట్రాలు!” – ఆంగ్లంలో ఈ భోగట్టా ఇవ్వటం తప్పనిసరి. మన తెలుగు పుస్తకాలు, సినిమాలు అమెరికాలోని చాలా పట్టణాల ప్రజా గ్రంధాలయాలలో లభ్యమవుతాయి. పుస్తకాల కాటలాగింగ్ ప్రక్రియకు ఇండెక్స్ కూ ఇవి అవసరం.
    “తనను తిట్టినవాడిని మంచివాడనడం ముళ్ళపూడి గొప్పతనం -అది అభినందించదగ్గదే. అయితే, నన్ను ఆకట్టుకున్నది మాత్రం – ఆ రాతలను, ఆ రాసేవాణ్ణి ఆయన పట్టించుకోనితనం!. ఇది అంతర్జాల యాత్రికులు కూడా నడవదగ్గ, నడవాల్సిన బాట!” – సమీక్ష నచ్చింది. మొదలెట్టాకా సెలయేరులా ఎక్కడా ఆగకుండా చదివించింది. పుస్తకం లోని మంచి విషయాలను చక్కగా చెప్పారు.

  5. Sarath

    chala bagundi mii konam, pustakam swathi lonunchi chimpukuni kakunda koni chadavalani pinchela rasaru, thanks

Leave a Reply