పుస్తకం
All about booksపుస్తకభాష

December 3, 2009

నాకు నచ్చిన పుస్తకం: విరాట్

More articles by »
Written by: అతిథి
Tags:

రాసినవారు: వరప్రసాద్ రెడ్డి
(ప్రమోటర్, ఎండీ, శాంతా బయోటెక్నిక్స్; పబ్లిషర్: హాసం)

********************************
నాకు నచ్చిన పుస్తకం గురించి మీతో నా అనుభవాలు పంచుకుందామని మీ ముందుకు వచ్చాను. మనం అనేక పుస్తకాలు చదువుతాం. నచ్చిన పుస్తకాలు కూడా చాలా ఉంటాయి. అయితే, వాటిలో కొన్ని మనల్ని వెంటాడతాయి. ఆలోచింపజేస్తాయి. నిద్ర పట్టనివ్వకుండా చేస్తాయి. రచయిత అభిప్రాయం ఇదేనా? లేక నేను మరొకలా భావిస్తున్నానా? అని మాటిమాటికి విచికిత్సలో పడవేస్తాయి. జీవితం గురించి, జీవనతత్వం గురించి, ధర్మాధర్మాల గురించి మానను తర్కించామంటాయి. అలాటి పుస్తకమే ‘విరాట్’.

‘విరాట్’ ఓ చిన్న పుస్తకం. స్టీఫన్ త్సయిక్ అనే జర్మన్ రచయితా రాసిన ఓ నవలిక ఇది. ఈ త్సయిక్ ఆస్ట్రియాలో పుట్టారు. జర్మన్ భాషలో కథకుడిగా, వ్యాసకర్తగా, నాటక రచయితగా, కవిగా పేరుకెక్కారు. 1915 ప్రాంతంలో భారతదేశానికి వచ్చారు. భారతీయ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసారు. వేదాలని, ఉపనిషత్తుల్ని, పురాణాలని, భగవద్గీతను ఆకళింపు చేసుకున్నారు. భగవద్గీత సూక్తుల ఆధారంగా ‘విరాట్’ ను రూపొందించారు. అందుకే మనదేశంలో జరిగినట్లుగా కథను కల్పించారు. ఈ నవలిక ప్రపంచంలోని నలభై భాషల్లోకి అనువదించబడింది. కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. దీన్ని పొనుగోటి కృష్ణారెడ్డి అనే తెలుగు రచయితా, జర్నలిస్టు, విమర్శకుడు -స్వయంగా అనువదించి ప్రచురించారు.

1999లో వెలువడిన ఈ పుస్తకాన్ని నేను చదివాను. తల వేడెక్కిపోయింది. ఆలోచనలు చుట్టుముట్టాయి. ఒకరకమైన పూనకం వచ్చినట్లైంది. వందలకొద్దీ కాపీలు కొని తెలిసినవారందరికీ పంచిపెట్టాను. కొందరు బాగుందన్నారు. కొందరు అంత బాగుండడానికి ఇందులో ఏముంది? అని విస్తుపోయారు. మరి కొందరు ఈ కథానాయకుడు ఓ పిచ్చిముండా కొడుకులా ఉన్నాడు, హీరో లక్షణాలు ఏమీ లేవు. వాణ్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి కనుక? అని చికాకు పడ్డారు. మీరేమంటారో చూద్దాం.

ముందుగా మీకు కథ చెబుతాను. బుద్ధుడు భూమి మీద అవతరించడానికి ముందు జరిగిన కథ ఇది. వీరవాఘ రాజ్యాన్ని ఒక రాజుగారు పాలిస్తున్నారు. ఆయనకు కుడిభుజంగా ఉన్న ఒక గొప్ప యోధుడు విరాట్. ఈ విరాట్ నడివయస్సు వాడు. భార్య, కుమారులు, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. వేటికీ లోటు లేదు. ఉన్నట్లుంది రాజుగారి బావమరిది రాజుగారి మీద తిరుగుబాటు చేసాడు. రాజుగారి పట్ల కోపంగా ఉన్న పర్వతవాసుల్ని తన సైన్యంలో కలుపుకుని రాజధాని మీదకు దండెత్తాడు. దురదృష్టం ఏమిటంటే రాజుగారి సేనాపతి కూడా వాళ్లతో చేతులు కలిపాడు. రాజుగారికి అండగా ఎవరూ నిలవలేదు. అయన వ్యవహారశైలి చాల కఠినంగా ఉంటుంది. చిన్నచిన్న తప్పులకి కూడా పెద్దపెద్ద శిక్షలు వేసే అయన పధ్ధతి అందర్నీ ఆయనకి దూరం చేసింది.

ఈ పరిస్థితుల్లో రాజు విరాట్ ఇంటికి వెళ్లి సహాయం అర్థించాడు. విరాట్ ఆయనకు మాట ఇచ్చాడు. తన బందుజనంతో సహా వెళ్లి శత్రువులపై పడ్డాడు. అర్థరాత్రి వాళ్ళ గుడారంలోకి ఒంటరిగా దూరి విద్రోహుల తలలు నరికేసాడు. మర్నాడు సూర్యోదయం కాగానే వాళ్ళ శవాలు ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు, గద్దలకు వేయడానికి గుడారంలోకి మళ్ళీ ప్రవేశించాడు. రాజుగారి బావమరిది, సేనాపతి శవాలతో పాటు విరాట్ అన్నగారి శవం కూడా అక్కడ పడి ఉంది. అతను ఒక పర్వత రాజు. రాజుగారి మీద కోపంతో తిరుగుబాటుదారులతో చేతులు కలిపాడు. విరాట్ అంటే అమిత ప్రేమ కలవాడు. అతను చనిపోయాడు కానీ అతని కళ్ళు తెరిచే ఉన్నాయి. నువ్వు చేసింది న్యాయమేనా? అని విరాట్ను ప్రశ్నిస్తున్నట్లున్నాయి. అవి చూసి విరాట్ చలించాడు.

శవాల్ని ఖండఖండాలుగా కోయబోతున్న తన సైనికుల్ని వారించి వాటికీ సవ్యంగా దహనం జరిపించాడు. తన రాజ్యానికి తిరిగివస్తూ ఓ వంతెనపై నిలబడి రక్తసిక్తమైన తన ఖడ్గాన్ని నదీ ప్రవాహంలో విడిచిపెట్టాడు. రాజుగారి వద్దకు వచ్చాడు. విరాట్ సాధించిన విజయానికి రాజుగారు పొంగిపోయారు. తన పూర్వీకుల ఖడ్గాన్ని బహుకరించాబోయారు. కానీ విరాట్ తీసుకోలేదు. ‘నా అన్నగార్ని చంపుకున్నానని తెలిసాక, ఇక జీవితంలో ఖడ్గాన్ని ముట్టనని నిర్ణయించుకున్నాను. ఇకముందు నుండీ ఎవర్ని చంపబోయిన న సోదరుడి వంటి వాణ్ణి చంపబోతున్నననే భావన కలుగుతుంది. కట్టి చూపి ఇతరులను భయపెట్టి బతికేకన్నా భిక్షమెత్తుకుని బ్రతకడం మంచిదని నేను భావిస్తున్నాను’ అని విన్నవించాడు. అతని మానసిక పరిస్థితిని రాజుగారు అర్థం చేసుకున్నారు. ‘నీ వంటి వాడి సేవలు ఈ రాజ్యానికి కావాలి. నువ్వు ధర్మబద్దుడివి. చెడును గుర్తించగలవు. ఇకపై ప్రధాన న్యాయాధికారిగా ఉంది న్యాయాన్ని కాపాడు’ అన్నారు. విరాట్ అంగీకరించాడు.

చాలా బాగుంది కదూ! ఒక మహా యోధ, అశోక చక్రవర్తి స్టైల్ లో …హింస జోలికి పోనని నిర్ణయించుకోవడం. కత్తి పక్కకు పెట్టి ధర్మదండం చేబూనడం మంచి ఎగ్జైటింగ్ గా ఉంది కదూ? కనీ ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. లోకంలో యుద్ధాలు జరగకూడదని రచయిత చెబుతున్నడా? హింసకు తావు లేదంటున్నడా? మరి దుష్టులు చెలరేగితే ఏం చేయాలి? విరాట్ అన్నగారు విద్రోహుల పక్షాన చేరడం న్యాయమేనా? అన్నగారయినంత మాత్రాన రాజద్రోహం చేసిన, రక్తపాతంతో అమాయక ప్రజలను కష్టాల పాలు చేసినా, చంపకుండా వదిలేయాలా? విరాట్ ఒంటరిగా దొరికి ఉంటే అన్నగారు వదిలి ఉండేవాడా? ఒక్కొక్కప్పుడు శాంతి నెలకొల్పడానికి యుద్ధాలు చేయవలసి ఉంటుంది. అప్పుడు కత్తి ముట్టనంటే ఎలా? – రచయిత వీటికి సమాధానాలు చెప్పలేదు. మనల్నే ఆలోచనలో పడేసి ముందుకు సాగాడు.

ప్రధాన న్యాయాధికారి అయ్యాక విరాట్ చాలా జాగ్రత్తలు తీసుకొన్నాడు. విచారణ జరిగిన రోజునే తీర్పు చెప్పేవాడు కాడు. ఒక రోజు ప్రశాంతంగా ఆలోచించి, మర్నాడు చేతులు, కాళ్ళు చల్లని నీళ్ళతో కడుక్కొని ఆవేశకావేషాలు లేకుండా అప్పుడు తీర్పు చెప్పేవాడు. అయినా తీర్పు సమజసంగా ఉందా అని ముద్దాయిని అడిగేవాడు. నూటికో కోటికో ఎవడో ఒకడు తప్ప వాళ్ళంతా సమంజసంగా వుందనేవారు. ఈయన మరణదండనలు విధించేవాడు కాడు. కానీ శిక్ష కఠినంగా వుండేది. దాంతో నేరస్థులు తగ్గేవారు. ఆరేళ్లలో విరాట్‍కి ఎంతో ఖ్యాతి లభించింది. అప్పుడో కేసు విచారణకు వచ్చింది.

ఒక గ్రామస్తుడి కూతుర్ని వేరే జాతివాడు, ఒక ఆటవిక యువకుడు ప్రేమించాడూ. అతడు తన జాతివాడే అయిన మరో గ్రామంలో వున్న వ్యాపారికి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు ఆమె ప్రేమను గమన్ంచకుండా కన్యాశుల్కం కోసం కూతుర్ని అమ్ముకున్నాడని ఈ కుర్రవాడు కోపం పెంచుకున్నాడు. ఆ అమ్మాయిని, భర్తను ఏమీ చేయలేదు కానీ తండ్రిని, సోదరులను, వాళ్ల నౌకర్లను ఇలా పదకొండుమందిని చంపేశాడు. అతన్ని ఆ గ్రామస్తులు బంధించి విరాట్ ముందుకు విచారణకై తెచ్చారు. వాళ్ళు చెప్పినది వ్న్నాక విరాట్ ఈ కుర్రవాణ్నిఇ అడిగాడు – అదంతా నిజమేనా? అని. ’నిజమేదో నీకెలా తెలుస్తుంది? ఇతురుల మాటలు విని నిజాలు తెలుసుకుంటాననుకుంటున్నావ్. నాకు తోచినది నేను చేశాను. అది నేరంగా నీకు తోస్తే తోచనీ. నా మీద ఆరోపణ చేసిన వాళ్లనీ, నీ తీర్పునీ నేను ద్వేషిస్తాను.’ అన్నాడు ఆ కుర్రవాడు నిర్భయంగా.

విరాట్ మర్నాడు తీర్పు చెపుతానన్నాడు. చాలా దూరం నుండి వచ్చాం కాబట్టి ఇక ఉండలేమనీ, ఆ రోజే తీర్పు చెప్పాలనీ గ్రామస్థులు పట్టుబట్టారు. విరాట్ చల్లటినీళ్ళతో తనని తాను చల్లబరచుకుని ’పదకొండుసార్లు ప్రతీసారీ వంద కొరడా దెబ్బలు తినాలి. జీవితం భగవంతుని అనుగ్రహం కాబట్టి యితను జీవించే హక్కు కోల్పోడు.’ అన్నాడూ. అందరూ చప్పట్లు కొట్టారు.

ముద్దాయి మాత్రం ’నీ దయ నాకక్కరలేదు. నానుంచి హరిస్తున్నదానితో పోలిస్తే నీ దయ ఏపాటిది?’ అన్నాడు. అదేమిటంటే ’అవును, నన్ను ఒక్కసారిగా చంపినా ఫర్వాలేదు. కానీ ఏళ్ళకు ఏళ్ళు కుళ్ళబెట్టి చంపుతున్నావు.నీ పిరికి హృదయం రక్తపాతాన్ని తట్టుకోలేదు కాబట్టి యిలాటి తీర్పులు యిచ్చ్ ప్రజల యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని బలి పెడుతున్నావు. కొరడా దెబ్బల రుచి ఎలా ఉంటుందో రుచి చూశావా? చెరసాల జీవితం ఎలా వుంటుందో తెలుసా? మా అడవి మనుషుల కంటె క్రూరుడివి నీవు.’ అని విరుచుకు పడ్డాడు.

ఇది ఒక గొప్ప పాయింటు. మనం చాలా గొప్పవాళ్లం, తప్పు చేయనివాళ్ళం, పవిత్రులం అనుకుంటూ ఎడా పెడా తీర్పులు చెప్పేస్తాం. జజ్‍మెంట్లు పాస్ చేస్తాం. వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు, నేరం చేశాడు. బుద్ధి వచ్చేట్లు నాలుగు తన్నాలి, తోలు వలిచేయాలి అంటూ. వాడి పరిస్థితులు అర్థం చేఉకోము. నేనైతే అలా చేయను అనుకుని సర్దిచెప్పుకుంటాం. అంతేగానీ వాడి స్థితిలోకి వెళ్లం కదా. వెళ్లినపుడు వాడిలా ప్రవర్తిస్తామో, వాడి కంటె హీనంగా ప్రవర్తిస్తామో? పైగా ఏది నీతి? ఏది ధర్మం? కాలం బట్టి, సమాజం బట్టి నీతి మారుతూంటుంది. త్రేతాయుగంలో రాముడు శంభుకుడిని వధించినది ఆ యుగానికి రైటు. ఈ యుగంలో తప్పు. ఈ యుగంలో కూచుని రాముడి మీద తీర్పు యివ్వకూడదు. మనిషిని ఇంట్లో చంపితే తప్పు, యుద్ధంలో చంపితే ఒప్పు, మెప్పు. మేనరికం కొన్ని అమాజాల్లో ఒప్పు, కొన్నిట్లో యిన్‍సెస్ట్ అనే మహాపాపం. దారినపోయే బాటసారి తోటలో కాయ తెంపుకుంటూ తిట్టి వదిలేస్తాం. అదే జీతమిచ్చి కాపలాకు పెట్టినవడే తినేస్తే శిక్ష వేరేలా వుంటుంది కదా! మన మనోవికారాల బట్టి తీర్పు యివ్వడం జరుగుతుంది.

ఇక్కడ విరాట్‍కు రక్తం చిందించడం యిష్టం లేదు కాబట్టి ఖైదీలకు వేరే రకమైన శిక్ష విధించాడు. కానీ ఆ శిక్ష కలగజేసే శారీరక, మానసిక బాధ ఎటువంటిదో అతనికి తెలియదు. ఆ ఖైదీ వెళుతూ వెళుతూ చూసిన చూపు – ఆ చూపు చనిపోయిన విరాట్ అన్నగారి చూపులాగానే వుంది – ఆ చూపులో అర్థమైంది విరాట్కి. అది స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తుంది అనుకున్నాడు. మత్నాడు నెల్లాళ్ల సెలవుపై వెళుతున్నానని అందరికీ చెప్పి, ఆ ఖైదీ వద్దకు వెళ్లాడు. అతని బదులుతను ఖైదులో వుంటానని, నెల్లాళ్ల తర్వాత అతను తిరిగి రావాలని ఒట్టు వేయించుకుని బయటకు పంపించాడు. ఈ రహస్యం మనిద్దరి మధ్యనే వుండాలన్నాడు. ఖైదీ ఆశ్చర్యపడుతూనే బయటకు వెళ్లాడు.

ఇతన్ని మర్నాడు కొరడా దెబ్బలు కొట్తారు సైనికులు. 70 దెబ్బలు కొట్టేసరికే యింతటి మహా యోధుడూ మూర్ఛపోయాడు. తర్వాత పాతాళఖైదులో జీవితం ఎంత నిస్సారంగా, ఎంత భయానకంగా వుంటుందో అతనికి తెలిసివచ్చింది. తన ప్రాయశ్చిత్త కర్మ అతనికి ఆనందాన్ని, తృప్తినీ కలిగించింది. కానీ 19 వ రోజున హఠాత్తుగా తను విడిపించిన ఖైదీ అన్నమాట ప్రకారం తిరిగి రాకపోతే? అన్న సందేహం వుదయించింది. అంతే ఆ తర్వాత మనసంతా గిగులే, భయమే. తన పిచ్చిపనికి దేవుణ్ని, మహారాఉని, గుర్తుఉ వచ్చిన ప్రతీవాణ్ని తిట్టుకున్నాడు. ఆహారం, పానీయం ఏదీ రుచించలేదు. బండరాళ్లకు తల మోదుకోవడమే పని. ఇలాటి పరిస్థితిలో ఆ ఖైదీ తిరిగి వచ్చాడు. ఇతన్ని చెర విడిపించాడు. కానీ విరాట్‍ఉ తను న్యాయమూర్తిగా పనికిరాననిపించింది. ఆ వుద్యోగం మానేస్తానని రాజుని వేడుకున్నాడు. ’సరే నీ యిష్టం, నాకు ప్రధాన సలహాదారుగా వుండు’ అన్నాడు రాజు.

ఇక్కడ ఒకటి రెండు విషయాలు మనం గుర్తించాలి – మనం అనుభవించినపుడే అవతలికి వాళ్ళకు ఉపదేశించే హక్కు వస్తుంది. ఓ సారి మహాత్మాగాంధీ గారి వద్దకు ఒకావిడ వాళ్ల పిల్లాణ్ని వెంటబెట్టుకుని వచ్చింది. ’మా వాడికి బెల్లం తినే అలవాటు వుంది. మానేయమని మీరు గట్టిగా చెప్పండి’ అని బతిమాలింది. ’వారం తర్వాత రా’ అన్నాడీయన. అప్పుడు ఆ అబ్బాయికి ‘మానేయవయ్యా, అలావాటి తప్పించుకోవడం అంత కష్టమేమీ కాదు’ అని చెప్పాడు – ’నిజానికి నాకూ బెల్లం తినే అలవాటుంది. ముందు నేను మానేసి ఆ తర్వాత చెప్దామని వారం గడువు అడిగాను. వారంలో అలవాటు తప్పించుకోగలిగాను అన్నారు.

ఇక్కడ శిక్ష స్వయంగా అనుభవించాకనే విరాట్‍కు తనెంత కఠినమైన, క్రూరమైన శిక్షలు వేస్తున్నదీ అర్థమైంది. క్రీస్తుపూర్వమే కాదు, యిప్పటికే ఖైదు జీవితాలు అధ్వాన్నంగానే వున్నాయి. 54 ఏళ్లపాటు ఏ విచారణా లేకుండా జైల్లో మగ్గిన అస్సాం ఖైదీ ఒకతను యీ మధ్యే పోయాడు. శిక్ష విధించే శాఖ వేర్ఉ, జైళ్ళు నిర్వహించే శాఖ వేరు. సంజయ్ దత్ జైల్లోంచి పెరోల్ మీద బయటకు వచ్చి జైళ్ల మాన్యువల్ నూరేళ్ల నాటిది, దాన్ని మార్చాలి అంటున్నాడూ. సినిమాలో జైళ్ల సెట్టింగుల్లో నటించినప్పుడు ఆయనకా విషయం స్ఫురించలేదు. స్వానుభవం మీదనే తెలిసింది.

మళ్లీ కథలోకి వద్దాం. విరాట్‍కు ఇప్పుడు సలహాదారుగా మంచి పేరు వచ్చింది. ఇంటి పట్టున వుండి అనేక సంవత్సరాలు చాలా గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఒకసారి వాళ్లింట్లో బానిస పారిపోయాడు. అతని కొడుకు అతన్ని పట్టుకుని తెచ్చి రక్తాలు వచ్చేట్లు కొట్టాడు. అది చూసి విరాట్ బాధపడ్డాడు. ఆ బానిసకు విముక్తి ప్రస్తాదిస్తానన్నాడు. కొడుకులు తిరగబడ్డారు – ’తప్పుచేసినవాణ్ని దండించకపోగా బహుమతి యిస్తానంటావేమిటి? రేపుపొద్దున్న మరొకడు పారిపోతే యీ పనులన్నీ మేం చేయలా? వాడు సాటి మనిషి, పని చేయించకూడదు అంటే ఎద్దులను మాత్రం కష్టపెట్టడమేందుకు? వాతి బదులు మన్మే పొలం దున్నవచ్చుగా? ఇంతెందుకు మాకిన్ని నీతులు చెతుతున్నావు. నువ్వెప్పుడైనా నీ పనుకు చేసుకున్నావా? ఇతరుల శ్రమపైననే కదా యిన్నాళ్లూ ఆధారపడ్డావు, సుఖంగా బతికావు?’ అని దులిపేశారు.

ఇది మరొక జటిలమైన సమస్య. ఆ యుగంలో బానిసలు వుండడం సమంజసమే. అందుకే విరాట్ కూడా చిన్నప్పటి నుండీ బానిసల చేత ఊడిగం చేయించుకోవడం తప్పుగా భావించలేదు. కానీ యీరోజు రక్తపాతం చూడలేక జాలి చూపించబోతే యిన్నాల్లూ సౌఖ్యాలు అనుభవించిన యితరులు ప్రశ్నించారు. నిజమే ఎవరూ చేయకపోతే పనులెలా అవుతాయి? చేయించుకోకపోతే పనివారికి మాత్రం తిండి ఎక్కణ్నుంచి వస్తుంది? వేశ్యావృత్తిని నిర్మూలిస్తాం అంటారు. బాగానే వుంది. తర్వాత వాళ్లు ఎలా బతుకుతారు? వాళ్లకు వేరే పని నేర్పించినా నేర్చుకుంటారా? లేక వీళ్లందరినీ రోడ్డు మీదకు తరిమేసి వూరుకుంటే సరిపోతుందా? ఆలోచిస్తే అన్నీ సమస్యలే. మనసుంటే అన్నీ చిక్కుప్రశ్నలే. ’లైఫ్ యీజే గేమ్ ఫర్ ఏ ఫూల్, ఏ పజిల్ ఫల్ వైజ్’ అన్నారు పెద్దలు. ’మనిషికి మనసే తీరని శిక్ష’ అన్నారు సినీ కవులు.

కొడుకులు లేవదీసిన ప్రశ్నలకు విరాట్ వద్ద సమాధానం లేదు. ’పాపం చెయ్యాల్సిన అవసరం కలిగించే పనులన్నిటినుండీ నేను దూరంగా వుంటాను. బానిసలందర్నీ విముక్తుల్ని చేయండి. మీకు అవసరమైన పనుల్ని మీరే చేసుకోండి’ అని తన పల్లల్ని ఆదేశించాడు. అప్పుడు వాళ్లు ’పాపం చుట్టుకుంటుందన్న భయంతో మీరు బానిసల్ని శాసించటం లేదు. బాగానే వుంది. మరి అలాటప్పుడు బానిసల్ని విడిచేయమని మమ్మల్ని మాత్రం ఎందుకు శాసిస్తున్నారు?’ అని పాయింటు లాగారు.

ఇది మరొక చిక్కుప్రశ్న. ఇప్పుడొక కమ్యూనిస్టు వున్నాడు. ’మతం మత్తుమందు లాటిదిఇ, దేవుడిపై ఆధారపడకుండా మీ బాగుకై మీరే శ్రమించండి’ అని వూళ్లో అందరికీ భోధిస్తున్నాడు. తను అలాగే నడుచుకుంటున్నాడు. కానీ అతని భార్యకు దేవుడిపై విశ్వాసముంది. ఆమె పూజలు చేస్తానంటోంది. అతను ఆమెను శాసించి పూజలు మాన్పించాలా? లేక ఎవరి ఇష్టం వారిదని వదిలేయాలా? ఎలా చేసినా విమర్శ తప్పదు. మాన్పిస్తే వ్యక్తిగత స్వేచ్ఛ హరిస్తున్నాడన్న నింద మోయక తప్పదు. అది అతను చెప్పే అందరూ సమానమే నీతికి విరుద్ధంగా ప్రవర్తించినెట్టే అయింది. లింకన్ బానిసత్వాన్ని రూపుమాపాడంటే బలిమితో దాన్ని సాధించాడు, యుద్ధాలు చేసి మాన్పించాడు. కానీ విరాట్‍‍కి యుద్ధం కూడా పడదే! ఇక ఈ సమస్యకు పరిష్కారం చూపలేక యిల్లు వదిలి వెళ్లిపోయాడు.

బుద్ధుడు యిల్లు వదిలి పెట్టి వెళ్లిపోయాడంటే ఓహో అంటాం. కానీ అతని భార్య యశోధర మాటేమిటి? ఆమె యవ్వనం.కోరికలు, ఆసరా వాటిని ఎవరు తిరిగి యిస్తారు? లోకానికి సంతోషం కలిగించే మార్గం కనుగొనడానికి బుద్ధుడు ఒక వ్యక్తి సంతోషాన్ని బలిపెట్టడం న్యాయమేనా? వ్యక్తిగత సుఖం, సామాజిక సుఖం వీటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? వ్యక్తి మాత్రం సమాజంలో భాగం కాడా?

ఇల్లు వదిలి, సమాజాన్ని వదిలి అడవిలో నివాసం ఏర్పరచుకున్న విరాట్‍కు పక్షులతో సాన్నిహిత్యం ఏర్పడింది. జంతువులతో సాన్నిహిత్యం ఏర్పడింది. వాటిలోనూ హింసాప్రవృత్తి వుందని గ్రహిస్తూనే ఆ వ్యవహారాల్లో తను కేవలం ప్రేక్షకుడిగా వుండడం అతన్ని తృప్తి పరిచింది. కానీ సమాజానికి దూరంగా వుండగలిగాడా? ఏడాదిన్నర గడిచాక ఓ వేటగాడి కంటబడ్డాడు. అంతే ఋషితుల్యుడైన ఈ వ్యక్తి గురించి అంతటా పేరు పాకింది. చాలామంది ఆయనలాగే సర్వసంగపరిత్యాగులు కాసాగారు. విరాట్ కూడా సమాజాన్ని వదిలిపెట్టలేకపోయాడు ఓ రోజు ఓ సాధువు అరీరం తన కుటీరం వద్ద కనబడితే దాని అంత్యక్రియలకై వెళ్లి జనాల సహాయం అడగవలసి వచ్చింది. అప్పుడు ఓ యిల్లాలు తనను కోపంగా చూడ్డం గమనించాడు. ఆమె భర్త ఓ సాలెవాడూ. డబ్బు సంపాదించి, భార్యను, ముగ్గురు పిల్లలను బాగా చూసుకునేవాడూ. ఇప్పుడీ విరాట్ మోజులో పడి ఇల్లు వదిలిపెట్ట్ అడవుల్లో ముక్కు మూసుకుని కూచున్నాడు. ఆకలికి తాళలేక ముగ్గురు పిల్లలూ మరణించారు. ఇదంతా నీ వల్లనే అంటుంది ఆ యిల్లాలు. ఒక పని చేసేముందు దాని పరిణామాలెలా వుంటాయో అని ఆలోచించలేనివాడివి నువ్వేం మహాత్ముడివి? అని తిట్టిపోసింది.

ఈ ధర్మసంకటం విరాట్‍ను ఆలోచనలో పడేసింది. రాజు వద్దకు వెళ్లి యికపై సాధువుగా వుండనన్నాడు. మానవసేవకు దూరం కావడం తప్పు అని తెలుసుకున్నానన్నాడు. పని నిర్వహణ మాత్రమే మన పని. ఫలితం భగవంతుని చేతులో వుంది. తర్కించక కార్యాచరణకు సిద్ధపడేవాడు మాత్రమే నిజమైన స్వతంత్రుడు. పనిలో ఉన్నతమైనది, అల్పమైనదీ ఏదీ లేదు.’ అన్నాడు. రాజుగారికి మండింది. నన్ను సేవించినా కుక్కలను సేవించినా ఒకటే నంటాడా? అనుకుని కుక్కల కాపలాదారుగా నియమించాడు. విరాట్ ఏ మాత్రం సంకోచించకుండా సరేనన్నాడు. కానీ కుటుంబానికి సంకోచం వుంటుందిగా, వాళ్లు యితన్ని వదిలిపెట్టేశారు. ఇతను నౌకర్ల గదిల్లోనే నివసించాడు. కొంతకాలానికి రాజు మరణించాడు. కొత్తరాజుగారికి యితని గతం తెలియదు. ఓ సారి కుక్క అనవసరంగా మొరిగితే కోపం కొద్దీ విరాట్‍ను బెత్తంతో మోదాడు.

విరాట్ అనామకుడు ఐపోయాడు. చనిపోయినపుడు బానిసలను దహనం చేసే శ్మశానంలోనే ఆయన్నూ దహనం చేశారు. కుక్కలు మాత్రం రెండు రోజులు తిండీ తిప్పలూ మానేసి రాత్రింబవళ్లు మొరిగాయి. అంతే ఆ తరువాత యజమానిని మర్చిపోయాయి. అంతటితో విరాట్ కథ సమాప్తమైంది.

ఇలా విరాట్ జీవితంలో ఎన్నో జటిలమైన ప్రశ్నలు, ధర్మసంకటాలు. ఏది మంచి? ఏది చెడు? ఏది సత్యం? ఏది అసత్యం? అన్న మీమాంస అతన్ని జీవితాంతం వెంటాడింది. ఈ సృష్టిలో ఏదీ అబ్సల్యుట్ ట్రూత్ లేదు. అన్నీ సాపేక్షమైనవే! రెలటివ్ గానే ఉంటాయి. మరొకదానితో ముడిపడే ఉంటాయి. అందుకే శ్రీశ్రీ అడిగాడు –
“ఏది సత్యం..? ఏదసత్యం?..
ఓ మహాత్మా! ఓ మహర్షీ!”
ఎవరు తేలుస్తారు? ఎవరు తేల్చగలరు?
విరాట్ కథలో ఓ మనసున్న మనిషి ఎదుర్కునే సంఘర్షణ చూపాడు. యుద్ధ వ్యవస్థలో, న్యాయవ్యవస్థలో, కార్మిక వ్యవస్థలో, ఆధ్యాత్మిక వ్యవస్థలో నాణానికి అటూ ఇటూ రెండు చూపాడు. సమస్య ఎదురైనప్పుడల్లా విరాట్ తప్పుకుంటూ పోయాడు. అమేయమైన శక్తియుక్తులు, బుద్ధి కుశలత ఉంది కూడా, చివరకు అనామకుడిగా, సమాజానికి ఉపయోగపడకుండా అయిపోయాడు. తమాషా ఏమిటంటే, ‘విరాట్’ అనే ఈ పజిల్ ను సృష్టించిన రచయిత తన అరవై ఒకటవ ఏట భార్యతో పాటు ఆత్మహత్య చేసుకున్నాడు.

మన హిందూ ఫిలాసఫి వీటికి ఏ పరిష్కారం చూపుతుంది? నీటి వలెనే బురద ఏర్పడుతుంది. ఆ బురద కడుక్కోవాలంటే నీటినే ఉపయోగించాలి. అలాగే కర్మల వల్లనే పాపపుణ్యాలు ఏర్పడతాయి. పాపాలను కడుక్కోవాలంట కర్మల ద్వారానే సాధ్యం. కర్మలయందు విముఖుడైన వుండద్దంటాడు కృష్ణపరమాత్ముడు. మా తే సంగోత్సవ కర్మణి! కర్మ చేయడం వరకే నీ విధి, ఫలితం నాకు వదిలేయ్ కర్మఫలానికి నువ్వు కారణానికి, హేతువు కావద్దు అంటాడు.

ఆ విధి అన్నది మనం హిందూమతంలో చెప్పే ధర్మం. ధర్మవ్యాధుడు కసాయివాడే. కానీ పూజనీయుడే. కసాయి వృత్తి అతని ధర్మం. తగుపాటి హింస లేనిదే, సమాజం సాగదని హిందూ మతం ఎప్పుడో గ్రహించింది. జంతువులపై పరీక్ష చేయనిదే మనషులకోసం తయారుచేసే ఔషదాలు తయారుకావు. కుక్కలను పట్టుకెళ్ళవద్దని జంతుప్రేమికులంటారు, కరుస్తున్నాయి చచ్చిపోతున్నాం బాబోయ్ అంటారు మామూలు ప్రజలు. ఎవరి మాట వినాలి. ఈ ధర్మాన్ని ఎవరికి వారు గ్రహించాలి. ఆచరించాలి. స్వధర్మమేదో నిర్ణయించుకోవాలి. అనుసరించాలి.

ఈ మాటలను సాలెవాడి భార్య ద్వారా చెప్పించారు రచయిత. ’ప్రపంచంలోని సమస్త కార్యాలు భగవత్ కార్యాలే. ఏ మనిషి కూడా తన యిష్టప్రకారం ఆ పనుల నుంచి ఆ బాధ్యతల నుంచి తప్పించుకునే వీలు లేదు. నీ బుద్ధికి అహంకారం పడితే నీ కర్మలకు నీవే కర్తవు కావగలననుకుంటావు. నీకు అమృతం అయినది మరొకడికి విషం అవుతుంది. అందువల్ల నీ ధర్మం ఏదో తెలుసుకుని ఆచరించు.’ అని.

పుస్తకం చదివి చూడండి.

*********************
మూలం: Virat : The eyes of undying brother (By Stefan Zweig)About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.22 Comments


 1. varaprasaad.k

  వరప్రసాద్ రెడ్డి గారిలో ఇంతగొప్ప కధకుడున్నాడని ఇపుడే తెలిసింది,ఓ పాతికేళ్ల క్రితం అనుకుంటా గొప్ప టీకా కానీ పెట్టారని తెలుసు గానీ ఇంత చక్కగా రాస్తారని ఇపుడే తెలిసింది.నిజానికి కథ చాలా బావుంది అనే కంటే సమీక్షా ద్వారా కథకు మరింత న్యాయం చేశారని చెప్పొచ్చు.నిజానికి నేను పుస్తకం నుండి కోరుకొనేది ఇదే.ప్రతి వారి తాము పరిచయం చేసే పుస్తకం గురించి ఇంత విపులంగా చర్చిస్తేనే న్యాయంగా ఉంటుంది,ఎదో గొప్పగా మొదలు పెట్టడం,కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు నాలుగు మాటలు గెలకడం,ఆపైన మిగతా అంతా పుస్తకం కొని చదివితేనే బావుంటుంది అని సలహా చెప్పటం.కొందరికి కుదిరినట్టు అందరికి కుదరాలికదా,సొంత వ్యాపకాలతో మునిగి తేలుతూ ఎదో అర్ధరాత్రి కాసింత టైం దొరికితే తెలుగు దొరికే ఇలాంటి చోటు వెతుక్కొని ఆనంద పడతాం.ఎపుడో వీలైనప్పుడు ఆ పుస్తకం కొని తరిస్తాం.కానీ మీరు ముందే నీళ్లు చల్లేస్తే ఎలాగండి బాబు.పద్మవల్లి గారి ది అవుట్ సైడర్స్ ,వరప్రసాద్ రెడ్డి గారి విరాట్,నామిని గురించి ఏనుగు పడింది గట్రా, సమీక్షలంటే.రాస్తే ఆలా రాయండి,ఇదంతా ఎప్పటినుంచో అందరితో పంచుకోవాలను కొంటున్నాను,ఇపుడు విరాట్ చదివేసరికి ఇక ఆగలేక బయటపడిపోయాను,తప్పనుకుంటే క్షమించండి.కానీ సమీక్షలు మరింత విపులంగా రాయండి…………….వరప్రసాద్.


 2. Rajesh Devabhaktuni

  వారం క్రితం హైదరాబాదు నుండి ఈ పుస్తకం తెప్పించాను. ఈ రోజే చదివి ముగించాను. బాగుంది….

  కాని పై వ్యాసం చదివాక ఇంకా పుస్తకం చదవాల్సిన అవసరం లేదు … పుస్తకం లోని విషయాన్ని పరిచయం చేయకుండా… మొత్తం పుస్తకంలోని విషయాన్ని క్లుప్తంగా ఇక్కడ వ్రాసారు. అందుకే పుస్తకం చదివాక ఇది చదవండి.


 3. Pavan

  I got this book sometime back from my father. He works in judiciary dept. and this book is distributed to him from the judiciary dept.
  I go speechless in describing the effect of this book on me and i can say that i tried to get a small byte from bhagavad gita through this book.
  I dont know, how many such stories can we write based on our gita.
  Sometimes, i wonder how this single book can speak so much truth that every time i can open and cross-check its applicability to every event in our lives.
  Great book!!!!


 4. madhu

  This is great book.This book was given to me by Dr Vara Prasad Reddy in 2007, The book was so good, I want to share with many people. At my request I borrowed another 10 more copies and given it to friends.
  I wanted more, but Dr Vara Prasad ran out of his copies.
  Then I approached Punugoti for copies. He also does not have copies and said he will publish. In spite of my continuous persuation, I could not get the book published.Some body has got the book published without price and distributed free and I also got some copies and given to many people.

  The translation by Punugoti is really fantastic. I believe this was translated by Smt Chaya devi garu also.She has the original books in English. I also bought one book containing some stories and I gave it to a friend and I have to get it back.

  In Vijayavada book exhibition in January 2010 I put up a stall to sell books like Telugu Kathaku Jeje Jeje and other books of Sakam Nagaraja, Telugu padayam maa Nanna and books of Namini.

  Then Kosaraju Suresh of “www.manchipustakam.in” came to my stall and gave Virat, which I was giving free to friends, who visited me. Whom ever I given Virat, all of them thanked me for giving such a good book

  Suresh sat in the exhibition and completed this book and wanted to publish this book. Then i asked him contact Punugoti and finally the book has come out and will be available with “www.manchipustakam.in”
  You can contact them at info@manchipustakam.in and tel 94907 46614 to get the copies.

  This is all happened because of Dr Vara Prasad


 5. […] గారు పుస్తకం.నెట్ లో రాసిన వ్యాసం ఇక్కడ చదవండి! (No Ratings Yet)  Loading […]


 6. […] విరాట్ పై పుస్తకంలో వచ్చిన వ్యాసం ఇక్కడ. […]


 7. Srinivas Vuruputuri

  నిర్వాహకులకు,

  “బుద్ధుడు యిల్లు వదిలి పెట్టి వెళ్లిపోయాడంటే ఓహో అంటాం. కానీ అతని తల్లి యశోధర మాటేమిటి?” – తల్లి కాదు, భార్య అని ఉండాలి కదా. సవరించగలరా?


 8. రమణ

  @పూర్ణిమ : సమాచారానికి కృతజ్ఞతలు. బెంగళూరు పుస్తక ప్రదర్శనశాలలో ఈ పుస్తకం మరియు మరికొన్ని పుస్తకాలు మీ ‘హైదరాబాద్ పుస్తక ప్రదర్శన 2010’ పోస్ట్ లోవి వెతికాను కానీ దొరకలేదు.


 9. Purnima

  ఈ పుస్తకం, ఇప్పుడు జరుగుతున్న హైదరబాద్ బుక్ ఫేర్‍లో లభిస్తుంది. వీక్షణం వారి స్టాల్‍లో చూశాను.


 10. @పుస్తకం.నెట్: ఈ వ్యాఖ్యలను వరప్రసాదరెడ్డి గారికి పంపి వారి స్పందన కూడా పాఠకులకు తెలియచేయగలరు.


 11. Ganesh

  ee pusthakam chaala baagundi


 12. విరాట్ పుస్తక సమీక్ష బాగుంది. నిజానికి ఇది సమీక్షలా కాకుండా, ఏది ధర్మం, ఏది అధర్మం అనే విషయాలపై తర్కిస్తూ రాసిన వ్యాసంలా గోచరిస్తుంది. తాత్విక చింతన, మార్మికత కలిసి ఉన్నాయీ పుస్తకంలో. అగ్రకులాధిపత్యానికి, ఆధిపత్య భావజాలానికి ప్రాతినిధ్యం వహించే సంఘటనే శంభూక వధ. చూసే దృక్పధాన్నిబట్టి దీన్ని ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. సమీక్ష చదివాకే ఇంతటి మీమాంసకు గురైతే, అసలు పుస్తకం చదవటం ఇంకా మేలు కదా . 1999లో వెలువడిన ఈ పుస్తకం ఇప్పుడు లభ్యం కావటం లేదని పై వ్యాఖ్యలవలన తెలుస్తుంది. హాసం తరపున దీనిని మీరు ప్రచురించ కోరుతాను.


 13. bala

  విరాట్ పుస్తక పరిచయం బాగుంది. వెంటనె చదవాలని వుంది. ఇక కథ గురించి నాకో చిన్న సందెహం. విరాట్ యోధుడు కదా. మరి అర్ధరాత్రి శత్రువులను ఎందుకు చంపాడు? ఇది యోధునికి తగునా? ఇంకా పుస్తకం పూర్తిగా చదవలెదు కాబట్టి ఇలాంటి సందెహాలు సబబు కాదేమొ.


 14. వరప్రసాద్ రెడ్డి గారు,
  ఈ website నేను మొదటి సారిగా చదువుతున్నాను. మేరు రాసిన ఈ విరాట్ చాలా బాగుంది. ఇందులో ఉన్న అన్ని సందర్బాలు ఆలోచించే విదంగా ఉన్నాయి. నాకు ఎప్పుడు పుస్తకాలూ చదివే అలవాటు లేదు, కానీ ఇప్పుడు ఈ కథ చదివాకా తెలుగు నవలలు, పుస్తకాలూ చదవాలనిపిస్తుంది.
  thanks for giving good article.
  -లక్ష్మణ్


 15. హెచ్చార్కె

  ‘త్రేతాయుగంలో రాముడు శూద్రకుణ్ని వధించినది ఆ యుగానికి రైటు. ఈ యుగంలో తప్పు. ఈ యుగంలో కూచుని రాముడి మీద తీర్పు యివ్వకూడదు.’
  అన్యాయం సార్‍.
  రాముడు చంపిన మహర్షి పేరు శూద్రకుడు కాదు. శంబుకుడు. కులానికి శూద్రుడు.
  ఫ్యాక్చువల్ ఎర్రర్ సంగతి అలా వుంచి, శంబుకుడిని… ఒక నిరాయుధుడిని, తపస్విని… శూద్రుడు చదువుకోరాదని (తపస్సు చేయరాదని) శాసించే ‘వర్ణాశ్రమ ధర్మా’న్ని రక్షించడం కోసం రాముడు చంపాడు. అలాంటి హీన చర్య త్రేతా యుగంలోనైనా ఇంకే తాతా యుగంలోనైనా తప్పే. రామాయణం అనేది మ్యూజియంలో వస్తువు కాదు. నేటికీ అదొక సజీవ సాంస్కృతిక విశేషం. అది ప్రవచించే ‘ధర్మాల’ను ఈనాటి సమాజం గట్టిగానే పట్టించుకుంటోంది. పితృద్వామిక, వర్ణాశ్ర్రమ ధర్మాల ప్రసక్తి లేకుండా రామ కథను వూహించలేం. అలాంటి హీనత్వాలు ‘ధర్మం’ పేరిట ప్రచారం ప్రచారం కావడానికి ఈనాడు రామాయణాన్ని ఉపయోగించుకుంటున్నారు. అందువల్ల, అది అప్పటి దర్మం, ఇప్పుడెందుకు పట్టించుకుంటారని ఎలా అనడం అన్యాయం.
  రాజి రెడ్డి అన్నట్లు పుస్తక పరిచయంలో ఇలాంటి ‘వాల్యూ జడ్జిమెంట్లు. దొర్లాల్సింది కాదు.


 16. పరిచయమే ఒక పెద్ద షాకింగ్ లా అనిపిస్తోంది. తప్పక చదవాలీ పుస్తకాన్ని. మిత్రులెవరైనా లభించే చోటు చెపుతారని ఆశిస్తున్నాను.

  బొల్లోజు బాబా


 17. ఒక గొప్ప పుస్తకాన్ని గుర్తుచేసినందుకు మీకు ధన్యవాదాలు. నా జీవితంలో కూడా నన్ను అతలాకుతలం చేసిన పుస్తకాల్లో మొదటిది అంతర్ముఖం ( యండమూరి ) రెండోది విరాట్. మొత్తం షేక్ చేసింది విరాట్. నా దృక్పథానికి పునర్జన్మను ఇచ్చింది. కొన్ని నెలలపాటు జ్వలించిపోయాను. జనవిఙ్ఞానవేదిక నాయకులు గేయానంద్ గారు నాకు ఈ పుస్తకాన్ని చదవమని ఇచ్చారు. తర్వాత నా అభిప్రాయం చెప్పమన్నారు. నిజానికి నేను డీప్ షాక్ ( షాక్… ట్రాన్స్ ఏదైనా అనండి )లో పడిపోయాను. ఏమీ చెప్పలేకపోయాను. ఏదో ఏదేదో అని మనం అనుకునే ఈ జీవితానికి అర్థం ఉందా? భ్రమల్ని పటాపంచలు చేస్తుంది విరాట్. మనం సత్యం అనే విషయాన్ని ఎంతసేపూ మన కోణంలోంచి చూసి అదే నిజమని నమ్ముతాము. ఎదుటి వ్యక్తి పరిస్థితి ఆలోచించం. జీవితం ప్రతి స్టేజిలోనూ నిరంతరాయంగా నీ పని నీవు చేసుకుపోతూనే ఉండు. ఫలితాన్ని ఆశించకపోవడం వల్లనే విరాట్ ఎప్పటికప్పుడు అన్నిటిని త్యాగం చేయగలుగుతాడు. తనను తాను తెలుసుకునే క్రమంలో వెనకడుగువేయడు. కానీ ఖైదీ అయినపుడు ఎంతో బలహీన మనస్కుడు అవుతాడు. నిజానికి ఇప్పటికీ నాకు గందరగోళంగానే అనిపిస్తుంది. జీవని స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేయడంలో విరాట్ పాత్ర తప్పకుండా ఉంది. ఈ పుస్తకం దొరికే అడ్రస్ చెబితే చాలా మందికి ఉపయోగం. నేను చాలా చోట్ల ప్రయత్నించి విఫలం అయ్యాను. పరిచయం కూడా బాగా చేశారు. విరాట్ వీరాభిమానిగా మీకు నా ధన్యవాదాలు.


 18. Welcome to Best Blog 2009 Contest

  The Andhralekha best blog 2009 contest is the first ever blog contest for telugu speaking bloggers. This contest is to recognize the effort & energy shown by bloggers. The contest is open for all bloggers and the blog should be in either english or telugu.

  Submit your best blog written in 2009 along with URL and enter to win Best blog 2009 contest. All the blogs submitted will be carefully reviewed by our senior journalists and editors. Voting for selected finalists is expected begin January 15, 2010. Top 3 winners would receive shields and surprise gifts.

  Please submit your entries by sending an email to blogchamp@andhralekha.com with your name, location, blog details and URL.

  Good Luck! Spread the word and enjoy the contest.

  plz contact andhralekha@gmail.com

  http://andhralekha.com/blog_contest/AL_blog_contest.php


 19. చాలా చక్కటి పరిచయం. ఈ పుస్తకం చదువుతాను.


 20. rajireddy

  Virat is one of my favorite books.
  He is a real Satyaanveshi.
  ‘సమాజానికి ఉపయోగపడకుండా పొయాడూ అనేది కూడా ఓ జడ్జిమెంట్.
  అది మళ్లీ మనం ఏర్పరుచుకున్న ప్రమాణమే.
  తను నమ్మిన సత్యం కోసం, మనస్ఫూర్తిగా బతికి చనిపోయిన ఓ మనిషిగా అతడిని నేను అర్థం చేసుకున్నాను.
  Thanks to Ponugoti Krishna Reddy gaaru and Varaprasad Reddy garu.


 21. సౌమ్య

  Thanks for introducing Stefan Zweig through this article.
  పుస్తకం వివరాలు, ఎక్కడ దొరుకుతుంది – వంటి వివరాలు ఏమన్నా తెలిస్తే, చెప్పగలరు.
  గూగుల్ లో వెదుకుతూ ఉంటే, గుజరాతీ అనువాదం కూడా కనిపించింది 🙂  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Fantastic night and other stories – Stefan Zweig

వ్యాసకర్త: Nagini Kandala ********* Stefan Zweig.. ఈ మధ్యే మొదలైన కొత్త ప్రేమ. అసలీ పుస్తకం కళ్ళపడే వరకూ ఈయన గు...
by అతిథి
0