వట్టికోట ఆళ్వారుస్వామి కృషి

రాసిన వారు: వరవర రావు
(ఈ వ్యాసం మొదట వీక్షణం పత్రిక జనవరి 2010 సంచిక లో ప్రచురితమైంది. పుస్తకం.నెట్ లో ప్రచురించేందుకు అనుమతించిన సంపాదకులకి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

వరవరరావు కవి, విప్లవ రచయితల సంఘం నాయకులు, తెలుగు అధ్యాపకులుగా పనిచేసి రిటైరయ్యారు. ‘తెలంగాణ విమోచనోద్యమం – తెలుగు నవల’ పై పి ఎచ్ డి చేశారు.

*************************
‘తెలంగాణం’ వ్యాసాలు వెలువడి అప్పుడే ఆరు నెలలైనప్పటికి నేను ఇటీవల రెండుసార్లు చదివాను. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన సందర్భంగా 1956లో మొదటిసారి రెండు సంపుటాలుగా ఈ వ్యాసాలు వెలువడినవి. దేశోద్ధారక గ్రంథమాల తరఫున వట్టికోట ఆళ్వారుస్వామి సంకలనం చేసారు. అప్పటికి నేను పదహారు సంవత్సరాల వయసులో పియుసి చదువుతున్నాను. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన ఆనందం, నాగార్జున సాగర్‌ ఆధునిక దేవాలయం అని భావించిన పులకింతలో ఇంత సమగ్రంగా తెలంగాణ చరిత్ర ఒకచోట చదువుకున్న ఆ అనుభూతి ఇంకా మిగిలే ఉన్నది. 53 ఏళ్లు పోయాక మళ్లీ రెండు సంపుటాలు ఒక చోటే కలిపి తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ రచయితల వేదిక పునర్ముద్రించినపుడు అంతే ఆనందంతో ఆ పుస్తకాన్ని చేతికి రాగానే చదివేసాను.

వ్యాసాల్లో అదే నిజాయితీ, అదే సత్యశోధన, అదే సులభత్వం. తేడా అల్లా అప్పుడు తెలుగువాళ్లు ఒకటవుతున్నారన్న భావన. ఆంధ్రప్రదేశ్‌ పరిపాలనా బాధ్యతలు చేపట్టే వారికి అన్ని రంగాలలో అప్పటికి తెలంగాణ సాధించిన, సాధించని, కలిగి ఉన్న, కలిగిలేని పురోగతిని వివరించాలన్న, ముందుంచాలన్న ఒక కఠోరమైన పరిశోధనా పూర్వక ప్రయత్నం.

ఇప్పుడు తెలంగాణలో మా చక్కిన మేం విడిపోతాం. కలిసి ఉండడంలో మాకు మిగిలిందల్లా చేదు అనుభవం, ఫ్యూడల్‌ పాలన నుంచి, వలస పాలన కిందికి వచ్చిన న్యూనతా భావం – కనుక 53 ఏళ్ల కింద ఉన్నట్లయినా ‘తెలంగాణం’ ఉందా లేదా సందుక తెరచుకొని చూసుకున్న నాస్టల్జియా.

ఎంత మార్పు అంటే – వట్టికోట ఆళ్వారుస్వామి ఆంధ్ర మహాసభలో క్రియాశీల కార్యకర్తగా పనిచేసారు. మాడపాటి, సురవరం, ఆదిరాజు, మగ్దూమ్‌లతోపాటు తెలంగాణ వైతాళికుల్లో ఒకరుగా పేర్కొనదగిన బహుముఖ ప్రజ్ఞావంతుడు. వీరు, వీరితోపాటు కాళోజీ, దాశరథిలు ఆంధ్ర శబ్దాన్ని తెలుగుకు పర్యాయపదంగా, అభేద్యంగానే స్వీకరించారు. శ్రీ కృష్ణరాయాంధ్ర భాషా నిలయాన్ని 1901లో ఏర్పాటు చేసిన నాటి నుంచి 1953లో అలంపూరంలో తెలంగాణ రచయితల సంఘాన్ని అఖిలాంధ్ర రచయితల సంఘంగా మార్చే వరకు ఒక ఏభై ఏళ్లు తెలంగాణ విమోచనోద్యమాన్ని ఆంధ్రాభినివేశంలోనే నిర్వహించారు. కమ్యూనిస్టులయితే (వట్టికోట ఆళ్వారుస్వామి కమ్యూనిస్టు కూడ) విశాలాంధ్ర భావనతోనే నిర్వహించారు.

ఆంధ్ర మహాభారతం నన్నయ, తిక్కన, ఎర్రనలు రచించినట్లే బమ్మెర వాడయిన పోతన శ్రీమదాంధ్ర భాగవతవేు రచించాడని భావించి గౌరవించారు. త్రిలింగ ప్రదేశాల మధ్యన నివసించిన వారంతా తెలుగు వారే అనుకున్నారు. ఆంధ్రులు కారని అనుకోలేదు. ఎందుకంటే ఒక్క కాళేశ్వరం మినహా ఇప్పుడు ఆంధ్ర రూఢ్యర్థంలో వాడుతున్న ద్రాక్షారామం, రాయలసీమగా ప్రాచుర్యానికి వచ్చిన శ్రీశైలం – మరో రెండు ఉన్నాయి త్రిలింగక్షేత్రాలలో.

కాని ఈ ఏభై మూడేళ్లలో జాతి, భాష వేరయినంతగా ఆంధ్ర, తెలంగాణ శబ్దాలు రెండు ప్రాంతాల్లోనూ మనసుల్ని కలుషితం చేసాయి.

డిసెంబర్‌ 9న రాత్రి ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభమవుతుంది’ అని కేంద్ర దేశీయ వ్యవహారాల మంత్రి ప్రకటించిన దగ్గర్నించీ ఇటు వేర్పాటువాదులు, అటు సమైక్యత పేరుతో తెలంగాణ విద్వేషవాదులు చేసుకుంటున్న పరస్పర ఆరోపణలు వింటుంటే మళ్లీ ఒకసారి ‘తెలంగాణం’ చదువవలసిన అవసరం ఎంత ఉందో అనిపించింది.

తెలంగాణం కేవలం ఒక భూగోళం కాదు. ఒక చరిత్ర, ఒక సంస్కృతి, ఒక జీవన విధానం అని సమగ్రంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సందర్భంగా ప్రజల దృష్టికి తేవాలనే ప్రయత్నంలో వట్టికోట ఆళ్వారుస్వామి ఏ చరిత్ర పరిశోధకుడు కూడా చేయని కృషి చేసారు. అప్పటి నుంచీ ఇప్పటివరకు గత 53 ఏళ్లలో మళ్లీ ఇటువంటి కృషి జరుగనేలేదు. ప్రాచీన చరిత్ర, ఆ చరిత్ర నిర్మాణానికవసరమైన నాణెములు, శాసనములు, తాళపత్ర గ్రంథాలు, దేవాలయాల చరిత్ర ఇందులో ఉన్నది. ఇవ్వాల్టి తెలంగాణకు కాకతీయులు ‘త్రిలింగ దేశం’ గా ప్రాచుర్యం తెచ్చారు కనుక, శాతవాహానుల తర్వాత మళ్లీ అంత విశాలమైన తెలుగు సామ్రాజ్యాన్ని పాలించారు గనుక కాకతీయ రాజవంశం మీద, కాకతీయ సాంఘిక చరిత్ర మీద రెండు వ్యాసాలున్నాయి. ఇవన్నీ సుప్రసిద్ధ చరిత్రకారుడు ఆదిరాజు వీరభద్రరావు గారు రాసినవే ఎంతో ప్రామాణికమైనవి. వరంగల్‌ను 12వ శతాబ్దంలోనే ‘ఆంధ్ర నగరం’ అన్నారని వినుకొండ వల్లభరాయని ‘క్రీడాభిరామం’ ఆధారంగా చెప్తున్న లగడపాటి రాజగోపాల్‌ గారు కాకతీయుల కాలం నుంచి, ఢిల్లీలో మొగలాయిల పాలన దాకా, అంటే ఇక్కడ కుతుబ్షాహీ, ఆసఫ్‌జాహీల కాలం దాకా తెలుగునేల తెలంగాణగా ప్రాచుర్యం పొందిందని ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారు. మంత్రి మాదన్న గురించి, ఆయన విదేశాంగ నీతి గురించి చొల్లేటి నృసింహాశర్మ, కె.వి. భూపాలరావు వంటి పండితులు, చరిత్ర పరిశోధకుల వ్యాసాలున్నాయి. తెలంగాణ భూగోళ, నైసర్గిక స్వూరూపాలు, కొండలు, నదులు, ఖనిజాలు వంటి వివరాలు ఆదిరాజు వీరభద్రరావు గారు రాస్తే, పరిశ్రమల గురించి, పారిశ్రామిక కార్మికుల గురించి గొబ్బూరి రామచంద్ర రావు రాసారు. బొగ్గు గనుల గురించి ఎస్‌. సోమరాజు రాసిన వ్యాసం ఎంత సందర్భోచితంగా ఉన్నదంటే సింగరేణి బొగ్గు గనుల ఓపెన్‌ కాస్ట్‌ విధ్వంసం సందర్భంగా ‘వీక్షణం’లో చదివినపుడే 53 ఏళ్ల క్రితం కాలం చెల్లిన వ్యాసం అనిపించలేదు. అట్లే తెలంగాణలో కుటీర పరిశ్రమలు, చేనేత పరిశ్రమల గురించి ప్రామాణికమైన వ్యాసాలు ఉన్నాయి. 53 ఏళ్ల తర్వాత మూలబడిన కుటీర పరిశ్రమలు, ఆత్మహాత్యల పరంపర సాగుతున్న చేనేత పరిశ్రమల వర్తమాన చరిత్ర మనం 53 ఏళ్లు ముందుకు వచ్చామని చెప్తుందా? వెనక్కు వెళ్లామని చెప్తుందా?

తెలంగాణ రాజకీయోద్యమం – భూదానోద్యమం వంటి సంస్కరణ వాదం మొదలు – భూసంస్కరణల విషయంలో కమ్యూనిస్టుల, కాంగ్రెస్‌ వాళ్ల అవగాహాన వరకు విశ్లేషించాయి. కౌలుదారీ సమస్యపై దేవులపల్లి వెంకటేశ్వరరావు రాసిన సమగ్రమైన వ్యాసం, దానికదిగా వ్యాసం మాత్రవేు కాదు, తెలంగాణలో మూడువేల గ్రామాలను విముక్తం చేసి, పదిలక్షల ఎకరాల భూమిని పంచిన విప్లవ భూ సంస్కరణల పరిచయం. ఇదంతా నిజాం వ్యతిరేక, ఫ్యూడల్‌ భూస్వామ్య వ్యతిరేక రాజకీయోద్యమంలో అంతర్భాగంగా నిర్వహించబడిన రాజకీయార్థిక ఉద్యమం. ఇటువంటి పోరాటం దేశంలో 1956 కన్న ముందు ఎక్కడా విముక్తి – విద్రోహాల దాకా నిర్వహించబడలేదు.

ఇవ్వాళ లోక్‌సత్తా – జయప్రకాశ్‌ నారాయణ్‌ మళ్లీ చాల వెనక్కు వెళ్లి ప్రాంతీయ అభివృద్ధి కమిటీలు, జిల్లా కౌన్సిళ్ల గురించి మాట్లాడి చన్నీళ్లు చల్లుతున్నారు. తెలంగాణలోని ‘స్థానిక స్వపరిపాలన విధానం’ గురించి ఆయన మరి ఒక పరిపాలనాధికారిగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినాక అధ్యయనం చేసారో లేదో.

తెలంగాణ రాయకీయోద్యమాల గురించి ఆయా పార్టీల సాధికార ప్రతినిధులనదగిన రావి నారాయణరెడ్డి, కోదాటి నారాయణరావులు రాసారు. మునగాల పరగణలోని పోరాటం గురించి లేదుగానీ పరిటాల ప్రజా ఉద్యమం గురించి ఉన్నది. సర్వాయ పాపని తిరుగుబాటు గురించి ఉన్నది. ఆదివాసుల గురించిన వ్యాసంలో తెగలు, అలవాట్లు, విశ్వాసాల ప్రస్తావన ఉంది గాని గోండుల ప్రస్థావన, ఆదిలాబాద్‌, కేసలాపురంలోన నాగోబా జాతర సందర్భంలోనైనా జోడెన్‌ ఘాట్‌ పోరాటం గురించి, రాంజీ గోండు, కొమురం భీంల స్వపరిపాలనా పోరాటం గురించి ప్రస్తావించక పోవడం పెద్దలోపం. ఆ విధంగా చూసినపుడు ఆదివాసుల సందర్భంలోనే సమ్మక్క, సారలక్క గురించి, వేుడారం జాతర గురించి ప్రస్తావన ఉంది గానీ పగిడద్దరాజు కాకతీయుల నెదిరించి చేసిన పోరాటంలో సమ్మక్క, సారలక్కలు పాల్గొని ప్రదర్శించిన సాహాసం, చేసిన త్యాగం గురించి ఉండాల్సింది.

మాడపాటి హానుమంతరావు తెలంగాణ విమోచనోద్యమ వైతాళికుడని, ఆయన ఆంధ్రప్రదేశ్‌ కేంద్ర సంఘాన్ని, ఆంధ్ర మహాసభను ప్రారంభించాడని ఇవ్వాళ అందరికీ తెలుసు. తెలంగాణ విమోచనోద్యమాన్ని ఆయన ఆంధ్రోద్యమంగా చూపాడు. అందుకే ఆయన నిజాం రాష్ట్రంలోని యంత్రాల గురించి రాసాడు. ఇది నిజానికి 1914లో రాసిన వ్యాసం. దాదాపు వంద సంవత్సరాలు గడించే వరకు ఇవ్వాళ ఎవరైనా ఈ వ్యాసాన్ని అప్‌డేట్‌ చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్‌ లోని తెలంగాణీయులు – తెలంగాణ వాళ్లు అని రాయవలసి వస్తుందనుకుంటాను. బ్రిటిష్‌ ఇండియాలో మద్రాసు ప్రావిన్సులో ఆంధ్రులు అనుభవించిన వలసాధిపత్యం వంటిదే ఏభై మూడేళ్లగా తాము అనుభవిస్తున్నామని ఇవ్వాళ తెలంగాణవాదులు (సరిగ్గా నైజాం ఆంధ్రులు అని భావించిన వాళ్ల వారసులు – అంటే మధ్యతరగతి, పెటీ బూర్జువా బుద్ధిజీవులు, రచయితలు, కళాకారులు) భావిస్తున్నారు. మహాంధ్రోదయం, విశాలాంధ్ర, ముక్కోటి ఆంధ్రులు ఒక్కటై ఉండాలని కలలుగన్న వారి వారసులే ఇవ్వాల మూడున్నర కోట్ల తెలంగాణ ఏర్పాటు గురించి కదనాన దూకారు. అందుకు సమైక్య వాద నాయకులందరూ జవాబుదారీ కావల్సిందే. అందుకే ఈ సంపుటిలో వావిలాల గోపాలకృష్ణయ్య ‘మనం ఆంధ్రులం’ అని చెప్తా, ఔనా, అట్లాగా అని కనుబొమ్మలు ముడిపడుతున్నాయి.

తెలంగాణ జానపద గేయాల గురించి జానపద సాహిాత్య పరిశోధనలో తెలుగు సాహిాత్య చరిత్రలో వేళ్లమీద లెక్కపెట్టదగిన వారిలో ఒకరైన బి. రామరాజు సాధికారికమైన వ్యాసం రాసారు. అట్లే చిత్రకళ గురించి కొండపల్లి శేషగిరి రావే స్వయంగా రాసారు.

ఇవన్నీ ఒక ఎత్తు – ఒక రచనగా, కొండను అద్దంలో చూపడంగా దాశరథి (కృష్ణమాచార్య) రాసిన ‘తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం’ ఒక ఎత్తు. తెలంగాణ కవుల గురించి వానమానులై వరదాచార్యులు 16 పేజీల వ్యాసం రాసినా ఎవరినో మరిచిపోయాడనే అనిపిస్తుంది. అసమగ్రమనిపిస్తుంది.

కాని దాశరథి రెండు పేజీలు ఎంత గడుసు సామరస్యంతో రాసాడంటే మనను ముఖద్వారంలో నిలబెట్టే ఆధునిక సాహిత్యాన్ని అంత సాకల్యంగా చూసాడు. బొంబాయి తమాషా చూసినట్లు. నోరు తెరిస్తే ప్రేవులు లెక్కపెట్టినట్లు చెప్పి ‘ఇంతకు మించి రాయకూడదు. ఎందుకంటే నా ప్రసక్తి రావలిసి వచ్చే ప్రమాదం ఉంది’ అని ముగిస్తాడు.

రెస్ట్‌ ఈజ్‌ హిస్టరీ అన్నట్లు. నిజంగా తెలంగాణంలో ఆయన నడిపిందే గదా ఆధునిక సాహిత్య చరిత్ర 1956 దాకా.

ఇంత సమగ్రమయిన పుస్తకంలో వెలితి ఏమిటో కూడ ఆళ్వారుస్వామి గారే దాచుకోకుండా వినమ్రంగా చెప్పారు.

పదిహేడు శీర్షికలకు రచనలు పొందలేకపోవడమో, వచ్చినవి తృప్తిగా లేకపోవడమో కారణమన్నారు. ఆదివాసుల గురించి ప్రస్తావన అయినా ఉన్నది గానీ ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఎంతో బలాన్నిచ్చిన భాగ్యారెడ్డి వర్మ మొదలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న దళితుల వరకు ఆనాడు ‘తెలంగాణం’లో రాయించలేదు. ముస్లింల గురించి ఆనాడే కాదు, ఈనాడు కూడ తెలంగాణలో వారొక ప్రధాన పాయ అనే గుర్తింపు రాజకీయోద్యమాల్లోనే కాదు, సాంస్కృతికోద్యమాల్లోనూ కనిపించడం లేదు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం – గత నలభై ఏళ్ల ప్రస్థానం, ఇటీవలి పదిరోజుల ప్రజా వెల్లువల నేపథ్యంలో ఇటువంటి కృషికి సంస్థలు పూనుకోవాలి. వట్టికోట ఆళ్వారుస్వామి ఒక్క చేత నడిపిన దేశోద్ధారక గ్రంథమాలతో పోలిస్తే, ఇవ్వాల తెలంగాణ విద్యావంతులు, రచయితలు, సాంస్కృతిక కార్యకర్తలు, సంస్థలు కోకొల్లలు. ‘తెలంగాణం’ను వీరంతా కలిసి అప్‌డేట్‌ చేస్తారనే ఆశిద్దాం.

You Might Also Like

2 Comments

  1. పుస్తకం » Blog Archive » నూరేళ్ళ తెలుగు నవల

    […] మంచీ-చెడూ (శారద); ప్రజల మనిషి (వట్టికోట ఆళ్వార్‌స్వామి); పెంకుటిల్లు (కొమ్మూరి […]

  2. madhurasree

    “Vattikota Alwarswamy Krushi” essay is interesting to read

Leave a Reply