అంతర్వీక్ష

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

******

తరతరాలుగా సాహిత్యం మనిషి మనుగడలో భాగంగా సమాంతరంగా నడుస్తూనే ఉంది. భూత, వర్తమాన, భవిష్య కాలాల్ని పెనవేసుకుంటూ ఆలోచన, విచక్షణ తెలిసిన మనిషిని ఉత్తమ మార్గంలో నడిపించేందుకు సాహిత్యం తోడవుతుంది. అధ్యయనం సమకూర్చిన జ్ఞానం, అవి రేకెత్తించే ఆలోచనలు, విశ్లేషణలు, బాహ్యప్రపంచంలోని అనుభవాలు దారి చూపుతుంటే రచయితలు ఒక కొత్త తెలివిడిని ప్రపంచానికి అందిస్తుంటారు. ఆ సంపదను అంతే ఉత్సుకతతోఅందిపుచ్చుకునే పాఠకులు తమతమ ఆలోచనా ప్రపంచాన్ని విస్తరింపజేసుకుంటారు. క్షరము కాని అక్షరానిదే ఆ శక్తి!

ఈమధ్య ఒక పుస్తకం మళ్ళీ మళ్ళీ నాతో చదివించింది. పుస్తకం చదవటం పూర్తి అవగానే చదివేసానన్న ఆలోచన కాక మరోసారి మొదటి పేజీ నుంచి మొదలు పెట్టేలా చేసింది. కేవలం కొన్ని పుస్తకాలే ఇలాటి మ్యాజిక్ చేస్తాయి.

ఆ పుస్తకం అంతర్వీక్ష. రచయిత్రి డా. ధూళిపాళ అన్నపూర్ణ. ఈ పుస్తకంలో అంతర్వీక్ష, బహిర్వీక్ష అన్న రెండు భాగాలున్నాయి. అంతర్వీక్ష అన్న భాగంలో ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన పదకొండు వ్యాసాలున్నాయి. సంస్కృత అధ్యాపకురాలుగా రచయిత్రి అధ్యయనం చేసిన, బోధించిన సాహిత్యం గురించి రాసినవవి. బహిర్వీక్ష అన్న భాగంలో ఆమె రాసిన కథలున్నాయి.

వాడ్రేవు వీరభద్రుడుగారు పుస్తకం గురించి ముందుమాటలో వివరంగా రాస్తూ పుస్తకాన్ని సాత్త్వికీకరణ వాచకం అన్నారు. విలువైన పుస్తకానికి మరింత విలువైన ముందుమాట! ఆయా వ్యాసాలలోని గొప్పదనాన్ని ఆయన అలవోకగా, అందంగా చెప్పారు. అంతర్వీక్ష అంటే చూపు లోపలకి తిప్పుకోవడం, బహిర్వీక్ష అంటే బయటి ప్రపంచాన్ని చూడటం అనేది మామూలు అర్థం అంటారాయన. 

మా కన్నతల్లికి మల్లెపూదండ “స్త్రీలకు వ్యక్తిత్వాలు ఎంతవరకు వెలుగులో, ఎంతవరకు నీడలో చాలా సూక్ష్మంగా ఎక్కడా వాచా చెప్పకుండా పాత్రల జీవితాల ద్వారా చెప్పించడం ఈ కథల్లో ఉందంటారు” వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు తమ ముందుమాటలో.

రచయిత్రి మరో నేస్తం నాగాభట్ల సంధ్యాదేవి నిశ్శబ్ద తరంగం అంటూ ముందుమాటలో వ్యాసాల్నీ, కథల్నీ విశ్లేషిస్తూ, 

“The woods are Lovely Dark and Deep! But I have promises to keep.

Robert Frost అక్షరాలకి ప్రతిరూపమే మా అన్నపూర్ణమ్మ” అని ముగించారు.

 అంతర్వీక్షలోని వ్యాసాలను గురించి వీరు ముగ్గురూ విశదంగా విశ్లేషించారు కనుక బహిర్వీక్షలోని కథలకు మాత్రమే ఇక్కడ పుస్తక పరిచయాన్ని పరిమితం చేస్తున్నాను.

బహిర్వీక్షలో ఎనిమిది కథలున్నాయి. ఇవన్నీ వివిధ పత్రికలలో 1999 – 2003 మధ్య ప్రచురించబడిన కథలు.

స్వయంప్రభ తాను ప్రేమించిన వ్యక్తి కి మంచి భవిష్యత్తుందని, తామిద్దరూ పెళ్ళి చేసుకుందామనుకుంటున్నామని కూతురు చెప్పిన మాటలు ఆ తల్లి మనసులో ఆందోళనని కలిగిస్తాయి. సరిగ్గా ఇరవై రెండేళ్ల క్రితం ఆమె జీవితంలోనూ ఇలాటి ప్రేమే తటస్థపడి పెళ్ళికి దారి తీసింది. ఆ వ్యక్తి పట్ల అలవికాని మమకారంతో, మోహంతో చుట్టూ ఉన్న ప్రపంచంతో తనకు నిమిత్తమే లేదనుకుంది. ప్రేమగా పెంచిన తాతయ్య రమ్మని పిలిచినా చూసేందుకు సమయం లేదనుకుంది. తనదన్నది విడిగా ఏమీ లేదని, తన జీవితం అతని జీవితంతో పెనవేసుకుపోయిందని, అతని సంతోషం తన సంతోషమనీ, అతని మంచే తనకూ మంచి అని, అతని తోడిదే తన భవిష్యత్తని నిజాయితీగా నమ్మింది. కానీ అతను అలా అనుకోలేదన్నది ఓ చేదు వాస్తవ రూపంలో కళ్ళెదుట కనిపించినపుడు తనను నిలబెట్టుకుందుకు తన పోరాటం తనే చెయ్యాలన్న ప్రయత్నం మొదలుపెట్టింది. ఇదంతా తన అనుభవం! 

కూతురు మాత్రం తనలా కాక స్వయంప్రభగా తాను కోరుకున్న వ్యక్తి హృదయాన్ని ప్రభావితం చేసి ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది.

సాయంసంధ్య ఆమె ముగ్గురు పిల్లల తల్లి. మగపిల్లలకి సమాజం ఇస్తూ వచ్చిన ఆధిక్యభావం ఆమెతో పాటు ఆమె భర్తకి కూడా సమ్మతం కాదు. ఇద్దరాడపిల్లలతో పాటు ఒక మగ పిల్లవాణ్ణి ఒకే తరహాలో పెంచారు. పిల్లల పెంపకంలో మునిగి స్వంతానికి ఇష్టాలుంటాయన్న విషయమే మరిచిపోయిందామె. కూతుళ్ళు బాగా చదువుకుని, తమ భర్తలతో సమానంగా ఉద్యోగాలు చేసుకుంటుంటే ఆమె విస్మయంగానూ, ఆనందంగానూ గమనిస్తుండేది.

‘స్వతంత్రించి ఒక్క నిర్ణయమూ చేసే అవకాశం లేదని’ పెద్ద కూతురు బాధపడినపుడు ‘ప్రేమగా చూసుకునే భర్త ఉన్నాడు కదా’ అని తల్లిగా ఓదార్చబోతుంది. ఆపైన ఆ విషయాన్ని పట్టించుకోదగ్గదే కాదనుకుంటుంది. అన్ని విషయాల్లోనూ ఇంటాబయటా జీవిత భాగస్వామి సాయపడాలన్న చిన్నకూతురు కూడా భర్తతో నిత్యం ఘర్షణ పడుతుంటుంది. 

ఇంట్లో అందరి ఉనికిని, ప్రశాంతతనూ కాపాడడం కోసం తమ కష్టాల్ని, అయిష్టాల్ని మర్చిపోయి జీవించిన తమలాటి వారి జీవితాలను అప్రయత్నంగానే పోల్చుకుంటుంది. పెద్ద చదువు, ఆర్థిక స్వాతంత్ర్యం కూతుళ్ళ జీవితాల్లో శాంతిని నింపనేలేదని అనుకుంటుంది. 

భర్త పోయాక పిల్లల దగ్గర ప్రశాంతంగా జీవితం గడిచిపోతే చాలనుకుంటుంది. కానీ పిల్లల జీవితాల్లో కొరవడిన సామరస్యం చూసి అలాటిచోట మూడవ వ్యక్తిగా తాను ఇమడగలదా అని సందేహపడుతుంది.

తమ దగ్గరే పెరిగిన చెల్లెలు కూతురు అందంగా మలుచుకున్న జీవితాన్ని చూసి ముచ్చటపడుతుంది. తనేం చెయ్యాలో అవగాహనకొస్తుంది. ఇప్పటి సమాజాన్ని ప్రతిబింబిస్తూన్న మంచి కథ.

సహచరుడు చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టిందామె. పెళ్ళి ఆలోచనే లేదు. ఇంతలో అమ్మమ్మ తాతయ్యలు ఏర్పాటుచేసిన పెళ్ళికొడుకును చూసింది. పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నారన్న అతని ప్రశ్నకి అప్రయత్నంగానే ఆమె ఇచ్చిన సమాధానం వాళ్ళని ఒక్కటి చేసింది. 

ఇద్దరూ ఒక్కరన్నట్టుగా వాళ్ల జీవితాలు మమేకమైపోయాయి. కలిసి గడిపే సమయాన్ని ఆదా చేసుకుందుకు కలిసి ఇంట్లో పనులు చేసుకునేవారు. కలిసి పుస్తకాలు చదువుకునే వారు, ప్రయాణాలు చేసేవారు. ఒకరి సహచర్యంలో ఒకరు తమదైన ప్రపంచంలో ఐదు సంవత్సరాలు గడిపేసారు. వారి మధ్య పిల్లలకి అప్పుడే చోట్లేదని వాయిదా వేసుకున్నారు. ఉన్నట్టుండి అతను మాయం అయిపోయాడు. ప్రపంచ దృష్టిలో ఆమె ఒంటరిదైంది. 

డిగ్రీ చదువుకునే రోజుల్లో ఆమెను పెళ్లి చేసుకుంటానని ఇంటివరకూ వచ్చిన రాజు ఆమె ఒంటరి జీవితానికి తోడవుతానంటూ మరో స్నేహితురాలితో కబురంపుతాడు.

భర్తతో గడిపిన దాంపత్య జీవితం ఆమెకు ఒంటరితనాన్నెక్కడ మిగిల్చింది? 

కోరుకున్నదేదైనా తనకే స్వంతం కావాలని తాపత్రయపడే మనిషి డబ్బునో, హోదానో, అధికారాన్నో ఎరగా చేస్తుంటాడు. కానీ ఒక మనిషిని గెలుచుకుందుకు ఇవేవీ అక్కర్లేదని ఆమె మనసెరిగిన స్నేహితురాలు గ్రహిస్తుంది.

సాలెగూ(గో)డు

ఆ పేటలో చాలా వరకు నేత పనివాళ్లే. ఆమె బాల్యం ఆ కుటుంబాల మధ్య గడిచింది. అందరిలోకి మావుళ్ళమ్మ మరింత దగ్గరైందామెకు. విడివిడి దారాలన్నీ కలిపి బట్ట గా నేసే ఆ నేతగాళ్ళు బీటలు వారిన తమ పలకలు కూడా అతికించగలరేమోనన్నది ఆమె బాల్యపు అమాయకత్వం. పిల్లలు లేని మావుళ్ళమ్మ గౌరిని తెచ్చి పెంచుకుంది. గౌరి పెళ్లై వెళ్తూ మావుళ్ళమ్మని, భర్తని తనతో తీసుకెళ్తుంది.

చేనేత కార్మికుల ఆర్థిక సమస్యలు నిత్య నూతనంగా వర్ధిల్లే మన సమాజంలో గౌరి కుటుంబమూ అప్పుల్లో మునిగిపోతుంది. బయటపడే మార్గం కనిపించని గౌరి, ఆమె భర్త తీసుకోకూడని నిర్ణయం తీసుకుంటారు. మావుళ్ళమ్మ, ఆమె భర్త గౌరికూతురితో మిగిలిపోతారు. 

పరుగులెత్తడమే తెలిసిన కాలం తనలో వచ్చే మార్పులకి ఎదురీది పోరాటానికి దిగినవాళ్ళకి ధైర్యాన్నివ్వగలదే కానీ పిరికితనంతో వెనుదిరిగి పరుగెత్తే వారిని కాలగర్భంలో కలిపేస్తుంది. సమాజంలో వచ్చే రాజకీయ, ఆర్థిక మార్పులు జీవితాల్ని తలకిందులు చేసినపుడు నిజాయితీగా కష్టపడి బతికే బడుగుజీవి కూడా నీతి, అవినీతి మధ్య విచక్షణను మరిచిపోయే ప్రమాదం ఎదురవక తప్పదు. చుట్టూ ఉన్నవారి మానవత్వం ఒక్కటే వాళ్ళనాదుకోగలదు.

చేదు జ్ఞాపకాలు

సున్నితమనస్క అయిన ఆమె పెళ్ళికూతురిగా మనసునిండా కొత్త ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అంతా బాగానే మొదలైంది. అతను స్నేహితులతో డ్రింక్ పార్టీలకి వెళ్ళొస్తున్నాడు. అదో సోషల్ స్టేటస్ కాబోలని సర్దుకుంది. అతని ప్రవర్తన చెయ్యిజారిపోతూనే ఉంది. కుటుంబ పరిస్థితి చుట్టుపక్కలవాళ్ళ నోళ్ళలో నానటం ఆమెలోని ప్రశాంతతను, సౌకుమార్యాన్ని మాయం చేసింది. కుటుంబ మర్యాద రోడ్డెక్కింది. 

తాగుడుకి బానిసలై కుటుంబాల్ని రోడ్డున పడేసిన మగవాళ్ళని, సంఘటనల్ని చూసిన పక్కింటామె వాటిని తలుచుకోకుండా ఉండలేకపోయింది. భార్య శక్తిని, ఆత్మగౌరవాన్ని హేళనచేసి, పిల్లల్ని నిర్లక్ష్యం చేసి బతుకుల్ని హీనపరుచుకున్న వ్యక్తులవే అవన్నీ.

ఆర్థికపరమైన సమస్య ఎదురైందన్న విద్యార్థిని నమ్మి, అతని చదువును తన బాధ్యతగా భావించి డబ్బు ఇచ్చిందామె. కానీ ఆ డబ్బు దేనికి ఖర్చు చేసేడో అతనే నిజాయితీగా చెప్పినప్పుడు కలతపడింది. అతని పట్ల నమ్మకాన్ని వదులుకోలేనంటూ హెచ్చరించి పంపింది.

వానకి తడిసే పక్షి

కథలో ఆమె తన స్నేహితురాల్ని చాలా ఏళ్ళ తర్వాత ఫేస్బుక్ పుణ్యమా అని కనుక్కుంటుంది. స్నేహితురాల్ని ఆశ్చర్యానందాలకు గురి చెయ్యాలని వెళ్ళి అందమైన ఆ ఇంటిని చూసి వారి సౌందర్య దృష్టికి గర్వపడుతుంది. తనకు, తన భర్తకు దొరికిన అపురూపమైన బహుమతి అంటూ కదలలేక వీల్ ఛైర్ కి అంకితమైన తన కూతుర్ని చూపిస్తుందా స్నేహితురాలు. కూతురి జీవితానికి ఆ భార్యాభర్తలిద్దరూ అందమైన చేర్పును అమర్చారు. తమ ఇష్టాలకి, కోర్కెలకి భగవంతుడిచ్చిన వరాన్ని ఒక బరువుగా, బాధ్యతగా కాక సంతోషంగా స్వీకరించామంటుంది. 

పూర్వపు రోజుల్లా కాకుండా ఇంటికి, కుటుంబానికి ఒకరో ఇద్దరో పిల్లలుంటున్నకాలమిది. తల్లిదండ్రుల ఆశలు, కలలు అన్నీ వాళ్ళ చుట్టూనే. పిల్లలు పెద్దవాళ్ళయ్యారన్నది అర్థంచేసుకోకుండా వారి జీవితాల్లో అనుక్షణం జోక్యం చేసుకుంటూ అక్కర్లేని బరువును మోసే తల్లిదండ్రులకు తన స్నేహితురాలి గురించి చెప్పాలనుకుంటూ ఆమె ఇంటి దారి పడుతుంది. 

తప్పటడుగు

ఆమె పిల్లలని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయురాలు. పిల్లల్ని ప్రేమించి, వాళ్ల భవిష్యత్తుని గురించి బాధ్యతగా ఆలోచించే వ్యక్తి. బడితోటలో పెంచుకున్న మొక్కకి చీడ పట్టిందంటూ దిగులుపడిన చిన్నారిని పురుగుమందు జల్లుదాం అంటూ ఓదారుస్తుంది. 

మిగిలిన పిల్లల్లో లేని వాడి చురుకుతనాన్ని, ప్రత్యేకతను అందరిలాగే ఆమె కూడా ప్రశంసించింది. సరదాగా బడిలో తన ఆటపాటలకు ఎదురైన ప్రోత్సాహం, మెప్పుదల వాడిని చదువుకి దూరం చేసి ఊహల్లో బతికేలా చేసింది. దారి తప్పుతున్న కొడుక్కి మంచి చెడ్డలు చెప్పటం తెలియని తల్లి గుడ్డిప్రేమతో పెళ్ళి చేస్తుంది. అవివేకంతో కన్న రంగులకలలు వాడిని మాయలో ముంచి వ్యసనపరుణ్ణి చేసి, ప్రాణాన్ని హరిస్తాయి. అమాయకురాలైన అతని భార్య, కూతురు జీవితాలు నరకప్రాయమవుతాయి. 

మందు జల్లినా ఎండిపోయిన బడితోటలోని మొక్కను చూస్తూ లేత వయసులో పట్టిన చీడనుంచి కాపాడేందుకు పైపైన మందు చల్లటం ఒక్కటే చాలదని ఉపాధ్యాయురాలు అనుకుంటుంది.

వెలుగు అతనిలో తళుక్కుమనే చురుకు, మెరుపు ఆమెను వివశను చేస్తాయి. పెద్దలు కాదన్నా పెళ్ళి చేసుకుంటుంది. ఉద్యోగంలో మెట్లెక్కుతున్నానంటూ అతను ఆమెను రకరకాల బహుమతులతో సంతోషపరుస్తుంటే ఆమెలో సంశయం మొదలవుతుంది. అతను అన్యాయంగా సంపాదిస్తున్నాడన్నది బయటపడుతుంది. వాస్తవాన్ని ఎదుర్కోలేక కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోతాడతను. నిలకడ లేని అతనితో జీవితం ఏమిటో అనుభవమయ్యాక అప్పుడు మొదలవుతుంది ఆమె జీవనపోరాటం. తనను తాను కూడదీసుకుంటూ కూతుర్ని పెంచుకుంటున్న ఆమె జీవితంలోకి పదేళ్ళ తర్వాత తాపీగా నడిచొస్తాడు ఆ భర్త. కావలసినంత సంపాదించుకునే వచ్చానంటాడతను.

ఆమె కలవరపడుతుంది. అతనితో అనుబంధానికి ఆమె మనశ్శరీరాలు సిద్ధంగా లేవు. అనుక్షణం నీడలా వెంటవెంట తిరిగే పధ్నాలుగేళ్ళ కూతురు తల్లి ముఖంలో అశాంతిని, ఆందోళనని గమనిస్తుంది. ఇంటికొచ్చిన తండ్రి రక్షణలో సేదదీరాలన్న ఆశ, ఆలోచన ఆ చిన్నారికి రానేరావు. తన మనసులో మాటను తల్లికి ఒక సందేశ రూపంలో అందిస్తుంది. గొప్పగా ఉంది ముగింపు.

ఈ కథలన్నీ కూడా స్త్రీ కేంద్రంగా నడిచినవే. తరతరాలుగా వ్యవస్థ స్త్రీకి ఆపాదించిన సున్నితత్త్వం, కరుణ, ప్రేమ ఆమె జీవితానికి శాంతిని, సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాయి. స్త్రీ కూడా పురుషుడు లాగే అన్ని భావోద్వేగాలను అనుభవించగలదు. ప్రకటించనూగలదు. అవసరమైన చోట స్థిరంగా నిలబడి పోరాటదారి పట్టగలదు. కూలిపోతున్న జీవితాన్ని కూడదీసుకోగలదు. అలాటి స్థిరత్వం, నిబ్బరం, సహనం విషయంలో పురుషుడిని ఆమె ఓడించగల ధీర! 

రచయిత్రికి అభినందనలు.

వరేణ్యా ప్రచురణ, జూలై 2024

వెల – రూ. 200/-

You Might Also Like

Leave a Reply