గోధుమ రంగు ఊహ

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ
***********
మనిషి కి తన ప్రాథమిక అవసరాలు తీరటంతోటే సరిపోదు. వాటిని మించిన మానసికమైన అవసరాలూ, కలలూ, ఆశలూ తోడైతేనే జీవితం సంపూర్ణంగా ఆస్వాదించగలడు. ఆ ప్రయాణంలో తన భావోద్వేగాలను పంచుకుందుకు, పోల్చుకుందుకు, ఉపశమనం పొందేందుకు సాహిత్యం సహాయ పడుతుంది.
మనసుకు సాంత్వననిచ్చి, చుట్టూ సమాజం పట్ల అవగాహనను, సానుకూల దృక్పథాన్ని కలిగించే సాహిత్యం మనిషి జీవితంలో ఒక ప్రియమైన నేస్తం. ఒక అవసరం.
ఈ సాహిత్యం ఎక్కణ్ణుంచి వస్తుంది? మనిషి జీవితమే దానికి ముడి వస్తువు. కవిత్వమైనా, కథైనా, మరే సాహిత్య రూపమైనా మానవ జీవితాల్ని, ఆ జీవితాల్లోని సంక్లిష్టతల్ని, సుఖదుఃఖాల్ని, మంచి చెడులను కాక మరింకేం ప్రతిబింబించగలదు?
జీవితంలోని భిన్న పార్శ్వాలకి రచయిత తనదైన చూపుతో, తన అనుభవం మేరకు ఒక రూపాన్నిచ్చి పాఠకుడికి అందిస్తాడు. ఆయా సాహిత్య రూపాల్లో దాగి ఉండి, మనసును తట్టే సత్యమేదో పాఠకుడు పట్టుకోగలిగితే ఆ సాహిత్య సృష్టికి సార్థకత దొరికినట్టే. అది పాఠకుణ్ణి సేద దీర్చి, తనతో మమేకమైపోయేలా చేసుకుంటుంది.
గోధుమ రంగు ఊహ పేరుతో వచ్చిన కథల సంపుటి రచయిత వంశీకృష్ణ. ఈ పుస్తకంలో పధ్నాలుగు కథలున్నాయి. ఇందులో చాలా కథలు పాలపిట్ట మాసపత్రిక, సారంగ అంతర్జాల పత్రికలలో వచ్చినవి. వాటికి తేదీల వారీగా వివరాలు ఇచ్చి ఉంటే బావుండేది.
ప్రసేన్ ముందుమాటలో కథలన్నింటి గురించి చక్కని విశ్లేషణ చేసారు. ఈ కథల్ని భావోద్వేగాల ఇంద్రధనువులు అన్నారాయన. ఈ పుస్తకం శీర్షిక గోధుమ రంగు ఊహ అన్న పేరుతో ఉన్న కథ గురించి చెపుతూ ఊహ ది గోధుమరంగా అని ప్రశ్నిస్తూనే గోధుమ రంగుకున్న అనేకానేక నిర్వచనాలు చెప్పారు. గోధుమ అంటే మట్టి అని, గోధుమ అంటే బతుకు అని గోధుమ రంగుకున్న అనేక అర్థాల్ని, రూపాల్ని గురించి ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు.
రచయిత వంశీకృష్ణ ముందుమాటను చెపుతూ తాను ఇంతకు ముందు తీసుకొచ్చిన రెండు కథా సంపుటాలకి ఈ కథా సంపుటికి మధ్య పదిహేడేళ్ల విరామం ఉందని, దానికి కారణం ఇన్నేళ్లుగా చదువుతూ వస్తున్న సాహిత్యమే అన్నారు. కథ పట్ల తనకు కొంచెం భయం, చాలా ప్రేమ అని చెపుతూ ఈ కథలన్నీ గుడిపాటి, అఫ్సర్, గొరుసు వంటి సాహిత్యమిత్రుల ప్రోద్బలంతో రాసినవేనంటారు.
“జీవితం ఎప్పుడూ కరుకు వ్యాఖ్యానాలలో ఉండదని, కఠిన వాస్తవంలో కార్యాచరణలో ఉంటుందన్నది తాను నేర్చుకున్న సత్యమని” చెప్పారు. పాఠకుడు ఆలోచించేలా, అనుభూతించేలా రాయటమే తనకు ఇష్టమన్నారు రచయిత.
అడవి అంటుకున్నది మొదటి కథ. ఈ కథ మనమున్న వ్యవస్థను కళ్లకు కట్టినట్టు చెప్తుంది. ప్రజల సమస్యలను, కష్టాలను తీర్చే బాధ్యతను పాలకులు తీసుకున్నట్టు సమీప గతంలో ఏ సమాజమూ రికార్డ్ చెయ్యనేలేదు. కష్టాలు, కడగళ్లు ఓ పక్క భరిస్తూనే మంచిరోజులొస్తాయని నమ్మే వెర్రి ప్రజలే ఎక్కడా ఉన్నారు. మాయమాటల మంత్రదండంతో మతాన్ని, దేవుళ్లని ప్రజల పరం చేసి వాళ్ల బాగోగులకి వాళ్లనే కర్తలు చేసే పాలకవర్గమూ ఉంది. పాలితులు పీడితులే అయినా ప్రశ్నించే హక్కును ఎక్కడో, ఎప్పుడో పారేసుకున్నారన్నది స్వయంకృతమే కావచ్చు.
ఒక పసుపు పచ్చ సాయంకాలం – ఆలోచనలు పసుపు పచ్చని రంగులో ఉంటే దానికర్థం ఏమిటి? నిస్సారమైన భావోద్వేగాల్ని స్టిమ్యులేట్ చేసేందుకు పసుపురంగు సాయపడుతుందన్న భార్య మాటలు కథానాయకుడికి సందేహాన్నే కలిగించాయి. పసుపుపచ్చ రంగు ఆలోచన గాయాన్ని మాన్పగలిగినా దానికి వ్యతిరేకంగా అలసటనీ, ఆగ్రహాన్ని, ఆందోళనని కూడా కలిగిస్తుందంటుందామె.
పెళ్లి తరువాత జీవితంలో వైయక్తిక స్వేచ్ఛ మాయమై స్త్రీ పురుషులిద్దర్నీ కుటుంబ వ్యవస్థకి బానిసల్ని చేస్తుందా అన్న మీమాంస అతడిని వదలదు. ఉన్నవన్నీ వైరుధ్యాల్లానే కనిపించినా అవి అంతిమంగా అందించేవి శాంతి, సౌఖ్యాలే కాబోలు.
ఏమో, ఇద్దరూ రైటే అన్నట్టు ఇంద్రధనుస్సులో రంగులన్నీ ఒకే రంగులో ఐక్యం కావూ?!
ఎదురైన దృశ్యం – అతడు కవిత్వం రాస్తాడు. ఆమె అందమైన చిత్రాలు గీస్తుంది. ఎదుటి మనిషిలో నచ్చని అంశాలను కూడా నచ్చేలా చేసుకోగలిగేలాటి ప్రేమ వారిద్దరి మధ్యా ఉంది. అయినా కలిసి జీవించాలనుకున్న ఆమె ఆశను అతను తిరస్కరించాడు. జీవితం అంటే సర్దుకుపోవటమన్న వాస్తవం ఆమెకు తెలిసినట్టు అతనికి తెలియనేలేదు.
గాంధీ – గాంధీ అంటే ఒక గౌరవం. ఒక జాతి పరువు. ఆ గాంధీ వేషం పసివాళ్లకి కడుపునింపే మార్గమవటం గాంధీ పుట్టిన దేశానికి పట్టిన దుర్గతి.
ఆట ముగిసాక – మనిషి భలే చిత్రమైన వాడు. జీవితం క్షణభంగురమని వింటూనే ఉంటాడు. నమ్మినట్టే ఉంటాడు. అంతలోనే తన హోదా, తన అధికారం, తన అహంకారం – ఏదీ వదులుకుందుకు సిద్ధంగా ఉండడు.
అతడు పేదరికంలో పుట్టాడు. కష్టపడి మంచి ఉద్యోగం సంపాదించాడు. ఎదిగే క్రమంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తి వల్ల ఒకసారి ఓటమిని ఎదుర్కొన్నాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒకప్పటి ఓటమి తాలూకు కసిని మోస్తూనే ఉన్నాడు. పదవిలో ఉండగా ఆ వర్గాన్ని సాధించి కసిని తీర్చుకున్నాడు. అతని కోపానికి బలి అయిన వ్యక్తి మాత్రం తోటి మనిషిని కేవలం ప్రేమించటం తెలిసినవాడు.
పదవీ విరమణ తర్వాత అధికారికి జ్ఞానోదయం కలిగింది. అవును, ఆట ముగిసాక చదరంగంలో రాజు, మంత్రి, బంటు అన్నీ ఒకే డబ్బాలో చేరినట్టు మనుషులంతా ఎన్ని వర్గాలుగా, వర్ణాలుగా విడిపోయినా ఆఖరికి ఒక్క చోటుకి చేరవలసిందే అన్న సత్యాన్ని తెలుసుకున్నాడు.
ఉష్… మాన్ చెప్పని కథ – వాళ్లిద్దరూ ఒకే ఊళ్లో ఒకే సారి పుట్టి, స్నేహం కట్టారు. ఎవరికి వారుగా పెరిగారు. తమ మధ్య ఉన్న మతం వాళ్ల స్నేహానికి ఎప్పుడూ అడ్డు కాలేదు. అసలా స్పృహే లేదు వాళ్లకి. ఇది మన దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ వినిపించే సామరస్య జీవన గీతం.
సాధారణ ప్రజల జీవితాల్లో దైనందిన పోరాటాల్ని మించిన విషయాలు వాళ్లకి పట్టవు. వర్గాలుగా, మతాలుగా తమలో ఉన్నాయనే భేదభావాల్ని గురించి ఆలోచించి అసహనాన్ని పెంచుకునే తీరిక, ఓపిక కూడా ఉండవు. అయితే ప్రపంచవ్యాప్తంగా సమాజాల్లోని మనుషులంతా ఇన్ని విభజన రేఖల మధ్య ఎందుకు ఉంటున్నారు? పాలకుల స్వార్థం ప్రజల మధ్య మారణహోమాల్ని సృష్టిస్తూ తమ పబ్బం గడుపుకోవటమే వర్తమాన రాజకీయ, సామాజిక చిత్రం.
ప్రేమను కాక ద్వేషాన్నిపెంచే సందర్భాలే అన్ని చోట్లా ఎదురవుతుంటే రేపటి ఆశన్నది ఏదీ మిగలటం లేదు.
పైసా వసూల్ – వ్యవస్థంతా డబ్బున్నవాళ్ల కోసమే పనిచేస్తుంటే నిరాధారంగా ఉన్న వ్యక్తులకి దిక్కెవరు? పదవిలో ఉన్నవారంతా పేదల పక్షానే ఉంటారు. కానీ వాళ్ల విధానాలన్నీ చిత్రంగా డబ్బు, అధికారం ఉన్నవాడి ప్రయోజనాల కోసమే.
కోట్ల కొద్దీ రుణాల్ని గాలికి వదిలి విదేశాల్లో నిష్పూచిగా బతికే శ్రీమంతులు ప్రభుత్వాల దృష్టిలో నేరస్థులుగా ఎప్పటికీ రుజువు కారు. తిండి గింజలు కూడా లేని బడుగురైతు తీసుకున్న రుణాలు మాత్రం తీర్చవలసినవే అన్నది బ్యాంకులకు టార్గెట్ అవుతుంది. ఆ టార్గెట్ల పరుగులో ఒక రుణమాఫీకి మరో రుణాన్నిచ్చే వెసులుబాటూ ఉంటుంది. ఏ నిబంధనలకైనా లొసుగులుంటాయన్న తెలివిడి ఎవరికి మంచి చేస్తోంది? ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు.
గోధుమ రంగు ఊహ – అతనికి హఠాత్తుగా ఆరోజు ఉదయం నుంచీ ఒక గోధుమ రంగు ఊహ వచ్చింది. అది చావు వాసన వేస్తోందనుకుంటాడు. అయితే ఆ చావు ఎవరిదన్నది తోచదు.
బాల్యంలో మున్నేటి మూలం కనుక్కోవాలన్న కోరికతో బయల్దేరి నది వెంట కొట్టుకు పోతున్నప్పుడు అతన్ని ఒడ్డుకు చేర్చిన ఆచార్యులవారు కొట్టుకుపోయారు. కృష్ణవేణి యవ్వనారంభంలో అతన్ని ఆకర్షించింది. అదెందుకో తెలియలేదు. కానీ ఉన్నట్టుండి ఆమె మాయమైపోయింది. ఆరోజు ఒక పసిపాప రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయింది.
గోధుమ రంగు ఊహ మాయమైనవారినే కంటి ముందుకు తెస్తోంది. ఆ ఊహ గురించిన ఆలోచన తేలకుండానే దూసుకొచ్చిన ట్రక్ రూపంలో మృత్యువు అతన్ని కమ్మేసింది.
మౌన – ఆమె, అతను మొదటిసారిగా పెళ్లిచూపుల్లో కలిసినప్పుడు తమ మధ్య బంధం ఎన్నో జన్మలదనుకున్నారు. వాళ్ల అందమైన జీవితాల్లో పాపాయి రాక అద్భుతాన్ని అందించింది.
అకస్మాత్తుగా పాపాయి మాయమైపోయింది. ఆమె పాపను కోల్పోయిన దుఃఖాన్ని తీర్చుకునే దారి వెతుక్కుంటూంది. భర్తలో పసిపాపని చూసుకోవాలని అనుకుంది. అతను మాత్రం ఆఫీస్ పనిలో ఆ భారాన్ని మొయ్యాలనుకున్నాడు. క్రమేపీ ఆఫీస్ పని అతన్ని అందరాని ఎత్తులకు చేరుస్తూ సొంత ఊరు నుంచి, ఇంటి నుంచి, భార్య నుంచి కూడా దూరం చేస్తూ వచ్చింది. చూస్తుండగానే పదిహేనేళ్లు వాళ్ల జీవితాల్లో గడిచిపోయాయి. అతను వెనక్కొచ్చాడు. నిశ్శబ్దం వారిద్దరి మధ్య ఘనీభవించి వాళ్లను చెరొక పక్కకీ విసిరేసింది. సమాంతర రేఖల మధ్య మౌనం మినహా ఏం మిగల్లేదు.
శ్యామ కల్యాణి – వృద్ధాప్యానికి పసితనమెంత చేరువ! ఆ డెబ్భైయేళ్లు దాటిన పెద్దాయన అప్పుడే పుట్టిన పసికందుతో స్నేహం కట్టాడు. ఆయన మంచం మీంచి కదల్లేడు. పాపాయి ఉయ్యాల్లోంచి నడిచి రాలేదు. అయితేయేం, చిత్రంగా వాళ్ల మధ్య ఒక అనుబంధం అల్లుకుంది. ఆయనకి మాట పెగలని అస్వస్థత! పాపాయికి మాటలు నేర్వని పసితనం. అయినా ఇద్దరి మధ్యా చూపులతోనే ఒక వంతెన అల్లుకున్నారు.
ఈ కథ ఎంతో ఎంతో సాధారణంగా మొదలైంది. పెద్ద వయసులో ఎదురయ్యే కష్టాల్ని చెపుతున్న మరో రొటీన్ కథ అనే అపోహ కలిగిస్తుంది. కథ నెమ్మదిగా చిన్న సెలయేరులా మొదలై ఒక చల్లదనాన్ని, ఒక హాయిని ఇస్తూ మన మనసుల్లో అమృత ప్రవాహాన్ని నింపుతుంది. అద్భుతమైన కథ. కవితాత్మకమైన పదాల కూర్పు. శ్యామ కల్యాణి మనల్ని అంత త్వరగా వదలదు. ఆ అమృత భాండాన్ని మనమూ వదల్లేము.
సెలవు – వాడు బాగా చదువుకోవాలనుకుంది అమ్మ. కలెక్టర్ ని మించిన చదువు చదువుకొమ్మని వాణ్ణి బడికి పంపింది. వాడూ అమ్మకి తగిన కొడుకే. అమ్మ ముఖం మీద నవ్వులు పూయిస్తూ పెద్దవాడై కాలేజీ చదువులు పూర్తై, యూనివర్సిటీ మెట్లెక్కాడు. ప్రపంచాన్ని విశాలంగా చూస్తున్నాడు. మంచి చెడ్డల్ని, న్యాయాన్యాయాల్ని గమనించి అర్థం చేసుకుంటున్నాడు. కానీ ఎందుకో, వాడు నోరిప్పి అభిప్రాయం చెప్పబోతే ఎదుటి వాళ్లకి వాడి కులం గుర్తొస్తుంది చిత్రంగా.
ఇంత చదివి, ఇక్కడి వరకు చేరినవాడికి ఊపిరాడకుండా చేస్తోంది ఆ క్యాంపస్.
అయినా వాడికి ఎవరి మీదా జాలి కలగలేదు. తన బతుకు మీదే జాలి. అమ్మని తలుచుకుంటూనే ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయాడు సెలవంటూ. మనిషికి విద్యను, వివేకాన్ని అందించే విశ్వవిద్యాలయాల్లోనూ కనిపిస్తున్న దుర్మారం ఇది. దీన్ని ఎదిరించి గెలిచే అవకాశం ఎప్పుడొస్తుంది?! ఎలా? ఈ ప్రశ్నలకి సమాధానాలిచ్చేందుకు మన సమాజమింకా తయారుగా లేదు.
పుస్తకం ఆఖరు పేజీల్లో గుడిపాటి కథలన్నింటినీ విశ్లేషించారు. చిట్టచివరి పేజీలో రచయిత వంశీకృష్ణ సాహిత్య పరిచయం ఉంది.
వాస్తవ జీవితాల్ని ప్రతిబింబించే ఈ కథలన్నీ వ్యక్తిపరంగా కనిపించే సన్నివేశాలు, సమాజపరంగా కనిపించే సందర్భాలే.
రచయితకు అభినందనలు.
పుస్తకం కవర్ పేజీ గోధుమ రంగులో అందంగా అమరింది. కర్టెసీః బ్రహ్మం భావన గ్రాఫిక్స్.
ధరః రూ. 150/-
మొదటి ప్రచురణః కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్, డిసెంబరు 2024
Leave a Reply