పుస్తకం
All about booksపుస్తకాలు

October 6, 2011

నూరేళ్ళ తెలుగు కథ – మళ్ళీ చెప్పుకొంటున్న మన కథలు

More articles by »
Written by: Jampala Chowdary
Tags:

మీకు తెలుగు కథల గురించి ఏమీ తెలీదా? ఐతే ఇదిగో మీ కోసం ఒక పుస్తకం.

మీకు తెలుగు కథల గురించి బాగా తెలుసా? ఐతే మీ ఆనందం కోసం ఇదిగో ఈ పుస్తకం.

మీరు తెలుగు కథలంటే ఇష్టమే గాని, తెలుగులో మంచి కథలగురించి ఇంకొంత తెలుసుకోవాలని ఉందా? ఐతే, మీ కోసమే ఈ పుస్తకం.

తెలుగు కథ పుట్టి నూరేళ్ళైందని ఏడాదిగా పండగ చేసుకుంటున్నాం కదా! మరి పుట్టినరోజు పండగకు మంచి బహుమతి ఇవ్వద్దూ? ఇదిగో ఆ బహుమతి. ప్రేమగా, శ్రద్ధగా ఏర్చి కూర్చిన  ఆల్బం. ఈ నూరేళ్ళ మధురానుభూతులని ఒకచోట చేర్చి, నూరేళ్ళ జీవితంలో ముఖ్యులందరినీ ఒకసారి గుర్తు చేస్తూ, తెలిసినవారికి జ్ఞాపకాల దొంతరలు తెరుస్తూ, తెలియని కొత్తవారికి ఆసక్తి కలిగించే ఒక చక్కటి ఆల్బం – కథాచిత్రాల ఆల్బం – ఈ పుస్తకం.

నూరేళ్ళ జీవితంలో ముఖ్య సంఘటనలని ఫొటోల ద్వారా చెప్పినట్లుగా,  ఈ నూరేళ్ళలో వచ్చిన ప్రసిద్ధ కథలను చిన్న పదచిత్రాలుగా మార్చి, ఒక చోట చేర్చి, ఈ ఆల్బంని అందంగా అలంకరించి మనకు అందజేసింది మహమ్మద్ ఖదీర్‌బాబు. స్వయంగా పేరెన్నికగన్న కథకుడు. “కథ నాకు చాలా ఇచ్చింది. కథనుంచి నేను చాలా తీసుకున్నాను. కాని కథకు నేను ఏమిచ్చినాను” అని ప్రశ్నించుకుంటున్న తరుణంలో,  సాక్షి దినపత్రిక ఫ్యామిలీ సెక్‌షన్లో రోజూ ఒక తెలుగు కథను పాఠకులకు పరిచయం చేయమంటే, “వందేళ్ళుగా గొప్ప గొప్ప కథలు రాసినోళ్ళున్నారు. వారిని కొత్తతరం పాఠకులకు పరిచయం చేయా”లంటే ఆ కథలను తనకిచ్చిన కొద్ది జాగాలో తిరిగి చెప్పటమే సరైన విధానం అని భావించాడు ఖదీర్‌బాబు.

ఇలా పాఠకులకు పాతకథలని తిరిగిచెప్పటం మొదలుబెట్టి అక్టోబరు 2010 నుంచి ఫిబ్రవరి 2011 వరకూ వారానికి ఐదారు కథల చొప్పున 75గురు కథకులు వ్రాసిన 75 కథలను పరిచయం చేశాడు ఖదీర్‌బాబు. సాక్షిలో అక్కడికి ఆ శీర్షిక ఆపేసినా, ఇంకో 25 కథలను చేర్చి మొత్తం 100 మంది రచయితలు రాసిన 100 కథల పరిచయాల్ని ఇప్పుడు ఒక సంకలనంగా తీసుకువచ్చాడు. ఒకో పరిచయం మూడునుంచి ఐదు పేజీలవరకూ ఉంటుంది. ఎంచుకున్న ప్రతి కథనూ ఖదీర్‌బాబు సంక్షిప్తంగా పరిచయం చేసి, తర్వాత ఆ కథను విశ్లేషిస్తూ, కథకుణ్ణి కూడా పరిచయం చేస్తాడు. ప్రతి పరిచయం ముందూ రచయిత ఛాయాచిత్రం, పరిచయం తర్వాత క్లుప్తంగా రచయిత వివరాలు ఉంటాయి. ప్రతి కథకూ ఖదీర్‌బాబు పెట్టిన ఆసక్తికరమైన కొత్త శీర్షిక ఉంటుంది.

ఈ పుస్తకంలో తాను పరిచయం చేసిన ప్రతి కథనూ తనదిగా చేసుకోవటానికి ఖదీర్‌బాబు ప్రయత్నించాడు. కథ చెప్పటంలోనూ, ఆ కథ మనకు ఎందుకు నచ్చాలో (అంటే తనకు ఎందుకు నచ్చిందో) తెలియజేయటంలోనూ అతని ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. హృద్యంగా వచనం రాయటంలో మంచి నేర్పు ఉన్న కొద్దిమంది ఈ తరం రచయితల్లో ఖదీర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి పరిచయమూ వేగంగా చదివిస్తుంది. ఆ తర్వాత మనల్ని ఆపి ఆలోచింపచేస్తుంది.

తెలుగులో మంచి కథలున్నాయా? మంచి కథకులున్నారా? తెలుగు కథల్లో ఎలాంటి వైవిధ్యం ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల్ని ఈ పుస్తకంలో వెతుక్కోవచ్చు. ఈ పుస్తకంలో తొలి తెలుగు కథకుడిగా ప్రఖ్యాతి చెందిన గురజాడ అప్పారావు, తొలి తెలుగు కథకురాలిగా గుర్తింపు పొందిన భండారు అచ్చమాంబ మొదలుకొని ఈ మధ్యే కథలు రాస్తున్న వాళ్ళూ ఉన్నారు. తెలుగు కథ అనగానే స్ఫురించే కథకులందరితో పాటు, కథకులుగా అంతగా గుర్తింపు పొందకపోయినా గుర్తుంచుకోవలసిన కథలు రాసినవాళ్ళూ ఉన్నారు. గంభీరమైన కథలే కాదు, చిలిపి కథలూ ఉన్నాయి. నూరేళ్ళ తెలుగుకథలో ఉన్న ప్రక్రియల, వస్తువుల వైవిధ్యం ఈ సంచయంలో ప్రతిఫలిస్తుంది. తెలుగు కథ లోతూ, వెడల్పూ రెండూ స్థూలంగా పరిచయమౌతాయి. వంద కథలు ఒక్కసారే చదవటమా అని కంగారేం పడక్కరలేదు. ఓపిక, ఉత్సాహం ఉంటే సరే; లేకపోతే వీలు దొరికినప్పుడు వీలైనన్ని పరిచయాలు చదివి ఆస్వాదిస్తూ దాచుకుని చదువుకోవచ్చు.  నచ్చిన కథల్ని పూర్తి రూపంలో సంపాదించి చదువుకోవచ్చు.

ఏ విషయంలో ఐనా, యాభయ్యో వందో అంటూ ఒక అంకె అనుకొని, ఆ మేరకు ఎంపిక చేసుకుని అందరి ఆమోదమూ పొందటం ఎవరికైనా అసాధ్యం. కొకు, పద్మరాజుల్లా (ఒకటికంటే) ఎక్కువ గొప్ప కథలు వ్రాసిన రచయితల కథల్లో అందరికీ నచ్చేట్టు ఒక్క కథని ఎంపిక చేయటమూ అసాధ్యమే. ఈ పుస్తకంలో ఉన్న కొన్ని ఎంపికలతో నాకు ఏకీభావం లేదు. అలాగే కొన్ని కథలను ఖదీర్‌బాబు, నేను వేరువేరుగా అర్థం చేసుకొన్నాం అనిపిస్తుంది అతని విశ్లేషణ చదివితే. ఐతే ఇవి అతని ఎంపికలు, విశ్లేషణలు; అతని అభిరుచికీ, ఆలోచనలకూ సంబంధించినవి. ఈ ఎంపికలలో, విశ్లేషణలలో నచ్చని విషయాల సంఖ్య, నచ్చిన వాటితో పోలిస్తే అతిస్వల్పం అన్నది ముఖ్యం.

మిగతా ప్రక్రియలతో పోలిస్తే కథలంటే నాకు కొద్దిగా పక్షపాతం. కథలు ఎక్కువగానే, వెతుక్కుని మరీ, చదువుతాను. ఐనా ఇంతకు ముందు చదువని నలుగురు కథకుల్నీ, వారి కథల్నీ ఖదీర్‌బాబు ఇప్పుడు పరిచయం చేశాడు. తెలిసిన కథకులవీ ఇంతకు ముందు చదవని కథలు కొన్ని ఈ పుస్తకం వల్ల తెలిశాయి.  రాధాగోపాళం సినిమాలో నచ్చిన ఒక సన్నివేశానికి మూలం కప్పగంతుల సత్యనారాయణగారి తెల్లవారుజాము పాఠాలు అని ఖదీర్ పరిచయం తర్వాతే తెలిసింది.

ఖదీర్‌బాబు అన్ని పుస్తకాలలాగానే ఈ పుస్తకమూ అందంగా ముద్రించబడింది. అచ్చుతప్పులు బహుతక్కువ. గన్నేరు పువ్వు ముఖచిత్రం ఆకర్షణీయంగా ఉంది (ముఖచిత్రం గురించి వెనుక అట్ట మీద వ్యాఖ్యానం చెపుతుంది). ఈ పరిచయాలు సాక్షిలో ప్రచురించినప్పుడు అన్వర్ చక్కటి రంగుల బొమ్మలతో ఆ కథల్ని అలంకరించాడు. అవికూడా ఈ పుస్తకంలో ఉంటే ఇంకొంత అందం వచ్చేది. సాక్షిలో వచ్చిన పరిచయాల్లో, చలం కథ “శమంతకమణితో ఇంటర్వ్యూ” ఉంది. కానీ ఈ పుస్తకంలో ఆ పరిచయం లేదు (చలం సుశీల కథ పరిచయం ఉంది). ఇలాంటి తేడాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో తెలీదు. శ్రమతో కూడిన పనే ఐనా, రచయితలందరి ఫొటోలు సేకరించి, వారి వివరాలు ఇవ్వడం అభినందనీయం. సాక్షి పరిచయాల్లో రచయితల ఫోను, ఈమెయిల్ చిరునామా ఇచ్చినట్లు గుర్తు. ఎందుచేతో ఈ పుస్తకంలో ఆ వివరాలు లేవు. పుస్తకంలో పరిచయాలు రచయితల పేర్ల అకారాది క్రమంలో ఉండడంతో మొదటి కథగా సుఖాంతం (అబ్బూరి ఛాయాదేవి) ఉండడం కొంచెం నవ్వు తెప్పించింది.

ఒకతరం ఇష్టంగా చదివిన రచయితలు, రచనలు వేరొక తరానికి అందుబాటులో ఉండవు. మరుగునపడిన మాణిక్యాలను వెదికి చూపించడానికి మార్గదర్శకుల అవసరం ఉంటుంది. సాహిత్య చరిత్ర తెలిసిన సన్నిహితులూ, గురువులూ అందరికీ అందుబాటులో ఉండరు. ఇలాంటి పుస్తకాలు ఆ కొరతను తీరుస్తాయి. తన కథలతోనేకాక, ఈ కథా పరిచయాలతోనూ ఖదీర్‌బాబు తెలుగుకథకు ఎనలేని సేవచేశాడు. చేసినవాడినే ఇంకా చేయమని అడగడం బాగోదుకానీ, వరుసగా ఇంకొన్ని కథా పరిచయాలు రాసి రెండు, మూడు భాగాలు అంటూ వరుసగా తీసుకురాగలిగితే, అబ్బో…

ఈ పుస్తకం, ఇంతకు ముందు పరిచయం చేసిన నూరేళ్ళ తెలుగు నవల, వైతాళికులు కవితా సంకలనం, ప్రతి తెలుగు సాహిత్యాభిమాని కొని, చదివి, అందరితో పంచుకోవలసిన పుస్తకాలు. తెలుగుమీద ప్రేమ ఉన్న మిత్రులకు బహుమతిగా ఇవ్వవలసిన పుస్తకాలు. తెలుగుసాహిత్యాన్ని తీసిపారేసేవారి చేత చదివించాల్సిన పుస్తకాలు. తెలుగునాట ప్రతి విద్యార్థి సిలబస్‌లోనూ, సంచిలోనూ ఉండవలసిన పుస్తకాలు. ఆధునిక తెలుగు సాహిత్యపు వైవిధ్యపు రుచుల్ని చూపిస్తాయి ఈ పుస్తకాలు.   ఒకసారి ఈ రుచులంటూ ఉన్నాయని తెలిశాక, వారికి ఇష్టమైన ప్రక్రియలో మంచి సాహిత్యాన్ని వాళ్ళే వెదుక్కొని చదువుకొంటారు.

ఈ నూరేళ్ళ తెలుగు కథ విరివిగా ప్రాచుర్యం చెందుతుందని, అనేక ముద్రణలు పొందుతుందని, ప్రతి తెలుగువారి ఇంటా ఉంటుందని, తెలుగు కథపై కొత్త ఆసక్తి కలిగిస్తుందని, కొత్త కథకులకు ఉత్ప్రేరకమౌతుందనీ ఆశిద్దాం.

**********
నూరేళ్ళ తెలుగు కథ
నూరుగురు కథకుల నూరు ప్రసిద్ధ కథలు
పునఃకథనం /రీటెల్లింగ్: మహమ్మద్ ఖదీర్‌బాబు
సెప్టెంబర్ 2011
కావలి ప్రచురణలు
అన్ని ముఖ్యమైన తెలుగు పుస్తక దుకాణాల్లో దొరకవచ్చు
395 పేజీలు, 190 రూ.

(Disclosure ఈ పుస్తకం ముందు ఖదీర్‌బాబు కృతజ్ఞతలు చెప్పినవారిలో నేనూ ఉన్నాను.)About the Author(s)

Jampala Chowdary

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు, కథ-నేపథ్యం కథాసంపుటాలకు సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానాకు 2013-2015కు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా, 2015-2017కు అధ్యక్షుడిగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.24 Comments


 1. jayaprabha

  ‘నూరేళ్ల తెలుగు కథ’ పేరిట నూరుగురు కథల నూరు ప్రసిద్ధ కథలు పునఃకథనం చేసిన మహమ్మద్ ఖదీర్‌బాబు తెలుగు సాహితి వర్గానికి చేసిన ఒక
  మేలు ఏమిటంటే …?
  అందులో తన కథ పెట్టకుండా బతికించాడు . లేకుంటే అతడి చెత్త కథలు చదవలేక చచ్చేవాళ్ళం .


 2. నాగరాజు

  జంపాలగారూ,
  నూట పదహార్లు అన్న పేరుతో ఒక సంకలనం (రెండు సంపుటాలుగా) ఒకటి మునుపెప్పుడో కాలేజీరోజుల్లో చదివిన గుర్తు. దాని వివరాలు చెప్పగలరా (ఇప్పుడు ఎక్కడైనా దొరికే అవకాశం ఉందా? )
  భవదీయుడు,
  నాగరాజు


  • Jampala Chowdary

   @నాగరాజు:

   నూటపదహార్లు (ప్రథమ భాగము) పేరుతో ఒక కథాసంకలనాన్ని 1974లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించింది. తాళ్ళూరి నాగేశ్వరరావు, హితశ్రీ (ఎం.వి.ఎన్. ప్రసాదరావు అసలు పేరు అనీ గుర్తు) సంకలన కర్తలు. ఇద్దరూ తెనాలి వాస్తవ్యులు; రచయితలుగా ప్రసిద్ధులు.

   సంకలన కర్తల మాటల్లో: “నూటపదహారు ఉత్తమకథలను ఎన్నికచేసి ప్రచురించాలనే సంకల్పం మాకు 1965లో కలిగింది. కథల ఎన్నిక కేవలం మా ఇష్టానిష్టాల ప్రకారం జరగలేదు. తమ రచనలలో శ్రేష్టమైనవి తమకు నచ్చినవి పేర్కొనవలసినదిగా ఆ రచయితలనే కోరాము. కొంతమంది సూచించినారుగాని, ఎక్కువమంది ఎంపిక ప్రక్రియను మాకే వదలి వేశారు.”

   ఈ ప్రథమ భాగములో 53 కథలు ఉన్నాయి. కథకులు చాలావరకూ తొలి మలి తరాలకు చెందినవారు.
   రెండవ భాగము ప్రచురింపబడలేదని విన్నాను. తాళ్ళూరి నాగేశ్వరరావు చిన్న వయసులోనే మరణించటం కారణమేమో తెలీదు.

   536 పేజీల ఈ పుస్తకం అప్పటి వెల 15 రూపాయలు.
   ఈ పుస్తకం పునర్ముద్రించబడినట్లు లేదు. పాత పుస్తకాల షాపుల్లో దొరకవచ్చేమో!


 3. ramachary bangaru

  manchi charcha chesaaru.manchikadhakula perlanu daaramtho poolamaalagaa malichinaaru.danyavaadaalu.


 4. Lalitha TS

  Oh! Sorry! That’s a misunderstanding on my part. Based on your comment from above, could you please tell me if I can get the 97 stories (Katha Sagar)?

  395 పేజీల్లో 100 కథలు పూర్తిగానా? అదీ. పరిచయాలూ, విశ్లేషణలతో సహా! అమ్మా, ఆశ
  నూరు కాదు కానీ, 98 మామంచి కథలున్న మంచి పుస్తకం ఒకటి ఉంది. కావాలంటే నాకు ఈమెయిల్ పంపించండి.


  • Jampala Chowdary

   కథాసాగర్ వివరాలు నిన్న (అక్టోబరు 11) వ్రాసిన వ్యాసంలో చూడవచ్చు.


  • లలితా గారు నమస్కారం,

   నాకు 98 కథల పుస్తకం పంపించండి.

   భవదీయుడు.
   రామాచారి బంగారు.
   సెల్ నెంబరు.9949391110
   చిరునామా .ఇంటి నెంబరు. 4-7921/1,
   శ్రీహర్ష , లాయర్స్ కాలని,
   భవానీ నగరు , కోదాడ ( గ్రామం & మండలం)
   నల్లగొండ జిల్లా .508 206 .


 5. Lalitha TS

  జంపాల చౌదరి గారూ ,

  నమస్తే!

  నాకు “నూరేళ్ళ తెలుగు కథ” ఒక కాపీ కావాలి. మీ ఈమెయిలు ఐడి ఇస్తే నా అడ్రస్ వివరాలు ఇస్తాను. మేము మిజోరి లో ఉంటాము. పుస్తకం ఖరీదు , పోస్టల్ ఖర్చులు ఎంత అవుతాయో దయచేసి తెలపండి (in US $).

  ధన్యవాదాలు,
  లలితా TS


  • Jampala Chowdary

   క్షమించాలి; నా దగ్గర నా కాపీ మాత్రమే ఉంది. ఈ పుస్తకాన్ని మీరు ఇండియాలో ఉన్నవారెవరి సహాయంతోనైనా తెప్పించుకోవాలి.


  • GOPINAIK BHUKYA

   meeku kaavalsina book cheppithe meeku pampe erpatu chestanu


 6. Srinivas

  @శేఖర్ గారు,
  ఇకముందు స్కై/సంగిశెట్టి వంటి వారెవరయినా కథా సంకలనాలు వేయదలుచుకుంటే మీరిచ్చిన పట్టిక చాలా ఉపయోగకరం గా ఉంటుంది. కాకపోతే మీరు శ్రమ అనుకోకుండా మరిన్ని వివరాలు సేకరించాలి.
  మీరు ప్రాంతం మాత్రమే ఇచ్చారు; ఒక్కో ప్రాంతంలో ఏ జిల్లాకీ అన్యాయం జరక్కుండా వారి వారి జిల్లాలు కూడా తెలియాలి. ఊరు కూడా తెలిస్తే మంచిది – గ్రామీణ ప్రాంతాల వారికి అన్యాయం జరక్కుండా జాగ్రత్త పడొచ్చు. అట్లాగే వీరి కుల, మత, ఆదాయ వర్గ వివరాలూ కావాలి. ఎవరికి ఏ కోటా వర్తిస్తుందో చూడాలి కదా! వయస్సూ, లింగమూ (వీరిలో ఎవరయినా కలం పేర్లతో రాస్తూ ఉంటే) తెలిస్తే వయోలింగ వివక్ష కూడా లేకుండా ఒక నిష్పక్షపాత సంకలనం తేవచ్చు.

  తా.క. మీ రిచ్చిన పట్టిక బావుంది. అయినా ఇది కూడా పరిపూర్ణం కాదని ఇంకొకరెవరయినా మీతో తగవు పడొచ్చు జాగ్రత్త!:-)


 7. sekhar

  sorry sky and sangisetty

  yendukante 100 miss ayyayani 90 ichanu.

  oka section update cheyadam marchipoyanu.

  khadeer babu miss chesina, tana ahamkaaram koddi vadilesina antsrrashtra writers inko 10 mandi vunnaru. vaallato kalipite mottam 100 missing.

  aa writers.

  1 maalati chandur (chennai)
  2. jalandhara (chennai)
  3. vivina murthy (banglore)
  4. dasari amarendra (delhi)
  5. liyosa sampath kumar (delhi)
  6. amballa janardhan (mumbai)
  7. daatla devadanam raju (yanam-pandichery)
  8. basavaraju (hosoor)
  9. dr.prasad (hosoor)
  10. sadlapalli venkateswara reddy (ballarey)

  veellandarini vadilesina khadeer babunu yem chesinaa paapam ledu.

  sangisetty and sky tum sangharsh karo ham saath hai.


 8. sekhar

  sangisetty vadilesina perlu.
  telugu katha noorellalo leni perlu.

  telangana
  1.dilaavar
  2. bejjarapu ravindar
  3. bejjarapu vinod kumar
  4. kv narendar
  5. ita chandrayya
  6. haneef
  7. koduri vijay kumar
  8. adilabad muralidhar
  9. jookanti jagannadham
  10. devulapalli krishana moorthy
  11. ampasayya naveen
  12. raama chandramauli
  13. anwar
  14. bhoopal
  15. Dr.pulipaati guruswami
  16. bhagavantam
  17. mangaari raajendar (jimbo)
  18. gudipaati
  19. chintapatla sudarsan
  20. nelimala bhaskar

  raayala seema
  1. sukoji devendra chari
  2. kv ramana
  3. paalagiri viswaprasad
  4. sasisree
  5. g.venkatakrishna
  6. kaasibhatla venugopal
  7. g.uma maheswar
  8. dr.harikishan
  9. raara
  10. tavva vobula reddy
  11. akkampeta ibrahim
  12. vempalli gangadhar
  13. battula prasad
  14. balakrishna moorthy (mangali kathalu)
  15. raaptadu gopala krishna
  17. pasupuleti geeta
  18. munisuresh pillai
  19. vempalli abdul khadar
  20. palamaneru baalaji

  vuttaraandha
  1.jagannadha sarma
  2. chinta appalnaayudu
  3. reddy sastry
  4. bodda koormarao
  5. raamakoti
  6. jeshta
  7. k.v.koormanadh
  8. k.n.malleeswari
  9. chaganti tulasi
  10. chaganti sankar
  11. sri sri
  12. arnadh
  13. k.k.bhagyasri
  14. k.k. raghunandana
  15. electron
  16. daatla naarayanamoorthy raaju
  17. ichapuram jagannadham
  18. tripura
  19. gv chalam
  20. chitra

  kostandhra

  1. addepalli prabhu
  2. vommi ramesh babu
  3. johnson choragudi
  4. k.varalaxmi
  5. vaadrevu veeralaxmi devi
  6. yendluri sudhakar (mallemoggalagodugu)
  7. molakalapalli koteswara rao
  8. v.pratima
  9. lenin dhanisetty
  10. daggumaati padmakar
  11. vinodini
  12. titanic suresh
  13. manchikanti
  14. nalloori rukmini
  15. b.ajay prasad
  16. tallavajjala patanjali sastri
  17. d.r.indra
  18. nandigam krishnarao
  19. geethanjali
  20. goparaaju naarayana rao

  nri writers
  1. saayi brahmanandam gorti
  2. nidadavolu maalathi
  3. kanneganti chandra
  4. kv giridhar rao
  5. tupaaki naarayana swami
  6. vangoori chittenraju
  7. veluri venkateswararao
  8. aari seeta raamaiah
  9. satyam mandapaati
  10.poorna sonti

  mottam nooru kathalu.

  inta mandini vadilesina khadeer babunu yem chesinaa paapam ledu.

  sangiseety and sky i am with you yaar.


 9. స్కైబాబ

  పునఃకథనంలోనూ వివక్షే!
  (ఆంధ్రజ్యోతి ‘వివిధ’లో ప్రచురింపబడిన స్పందన)
  తెలుగు కథా సాహిత్యానికి నివాళిగా ‘నూరేళ్ల తెలుగు కథ’ పేరిట నూరుగురు కథల నూరు ప్రసిద్ధ కథలు పునఃకథనం చేసిన మహమ్మద్ ఖదీర్‌బాబు అభినందనీయుడు. కథకుల ఒరిజినల్ కథను భావం చెడకుండా సంక్షిప్తం చేయడం కష్టసాధ్యమైన పని. అయితే ఈ పనిని ఖదీర్‌బాబు సరిగ్గానే పూర్తి చేసిండు. ఇది కచ్చితంగా తెలుగు కథకు కొత్త మేలు చేర్పు. అయితే ఈ చేర్పుతో తెలంగాణకు మొత్తంగా, సీమాంధ్ర ప్రాంతాల్లోని దళిత, బీసీ రచయితలకు ఖదీర్‌బాబు చేసిన చేటు అంతా ఇంతా కాదు. నిజానికి తొలి తెలుగు కథ వెలువడి ఇప్పటికీ 113 యేండ్లు గడిచినవి.

  తొలి తెలుగు కథ రాసిన భండారు అచ్చమాంబ కథను (ధనత్రయోదశి-1902) ఈ సంకలనంలో జోడించుకుంటూనే ఈ పుస్తకానికి ‘నూరేళ్ల తెలుగు కథ’ అని పేరు పెట్టిండు. అలాగే లోపల కూడా వందేళ్ల కథలు అని చెప్పుకున్నాడు. అంటే ఇది తెలుగు పాఠకుల్ని తప్పుదోవ పట్టించడమే! గురజాడ కన్నా 12 యేండ్లకు ముందే తొలి తెలుగు కథ అచ్చయిందని ‘అచ్చమాంబ కథలు’ వెలుగులోకి తీసుకొచ్చి చెప్పడం జరిగింది. ఈ సంకలనంలోని మొత్తం వంద కథల్లో తెలంగాణ ప్రాంతం వారి కథలు రెండు పదులకు మించి లేవు. న్యాయంగా తెలంగాణ కథకులవి నలభై కథలుండాలి.

  అట్లా కాకుండా కేవలం 20 కథలు మాత్రమే ఇందులో చేర్చడం వెనుక ఆయనకు తెలంగాణ కథకులపై ఉన్న చిన్నచూపు, చులకన భావం అర్థమవుతుంది. ట్యాంక్‌బండ్‌పై సీమాం«ద్రుల విగ్రహాలు నెలకొల్పిన కుట్రే ఇందులో కనబడుతోంది. ట్యాంక్‌బండ్‌పై మచ్చుకు ఐదారుగురు తెలంగాణ వాళ్ల విగ్రహాలు నెలకొల్పి మిగతావి సీమాం«ద్రులవే స్థాపించి తెలుగు నేలలో ఉన్న వైతాళికులు వీరు మాత్రమే అని ప్రపంచానికి ప్రదర్శన పెట్టారు.

  ఇన్నేండ్లుగా తెలంగాణలో ఐదారుగురికి మించి వైతాళికులు లేరు అనే భావన వ్యాప్తిలోకి వచ్చింది. ఆ భావన ఆగ్రహంగా మారి మార్చి పదిన ప్రాంతేతరుల విగ్రహాల తొలగింపుకు దారి తీసింది. తెలంగాణలో ఇన్ని ఉద్యమాలు జరుగుతూ ఉండి, తమకు న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం, హక్కుల కోసం తెలంగాణ బిడ్డలు నిత్యం రోడ్డెక్కుతున్నారు.

  అయినా కూడా సీమాంధ్ర పాలక వర్గాలు, వారి తాబేదార్లు గత ఆరు దశాబ్దాలుగా తెలంగాణపై చూపించిన వివక్ష, వ్యతిరేక వైఖరినే ఖదీర్‌బాబు ఈ సంకలనం ద్వారా మరోసారి విచ్చలవిడిగా ప్రదర్శించాడు. తెలంగాణలో పరిగణనలోకి తీసుకోవాల్సిన కథకులు రెండు పదులకు మించి లేరని చెప్పకనే తన ఉద్దేశ్యాన్ని చెప్పిండు. మహమ్మద్ ప్రవక్త ‘అజాఁ’ ఇచ్చే అవకాశం ఆఫ్రికన్ బ్లాక్, బానిస హజ్రత్ బిలాల్‌కు దక్కినట్టుగానే ఈ కథలను మళ్లీ చెప్పడానికి తనకు అవకాశం దక్కిందని మురిసిపోయిన ఈ మహమ్మద్ ఖదీర్‌బాబు తన ‘పిలుపు’ను ‘తమ ప్రాంతం వారికి మాత్రమే’ పరిమితం చేయడం విషాదం.

  ఖదీర్‌బాబు ఈ పుస్తకానికి ముందుమాట రాస్తూ ‘కథను గుట్టు చప్పుడు కాని ఒక కత్తిలా బొడ్లో దోపుకొని సైలెంట్‌గా ఉండటం అంటే ఏమిటో అర్థమయింది. దానిని నేను ఒదల్లేదు’ అన్నాడు. ఒక్క ఖదీర్‌బాబేమి గతంలో తెలుగు కథలు సంకలనం చేసిన అందరూ అదే పనిచేశారు. దాన్ని ఖదీర్‌బాబు కొంచెం పదునుపెట్టి తెలంగాణ గొంతుమీద పెట్టిండు. అంతే తేడా. తెలుగులో గతంలో సంకలనాలు వేసిన మధురాంతకం రాజారాం, వాకాటి పాండురంగారావు, వేదగిరి రాంబాబు, వాడ్రేవు చినవీరభద్రుడు, వాసిరెడ్డి నవీన్-పాపినేని శివశంకర్, జంపాల చౌదరి-ఎ.కె.ప్రభాకర్-గుడిపాటిలు చేసిన అన్యాయమే ఈసారి ఖదీర్‌బాబు చేసిండు.

  ఖదీర్ చేసిన అన్యాయానికి అస్తిత్వాల ముసుగేసే ప్రయత్నం చేసిండు. అస్తిత్వాల ముసుగులో ఏది చేసినా చెల్లుతుందనే ధిక్కార, ఆధిపత్య స్వభావాన్ని ప్రదర్శించుకున్నాడు. ‘వందేళ్లలో జరిగిన మార్పులు, చేర్పులు, పోరాటాలు, ఎదుగుదలలు, అధోపాతాలు, బాధితుల ఘోష, నిచ్చెన పట్టుకొని ఎగబాకేందుకు స్త్రీలు, బహుజనులు, దళితులు, ముస్లింలు చేసిన పెనుగులాట, ఒక మౌన అశ్రువు, ఒక మందహాసం… ఇవన్నీ తెలియాలని అనుకున్నాను’ అని ముందుమాటలో చెప్పుకున్నాడు. ఇవన్నీ పైకి కనిపించే మెత్తటి మాటలు. రహస్యంగా ఎవరికీ అంతు చిక్కకుండా సైలెంట్‌గా బొడ్లె దోపుకున్న కత్తిని విశృంఖలంగా వినియోగించిండు.

  నిజానికి ఇందులోని మొత్తం కథల్లో ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా 70 శాతం కథలు అగ్రవర్ణాల వారివి. మొత్తం కథల్లో 50 శాతం బ్రాహ్మణులవి. మహిళల (బ్రాహ్మణులతో కలిపి) కథలు 16కు మించి లేవు. దళితుల కథలు ఎనిమిది దాటలేదు. దళితుల కథలు జాజుల గౌరి, గోపి భాగ్యలక్ష్మిలను కలిపినా ఏడెనిమిదిమందికి మించి లేవు. అలాగే బీసీ కథకుల సంఖ్య డజను దాటలేదు. మరి ఈ కులాల నుంచి కథలు రాసినవారు లేరా? అంటే చాలామంది ఉన్నారు. సీమాంధ్ర ప్రాంతలో ఉన్న చాలామంది దళిత, బీసీ, ఎస్సీలకు, తెలంగాణలోని పై వర్గాలతో పాటుగా ముస్లిం మైనారిటీలకు దక్కాల్సిన వాటా దక్కలేదు.

  అందుకు తన మీద మాట రాకుండా ముందుగానే ఖదీర్ ఎగ్జిట్ దారి ఏసి పెట్టుకుండు. ‘ఈ కథకుల్లో మణుగుల కొద్దీ బరువు వేసినవారు కొందరు లేరు. ఒక్క తులసీదళం వేసి కూడా బిక్కుబిక్కుమని నిలుచున్నవారు ఉన్నారు. నా మిత్రులు చాలామంది లేరు. శత్రువులు ఒకరిద్దరు ఉన్నారు. నేను చూళ్లేదు. రాసేటప్పుడు- ఒక కథను చేతిలో పట్టుకొని నిలుచున్నప్పుడు- నిర్ణేత కథే. వ్యక్తి కాదు. కథ తనకు తానుగా ఎంచుకున్న వందమంది వీళ్లు’. ఇది పూర్తిగా బుకాయింపే.

  కథ తనకు తానుగా ఎంచుకున్న వందమంది వీళ్లు అన్నాడు ఖదీర్. కచ్చితంగా వాటినే పునఃకథనం చేసే వ్యక్తే వాటిని ఎంచుకుంటాడు. కథే నడిచి వచ్చి ముందు నిలబడదు కదా! ఈ ఎంపిక చేయడంలో పునఃకథనం చేసే ఖదీర్ యిష్టాయిష్టాలు పనిచేశాయి. తన ప్రాంత మూ పనిచేసింది. ఇన్నేండ్ల నుంచి తాను చదువుకున్న సాహిత్యమూ పనిచేసింది. తన పరిసరాలు పనిచేశాయి. ఇవన్నీ కలగలిపి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరింపజేశాయి. సీమాంధ్ర ఎస్సీ, బీసీలకు అన్యాయం చేశాయి.

  భూషణం, అట్టాడ అప్పల్నాయుడు, గంటేడ గౌరునాయుడు, సువర్ణముఖి, వల్లిపురం జగదీష్ ఈయన దృష్టికి ఆనకుండా పోయిండ్రు. తొలితరం సీమ దళిత కథా రచయిత కె.సభా, సీమ దళిత జీవితాలను చిత్రించిన శాంతినారాయణ ఈయన కండ్లకు కనబడలేదు. అలాగే ఎన్నో కథా సంపుటాలు వెలువరించిన సింగరాజు లింగమూర్తి, అందే నారాయణస్వామిలు అతాపతా లేకుండా పోయిండ్రు. కథల్లో ఓనమాలు దిద్దుకున్న తిరుపతి బిడ్డలు పులికంటి కృష్ణారెడ్డి గానీ, వి.ఆర్.రాసాని గానీ ఖదీర్‌బాబు దృష్టికి రాలేదు.

  ఇక తెలంగాణ విషయానికి వస్తే సహజంగా, న్యాయంగా ఇందులో స్థానం దక్కాల్సిన చాలామంది ఖదీర్‌బాబు హ్రస్వ దృష్టి వల్ల బయటే ఉండిపోయారు. పొట్లపల్లి రామారావు, భాస్కరభట్ల కృష్ణారావు, సురమౌళి, ముదిగంటి సుజాతారెడ్డిలు ఏ పద్ధతిలో చూసినా చోటు దక్కాల్సిన ప్రథమశ్రేణి రచయితలు. వీరికి ఏమాత్రం తీసిపోని రచయితలు వుప్పల నరసింహం, ఆడెపు లక్ష్మీపతి, కాలువ మల్లయ్య, అఫ్సర్, పి.చంద్, చైతన్య ప్రకాశ్, స్కైబాబ, జూపాక సుభద్ర, షాజహానా, ఖాజా. సంపుటిలో ఆల్రెడీ కొంతమంది శత్రువుల్ని కూడా చేర్చుకున్న ‘విశాల దృక్పథం’ ఉన్న ఖదీర్ మరి వీరిని ఎందుకు విస్మరించిండో తెలుగు పాఠక లోకానికి చెప్పుకోవాల్సిన అవసరముంది.

  కేవలం సంపుటి అయినట్లయితే ఏ వెయ్యిమందికో చేరుతుంది కాబట్టి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఖదీర్‌బాబు ఇందులోని 75 కథలు గతంలోనే పత్రికలో ప్రకటించి 50 వేలమంది చేత చదివించిండు (అతని లెక్క ప్రకారమే) కాబట్టి అంతమందికి ఒక సంకేతం వెళ్లింది- సీమాంధ్రల్లో దళిత, బీసి రచయితలు తగినంతమంది లేరనే సంకేతమిది. అలాగే- తెలంగాణలో 20 మందికి మించి చెప్పుకోదగ్గ కథకులు లేరు- అని ఆయన భావించిండు. ఇదే అతని విజ్ఞతను ఎఱుక పరస్తుంది.

  సంతోషంగా, పరవశిస్తూ, ప్రతి రచయితా వదిలి వెళ్లిన కథాస్థలిని ఎంతో కుతూహలంతో ఖదీర్ రీవిజిట్ చేసిండు. ఈ రీవిజిట్‌లోనైనా గతంలో ఎవ్వరూ తిరగని ప్రదేశాలను, ప్రసిద్ధ కథకులనూ, భిన్న జీవితాలను, అట్టడుగు బతుకులనూ, మైనారిటీల వ్యథలను ఖదీర్ తిరగాలని ఆశించాము. అయితే ఆయన ఈ విషయంలో తెలుగు కథాభిమానులందర్నీ నిరాశ పరిచాడు. ఖదీర్‌బాబు ఇప్పటికైనా ఈ కథలు ‘తనకు తానుగా’ ఎంచుకున్న పద్ధతి ఏంటిదో చెబితే భవిష్యత్తరాల వారికి మేలు చేసినవాడు అవుతాడు. ఎందుకంటే ఆ ముండ్ల దారి కాకుండా వాళ్లు కొత్తదారి వేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది.
  – సంగిశెట్టి శ్రీనివాస్


 10. అవును. పొరపాటు నాదే. మన్నించాలి. అరుణ పప్పు గారి వ్యాసం మీద జరిగిన చర్చ, అందులో స్టీవ్ జాబ్స్ ప్రస్తావన, దానికి సంబంధించి నా వ్యాఖ్య.


 11. ఈ చర్చ చూస్తుంటే నేనడిగే ప్రశ్నకీ, ఈ చర్చకీ సంబంధం ఉందనాలో లేదనాలో అర్థం కాకుండా ఉంది 🙂
  ఇంతకీ నా సందేహం. పాపం స్టీవ్ జాబ్స్ అన్న మాటలు మూర్ఖంగా ఉండమనా, అజ్ఞానంతో ఉండమనా లేక అమాయకంగా ఉండమనా? తను నమ్మిన దానిని పట్టుకుని మూర్ఖంగా ముందుకు పొమ్మని కాదూ ఆయన చెప్పినది? ఆ పని కొంతమంది చాలా చక్కగా చేస్తుంటారు. కాకుంటే ఆయన ఉద్దేశించన పద్ధతిలో కాదనుకుంటా. (ఈ మధ్య కొన్ని తెలుగు బ్లాగులలో వ్యాఖ్యలను చూస్తే అనిపిస్తోంది. పుస్తకం.నెట్ గురించి కాదు సుమా). ఈ వ్యాఖ్య వ్రాయటంలో నేను ఈ ఆర్టికల్ రచయిత, వ్యాఖ్యాతలలో ఎవరినీ సమర్థించే ప్రయత్నం కానీ వ్యతిరేకించే ప్రయత్నం చెయ్యడం లేదని గమనించ ప్రార్థన. నిజానికి వ్యాసం చదివితే ఒక మంచి రచన / వ్యక్తీకరణ చదివిన అనుభూతి కలిగింది. పొడుగైన వ్యాఖ్యలు నాకు (ఇరువైపులా) అర్థం కాలేదు. స్టీవ్ జాబ్స్ సందేశం గురించిన ప్రస్తావన మాత్రమే నన్నాకర్షించింది.


  • Jampala Chowdary

   @లలిత:
   మీరు పొరపాటున పక్క పేజీకి వచ్చేసినట్టున్నారు. స్టీవ్ జాబ్స్ ప్రస్తావన వచ్చిన సంభాషణ జరుగుతుంది అరుణ పప్పు గారి వ్యాసం పేజీలో.


 12. appaji

  sir,please send me too..eagerly waaiting..


  • Jampala Chowdary

   @రామ, లలిత, చంద్రహాస్, ఏరువాక, అప్పాజీ:

   లెక్క తప్పు చెప్పాను, తొంభయ్యెనిమిది కథలు కాదు తొంభయ్యేడే; పొరపాటుకు క్షమించండి.
   ఇన్ని మంచికథలున్న పుస్తకం పేరు కథాసాగర్; సంపాదకుడు ఎం.ఏ. సుభాన్. 2007 ప్రచురణ. పుస్తకం గురించి వివరంగా ఇంకోసారి తెలియజేస్తాను. తెలుగునాట మంచి పుస్తకాల షాపుల్లో దొరుకుతూ ఉండాలి. అమెరికాలో ఉన్న వారెవరికైనా కావాలంటే నా దగ్గర బహుకొన్ని కాపీలు ఉన్నాయి. ఈ పుస్తకం గురించి చెప్పడానికి కారణం పుస్తకంలో నా ఫొటో వెయ్యడం మాత్రం కాదు.


 13. K.చంద్రహాస్

  మంచి పరిచయం. Thanks. ఆప్పట్లో సాక్షి దినపత్రికని ఈ కథల పరిచయాలకోసమే తీసుకోవడం మొదలుపెట్టాను. కథల పరిచయం వరకు బాగున్నదిగాని కథలపైన వ్యాఖ్యానం నాకు అంతగా నచ్చలేదు. పరిచయం చేసినవన్నీ గొప్ప కథలే. వాటిని చక్కగా చెపితే చాలని నా భావన.
  సాక్షిలో పరిచయం చేసినవి 75 కథలు. ఈ పుస్తకంలో మరో 25 కథలను పరిచయం చేసారు అంటున్నారు కదా? అవేవో తెలుసుకోవడానికి పుస్తకం తెచ్చుకోవాలి.
  మీరు చెప్పే 98 కథలు నవ్యలో వేసినవేనా? కాకపోతే, నాకుకూడా పంపించండి please.
  K.చంద్రహాస్


 14. ఏరువాక

  @జంపాల గారు
  దయచేసి నాకు కూడా పంపించగలరు
  lg.kale@gmail.com


 15. lalitha sravanthi

  @jampala chowdary

  sir naaku kooDA 98 maa manci kathalu pampanDi

  lalithasravanthi@gmail.com


 16. ఇందులో కథా పరిచయాలతో బాటు ఏ కథ గురించి వ్రాస్తున్నారో ఆ కథ కూడా ఉందా?


  • Jampala Chowdary

   @రామ:
   395 పేజీల్లో 100 కథలు పూర్తిగానా? అదీ. పరిచయాలూ, విశ్లేషణలతో సహా! అమ్మా, ఆశ 🙂
   నూరు కాదు కానీ, 98 మామంచి కథలున్న మంచి పుస్తకం ఒకటి ఉంది. కావాలంటే నాకు ఈమెయిల్ పంపించండి.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

“బియాండ్ కాఫీ” – ఖదీర్‌బాబు

వ్యాసకర్త: మానస చామర్తి ************** మంచి కథ అంటే, మనని తనలో కలుపుకునేది. రచయిత సృష్టించిన లో...
by అతిథి
1

 
 

ఖదీర్ బాబు ఫుప్పుజాన్ కతలు

వ్యాసకర్త: రహ్మానుద్దీన్ షేక్ ****** బెంగుళూరు వచ్చిన కొత్తలో స్నేహితుల ద్వారా మహమ్మద్ ...
by అతిథి
4

 
 

‘నూరేళ్ల తెలుగు కథ’ నుంచి మినహాయింపు ఒక అదృష్టం!

(ఈ వ్యాసం మొదట ఆంధ్రజ్యోతి “వివిధ” లో అక్టోబర్ 31న వచ్చింది. కొన్ని మార్పులతో రచయిత...
by అతిథి
7

 

 
నూరేళ్ల తెలుగు కథ – మరో వెయ్యేళ్లు వెలిగే కథ

నూరేళ్ల తెలుగు కథ – మరో వెయ్యేళ్లు వెలిగే కథ

ముందొక పిట్ట కథ. పూర్ణయ్యని బావగాడంటారు అందరూ. బావగాడు లేకపోతే సరదాలేదు, సంబరమూ లేదు....
by అరుణ పప్పు
27

 
 
ఈస్ట్‌మన్ కలర్ జ్ఞాపకాలు

ఈస్ట్‌మన్ కలర్ జ్ఞాపకాలు

(మహమ్మద్ ఖదీర్‌బాబు “బాలీవుడ్ క్లాసిక్స్” పుస్తకానికి జంపాల చౌదరి ముందుమాట) సిన...
by Jampala Chowdary
4