Bridging connections – An anthology of Sri Lankan short stories

వ్యాసకర్త: లక్ష్మీదేవి
*********
ఎస్సెమ్మెస్ – సునేత్రా రాజకరుణానాయకే వ్రాసిన ఈ కథ యుద్ధానంతర స్తబ్ధ భీతావహ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది.

(1917 మూవీ లో ఇలాంటి చిత్రణ ఉంటుంది. ఎంతైనా అది మూవీ.) ఈ ఎస్సెమ్మెస్ అనే సునేత్ర గారి కథలో అంత గొప్ప చిత్రణా ఉండడం ఆ రచయిత్రి కధనకౌశలాన్ని చూపిస్తుంది.
ఘర్షణ నెలకొన్న జాఫ్నా వణ్ణి ప్రాంతాలలోని కిళినోచ్చి నుంచి వడమరాచ్చికి జరిగిన ఒక చిన్నప్రయాణంలోని అనుభవాలదీ కథ. అడుగడుగునా ఎక్కడెక్కడ ప్రేలుడు పదార్థాలు పాతిపెట్టబడి ఉన్నాయో చెప్పలేని భయానక వాతావరణం. అన్నీ తొలగించబడినప్పటికీ ఎక్కడ ఏమున్నాయో అనే శంక. ఒక నాలుగు కేజీల బరువు అంటే ఒక చిన్నపిల్లోడి కాలు పడినా చాలు పేలడానికి. ఒకానొక అంతర్జాతీయ సంస్థ తరపున కొందరు అక్కడి పరిస్థితిని అంచనా వేయడానికి వెళ్తారు. వారి నోటివెంట కథనం సాగుతుంది.
ఇళ్ళ శిథిలాలను బట్టి అక్కడి జనావాసాలను అంచనా వేస్తూ, గడ్డి మొలవకుండా పాడైపోయిన చవిటి నేలలను బట్టి పరిస్థితి తీవ్రతను అంచనా వేస్తూ సాగుతారు. అన్ని యుద్ధ పరిస్థితులను ఎదుర్కొని స్థిరచిత్తులై జీవిస్తున్న కొందరిని ఒక చిన్న పల్లెలో కలుసుకుంటారు. వారితో చిన్న సంభాషణ. వారి ఇబ్బందులను, అవసరాలను పరిశీలించి అవగాహన చేసుకుంటారు.
శ్రీలంకలో జరిగిన అంతర్గత ఘర్షణ గురించి ప్రపంచానికెంతో తెలుసు. ఇంకెంతో తెలీదు. అసలు సరిహద్దులకు దూరంగా భద్రంగా ఇనప్పెట్టెలో ఉన్నట్టు తెలుగు ప్రాంతంలో నివసించే ఈ శతాబ్దపు జనాలకు అసలు యుద్ధవాతావరణం గురించి తెలియదనే చెప్పొచ్చు. కానీ భిన్నజాతులు, భాషల జనుల మధ్య ఎలాంటి అస్పష్టమైన ఒక జంకు, ఇబ్బంది ఉంటుందో ఆ విషయాల గురించి ఈ పెద్ద ప్రపంచంలోని మూలమూలలకూ వలస వెళ్ళే అన్ని సమాజాలకూ కొద్దిగానైనా తెలియనే తెలుసు.
బ్రిడ్జింగ్ కనెక్షన్స్ అనే పేరుతో సింహళ, తమిళ కథల ఆంగ్లానువాదాలు మరియు ఆంగ్ల కథలను కూర్చిన ఈ సంకలనంలో నేపథ్యమంతా అదే. ఇందులో కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల కథనాలుంటే, కొన్ని సామాజిక సంఘటనలూ, మరికొన్ని బయటి వాళ్ళ పరిశీలనలా అనిపించే కథలూ ఉన్నాయి.
కథల సంఘటనలలో, కథనములో కొత్తదనమేమీ లేదు, అనువాదభాష (ఆంగ్లము) చాలా చోట్ల గట్టెక్కించే స్థాయిలో మాత్రమే ఉంది. [ఎస్సెమ్మెస్ తప్ప] ఈ సంకలనంలో కథలు ఆకట్టుకునేలా ఉన్నాయని చెప్పలేము. కానీ వస్తువు మీద ఆసక్తి వీటిని చదివించగలదు.
ఇవన్నీ ఎల్ టిటియి కి గానీ, ఐపికెఎఫ్ కి గానీ, అక్కడి ప్రభుత్వానికి గానీ అనుకూలంగానో ప్రతికూలంగానో కాక వ్యక్తి పరంగా, సమాజ పరంగా వ్యాఖ్యానాన్నిస్తాయి.
ముఖ్యంగా అక్కడ స్థానికంగా జాఫ్నా ప్రాంతంలో వివాదంలో ఉన్న రెండు ప్రముఖ భాషలు సింహళం, తమిళం కథలను అనువదించి, కొన్ని శ్రీలంక ఆంగ్ల రచనలతో కలిపి ప్రచురించడం అనే ప్రయత్నం మెచ్చుకోదగ్గది.
కొన్ని వందేళ్ళ క్రిందటి రచనలు కూడా ఉండడం వలన ఆ దేశ స్వాతంత్ర్య ప్రాప్తికి ముందర ఆంగ్లేయుల ప్రభావంతో సాటి పౌరులు చులకన చేయబడిన విషయాలు కూడా తెలుస్తాయి. ఇవి వలస అనే పేరుతో ఆక్రమణకు గురైన అన్ని రాజ్యాలలో జరిగినవే.
ఆంగ్లేయుల నిర్బంధం వలన కొన్ని కనీస జీవన సౌకర్యాలకు అలవరచుకోవలసి వచ్చిన సందర్భంలో స్థానికుల ఇబ్బందుల గురించిన వివరణలూ కనిపిస్తాయి.
యుద్ధ ప్రభావం ఉన్నట్టి, లేనట్టి వ్యక్తిగత విషాదాలు, ఘర్షణలు కూడా ఈ కథల్లో చోటు చేసుకున్నాయి.
ఒక సరదా సంగతి నేను గమనించినదేమిటంటే పేర్ల స్పెల్లింగ్స్. Wickramasinghe, Wijesuriya, Wijesinha, Wimal. వీటినెలా చదవాలో మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ మన స్పెల్లింగ్స్ కు భిన్నంగా ఉంటుంది ఈ తీరు.
సింహళ, తమిళ ఆంగ్లానువాదాలు & ఆంగ్ల కథలు- అన్నిటిలోకీ సింహళ కథలు కొంచెం మెరుగు. వాటిలోనూ, మొత్తం పుస్తకంలోనూ కూడా గొప్పగా నచ్చిన కథైతే పైన చెప్పిన ఎస్సెమ్మెస్.
Leave a Reply