కొన్ని కథలతో అనుభవాలు

ఈ వ్యాసం ఉద్దేశ్యం – సమీక్షా, పరిచయం ఏదీ కాదు. గత మూణ్ణాలుగు నెలల్లో అప్పుడొకటీ, ఇప్పుడొకటీ అంటూ, భిన్న రచయిత(త్రు)ల కథలు చదివాను. ఇటీవలే డైరీ తిరగేస్తూ, ఒక్కోళ్ళ గురించీ నెమరువేసుకున్నాను. ఆ పఠనానుభవాల తాలూకా సంగతులను ఇక్కడ పంచుకోవాలనుకుంటున్నాను. అంతకుమించి ఈ వ్యాసానికి పరమార్థమేం లేదు.

రాచమల్లు రామచంద్రారెడ్డి కథలు – అలసిన గుండెలు:
ఈ పుస్తకం, ఈ-పుస్తకంగా చదివేందుకు ఇక్కడే ఎవరో లంకె ఇచ్చినట్లు గుర్తు. రా.రా. విమర్శ వ్యాసాలు చదివాక, ఆయన కథలెలా రాస్తాడో – అన్న కుతూహలం కలిగి చదివాను. నామటుకైతే నచ్చాయి. చిన్నవిగా ఉండటం కూడా అందుకో కారణం. కొట్టొచ్చిన్నట్లు కనిపించేదీ, మనసులో అలా నిలిచిపోయేదీ – ఇలాంటి లక్షణాలేవీ నాకు తగల్లేదు. నాలుగైదు నెల్ల క్రితం చదివానేమో – ఇప్పుడు అంతగా కథాంశాలు కూడా గుర్తురావట్లేదు – ఒకటీఅరా తప్ప. అయినా కూడా, నా అభిప్రాయంలో ఎప్పుడైనా అలవోకగా తీసి రెండు కథలు చదువుకుని, మూసేస్కోవచ్చు – అనిపించింది కనుక, మంచి కథలే. అన్నట్లు, కథల్లో ఎక్కడా యాస లేకపోవడం కాస్త కొత్తగా అనిపించింది – ఇటీవలికాలంలో యాసలు ఎక్కువ చదివి.

రావికొండలరావు కథలు:
ఇవి కూడా పైన అన్నట్లే, ఎన్నిసార్లైనా బోరు కొట్టకుండా చదువుకునే తీరులో ఉన్నాయి. ఐతే, పైవాటిలో కాస్త కొరవడ్డదీ, ఇందులో ఉన్నదీ, రావికొండల్రావు మార్కు హాస్యం. వీటిల్లో కూడా మనల్ని పట్టుకు కుదిపేసే కథలూ, సన్నివేశాలూ లేవు. కానీ, నన్ను అడిగితే, మంచి కాలక్షేపం అని చెబుతాను. ముఖ్యంగా, ’రెండు ఆత్మలు’ కథ బాగా నచ్చింది నాకు.

సొదుం జయరాం కథలు:
సూటిగా, ఆట్టే సమయం వృధా చేయకుండా విషయం చెప్పడం ఇతని ప్రత్యేకత. చాలామటుకు కథలు రెండు మూడు పేజీలు మించవు. ఎక్కడా నాటకీయత కానీ, వర్ణనలు కానీ కనబడవు. కొన్ని కథలు – కదిలించాయి. అయితే, ఈ కథల్లో ఎక్కడ చూసినా రచయిత కనిపిస్తూనే ఉంటాడు. కాసేపు బానే ఉండింది కానీ తరువాత్తరువాత చిరాకేసింది. అవి కథలో – వ్యక్తిగతాలో గందరగోళంగా అనిపించింది. కథల్లోకి రారానో, ఇతర రచయితలో పాత్రలుగా రావడం ఇదంతా దేనికి? అని సందేహం కలిగింది. అయితే, నా ఫస్ట్ ఒపీనియన్ – ఈకథలేం అంత అద్భుతాలు కావు..అని. కానీ, రెండ్రోజుల తరువాత ఆలోచిస్తే, ఒకందుకు ఈ కథలు చదవాలి అనిపించింది – ఆ శైలికోసం. క్లిష్టత లేకుండా, కన్ఫ్యూజన్ సృష్టించకుండా, అనవసర వర్ణనలు లేకుండా – సాఫీగా సాగింది. అక్కడక్కడా కాల్పనిక జగత్తులో మునిగే కథలపై తన విసుగును కూడా పాత్రల మాటల్లో చెప్పించారు. బహుశా – యాభై ఏళ్ళ తరువాత కూడా జయరాం కథలు చదువుతారా? అని అడిగితే, చదవకపోవచ్చని అనిపిస్తుంది…ఎందుకంటే ఆ తరానికి ఓ జయరాం పుట్టిఉండాలి కనుక…

మనోవ్యాధికి మందుంది – శివరాజు సుబ్బలక్ష్మి కథలు :
ఈకథలు చదివాక వర్ణనలు అసలే లేకపోవడం వల్ల వచ్చే సమస్యేమిటో అర్థమైంది. పైన జయరాం కథల్లో కూడా వర్ణనలూ గట్రా తక్కువే కానీ – కథలు చిన్నవి కావడం, చాలామటుకు – చెప్పదల్చుకున్న విషయం కూడా కొంతే ఉండడం వల్ల – అవి బాగానే చదివించాయి. స్పష్టంగా ఉన్నాయి కూడానూ. కానీ, ఈ కథల విషయానికొస్తే – కథల్లో ఎన్నో సంఘటనలు జరిగిపోతూండటం, దానికి తోడు వివరణలూ గట్రా లేకపోవడం వల్ల – కొన్ని సార్లు మితిమీరిన వేగంతో కథనం సాగినట్లూ, కొన్ని చోట్ల ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయంలో ఉన్నట్లూ అనిపించింది. అయితే – ’ఆడవారి పెట్టెలో ప్రయాణం’ కథ మాత్రం బాగా నచ్చింది. ఈ కథకు ఆంగ్లానువాదం తూలిక.నెట్ లో చూడవచ్చు. ఈ కథలన్నింటిలోనూ వాడిన భాష – నాకు అన్నింటికంటే నచ్చింది. అక్కడక్కడా, హాస్యం బాగా కుదిరింది. ఇక – రికమెండేషన్ విషయానికొస్తే – ఆ ఫాంటులో, ఈ తీరులో కథలు చదవాలంటే కాస్త ఓపిక కావాలి.
(సుబ్బలక్ష్మి గారి గురించి తూలికలో వచ్చిన బయోగ్రాఫికల్ వ్యాసం ఇక్కడ.)

ఆలూరి బైరాగి కథలు:
కవులు రాసిన కథలెలా ఉంటాయో – కరెక్టుగా ఈ కథలు అలాగే ఉన్నాయి! కొన్ని కథలు చదువుతూ-ఊహించుకుంటూ ఉంటే – వావ్! అనిపిస్తూ ఉండింది. ఒకట్రెండు కథలు పెద్దగా నచ్చలేదు కానీ, ఓవరాల్ గా , నాకు ఈ కథలు నచ్చాయి. ఇంతకీ – ’దివ్య భవనం’ కథాంశం ఆమధ్య Enlightenment Era గురించి ఓ వ్యాసం చదువుతూంటే అందులో చెప్పిన కథాంశాన్ని పోలినట్లు అనిపించింది. నాకిప్పుడు ఆ రచయిత ఎవరో, రచన ఏమిటో గుర్తు రావట్లేదు. 🙁 ఈకథల్ని చదవండి – చదివి అనుభవించండి… ఈ పుస్తకం పై గతంలో పుస్తకం.నెట్ లో వచ్చిన సమీక్ష ఇక్కడ.

మల్లెమాల వేణుగోపాలరెడ్డి కథలు:

అసలు ఏమాత్రం ఆసక్తి కలిగించలేకపోయిన కథలివి. కథా-కథనం – అంతా రొటీన్ గా సాగిపోయాయి. కొంతవరకూ ప్రిడిక్టబిలిటీ ఉన్నందుకో ఏమో – నాకంత నచ్చలేదు.

నెమ్లీక – తెలిదేవర భానుమూర్తి:

తెలంగాణ యాసలో నామిని కథల తరహాలో ఉన్నాయి. నేను పూర్తిగా చదివేయలేదు కానీ, చదివినంతలో నాకు నచ్చాయి. ఈయన వ్యాసాలు ఇదివరలో పత్రికల్లో చూసినట్లు గుర్తు. అయితే, ఈ యాసలో చదవడం ఇదే ప్రథమం. కొన్ని కొన్ని పదాలు అర్థం కాలేదు కానీ, కథలైతే బాగున్నాయి. అందునా, ఆ కవర్ పేజీ డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంది (మంచిపుస్తకం వారి వద్ద కొన్నాను).

గిడుగు రాజేశ్వరరావు కథలు:
దాదాపు రెండేళ్ళ క్రితం ఈయన కథలు కొన్ని చదివి, మర్చిపోయినట్లు గుర్తు. పోయిన వారం మరో సంకలనం దొరికి, అది చదువుతూ ఉంటే, అప్పటి అభిప్రాయాలు పూర్తిగా గుర్తులేవు కానీ, ఇప్పటితో పోలిస్తే వేరేమో అనిపించింది. ఇప్పుడు చదివిన కథల్లో – ఒక విధమైన వేదాంత ధోరణి కనబడ్డది. అయితే, కొన్ని కథలకి అది బాగా అమరింది కానీ, కొన్నింటిలో మాత్రం – సంబంధం లేని విషయాలను వేదాంతం అన్న లంకెతో కలిపేసినట్లు అనిపించింది. ఈకథలు కాస్త వయసొచ్చాక రాసారేమో అనిపించింది. కథలు చదివించేమాదిరిగానే అనిపించాయి కానీ – ఒక్కోచోట ఓవర్డోస్ అయిన భావన కలిగింది. బహుశా, మరోసారి ఈయన కథలేవన్నా కనిపిస్తే కూడా చదువుతాననుకుంటాను…
(రాజేశ్వరరావు గారు వారి తాతగారైన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జీవితచరిత్రను రాశారు. ఆ పుస్తకం పై పుస్తకం.నెట్ లో వచ్చిన సమీక్ష ఇక్కడ.)

బీరకాయపీచు – కొడవటిగంటి కృష్ణమూర్తి కథలు:

ఈయన పేరు తెలిసిందే – నాకు తెలిసినవారు ఒకరు, తన కాలేజీ రోజుల్లో (దాదాపు యాభై ఏళ్ళ క్రితం), ఈయన కథలు చదివానని చెబుతూంటే. ఈయన కొ.కు. సోదరుడని తర్వాత తెలిసింది. ఇప్పటి వరకూ సంకలనం పూర్తి చేయలేదు. కానీ, చదివిన కథలన్నీ బాగా నచ్చాయి. ఈపుస్తకం ఇప్పుడు దొరకట్లేదని విన్నాను. పైగా, ఈయన ప్రచురించిన సంకలనం ఇదొక్కటేనట!! ఏమైనా, ఈయన్ని మాత్రం మస్ట్ రీడ్ అని చెబుతాను నేను…. ఈ తరహాలో కథలు (ముఖ్యంగా బీరకాయపీచు కథ) తెలుగులో నేనెప్పుడూ చదవనందుకు కాబోలు… వీటిల్లో కథంటూ పెద్దగా లేదు – అనిపించే అవకాశం లేకపోలేదు కానీ – వెరీ ఎంటర్టైనింగ్.

స్వయంప్రకాశం – శ్రీవల్లీ రాధిక కథలు:

ఆమధ్య సి.పి.బ్రౌన్ వారి పత్రికలో రాధిక గారి కథ చదివాను. నాకు కథాంశం నచ్చింది. ఇంతలోపే, సంకలనం చదువుతానని ఊహించలేదు. హుమ్ – దాదాపుగా కథలన్నీ కథాంశం పరంగా బాగున్నాయి. ఎటొచ్చీ, నాకు కథనం మాత్రం ఏమాత్రమూ నచ్చలేదు. :(. అయినప్పటికీ, నాకు ఈ కథల్ని రికమెండ్ చేయాలనే అనిపిస్తుంది – ఎందుకంటే, ఆ కథావస్తువులు వాస్తవజీవితంలో జరిగే సంఘటనలకు దగ్గర్లో ఉన్నాయి కనుక. (ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో వచ్చిన సమీక్ష ఇక్కడ. పుస్తకావిష్కరణ నాటి విశేషాలు ఇక్కడ.)

అదండీ నా కథా పఠనం కథ!

You Might Also Like

4 Comments

  1. మర్రినీడ | పుస్తకం

    […] చివరి సన్నివేశంలో – “వాడి అసలు కథ అప్పుడే మొదలైంది. అప్పుడు మొదలైన ఆ అసలు కథకి వ్యాఖ్యానం సంఘమూ, వాడి చుట్టూ వున్న మనుష్యులే చెబుతారు కనుక ఆ ప్రయత్నం నేను విరమించుకుంటున్నాను” అని రాశారు. కొంచెం వెరైటీగా అనిపించింది ఈ ముగింపు నాకు. అదే సమయంలో ఎందుకోగానీ సొదుం జయరాం “క్లైమాక్సు లేని కథ” గుర్తువచ్చింది. (ఈయన కథల గురించి ఇదివరలో పుస్తకం.నెట్లో క్లుప్తంగా ఒక్కసారి ప్రస్తావించాను) […]

  2. కొత్తపాళీ

    బాగుందండీ.
    బైరాగి కథలగురించి మీ మొదటి వాక్యం అబ్సొల్యూట్లీ కరక్టు!

    కొడవటిగంటి కృష్ణమూర్తిగారి గురించి తెలుసుకోవడం ఆసక్తికరం. మీ దగ్గర ఉన్న ప్రతిలో ప్రచురణ వివరాలు (సంవత్సరం, ఎవరు ప్రచురించారు, వీలైతే కవేర్ పేజి బొమ్మ) ఇలాంటివి ఇస్తే, మాలాంటి వాళ్ళకి పుస్తకం సాంపాయించడానికి ఉపయోగించొచ్చు. అసలే కొకు సోదరుడు – కొంత క్యూరియాసిటీ ఉంటుంది. అటుపైన మీరు మస్ట్ రీడ్ అని చెబుతున్నారాయెను.

    సొదుం జయరాం గారికి శ్రీకాకుళం కథానిలయం వారిచ్చే రాచకొంద పురస్కారం ఇచ్చిన సందర్భంలో నేనక్కడ ఉన్నాను, ఆయన ఉపన్యాసం విన్నాను, కొద్దిగా ముచ్చటించాను. ఆయన కథలు ఆ తరవాతే చదివాను. ఆయన తన కథల్లాగే చాలా నిరాడంబరుడు. తమాషాగా ఆయన తన కథల్లో చూపించే లాంటి పేద బక్క రైతు కాడు. వాళ్ళ ప్రాంతాలకి (కడప జిల్లాలో ఎక్కాడో అనుకుంటా, లేక అనంతపురమా?) వాళ్ళ కుటుంబం మోతుబరుల కీందే లెక్క. ఎనీవే, పాయింటేంటంటే ఈయన కథల గురించి కూడా మీ మాటతో ఏకీభవిస్తాను.

    విశాలాంధ్ర వాళ్ళు ఈ మధ్యన పాలగుమ్మి పద్మరాజు, బుచ్చిబాబుల కథల సంపుటులు ప్రచురించారు. తెలుగు కథా ప్రేమికులు తప్పక చదవాల్సినవని నా అభిప్రాయం. ప్రయత్నించండి. మళ్ళి ఇలాంటి చక్కటి రివ్యూ రాయండి.

  3. Asooryampasya

    @Sirisha:
    ఎక్కడెక్కడ లంకెలు తెలుసో, అక్కడంతా ఇచ్చాను. మిగితా పుస్తకాలకి ఆన్లైన్ లంకెలు ఉన్నవో లేవో తెలీవు. బహుశా, ఏవీకేఎఫ్ వంటి సైట్లలో పై పుస్తకాల్లో ఎవన్నా కొనుగోలుకి దొరకొచ్చు. ’శివరాజు సుబ్బలక్ష్మి’ గారి పుస్తకం వారి ద్వారానే కొన్నాను.

  4. Sirisha

    meeru chadivina books links kuda istey baguntundi emo andi…nalanti kotta followers ki use avutundi…

Leave a Reply