మర్రినీడ

“మర్రినీడ” అన్న పుస్తకం లో పి.సత్యవతి గారి చిన్న నవల “మర్రినీడ”, మరి రెండు కథలు – “నిజాయితీ”, “సుడిగాలి” ఉన్నాయి.

పుస్తకం వెనుక కథ:
ముందుగా నవల గురించిన నేపథ్యం: మొదట ఇది ఆంద్రజ్యోతి సచిత్రవారపత్రికలో వచ్చిందట. పుస్తకంగా మొదటి ముద్రణ జూన్1975 అని ఉంది కనుక, అంతకుముందే వచ్చి ఉంటుంది పత్రికలో. ఇక, నవలా ప్రియదర్శిని సాహితీ బాలెట్ పథకంలో నాల్గవ నవల అని ఉంది. పుస్తకంలో ఈ సాహితీ బాలెట్ నిబంధనలు అన్న పేరుతో ఇచ్చిన జాబితాని బట్టి నాకు అర్థమైనది ఏమిటంటే, వీళ్ళ ప్రతి పుస్తకం చివర్లోనూ ఒక బాలెట్ కార్డు ఉంటుంది. దానిలో తమకి నచ్చిన నవలను పేర్కొని (అంటే వీళ్ళు వేసిన పుస్తకాల్లో తమకి నచ్చినది) పంపిస్తే, ఫలానా తేదీ తర్వాత ఉత్తమ రచయితను ఎంపిక చేస్తారట.”తెలుగు నవలా ప్రపంచంలో ఏకైక సాహితీ బాలెట్ పోటీలో పాల్గొనండి! బహుమతులు పొందండి” అని ఒక ప్రకటన కూడా కనబడ్డది ఈ పుస్తకం మొదటి పేజీల్లో. ఈ బాలెట్లో ఎంపికైన మొదటి నాలుగు నవలల జాబితా ఇచ్చారు. అవి –
లీలామనోహరం – మల్లాది సూరిబాబు
వెన్నెల మెట్లు – వై.రామలక్ష్మి
కొత్తచిగురు – వి.రాజారామమోహనరావు
మర్రినీడ – పి.సత్యవతి
ప్రస్తుత పుస్తకం “మర్రినీడ” విషయానికొస్తే, ఇందాక అన్నట్లు, పుస్తకంలో ఒక చిన్న నవల, రెండు కథలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా పరిచయం చేస్తాను.

నిజాయితీ కథ:
కల్యాణి అనే అమ్మాయి “తను గతంలో చేసిన” తప్పు సరిదిద్దుకోవడానికి ఇదివరలో తాను ఊరువదిలేసే ముందు పనిచేసిన వారింటికి మళ్ళీ వెళ్తుంది. ఆ తప్పేమిటి? ఆమె ఎందుకు వచ్చిందో తెలియక ముందు ఆ ఇంట్లో వాళ్ళ స్పందనలు ఎలా ఉన్నాయి? తర్వాత ఎలా ఉన్నాయి? చివరికి ఏమౌతుంది? అన్నది వస్తువు ఈ కథలో. నిజానికి ఆ “తప్పు” ఏమిటో తెలిసేదాకా నాకు కాస్తో కూస్తో “సస్పెన్స్” ఉండింది కానీ, తరువాత జరిగేది ఊహించడం పెద్ద కష్టం కాదు కాస్తో కూస్తో లోకజ్ఞానం ఉన్నవారికెవరికైనా. కాకపోతే, మొదట్నుంచీ చివ్వరి దాకా ఆ పాత్రల మధ్య మారుతున్న సంబంధాలకి తగ్గట్లుగా నన్ను కూడా స్పందింపజేస్తూ పోయింది ఈ కథ. అలా “ఇన్వాల్వ్” అవడం ఒకసారి కాదు, తరువాత ఈ కథ రెండు, మూడు సార్లు చదివాను – ప్రతిసారీ జరిగింది. తరువాత, కథలో నాకు బాగా నచ్చిన అంశం – భాష. హాయిగా ఉండింది అంత చక్కటి భాషలో చదువుతూంటే. “వచ్చిన పనైందిగా!” అనేసి కల్యాణి చివర్లో బయటికి వెళ్ళే దృశ్యం మరొకరైతే బహుశా వీలైనంత నాటకీయంగా, సెంటిమెంటు కారిపోయేలా కూడా చెప్పి ఉండవచ్చేమో. కానీ, ఈ కథలో అదొక్కటే లైను. వచ్చిన పనైందిగా, అనేసి కల్యాణి వెళ్ళిపోతుంది. అది కూడా నాకు బాగా నచ్చింది. నచ్చని అంశాలు ఒకట్రెండు ఉన్నాయి – కానీ, “కథ ఇలా ఉండకుండా ఉంటే బాగుంటుంది. ఇలా ఉంటే బాగుంటుంది” అనే టైపు సూచనలిచ్చే నచ్చకపోవడాలు కావవి (అంత విపరీతాసక్తీ, తెలివితేటల్లేవు నాకు). మామూలుగా, కొన్ని ముక్కలు కొందరికి నచ్చవంతే!

సుడిగాలి కథ:
ఈ పుస్తకం లో నాకు ఇది బాగా నచ్చిన కథ. ఈ పుస్తకంలో అనే కాదు, మామూలుగా కూడా నేను చదివిన కొద్దిపాటి కథల్లో నాకు బాగా నచ్చినవిగా లెక్కేసుకునే కథల్లో దీన్ని కూడా చేర్చుకున్నాను. నాకు ఈ కథ నచ్చడానికి నేను అనుకునే కారణాలు – పాత్రల చిత్రణలో ఒక విలక్షణత, ఆట్టే ప్రస్ఫుటంగా లేకపోయినా కథలో ఉన్న అభ్యుదయం, రొటీన్ కు భిన్నంగా ఉంది అని నాకు అనిపించిన ముగింపు. ఒక మూసలో సాగే పాత్రలని, ఆవేశ కావేశాలతో రగిలిపోయే కథనాలని చూసి విసుగెత్తిన నాకు – ఈ కథలో ఈ రెండూ (ముఖ్యంగా రెండోది) లేకుండానే రచయిత్రి ఒక బలమైన స్టేట్మెంట్ ఇవ్వగలిగినట్లు అనిపించింది. “సాంఘిక ప్రయోజనం” అన్న పదం విన్న ప్రతిసారీ నాకొక్క సందేహం కలుగుతుంది. “ఇప్పుడు విపరీతమైన విషాదం చూపకపోతే దానికి సాంఘిక ప్రయోజనం లేనట్లేనా?” అని. జీవిత వాస్తవాల్లో విషాదం తో పాటు అనేకం ఉన్నాయని నా అభిప్రాయం – హాస్యంతో సహా. ఈ నేపథ్యంలో “సాంఘిక ప్రయోజనం” ఉన్న “మంచి” కథ అంటే అలాగా గుండెలు పిండే సంభాషణలు గానీ, వాటిని చూపించి ప్రశ్నించే కథకుడి వాక్యాలూ అవీ తప్పనిసరిగా ఉండాల్సిందేనా? అన్న సందేహాల మధ్య ఉండే నాకు సత్యవతి గారి కథలు (దాదాపు రెండేళ్ళ క్రితం “మంత్రనగరి” సంకలనం చదివాను) కొత్త దారులు తెరిచాయి. విపరీత భావోద్వేగాలు, ఎడాపెడా సాగిపోయే వాదోపవాదాలు ఇప్పుడు ప్రస్తావిస్తున్న కథలో లేవు. కానీ ఈ కథలో “అభ్యుదయం” లేదనీ, “సాంఘిక ప్రయోజనం” లేదనీ – అని మాత్రం నేను అనలేను.

భర్త స్నేహితురాలి పట్ల ఆకర్షితుడు అవుతున్నాడు అన్న విషయం గురించి భార్యకి, అతని చెల్లెలికీ మధ్య చర్చ జరుగుతోంది. చెల్లెలు వచ్చి – మా అన్న వ్యవహారం నీకు తెలిసి కూడా ఏమీ చేయట్లేదేమిటి? అని ఆవేశంగా అడిగినప్పుడు ఈ కథలో ఆ భార్య ఇలా అంటుంది:
“మీ పాదదాసిని ఏలుకొండి. దాన్ని విడిచిపెట్టండి. మన పెళ్ళయిన తొలి రోజులు గుర్తు తెచ్చుకోండి. అని పాదాలు పట్టుకుని ఏడవమన్నావా? గట్టిగా అరచి నలుగురికీ చెప్పి తల బాదుకోమన్నావా? నువ్వు చెప్పు.” అని, మళ్ళీ “ఇంతలోనే కాపురం ఎందుకు కూల్తుందే! వాళ్ళిద్దరూ లేచిపోతారని నాకేం భయం లేదు. డబ్బూ, హోదా వదులుకుని ఎవరు ఈయన వెంట పడి వస్తారే? అందులోనూ హేమేనా వచ్చేది? పరువు ప్రతిష్ట అంటూ పడిచచ్చే వంశంలో పుట్టిన మీ అన్నయ్యా వెళ్ళిపోయేది? ఇంత దూరం ఎందుకు ఆలోచిస్తావే నువ్వు? తాత్కాలికంగా వాళ్ళకి అదో సరదా! దానికి వాళ్ళని గోల చేయడం ఏమీ బాగాలేదు”.
-కనీసం నేను చదివిన తెలుగు కథల్లో కానీ, ఇతర భాషా కథల్లో కానీ (నేను చదివిన కథలు చాలా తక్కువ అని ముందే ఒప్పుకుంటున్నాను) ఇంత ధీమాగా ఉన్న భార్య నాకు తారసపడలేదు. ఈ కథలో నాకు బాగా నచ్చిన సన్నివేశం ఇది. గత కొన్నిరోజుల్లో ఎన్నిసార్లు చదువుకున్నా బోరు కొట్టని సన్నివేశం కూడానూ.
(రచయిత్రి అనుమతితో ఈ కథ పీ.డీ.ఎఫ్. ఇక్కడ ఉంచుతున్నాను. పుస్తకానికి ఏమీ కాకుండా స్కాన్ చేసే ప్రయత్నంలో అదొక కోణంలో కనిపిస్తాయి పేజీలు. కానీ, అక్షరాలేవీ మిస్ అవలేదు లెండి.)

మర్రినీడ నవలిక:
“మర్రినీడ” – నవలిక మధ్య మధ్యలో ఒకట్రెండు చోట్ల కొంచెం బోరు కొట్టించినా, మొత్తంగా నవల ఆసక్తికరంగా సాగి, చివరి దాకా చదివించింది. ప్రధాన పాత్రలు నవల సాగే కొద్దీ మారాయి కానీ, ఎలాగైనా, ఆ నన్ను ఆ ఫ్లో లో ఉంచగలిగింది కనుక నవల నాకు నచ్చింది. ఇంతకంటే ప్రత్యేకంగా ఈ నవల గురించి చెప్పేందుకు నా దగ్గర విషయాలేవీ లేవు.

చివరి సన్నివేశంలో – “వాడి అసలు కథ అప్పుడే మొదలైంది. అప్పుడు మొదలైన ఆ అసలు కథకి వ్యాఖ్యానం సంఘమూ, వాడి చుట్టూ వున్న మనుష్యులే చెబుతారు కనుక ఆ ప్రయత్నం నేను విరమించుకుంటున్నాను” అని రాశారు. కొంచెం వెరైటీగా అనిపించింది ఈ ముగింపు నాకు. అదే సమయంలో ఎందుకోగానీ సొదుం జయరాం “క్లైమాక్సు లేని కథ” గుర్తువచ్చింది. (ఈయన కథల గురించి ఇదివరలో పుస్తకం.నెట్లో క్లుప్తంగా ఒక్కసారి ప్రస్తావించాను)

సత్యవతి గారి కథల్లో (నేను చదివినంతలో) బలమైన స్త్రీ పాత్రలు ఉంటాయి. బలమైన స్త్రీ పాత్రల్లేని చోట కూడా స్త్రీ సమస్యల చుట్టే నడుస్తుంది కథ. విషయం ఎంత సీరియస్ అయినప్పటికీ, ఎక్కడా నిప్పులు చెరిగిపోయే ఆవేశం కనబడదు సరికదా, అంత సీరియస్ విషయమూ బుర్ర హీటెక్కించకుండా ఎక్కిస్తారు – ఇదీ నేను ఇదివరలో ఆవిడ రచనలు చదివినప్పుడు ఏర్పరుచుకున్న అభిప్రాయం. ఇప్పుడు కూడా అదే అంటాను.

ఇంతకీ, చివర్లో చెబుతున్నా, ఈ పుస్తకంలో నాకు నచ్చిన మరో అంశం – అట్టపై ఉన్న బొమ్మ.
***
పుస్తకం వివరాలు:
మర్రినీడ
సమర్పణ: నవభారత్ బుక్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ-2
ముద్రణ: సుబ్రమణ్యేశ్వర, విజయవాడ-2
వెల – ఐదురూపాయలు
ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతుందో లేదో నాకు తెలియదు. నేను లైబ్రరీ నుండి అరువు తెచ్చుకున్నాను.

You Might Also Like

4 Comments

  1. Vamshi

    Sudigali katha link panicheyatledu. Dayachesi link saricheyandi.

    1. సౌమ్య

      Corrected the link. It works now. Thanks for informing us.

  2. Asooryampasya

    Radhika garu: :)). కరెక్టే. థాంక్స్ ఎత్తిచూపినందుకు. నేనన్నది ఆవిడ భర్త యొక్క చెల్లెలు అనే 🙂

  3. Radhika

    నేను పుస్తకం చదవలేదు కానీ సమీక్ష బాగుంది.
    అయితే .. “భార్యకి, మరదలికి మధ్య చర్చ జరుగుతోంది.” … అని రాస్తే భర్తకి మరదలు (భార్యకి చెల్లెలు) అన్న అర్ధం వస్తుంది కానీ ఆమె భర్తకి చెల్లెలు కదా! 🙂

Leave a Reply