పౌరహక్కుల ఉద్యమ ధృవతార ప్రొ. శేషయ్య జ్ఞాపకాలు

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

*********

 హక్కు! ఈ మాట అందరికీ ప్రియమైనది. బడిలో సామాజిక శాస్త్రాన్ని చదివే కంటే ముందే పిల్లలకి కూడా హక్కు గురించి తెలిసి పోతుందేమో! కోరుకున్నదేదైనా వాళ్లు హక్కుగా సాధించేసుకుంటారు.  

ఒక దేశ పౌరులుగా ఎలాటి హక్కుల్ని, ఎలాటి బాధ్యతల్ని కలిగి ఉంటామో ఆ దేశపు రాజ్యాంగం చెపుతుంది. పౌరహక్కుల ఉద్యమాన్ని బలంగా నడిపించిన ఒక నాయకుడిని పోగొట్టుకున్న సందర్భంలో ఆయన స్నేహితులు, ఆత్మీయులు, సహచరులు చెప్పిన సంగతుల సమాహారం ఈ పుస్తకం.  వీరంతా శేషయ్యగారితో తమకున్న స్నేహాన్ని, సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని వ్యాసాల రూపంలో చెప్పారు. ఆయా వ్యాసాల్లోని ఆర్తి, ఆర్ద్రత, ప్రేమ గొప్పగా ఉంది! 

ఎవరి హక్కుల కోసం మరెవ్వరో గొంతెత్తరో, అలాంటివారి హక్కుల కోసం గళమెత్తడమే పౌరహక్కుల సంఘం కర్తవ్యం” అని పౌరహక్కుల సంఘానికి ఒక కార్యాచరణను అందించిన మార్గదర్శకుడు ప్రొ. శేషయ్యగారు. ఆయన జీవితమంతా పోరాటాలే. అణగారిన వర్గాలకోసం, అభాగ్యుల కోసం తపన పడి, వారి హక్కుల్ని వారికి తెలియజెప్తూ, వాటికోసం నిత్యం రాజ్యాధికారంతో, చట్టంతో, న్యాయస్థానాలతో పోరాడిన వ్యక్తి శేషయ్యగారు. ఎలాటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజల మధ్య, ప్రజల కోసం అనుక్షణం బతికిన ఆయన 2020లో కరోనా కి బలి అయిపోవటం పౌరహక్కుల ఉద్యమానికీ, పీడిత ప్రజల భవిష్యత్తుకీ పెద్ద లోటు. ఆయన మరణవార్త ని జీర్ణించుకోలేని ఆత్మీయులంతా ఆయన ఆశయాలను ఆచరణలోకి తీసుకువస్తామనీ, అదే ఆయనకిచ్చే బహుమతీ అని అంటారు. 

దినపత్రికల్లో చదివే పౌరహక్కుల సంఘం వార్తలు మినహా ఇంకేమీ తెలియని వారికి ఈ పుస్తకం కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. సమాజంలో పీడితుల వ్యధను, దానినెదుర్కుందుకు గొంతెత్తి ఉద్యమాలు చేస్తున్నవారి  నిస్వార్థ జీవితాలను గురించిన అవగాహననిస్తుంది.

అన్నపూర్ణ విలువల కోసం బతుకుతూ, తోటివారి బాధలకు తమ గొంతులనిచ్చి జీవితాంతం పోరాడిన అరుదైన మేధావులలో ఒకరు శేషయ్యగారు. రాజ్యం పౌరుల మీద చేస్తున్న హింసను ఖండించడానికి మాత్రమే పౌరహక్కుల సంఘం ఉండాలని సంఘంలో ఏకాభిప్రాయం సాధించారు. ప్రజా ఉద్యమాలలోని వారంతా అధ్యయనాన్ని ఒక ఆయుధంగా ఎంచుకోవాలంటారు.

అనంతపురం విద్యుత్ నగర్లో ఇంటి నెంబరు 49 ప్రజాసంఘాల మిత్రులందరికీ “మన ఇల్లు” అంటారు పి. వరలక్ష్మి. న్యాయశాస్త్రంలో శేషయ్య గారి సిద్ధాంత పత్రం ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ లా ఇన్ డెవలప్ మెంట్’ నిపుణుడు క్లారెన్స్ డయాస్ ప్రశంసలు అందుకుంది. సామాజిక పరిణామంలో నిన్న గుర్తించని హక్కులను ఇవాళ రాజ్యం గుర్తించడానికి దోహదం చేసే ప్రజాపోరాటాలే మౌలికమైనవని, ‘పౌరహక్కుల ఉద్యమం’ అందులో అంతర్భాగమంటారాయన.

శేషయ్య గారి జీవన సహచరి శశికళ వ్యాసం చదవనీయకుండా కన్నీళ్లడ్దుపడతాయి. మరణానికి ముందు వైద్యం కోస ప్రయాణమవుతూ సహచర ఉద్యమనేత పురుషోత్తం జ్ఞాపకాలతో తయారవుతున్న పుస్తకానికి మెటీరియల్ ను జ్యోతి, స్వేచ్ఛలకి అందజేయమంటూ భార్యను హెచ్చరించిన ఆయన నిబద్ధత, సహచరుని పట్ల నిస్వార్థమైన ప్రేమ నిర్వచించలేనిది. ఏ రాజకీయ, ఆర్థిక, సామాజిక సంఘటనలోనైనా పౌరహక్కుల ఉల్లంఘన జరిగితే దానిని న్యాయశాస్త్ర దృష్టితో విశ్లేషించి వ్యాసాన్ని రాసేవరకూ ఆయన పడే వేదన, నిజనిర్ధారణకు వెళ్లిన ప్రతిసారి ఆయన రాకకోసం ఎదురుచూసే ఆమె పడే క్షోభ మరెవరు చెప్పగలరు? ఆఖరి క్షణాల్లో ఆయన మనసు ఏ బాధితుడి కోసం తపన పడిందో అంటారామె. 

బి. జ్యోతి పౌరహక్కుల సంఘం ఆంధ్ర, తెలంగాణాగా విడిపోయినపుడు రెండు రాష్ట్రాలకు కన్వీనర్ గా శేషయ్య సార్ ని ఎంచుకోవటం ఆయన అనుభవం, అవగాహనల పట్ల ఉన్న గౌరవం అంటారు. 

బి. అనూరాధ ఆత్మీయులైన వారి గురించి రాయవలసి వచ్చినప్పుడు వారు భౌతికంగా లేరన్న వాస్తవాన్ని ఒప్పుకోవటం అత్యంత నొప్పి కలిగిస్తుందంటారు.

కాత్యాయని విద్మహే శేషయ్యగారు వృత్తిపరంగా న్యాయవిభాగం అధ్యాపకత్వం చేస్తూ, ఆ జ్ఞానాన్ని బాధితుల కోసం నిబద్ధతతో ఆచరణలో పెట్టిన నాయకుడు. కుటుంబ హింసను రాజ్యహింసలో భాగంగా చూడాలని, మానవహక్కులన్నీ స్త్రీల హక్కులే అని సంఘం 1990లో తీర్మానించింది. 2016లో గ్రేహౌండ్స్ మావోయిస్టులపై జరిపిన కాల్పుల ఘటనలో నిజనిర్ధారణకు వెళ్తున్న బృందంలో తానూ వెళ్లటాన్ని, శేషయ్యగారు చాకచక్యంగా ఆ కార్యక్రమాన్ని నడిపించటాన్ని ఆమె తలుచుకున్నారు.  

పద్మకుమారి అమరుల స్థూప నిర్మాణాలు, సంస్మరణ సభలు ఏర్పాటు పని మీద వెళ్లి శేషయ్య సార్ ఇంట్లో గడిపిన రోజుల్ని చెపుతూ, ఆ ఇల్లు అక్కడ అందరికీ అన్ని పనులకూ కేంద్రమంటారు. సార్ ప్రజా పోరాటాలకు పెద్దదిక్కంటూ, రాజ్యహింసను ఆయన అర్థం చేసుకునే పద్ధతి అద్భుతమంటారు.

రమాదేవి చేలూరి శేషు, శశీ ధర్మరథానికి దృఢమైన చక్రాలుగా మానవత్వంతో ఎందరికో చేయూతనిచ్చారంటారు. కుటుంబాన్ని, సమాజాన్ని, విశ్వాన్ని ప్రేమించే ప్రేమైకజీవి సార్! ‘మనకోసం మనం బతికే బతుకు బతుకు కాదం’టారంటారు.

టి. లక్ష్మి సభల్లో నెమ్మదిగా ప్రసంగం మొదలుపెట్టి క్రమంగా కంఠస్వరాన్ని పెంచి, స్థిరంగా మాట్లాడుతుంటే ఇంట్లో చిన్నపిల్లాడిలా ఉండే శేషు అన్నయ్యేనా అని అబ్బురంగా వినేదాన్నని అంటారు.

డా. లక్ష్మణ్ గడ్డం మనిషికి ఒక్కటే గుండె ఉంటుందని సైన్స్ చెపుతుంది కానీ శేషయ్యకు వేయి గుండెలున్నాయని సామాజిక శాస్త్రం చెపుతుందంటారు. మేధావులను కోల్పోవటం ఆయా సంస్థలకే కాక మొత్తం సమాజం గుండెలు దిగజారే సందర్భమంటూ, మరో శేషయ్యలాటి బహుముఖ ప్రతిభావంతుడిని పొందటం సాధ్యం కాదంటారు.

వేడంగి చిట్టిబాబు సంస్థలో భిన్నాభిప్రాయాలను విశ్లేషించి ఏకాభిప్రాయంతో కలుపుకుపోయే సమర్ధుడైన ఆచార్య శేషయ్య న్యాయవ్యవస్థకున్న అప్రజాస్వామిక వైఖరిని గుర్తించి, న్యాయస్థానాల ద్వారానే హక్కుల్ని కాపాడాలంటారు.

చిలుకా చంద్రశేఖర్ నేడు పౌరహక్కుల సంఘం వివిధ రాష్ట్రాల హక్కుల ఉల్లంఘనలపై గొంతెత్తి మాట్లాడుతుందంటే దానికి కారణం శేషయ్య! మీడియాకు, ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉన్న అసామాన్యుడాయన.

ఎన్. నారాయణరావు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తే ప్రజలను అనివార్యంగా పోరాటం వైపు ప్రభుత్వమే నెడుతుందని విశ్లేషించిన మేధావి శేషయ్య అంటారు.

క్రాంతి చైతన్య గత రెండు దశాబ్దాలుగా సైద్ధాంతికపరమైనదైనా, ఆచరణకు సంబంధించినదైనా సమస్య పరిష్కారం కోసం శేషయ్యగారి వైపే సంస్థ చూసేది. సమస్యల్ని విశ్లేషించి పరిష్కరించటంలో ఆయనకాయనే సాటి. న్యాయస్థానాల ప్రజాస్వామీకరణకు పోరాడాల్సిన కర్తవ్యం సంఘానిదంటారు.

వరవరరావు శేషయ్యను వినటం నాకు ఒక జ్ఞానం అంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచీకరణ, ఉదారీకరణ, ప్రైవేటీకరణలను ఆర్థిక రంగంలోనే కాదు, హింసను కూడా ప్రైవేటీకరించారని చెప్పారంటారు. మూడో ప్రపంచంలో పౌరహక్కులంటే ప్రజాస్వామిక హక్కులేనని సెబాస్టియన్ వలె నిర్వచించిన న్యాయకోవిదుడు శేషయ్య.

పాణి శేషయ్య భిన్నమైన మేధావి! రాయలసీమ పలుకుబడి, విరుపుతో పాటు మధ్యలో ఆంగ్లభాష కలగలిసిన ఆయన ఉపన్యాసాల్లో ఆకర్షణ, కనెక్టివిటీతో పాటు సిద్ధాంత స్పర్శ గాఢంగా ఉంటుందంటూ, ఏ సామాజిక రాజకీయార్థిక సాంస్కృతిక సమస్యనైనా ముందుగానే గుర్తించి, దాన్ని మన స్థలకాలాల లోంచి, అంతర్జాతీయ నేపథ్యంలోంచి ఏకకాలంలో చూసేవారంటారు.

వి. చెంచయ్య సామాజిక శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కోల్పోయే సమగ్రతను కల్పించటానికి సాహిత్య అధ్యయనం అవసరం అనే శేషయ్యగారు నిరంతర అధ్యయనశీలి. మానవహక్కుల్ని పరిశీలించేటప్పుడు మనిషిని సామాజిక సంబంధాల్లోనే చూడాలంటారు. హక్కుల ఉద్యమానికి ఒక శాస్త్రీయమైన దృక్పథాన్ని, గతితార్కికమైన తాత్వికతనూ సమకూర్చారు.

అరసవిల్లి కృష్ణ హక్కులను సామూహికంగా చూడాలనేది శేషయ్య అవగాహన. జీవించే హక్కు కోసం జీవితాంతం నినదించిన ఆయన అవగాహన వెలుగులో పనిచేయడమే ఆ హక్కుల తాత్వికునికిచ్చే నివాళి.

రివేరా ఏ విషయం చర్చిస్తున్నా తొందరపడక ఆ అంశం చుట్టూ కలుపుకు రావలసిన అన్ని అంశాల, భావాల పట్ల అప్రమత్తత శేషయ్య సార్ ఆలోచించే పద్ధతిలోన్ని విశిష్టలక్షణం. వర్గ సంఘర్షణ ప్రతిఫలన రూపమే సాహిత్యం అనే స్థూల అవగాహన ఆయనది. 

ప్రొ. జి. హరగోపాల్ ప్రొ. శేషయ్యది చాలా విలువైన మేధస్సు. రాజ్యాంగం మీద లోతైన పరిశోధన చేసి, రాజ్యాంగాన్ని, సామ్రాజ్యవాదాన్ని కార్యకర్తలకు, సాధారణ ప్రజలకు స్పష్టంగా వివరించేవాడు. బహుశా భారతదేశంలో రాజ్యాంగం మీద ప్రొ. శేషయ్య కున్నంత విమర్శనాత్మక సమగ్ర అవగాహన ఉన్న లా ప్రొఫెసర్స్ చాలా తక్కువ. శేషయ్య ప్రాపంచిక దృక్పథం మార్క్సిజం చారిత్రక, తాత్విక అవగాహన వలన మలచబడింది. హక్కులను ప్రజా ప్రయోజనలకు ఎలా ఉపయోగించాలో ఆలోచించేవాడు.

రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి విశ్వవిద్యాలయంలోనూ, బయట సమాజంలోనూ శేషయ్య ప్రసంగాలు ఒక వినూత్న విధానంలో సమస్యల్ని ఆవిష్కరిస్తున్నట్లుండేవి. సామాజిక సమస్యలను వర్గ దృక్పథంతో, పోరాట స్ఫూర్తితో ఆయన విశ్లేషించడం శ్రోతలకు నచ్చేది. పౌరహక్కుల ఉద్యమంలో పనిచేస్తూ శేషయ్య పడిన బాధలు లెక్కలేనివి. ఆయన ఒక అసాధారణ మేధావి. సహృదయుడు!

టి. ఆంజనేయులు పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవాలనేవారు శేషయ్య గారు. పోరాడే ప్రజలను అణచివేసేందుకు చేసిన ప్రజావ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా సంస్థాపరంగానూ, ఇతర ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలతో కలిసి వారు చేసిన కృషి సంస్థకు మంచి పేరు తెచ్చింది. 

షామీర్ బాషా ప్రొ. శేషయ్య గారు హక్కుల ఉద్యమ నాయకుడు, తాత్వికుడు, ఆత్మీయ అధ్యాపకుడు, సహచరులందరికీ ఆత్మీయ స్నేహితుడు, మార్గదర్శి. పౌర, రాజకీయ, ప్రజాస్వామిక హక్కులన్నీ జీవన పరిస్థితులను మెరుగుపరుచుకునే క్రమంలో ప్రజలు చేసిన ఉద్యమాల ఫలితాలంటూ, ఉద్యమించే హక్కు ప్రజల జీవించే హక్కులో భాగమంటారాయన.

అమన్ పౌర స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కుల కోసం బలీయమైన స్వరాన్ని వినిపించినవారు శేషయ్య. మానవ హక్కులు, హక్కుల ఉద్యమ సిద్ధాంతం, ఆచరణ, వాటిలోని సమస్యలపై లోతైన అవగాహన గల అసాధారణ వ్యక్తి! 

విజయకుమార్ ‘’గొంతు లేనివారికి గొంతు’’ గా ఉన్న శేషయ్య సార్ నిరుపేద కుటుంబంలో పుట్టారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా, జాతీయ స్థాయి హక్కుల ఉద్యమ రధసారధిగా ఎదగడం వెనుక ఎంతో ఆవేదన, తపన, అంకితభావం ఉన్నాయి. అత్యంత సున్నిత మనస్కుడాయన.

పి. రాజారావు రాజ్యాంగ నిపుణుడు, తత్వవేత్త, నిజాయితీపరుడూ, నిబద్ధుడు అయిన శేషయ్య పౌరహక్కుల సంఘం నిలదొక్కుకుందుకు దోహదం చేసారు. ‘ప్రాథమిక హక్కులు – సుప్రీంకోర్టు తీర్పుల’పై లోతైన విశ్లేషణాత్మక వివరణ ఇవ్వగలిగే దేశంలోని అరుదైన వ్యక్తుల్లో శేషయ్య ఒకరు.

జీవిత సహచరి అనే పదానికి ఆచరణాత్మక అర్థం చెప్పిన శేషయ సహచరి శశి మనవాడైన శేషయ్యను మనకు అందుబాటులో ఉంచింది! ఆమెకు కృతజ్ఞతలు.

నంబూరి శ్రీమన్నారాయణ రాజ్యం చర్యలతో ప్రజల హక్కులకి విఘాతం కలిగే అన్ని అంశాలపైన సంస్థ కార్యాచరణను శేషయ్యగారు విస్తృత పరిచారు. రాయలసీమ ప్రజల హక్కుల ఉద్యమాలలో ఆయన భాగస్వామ్యులు. తెలంగాణ ఉద్యమానికీ మద్దతిచ్చారు.

ఆచార్య డి. సూర్యప్రకాశరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై సంవత్సరాలకు పైగా ప్రగతిశీల రాజకీయాల పరిరక్షణలో ముఖ్యపాత్ర వహించిన గొప్ప సామాజికి కార్యకర్త ఆచార్య శేషయ్య. సిద్ధాంతమేదైనా ఆచరణాత్మక వాదంతో సాటి మనిషిని మనిషిగా చూడడం, ప్రజలకు హక్కులపై అవగాహన కల్పించి, చైతన్య పరచడం సామాజిక అభివృద్ధికి తోడ్పడతాయని నమ్మిన శేషయ్య మనకు ఆదర్శం.

దుడ్డు ప్రభాకర్ భద్రమైన జీవితం గడిపే అవకాశమున్న మధ్యతరగతి బుద్ధిజీవి ప్రొ. శేషయ్యగారు హక్కుల ఉద్యమానికి నాయకత్వం వహించి, బలిగంగ నెత్తికెత్తుకున్నారు. ఒక చారిత్రాత్మక కర్తవ్యాన్ని విజయవంతంగా కొనసాగించి రెండు తెలుగు రాష్ట్రాల పౌరహక్కుల సంఘాల సమన్వయ కర్తగా ఉద్యమ ప్రయాణాన్ని సాగించారు.

ఆర్ శ్రీధర్ శేషయ్య సార్ చర్చల్లో తన అభిప్రాయాన్ని సభ్యులపై రుద్దకుండా ఓపిగ్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పి ఆమోదం పొందేవారు. నిత్యశోధకుడు. హక్కుల కార్యకర్తలు ప్రజల్ని చైతన్యపరిచి సమస్యల పరిష్కారానికి దోహదం చెయ్యాలనేవారు.

నర్ల రవి పౌరహక్కుల ఉద్యమానికి తనదైన ఒక తాత్విక దృక్పథం ఉండాలని శేషయ్య సార్ బలంగా భావించేవారు. పౌరహక్కుల విషయంలో మార్క్సిస్టు దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి, అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేసారు. ఆయనకున్న జ్ఞానాన్ని కాగితం మీద పెట్టలేదన్న ఫిర్యాదు నాకుంది.

ఎం. శ్రీనివాస్ ఉద్యమంలో పనిచేస్తున్న వ్యక్తులంతా స్నేహితులుగా దృఢమైన వ్యక్తిగత సంబంధాలున్నప్పుడే సామూహికంగా ఉద్యమంలో పనిచేసి, ప్రజా ఉద్యమాలను బలోపేతం చెయ్యగలరని గాఢంగా నమ్మినవారు ప్రొ. శేషయ్య. అపార మేధోసంపత్తి ఉన్న అంతర్ముఖుడు.

గుంటి రవి ఇటీవల వస్తున్న హక్కుల దృక్పథంలోని ధోరణులను, రూల్ ఆఫ్ లా, ఐడియాలజీ, పౌరహక్కుల సంఘం చరిత్ర, ప్రపంచ వ్యాప్త్రంగా వస్తున్న ప్రజా ఉద్యమాలకు సంబంధించిన విషయాలను సమయం దొరికినప్పుడల్లా శేషయ్య సార్ బోధించేవారు. ఆయనొక సాహసిక ప్రజా మేధావి.

చీమలపెంట వెంకట్వేశ్వర్లు మీటింగుల్లో సభ్యులందరినీ పేరుపేరునా పలకరించే శేషయ్య సార్ ది సున్నితమైన మాటతీరు. సభ్యుల భిన్నాభిప్రాయాలను గౌరవించి, ఓపికగా సమాధాన మిచ్చేవారు. పీడిత ప్రజల కోసం చివరి వరకూ పోరాడిన మేధావి.

జి. గోపాల్ సమకాలీన రాజకీయార్థిక విషయాల పట్ల సునిశితమైన దృష్టి కలిగిన శేషయ్య మార్క్సిజం – లెనినిజం వెలుగులో విషయాల్ని విశ్లేషణ చేసేవారు. పౌరహక్కుల ఉద్యమం తన కార్యరంగంగా సవాళ్ల మధ్య నాయకత్వాన్ని అందించిన ఆయన స్ఫూర్తి ఎప్పటికీ ఉంటుంది.

బి. రామకృష్ణ దేశవ్యాప్త హక్కుల ఉద్యమాల సమన్వయం కోసం కృషి చేసి, సెంటర్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ (సిడిఆర్ఓ)ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర వహించినవాడు శేషయ్య. హక్కుల ఉద్యమ స్వభావాన్ని, దాని పరిధి, పరిమితులను కార్యకర్తలకి అవగాహన కలిగించేవాడు.

ఎన్. వేణుగోపాల్ హృదయం లోలోపలి అత్యంత సన్నిహితుడు శేషయ్య. ఏ అంశం మీదైనా సాధికారంగా మాట్లాడేవాడు. అందరికీ అలవాటైన సంవాదాన్ని ఒక కొత్త వెలుగు నుంచి ఒక మెట్టు పైకి ఎక్కించడానికి ప్రయత్నించేవాడు. శేషయ్య ఒక వజ్రం. ఒక పువ్వు. ఒక గతితార్కిక వ్యక్తిత్వం. ప్రణాళికాబద్ధ ఆర్థికాభివృద్ధి వ్యూహానికి రాజ్యాంగ ఆదర్శాలకూ ఉన్న సంబంధం గురించి పి. హెచ్. డి. చేసి, రాజ్యాంగ ఆదర్శాలలో అత్యంత ప్రధానమైనది సామాజిక న్యాయభావనే అని నమ్మాడు.

జి. బొమ్మయ్య బూటకపు ఎంకౌంటర్లపైనే కాక, దళితులు, మహిళలు, ఆదివాసీలు, రైతులు, చేనేత కార్మికులు అందరి హక్కుల కోసం పౌరహక్కుల సంఘం తన కార్యాచరణను విస్తృతం చేయటంతో శేషయ్యసార్ రేయింబవళ్లు ఆరాటపడ్డారు. ప్రతీ కార్యకర్తా అధ్యయనం, ఆచరణలో రాటు తేలాలనేవారు.

కె. నాగేశ్వరాచారి శేషయ్యసార్ తో దాదాపు ముఫ్ఫై ఏడేళ్ల స్నేహం. ఆ జ్ఞాపకాలు చెదిరిపోవు. హక్కుల ఉద్యమ కార్యకర్తే కాదు సాహిత్య విద్యార్థి కూడా. అనంతపురం నడిమధ్యలో ఉన్న పట్టాపొలంలో యాభై ఏళ్లుగా ఉంటూన్న కుటుంబాలకు అండగా నిలిచి అధికారుల్తో, రాజకీయ నాయకులతో పోరాడి, పట్టాలిప్పించారు. ఆ ప్రాంతాన్ని ‘సూర్యానగర్’ అంటారు. కానీ ‘శేషయ్య నగర్’ అని పిలిస్తే బావుంటుంది.

ఎస్. సుధాకర్ శెట్టి మా నాన్న శేషయ్య లాగే జీవితాంతం గుర్తుండిపోయే వ్యక్తిగా నా మదిలో శేషయ్యగారు నిలిచిపోయారు. యూనివర్సిటీ హాస్టల్స్ లో తాత్కాలిక ప్రాతిపదికన అతి తక్కువ వేతనాలకు పనిచేసే వందల మంది కార్మికుల వేతన పెంపుకోసం అందరినీ కూడగట్టుకుని పోరాడి సాధించారు. 

పి. రామకృష్ణ హక్కుల హద్దూ, అవసరమూ చెప్పిన శేషయ్య గొప్ప ఆలోచనలు, గొప్ప ఆశయాలు, గొప్ప లక్ష్యం ఉండటంతో పాటు దానికి ప్రాతినిధ్యం వహించేలా ఎన్నుకొన్న కార్యక్షేత్రంలో పనిచెయ్యాలంటారు. ప్రభుత్వాలు చట్టబద్ధ పాలనకూ, ప్రజాస్వామ్య విలువలకూ కట్టుబడి ఉండేలా చూడటమే హక్కుల సంఘాల కర్తవ్యం అంటారాయన.

సతీష్ బైరెడ్డి సుదీర్ఘ మానవజాతి పరిణామ క్రమంలో ఉన్నతమైన జీవితం కోసం ప్రజా సమూహాలు సాగించే పోరాటాలు, త్యాగాలు, రక్తతర్పణాల క్రమంలోనే హక్కులు మనుగడలోకి వచ్చాయంటారు శేషయ్య. ఏ రూపంలో హక్కుల ఉల్లంఘన జరిగినా పౌరహక్కుల సంఘాలు ఉద్యమించేలా వాటి కార్యరంగాన్ని విశాలం అయేందుకు శేషయ్య చేసిన కృషి విలువైనది.

అశోక్ కుంబము హక్కుల ఉద్యమానికి తానందించిన, ఆచరించిన ప్రాపంచిక దృక్పథం ద్వారా శేషయ్య ప్రత్యేకం. భారతదేశంలో అసంపూర్ణంగా జరిగిన ప్రజాస్వామిక విప్లవం వల్ల నేటికీ రాజ్యం, చట్టం, సమాజం ప్రజాస్వామిక స్వభావాన్ని సంతరించుకోలేదని, భూస్వామ్య విధానం వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉందనీ అంటారు శేషయ్య.

సుజాతో భద్రో (సిడిఆర్వో, ప. బెంగాల్) న్యాయవ్యవస్థ, వర్గపోరాటం గురించి శేషయ్య రాసిన ముఖ్యమైన వ్యాసాన్ని అనువదించి,” న్యాయ మీమాంసః మార్క్సిస్టు దృక్పథం – హక్కుల దృక్పథం – సవాళ్లు” పేరుతో మా సంస్థ సావనీర్ లో అచ్చువేసాం. ఉద్యమానికున్న సామాజిక పునాదిని గుర్తు చేసుకుని, సామాజిక దృక్పథం వైపు నుండి ఉద్యమాన్ని చూడాలని రాజ్యానికి మేము ఒకే గొంతుతో విజ్ఞప్తి చేసాం.

ఆర్. రాజానందం భయం గుప్పిట్లో బ్రతుకుతున్న రోజుల్లో పౌరహక్కుల కార్యకర్తలు పని చేయకపోయినా ఫర్వాలేదు, కానీ రాజీనామాలు, రద్ధులు చెయ్యవద్దని, అది సంస్థ మీద చాలా ప్రభావం చూపుతుందని శేషయ్య చెప్పేవారు. ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం. ఏ కార్యకర్త ఇంట్లో చిన్న పిల్లలుంటే ఆ ఇల్లు సార్ కి ఇష్టం. ఆయన ప్రసంగాలు అత్యంత ఆసక్తికరం.

జె.జె.సి.పి. బాబూరావు రచయితగా, వక్తగా, పరిశోధకుడిగా, న్యాయశాస్త్ర అధ్యాపకుడిగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన శేషయ్య హక్కుల ఉద్యమంలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించి, “చెరగని హక్కుల స్ఫూర్తి” గా ప్రజల హృదయాల్లో ఉండిపోయారు.

జిల్లెళ్ల మనోహర్ వయసులోనూ, జ్ఞానంలోనూ చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా ఎదుటి మనిషిని గౌరవించే నిజమైన హక్కుల ఉద్యమ కార్యకర్త ప్రొ. శేషయ్య. ప్రభుత్వం ప్రజలపై జరుపుతున్న హింసపై, చట్టాల ఉల్లంఘనపై అవగాహన కలిగించి సభ్యులకు పోరాటపటిమను అందించేవారు.

ఎస్. ఎం. బాషా చట్టాలను, రాజ్యాంగాన్ని చదువుకుని, వాటి డొల్ల స్వభావాన్నర్థం చేసుకుని, ప్రజలకోసం గళం విప్పాల్సిన అవసరాన్ని గుర్తించినవారు శేషయ్య. మానవీయ స్పర్శను నరనరానా జీర్ణించుకున్న ఉత్తమ మానవుడాయన. ఆయన సహచరి శశికళగారిదీ అదే సంప్రదాయం. ఒక మానవీయ వాతావరణం వారి ఇంటి గడపనుంచే మొదలవుతుంది.

ఎస్. అల్లాబక్ష్ సంఘం కార్యకర్తలతో ఉద్యమ సంబంధాలతో పాటు ఆత్మీయ సంబంధాలను నిరంతరం కొనసాగించిన వ్యక్తి శేషయ్యగారు. హక్కుల ఉద్యమాలు ఉన్నంత కాలం శేషయ్య సజీవుడే. ఏ అంశాన్నైనా అధికారపూర్వకంగా చెప్పేందుకు నిజనిర్ధారణలు, క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం మాత్రమే సంఘం ప్రతినిధిగా తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పేవారు.

నందిగం కృష్ణారావు వెనుకబడ్డ కులాల్లో దగా పడుతున్న వాళ్లల్లో సమాజం ఉందని, వారికి గౌరవంగా జీవించే హక్కు అవసరమని గ్రహించి పౌరహక్కుల సంఘం బాధ్యతలు చేపట్టిన శేషయ్యగారు హక్కులను భూమార్గం పట్టించారు.

పి. బాలయ్య భూస్వామ్య, పురుషాధిపత్యాలను ఎదిరించేవారు ప్రజాస్వామిక వాతావరణం వైపు ఆలోచన చేసి, దోపిడీ, పీడన లేని సమాజం కోసం కలలు కనేలా చేసినవాడు శేషయ్యసార్. అవి నిజమయేందుకు ఉద్యమాలలో తమ అడుగులు, గొంతుకలు కలిపేందుకు ప్రేరణ ఇచ్చినదీ ఆయనే.

పి. ఎం. రాజు దళిత, మైనారిటీ, ఆదివాసీ, కార్మిక, మహిళ, విద్యార్థుల, పీడిత ప్రజల హక్కుల గొంతుక శేషయ్య. తన రచనల ద్వారా ప్రజలను చైతన్య పరిచి, రాజ్యాన్ని ప్రశ్నించి, జవాబుదారిగా నిలబెట్టే కృషి చేస్తూ, సమాజంలోని సంక్లిష్టతలను, సమస్యలను హక్కుల కోణంతో విశ్లేషించారు.

ఎల్లంకి వెంకటేశ్వర్లు “ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కు” గా గుర్తించాలని శేషయ్యగారు లక్ష సంతకాలను సేకరించి ప్రభుత్వాలకు పంపటంతో సంస్థ మరింతగా ప్రజలకు చేరువైంది. వివిధ స్థాయులలో గుర్తింపుగల నాయకత్వం తయారవాలని తపన పడేవారు. 

జి. రఘురాం మైనారిటీల జీవితాలలో అనివార్యంగా ఉండే ఘర్షణ వాతావరణం, ఆయా నిరసనలు చట్టబద్ధంగా ఉండవు. వాటిలో రాజ్యం అణచివేతకు వ్యతిరేకంగా జరిగే అభివృద్ధికరమైన ఆకాంక్షల్ని విసృత సమాజానికి తెలిపి, సమర్ధించే వారికి అండగా ఉండటం సంస్థ కార్యాచరణగా చెప్పేవారు.

డా. సి. హెచ్. సుధాకరబాబు నన్ను అత్యంత ప్రేమగా చూసుకున్న, నాకు అత్యంత ఇష్టమైన మాస్టారు శేషయ్యగారు. రాజ్యాంగం గురించి, రాజ్యహింస గురించి, గొప్ప న్యాయశాస్త్ర కోవిదుల గురించి గంటలుగంటలు చెప్పేవారు. నా డాక్టరేట్ కు ఎంతో సాయం చేసారు. 

డి. సురేష్ కుమార్ హక్కుల ఉద్యమ పోరాటంలో ముందు తరాల ఘనమైన వారసత్వాన్ని అందుకుని, తనతోటి తరంతో విభేదాలున్నా కలుపుకుపోతూ, రానున్న తరానికి తగిన నాయకత్వాన్ని, సిద్దాంతాన్ని, ఆచరణనీ అందించిన అరుదైన నాయకుడు శేషయ్య. 

సి. హెచ్. ఎల్. ఎన్. మూర్తి స్పష్టమైన వర్గ దృక్పథంలో రాజ్యాంగాన్ని, న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేసినవాడు శేషయ్య సార్. సంక్షోభ సమయంలో సంస్థ బాధ్యతలను మోయడానికి ముందుకొచ్చిన సోషల్ ఇంటలెక్చువల్ ఆయన.

“నువ్వు ముందుండి వేసిన అడుగులూ, వెనుక ఉండి అందించిన చేయూతనూ ఎలా మరువగలం చెప్పు, నీ జ్ఞాపకం నవ్వుతున్న నెగడు కదూ” – మహమూద్ నివాళి!

“నలభై యేండ్లు నువు! అలుపెరుగకుండా నలుదిక్కుల హక్కుల దిక్కయినావు

ఆచరణ మాటకు అంకితమన్నావు, అమరుడయ్యి ప్రజల గుండెల్లో నిలిచావు” – కోటి

“కొలువు గొప్ప కాదనీ…హక్కుల గొడుగువైనవు… 

రణం జరిగినన్నాళ్లు జనం మదిలో ఉంటావు…” శ్రీమన్నారాయణ

Dr. Ramakrishna Prasad – Seshaiah sir is a person with a social consciousness! His way of looking at the law and its impact on the lives of oppressed masses is something everyone should appreciate!

Prof. I. Sharatha Babu – Seshaiah sir was known for his qualities of helping nature, non-conntroversial character and a concern for the cause of poor in the society.

Dr. M. Sivaji Rao – Professor S. Seshaiah’s name reminds the public as a champion of Civil Liberties who fought for the protection of civil liberties in the state.

Prof. S. V. Pulla Reddy – Prof. Seshaiah made his students understand how the constitution can be interpreted, used and explored the possibilities to help the social movements…

G. Pullaiah babu – Communication skills, listening skills, patience and work ethics are Seshaiah sir’s strengths!

ఇంతమంది అభిమానుల్ని సంపాదించిన నిస్వార్థ ప్రజాహక్కుల నాయకుడు ప్రొ. శేషయ్య గారు అమరుడు! 

ప్రచురణః పౌరహక్కుల సంఘం, అక్టోబర్ 2021, వెలః రూ. 120/-

You Might Also Like

Leave a Reply