అలనాటి జాతిరత్నం
“ఒక పండితోద్దండుఁ డుద్ధతుం డొక యోద్ధ
యొక మహాసమ్రాట్టు నొక మహర్షి”
అని లెనిన్‌గ్రాడ్ విశ్వవిద్యాలయం (రష్యా) తెలుగు ప్రొఫెసర్ ఎస్వీ జోగారావుగారి చేత కీర్తించబడిన హరికథా పితామహుడు కీ.శే. అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస మహాకవి గుఱించి ఈనాటి యువతరానికి ఏమీ తెలియకపోవడం మిక్కిలి శోచనీయం. నిజానికి నారాయణదాసుగారి విషయమే కాదు, కథానికలూ, నవలలూ, లేదా సినిమా స్క్రిప్టులు రాసేవారిని మినహాయిస్తే ఈ తరం ఎవఱినీ గంభీరంగా పట్టించుకోవడం లేదేమో ననిపిస్తుంది. మిహతా భాషా, సాహితీవిభాగాల్లో కృషి చేసినవారంతా నిర్లక్ష్యానికి గుఱవుతున్నట్లుగా కనిపిస్తున్నది. అందులోను ఒక రచయిత/ కవి తన వ్యక్తిగత ఇష్టానిష్టాల్ని బట్టి గ్రాంథిక శైలిని, సంప్రదాయ కవితారీతినీ అవలంబించినవాడయితే అటువంటివారి పట్ల ఉద్దేశపూర్వకంగా దుర్విచక్షణ (discrimination) ప్రదర్శించడం ఒక సామాజిక సమ్మతి (social acceptability) ని పడసిన సదాచారంగా రూపుదాల్చింది. అది ఇంకా బాధాకరం.
నారాయణదాసుగారి గుఱించి నాకు మొట్టమొదట పరిచయమైంది నా చిన్ననాటి పాఠ్యపుస్తకాల ద్వారా ! అంత పసివయసులోనే ఆయన గుఱించి మొదటగా విన్నప్పుడు ఎంతో భక్తిభావం కలిగింది. దరిమిలా, నా వయసుతో పాటు ఆయన పట్ల భక్తిభావం అలా అలా పెఱుగుతూ పోయిందే తప్ప ఇసుమంతైనా తగ్గలేదు. అంతటి మహానుభావుడితో మనల్ని పోల్చుకుంటే “నక్క ఎక్కడ ? నాకలోకం ఎక్కడ ?” అనే సామెత గుర్తుకొస్తుంది. కానీ శ్రీ దాసుగారికీ, నాకూ కొన్ని పోలికలుండడమే బహుశా ఆయన పట్ల నా భక్తిభావానికి కారణమై ఉండొచ్చు. ప్రస్తుతం సమీక్షితమవుతున్న “మహాకవి ఆదిభట్ల నారాయణదాస చరిత్రము” సార్థక నామధేయం. ఈ కృతిని ఆనాటి రవికళాశాల (గుంటూరు) లో తెలుగు అధ్యాపకుడుగా పనిచేసిన శ్రీ.ఎమ్.వి.ఆర్. కృష్ణశర్మగారు రచించగా దీన్ని అంకితం తీసుకొన్న శ్రీ కఱ్ఱా ఈశ్వరరావుగారు 1975 లో వెల్‌కమ్ ప్రెస్ (గుంటూరు) వారి ద్వారా ముద్రింపించారు. ఎమ్.వి.ఆర్. కృష్ణశర్మగారు దీన్ని వ్రాసిన ప్రయోజనం వారి మాటల్లోనే-
“భావిభారత పౌరులకుఁ గూడ తెలియఁదగిన విశేషాంశములు దాసకవీంద్రుల చరిత్రలో ఆణిముత్యములై యున్నవి…. శ్రీ దాసకవీంద్రుల సాహిత్యసేవను ప్రధానక్షేత్రముగా గైకొని, నేటి విద్యార్థులకు అర్థమవునట్లుగా సరళగ్రాంథికభాషలో రెండువందల పేజీలకు మించకుండా S.S.L.C., Matriculation, Inter విద్యార్థులకు ఉపవాచకముగా ఉపయోగపడు చిన్నరచన చేయవలెనని ఆశ పొడమినది… ఢిల్లీలో ఇట్టి మహాకవిచరిత్రల Competition జరుపుచున్న కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖకు పంపిన నాకు గూడ శ్రేయోదాయకమవును…”
ఈ పుస్తకాన్ని అంకితం తీసుకొన్న కృతిభర్త శ్రీ కఱ్ఱా ఈశ్వరరావుగారు కేవలం ఒక ధనికుడు కారు. ఆయన కూడా యథార్థమైన సాహితీపిపాసువే. అదే సమయంలో తానూ నారాయణదాసుగారికి కృష్ణశర్మగారంత వీరాభిమానే. ఈ పుస్తకానికి ఈశ్వరరావుగారే స్వయంగా వ్రాసిన “భూమిక”లో ఈ విషయం వెల్లడవుతున్నది : “దాస కవీంద్రుల ఆదర్శములు, భక్తిభావములు – ముఖ్యముగా నేటి సందిగ్ధ పరిస్థితులకు ఉపయోగపడుటకు, వెల్లడించుటకు నెంతైన అవసరమున్నది. ఆ నిమిత్తమై ప్రకాశకునిగా నేను వెలయించిన దాసభారతీ ప్రచురణములు నిర్విఘ్నముగా సాగుచుండుటకు శ్రీ దాసకవీంద్రుల ఆధ్యాత్మికశక్తి, ఆశీర్వచన బలమే కారణము… నాకు శ్రీ నారాయణదాస సారస్వతాభిరుచి దినదినము వృద్ధిపొందుచుండ, వారి అనేక గ్రంథములను చదువు భాగ్యము కలిగినందున శ్రీ దాసవర్యులు ఎంత మహోన్నత వ్యక్తియో గ్రహించి శ్రీ నారాయణదాస కార్యము ఏదయినా చేపట్టి దానికి తగిన ఆర్థిక సహాయము కూడ చేయ నుద్యుక్తుఁడనై యున్నందున… వారి కోరికకు అడ్డురాక కృతిపతిగా గూడ అంగీకరించితిని…”
నారాయణదాసుగారి గొప్పతనాన్ని ఒక్క వాక్యంలోనో, వ్యాసంలోనో చెప్పేయడం సాధ్యం కాదు. హరికథల్ని మొదట ప్రారంభించినది నారదమహర్షి అని చెబుతారు. అయితే నారాయణదాసుగారు పుట్టకముందు హరికథలనేవి ఎలా ఉండేవో మనకు తెలియదు. కానీ మనం ఈనాడు చూస్తున్న, వింటున్న హరికథలన్నీ నారాయణదాసుగారి సృష్టే. ఆయన ముద్రే. అలాగని హరికథలు చెప్పడం ఆయన ప్రవృత్తే తప్ప వృత్తి కాదు. ఆయన హరికథలకు సంగీతాన్ని, నాట్యాన్ని, పిట్టకథల్నీ, సామెతల్నీ, నవరసాల్నీ జతచేర్చి దాన్ని ఒక సకలకళాప్రయాగగా రూపుదిద్దారు. ఆయన అనంతరం హరికథల్ని చేపట్టినవారంతా అయననే ముమ్మూర్తులా అనుకరించారు. అనుసరించారు. ఇప్పటికీ అనుసరిస్తున్నారు. పిఠాపురం రాజావారు (తూ.గో.జిల్లా) హరికథా కళాశాలను స్థాపించడానికి నారాయణదాసుగారే ప్రేరణ.
ఈ పుస్తకం ద్వారా నారాయణదాసుగారి జీవితవిశేషాలు చాలా తెలియవస్తున్నాయి. ఆయన 1864 వ సంవత్సరం ఆగస్టు నెల 31 వ తేదీన శ్రీకాకుళం జిల్లా అజ్జాడ గ్రామంలో జన్మించారు. తండ్రి ఆదిభట్ల వెంకటచయనశాస్త్రి. తల్లి నరసమాంబ. నారాయణదాసుగారీ దంపతులకు కడగొట్టు సంతానం. ఆయనకు భాషాపరిజ్ఞానం బాల్యంలో ఎవఱూ నేర్పకుండానే సహజపాండిత్యంగా అబ్బిందని తెలుస్తోంది. చాలా చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే పోతనగారి ఆంధ్రమహాభాగవతానికి అర్థం చెప్పేవారట. పెఱిగి పెద్దవారయ్యాక సంస్కృతం, ఇంగ్లీషు, ఫార్సీ, హిందూస్తానీ భాషల్లో సైతం స్వయంకృషితో పాండిత్యాన్ని ఆర్జించారు. తనకు గురువెవఱూ లేరని ఆయన ఒకచోట పేర్కొన్నారు.
నారాయణదాసుగారు రచించిన గ్రంథాలలో సుమారు 50 టిని గుఱించి మనమీనాడు తెలుసుకోగలుగుతున్నాం. అవి ౧. అంబరీష చరిత్రము ౨. అచ్చతెలుఁగు పలుకుబడి ౩. ఉమర్ ఖయ్యామ్ రుబాయతులు ౪. కచ్ఛపీ శ్రుతులు ౫.కాశీశతకము ౬. గజేంద్రమోక్షము ౭. గోవర్ధనోద్ధారణము ౮.గౌరప్ప పెండ్లి ౯.చాతుర్వర్గ్య సాధనము ౧౦. జగజ్జ్యోతి ౧౧. జానకీశపథము ౧౨. తర్కసంగ్రహము ౧౩. తల్లివిన్కి ౧౪. తారకము ౧౫. దశవిధరాగనవతి ౧౬. దంభపురప్రహసనము ౧౭. ధ్రువచరిత్రము ౧౮. నవరసతరంగిణి ౧౯. నా యెఱుక ౨౦. నూఱుగంటి ౨౧. పురుషార్థసాధనము ౨౨. ప్రహ్లాదచరిత్రము ౨౩. బాటసారి ౨౪. బాలరామాయణకీర్తన ౨౫. భీష్మచరిత్ర ౨౬. మన్కిమిన్కు ౨౭. మార్కండేయచరిత్ర ౨౮. ముకుందశతకము ౨౯. మృత్యుంజయ శివశతకము ౩౦. మృత్యుంజయస్తోత్రము ౩౧. మృత్యుంజయాష్టకము ౩౨. మేలుబంతి ౩౩. మ్రొక్కుబడి ౩౪. యథార్థరామాయణము ౩౫. రామచంద్రశతకము ౩౬. రుక్మిణీకల్యాణము ౩౭. వెన్నుని వేయిపేర్ల వినకరి ౩౮. వేల్పుమాట ౩౯. వేల్పువంద ౪౦. వ్యాకరణసంగ్రహము ౪౧. వ్యాసపీఠము ౪౨. సంగీతతరంగిణి ౪౩. సత్యవ్రతిశతకము ౪౪. సారంగధర నాటకము ౪౫. సావిత్రీచరిత్రము ౪౬. సీమపల్కువహి ౪౭. సూర్యనారాయణశతకము ౪౮. హరికథామృతము ౪౯. హరిశ్చంద్రోపాఖ్యానము ౫౦. ??????
పైన పేర్కొన్నవాటిల్లో రాజవాటా హరికథలది. వీటిల్లో కొన్నింటిని నేను స్వయంగా చదవగలగడం నా అదృష్టం. వీటిల్లో సంస్కృత నామధేయాలున్నవి శ్రీ దాసుగారు జీవిత పూర్వార్థంలో వ్రాసినవి కాగా, అచ్చతెలుఁగుపేర్లు గల పుస్తకాలు ఉత్తరార్థంలో వ్రాసినవి. కారణం – ఆయన మొదట్లో స్వయంగా కాకలు దీఱిన సంస్కృత పండితుడూ, భారత దేశభక్తుడూ అయ్యుండీ, ఏ కారణం చేతనో తరువాతి కాలంలో పూర్తి అచ్చతెలుఁగువాదిగా, తెలుగు జాతీయతావాదిగా మారిపోయారు. అప్పట్నుంచి తన రచనల్లో సంస్కృతపదాల వాడకం బాగా తగ్గించేశారు. అనంతరం అసలు సంస్కృతస్పర్శే పరిహరించి అచ్చతెలుఁగు పుస్తకాలు మాత్రమే వ్రాయడం మొదలుపెట్టారు. ఆయనలో ఈ భావవిప్లవానికి, మానసిక పరిణామానికి దారితీసిన కీలకమైన మలుపు ఏంటో తెలియరాకుండా ఉన్నది. అచ్చతెలుఁగు వాడుకలయందు తనకున్న పక్షపాతాన్ని వెల్లడిస్తూ ఒక సందర్భంలో ఆయన చెప్పిన పద్యం :
ఆ||వె|| మొలక లేఁతదనము తలిరుల నవకంబు
మొగ్గసోయగమును బూవుతావి
తేనె తీయఁదనము తెన్గునకే గాని
పరుషసంస్కృతాఖ్యభాషకేది ?
శ్రీ దాసుగారు హిందూధర్మంలో మౌలికంగా మార్పు రావాల్సి ఉందని పేర్కొంటూ ’జగజ్జ్యోతి’ అనే గ్రంథాన్ని వ్రాశారు. అందులో ఆయన వేదప్రోక్తమైన యజ్ఞయాగాదులు ఈ కాలానికి ఉపయుక్తం కాదన్నారు. అదే విధంగా స్త్రీశూద్ర విచక్షణ లేకుండా అందఱికీ వేదశాస్త్రాదుల అధ్యయనాధికారాన్ని కలిగించవలసి ఉందని, కులతత్త్వం పోవాలని అభిప్రాయపడ్డారు. ఆ కాలపు సమాజంలో ఇటువంటి అభిప్రాయాలకు ఆదరణ లేకపోవడంతో ఆయన ఆ విషయమై మళ్ళీ ఏమీ వ్రాయలేదని తోస్తోంది.
శ్రీ దాసుగారు అమ్మవారి ఉపాసకులు. కఱుడుగట్టిన స్త్రీజాత్యభిమాని కూడా. అయితే రెంటికీ ఎల్లవేళలా సంబంధం ఉండకపోవచ్చు. ఎందుకంటే దేవీ ఉపాసకులైనా కాకపోయినా, సాధారణంగా కవులంతా అంతర్గతంగా స్త్రీజాత్యభిమానులే అయ్యుంటారు. కవిత్వాన్ని, రచనాశక్తినీ ప్రసాదించే సరస్వతీదేవియే స్వయంగా స్త్రీమూర్తి అయి ఉండగా కవులు స్త్రీని అభిమానించడంలో ఆశ్చర్యం ఏముంటుంది ? “ఆడుది సత్తా, మగవాఁడు చెత్త” అని చమత్కరించేవారాయన. ఒకసారి నాయుడుగారనే ఆయన వచ్చి దాసుగారితో “మన తెలుగుపాటల్ని తమిళ సంగీతవిద్వాంసుల బాణీలలో పాడితే బావుంటుంది” అని సూచించగా దాసుగారు “తెలుగుపాటల్ని తెలుగు పాటల్లాగానే పాడాలి తప్ప తమిళపాటల్లా పాడితే ఏం బావుంటుంది ? ఎవఱైనా తన కొడుకు తనలాగా పుట్టాలని కోరుకుంటారు గానీ ఊళ్ళో బడేసాహెబు లాగా పుట్టాలని కోరుకుంటారా ?” అని ప్రశ్నించేసరికి నాయుడుగారు తన మాటల్లోని అనౌచిత్యానికి సిగ్గుపడ్డారట. దాసుగారి హరికథలు ప్రాచుర్యం పొందడానికి ఆయన అఖండ పాండిత్యమే కాక ఈ వ్యక్తిగత చమత్కారధోరణి కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు.
శ్రీదాసుగారి వృద్ధాప్యంలో ఆయన దౌహిత్రుడికి మశూచి సోకి ప్రాణాపాయస్థితిలో ఉన్నప్పుడు ఆయన దుఃఖించి “ఆ జబ్బుని వృద్ధుడయిన తనకు బదలాయించి బాలుడైన దౌహిత్రుణ్ణి కాపాడ”మని అమ్మవారిని వేడుకొన్నారు. చిత్రంగా అదే జఱిగింది. దాసుగారికి మశూచి సోకింది. వారి మనవడు బతికాడు, ఆయన చనిపోయారు.
ఈ గ్రంథం ఇప్పుడు అలభ్యం.
(కాని దీని ఎలక్ట్రానిక్ పాఠాంతరాన్ని ఈ క్రింది లంకెలో దించుకోవచ్చు.
http://www.scribd.com/doc/36292693
ఈ పి.డి.ఎఫ్. పత్రాన్ని తెఱవాలంటే Adobe Reader 9 లేదా అంతకు పై పాఠాంతరాలు కావాలి. దీన్ని తెఱిచినప్పుడు View–>Rotate View–>Counter clockwise అనే మెన్యూ కమాండ్లని ఎంచుకోవాలి. పుట పరిమాణాన్ని 100% కంటే తగ్గించుకొని చదివితే సౌలభ్యకరంగా ఉంటుంది)
తాడేపల్లి
మీ స్పందనకు నెనరులు. మీరన్నది నిజం. నారాయణదాసుగారి గుఱించి ఎంత చెప్పినా తక్కువే.
నేను శ్రీమతిని కాదు శ్రీమాన్ నే. నాకో శ్రీమతి ఉంది.
గంటి లక్ష్మీ నరసింహమూర్తి
లలిత గారూ(శ్రీమతి అనే అనుకొంటున్నాను)
మీరు వ్రాసిన సమీక్ష బాగుంది.ఈ పుస్తకం 1975 లొ ముద్రించేరు.కీ.శే.కర్రా ఈశ్వర రావుగారు దాస సాహిత్యాన్ని వెలుగులోనికి తీసుకొని రావడానికి చేసిన కృషి అమోఘం.ఆయన నా సోదరుడుకీ.శే.గంటి శ్రీరామమూర్తిచే దాసుగారి జీవిత చరిత్రను ఆంగ్ల భాషలో వ్రాయించేరు.దానిపేరు “Monarch of Rythm”.(లయబ్రహ్మ).దీనిని కూడా వారు గుంటూరులో వెల్కం ప్రెస్ లోనే 1980 ముద్రించేరు.దీనికి కాపీ రైటు హక్కులు గురించి తెలియక పునర్ముద్రించలేదు.1959లో శ్రీ మదజ్జాడాదిభట్ల నారాయణదాస జీవితచరిత్రము అనే గ్రంధాన్నిశ్రీ మరువాడ వేంకట చయనులు గారు వ్రాసేరు.దీనిని ఎలక్ట్రానిక్ మాద్యమములోనికి మార్చాలి.దీనికన్నాముందు ఆంగ్లభాష లో 1956లో Adibhatla Narayana Das అని కీ.శే.వసంతరావు బ్రహ్మాజీరావు గారు వ్రాసేరు.
ఈ పుస్తకాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుత సృష్టి.
నోబుల్ ప్రైజు నే నాకొద్దు అని తిరస్కరించిన మహామహుని గూర్చి ఎంత చెప్పినా తక్కువే-మూర్తి
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
అతిథి శీర్షికన పుస్తకమ్ డాట్ నెట్ లో అందఱూ తమ అభిమాన గ్రంథాల విశేషాల్ని నెటిజనులతో పంచుకునే అవకాశం ఉన్నది. కనుక దయచేసి ఆ దిశలో కూడా యోచించగలరు.
కొడవళ్ళ హనుమంతరావు
తాడేపల్లి గారికి,
మీకు నా వ్యాఖ్య నచ్చినందుకు సంతోషం. విద్వత్తు లాంటి విశేషణాలు నాకు కొంత ఇబ్బంది కలిగించాయి. కొటేషన్లతో కూడుకున్న ప్రమాదమే అది. అయినా వదులుకోలేని వ్యసనం. అపోహలు కలిగించనంత వరకూ హానికరం కాదనుకుంటాను. పుస్తకం.నెట్ ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు.
“And yet the books will be there on the shelves, separate beings,
That appeared once, still wet
As shining chestnuts under a tree in autumn,
And, touched, coddled, began to live
In spite of fires on the horizon, castles blown up,
Tribes on the march, planets in motion.
“We are, ” they said, even as their pages
Were being torn out, or a buzzing flame
Licked away their letters. So much more durable
Than we are, whose frail warmth
Cools down with memory, disperses, perishes.
I imagine the earth when I am no more:
Nothing happens, no loss, it’s still a strange pageant,
Women’s dresses, dewy lilacs, a song in the valley.
Yet the books will be there on the shelves, well born,
Derived from people, but also from radiance, heights.”
– “And Yet The Books,” by Czeslaw Milosz.
కొడవళ్ళ హనుమంతరావు
తాడేపల్లి
కొడవళ్ళ హనుమంతరావుగారూ ! నెనర్లు మీ వ్యాఖ్య ఒక స్వతంత్ర వ్యాసంలా అఱుదైన సమాచార విశేషాలతో కూడుకొని ఈ పుస్తకసమీక్షకి చాలా వన్నెతెచ్చింది. మీవంటి విద్వత్పాఠకులుండడం పుస్తకమ్ డాట్ నెట్ అదృష్టం. దయచేసి మా సైటుని తఱచుగా సందర్శిస్తూ మీ అమూల్యమైన అభిప్రాయాల్ని ఇలా మాతో పంచుకుంటూ మా కృషిని ఆశీర్వదింప ప్రార్థిస్తున్నాను.
కొడవళ్ళ హనుమంతరావు
నాలుగేళ్ళ క్రితం, అనువాద కవిత్వాన్ని విచారిస్తూ ఉమర్ ఖయ్యాం కవిత్వాన్ని ఉదాహరణలగా తీసుకొని తమ్మినేని విమర్శనాస్త్రాలని [1] వేస్తే చూశాను. ఆ ధాటికి తట్టుకున్న వారిద్దరే – తెలుగులో చలం, సంస్కృతం లో ఆదిభట్ల. ఆయన హరిదాసు మాత్రమే ననుకున్న నేను ఆశ్చర్యపడి మరికొంత తెలుసుకుందామని అప్పుడు కొన్న పుస్తకం “నారాయణ దర్శనము” [2]. ఇన్నాళ్ళకి తాడేపల్లి గారి మూలాన కాస్త చదివే అవకాశం కలిగింది. మంచి పరిచయానికి కృతజ్ఞతలు.
దాసు గారికి ముందర హరికథలున్నా, సంగీతం, సాహిత్యం, నృత్యం – మూటినీ కలిపి, పండితులూ పామరులూ కూడా హరికథలంటే చెవి కోసుకోడానికి కారణం ఈ మహానుభావుడే:
“ఘన శంఖమో యనఁ గంఠంబు పూరించి
మేలుగ శ్రుతిలోన మేళవించి
నియమము తప్పక నయ ఘనంబులఁ బెక్కు
రాగ భేదంబుల రక్తి గొల్పి
బంతు లెగిర్చిన పగిది కాలజ్ఞతన్
జాతి మూర్ఛనలొప్ప స్వరము పాడి
చక్కని నృత్యము సర్వరసాను కూ
లంబుగాఁగ నభినయంబు చేసి
స్వకృత మృదు యక్షగాన ప్రబంధసరణి
వివిధ దేశంబులం బిన్న పెద్దలు గల
పలు సభల హరిభక్తి నుపన్యసింప
లేని సంగీత కవితాభిమాన మేల?”
మశూచి కథ లాంటిదే మరో మహిమ: దాసు గారితో వంతపాట పాడే పేరన్నకి జబ్బు చేస్తే, అన్నని బతికించమని శివుణ్ణి ప్రార్థిస్తూ రాసిన శతకం మృత్యుంజయ శివ శతకం. అదంతా రాసింది ఒకే ఒక్క రాత్రి! దేవుడు దిగి వచ్చాడు. వైద్యులకి లొంగని జబ్బు నయమయింది.
విజయనగర ప్రభువు ఆనందగజపతి ఓరోజు ఇష్టాగోష్ఠిలో దాసుగారికి ‘సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్’ అనే సమస్యనిచ్చి పూరించమంటే, దాసుగారు వెంటనే పూరించారు – నూరు విధాలగా! అది సత్యవ్రత శతకం.
ఖయ్యాం రుబాయెత్ ని పారశీక మూలం నుండి సంస్కృతంలోకీ, అచ్చ తెలుగులోకీ, తిరిగి Fitzgerald ఆంగ్లానువాదం నుండి సంస్కృతంలోకీ, అచ్చ తెలుగులోకీ అనువదించారంటే దాసుగారి సహజ పాండిత్యం ఎలాంటిదో అంచనా వెయ్యొచ్చు.
వీటన్నిటికన్నా చెప్పుకోదగ్గది ‘నవరసతరంగిణి.’ Shakespeare, కాళిదాసు తమ రచనలలో నవరసాల్ని ఎలా పోషించారో అనువాదాల ద్వారా చూపే గ్రంథం. ఉదాహరణకి శృంగార రసం:
“Love is a smoke raised with the fume of sighs;
Being purged, a fire sparkling in lovers’ eyes;
Being vexed, a sea nourished with loving tears.
What is it else? A madness most discreet,
A choking gall, and a preserving sweet.”
— Romeo and Juliet, Act I, Scene I.
వలపనఁగ వెచ్చనూర్పులఁ గలిగిన పొగ
కాముకుల కన్నులందునఁ గ్రాలు నగ్గి
నాయికానాయకాశ్రయులన్ బ్రబలు కడలి
వెర్రియున్, జంపఁ బెంపఁగ విషమమృతము.
‘నవరసతరంగిణి’ లాంటి పుస్తకం తెలుగులో మరొకటి ఉందా? పీఠికలోని అభిప్రాయాలకోసమైనా చదవాలని ఉంది. దొరుకుతుందా?
పోను పోను దాసుగారు అచ్చ తెనుగులో, ఆయన మాటలో నాటు తెనుగులోనే, రాయాలని పట్టుబట్టడంతో ఆయన రచనల్లో రసం కొరవడిందంటారు.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “నేటి కాలపు కవిత్వం – తీరుతెన్నులు,” తమ్మినేని యదుకుల భూషణ్, 2004.
[2] “నారాయణ దర్శనము (ఆదిభట్ల నారాయణదాసు),” డాక్టర్ గుండవరపు లక్ష్మీనారాయణ. ప్రథమ ముద్రణ, 1983. ద్వితీయ ముద్రణ, 2003. ఇది PhD గ్రంథమయినా సామాన్య పాఠకులకి అర్థమయే రీతిలో ఉంది.
మల్లిన నరసింహా రావు
మంచి పరిచయ వ్యాసాన్ని అందించినందులకు మీకు నా అభినందనలు. వారి పుస్తకాలు ఆ తరం లోని ఎవరో ఒకరి దగ్గఱ ఉండొచ్చు. వాటిని దొరకపుచ్చుకుని పునర్ముద్రణ చేయించుకోవటం మనందరి అవసరం.
Manohar
first of all forgive me for giving reply in english.
I came to know about this great person when i heard some harikadhas from Sri kota sachchidananda sastri garu. from then i am trying for the books written on him or by him.. but I am unable to get them. thanks for introducing his books. is there any possibility of getting other books written by him? please let me know.
chkrman@gmail.com
నారాయణ
చక్కని పరిచయం. చివరివాక్యం చదివాక బాధగా అనిపించింది.
SATYARAO POTHULA
EE VYASAM CHALA BAAGUNDI.