ఈస్తటిక్స్ కథలు – ఖమ్మం ఈస్తటిక్స్ 2022

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

********

తెలుగు సాహిత్యంలో కథకున్న బలం, ఆదరణ వర్తమానంలో మరే ప్రక్రియకు లేదేమో! ఇటీవలి కాలంలో కథల పోటీలు తరచుగా చూస్తున్నాం. కాలానుగతంగా సమాజాన్ని, వ్యక్తుల జీవితాల్ని రకరకాల కోణాల్లో స్పృశిస్తూ వస్తున్న రచనలు జీవితాల్ని మరింత విశాలావరణలో చెపుతున్నాయి. సాహిత్యమేదైనా ఆయాకాలాల్లోని జీవనశైలి, వైవిధ్యాల్ని పాఠకులకి అందిస్తుంటుంది. నిన్నటి జీవితాల్లో కనిపించని, అవసరపడని కొత్త సమస్యలు, కొత్త పరిష్కారాలు, కొత్త జీవన విధానాలు మన ముందుకు తెస్తూ, తనదైన ఒక ప్రయోజనాన్ని కూడా నెరవేరుస్తుంది.

ఖమ్మం నుంచి సాహిత్య హితం కోరుతున్న కొందరు మిత్రులు కొన్ని ఆలోచలను చేసి, కథల పోటీ నిర్వహించి కథకులను, కవులను ప్రోత్సహించాలనుకున్నారు. ఆ మిత్రులు రవి మారుత్, ప్రసేన్, సీతారాం, వంశీకృష్ణ, మువ్వా శ్రీనివాసరావు, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, ఫణి మాధవి కన్నోజు. ఈ కమిటీ కి గౌరవ సలహాదారులు ఓల్గా, డా. ఎల్. ఎస్. ఆర్. ప్రసాద్.

అవార్డులు ఎన్నున్నా ఇంకో అవార్డు అవసరముంటుందని భావించారు. ఒక విస్తృత సాహిత్య ప్రయోజనాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని అవార్డులు ఇవ్వవలసిన అవసరం ఉందంటారు వాళ్లు. అది తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసే దిశగా ఉండాలంటారు.

మొదటి ప్రయత్నంగా 2022 లో కవిత్వ సంపుటాలతో పాటు కథల పోటీ నిర్వహించారు. ఉత్తమమైన మూడు కథలకు పెద్ద మొత్తంలో బహుమతి ప్రకటించారు. వాటితో పాటు మరికొన్ని మంచి కథలను ఎంపిక చేసి పన్నెండు కథలతో ఒక కథా సంకలనాన్ని తీసుకొచ్చారు. తమ ప్రయత్నంతో తెలుగు సాహిత్యాన్ని మరింత సంపన్నం చెయ్యాలన్న వారి కల సాకారమవుతోంది.

పుస్తకంలోని కథల్లోకి వెళ్తే,

మొదటి బహుమతి పొందిన సయ్యద్ సలీం – హరామీ ఒక ముస్లిం జంట ఆలోచనలు, అనుభవాన్ని చెపుతుంది. కులమతాల పట్ల ఉన్న తీవ్ర అభిప్రాయాలు, అవి ఆయా జీవితాలను ప్రభావితం చేస్తున్న తీరును వర్తమాన సమాజంలో చూస్తున్నాం. మనిషికి మనిషి పట్ల సహజంగా ఉండవలసిన ప్రేమ, సహానుభూతిని కూడా మరిచిపోయేంతగా ఇవి మనుషుల్ని విడదీస్తున్నాయి. జీవించినంత కాలం వెంటాడే ఈ అనవసరపు లెక్కలు, వివరాలు మరణం తరవాత కూడా మనిషిని వదిలిపెట్టవని ఈ కథ చెపుతుంది. స్వంత మతానికి చెందిన విధివిధానాలను ఒక వ్యక్తి ఎంతవరకు పాటించాడన్నది మరణించాక కూడా సమాజం జ్ఞాపకం పెట్టుకుని తదనుగుణంగా మాత్రమే వారి ఆఖరి ప్రయాణానికి అనుమతినిస్తుందని చదివినప్పుడు ఆశ్చర్యం కంటే ఆక్రోశం కలగక మానదు. మనది లౌకిక రాజ్యం! మన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా కాక మనం పుట్టిన కులమో, మతమో జీవితాల్ని, మరణాల్ని కూడా శాసిస్తోంది. 

రెండవ బహుమతి పొందిన దేశరాజు – సహజాసహజం ప్రస్తుతం పట్టణాల్లోనూ, నగరాల్లోనూ వేధిస్తున్న సమస్య. ఆ సమస్య కు మూలకారణం మన జీవితాల్లో వచ్చిన మార్పులే. పొలాల్ని, కనబడిన ఖాళీ స్థలాల్ని అపార్ట్మెంట్లుగా మార్చేస్తూ మన నివాసాల కోసం, సౌకర్యాలకోసం ప్రకృతిని ఎంతగానో ధ్వంసం చేస్తున్నాం. ఈ క్రమంలో మనకి పక్షుల నుంచి పెద్ద సమస్య ఎదురవుతోంది. ప్రకృతిలో భాగంగా బతికే జీవరాశులు ఎక్కడ తలదాచుకోవాలన్న కనీస ఆలోచన లేకుండా చేస్తున్న పట్టణ, నగారాభివృద్ధి వాటికి నిలువ నీడ లేకుండా చేస్తున్నదన్నది కాదనలేం. దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించే బాధ్యత మనది కాదా? వాటి నుంచి మనకి ఎదురయ్యే ఇబ్బందుల్ని, మనుషులం కదా, తెలివిగా తప్పించుకునే మార్గాల్ని మాత్రం వెతుక్కుంటాం. ఈ సమస్య రానురాను తీవ్రమవుతూనే ఉంది. సమస్య కు కారణమైన మనిషే పరిష్కారం చూపించాలి.

మారుతి పౌరోహితం – కుశలంబే కదా ఆంజనేయ కథ మూడవ బహుమతి పొందింది. శివరాత్రి వెళ్లాక ఒక స్టేజి డ్రామా వెయ్యాలనుకున్న ఓ ఊరివాళ్లు ఆ ప్రయత్నంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని విజయవంతంగా దాటి ప్రదర్శన చెయ్యటం వివరంగా చెపుతుందీ కథ. కథ చదివినంతసేపూ ఒక పల్లె వాతావరణంలో ఆరుబయట ఆకాశం కింద కూర్చుని ఒక నాటకాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ప్రముఖ దర్శకుడు వంశీ సినిమా చూస్తున్నట్టు కూడా అనిపించింది. “రామాంజినేయ యుద్ధం” డ్రామా కోసం గురువుని వెతుక్కుంటూ వెళ్ళి పాండురంగయ్యని కలిసి మాట్లాడిన తీరు సహజంగా ఉంది. రిహార్సల్స్ లో శిష్యులు గురువుగారికి చుక్కలు చూపించినా ఇదంతా చాలా సరదాగా ఉంటుంది. డ్రామా వేసే సమయంలో పాత్రధారులు తమ కుటుంబీకులు వచ్చారా, తమని చూస్తున్నారా అని ఆరా తీసి మరీ పాత్రపోషణ చెయ్యటం భలే ఉంటుంది. ఆ రిహార్సల్స్ చూస్తూ ఊళ్లో పిల్లలంతా డ్రామాలోని పద్యాలన్నీ నేర్చేసుకుంటారు. రాముడి వేషం వేసే రసూలు గడ్డం తియ్యలేనని చెప్పినప్పుడు పద్యం బాగా పాడే రసూలు మాత్రమే రాముడుగా నప్పుతాడని నమ్మిన ఊరంతా అతని నిర్ణయాన్ని అంగీకరిస్తుంది. ఈ కథలోని మాండలీకం కథకి మరింత అందాన్నిచ్చింది. ఈ కథ చదవటం, ఈ పాత్రల పరిచయం ఒక అద్భుతమైన అనుభవాన్నిస్తుంది.

శరత్ చంద్ర – చివరకు మిగిలేది…?  తమ వరకు జీవితం గడిపేస్తే చాలని చాలామంది అనుకోరు, చుట్టూ ఉన్న సమాజానికి ఏదైనా చెయ్యాలన్న తపనతో చాలాసార్లు కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని కూడా లెక్కచెయ్యరు. అది వృత్తి రీత్యా అవసరమైనా, స్వంత అభిరుచి మేరకైనా కూడా నిస్వార్థంగా తోటివాళ్ల అవసరాల్ని అర్థం చేసుకుని చేయూతనిస్తారు. తమ శక్తిని, సమయాన్ని కూడా ఇతరులకు ధారపోస్తారు. అలాటి వ్యక్తులు ఇద్దరు ఈ కథలో కనిపిస్తారు. వ్యక్తులు, సమాజం కూడా ఉచితంగా అందే సాయాల్ని హక్కుగా అందుకుంటారు. సమస్యలో ఉన్నవారికి ఏదైనా చెయ్యగలమా అన్న ఆలోచన రాకపోవటం లోటు కాకపోయినా, తీరా ఎవరైనా అడిగినపుడైనా సాయం చేసే పెద్ద మనసు చాలామందిలో కనిపించదు. ఇది నిష్టూరమైనా వాస్తవం. అందుకే ఎవరికి ఎవరూ కాని ఈ స్వార్థ ప్రపంచంలో మన కోసం మనమే జాగ్రత్తపడాలి.  

కృపాకర్ పోతుల – ఎదురీత: స్థోమత ఉండీ తన కూతుర్ని ప్రభుత్వ బడిలో మాత్రమే చదివించాలకున్న అతని తత్త్వం ఇంట్లో వాళ్లకి, బయటవాళ్లకి కూడా అర్థం కాదు. స్వంత నిర్ణయానికి కట్టుబడి ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటాడు. ప్రపంచం తీరుకి భిన్నంగా పెంచుకున్న కూతురు అతని నమ్మకాన్ని నిలబెడుతూ ప్రతిష్టాత్మకమైన అవార్డ్ ను గెలుచుకుంటుంది. మన సమాజంలో ఉన్న నమ్మకాలు కొన్నిటికి ఆధారం ఉండదు. నలుగురు నడిచే దారిలో నడవటం అంటే సమాజంలో అధికశాతం మద్దతుని అవలీలగా పొందచ్చన్న ఆలోచనే కానీ స్వంత అభిప్రాయం, స్వంత నిర్ణయం చాలాచోట్ల కనిపించవు. అది తీసుకున్నవాళ్లకి ఎదురీత తప్పదు.

దాట్ల దేవదానం రాజు – కాలం -పొలం. ఆర్థికాభివృద్ధి పేరుతో వ్యవసాయ భూములన్నీ రొయ్యల చెరువులుగా మారుతున్నాయి. విసిగించే డబ్బు అవసరాలు, పంట చేతికొస్తుందో లేదో తెలియని స్థితి – సామాన్య రైతుకి వ్యవసాయం అనవసరమైన శ్రమగానూ, వృధా పెట్టుబడిగానూ కనిపించటంలో ఆశ్చర్యం లేదు. దీనికి విరుద్ధంగా భూమిని కన్నతల్లిలా ప్రేమించి పూజించే వాళ్లూ ఉన్నారు. వారికి లాభనష్టాలతో సంబంధం లేదు. భూమిని పర్యావరణ కాలుష్యాలకు దూరంగా కాపాడుకోవాలన్న కలలతో వ్యవసాయం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అయినా, కొన్ని బలహీన క్షణాల్లో ఇంటా, బయటా ఒత్తిళ్ల మధ్య తామొక్కరేం చెయ్యగలమన్న నిరాశతో ఏటికి ఎదురీదలేని పరిస్థితులకి తలవంచేలా చెయ్యటం విషాదం. 

పెనుమాక రత్నాకర్ – అన్నపూర్ణాలయం: కడుపు నింపుకుందుకు కష్టపడటం సామాన్యుడికి అలవాటే. దానికీ అవకాశం దొరకని పరిస్థితులు ప్రకృతి కల్పించినపుడు తనను నమ్ముకున్న కుటుంబ సభ్యులకి ఆకలి తీర్చే వెతుకులాటలో ఎదురయ్యే ఉపాయాలను తప్పని అనలేము. తోటివాళ్ల ఆకలిబాధ పట్టనివారు మరణించిన తమవారి కోసం మాత్రం స్మశానాల్లోనూ షడ్రసోపేతమైన విందుల్ని నైవేద్యంగా పెట్టే మన ఆచారాల్ని ఏమందాం? అలాటి స్మశానమే ఒక కుటుంబానికి ఆకలి తీర్చే ఆధరువైంది. కళ్లు చెమర్చే దయనీయ పరిస్థితి!

సిహెచ్. సీత – ఋగ్వేదం: శుభ్రత లోపిస్తే అతను సహించలేడు. “వాళ్లు కష్టజీవులు, వాళ్ల బలం మురికి, వాళ్ల ఆయుధం చెమట” అంటుందామె. ఒప్పుకోలేకపోతాడు. మట్టిరోడ్డులో కారు నడవనని మొరాయించినపుడు చేతులేసి సాయపడిన ఆ మురికి పిల్లలకి డబ్బివ్వబోతాడు. ఆ పేద తల్లి నిరాకరించి చిన్నసాయం అడుగుతుంది. వాయిదా వేసి వెళ్లిపోయిన అతను తిరుగుప్రయాణంలో అక్కడే యాక్సిడెంట్ కి గురవుతాడు. అదివరకు సాయం చేసిన పసివాళ్లే మళ్లీ ఎదురవుతారు. జీవితం విలువ అవసరంలోని వ్యక్తిని ఆదుకోవటంలో ఉందని అతను గ్రహించాడు.

సింహప్రసాద్ – కిక్ ద కిచెన్: వంటింటికి ఆడవాళ్లని మహారాణిని చేసేమంటూ ఆ బాధ్యతని పూర్తిగా తప్పించుకోగలిగారు మగవాళ్లు. విప్లవం తెచ్చి ఈ వంటపని నుండి ఆడవాళ్లకి విముక్తినిస్తాం అంటూ కాలనీలో సమావేశం పెట్టి ఆడవాళ్లని ఉత్సాహపరిచి రుచికరమైన ఆహారాన్ని ఇంటికే నేరుగా పంపిస్తామంటూ ఊరించింది క్లౌడ్ కిచెన్ అనే అమెరికా సంస్థ. ఎవరు కోరుకున్న భోజనం, టిఫెన్లు వారికి అందిస్తామని హామీ ఇచ్చి సమావేశానికొచ్చిన వారిని మెంబర్లుగా చేర్చేసుకుంది. వంటింటి పనులు తప్పడమే కాకుండా ఇష్టమైన రుచుల్ని తినే సంతోషం, ఇష్టమైన వ్యాపకాల్ని వెతుక్కున్న సంబరం ఎన్నళ్లో సాగనేలేదు. సున్నితమైన హాస్య ధోరణిలో కథ నడుస్తుంది. క్లౌడ్ కిచెన్ చివరికి మంచే చేసింది. అదే కథకి కొసమెరుపు.    

కిరణ్ జమ్మలమడక – మోహపుమరకలు: సోషల్ మీడియా ఇప్పటి మన జీవితల్లో విడదీయలేని భామైపోయింది. మన సంతోషాలు, మన గెలుపులు, మనవైన అన్నిరకాల ఉద్వేగాల్ని నలుగురికీ పంచే అలవాటు ఎకువైంది. మనకంటూ ప్రైవసీ అవసరమే లేదన్నట్టు జీవితాల్ని బాహ్య ప్రపంచానికి అందించటం చూస్తున్నాం. ఎవరి గురించి వారు ఏం చెప్పుకున్నా, ఎలాటి ప్రచారాలు చేసుకున్నా తప్పులేదు. కాని మరొకరి జీవితాల్ని బట్టబయలు చేసి వాళ్ల ప్రైవసీని దురాక్రమణ చేసి, దానిని మరింత మందికి చేరేసే అమానుషమైన, హేయమైన ఆనందాన్ని పొందే హక్కు ఎవరికీ లేదు. సున్నిత మనస్కుల్ని ఇలాటివి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తాయి. ఇలాటి పరిస్థితిలో చిక్కుకున్న ఒక అమ్మాయి క్షణం తడబడినా, ధైర్యంగా ప్రపంచం ముందుకొచ్చి ఎలాటి పరిష్కారానికి ప్రయత్నించిందో ఈ కథ చెప్పింది.

కౌలూరి ప్రసాదరావు – ఉర్వారుక మివ బంధనా…: జర్మన్ దేశానికి చెందిన ఘనత వహించిన కుక్క ‘లియో’ సంపన్నుల ఇంట్లో రాజ భోగాల్ని అనుభవిస్తుంటుంది. ఉన్నట్టుంది ఓనరమ్మ చిన్నకొడుకు కోరిక మీద కొత్త బొచ్చు కుక్కపిల్లని ఇంటికి తీసుకొస్తుంది. అన్నేళ్లుగా ఉన్న లియో ని ఇంట్లోంచి నిర్దయగా పంపేస్తుంది. ఆమె తెంచుకున్నంత తేలిగ్గా లియో ఆ ఇంటితో అనుబంధాన్ని తెంచుకోలేక రోడ్డు మీద దీనావస్థలో ఉండి కూడా తిరిగి తాను ఆ ఇంటికి వెళ్లాలనే కలలు కంటుంది. తన గుండె చీల్చి చూస్తే ఆ ఇంటి యజమాని కుటుంబం ఉంటుందని చెపుతుంది. అలా సులువుగా తెగని అనుబంధం గురించే కథ పేరు చెపుతుంది. 

చంద్రశేఖర్ ఆజాద్ – గోస: అతను పేరులేని వాడు. తండ్రి ద్వారా వచ్చిన జాగా ని దొర ఆక్రమించుకున్నాడు. అతని గోస వినేవారు లేరు. దేవుణ్ణి నమ్ముకుని పుణ్యక్షేత్రాలు తిరిగాడు. ఫలితం లేక సన్యాసిలా మారాడు. కట్టుకున్న భార్య, పిల్లలు బతకలేనివాడితో కుదరదని వదిలి పోయారు. దేవుడు లేకపోయినా మనుషులు బతక గలరని నమ్మకం కలిగాక దేవుణ్ణి చంపెయ్యాలనుకుంటాడు. ఊరూరూ తిరుగుతూ ఎవరికీ అనుమానం రాకుండా తాను చెయ్యాలనుకున్న పని చేస్తాడు. అతను చేసిన పనికి భిన్నమతాల మధ్య చిచ్చు రేగి, అమాయకుల ప్రాణాలు పోయాయి. పోలీసు దర్యాప్తులు జరిగాయి. కూల్చినవన్నీ తిరిగి ప్రతిష్టించాలనుకున్నారు. ఆనక జనం అన్నీ మరిచేపోయారు. ఉనికిలో లేని దేవుణ్ని చంపాలనుకోవటం ఎంత తప్పో అర్థమైంది అనామకుడికి. మన సమాజంలో మతం, దేవుడు పేరుతో జరుగుతున్న తంతు గురించి వ్యంగ్యంగా చెప్పిన కథ. 

ఈ కథలన్నీ భిన్న వస్తువులతో వర్తమాన సమాజాన్ని ప్రతిబింబిస్తున్నాయి. సాహిత్యం పట్ల ఖమ్మం ఈస్తటిక్స్ వారి ప్రేమ, నిజాయితీలకి నిదర్శనంగా వెలువడిన ఈ సంకలనం తెలుగులో కథాసాహిత్యానికి మరో చక్కని కూర్పు. వారి ప్రయత్నానికి అభినందనలు.

ప్రచురణః ఖమ్మం ఈస్తటిక్స్, డిసెంబరు, 2022

వెలః రూ. 150/-

You Might Also Like

Leave a Reply