భీముని స్వగతం: ఎమ్.టి. వాసుదేవన్ నాయర్

“చిన్నతనంలో మరణమంటే యముడనే అనుకునేవాణ్ణి. తర్వాత, ఆచార్యుల్లో ఎవరో మృత్యువు సంగతి తెలియజెప్పారు. బ్రహ్మ, కోపంలో సృష్టించాడు మృత్యువుని. అందమైన రూపంలో ఆమె ఉనికిలోకి వచ్చింది. సంహార క్రియకి తగిన ధైర్యం తనకి లేదని జంకుతున్న చెలువకి బ్రహ్మ ధైర్యాన్ని కరుణించాడు. నలుపు కలిసిన కెంపురంగున్న ఆమె. నగలని పెట్టుకున్న ఆమె. లేత ఎరుపు కన్నులూ, చిక్కని ఎరుపుగా పెదాలూ ఉన్న ఆమె. స్వర్ణాభరణభూషితురాలు, సుందరియైన మృత్యుకన్య. 

కురుక్షేత్రంలో తిరుగడం మొదలెట్టిన ఈ చెలువ, ఇప్పుడు నాలోని ఒక పార్శ్వాన్ని అపహరించింది.”  

(భీమాయణ, పేజి: 226)

అభిమన్యుడు చనిపోయిన వార్త తెలియగానే, ఎం.టి. వాసుదేవన్ నాయర్ సృష్టించిన భీముని స్వగతమిది. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నా, తన మీద జరిగిన హత్యాయత్నాలని తృటిలో తప్పించుకున్నా, తన కండబలంతో మహాబలులని హతమార్చినా మృత్యువుని గురించి ఆలోచించని భీముడు, యుద్ధభూమిలో సంభవిస్తున్న మరణాలను చూసి మాత్రం ఒక ధ్యానంలా చావుని గురించి ఆలోచిస్తాడు. 

చావుకి (మాత్రమే) రూపం (personification) ఎందుకు కావాల్సి వస్తుంది? దున్నపోతు మీద యమకింకరుడిగానో, వెన్నంటే నడిచే తెల్ల దుస్తులేసుకున్న అస్తిపంజరంగానో దాన్ని ఏదో ఒక రూపంలో ఎందుకు ఊహించుకుంటాం మన కథల్లో? మన రాకకు ముందూ సృష్టి యధావిధంగా కొనసాగినప్పుడు, మనం పోయాక కూడా అందులో ఏ మాత్రం మార్పు ఉండబోన్నప్పుడూ, ఈ రాకపోకలు ఒక కాంట్రాక్ట్ అనుకుంటే, దాని ముగింపుకి, అదే, మన నిష్క్రమణకి కారణమయ్యే మృత్యువుకి ఒక రూపం, ఒక బాధ్యత, ఒక వ్యక్తిత్వం ఎందుకు ఆపాదిస్తాం? అలా ఆపాదించడం ఒక అవసరమైతే అది పుట్టుకకూ ఎందుకు వర్తించదు? జీవి ఉనికిలోకి రావడానికి కనీసం ఇద్దరి జీవుల ప్రమేయం ఉండాలి – అందుకనా? అదే, చావుకైతే అలా ఇద్దరు కూడబలక్కోనవసరం లేదనా?  

మృత్యుకన్యలా జీవ-దేవి (Goddess of Life) ఉండే అవకాశముందా? 

***** 

మహాభారతమంటే దాదాయాదుల మధ్య పోరని చెప్తారందరూ. రాజ్యం కోసం యుద్ధం చేసుకుని ఒకరినొకరు చంపుకున్న అన్నదమ్ముల కథ! ఎంతసేపూ కుటుంబం, అధికారం, ధర్మం, హక్కు,  అవమానం, కుతంత్రం, ప్రతీకారం లాంటి మాటలే వినిపిస్తాయి.  ఆ hyper-dysfunctional కుటుంబంలోని మనుషులనీ, వాళ్ళ మధ్య తగాదాలనీ, వివాదాలనీ మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటారు – పుస్తకాలు చదివే ఓపిక లేకపోయినా,  టివి సీరియళ్ళల్లో, సినిమాల్లో, ప్రవచనాల్లో!

అదే కథను తిప్పి తిప్పి చెప్పడం వల్ల పెద్ద ఒరిగేదేమీ ఉండదు – రామాయణ, మహాభారత retellings ఆధారంగా ప్రస్తుతం కుప్పలుతెప్పలుగా వస్తున్న పుస్తకాలని చూస్తే ఆ సంగతి అర్థమవుతుంది. “ఆ ఊరికే తిప్పే తిప్పుడు కాదు కదా… మూల కథలో తెరవెనుకో, పక్కనో  ఉండిపోయిన పాత్రలపై వెలుగు ప్రసరిస్తున్నాం, డైలాగులైనా లేనివాళ్ళని నాయికానాయకుల్ని చేస్తున్నాం,” అని ఈ రచయితలు వాదించచ్చు, కానీ స్పాట్‍లైట్ వేసినంతమాత్రాన, మైక్ ముందుపెట్టినంత మాత్రన కథ అమాంతంగా మారిపోదు. “పాయింట్ ఆఫ్ వ్యూ” మారినంత మాత్రాన పాయింట్ మారదు. 

కథని అదే కథగా ఉంచుతూ పాత్రలను, ఘటనలూ మార్చకుండా పాఠకులకి అంతకుముందే తెల్సిన కథనే మళ్ళీ చెప్తూ కూడా వారి అవగాహనలో ఒక tectonic shift తీసుకురాగలిగేలా చేయడం అరుదుగా జరుగుతుంది. మలయాళంలో ఎమ్.టి. వాసుదేవన్ నాయర్ రాసిన “రెండమూళం”కి మూడేళ్ళ  కిందట “Bhima, the lone warrior” అని గీతా కృష్ణన్‍కుట్టి చేసిన ఆంగ్లానువదం చదివినప్పుడు నాకు మహాభారతాన్ని కొత్త చెవులతో వింటున్నట్టు, కొత్త మేధతో అర్థం చేసుకున్నట్టూ అనిపించింది. “నేను చంపేస్తా, నేను నరికేస్తా… ఏదీ, నా గదేదీ?” అంటూ ఆవేశపడే ఎన్టీఆర్‍గానో, సత్యనారయణగానో తెల్సిన భీముడుకి, “ప్రస్తుతకాలంలో కార్పరేట్ లోకంలో ఎప్పటికీ సి.ఇ.ఓ అవ్వకుండా మిడిల్ మానేజర్‍గా మిగిలిపోయేలాంటివాడు….” అని నాటకాల్లో కొత్త జార్గన్‍లో నిర్వచించబడుతున్న భీముడుకి మధ్య  నేనింకో భీముణ్ణి పట్టుకోగలిగాను. 

మహాభారతం అనగానే వినిపించే మహిమలూ, అవతారాలూ, మానవులకి సాధ్యం కానీ ప్రావీణ్యాలూ, ఊహించలేని త్యాగాలూ తీసేసి, multi-verse ప్రస్తావన లేకుండా, కేవలం భూమి మీద, అచ్చంగా మానవమాత్రులకే జరిగే కథగానే చెప్పడం ద్వారా పాత్రలలో ఒక మంటివాసన తెలుస్తుంది ఎప్పుడూ అనుకోనంతగా! “రండామూళం”కి మలయాళంలో “రెండో అవకాశం”, “రెండో స్థానం” లాంటి అర్థాలు చెప్పుకోవచ్చంట, కానీ నాకు మాత్రం ఇది “టేక్ టు”లా అనిపించింది. నమ్మశక్యం కానంతగా మారిపోయిన కథను మళ్ళీ తన మూలాల్లోకి తీసుకొచ్చే “టేక్ టు”! 

అయితే ఎమ్.టి అసలు కథలోని అలంకారాలనీ, అతిశయోక్తిలనీ పూర్తిగా విస్మరించకుండా, వాటిని ఓ పక్కన ప్రస్తావిస్తూనే ఇంకో పక్క భీముని చేతే వాటిని కొట్టిపారేయిస్తారు. ఒక పేజీలో పుట్టిపెరుగుతున్న మాయ (myth) రెండుమూడు పేజీలలోపే భీముని చేతిలో అప్పచ్చి అయిపోతుంది. ఈ అప్పచ్చులన్నీ ఏరుకుంటూ పోతే మనకి కొత్త అవగతమయ్యే సంగతులు బోలెడు.  

 భీముడు హిడింబ, బక (అసుర అని వాడరు)లాంటి వారిని మల్లయుద్ధంలో ఓడించడానికి శక్తి ఎంత ఉపయోగిస్తాడో, యుక్తీ అంతే ఉపయోగిస్తాడు. అదంతా ఉత్త బండతనం కాదు. అందులో చాలా ఆలోచన నిక్షిప్తమయ్యుంది. ఈ ఆలోచన అవతలివాళ్ళ మీద దాడిచేసే సందర్భాల్లోనే కాదు, ఏమీ చేయలేని, తిరిగి ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో కూడా ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని, తన చుట్టూ ఉన్న ప్రతీ మనిషిని పరిశీలించి, పరికించి చూడగలడు ఈ భీముడు.

“Yet in life there is no such separation; there is no body that is not mind, no mind that is not body. The word mindbody has been suggested to convey the real state of things.”

(When Body Says No, Gabor Mate)

ఆ మానసికత-భౌతికతల విడదీయలేనితనాన్ని సాహిత్యంలో చదువుకోవాలంటే ఎమ్.టి భీముణ్ణి చదువుకోవచ్చు. 

మనది కానిది ప్రతీది మనం – ఒప్పుకోలేనిదీ, ఆమోదించలేనిదీ, సొంతచేసుకోలేనిదీ. ఈ వేర్పాటు (othering)లో అసలు ఉన్న దూరానికి మించిన అగాధాలేవో ఏర్పడతాయి. భీముణ్ణి కాళ్ళు కట్టేసి చెరువులో పడేస్తే కిందకంటా మునిగిపోయి, నాగలోకం చేరుకుని, అక్కడివారి మానవేతర మహిమలతో బాగై, వాళ్ళ అస్త్రాలవీ ఇస్తే… పదేళ్ళ వయసులో ఈ కథ విన్నప్పుడు “ఎక్కడో, ఎవరికో” జరుగుతున్న కథ, ఎట్టి పరిస్థితుల్లో నాలోకంలో, నాకూ, నావాళ్ళకీ జరిగే అవకాశం లేని కథ అనిపించింది. ఎమ్.టీ భీముడు మాత్రం ఏదోలా తనకలాడి, కాళ్ళకి కట్టిన తాళ్ళు ఊడగా, నీటి ధాటికి ఎలానో ఒక తీరానికి కొట్టుకుపోతాడు. ఆ నదీతీరాన్న అడవిలో ఉన్నవాళ్ళు కాపాడి, బలం పుంజుకునేలా చేస్తారు. దివ్యాస్త్రాలకన్నా తన సొంత బలంపై నమ్మకం పెట్టుకోవడం ఉత్తమమని చెప్తూ, “యుద్ధకథలన్నింటిలో వీరులు దివ్యాస్త్రాలతోనే గెలిచారుగా” అంటూ ఆ సలహా ఒప్పుకోలేకపోతున్న భీమునికిచ్చిన అస్త్రం:

“వైరి దానికంటే పెద్ద ఆయుధంకోసం తపస్సు చేస్తే? దేవతలు అదీ ఇచ్చేస్తారు. మరి మొదట ఇచ్చిన వరాయుధం వల్ల ఏం ప్రయోజనం?”

(భీమాయణ: 48)

ఇట్లాంటివన్నీ మొదటిసారి చదివినప్పుడే అర్థమయ్యాయి. కానీ వాటిని వ్యక్తీకరించడం రాలేదు. వ్యక్తీకరించడానికి ప్రయత్నించినా “ఇంతేనా?” అని అనుమానం పీకుతూ ఉంది. చాలా గొప్ప రచననుకోవడం తప్పించి ఎందుకు గొప్పో అన్నది అర్థమై కాకుండా ఉండిపోయింది.

*****

మూడునాలుగేళ్ళ తర్వాత మాటల సందర్భంలో ఈ నవలలో మొదట వచ్చే “పయణం” అనే ఎనిమిది పేజీల చాప్టర్ గురించి అనర్గళంగా గంటగంటన్నర అన్నా మాట్లాడగలిగే స్నేహితుడు దాని ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు నాకు కథ ముగింపు మాత్రమే మెదిలింది గానీ మొదలు అస్సలు గుర్తుకురాలేదు. మళ్ళీ ఓసారి చదవాలనుకుంటుండగా సాహిత్య అకాడెమీవారి కన్నడ అనువాదం దొరికింది. ఎటూ తెల్సిన కథ కదా, భాష వంటపడుతుందని ఊరికే చదవడం మొదలెడితే చివరి పేజీ దాకా ఆపలేకపోయాను. ఇప్పుడన్నా ఈ రచన నాలో కలిగించిన ప్రకంపనలని పట్టుకోగలనో లేదో – కనీసం, ఒక ప్రయత్నంగా అయినా ఉంటుందని రాస్తున్నాను.

పైన నేనన్న tectonic shift గురించి చెప్పాలంటే నేను ఇంతకు ముందు సరమగో నవల “సీయింగ్”కి రాసుకున్న దాన్నే ఆధారంగా తీసుకుంటున్నాను: 

కొందరు పిల్లలు ఎంచక్కా తమకు తోచిన రీతిన ఒక భవనాన్ని కట్టుకుని అందులోనే నివాసం ఉంటున్నారు. వారిలో ఒకడు, ఆ భవనాన్ని తన సూక్ష్మదృష్టితో పరికించి, తనకున్న పరిజ్ఞానాన్ని జోడించి ఆ భవన నిర్మాణపు తాలూకా ప్రతి చిన్న విషయాన్నీ తెల్సుకున్నాడు. ఇప్పుడతని ముందున్న కర్తవ్యం ఆ భవనమెంత డొల్లో నిరూపించడం. అదేం అహంకారపు చర్య కాదు. కొన్ని ప్రమాణికాలు పాటించకపోతే ఆ భవనంలో ఉండడమెంతటి హానికారకమో చెప్పటం. ఉండడానికి ఈ భవనానికి మంచి పేరే ఉన్నా, ఇందులో లొసుగొలూ ఉన్నాయని చెప్పటం.

అందుకని ఈ కుర్రవాడు, ఆ భవనాన్ని కూల్చకుండా ఒక నమూనాని తీసుకొని అందులో భవనం మొత్తానికి కీలక ఆధారమైనదాన్ని కొంచెంగా జరిపి, తాను పక్కకు తప్పుకొని, భవన పతనాన్ని స్లో మోషన్ కెమరాలో బంధించాడు.

ఆ భవనం పేరు “డెమోక్రసీ”. రికార్డింగ్ పేరు “సీయింగ్” అనే నవల. ఆ కుర్రాడు, విశ్వవిఖ్యాత సరమగో! 

ఎమ్.టి చేసింది కూడా అచ్చంగా ఇదే! సరమగో ఏమో మామూలు చప్పని, పల్చని వాస్తవికతను తీసుకుని, ఏదో ఒక మాజిక్కునో/గిమ్ముక్కునో (ఉదా: దేశంలో అంతా గుడ్డివాళ్ళైపోతారు, లేదా మనుషులెవరూ చనిపోరూ లాంటివి) చేసి, దానివల్ల జరిగే పర్యవసానాలని కథావస్తువుగా తీసుకుంటే, ఎమ్.టి దానికి విరుద్ధంగా మాయలూ, మంత్రాలూ, అద్భుతాలూ ఉన్న పౌరాణిక లోకాన్ని తీసుకుని దాంట్లోని మాజిక్కుని తీసేసి చప్పని, పల్చని వాస్తవికతకు దగ్గరగా దాన్ని తీసుకొచ్చారు. కాకపోతే, ఇద్దరి ధ్యేయం ఒకటే – భవనానికి మూలాధారమైన దేన్నో కొద్దిగా పక్కకు జరిపి, ఆపై జరిగే తమాషాను చూపించడమే!  

సరమగో ఎన్నుకున్న అంశం “డెమోక్రసీ” అని కనిపించినంత స్పష్టంగా ఎమ్.టి ఏ భవనాన్ని కూలుస్తున్నారన్నది పట్టుకోవడం కష్టం. అందులోనూ, అసలు మహాభారతాన్ని, దాన్ని ఫిలాసఫీని చదవని నాలాంటి వాళ్ళకి దాదాపుగా అసాధ్యం. అయినా, ప్రస్తుతమున్న అవగాహన బట్టీ ఇందులో కుటుంబ వ్యవస్థ మీదకే నా ధ్యాస పోతోంది. 

కుటుంబ వ్యవస్థ అంటే, దాయాదుల పోరు, రాజ్యాధికారాల గురించి కాదు. ఒక మనిషికి, తన రక్తసంబంధీకులకి, పుట్టిపెరిగిన వాతావరణానికీ మధ్య సంబంధాల గురించి. 

బయటవాళ్ళు మనమీద చూపే వివక్ష గురించి మనం గొంతులు చించుకుని అరుస్తాం గానీ, అది మన ఇళ్ళల్లోనే, మనవాళ్ళతోనే మొదలవుతుందని గుర్తించం కదా? బొజ్జపట్టినంత తినడం, కంటినిండా నిద్రపోవడం – అంటే, శరీరం అడుగుతున్నవి అడిగినంత సమకూర్చడం – మనకి హేళన చేయడానికి (shaming) మొదట పనికొచ్చేవి కదా?! బండోడు, కర్రోడు, తెలివితక్కువవాడు – labeling లేకుండా మన బాల్యం గడుస్తుందా? 

 అర్జునుడికి మెంటర్ కృష్ణుడు. ధుర్యోధనుడికి బలరాముడు. ధర్మరాజుకి విదురుడు. ఏ మెంటర్ లేనిది భీముడికే! మొట్టమొదటిసారి వేటకి వెళ్ళినప్పుడు  అర్జునుడు వేటాడి చంపగానే అందరూ తెగ ఆకాశానికి ఎత్తేస్తారు. వేటనుంచి తిరిగొస్తుంటే భీముడి మీద ఒక ఆడవి పంది దాడి చేస్తుంది. ఎవరైనా సహాయానికి వచ్చేవరకూ వేచి చూసే సమయం లేక భీముడే దాన్ని చంపేస్తాడు. ఎవరూ మాటవరసకైనా శభాష్ అని అనరు. ఇలాంటి isolationకి గురైనప్పుడు ఆ భావోద్వేగాలని బేఖాతరు చేస్తూ తనకి తానే దూరంగా జరిగిపోవడం ఒక విధమైన coping mechanism. అందుకు విరుద్ధంగా భీముని స్వగతం ఇలా సాగుతుంది: 

“నా బలం గురించి నా మనసుకే బాగా తెలిసింది. అన్నకి నేనింకా బుద్ధిహీనుణ్ణే అయ్యుండచ్చు. కౌరవులకి కేవలం వకోదరుడినే అయ్యుండచ్చు! అయితే భీమ మహాబలవంతుడుగా ఎదుగుతున్నాడని నేను చాలా సంతోషంగా నాకు నేనే చెప్పుకున్నాను.”  

(భీమాయణ: 27)

మొదట్లో చెప్పుకున్న mindbody ఇదే! ద్రౌపది ఐదుగురికీ భార్యగా ఉండడం తనకి సుతరామూ ఇష్టం లేదని యుధిష్ఠరునితో వాదించిన భీముడు, కుంతీ “మీ ఐదుగురిని కలిసుంచే మార్గమిది ఒక్కటే” అని అన్నప్పుడు ఎదురుచెప్పడు. వారి సంభాషణ ఇలా ముగుస్తుంది: 

“భిక్ష ద్రౌపదని తెలిసుకున్నాకే నేను అలా చెప్పాను, పంచుకోండని”

అమ్మ లోపలకి వెళ్ళాక నేను బాధపడ్డాను. అమ్మముందు దుర్బలంగా ఉండాల్సి వచ్చినందుకు కలిగిన బాధ. ఆపైన పట్టి ఆపిన నవ్వు దానంతట అదే భళ్ళుమంది.

బీజాన్ని స్వీకరించే గర్భపాత్రలు; బీజాన్ని మొలకెత్తించడానికి మాత్రమే ఉన్న భూములు; అంతకన్నా ఏమీ కారా! 

మీరు ఈ ఆడదాన్ని చూడలేదు, మా అమ్మని.”

(భీమాయణ, 108)

కథ అక్కడికే వస్తుంది మళ్ళీ, మళ్ళీ – బీజం, దాని వల్ల కలిగే హక్కు/బాధ్యత! భీముడు చాలానే మాయల్ని అప్పచి చేసి అవతలకి పారేస్తాడు గానీ తన తండ్రి వాయుదేవుడన్న స్పృహని ఎక్కడో భద్రంగా దాచుకుంటాడు, ఆఖరికి ఎప్పుడో కుంతీ నిజం చెప్పేవరకూ! అప్పటి వరకూ, రాజు అవ్వాలనే కోరికకి అవకాశమివ్వకుండా, అన్న రాజు కావడానికి అన్ని విధాలా అన్ని యుద్ధాలూ చేస్తూ, కుటుంబ యోగక్షేమాలను చూసుకుంటూ ఉంటాడు. 

హిడింబిని పట్టణానికి తీసుకెళ్ళడానికి వీల్లేదని కుంతి అంటే, ఒప్పుకుంటాడు. తన కొడుకైన ఘటోత్కచుడు అడవికి చెందినవాడు కాబట్టి (నిషాద) తనవాళ్ళు అతడిచేత పనులు చేయించుకుంటూనే ఈసడించుకున్నా ఊరుకుంటాడు.  యుద్ధంలో చనిపోయి, అంత్యక్రియలకీ నోచుకోక పడున్న కొడుకుని చూసి దుఃఖిస్తాడు గానీ, దుర్యోధనుడి కర్ణుడి జాతి/కులం గురించి ఆవేశపడినట్టు ఆక్రోశించడు. ఎదురు ప్రశ్నించడు.

తనలో తాను ఎంత తర్కించుకుంటున్నా బయటకు మాత్రం అందరికి నచ్చినట్టు, అందరి పనులూ చేసేపెట్టే భీముడు చివరికి మాత్రం, మహాప్రస్థానంలో “వెనక్కి తిరక్కూడదు” అని ఉన్న ఒకే ఒక్క నియమాన్ని ఉల్లంఘిస్తాడు. పడిపోయిన ద్రౌపది దగ్గరకి పరిగెత్తుకుని వస్తాడు.     

“The pressure of examinations is obvious and short term, but many people unwittingly spend their entire lives as if under the gaze of a powerful and judgmental examiner whom they must please at all costs.”

“When Body Says No”, Gabor Mate. 

డా.గబోర్ ఈ మాటల్ని chronic stress నేపథ్యంలో అన్నా కూడా, మన జీవితాలన్నీ ఒకరి కనుసైగల శాసనాల్లో నడుస్తున్నట్టు ఊహించుకోవడం విడ్డూరమేమీ కాదు. మనం ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి పుట్టామన్నది మనల్ని అనునిత్యం వెంటాడే సత్యం. దాన్ని నుంచి దూరం వెళ్ళచ్చుగానీ, మళ్ళీ అది అనుమతించినంత వరకే! అది అనుమతించినప్పుడే! అది అనుమతించిన విధంగానే! అందుకే భీముడు వెనుదిరిగాడు. వెనుదిరక్కుండా ఉండలేకపోవడమే భీముడు! 

మృత్యుకన్యలా చెలువో కాదో, స్వర్ణాభూషితురాలు అవునో కాదో గానీ మనవెంటే, మనతోనే ఉండేది మాత్రం మన పుట్టుక!  మనలో ఎంత అంతర్భాగమంటే దాన్ని వేరు చేసి చూడలేనంత, ఇంకో రూపాన్ని ఇవ్వాల్సిన అవసరం లేనంత!

అనువాదాల గురించి ఓ మాట:

గీత కృష్ణన్‍కుట్టి అనువాదం చదివేటప్పటికి నాకు ఇంగ్లీషు అనువాదం తప్ప మరో గత్యంతరం. అయినా చదువుతున్నప్పుడు సంస్కృత/భారతీయ పదాల్లాంటివి ఎక్కువగా లేకుండా, మరీ archaic English పదాలు లేకుండా హాయిగా చదువుకునేలా కొనసాగింది. ఆవిడ పుస్తకం చివర్లో ఇచ్చిన నోట్స్ లో కొన్ని ఉదాహరణలు ఇచ్చారు: రజస్వలకి ‘she was having her period’, రథవీరన్‍కి ’a warrior who masters fighting from a chariot.’ ఆయన వాడే గ్రామీణ ప్రాంతపు మలయాళం ఎటూ అనువాదంలో కోల్పోతుందని గుర్తుచేశారు. అయితే, అది పోయినా కూడా, ఆంగ్లానువాదంలో రాజరికపు భాష కనబడలేదు. దానివల్ల కథను ఎవరు, ఎలా చెప్తున్నారన్న దాంట్లో తేడాలు రాలేదు.

పైన నేను కోట్ చేసిన కుంతీ-భీముల సంభాషణ ఆంగ్లానువాదంలో ఇలా ఉంటుంది:

“Blockhead, when I asked all of you to share the alms, I knew it was Draupadi!”

I felt sorry for having been such a weakling before Mother. Then a laugh suddenly broke out of me.

“Women have been described in so many ways: as wombs that receive seed, fields meant only for sowing and so on. You who described them thus, you have not seen this woman, my mother!”

Bhima, The lone Warrior.

భారతీయ భాషల్లో ఉన్న వెసులుబాటు ఈ ఉదాహరణ వల్ల అర్థమవుతుందనుకుంటాను. కన్నడలో భాషలోని మట్టివాసన (earthiness) ఇంకా బాగా తెలుస్తుంది. ముఖ్యంగా భీముణి ఆంతరంగిక మాటల్లో! మిగిలిన పాత్రలూ అలానే ఉంటాయి. కన్నడంలోనూ భారీ సంస్కృత పదాలు కనిపించలేదు. వాక్యం సరళంగానే ఉంది.

నేను చదివిన రెండు అనువాదాలు:

Bhima, The lone warrior. Translated by Gita KrishnanKutty. Published by: Harper Perennial. (Amazon link)

భీమాయణ (కన్నడ అనువాదం: సి. రాఘవన్. కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురణ)

నోట్: భీమాయణ నుండి కోట్ చేసినవి నా అనువాదం.

You Might Also Like

3 Comments

  1. leol

    మంచి పరిచయం. ఈ పుస్తకం ఆంగ్లానువాదం చదివాను. చక్కని అనువాదం. మహాభారతంలో మాయలూ, మంత్రాలు తీసివేస్తే నిజంగా యిలాగే వుంటుందా అనిపించింది. అలాగని ఎక్కడా, ఎవరినీ కించపరచడం లేదు. ఎమ్.టి. వాసుదేవన్ నాయర్ రచనలు, గీత కృష్ణన్‍కుట్టి అనువాదాలు మరేవైనా ఆంగ్లంలో ఉన్నాయా అని ఆసక్తిగా వెతికాను కానీ ఏమీ దొరకలేదు.

  2. Purnima

    శ్రీనివాస్ గారు,

    మీరు ఈ పుస్తకం చదవండి వీలైనంత త్వరగా. మనం చర్చాగోష్ఠి పెట్టుకుందాం మన స్టైల్ లో. జూమ్ లు గత్రాలు లేని రాతియుగం స్టైల్ లో. 🙂

    నేను పూర్తి చేయగల పుస్తకాలే ఎన్నుకుంటున్నాను. వాక్యనిర్మాణం సరళంగా ఉంటే, ఎన్ని పదాలైన డిక్షనరీలో వెతుకుతూ చదువుకుంటున్నాను. Lots of miles to cover though! మీరు కన్నడ నేర్చుకోవడం మొదలెడితే మనం బోలెడు కలిసి చదువుకోవచ్చు. I’m excited. 🙂

  3. Srinivas Vuruputuri

    కొంతకాలం క్రితం ఈ పుస్తకానికి ఆంగ్లానువాదం కొన్నాను. ఓ రెండు అధ్యాయాలు చదివాక గొల్లభామలాగా మరో పుస్తకం మీదికి ఎగిరిపోయాను. పుస్తకాలు చదివేంత కన్నడం నేర్చుకున్నారా మీరు? అభినందనలు. నా 2021 తీర్మానాల్లో ఒకటిగా కన్నడం నేర్చుకోవడాన్ని చేర్చుకుంటాను.

Leave a Reply