మాసీమలో చేవగల పద్యకవులు

మాసీమ అనేది రాయలసీమ ఉద్యమనేత రాచుపల్లి రాజగోపాల రెడ్డి 1971-77లలో కడప నుంచి వెలువరించిన ఒక పక్షపత్రిక. అప్పట్నుంచి “మాసీమ” అనేది ఆయన ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. బహుశా కడప నుంచి సుదీర్ఘ కాలం వెలువడిన పత్రిక ఇదేనేమో! ఇదే పుస్తకంలో రచయిత ఒకచోట అన్నట్లు “అదేమి దౌర్భాగ్యమో గాని కడప జిల్లాలో ఏ పత్రిక కూడ పదికాలాల పాటు ప్రజల పత్రికగా మనుగడ సాగించలేదు.”

ముందుమాట “మనవి”లో చెప్పిన ప్రకారం ఆ పత్రికలో జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు “మాసీమ కవులు” శీర్షికతో రాయలసీమకు చెందిన 20వ శతాబ్దపు కవుల గురించి ధారావాహికంగా రాశారు. వాటిలో 30 మంది కవి పరిచయాలతో కూర్చిన పుస్తకం “మాసీమ కవులు”. కవులందరూ పద్యకవులే. 1973లో ఈ పుస్తకం వెలువడేనాటికి రెండేళ్ళలో బహుశా దాదాపు యాభై మంది కవుల పరిచయాలు రాసి ఉంటారు. “ప్రచురింపబడుచున్నవి” అన్నారు కాబట్టి మరిన్ని రాసి ఉంటారని భావించవచ్చు.

ఈ పరిచయాల్లో కొన్ని అప్పటికే మరికొన్ని పత్రికల్లో పునర్ముద్రితమైనాయి. ఇది మొదటి భాగం మాత్రమేనని, రెండవ సంపుటిలో మరికొందరు కవులను గూర్చి రాయదలచినట్లు తెలుపుతూ, ఇది సమగ్రమైన కృషి కాదని, తొలిమెట్టు మాత్రమేనని వినయపూర్వకంగా పేర్కొన్నారు. కానీ రెండవ సంపుటి రాలేదు.

కవుల పేర్లు: వావిలికొలను సుబ్బారావు, జనమంచి శేషాద్రిశర్మ, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావు, కట్టమంచి రామలింగారెడ్డి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ, దుర్భాక రాజశేఖర శతావధాని, గడియారం వేంకటశేషశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు, కొడవలూరు రామచంద్రరాజు, కామరాజు సీతారామకవి, కసిరెడ్డి వేంకటసుబ్బారెడ్డి, వేదం వేంకటకృష్ణశర్మ, నారు నాగనార్య, కలుగోడు అశ్వత్థరావు, కల్లూరు వేంకట నారాయణరావు, బెళ్ళూరి శ్రీనివాసమూర్తి, జనమంచి వేంకట సుబ్రహ్మణ్య శర్మ, మద్దులపల్లి సుబ్రహ్మణ్యశాస్త్రి, జోస్యం జనార్ధనశాస్త్రి, అనుముల వేంకట శేషకవి, ఉప్పలపాటి వేంకట నరసయ్య, భాస్కరాచార్య రామచంద్రస్వామి, సి. వి. సుబ్బన్న శతావధాని, వై. సి. వి. రెడ్డి, పాలా వేంకట సుబ్బయ్య, గంటి కృష్ణవేణమ్మ, షేక్ దావూద్ కవి, పిడతల చిన్న వేంకట సుబ్బయ్య.

కవుల పేర్లను రాయడంలో నేను గమనించింది జానమద్ది గారు పాటించిన రెండు పద్ధతులు: శర్మ, శాస్త్రి, రెడ్డి, రావు, రాజు లాంటివాటిని విడి పదాలుగా కాకుండా ముందున్న పదంతో కలిపి ఇవ్వడం ఒకటి. పేరులో వేంకట/వెంకట అని ఉన్నవాళ్ళు తమ తమ పేర్లను ఎట్లా రాసుకునేవాళ్ళో తెలియదుగానీ ఇక్కడ మాత్రం “వేంకట” అని ఇవ్వడం ఒకటి.

జానమద్ది గారు ఆయా కవుల రచనా శైలి, కావ్యాల విశిష్టత గురించి సోదాహరణంగా, సవివరంగా వారి కావ్యకృతుల నుంచి పద్యాలను తీసుకుని వివరిస్తూ, దానితోబాటే క్లుప్తంగా వారి జీవిత విశేషాలు చేర్చి ఒక్కొక్కరి గురించి సుమారుగా ఆరేడు పేజీల్లో పరిచయం చేశారు. పుస్తకంలోని భాష సరళ గ్రాంథికం.

ఈ కవుల ఎంపిక ప్రాంతం ప్రాతిపదికనే జరిగినా కొందరి విషయంలో ఏ జిల్లా/ఊరివాళ్ళు అని విడదీసి చూడడం సాధ్యమూ కాదు, ఆ అవసరమూ లేదనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళలో కొంతమంది ఒక ప్రాంతం నుంచి ఇంకొక చోటికి పోయి స్థిరపడినవాళ్ళు.

ఉదాహరణకు పుట్టపర్తివారు అనంతపురం జిల్లా చియ్యేడులో పుట్టి పెనుగొండ నుంచి ప్రొద్దటూరు మీదుగా కడపకు వచ్చి స్థిరపడ్డారు. “ఆంధ్ర వాల్మీకి”, “వాసుదాసు” గా ప్రసిద్ధికెక్కిన వావిలికొలను సుబ్బారావు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మద్రాసు, ఒంటిమిట్ట, తర్వాత గుంటూరు జిల్లా అంగలకుదురు చేరారు. రాయలసీమ కవుల్లో బహుశా అత్యంత నాటకీయ పరిణామాలతో నిండిన జీవితం, రసప్లావితమైన ఒక కావ్యరచనకు లేదా ఇప్పటి ట్రెండును బట్టి బయోపిక్ తీయడానికి వస్తువు కాదగ్గ జీవితం ఆయనది.

ఈ ముప్ఫై మంది కవుల్లో ఏకైక మహిళ గంటి కృష్ణవేణమ్మ. పుట్తపర్తి కనకమ్మ, మరికొందరి పేర్లు బహుశా రెండో భాగం ప్రచురించినట్లైతే దాంట్లో వచ్చేవేమో! కృష్ణవేణమ్మ గారు ముప్ఫయ్యవ యేట వైధవ్యం సంప్రాప్తించిన తర్వాత తల్లడిల్లిన మనసును కావ్యపఠనంతో, రచనతో కుదుటపరచుకోవడానికి ప్రయత్నించి, తన భర్త గంటి వేంకటసుబ్బయ్య అసంపూర్ణ రచన కవులుట్ల చెన్నకేశవ శతకాన్ని పూర్తిచేసి మరికొన్ని కావ్యాలు రచించారు.

ఈ గ్రంథ రచనకు అవసరమైన సమాచార సేకరణలో సహకారం అందించిన వారు రచయితలు పి. రామకృష్ణారెడ్డి, మల్లెమాల వేణుగోపాలరెడ్డి, వై.సి.వి. రెడ్డి, హైస్కూల్లో మాకు తెలుగు నేర్పిన మల్లేల నారాయణ సారు.

ఈ పుస్తక రచయిత, ప్రచురణకర్తలు, ముద్రాపకులు, పంపిణీదారులు అందరూ కడపవాళ్ళే. ముఖచిత్రం గీసిన పి. డి. బాలసుందరం మాత్రం చిత్తూరు జిల్లావారు అనుకుంటున్నాను. పుస్తకం వెల 6/- కానీ ఇప్పుడు కొనడానికి ఎక్కడా దొరకదు.

Update: రీప్రింటు వచ్చింది. కవర్ పేజీ కింద చూడవచ్చు.

You Might Also Like

One Comment

  1. త్రివిక్రమ్

    ‘ఇప్పుడు కొనడానికి ఎక్కడా దొరకదు’ అన్నాను. అది తప్పు. బ్రౌన్ లైబ్రరీ వాళ్లు 2021లో రీప్రింట్ చేసినారు. నాలుగు జిల్లాల రాయలసీమ మ్యాపు ముఖచిత్రంగా ఉంది. కవర్ పేజీ డిజైన్ చేసింది చదలవాడ వెంకటేశ్. పుస్తకం వెల ₹125.

Leave a Reply