పుస్తకం
All about booksఅనువాదాలు

July 14, 2011

Seeing. – Saramago

More articles by »
Written by: Purnima
Tags:
కొందరు పిల్లలు ఎంచక్కగా తమకు తోచిన రీతిన ఒక భవనాన్ని కట్టుకుని అందులోనే నివాసం ఉంటున్నారు. అందులో ఒకడు, ఆ భవనాన్ని తన సూక్ష్మదృష్టితో పరికించి, తనకున్న పరిజ్ఞానాన్ని జోడించి ఆ భవన నిర్మాణపు తాలూకా ప్రతి చిన్న విషయాన్నీ తెల్సుకున్నాడు. ఇప్పుడతని ముందున్న కర్తవ్యం ఆ భవనమెంత డొల్లో నిరూపించడం. అదేం అహంకారపు చర్య కాదు. కొన్ని ప్రమాణికాలు పాటించకపోతే ఆ భవనంలో ఉండడమెంతటి హానికారకం కాగలదో చెప్పటం. ఉండడానికి ఈ భవనానికి మంచి పేరే ఉన్నా, ఇందులో లొసుగొలూ ఉన్నాయని చెప్పటం. అందుకని ఈ కుర్రవాడు, అదే భవనాన్ని కూల్చకుండా ఒక నమూనా భవనాన్ని తీసుకొని అందులో భవనం మొత్తానికి కీలక ఆధారమైనదాన్ని కొంచెంగా జరిపి, పక్కకు తప్పుకొని, భవన పతనాన్ని స్లో మోషన్ కెమరాలో బంధించాడు. ఆ భవనం పేరు “డెమోక్రసీ”. రికార్డింగ్ పేరు “సీయింగ్” అనే నవల. ఆ కుర్రాడు, విశ్వవిఖ్యాత సరమాగో!

స్థూలంగా “సీయంగ్” అనే నవల కథాంశం ఇంతే! ప్రజలచే, ప్రజల కొరకు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల పని(చేయని)తీరుని హైరానాలు పడకుండా నింపాదిగా విమర్శించటం జరుగుతుంది. ఎన్నుకోబడేంతవరకే మీరు మా దేవుళ్ళు, ఎన్నికైనాక మీకూ మాకూ సంబంధాలేం ఉండవన్నట్టు వ్యవహరించే ప్రభుత్వాల పరిపాలనలో ఉన్నవారికి “మన కథే!” అనిపించే గాథ. ఒక కీలక నిర్ణయానికి అవునో, కాదో చెప్పటానికి ’ఇంకీ, పింకీ, పాంకీ’ అంటూ ఆటలాడుతున్నట్టుండే ప్రజాప్రతినిధులతో వేగే ప్రజల జీవనచిత్రాలకు దగ్గరపోలికలున్న చిత్రవిచిత్రాలు ఇందులో బోలెడు. బానిసత్వానికన్నా దుర్భరమైనది, బహుశా, తమ వేలే తమని పొడిచిందని తెల్సి కూడా ఏం చేయలేకుండా ఉండిపోవడం అని నాకనిపిస్తుంది. ఇలాంటి భావోద్వేగాలెన్నింటినో రేగొట్టే పుస్తకం ఇది.

సరమాగో రాసిన “బ్లైండ్‍నెస్” నవలకు సీక్వెల్ ఈ రచన. మొదటి నవల్లో ఓ పేరు లేని దేశంలో ఉన్నట్టుండి “శ్వేత అంధత్వం” (అంటే చిక్కటి పాల నురుగులాంటి వెలుగు తప్ప మరేం కనిపించకపోవటం) అనే అంటువ్యాధి ప్రబలి దేశం మొత్తంగా అంధులై పోతారు, ఒక్క ఆడమనిషి తప్ప. అంటువ్యాధిని నివారించడానికి అప్పటి ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్లో ఒకటి, అంధులైనవారందరినీ ఊరికి దూరంగా ఒక భవనంలో నిర్భంధించటం. అలా నిర్భంధానికి గురైన మనుషుల దినచర్యలూ, అక్కడ చోటు చేసుకున్న పరిణామాలన్ని తక్కిన కథ! ముందు జాయ్-జాయ్ మని చదివింపజేసే కథ, మధ్యలోకి వచ్చేసరికి కొనసాగించేందుకు భయం, జుగుప్స కలిగేంతగా మారిపోతుంది. ముగింపులో ఎలా వచ్చిందో ఆ అంటువ్యాధి, అలానే చక్కా పోతుంది.

రెండో నవల, వ్యాధి మాయమైన నాలుగు సంవత్సరాలకు అదే దేశంలో మొదలవుతుంది. ఒక రోజున హోరున వాన పడి ఇళ్ళు కదిలే వీలులేకుండా ఉంటుంది. కాని, అదే రోజున ఎన్నికలు జరుగుతున్నాయి. వర్షాన్ని అధిగమించి ఓటు వేసే పౌరుడు కనిపించడు. సాయంత్రానికి తెరిపినివ్వటం వల్ల జనాలు తండోపతండాలుగా వచ్చి ఓట్లు వేస్తారు. ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. అనూహ్యంగా అన్ని పార్టీలకు వచ్చిన ఓట్ల సంఖ్య కన్నా ఎక్కువగా “బ్లాంక్ ఓట్లు” ఉంటాయి. అది గమనించి, ఏదో మతలబు జరిగిందని గ్రహించి, మళ్ళీ ఎన్నికలు పెడతారు. ఈసారి ముందు కన్నా ఎక్కువ బ్లాంక్ ఓట్స్ వేయబడతాయి. ప్రజానాయకులకు మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇదెలా జరిగిందో కనుక్కోమని ఓటర్ల పై నేరుగా వత్తిడి తీసుకొస్తారు. అది పనిజేయకపోవడంతో అలా ఓట్లేసిన ప్రాంతం నుండి ప్రభుత్వాన్ని తప్పించి, కనీస సదుపాయలను కూడా కల్పించకుండా ఆ ప్రాంత ప్రజలను ఆ ప్రాంతంలోనే బంధించినట్టు చేస్తారు. దాని వల్లా ఈ కుట్రకు మూలమేమిటో తెలీదు. అప్పుడు, ఆలోచనలకు అందని విధివిధానాలను అనుసరించిన రాజకీయ నాయకుల పుణ్యామా అని నేరం, బ్లైండ్‍నెస్ నవల్లో అంధత్వం సోకని మహిళను చుట్టుకుంటుంది. అధికారులకు ఆమెది తప్పులేదని తెల్సు? మరి కాపాడగలిగారా? లేదా ఆమె తప్పుందా? ఇంతకీ ఏమయ్యింది? – ఇవ్వన్నీ ఈ నవలను పూర్తిచేస్తాయి.

“రాయడం పెద్ద ఏముంది చెప్పండి. ఒక ఆలోచన వస్తుందా? దాన్ని చుట్టూ ఊహాలల్లేసుకొని వాటిని కాగితం మీద రాయడమే” అని తేలిగ్గా చెప్పగల రచయిత ఊహాశక్తిని దగ్గరగా చూస్తే అబ్బురమనిపిస్తుంది. ప్రపంచానికి ఒక నమూనా సృష్టించి, అందులో కీలకాంశాల చేత విరుద్ధంగా పనులు చేయించి, దాని వల్ల కలిగే దుష్పరిణామాలను ఒక రకమైన డిటాచ్‍మెంట్‍తో చెప్పుకొస్తారు కథలను. అవసరమైన చోట్ల మోతాదు మించని హాస్యం ఎటూ ఉంటుంది. గజిబిజి గందరగోళపు వాతావరణంలోనూ లాజికల్‍గా ఆలోచించి అడగదల్చుకున్న ఏ ప్రశ్నకైనా సమాధానం సిద్ధంగా ఉంటుంది రచనలోనే. కథనం పరుగులు పెడుతూనే ఉంటుంది. ఇంత మాహాద్భుతంగా ఎలా రాస్తారని అడిగితే మాత్రం, “రాసేయ్యడమే!” అని సెలవివ్వగల జీనియస్.

మాజిక్ రియలిజమ్ అంటే ముందుగా వినిపించే పేరు మార్క్వెజ్. ఇక పై నా జాబితాలో మొట్టమొదటుండే పేరు: సరమాగో!

సరమాగో రాసేలాంటి వచనం మరెవ్వరూ రాయరు. ఆయన పంక్చువేషన్ విభిన్నంగా ఉంటుంది. అలవాటు పడితే గాని చదవటం చాలా కష్టం. వాక్యం ఎక్కడ ఆగుతుందో, ఎక్కడ ముగుస్తుందో, ఏ పాత్రల గొంతులు వస్తున్నాయో గమనించుకోవటం కష్టం. అందులోనూ పేజీలకు పేజీలు నడిచే పేరాలున్నప్పుడు. “నా కథలు చదవటం కష్టమని అంటుంటారు. నేను ’చెప్తున్న’ ధోరణిలో రాస్తాను కాబట్టి, పైకి చదువుకుంటే వీలుగా ఉంటుంది” అని ఆయన సలహా! దాన్ని పాటించి, కిండిల్‍లో టెక్ట్స్ టు స్పీచ్‍లో ఈ నవలను విన్నాను. బాగనిపించింది. కాకపోతే, అప్పటికే ఆయన వచనం కళ్ళకి బాగా అలవాటయ్యిపోయుండడం వల్ల ఎక్కువ సేపు కళ్ళు మూసుకొని ఉండలేకపోయాను.

తమ సిద్ధాంతాలను పాఠకుల మీదకు రుద్దడం కోసమో, ఈ లోకం నచ్చకనో, మెచ్చకనో, కనీసం పుస్తకాల్లో అయినా అవధుల్లేని ఆనందాలని అందించాలనో కాల్పనిక సాహిత్యాన్ని చేపట్టే రచయితలు చాలా మంది. కాని, చెహొవ్ అన్నట్టు మన జీవితాలెంతటి దుర్భరమైనవో, మన బతుకులనెట్లా ఈసడించుకుంటూ ఈడ్చుకొస్తున్నామో తెలియజేయటానికి ఊహాశక్తికి పదునుపెట్టి, మాటల ఉలితో చెక్కి మనోహరమైన రచనలు సృష్టించే అరుదైన జాతికి చెందిన రచయిత సరమాగో! ఈయన రచనలు చేయడం సాహిత్యలోకపు అదృష్టం.

సరమాగో అభిమానులకు ఆయన నవలల కలక్షెన్ కిండిల్ బుక్ రూపేణ వచ్చింది. అమెజాన్‍లో లభ్యం.
పుస్తకం.నెట్లో సరమాగో పుస్తక పరిచయాలు: బ్లైండ్‍నెస్, డెత్ ఎట్ ఇంటర్వెల్స్.


About the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..3 Comments


 1. Madhu

  Very good. Feel like reading it after reading this brief introduction.


 2. My bad. Corrected now. I meant, మించని. Saramago is subtle with his humour and sarcasm.

  Pardon me for the typos.


 3. Ramesh

  మరొక మంచి పరిచయం, పుస్తకం చదవాలనిపించేలా.
  @అవసరమైన చోట్ల మోతాదు మించిన హాస్యం ఎటూ ఉంటుంది.
  అవసరమైన చోట్ల, మోతాదు మించిన, ఎటూ – ఎంటో, ఇవి ఒక వాక్యం లో ఉంటే అర్ధం చేసుకోవటం కొంచెం కష్టంగా ఉందండి.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Saramago’s The Gospel According to Jesus Christ

కథ ఎవరిది? దాన్ని ఎవరు చెప్తున్నారు? అన్న రెండు ప్రశ్నలకు వచ్చే సమాధానల బట్టి ఇంకెన్...
by Purnima
2

 
 
మృత్యువుకు జీవం పోసి..

మృత్యువుకు జీవం పోసి..

మృత్యువు అన్న పదం వినగానే మీకు తొట్టతొలుత కలిగే భావమేమిటి? భయం? కోపం? నిర్లిప్తత? వైర...
by Purnima
2

 
 
BLINDNESS – Jose Saramago

BLINDNESS – Jose Saramago

ఒక్కో పుస్తకం మిగిల్చే అనుభవం ఒక్కోలా ఉంటుంది. కొన్ని పుస్తకాలు మన చుట్టూ ఉన్న లోకా...
by Purnima
3