రహస్య తంత్రి

వ్యాసకర్త: ఎ.కె. ప్రభాకర్

(రవి మారుత్ కవితా సంపుటి ‘క్రోధోద్రిక్త స్వరం’ కి ముందుమాట )

**************

కవి సమాజంలోకి ప్రవహిస్తున్న కొద్దీ సమాజంలోని అలజడి కవి అంతరంగంలోకి యెదురెక్కుతుంది. రెక్కలు విచ్చుకొని చెక్కర్లు కొడుతుంది. లోపలి గోడల్ని రాపాడుతుంది. గుండెని మెలిపెడుతుంది. అక్కణ్ణుంచీ అది పాములా జరజరా ఆణువణువూ పాకుతుంది. కుమ్మరి పురుగులా తొలుస్తుంది. వెయ్యికాళ్ల జెర్రిలా కదులుతూనే వుంటుంది. యిహ అది కవిని కూర్చోనీదు నించోనీదు నిద్రపోనీదు వూపిరి తీసుకోనీదు. కవిలో దాచుకున్న అణచుకున్న పోగుపడ్డ నిక్షిప్తమైన సమస్త వుద్వేగాలు కోపాలు దుఃఖాలు ఆనందాలు అవమానాలు ఆవేదనలు ఆక్రోశాలు యితరేతర మనోవ్యాపారాలన్నీ యెక్కడో వొకచోట యెప్పుడో వొకప్పుడు వెల్లువై దుంకుతాయి. గట్టు తెగిన ఆ వెల్లువే యే కొందరిలోనో బలమైన కవిత్వ రూపంలో ఆవిష్కారమౌతుంది. అప్పుడు అదొక విద్యుత్తరంగమై ప్రసరిస్తుంది. నిజానికి కవిత్వం యేకకాలంలో విద్యుత్తు విద్యుద్వాహకం విద్యుజ్జనకం కూడా. అయితే అది దేనిద్వారా దేన్ని ప్రవహిస్తుంది యెక్కడ యెందుకు యెలా పుడుతుంది దాని గమనం యేమిటిగమ్యం యేమిటి అనేవి కవి దృక్పథాన్ని బట్టీ చైతన్యాన్ని బట్టీ నిర్ధారితమౌతాయి. వీటిని గ్రహించడానికి కవి నిర్మించుకున్న రూప సారాలే ప్రాథమికమైన ఆధారాలు. కవినీ కవి జీవించిన సమాజ చలనాన్నీ కవి లోపలి కల్లోలాన్నీ విడివిడిగా గాక కలివిడిగా చూడటానికి వుపయోగపడే ప్రధానమైన ఆకరాలు కూడా అవే.

రవి మారుత్ కవిత్వ ఆవరణలోకి ప్రవేశించడానికి దారి వెతుక్కునే క్రమంలో జీవితం గురించి అతని ‘ఆకళింపు’నీ సమాజం పట్ల అతని యెరుకనీ మానవ సంబంధాల పట్ల అతను యేర్పరచుకొన్న అవగాహననీ స్థూలంగా కవిగా అతని ప్రాపంచిక దృక్పథాన్నీ పట్టి యిచ్చే పంక్తులు అనేకం గోచరించాయి. అవన్నీ సూచ్యంగానో వాచ్యంగానో ప్రతీకలతోనో ఆలంకారికంగానో అతని జీవిత నేపథ్యాన్నీ అది అందించిన వూర్ధ్వ ముఖ చైతన్యాన్నీ తద్వారా సంతరించుకున్న సంస్కారాన్నీ సమగ్ర ఆలోచనా విధానాన్నీ తేటతెల్లం చేస్తున్నాయి.

ప్రజలను ప్రేమించి చూడు

గోడలను అక్షరాలు ముద్దాడతాయి

కాగితాలు కవిత్వంగా మొలకెడతాయి

ఊహలు ఉద్యమాలుగా ఊయలలూగుతాయి.

(ఆకళింపు)

ప్రజల్ని ప్రేమించడమనే మౌలిక భావన యీ కవిత్వమంతటా చిక్కగా ఆల్లుకొని వుంది. ఆ భావనే ప్రతి కవితనీ మానవ సంవేదనలతో నింపడానికి దోహదం చేస్తుంది. గోడమీది నినాదాన్ని గుండెపై చెక్కుకోగల సున్నితత్వం వుండబట్టే కవిగా రవి మనిషి సామూహిక వేదనని అక్షరీకరిస్తున్నాడు. చరిత్ర పొడవునా ప్రజా వ్యతిరేక విధానాలకు కారణమైన అడ్డగోలు వ్యవస్థల్ని తీవ్రంగా ద్వేషిస్తున్నాడు. ఉద్యమాల పొత్తిళ్ళలో కన్ను తెరచినందువల్లే గతించిన జీవితాన్ని, నడిచిన దారుల్ని నెమరువేసుకుని కరిగించిన కాలాన్ని సమీక్షించుకుని, కళ్ళముందు పాతుకుపోతున్న చీకటి రాజ్యాన్ని ధిక్కరిస్తూ కవిత్వమై ‘క్రోధోద్రిక్తస్వరం’ వినిపిస్తున్నాడు.

రాజకీయ దళారుల సహాయంతో విస్తరిస్తున్న కార్పోరేట్ పెట్టుబడి జాతీయవాదం పేరుతో అమలవుతున్న ఛద్మ దేశభక్తి మతోన్మత్తత ఐక్యమై పరస్పరం పోషించుకుంటూ నియంతృత్వ స్వభావాన్ని సంతరించుకుంతున్నప్పుడు, వొకడి మాటే చెల్లే రాజ్యం ఫాసిస్టు రూపంలోకి తర్జుమా అవుతున్నప్పుడు, పీడిత ప్రజల పక్షంలో నిలబడిన బుద్ధిజీవులు జైళ్లలో మగ్గుతుంటే కిరాయి హంతకులు నాయకులై వీథుల్లో పట్టపగలు హింసాత్మక రాజకీయాలు నెరపుతున్నప్పుడు, శిక్షాస్మృతి ప్రజాస్వామిక స్వభావాన్ని కోల్పోయి ప్రతిఘటన స్వరాల్ని అణచివేయడానికి పాలకుల చేతిలో ఆయుధంగా మారినప్పుడు మౌనంగా వూరుకోలేనితనం నుంచి పుట్టిన కవిత్వం యిది. కవే చెప్పుకొన్నట్టు ‘అసంకల్పిత ప్రతీకార చర్య’ గా వెలికి వస్తోంది. రాజకీయ ప్రత్యామ్నాయ మార్గాలకు మద్దతుగా గొంతు సవరించుకొంటుంది. బాధితుల సామూహిక స్వరాన్ని వినిపిస్తోంది.

***

రవిది స్థూలంగా గతితార్కిక ఛారిత్రిక భౌతిక వాద దృష్టి. మనిషి మనిషిగా మారడానికి కారణమైన మానవ వికాస దశల పట్ల అతనికి స్పష్టమైన అవగాహన వుంది. పారిస్ కమ్యూన్ రష్యా అక్టోబర్ విప్లవం చైనా లాంగ్ మార్చ్ తెలంగాణ సాయుధ పోరాటం వియత్నాం యుద్ధం నగ్సల్బరీ వసంతమేఘ గర్జన శ్రీకాకుళం రైతాంగ ఉద్యమం చూపిన తోవలో నేర్చిన చారిత్రిక పాఠాల స్పృహ వుంది. అందిపుచ్చుకున్న సామాజిక వారసత్వం వుంది. సమ్మిళిత చేతన వుంది. నిరంతర అధ్యయనం వుంది. పోరాట శక్తులతో వీడని బంధం వుంది. అందుకే పెట్టుబడులు చుట్టుముట్టిన జీవితంలో ఉపయోగపు విలువ అమ్మకపు విలువగానో అదనపు విలువగానో మారుతోన్న వైనాన్ని తెలుసుకోగలిగాడు. శ్రమదోపిడీ మూలాల్ని పట్టుకోగలిగాడు. ఉత్పత్తి శక్తులపై ఆధిపత్యాల్ని ప్రశ్నించగలిగాడు. ఉత్పత్తి సాధనాల్ని అదుపుచేసే పెట్టుబడిదారీ వ్యవస్థ వికృత రూపాన్ని చూడగలిగాడు. ప్రాకృతిక వనరుల్ని సరుకుగా మార్చి సర్వం వ్యాపారంగా మార్చగల దుర్మార్గాన్ని బహిరంగం చేయగలిగాడు. మనిషి పరాయీకరణ పునాదుల్ని లోతుల్లోకి వెళ్లి అట్టడుగు తలాన్ని తాకగలిగాడు.

శాస్త్రానికి ధర నిర్ణయించాకా, ప్రాణం వస్తువయ్యాకా, సుఖానికి ఖరీదు కట్టాకా, ప్రజాస్వామ్యం కొనుగోలు రాజకీయమయ్యాకా, మనిషి సరుకయ్యాకా, బతుకు బజారయ్యాకా, దేశం మొత్తం మార్కెట్టయ్యాకా మానవీయ విలువలన్నీ కనుమరుగైపోతాయని నిర్ధారించ గలిగాడు (సుదీర్ఘ నిశ్శబ్దం). ‘వినిమయ సాగరంలో విస్తరించే గుర్రపు డెక్క సామాజిక సంబంధాల రసం పీల్చి’ పిప్పిచేసే వైనాన్ని పసిగట్టగలిగాడు. నియంతృత్వం మతవాదం నిర్బంధాలు యుద్ధాలు అన్నీ క్షుద్ర రాజకీయాలకు కొనసాగింపుగా చూడగలిగే యెరుకతో రాజ్య స్వభావాన్ని అంచనా కట్టగలిగాడు. ఆహార సేకరణ పశుపోషణ దశల నుంచీ యేకధ్రువ సామ్రాజ్య ప్రపంచంలో యెక్కడైనా ఎప్పుడైనా ఆక్రమణలు అంతర్యుద్ధాలు తిరుగుబాట్లు స్వాతంత్ర్య పోరాటాలు విమోచనోద్యమాలు విప్లవాలు ప్రపంచ యుద్ధాలు అణ్వాయుధాలు రాజ్యం పరిష్కరించలేని వైరుధ్య ప్రతిబింబాలేననీ, జర్మన్ ఘెట్టోలు జలియన్ వాలా బాగ్ నరమేధాలు రువాండా జన హననాలు వియత్నాంలో బాంబుల వర్షాలు ఆఫ్ఘన్ లో ఆయుధ వ్యాపారం సిరియా శరణార్థుల ఆక్రందన రాజ్యం చేసిన వికృత విన్యాసాల ప్రతిఫలనాలేననీ వెర్రిగొంతుక విచ్చి పలికాడు(అమూర్తం). పెట్టుబడుల రాజ్యమే సమస్త దుఃఖాలకూ కారణమని నమ్మాడు. అభివృద్ధిని రాజ్యం ప్రజలపై చేసే యుద్ధంగా తీర్మానించాడు. అంతిమంగా రాజ్యమే రద్దు కావాలని ప్రకటించగలిగాడు. మానవ జీవితాల్ని మురికివాడలుగా మార్చిన పారిశ్రామిక పెట్టుబడులు, భూమిని చెరబట్టి రక్తంతో రాజ్యాలకు అభిషేకించిన సామ్రాజ్యాలు ధ్వంసంగాక తప్పదని హెచ్చరిస్తున్నాడు. రాజుని చావు పుటుకల మధ్య చెక్కిన చారెడు చరిత్రగా కుదించాడు.

అంతేకాదు; రవికి ‘చూపుడు వేలు చివర చెవి ఆనించి విన’గల మనస్సు వుంది. అందుకే భారతీయ సమాజాన్ని కుల వర్గ సమాజంగా గతితార్కికంగానే గుర్తించాడు. వర్గంలో కులాన్నీ కులంలో వర్గాన్నీ చూడ గలుగుతున్నాడు. భిన్న సామాజిక అస్తిత్వాలు పరస్పరం ఘర్షణపడుతూనే ఐక్యం కావలసిన వర్తమాన చారిత్రిక కర్తవ్యాన్నీ అనివార్యతనీ గ్రహించగలుగుతున్నాడు. దాన్నుంచీ వొక సాహసోద్యమ స్వప్నాన్ని కవిత్వంగా ఆవిష్కరిస్తున్నాడు. రాజ్యాంగం ఆలోచనని రాజ్య శత్రువుగా వెంబడిస్తున్న వేళ కవిగా నిటారుగా నిలబడే ప్రయత్నంలో మన మధ్యకు వస్తున్నాడు. అందులో భాగంగానే –

‘ఉడక బెట్టిన మైదాని మనసంతా పులుముకొని నిరసన శాసనాల్ని ముద్రించిన వేడి ఎగపోతనీ నిషేధాల నడుమ ఎలుగెత్తి పాడుకున్న ఉడుకు నెత్తుటి పాటనీ’ నెమరువేసుకుంటున్నాడు. ఆ ‘నెమరువేత’ కేవలం నాస్టాల్జియా కాదు. దాన్నుంచి అతను స్వయం స్ఫూర్తిని పొందుతున్నాడు. ఆ స్ఫూర్తి నుంచి వర్తమానాన్ని రాజకీయంగా వ్యాఖ్యానిస్తున్నాడు. అనేక కారణాల వల్ల ‘క్రోధోద్రిక్త స్వరం’ అచ్చంగా నూటికి నూరుపాళ్ళూ వర్తమాన కవిత. అది యెంత అంతర్జాతీయమో అంత జాతీయమూ స్థానికమూ. సైబీరియా యెడారీ నమీబియా యిసుక ప్రాంతాలు మిస్సిసిపీ మైదానాలూ సిమికోట్ పర్వత శ్రేణులు బోట్స్వానా బురద నేలలు నుంచీ వైగేయీ నదీతీరాలు ఉత్తరాంధ్ర బీల భూములు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ తిలక్ రోడ్ సారస్వత పరిషత్ వరకు అన్నీ కవి సమయాలే. మౌర్యులు మొఘలుల నుంచి యుపియే ఎన్డీయేల వరకూ ‘హింసానల దగ్ధ చరిత్ర’ని కవిత్వ మాధ్యమంగా నమోదు చేయడంద్వారా రవి మారుత్ గత వర్తమానాల మధ్య వొక బలమైన వారధి నిర్మిస్తున్నట్లు గమనించగలం.

లింకన్ అంబేడ్కర్ మార్టిన్ లూథర్ ఏం చెప్పినా

ఏసోబులు ఫ్లాయిడ్ లు హత్య చేయబడతారు

వాళ్ళ ‘ఊపిరి’ ఉద్యమాలుగా ఉదయిస్తూ ఉంటుంది.

(వ్యవస్థీకృతం)

అన్నప్పుడు, డాలర్ల వేటలో బతుకు దారి తప్పిన చదువుల్ని తిరస్కరించినప్పుడు, తూత్తుకుడి మట్టిపై ఉల్కల్లా రాలిపడ్డ ప్రాణాల్ని ఆవాహన చేసుకున్నప్పుడు, ఇంద్ర ధనుస్సులో వర్ణ వైవిధ్యాన్ని గుర్తించక వొకే కాషాయం రంగుని చూసేవాళ్లకి గ్యాసు చాంబర్లలో యూదుల సామూహిక వేదననీ , అత్యాధునిక సమాజంలో సైతం వర్ణ వివక్షకి గురయ్యే నల్లరంగు మనుషుల రోదననీ, అంటరాని వెలివాడల విషాదాల్నీ గుర్తు చేస్తున్నప్పుడు(కాషాయకళ్ళు), ప్రజా పోరాటానికి ప్రాణవాయువునిచ్చినందుకు జైలు పాలైన ఎనిమిది పదుల యవ్వనం వరవరరావుకోసం బెంగటిల్లినప్పుడు (కృతజ్ఞత), ఈశాన్య ప్రాంతీయులపై కాశ్మీరీ మైనారిటీ ప్రజలపై మిలటరీ చర్య రాజకీయాలని నిరసించినప్పుడు, దొంగ కుట్ర కేసులు బనాయించి చట్టబద్ధ న్యాయాన్ని నిరాకరించి అక్రమంగా నిర్బంధించిన భీమా కొరేగాం ప్రజాస్వామ్య (రాజకీయ) ఖైదీలని బేషరతుగా విడుదల చేయమని డిమాండ్ చేసినప్పుడు, కులవర్గ కలనేత కలతనంతా తలనెత్తుకొని జీవించిన ఉసా ని ‘ఉద్యమాల వేగుచుక్క’గా అభివర్ణించినప్పుడు … , ‘క్రోధోద్రిక్త స్వరం’ వర్తమాన రాజకీయాలపై భగ్గున మండే భాస్వరంగా భాసిస్తుంది. మతతత్వ ఫాసిస్టు పాలనపై యింత సూటిగా యెక్కుపెట్టిన కవితాస్త్రంగా రూపొందిన యీ స్వరం పంట పొలాల్లో మురికి వాడల్లో గనుల్లో అడవుల్లో చిగురించటానికి నరాలు తెంచుకుంటున్నవాళ్లకి పుష్పించటానికి రక్తనాళాలు చిట్లగొట్టుకుంటున్నవాళ్లకి స్వేచ్చావాయివుల్ని ప్రవహించడానికి ప్రాణాల్ని తోడేసుకుంటున్నవాళ్లకి గొప్ప ఆసరాగా నిల్చి సత్తువనిస్తుంది (సాహసోద్యమ స్వప్నం). ఇన్ని విధాలుగా యీ కవిత్వం నా మనసుకి దగ్గరైంది.

***

నెపాన్ని కాసేపు కరోనా మీదికి నెట్టి బూటకపు ప్రజాస్వామ్య రాజకీయాల వైఫల్యాన్ని యెండగడుతూ రవి యీ సంపుటిలో చూపిన వస్తు వైవిధ్యం అనల్పమైంది. నాలుగైదు నెలల కరోనా గృహ నిర్బంధ కాలంలో అంతర్ముఖీనుడై వొకానొక తీవ్రోద్వేగ స్థితిలో రాసిన యీ కవిత్వాన్ని కేవలం కవిత్వం అనలేం. దశాబ్దాలుగా లోపల్లోపల అదుముకున్న ఆగ్రహ ప్రకటన. పార్లమెంటరీ రాజకీయాలపై నిరసన పూర్వకమైన రన్నింగ్ కామెంటరీ. మనిషితనం కోల్పోయిన మనిషిపై అవహేళన. పతనమౌతున్న విలువలపై అధిక్షేపం. పెట్టుబడుల పడగనీడలో కనీస భద్రత కరువై బతుకు బరువై కాళ్ళకు రెక్కలు కట్టుకొని పొట్ట అరచేత బట్టుకొని రోడ్ల పాలైన కోట్లాది వలస కార్మికుల ప్రాణాలకు భరోసా నివ్వని పాలకుల కుటిలనీతిని బోనెక్కించిన ప్రతి కవితా ప్రజా న్యాయస్థానం. అద్వానీ రథ యాత్ర దగ్గరుంచీ మన్ కీ బాత్ నమో వాచకాల వరకూ ప్రతి అడుగుపై అడ్డుప్రశ్నల నిలువు కోతల సూక్ష్మ శల్య పరీక్ష. మనిషిలోని క్రూరత్వాన్నీ అజ్ఞానాన్నీ స్వార్థాన్నీ వేలాది సంవత్సరాలుగా మానవ కథా వికాసంలో అద్భుతమైన నాగరికతని సాధించిన మనిషి దిగజారుడు తనాన్ని తాత్వికంగా విశ్లేషించిన కరోనా కవితా ఖండికలు వొక చోట వరసగా కూర్చినప్పుడు దీర్ఘకావ్యంలా రూపుకడతాయి. ఇదే కాలంలో వచ్చిన ‘వలస భారతం’ (జి.వి. కృష్ణయ్య), ‘వలస దుఃఖం’ (సంపా. బిల్లా మహేందర్), ‘దుఃఖ పాదం’ ( సంపా. నల్లెల రాజయ్య) వంటి కవిత్వం పక్కన యీ కవిత్వాన్ని పెట్టి చూసినప్పుడు కవిత్వ వస్తు రూపాల్లో రవి చూపిన ప్రత్యేకతని అధ్యయనం చేయగలం. కవిగా రవి దృక్పథాన్ని అంచనా వేయగలం. అన్నీ తత్ క్షణ ప్రతి స్పందనలే. ఉద్వేగ ప్రధానాలే. రాజకీయ వ్యాఖ్యానాలే. ఆ విధంగా చూసినప్పుడు కరోనా కవితా సమయానికి రవి చేసిన అదనపు చేర్పు యిది. వొకే వస్తువు పునరుక్తికి గురైనప్పుడు శిల్ప వైశద్యమే కవిత్వ ప్రమాణాన్ని నిర్ధారిస్తుంది. దాన్ని అంచనా కట్టడానికి యిది స్థలం కాదు. మరొకచోటయినా అధ్యయనం చేయొచ్చు.

***

రాజ్యంపై నిరసన మాత్రమే రవి మారుత్ కవిత్వ వస్తువు అని కుదించడానికి వీల్లేదు. బ్రాహ్మణీయ పితృస్వామ్య భావజాలాన్ని ఖండిస్తూ రాసిన కవితలు రవి మార్క్సిస్టు దృక్పథానికి ఎక్స్టెన్షన్ గా కనిపిస్తాయి. ఆధిపత్యం అసమానత యే రూపంలో వున్నా అతను సహించడని రుజువు చేస్తున్నాయి. ఆ క్రమంలోనే ముక్కు చెవులు కోసే ఆధిపత్య సంస్కృతి మీద, చెవుల్లో సీసం కరిగించి పోసే జ్ఞాన నీతి మీద, బొటనవేలు దక్షిణ కోరే కుటిల గురు ధర్మం మీద నిరసన ప్రకటిస్తున్నాడు. ఉత్పాదక క్రియలో చెమట చుక్కల్ని లెక్కబెట్టిన పెట్టుబడి పునరుత్పాదక పనిలో పురుటి నొప్పుల్ని పట్టించుకోదని ఇంటి పనిలో శ్రమదోపిడి ‘లెక్క’లు తీస్తున్నాడు. స్త్రీపురుష సంబంధాల్లోని రెండు సగాల మర్మాన్ని బహిర్గతం చేసున్నాడు (భిన్న కోణం).

ఒక నల్ల కలువ శ్వేత సౌధాన్ని ధిక్కరిస్తూ మోకాలి మీద కూర్చున్న ఘటన, ఆత్మ నిర్భర్ భారతంలో కార్పోరేట్ కండలు పెరిగిపోతున్న వైనం, మనిషి మనుగడనే కాదు సమస్త జీవావరణాన్ని కలుషితం చేసే అడ్డగోలు పారిశ్రామికీకరణ, మద్యమ్మీద ఆర్థిక సౌధాలు నిర్మించుకుంటున్న ప్రభుత్వాల ‘ఉపద్రవాధునికీకరణ’ లో తల్లులవకుండానే విధవలవుతున్న తండా స్త్రీల దుస్థితి, మొత్తం విద్యా వ్యవస్థని కార్పోరేట్ ఆన్లైన్ కంపెనీలకు అమ్మకానికి పెట్టిన పాలకుల అవినీతి, ఉచితాల్ని మప్పి వోట్ల కొనుగోలుని వ్యవస్థీకృతం చేసి హక్కుదార్లని లబ్ధిదార్లుగా బిచ్చగాళ్ళుగా మార్చిన ప్రజాస్వామ్య ప్రహసనం, వలగూటి సోపతుల పుస్తకాలకే పరిమితమైన సామాజిక నిరసనలు … యిలా అనేక వస్తువులు యీ సంపుటిలో కవిత్వాభివ్యక్తికి విస్తృతిని సాధించిపెడుతున్నాయి. ఇంతాజేసి కవిత్వం పరుసవేది. దాని రహస్య తంత్రి కవికి తెలుసు. అందుకే అంటాడు:

శబ్ద సౌందర్య రహస్యాన్ని ఛేదించే వేళ

అంతరంగ తరంగం కవిత్వమౌతుంది.

శబ్ద సౌందర్య రహస్యాన్ని ఛేదించే యీ విద్యని సొంతం చేసుకున్న రవి కవి ఆలస్యంగా వినిపిస్తున్న ‘క్రోధోద్రిక్త స్వరా’నికి స్వాగతం చెబుతూ యీ గొంతు ఆగకుండా కొనసాగాలని కోరుకుంటున్నాను.

అభినందనలతో ,

. కె. ప్రభాకర్

అక్టోబర్ 9, 2020, హైదరాబాద్,

You Might Also Like

Leave a Reply