పుస్తకంతో ఒక సంవత్సరం
పుస్తకం.నెట్ ఆరంభించిన సమయంలోనే ఈ చోటు గురించి తెలిసినా, నేను శ్రద్ధగా చూడటం ప్రారంభించింది మాత్రం ఒక సంవత్సరం క్రితమే. 2009 డిశెంబరు ఆఖరువారంలో పని తక్కువగా ఉండి, కొద్దిగా తీరుబాటు దొరికి అంతర్జాలంలో అటూ ఇటూ తిరుగుతుండగా, తెలుగు బ్లాగుల గురించి వినిపిస్తున్న కోలాహలం గుర్తొచ్చి కూడలికి వచ్చి బ్లాగులు చదవటం మొదలుబెట్టాను. అంతకు ముందొకటి రెండు సార్లు ఈ ప్రయత్నం మొదలుబెట్టాను కాని ఎందుచేతో బ్లాగులతో పరిచయం పెంచుకోవటం కుదరలేదు. కూడలి సూచికలో పుస్తకంలో ఒక వ్యాసం – మాలతిగారి From the Front Porch Anthology గురించిన వ్యాసం తెలుగు కథల ఆంగ్లీకరణపై నా ఆసక్తి వల్ల, ఈ సైటువైపు నడిపించింది. ఒకసారి ఇక్కడికి వచ్చి మొదటిపేజీలో వ్యాసాలు చదివాక, ఖజానాని తెరిచి, తరచి చూడాలనే కోరిక పుట్టింది. అక్కడనుండి రకరకాల లింకులవెంట, ఇతర బ్లాగుల వెంట పరుగులు తీయటం మొదలయ్యింది.
ఆ కోతికొమ్మచ్చి ఆడుతుండగానే, రెండు మూడు రోజుల తర్వాత, 2009 జనవరి ప్రారంభంలో, ఆ నెల ఫోకస్ శీర్షిక కింద, 2009లో చదివిన పుస్తకాల లిస్టు వ్రాయమని అడిగారు. అవునూ, క్రితం సంవత్సరం ఏం పుస్తకాలు చదివానూ అని గుర్తు తెచ్చుకోవటం మొదలుబెట్టాక నాకూ లిస్టు రాయాలనే అనిపించింది. గుర్తున్న వరకూ లిస్టు వ్రాసి ఒక వ్యాఖ్యగా పంపించాను. ఆ కామెంటు చూసిన సౌమ్యగారు దీన్ని కామెంటుగా కాక వ్యాసంగా వేస్తాం అంటే సరే అన్నాను. ఆ తర్వాత ఆ వ్యాసాన్ని ప్రచురించినప్పుడు (జనవరి 9, 2010), నేను రాసిన లిస్టులో ఉన్న పుస్తకాలకు ఇంటర్నెట్‌లో వెతికి లింకులు పెట్టటం చూస్తే నాకూ ఆశ్చర్యమూ, సరదా కలిగాయి. ఆ లింకులవెంట పరుగెత్తటం సరదాగా ఉండటమే కాక ఆ పుస్తకాల గురించి నాకూ కొన్ని కొత్త విషయాలు తెలిశాయి.
అదే సమయంలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌గారి ద్రౌపది నవలకు అకాడమీ అవార్డు ఇవ్వటం గురించి వివాదం మొదలయ్యింది. కొన్ని బ్లాగుల్లోనూ, ఇ-మెయిళ్ళలోనూ వచ్చిన వ్యాఖ్యలు చదివిన తర్వాత నాకు ఆ విషయంపైన నా అభిప్రాయాలు వ్రాయాలనిపించింది. మామూలుగా ఐతే ముందు రచ్చబండ ఈమెయిల్ గ్రూప్‌కే ఆ వ్యాసాన్ని పంపేవాణ్ణి (అప్పటికే విప్లవ్ ఒకసారి రచ్చబండలో ఈ విషయం చర్చకు తెచ్చాడు). కానీ బ్లాగు ప్రపంచంతో ఈ వ్యాసాన్ని పంచుకోవాలనిపించి సౌమ్యగారికి పంపించాను. ఆ వ్యాసానికి (జనవరి 20, 2010) మంచి స్పందనే వచ్చింది. నేను ఈ వ్యాసం వ్రాస్తున్నప్పటికి 4,551 సార్లు ఆ వ్యాసం చూడబడింది; 54 వ్యాఖ్యలు; ప్రస్తుతం ప్రాచుర్యంలో రెండో స్థానంలో ఉన్న ఈ వ్యాసం 2010లో ఎక్కువగా చూడబడిన వ్యాసం అనుకొంటాను. తర్వాత కొన్ని మార్పులతో ఆ వ్యాసమే ఆంధ్రజ్యోతి దినపత్రిక సాహిత్య విభాగం – వివిధలో వచ్చింది. ఈ వ్యాసం పుస్తకంలో ముందుగా వచ్చిందని ఆంధ్రజ్యోతి వారు తెలియచేయకపొవడం ఇక్కడ కొంతమందికి కోపం తెప్పించింది.
గత సంవత్సరం ప్రారంభం నుండీ, విధిగా పుస్తకం.నెట్ ప్రతిరోజూ చూస్తున్నాను. వీలు దొరికినప్పుడల్లా ఖజానాలోకి తొంగిచూస్తూ ఇప్పటిదాకా ఈ సైటులో ప్రచురించిన అన్ని వ్యాసాల్నీ, వ్యాఖ్యలనీ చదివాను. నాకు అంతకుముందు తెలియని చాలా పుస్తకాల గురించి ఇక్కడ చదువగలిగాను. ఇక్కడ మెహర్‌గారి వ్యాసం చదవకపోతే రమణీయం పుస్తకం మిస్సయి ఉండేవాణ్ణి. Leelaavati’s Daughters వంటి పుస్తకాలగురించి తెలిసి ఉండేది కాదు. వనవాసిని ఇంత తొందరగా కలిసి ఉండేవాణ్ణి కాదు. India After Gandhi తెప్పించుకొని ఉండేవాణ్ణి కాదు. ఇటువంటి ఉదాహరణలు మరెన్నో. ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ నాకు తెలియని చాలా పుస్తకాలు పుస్తకం.నెట్ ద్వారా పరిచయం అయ్యాయి. ఈ మధ్యలో గత సంవత్సరంలోనే ఎక్కువ పుస్తకాలు చదివాను అనిపిస్తుంది. దానికి ముఖ్య కారణాల్లో ఒకటి ఈ పుస్తకం.నెట్ సైటు.
ప్రవాసజీవితం ప్రారంభించాక, సాహిత్యం అంటే ప్రేమ ఉన్న అనేకమిత్రులను ఒక్కచోట మొదటిసారి కలుసుకొంది soc.culture.indian.telugu (SCIT) అనే యూజ్‌నెట్‌గ్రూపులో. అప్పుడు రేకెత్తిన ఉత్సాహం మళ్ళీ ఇప్పుడు ఈ సైటు చూసినప్పుడు కలుగుతూంది. SCITలో లాగానే కొత్త మిత్రులు ఇక్కడా పరిచయమౌతున్నారు. కనీసం పొద్దున్నే ఒకసారి, పడుకోపోయేముందొకసారీ రోజూ తప్పనిసరిగా పుస్తకం.నెట్ చూడటం అలవాటుగా మారింది. కొత్త పుస్తకాల గురించి ఎవరితోనన్నా మాట్లాడాలనుకొన్నప్పుడు ఈ చోటే గుర్తుకు వస్తుంది.
నా చిన్నప్పుడు పుస్తకప్రపంచం అని ఒక పత్రిక వచ్చేది. దానికి మకుటంగా ‘మంచి పుస్తకం చాటున మనసెంతో చల్లన’ అని ఉండేది (బాపుగారు ఈ కాప్షన్‌తో పుస్తకాల పురుగులమీద, సారీ, పుస్తకాభిమానుల మీద మంచి కార్టూన్లు ఈ పత్రిక ముఖచిత్రంగా వేసేవారు). నాకు పుస్తకం.నెట్ చూసినప్పుడు ఆ పత్రిక మకుటం, ఆ కార్టూన్లు గుర్తుకొస్తుంటాయి.
ద్రౌపది వ్యాసం తర్వాత అప్పుడప్పుడూ వ్యాఖ్యలు చేయటం తప్పించి, పది నెలలపాటు పుస్తకానికి నేనేమీ రాయలేదు. అప్పుడప్పుడూ, సౌమ్యో, పూర్ణిమో ఏదైనా పుస్తకం గురించి వివరాలడుగుతుంటే నా లైబ్రరీలో వెతికి సమాధానాలు చెప్పటమో, స్కానులు పంపటమో చేస్తూ నా వంతు సహాయం చేస్తున్నానులే అని తృప్తి పడుతుండేవాణ్ణి. నవంబరు ఆఖరువారంలో, రెండు దశాబ్దాలు సంపాదకత్వ బాధ్యత అయిపోయి కొంత తీరుబడి దొరికినప్పుడు (అరుణ, తానా వారు ఇండియా వెళ్ళటం, థాంక్స్‌గివింగ్ లాంగ్ వీకెండూ కూడా కలిసొచ్చాయి), తీర్చవలసిన పాతబాకీలు గుర్తుకు వచ్చాయి. ఎప్పటినించో చేద్దామనుకొంటున్న కొన్ని పరిచయాలతో పాటు, పుస్తకం చూడగానే ముద్దొచ్చో మూడొచ్చో గబుక్కున రాసిన కొన్ని పరిచయాలు కూడా కలిపి పంపితే పుస్తకం.నెట్ పిల్లలు నన్ను పుస్తకం రచయితల్లో ఒకరుగా కలుపుకున్నారు. దీంతో తీర్చుకోవలసిన బాకీలు ఇంకొద్దిగా పెరిగినట్టుగా అనిపిస్తుంది.
ఇక్కడ రాతలన్నీ ఒకే స్థాయిలో లేకపోయినా, పుస్తకం అంటే ప్రేమ ఉన్నవారు తాము చదివిన పుస్తకాల గురించి ఒక సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకోవడానికి వేదిక కల్పించిన పూర్ణిమ, సౌమ్య, సహాయం అందిస్తున్న పొద్దు.నెట్ కు అభినందనలు, కృతజ్ఞతలు. పుస్తకాల గురించి వ్రాస్తున్న మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. Let the good times continue!
—-
తా.క: ఇందాక సుహృద్భావ వాతావరణం అని అన్నానో లేదో, ఈ రోజే, మొదటిసారిగా, ఒక చర్చని ఆ సుహృద్భావం లోపించినందువల్ల అర్థంతరంగా ఆపేయవలసిరావటం చూసి బాధ కలిగింది. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవలసిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరిపైనా ఉంది. మారుపేర్ల వెనుక దాక్కొని ఘాట్టిగా అరిచేసుకొని తిట్టేసుకొని కొట్లాడుకోవటానికి వేదికలు చాలానే ఉన్నాయి. పక్కవాడి అభిప్రాయంతో విభేదించేటప్పుడు, ముసుగులు వేసుకొని అమర్యాదగానూ, అవమానకరంగానూ మాట్లాడవలసిన అవసరం లేదని మనం గుర్తెరిగి ప్రవర్తించకపోతే ఇంకోసారి మనం ఇంకో మంచి వేదికను కోల్పోతాము.
__________________________________________________________
జంపాల చౌదరి గారు రాసిన వ్యాసాలన్నీ ఇక్కడ చూడవచ్చును. – పుస్తకం.నెట్
Leave a Reply