Lilavathi’s Daughters

ఈ పుస్తకం గురించి మొదట హిందూ పత్రిక “లిటరరీ రివ్యూ” అనుబంధం లో ఏప్రిల్ మొదటివారంలో చదివాను (లంకె ఇక్కడ). లీలావతి భాస్కరాచారుడి కూతురు. “లీలావతి గణితం” అన్నది ఈవిడ పేరుపై పెట్టిన పేరే. విషయానికొస్తే, ఈ పుస్తకం భారత దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు చేస్తున్న మహిళల జీవిత చిత్రణల సంకలనం. 1880ల వద్ద మొదలై ఇప్పటిదాకా ఇలా పరిశోధనా రంగంలో ప్రతిభావంతులైన వంద మంది మహిళల గురించి ఇందులో రాసారు. అన్నేళ్ళలో వందమందేనా…అని ఒకింత నిరాశ కలిగింది కానీ, ఇందులోని కొన్ని కథలు మాత్రం చాలా ప్రేరణ కలిగించేవి.

ఆనందీ భాయ్ జోషీ ఓ సంప్రదాయ హిందూ కుటుంబంలో 1865 లో పుట్టి, 1883 లో వైద్యవిద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్ళి, అక్కడే డాక్టర్ పట్టా పొందిందన్న కథ మనలో ఎందరికి తెలుసు? అప్పట్లోనే మెడిసిన్ చదివిన మొదటి భారతీయ మహిళ ఉండిందని తెలిసి చాలా ఆశ్చర్యం కలిగింది నాకు – అదీ అప్పటి సంప్రదాయాల కట్టుబాట్ల మధ్య చిక్కుకున్న భారతదేశంలో, అమెరికా వెళ్ళి మరీ చదువుకోవడం! అయితే, 1887 లో ఆవిడ అనారోగ్యంతో కేవలం 22 సంవత్సరాల వయసులోనే కన్నుమూశారని తెలిస్తే మాత్రం మళ్ళీ మనసు చివుక్కుమంటుంది. ఈవిడ గురించిన సమాచారం తెలుసుకోగలగడమే ఓ గొప్ప విషయం. ఎందుకంటే, ఎక్కడా సరైన సమాచారం లేదట. ఈ వ్యాసం కిందే దీనికి సమాచారం పొందిన లంకెలు కూడా పొందుపరిచారు.

సైంటిస్టు తల్లీ కూతుళ్ళైన పూర్ణిమ సిన్హా, సుపూర్ణ సిన్హా ల కథలో కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. పూర్ణిమ సిన్హా కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‍డీ పట్టా పొందిన తొలి మహిళ. ఆవిడ భౌతిక శాస్త్రంలో ఈ ఘనత సాధించారు. ఆవిడ ప్రముఖ శాస్త్రవేత్త, ఎస్.ఎన్.బోస్ తో కలిసి పనిచేశారట. అప్పట్లో బోస్ నిర్వహించే ఖైరా లాబొరేటరీ లో దాదాపు పదిమంది పరిశోధకులు ఉండేవారట. అక్కడ బోస్ చెప్పిన నిబంధనల్లా ఒకటే – విద్యార్థులు తమ తమ పరిశోధనల్లో ఎవరికి కావాల్సిన పరికరాలను వారే తయారుచేసుకోవాలి అని. ఆ విధంగా పూర్ణిమ సిన్హా తనకు కావాల్సిన ఎక్స్రే పరికరాన్ని తానే తయారుచేసుకున్నారట. దానికి కావాల్సిన హైవోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ అదే విశ్వవిద్యాలయంలోని అప్లైడ్ ఫిజిక్స్ శాఖలోనే రూపొందించినది. బోస్ అవలంబించిన పద్ధతే మిగితా శాస్త్రవేత్తలు కూడా అవలంబించి ఉంటే మన దేశంలోని పరిశోధనశాలల పరిస్థితి నెమ్మదిగానైనా చాలా మారి ఉండి ఉండేదని పూర్ణిమ అభిప్రాయం.

దేశవిదేశాల్లో విద్యనభ్యసించడమే కాక, విదేశాల్లోనే పరిశోధనలు చేస్తూ, నెహ్రూ ఆహ్వానంపై భారతదేశం తిరిగివచ్చి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పునర్నించడంలో పాల్గొని తరువాత ఇండియాలోని వివిధ పరిశోధనాశాలల్లో పనిచేసిన జానకీ అమ్మాళ్ కథ, సీ.వీ.రామన్ కు మహిళలను పరిశోధనలో చేర్చుకోవడం మీద ఆసక్తి ఉండేది కాదట. దీనికి వ్యతిరేకంగా ఆయన కార్యాలయం ముందు సత్యాగ్రహంచేసి మరీ ఆయన్ని ఒప్పించిన కమలా సహానీ కథను, “Woman! work like an ant, act like a man, but remain a woman’ అంటూ పరిశోధనా రంగంలో తన అనుభవాలను చెప్పిన సులభ కులకర్ణి కథనూ, డిల్లీ ఐఐటీ తొలి మహిళా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పట్టాదారు ప్రీతీ శంకర్ కథనూ – ఇలా ఎన్నో స్పూర్తివంతమైన కథలను ఇందులో చదవొచ్చు.

వీరందరూ తమ కుటుంబం తమకందించిన సహకారం గురించి చెబుతూ ఉంటే, పరిశోధనా రంగంలో ఓ మహిళ నిలదొక్కుకోడంలో దాని ప్రాధాన్యం ఏమిటో చెప్పకనే తెలుస్తుంది. అలాగే, కొన్ని సందర్భాల్లో మహిళలంటే ఉన్న వివక్ష గురించి చెబుతూ ఉంటే, ఇంత చదువుకున్న వారిలో కూడా ఇలాంటి అభిప్రాయాలుంటాయా? అని ఆశ్చర్యం కలిగింది. పైన చెప్పిన సీవీరామన్ ఉదంతం కూడా అందుకు ఉదాహరణే. అలాగే, జీ.వీ.సత్యవతి గారి కథలో, ఆవిడ ఎంబీబీఎస్ సమయంలో వచ్చిన ఎగ్జామినర్ సైన్సులో నీ ఆదర్శం ఎవరు? అంటే, ఆవిడ “Curie” అని చెబితే – “Marie Curie did nothing but help her husband. How can she be your idol?” అని వచ్చిన సమాధానాన్ని, ఆవిడ పైచదువులకి వెళతా అంటే – “why does a ‘lady doctor’ choose not to practise or accept a teaching job in subjects like obstetrics & gynaecology, paediatrics, general medicine etc? what is this wonderful research the girl can do in India?” అని వచ్చిన ప్రశ్నలనూ, హేమా రామచంద్రన్ కు ఐఐటీ లో సీటు వచ్చినప్పుడు ఆమె సహాధ్యాయి ఒకతను – “You have spoiled the career of a man. Why do you girls want to study a IIT, especially when career has no meaning for woman? you have merely wasted a seat in IIT and deprived a boy of it” అని స్పందించిన విధానాన్నీ చదువుతూ ఉంటే, ఇదంతా మారదా? అన్న నిస్పృహ కలిగినా కూడా వీటినన్నింటినీ ఎదుర్కుని కూడా తమతమ పరిశోధనల్లో నిలదొక్కుకున్న వీరి పట్టుదల చూస్తే, స్పూర్తి కలగకమానదు.

మొత్తానికి, ఈ పుస్తకం కాస్తో,కూస్తో పై చదువులు చదువుతూ, పరిశోధనా రంగంపై ఆసక్తి ఉన్న ప్రతి అమ్మాయీ చదవవలసిన పుస్తకం. ఇందులో ఉన్న కథలన్నీ బాగున్నాయని నేను అనను. కొన్ని చాలా సాధారణంగా పరిశోధనారంగంవారిలో కనిపించే కథలు. కేవలం భారతీయ మహిళలు అనే ఒకే ఒక్క కారణం తప్ప ఏ పత్యేకతా లేకున్నా ఇందులో చోటు సంపాదించాయనిపిస్తుంది కొన్ని కథలు చదివితే. అయినప్పటికీ, ఇది ఈ అమ్మాయిలూ, వారి తాలూకా అబ్బాయిలూ తప్పక చదవవలసిన పుస్తకం. ఆన్లైన్ లో చదవడానికి వీలుంది కానీ, కొని చదవమని నా సలహా .

పుస్తకం షాపుల్లో దొరకదు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారి ద్వారా ఆన్లైన్ అమ్మకాలు. ఇది కొనేందుకు ఇక్కడికి వెళ్ళండి.

పుస్తకం వివరాలు:
Lilavati’s Daughters
Author/Editor : Rohini Godbole and Ram Ramaswamy, Eds.
Publisher : Indian Academy of Sciences, Bangalore (2008)
ISBN Number : 9788186450051

You Might Also Like

2 Comments

  1. Anandi Gopal – S.M.Joshi | పుస్తకం

    […] ౪. లీలావతిస్ డాటర్స్ పుస్తకంలో ఆనంది గురించి ఉన్న కొన్ని పేజీలు ఇక్కడ. ఈ పుస్తకంపై పరిచయ వ్యాసం పుస్తకం.నెట్ లో ఇక్కడ. […]

  2. మాలతి

    చాలా బాగుంది పరిచయం. ధన్యవాదాలు.

Leave a Reply