మృత్యువుకు జీవం పోసి..
మృత్యువు అన్న పదం వినగానే మీకు తొట్టతొలుత కలిగే భావమేమిటి? భయం? కోపం? నిర్లిప్తత? వైరాగ్యం? అయోమయం? నిరాశ? దిగులు? ఆందోళన?
మృత్యువు కి ఒక ఆకృతిని ఇవ్వమంటే, మీరేం ఇస్తారు? రాకాసి? యమపాశం? అశరీరమైనదేదో?
“మానవులకు ఇక మృత్యువు లేద”ని మీతో ఎవరన్నా అంటే, మీ ప్రతిస్పందన? ఆశ్చర్యం? ఆనందం? ఊరట? ఆందోళన?
ఇప్పుడు ఇంకో ప్రశ్న: “మానవులకు ఇక మృత్యువు లేద”ని మీరు పది లక్షల జీవిత భీమా చేయించుకున్నాక, ఎవరన్నా చెప్తే? ఎలా అనిపిస్తుంది? ఊ? 🙂
అచ్చంగా, ఇదే – ఇక పై మృత్యువు మానవుల పై మృత్యువు పనిచేయదు – అంశాన్ని తీసుకొని, సరమాగో వంటి విఖ్యాత రచయిత కథ అల్లితే, ఎలాగ ఉంటుందో మీకు తెలియాలంటే, మీరు ఆయన పుస్తకం ఒక్కటైనా చదివుండాలి.
ఇదివరలో నేను పరిచయం చేసిన Blindness నవలనే తీసుకుందాం. అందులో ఉన్నట్టుండి ఒక పేరు లేని దేశంలో “తెల్ల అంధత్వం” అనే అంటు వ్యాధి వ్యాపిస్తుంది. దేశమంతా మూకుమ్ముడిగా గుడ్డిదై పోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ దేశంలో జరిగిన పరిణామాల్ని, వాటి పర్యవసానాలనీ, విపరీత పరిస్థితుల్లో మనిషి వికృత రూపాన్నీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు. అది చదివిన అనుభవంతో, “ఉన్నట్టుండి ఆ దేశంలో మనుషులు మృతిచెందటం అనేది ఆగిపోతుంది” అన్నది కథాంశం అని తెల్సినప్పుడు, నా ఊహలని కాస్త ఉరికించాను. “హమ్మ్.. మనిషి చచ్చిపోకపోతే, జనాభా ఎక్కువైపోయి – సోషల్ స్టడీస్ కోసం బట్టీయం వేసిన జవాబేదో గుర్తొచ్చి – వనరులు చాలక, ప్రజలు తంటాలు పడుతుంటే, ప్రభుత్వాలు దిక్కులు చూస్తాయి.” లాంటివేవో ఉంటాయి అనుకున్నాను.
నవల మొదలవ్వటం కూడా అలానే మొదలయ్యింది. ఆ పేరు లేని దేశంలో, ఉన్నట్టుండి ఒక కొత్త ఏడాది మొదలైన పూట నుండి, మనుషులు చనిపోవటం ఆగిపోతుంది. ఎంతటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నవారికైనా మరణం రాదు. అలా అని సంపూర్ణ ఆరోగ్యవంతులూ కాలేరు. ఈ వైపరిత్యాన్ని ఆ దేశ ప్రజలూ, మీడియా, ప్రభుత్వం ఎలా ఎదుర్కొన్నారు అన్నదే తక్కిన కథాంశం అయుంటే నేను కూడా “ఆ… సరమాగో ఇంకో నవల చదివా.. బ్లైండ్‍నెస్ లా ఉంది కాస్త. పర్లేదు చదవచ్చు” అని ఒక రెండు ముక్కులు చెప్పి ఊరుకునేదాన్ని.
కాని, ఏం రాసాడీయన! ఏం రాసాడు!
మానవ జాతిని గడగడ వణికించి, ఒక ప్రహేళికగా ఉన్న మృత్యువును గురించిన కథను చదువుతూ ఉంటే, పళ్ళికిలిస్తూ, అక్కడక్కడా గట్టిగా నవ్వుతూ జోలీ జోలీగా చదువుతానని నేనే ఊహించలేదు. మృత్యువుకు ఒక రూపం ఇచ్చి, ప్రాణం పోసి, ఆమెకు existential dilemmaలు సృష్టించేసరికి నాకు ఉత్సాహంతో ఊపిరాడలేదు. 😛 ప్రతీ వాక్యంలో “వాహ్వాహ్” అనిపించేస్తూ ఉంటే, పుస్తకం ఆపకుండా చదివాను.
ఆపకుండా నేను చదివాను అన్నది బడాయి పోవటం. నిజానికి, మొదలెడితే, ఆపకుండా ఆయన చదివిస్తాడు. అంతే కాదు, ఆపకుండా చదవగలిగే వాడే ఆయనకు పాఠకుడు కాగలడు. ఎలానో చెప్తాను, ఉండండి.
ఇప్పుడు మనం పొద్దున్నే జాగింగ్ కు వెళ్తాం అనుకుందాం. (ఉత్తినే, ఉపమానం వరకే!)
అక్కడ మనకు తెలీని వాళ్ళు చాలా మంది వస్తుంటారు కద. అలా మనకు తెలీని రచయితలు బోలెడు మంది.
రోజూ వెళ్తుంటాం కాబట్టి (మళ్ళీ ఉత్తినే, ఉపమానం ఇంకా అయిపోలేదు) కొన్ని మొహాలు మనకి పరిచయమవుతాయి. అంటే, ఇట్లా ఫలనా రచయిత అని మనకి ఎవరో చెప్పటమో, లేక పుస్తకాల కొట్లల్లో వాళ్ళ పుస్తకాలు మాటిమాటికీ కనిపించటమో లాంటివి.
అప్పుడు మనం ఏదో పూట, ఒక చిర్నవ్వు విసురుతాం – ఒక ఫేజీ తెరిచి చదవటమో, లేక ఇంటర్వ్యూ అనో, ఆయన కోట్స్ అనో చదూకోవటం మాట.
కొన్ని రోజులకి “హై.. హలో.. గుడ్ మార్నింగ్” అని అంటాం – పుస్తకం చదవటానికి నిర్ణయించుకొని, దాన్ని కొనడమో, అరువు తెచ్చుకోవడమో.
పుస్తకం తెరచిన క్షణం “జాగింగ్ చేద్దామా?” అన్న రచయితకు “సై” చెప్తాం అన్న మాట.
మనిషి మనిషికీ ఒక నడక స్టైల్ ఉన్నట్టు, రచయిత రచయితకీ ఒక శైలో, మరోటో ఉంటుంది కదా. సరమాగో కథన నడక ఎలా ఉంటుందో చెప్పాలంటే, పెద్ద పెద్ద అంగలేసుకుంటూ గబగబా నడిచేస్తారాయన. నాలాంటి వాళ్ళు పరిగెత్తాల్సి వస్తుంది. ఇక్కడ తిరకాసు ఏంటంటే, “సై.. జాగింగ్ చేద్దాం” అనగానే, అంటే దాదాపు మొదటి వాక్యం, అంతగా కాపోతే, రెండు మూడు వాక్యాలు ఆయన మన చేయి పట్టేసుకుంటారు. ఇహ వదలరు. మనమూ విడిపించుకోడానికి ఇష్టపడం. కాని, ఆయన ఎంత గబగబా నడిచేస్తారంటే, మన పరుగుపెట్టి ఆయనతో సమానంగా ఉండాలి, వెనకబడిపోకుండా. Imagine, the fitness levels needed!
(మాటలో మాట, ఇదే మనకే సొంతమైన మల్లాది రామకృష్ణశాస్త్రి గారి కృష్ణాతీరం ఎలా ఉంటుందీ అంటే, ఆ జాగింగేదో, నదితీరాన ఇసుకలో నడుస్తున్నట్టు. ఇసుకలో నడవటం – అదో తమాషా. అడుగేయంగానే పుసుక్కున ఇసుకలోకి పోతుంది. కాని తీసి మరో అడుగేయాలంటే కాస్త శ్రమ తప్పదు మరి. అలానే ఆ పుస్తకం కూడా, ఆగాగి, ఆచితూచి అర్థం చేసుకుంటూ చదివితే తప్ప కష్టం.)
సరమాగోలో మరో ప్రత్యేకత, వైవిధ్యం ఏమిటీ అంటే ఆయన punctuation! “.”, “,” తప్ప తక్కినవి వాడరు. ఉత్త నరేషనే ఉంటుంది కాబోలు అనుకోడానికి లేదు. ఈ చుక్క, చుక్కన్నరతోనే ఆయన most complicated dialogues and situations ని చెప్పేస్తారు. అసలు ఆయన అలా ఎలా చెప్పేస్తున్నారో, మనం అలా ఎలా అర్థం చేసేసుకోగలుగుతున్నామో అర్థం కాకున్నా, కథ అంత చకచకా సాగుతుంటే, ఇవ్వన్నీ ఆలోచించాలన్నా చించలేం. ఆయనకివ్వన్నీ నచ్చవు. ఆయనతో నడకలో ఆయన ఏం చెయ్యమంటే అదే కుదురుతుంది మరి!
టూకీగా చెప్పాలంటే ఆయన కథనం RACY! నాలుగక్షరాల పదానికి నాలుగు పేరాలెందుకు దండగ? అని అనండి. అనండీ…
Lovers of concision, laconicism and economy of language will doubtless be asking, if the idea is such a simple one, why did we need all this to waffle to arrive, at last, at the critical point. The answer is equally simple, and we will give it using a current and very trendy term, that will, we hope, make up for the archaisms with which, in the likely opinion of some, we have spattered this account as if with mould, and that term is context.
ఇది ఆయన వచనం. ఇలా ఉంటుంది. అనువాదంలోనూ. నమ్మశక్యంగాని ఒక విషయంతో కథ మొదలెట్టి, చిట్టచివరి వరకూ ఊపిరిసల్పని కథనం నడిపించే సత్తా ఒక కాఫ్కా(మెటమార్ఫసిస్)లోనూ, మళ్ళీ సరమాగోలోనూ చూశాను. అయితే, ఈ నవల్లో గమ్మత్తైన విషయమేమిటంటే, పాఠకులు పీకాల్సిన ఈకలను, నరేటరే పీకేస్తూ దానికి వివరణలు ఇస్తూ ఉండడం. నవల తమాషాగా అనిపించటానికి ఇదీ ఓ కారణం.
ఇంతకీ కథ టూకీగా: ఓ దేశంలో ఉన్నట్టుండి జనాలు చనిపోవటం ఆగిపోతుంది. దానితో దేశంలో విపరీత పరిస్థితులు నెలకొంటాయి. మృత్యువు మీద ఆధారపడ్డ funeral and insurance business మొదలుకొని, ఆసుపత్రులూ – వృద్ధాశ్రమాల మీద, అసలు చావులేనప్పుడు మతం అవసరం ఏమిటన్న ప్రశ్నలు వరకూ అన్ని విధాలా ఆ దేశం క్లిష్ట పరిస్థితులను ఎదురుకుంటుంది, ఓ ఏన్నెళ్ళ పాటు. ఆ తర్వాత అదృశ్యమైన మృత్యువు తిరిగొచ్చి, చాప కింద నీరులా తన పని తాను చేసుకొని పోకుండా, “ఏదైనా చెప్పే చేస్తా, చేసేదే చెప్తా” అని స్టైలుగా ఉత్తరాలు పంపి, ఏడు రోజుల తర్వాత ప్రాణాలు తీస్తూ ఉంటుంది. ఇక్కడే, భీకరమైన మెలిక – ఓ పూట, తాను పంపిన ఉత్తరం తిరిగొచ్చేసరికి, మృత్యువు పడుతుంది పాట్లూ, ఆహా.. చదివి తీరాల్సిందే!
ఎరిక్ సీగల్ రాసిన లవ్ స్టోరీ, అలివర్ స్టోరీల పరిచయం చేయబూనినప్పుడు: “కవిత్వమంటే ఊదని బుడగ. దాంట్లో మన ఊపిరి పోయగలిగితే తప్ప దాన్ని ఏం చేసుకోలేం. “నీ మరణం క్షణికం, నా మరణం క్షణక్షణం” అన్నది మిమల్ని ఎంత స్పందింపచేయగలదూ అనేది మీ పూర్వానుభవం మీదో, సహానుభూతి మీదో ఆధారపడుంటుంది. అదే కథలో, నవలో అయితే కథకుడే ఊపిరి పోసి బుడగ మనచేతికిస్తాడు. ఇహ, మనం ఆడుకోవడమే. “”నీ మరణం క్షణికం, నా మరణం క్షణక్షణం” అన్నది మీ అనుభవంలో రాకపోయుంటే, ఎరిక్ సీగల్ దాదాపుగా తీసుకొచ్చి పెడతాడు. కావాలంటే చదివి చూడండీ!” అని రాసి, ఈ ఉపమానంలో ఏవో లొసుగులుంటాయేమోనని తీసేసాను..
కాని, ఈ పూట చెప్తున్నా. మృత్యువు మీద ఎన్నో కవితలు వచ్చుండచ్చుగాక. కాని సరమాగో దాన్ని చూపించగలిగినంత విస్తృతంగా – అందులోనూ మానవీయంగా, ముఖ్యంగా ఒక సామాన్య పాఠకునికి, చూపటం చాలా కష్టం.
“That is what I mean by respecting the integrity of the character—not making him do things that would fall outside of his own personality, his internal psychology, that which the person is. Because a character in a novel is one more person—Natasha in War and Peace is one more person; Raskolnikov in Crime and Punishment is one more person; Julien in The Red and the Black is one more person—literature increases the world’s population. We do not think of these three characters as beings who do not exist, as mere constructions of words on a series of sheets of paper that we call books. We think of them as real people. That is the dream, I suppose, of all novelists—that one of their characters will become “somebody.” ” – Saramago
Saramago, for sure, has increased the world’s population. And what he added is what the mankind dreads most, death! (To the ones who read this novel, death with small d!)
మృత్యువుకే జీవం పోసి, అమరం చేసిన ఓ మహర్షి… వందనాలు!
****************************
Saramago’s Interview with Paris Review.
Saramago’s Nobel lecture.
Notes on Saramago’s Punctuation.
Guardian reviews Death at Intervals
****************************
Details
Title: Death at Intervals
Author: Jose Saramago
Translated by (from Portugese): Margaret Jull Costa
Publishers: Vintage, London
Pages: 196
Cost: Rs. 399
**************************
పుస్తకం » Blog Archive » Seeing. – Saramago
[…] సరమగో పుస్తక పరిచయాలు: బ్లైండ్‍నెస్, డెత్ ఎట్ ఇంటర్వెల్స్. (No Ratings Yet) Loading […]
C.S.Rao
How fast you read books,how readily you review them,and review them so well!I really appreciate your literary passion ,and passion for communication.
Congratulations to Purnima!