ఓ ప్రేమకథ..

ఉదయాన్నే జాగింగ్ చేస్తూ కనిపిస్తాడు ఆ అబ్బాయి. ఒక్కో రోజు సరదాగా, చలాకీగా, నవ్వుతూ తుళ్ళుతూ అమ్మాయిలను కవ్విస్తూ, వారిని చూడ్డానికే జాగింగ్ వంక పెట్టుకొని వచ్చాడా అన్నట్టు పరిగెత్తుతుంటాడు. ఒక్కో రోజు పరధ్యానంగా, ఈ లోకంతో సంబంధం లేనట్టుగా, దారి తప్పిన వాడిలా, దారి తెల్సుకోవాలన్న ప్రయత్నం కూడా చేయకుండా పోతుంటాడు. మరో రోజు తనలో ఉన్న కసిని, కోపాన్ని కాళ్ళ కండరాల్లో నింపి ప్రపంచం మీద విరుచుకుపడ్డానికనట్టు ఆవేశంగా పరిగెడతాడు. అన్ని రోజులూ అతణ్ణి చూస్తూ ఉండిపోవడం నాకలవాటు.

నాకీ అబ్బితో పరిచయం నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో కలిగింది. అప్పటికి అతడూ కాలేజిలోనే ఉన్నాడు. అతని గురించి, అతని కుటుంబ నేపధ్యం గురించి, అతనికిష్టమైన ఐస్ హాకి ఆట గురించి తెల్సుకుంటున్న సమయంలోనే, అతని జీవితంలోకి “జెన్నీ” ప్రవేశించింది. పరిచయం స్నేహంగా, స్నేహం ప్రణయంగా ఎప్పుడు మారాయో తెలీలేదు. కల్సి బతకాలని నిర్ణయించుకున్న సమయాన ఎన్నో అవరోధాలను ఎదురైయ్యాయి. ఇద్దరూ ఒక్కరై వాటికి ఎదురునిల్చారు. కష్టాలనీ ఆనందంగా స్వీకరించారు. గుడిసె అయినా, మేడ అయినా, చిలుకా గోరింకలల్లే కాపురమున్నారు. కష్టాలు కరిగి, సుఖాలు అందుబాటులోకి వస్తున్నాయనగా, విధి వికటాట్టహాసం చేసింది. జెన్నీ……….

ఆ తర్వాత ఒలివర్‍‍ని నేను కల్సింది లేదు చాన్నాళ్ళ వరకూ. అప్పుడప్పుడూ గుర్తొచ్చేవాడు, ఎలా ఉన్నాడో? ఏం చేస్తున్నాడో?నని. కాని వెతికి పట్టుకున్నాక, పలకరింపుగా మాట పెగలకపోతే కలవటంలో ప్రయోజనం ఏంటి? “హే బడీ.. వాట్స్ అప్?” అని అడగలేక కాదు. వచ్చే జవాబులో నిజాయితీకన్నా, నిజాన్ని దాచిపెట్టగల సామర్ధ్యమే కనిపించేటప్పుడు  ప్రశ్న అడగడం దేనికి?! గుండెలోని వాయుగుండం కళ్ళతీరాన్ని దాటి చెక్కిళ్ళపై వర్షించటం ఓ రకంగా అదృష్టం. యుద్ధప్రాతిపదికన చుట్టూ ఉన్నవాళ్ళు సహాయకచర్యలు చేపట్టగలుగుతారు. వాన వెలిసాక, ఏదోనాటికి తెరిపి కలగక మానదు. కొన్ని బాధలు బయటకు రాక, గుండెలోనే అగ్నిపర్వతాలై కూర్చుంటాయి. ఏదో క్షణాన బద్దలైయ్యేవరకూ ఆ బాధ ఉన్నా లేన్నట్టే. కొన్ని బాధలు మాత్రం అరికాల్లో ముళ్ళులా, కంటిలో నలుసులా ప్రతి క్షణం తమ ఉనికిని చాటుతూనే ఉంటాయి. వాటిని “నవ్వు” కింద కప్పేటేయడంలో కొందరు నిష్ణాతులు అయిపోతారు. నవ్వు పొరలను దాటుకొని చూడగల నాలాంటి వాళ్ళు ఉన్నప్పుడు పరిస్థితి చెడుతుంది.

రెండేళ్ళ క్రితం ఎదురుపడ్డాం. మనసులో చాలా భయాలున్నా మొహం చాటేయాలనిపించలేదు. ఈ సందర్భంకోసం జీవితం కొద్దికొద్దిగా నన్నూ తయారుచేసిందనుకుంటా. మాటల్లో పడ్డాం. పులుముకున్న చిర్నవ్వులతో, అరువుతెచ్చుకున్న ఉత్సాహం ప్రదర్శిస్తూ అతను కబుర్లు చెప్పాడు. నిజాల్ని దాచిపెట్టగల సామర్ధ్యాన్ని మెచ్చుకోవడం నాకూ అలవడింది. అందుకే అతడూ ఆగలేదు. నేనూ ఆపలేదు. మాటల ప్రవాహంలో కొట్టుకుపోయాం. పోస్టుమార్టం బల్ల మీద జరిగేది సర్జరీనే. పూర్తవ్వగానే ప్రాణం తిరిగొచ్చేస్తుందన్నట్టే వ్యవహరించాం. ఆపైన ఎవరి దారిన వాళ్ళం పోయాం.

ఓహ్.. ఇంతకీ ఈ అబ్బి ఎరిక్ సీగల్ రచించిన “లవ్ స్టోరీ”, “ఒలివర్ స్టోరీ” అన్న నవలల్లో పాత్ర అని చెప్పనే లేదు కదూ! “ఓహ్.. ఒక పాత్రేనా?” అని కొట్టిపారేయడం కూడా అయిపోయిందా? హమ్మ్..

కవితలెలా రాస్తారో మరి? ఆయా భావాలను జీవించి రాస్తారేమో మరి! అప్పుడెప్పుడో, “నీ మరణం క్షణికం, నా మరణం క్షణం క్షణం.” అన్న ఒక పంక్తి చదివాను, ఒకానొక కవితలో. క్షణకాలం పాటు గుండె మూలిగి.. ఊరుకుంది.

కథలెలా అల్లుతారో మరి? ఆయా అనుభవాలను జీవింపచేశాలా రాస్తారేమో మరి? ఒలివర్ కథ లాంటి కథలు బోలెడు తెల్సు మనకు. మనుషుల కాకపోతే కనీసం సినిమాల్లో చూసుంటాం. అయినా ఏకాంతంలో కళ్ళుమూసుకొని నన్ను కదిలించిన వాటిని, నాకు దగ్గరైన వాటిని నెమరువేసుకునేటప్పుడు మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాలను తవ్వితే, “ఒలివర్ నీ జీవితంలో తారసపడిన వ్యక్తి కాదు. నువ్వు చదివిన ఒకానొక పుస్తకంలో పాత్ర మాత్రమే!” అని నా మెదడు నేను విస్మరించలేనంత గట్టిగానే వారిస్తుంది. కాని ఒలివర్ జ్ఞాపకాలు నాలో కలిగించే భావోద్వేగాలకి మాత్ర్రం వాస్తవమా? కల్పనా? అన్నది తెలీదు. కవితలో అదే భావాన్ని స్ఫురించే వాక్యాలను చదివినప్పుడు క్షణకాలం నిట్టూర్చి ఊరుకున్న గుండె ఇప్పుడో ఆప్తుడి కష్టం చూస్తూ ఉండలేనట్టు కాని ఏమీ చేయలేకపోతున్నట్టు ఉక్కిరిబిక్కిరై బరువెక్కుతుంది. తేలికపడ్డానికి కొన్ని రోజులు పడుతుంది.

“చదివిన ప్రతిసారీ నా చేత కంటతడి పెట్టించే నవల” అని లవ్ స్టోరీని గురించి హర్షా భోగ్లే (ప్రముఖ క్రికెట్ కామెంటేటర్) ఒక ఇంటర్వ్యూలో చెప్పగానే పుస్తకం చదవాలని నిర్ణయించుకున్నాను. చదివాను. నచ్చింది. చదువుతూ నేనూ ఏడ్చాను. స్నేహితులకు సిఫార్సు చేశాను. ఒకరు, “నాకేం ఏడుపు రాలే!” అన్నారు. మరొకరు, “ఎన్ని సినిమాలు చూడలేదూ?” అని కొట్టిపారేశారు. మరొకరు “అబ్బా.. ఆ భాషే ఎక్కలేదు నాకు” అని తీసిపారేశారు. నా మస్తిష్కంలో ఎందుకో మరి తిష్టవేసింది. “True love comes quietly, without banners or flashing lights. If you hear bells, get your ears checked.” అన్న వాక్యానికి అద్దం పట్టేట్టు హాయిగా సాయిపోయిన ప్రేమ కథ వల్లనుకుంటా! ప్రేమ కథలు ముగియచ్చేయేమో కాని ప్రేమించాక జీవితం ఆగదు. ఆ జీవితాన్ని ఆవిష్కరించినందుకూ నాకివి నచ్చాయి.

ఇప్పుడు రాస్తుంది కూడా “ఇదో గొప్ప నవల, తప్పక చదవండి” అని చెప్పటం కోసం కాదు. మనం అనుభవించిన ప్ర్రతీ క్షణం కాలంలో కొట్టుకుపోతూనే కొన్ని అపురూపమైన క్షణాలూ, వాటిలోని విశేషాలూ జ్ఞాపకాల రూపంలో దాగిపోతాయి. గతించిన జీవితం తాలూకు అవశేషాలు. ఓ పాత్రకు జీవం పోసి, ఆ జీవాన్ని నాలో తిరుగాడే జ్ఞాపకంగా మార్చిన ఎరిక్ సీగల్‍కు నాకు చేతనైన రీతిలో “థాంక్స్” చెప్పుకోవటం ఈ వ్యాసం.

By the way, when writing is a socially acceptable form of schizophrenia, why not add reading to it? I propose.

You Might Also Like

7 Comments

  1. RAVIKUMAR.B

    కేక పుట్టించారు సార్… సారీ చిన్నగా ఏడిపించారు సార్. ఎరిక్ సీగల్ లవ్‌స్టోరీ చదువుతున్నాను.. యాక్చువల్‌గా ఆయన పరిగెత్తిస్తారు కానీ నాకంత ఇంగ్లీష్ పరిజ్ఞానం లేదు. అయితే నా వేగం ఒక్కరోజులోనే ఇష్టపడి 40పేజీలు చదివాను. మీ బ్లాగులో చదివాక క్లైమాక్స్ కోసం నేనూ పరిగెత్తుతానేమో…..
    ……….నీ మరణం క్షణికం, నా మరణం క్షణక్షణం………

  2. పుస్తకం » Blog Archive » మృత్యువుకు జీవం పోసి..

    […] సీగల్ రాసిన లవ్ స్టోరీ, అలివర్ స్టోరీల పరిచయం చేయబూనినప్పుడు: “కవిత్వమంటే ఊదని […]

  3. Dhanaraj Manmadha

    Love story is a must read one to feel some magical moments…
    And the movie is a classic

  4. ఉష

    >> ప్రేమ కథలు ముగియచ్చేయేమో కాని, ప్రేమించాక జీవితం ఆగదు

    మీ ఆ ఒక్కమాటతో ఈ పుస్తకం చదవాలని నిర్ణయించుకున్నాను.

    >> కవితలెలా రాస్తారో మరి? ఆయా భావాలను జీవించి రాస్తారేమో మరి!.. కథలెలా అల్లుతారో మరి? ఆయా అనుభవాలను జీవింపచేశాలా రాస్తారేమో మరి?

    కవితకైనా, కథకైనా జీవం ముఖ్యం కదండి. కనుక కవిది రచయితది ఒకటే బాధ్యత. చదువరి స్టామినాలో తేడాలుండొచ్చునేమో!

  5. మెహెర్

    “పోస్టుమార్టం బల్ల మీద జరిగేది సర్జరీనే, పూర్తవ్వగానే ప్రాణం తిరిగొచ్చేస్తుందన్నట్టే వ్యవహరించాం.”

    Wow!

  6. నిశాంత్

    థాంక్స్…
    ఇంకో మంచి నవల అందించారు.

  7. ram n.

    అవునండి,

    కవిత్వం/కథలు ఇలాగే రాస్తారు..

    ఆయా భావాలను జీవించి రాస్తారు..

Leave a Reply